కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నవంబరు 3వ తేదీ మంగళవారం 6వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. కాగా, ఇప్పటివరకు ఐదు విడతల్లో అఖండ పారాయణం జరిగింది.
విశాఖ లోని గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబ సభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత సోమవారం పరామర్శించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు గాజువాకవరలక్ష్మి కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత కలుస్తారు. ఇప్పటికే దాడి చేసిన ప్రేమోన్మాది అఖిల్ సాయి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశాలు జారీచేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యార్ధినిలు, మహిళల రక్షణ కోసం ఉన్న దిశ యాప్ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలంతా వినియోగించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు రూపొందించి చైతన్య పరచనున్నామన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం కూడా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు..
గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మిని పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా భావిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఆదివారం గాజువాక శ్రీనగర్‌లోని వరలక్ష్మి ఇంటికి స్వయంగా వెళ్లిన సీపీ కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరలక్ష్మి హత్య చాలా బాధాకరకరమని, నిందితుడు తండ్రి ఇచ్చిన సమాచారంతో సంఘటన ప్రాంతానికి వెళ్లామన్నారు. అయితే అప్పటికే చాలా రక్తం పోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే వరలక్ష్మి మృతి చెందిందని సిపి వివరించారు. కాగా ఈ హత్య కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామన్న సీపి ఈ కేసును దిశా ఏసీపీకి అప్పగించామని.. వారం రోజుల్లో చార్జీ షీట్ వేస్తాంమని సిని వివరించారు. ఇలాంటి సంఘటనలు పురరావ్రుతం కాకుండా విద్యార్ధినిలు జాగ్రత్తగా ఉండాలని, కళాశాలలకు వెళ్లే ప్రతీ విద్యార్ధిని తమ మొబైల్ ఫోన్ లో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు యాప్ ద్వారా సమాచారం అందిస్తే, స్పందించి రక్షించడానికి అవకాశం వుంటుందన్నారు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ప్రయోగాత్మకంగా ఆదివారం నుండి టిటిడి ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆర్జిత సేవలను టిటిడి ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవగా నవంబరు రెండవ వారం నుండి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టిటిడి చర్యలు చేపట్టింది. ఈ సేవలు పొందిన భక్తులకు ఆ టికెట్టుపై శ్రీవారి దర్శనం ఉండదు. దర్శనం పొంద దలచిన గృహస్తులు శ్రీవారి దర్శనం కొరకు ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైన్ లో పొందవలసి ఉంటుంది. ఆలయంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి బడి గంటలు మోగబోతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభించిన తరువాత మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. 23 నుంచి 6, 7, 8 తరగతులకు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామన్న మంత్రి కరోనా నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహించనున్నామని చెప్పారు. తగ్గించిన సిలబస్‌తో విద్యా సంవత్సరం పూర్తిచేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు ఇళ్లకు పంపించేస్తామని మంత్రి సురేష్ వివరించారు. మొత్తం 180 పనిదినాలు ఉండేలా కార్యాణచరన రూపొందించి వాటికి అనుగుణంగానే సిలబస్ పూర్తిచేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశింమని వివరించారు..
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం అన్నాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఆలయంలో అన్నాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరం సుమారు 150 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం 5 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు.