గీతం భూఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మేకతోటి సుచిరత స్పష్టం చేశారు. విశాఖలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ ఎంతో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పుడు సమాచారం అందించిందన్నారు. ఇప్పటికే ఈ విషయమై విశాఖలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతోపాటు, ప్రజా సంఘాలు కూడా నిరవధికంగా గీతం విషయంలో ఆందోళనలు చేస్తున్నాయన్నారు. గీతంపై చర్యలు తీసుకునే సమయంలో విద్యార్ధులకు ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. గీతంను ఆంధ్రాయూనివర్శిటీకి అటాచ్ చేసే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో చర్చలు జరుపుతున్నామని హోంమంత్రి వివరించారు. గీతం మొత్తంగా 48 ఎకరాలు భూమిని ఆక్రమించినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, దీనిపై పూర్తిస్థాయి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమత్రి వివరించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు..
భారత దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. ఇది ఒక రకంగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామసచివాలయ వాలం టీర్లకు చేదు వార్తే.. పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుందని ఈ మేరకు పబ్‌జీ ఫేస్‌బుక్ పేజీలోఅధికారిక ప్రకటన చేసింది. నేటి (అక్టోబర్ 30,2020) నుంచి వినియోగదారులందరికీ పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించారు. అయితే తమ తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్‌జీని ఆడుకోవచ్చు. అత్యధికంగా గ్రామవాలంటీర్లు ఈ గీమ్ ని ఎక్కువగా తమ మొబైల్స్ ఆడుతున్నారు. అదీ ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్స్ నే ఆడుతుండటం విశేషం. ఆ విషయం ఆయా గ్రామసచివాలయ అధికారులు ద్రుష్టి కేంద్రీకరిస్తే వాస్తవాలు తెలిసే అవకాశం వుంది. అయితే తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం కూడా అందరు యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా కరోనా వైరస్ విస్తరణ, సరిహద్దు వద్ద చైనా దుశ్చర్య నేపథ్యంలో గోప్యత, భద్రత కారణాల రీత్యా భారత ప్రభుత్వం పబ్‌జీ సహా118 చైనా యాప్స్‌ని నిషేధించి నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, దీనిని విపరీతంగా వినియోగించడం విశేషం..
సింహాచలంలోని భూసమస్యపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్,సీఎం సలహాదారు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, సింహాచల ఆలయ కార్యదర్శి సభ్యులుగా వుంటారు. వీరితోపాటు, ఎంపీలు విజయసాయిరెడ్డి, బి.సత్యవతి, దేవాదాయశాఖ కమిషనర్ కూడా సలహాదారులుగా ఉంటారు. ప్రభుత్వం సింహాచలం పంచగ్రామాల సమస్యపై ప్రకటించిన విధంగా కమిటీ ఏర్పాటు చేసింది. భూ సమస్యపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వం పంచగ్రామాల సమస్య నిర్ణయం తీసుకుంటుంది. అదే సమయంలో జనవరి నుంచి జరగనున్న సమగ్ర భూ సర్వే కూడా ఈ భూసమస్యకు పరిష్కారం చూపించనుంది. సర్వేద్వారా దేవస్థానం భూములు ఎంత వరకూ ఉన్నాయి... ఆక్రమిత భూములు ఎంతవున్నాయనే విషయం కూడా తేలిపోనుంది. కాగా గత ప్రభుత్వంలో కమిటీ వేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా ప్రజా ధనం దుర్వినియోగం అయ్యింది..
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ ప్రతినిధులు వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి పోస్కో ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం వారికి వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ఏవిధంగా ప్రోత్సహిస్తున్నామో కూడా తెలియజేశారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటు నందించి, పారిశ్రామికాభివృద్ధికీ ఉపకరిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులు ఉన్నారు.
తిరుమలలో ప్రతినెలా జరిగే శ్రీవారి పౌర్ణమి గరుడసేవ అక్టోబరు 31న శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య జరుగనుంది. కాగా, అక్టోబరు నెలలో శ్రీ మలయప్పస్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరగడం విశేషం. ఈ నెలలో ఇప్పటికే పౌర్ణమి సందర్భంగా అక్టోబరు 1న, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడ వాహనసేవ నిర్వహించారు.కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తుల సందర్శనార్ధం స్వామివారి గరుడసేవను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్షప్రసారం కూడా చేయనున్నారు. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని కొద్ది మంది అధికారులు, అర్చకులతో మాత్రమే శ్రీవారికి ఈ సేవను నిర్వహించనున్నారు.