కరోనా వైరస్ రెండవ దశ విజ్రుంభించే ప్రమాదం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా వున్న జర్నలిస్టులు వచ్చే రెండు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)చేసిన హెచ్చరికల నేపథ్యంలో జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలుతు 45 రోజుల్లో కరోనా వైరస్ నీరసిస్తుందని భావించినా దాని ప్రభావం ఇపుడే అధికంగా కనిపిస్తుందని ప్రభుత్వం హెచ్చరించిందన్నారు. వైద్యులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్న తరుణంలో జర్నలిస్టులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. విధినిర్వహణలో బయటకు వెళ్లే ప్రతీ జర్నలిస్టూ విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ 5.0 నిబంధనలు సులభరతరం చేసినా, వార్తా సేకరణలో మాత్రం జర్నలిస్టులు మరో నెల రోజులు ముఖ్యమైన వాటికి మాత్రమే బయటకు రావాలన్నారు. మీమీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని గంట్ల శ్రీనుబాబు గుర్తు చేశారు.
వైయస్ఆర్ రైతుభరోసా 2వ విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమవారతిలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,115 కోట్ల నగదును కంప్యూటర్ లో నొక్కి బదిలీ చేశారు. తొలిసారిగా ఖరీఫ్‌లో నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు ఖరీఫ్ లోనే ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 135.7 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్ లక్ష మంది గిరిజన రైతులకు రూ. 11,500 చొప్పున రూ.104 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. రబీ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ROFR) రైతులకూ రైతు భరోసా సాయం అందుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని, రైతులను సాయమందించడం గర్వంగా ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 90శాతం నెరవేర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్నితోపాటు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో నవంబరులో విశేష ఉత్సవాలు శ్రీవారికి జరపనున్నారు. వరుసగా నవంబరు 14 నుంచి 29వరకూ స్వామివారికి జరిపే ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి విశేష ఉత్సవాలు కోసం తెలుసుకుంటే.. నవంబరు 14న దీపావళి ఆస్థానం, నవంబరు 18న నాగుల చవితి, నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, నవంబరు 25న స్మార్త ఏకాదశి, - నవంబరు 26న మధ్వ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి, చక్రతీర్థ ముక్కోటి, నవంబరు 27న కైశిక ద్వాదశి ఆస్థానం, నవంబరు 29న కార్తీక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో కార్యక్రమానికి సంబంధించిన రోజువారీ షెడ్యూల్ ను ముందుగానే అధికారులు ప్రకటించారు. ఆయా తేదీల వారీగా స్వామివారికి విశేష ఉత్సవాలు జరపనున్నామని తిరుమల జెఈఓ వివరించారు.
డా.వైఎస్సార్ కడప జిల్లాలోని స్టీల్‌ప్లాంట్ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఏపీఐఐసి, పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులు, చైర్మన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని.. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. అందుకు కనీసం ఏడు వారాల సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3-4 వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలిఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అనంతరం కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు సీఎంకి వివరించారు. ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పది రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. కోవిడ్-19 నిబంధల కారణంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించారు. చివరి రోజు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ ఏకాంతంగా జరిగింది. కరోనా వైరస్ కేసులను ద్రుష్టిలో ఉంచుకొని పరిమిత సిబ్బంది, అధికారులు, పురోహితులతోనే అమ్మవారి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ కుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్నా, వాహనం ఇన్‌స్పెక్టర్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ భూముల విషయంలో కోర్టు ఉత్తర్వును టీడీపీ వక్రీకరించి ప్రచారం చేస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాథ్ చెప్పారు. ఈ మేరకు విశాఖలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేయాలని చూస్తుందన్నారు. 70 రోజులు జైళ్లో ఉన్న అచ్చెన్నాయుడు కూడా గీతం భూములపై మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు. విశాఖలో ఆక్రమిత భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారని, ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. గీతం ఆధీనంలోని 40 ఎకరాల ఆక్రమిత భూమి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతించడాన్ని టిడిపి జీర్ణించుకోలేకపోతుందన్నారు. అటు గీతం యాజమాన్యం కూడా కోర్టు ఆర్డర్‌ను కూడా వక్రీ కరించి ప్రచారం చేస్తోందన్న ఎమ్మెల్యే.. రిట్ పిటిషన్ గీతం ఆధీనంలో ఉన్న శాశ్వత నిర్మాణాలు మాత్రమే తొలగించవద్దు అని మాత్రమే కోర్టు సూచించన విషయాన్ని కోర్టు ఆర్డర్ చూసిన వారెవరికైనా తెలుస్తుందన్నారు. కానీ టీడీపీ కి చెందిన పచ్చమీడియా కోర్టు ఆర్డర్లను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఆగస్టు 3న గీతం యాజమాన్యం తమ ఆధీనంలోని 43 ఎకరాల ఆక్రమిత భూమిని క్రమబద్ధీకరించాలని కోరిందని అయితే ఇప్పటికే సర్కారు నుంచి 71 ఎకరాలు తీసుకుని ఇంకా భూమి కావాలని కోరడంతో దానిని ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. గీతం యాజమాన్యం తన సొంత భూమి రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఖాళీగా ఉంచుకుని ప్రభుత్వ భూమి విద్యాసంస్థలకు ఆక్రమిస్తామంటే ఎలా ప్రభుత్వం అంగీకరిస్తుందని ప్రశ్నించారు. పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుంది కానీ ఇలా భూ దాహం వున్న వ్యక్తులకు ప్రభుత్వం ఇవ్వదని స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆఖరి క్యాబినెట్‌లో గీతం భూముల క్రమబద్దీకరణ అంశాన్ని అప్పటి క్యాబినెట్ వాయిదా వేసిందంటే పరిస్తితి ఎలా వుందో అదే పచ్చమీడియా అర్ధంచేసుకుంటే మంచిదన్నారు. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుందని, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని విమర్శలు చేసే టీడీపీ నాయకులు రుజువు చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తోందని దానికి... చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు' అంటూ ఎమ్మెల్యే అమరనాథ్ చంద్రబాబు కుటిల రాజకీయాన్ని ఎండగట్టారు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీలుగా టిటిటి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రేపు ఉదయం విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం నవంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 27న మంగళవారం ఉదయం 11.00 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టిటిడి ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్టు టిటిడి అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా టైమ్ స్లాట్ దర్శనాలు కూడా ప్రారంభించనున్నట్టు చెప్పిన అధికారులు అత్యధిక మందికి శ్రీవారి దర్శనాలను దగ్గర చేయాలన్నదే టిటిడి లక్ష్యమని పేర్కంది. స్వామివారి దర్శనాల కోసం భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. సంక్రాంతి కనుమ పండుగ రోజు కూడా తిరుమలలో పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేశారు. శ్రీమలయప్పస్వామివారు పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు ధరించి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా టిటిడి ఈవోకు ఆలయ మర్యాద ప్రకారం పరివట్టం కట్టారు. కోవిడ్-19 నిబంధనల కారణంగా ఆలయంలోని కల్యాణోత్సవ మండపం ఆవరణంలో టిటిడి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏడుకొండలతో పాటు శేషాచలాన్ని తలపించేలా రూపొందించిన నమూనా అడవిలో వివిధ రకాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వన్యమృగాల బొమ్మలను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేటలో పాల్గొన్నారు. అనంతరం విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టి స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేశారు.
పార్వేట ఉత్సవం అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ లోకకల్యాణం, కరోనా నివారణ కోసం శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించామని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పార్వేట ఉత్సవాన్ని కూడా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించామన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన జీయర్‌స్వాములకు, అర్చకస్వాములకు, అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ఎస్ఇలు జగదీశ్వర్ రెడ్డి, నాగేశ్వరరావు, డిఎఫ్‌వో చంద్రశేఖర్, విజివోలు మనోహర్, ప్రభాకర్, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనార్థం ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను అక్టోబరు 26వ తేదీ సోమవారం నుండి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో జారీ చేస్తారు. రోజుకు 3 వేల చొప్పున టోకెన్లను ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందిస్తారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు జారీ చేస్తారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తారు. టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టిటిడి అధికారులుు కోరుతున్నారు. భక్తులకు టిక్కెట్లను అందించేందుకు టిటిడి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లును చేసింది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ఈ ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీచేస్తున్నట్టు అధికారులు మీడియాకి వివరించారు.
కోట్ల రూపాయల విలువైన 40.50 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జాచేసిన గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ గుర్తింపుని యూజిసి తక్షణమే రద్దు చేయాలని AP ప్రజా సంఘాల జెఎసి అధ్యకులు జెటి రామారావు డిమాండ్ చేసారు. ఆదివారం ఆయ విశాఖలో మీడియాతో మాట్లాడారు. యూనివర్శటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసి) ఇది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వర్శిటీలు, ప్రైవేటు, డీమ్డ్ యూనిర్శిటీలకు గుర్తింపు నిచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థ. యూజిసి ఏదైనా యూనివర్శిటీకి గుర్తింపు ఇవ్వాలంటే సిబ్బంది, అద్యాపకులు, వసతులు, భూములు, క్రీడా మైదానాలు ఇలా అన్నీ యూజీసి నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే గుర్తింపు ఇస్తుంది. ఆ సంస్థ ద్రుష్టికి గీతం భూ కబ్జాల విషయం తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. లేదంటే అవన్నీ సక్రమంగా ఉన్నాయని యూజిసీని కూడా నమ్మించే ప్రయత్నం గీతం చేస్తుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక్కోసారి ప్రభుత్వ యూనివర్శిటీలకు సైతం నిబంధనలు సరిగా లేవని నిధులు ఆపేసిన చరిత్ర యూజిసికి వుందనే విషయాన్ని జెటి గుర్తుచేశారు. ప్రస్తుతం గీతం ప్రభుత్వానికి చెందిన 40.50 ఎకరాల భూమి, విద్యాసంస్థల ప్రాంగణంలో 33 ఎకారాలు అక్రమని విశాఖ అర్భన్ ఆర్డీఓ పెంచల కిశోర్ స్పష్టం చేశారన్నారు. ఈ నేపథ్యం అందులోని నిర్మాణాలు అక్రమం, ఇలాంటి సమయంలో అక్రమ నిర్మాణాలు, కట్టడాలు ప్రభుత్వం కూల్చేస్తే విద్యార్ధుల పరిస్థితి ఏంటని యూజిసి, నిబంధనలన్నీ సక్రమంగా వుంటేనే అలాంటి విద్యాసంస్థలను గుర్తిస్తుంది. అపుడు విద్యాసంస్థల్లో చదివే విద్యార్ధులను ద్రుష్టిలో వుంచుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థ యూజీసీ ఆ నిర్ణయం తీసుకుంటుంటి. అలా అనుకున్నప్పుడు యూజిసి నిబంధనల ప్రకారం గీతం విద్యాసంస్థ ఆస్తులు, నిర్మాణాలు సక్రమం కావు...అన్నీ అక్రమాలే అలాంటి సమయంలో యూజిసి గీతం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందాని విద్యార్ధుల్లో ఆందోళన మొదలైందన్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు విద్యార్ధులకే యూజిసికి ఫిర్యాదు చేసినట్టు తెలిసిందన్న జెటీ తాను లిఖిత పూర్వకంగా యూజిసికి ఫిర్యాదు చేస్తానన్నారు. కానీ అలాంటిదేమీ లేదని విద్యాసంస్థల పీఆర్వో మీడియా ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పడం కూడా హాస్యాస్పదమన్నారు. అసలు విశాఖపట్నానికి గీతం వలనే పేరువచ్చిందని, ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ కే తమ గీతం సంస్థ ద్వారా పేరు, గుర్తింపు వచ్చిందని పీఆర్వో టివి5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం దయ్యాలు వేదాలు వల్లించినట్టేనన్నారు. విశాఖ కీర్తి ఇప్పటికే ప్రపంచవ్యామన్న విషయాన్ని అక్రమ భూ ఖబ్జా కోరు గీతం యాజమాన్యం తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా ఇప్పటికే యూజిసి రెండు దఫాలుగా విడుదల చేసిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి నోటీసులు ఇచ్చిందని వాటి విద్యార్ధుల తల్లిదండ్రులు పరిశీలించుకోవాలన్నారు. దీంతో అప్పటి వరకూ డీమ్డ్ యూనివర్శిటీ అని బోర్డు పెట్టుకున్న గీతం...యూజీజీ లేఖలతో గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ అని పేరు మార్చుకుందని కూడా జెటి వివరించారు. ఇలాంటి అక్రమ ఆస్తుల సంస్థలకు తక్షణమే గుర్తింపు రద్దుచేసి విద్యార్ధుల భవిష్యత్తు కాపాడాలని ప్రజాసంఘాల జేఏసి కన్వీనర్ జెటి.రామారావు డిమాండ్ చేశారు. అక్రమంగా ప్రభుత్వ భూములను ఖబ్జాచేసే గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీకి యూజీసి తక్షణమే గుర్తింపు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రత్యేక లేఖ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, యూజిసికి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్టు ఆయన మీడియాకి తెలియజేశారు..