1 ENS Live Breaking News

ఆన్‌లైన్‌లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్లు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల‌కు 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్ల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, వేగంగా అందించేందుకు పోస్ట‌ల్ డిపార్టుమెంటుతో పాటు అమెజాన్ సంస్థ‌తో కూడా అందించేందుకు టిటిడి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. టిటిడి పరిపాలన భవనంలో గల త‌మ కార్యాల‌ యంలో ఆయన టిటిడి‌ అధికారులు, అమెజాన్ ప్ర‌తినిధుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి డైరీలు, క్యాలెండర్లకు విశ్వ‌వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంద‌న్నారు. గతంలో కూడా పోస్ట‌ల్‌డిపార్టుమెంట్ మ‌రియు వివిధ కొరియ‌ర్ ఏజెన్సీల ద్వారా డైరీలు, క్యాలెండర్లు అందించిన‌ట్లు తెలిపారు. కాగా  భ‌క్తుల‌కు మ‌రింత విస్తృతంగా, వేగంగా టిటిడి డైరీలు, క్యాలెండర్లు అందించేందుకు ప్ర‌ముఖ ఆన్‌లైన్ సంస్థ అయిన అమెజాన్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతునట్లు తెలియ‌జేశారు.          ఈ సంద‌ర్భంగా అమెజాన్ సంస్థ ప్ర‌తినిధులు  అభిలాష్‌,  షీతాల్ కుమార్‌లు టిటిడి డైరీలు, క్యాలెండర్ల‌ను అమెజాన్ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అందించేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికలు  త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌న్నారు. టిటిడి నిబంధ‌న‌ల మేర‌కు ద‌శ‌ల వారిగా దేశ విదేశాల‌లోని భ‌క్తుల‌కు టిటిడి డైరీలు క్యాలెండర్లు అందిస్తామ‌న్నారు.  ఇందులో భాగంగా మొద‌ట బెంగుళూరు కేంద్రంగా ద‌క్షిణ భార‌త‌దేశంలోని అన్ని ప్రాంతాల‌కు చేర‌వేస్తామ‌న్నారు. అదేవిధంగా అక్టోబ‌ర్ నుండి ఢిల్లీ కేంద్రంగా ఉత్త‌ర భార‌త దేశంలో అందిస్తామ‌న్నారు. మ‌లిద‌శ‌లో విదేశాల‌లోని భ‌క్తుల‌కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామ‌న్నారు.          కాగా టిటిడి ముద్రించిన రూ.100/- విలువ‌గ‌ల 12 పేజీల క్యాలెండర్లు, రూ.15/- విలువ‌గ‌ల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు, రూ.10/- విలువ‌గ‌ల శ్రీవారు మ‌రియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు, రూ.20/- విలువ‌గ‌ల తెలుగు పంచాంగం క్యాలెండర్లు, రూ.60/- విలువ‌గ‌ల టేబుల్ టాప్ క్యాలెండ‌ర్లు, రూ.130/- విలువ‌గ‌ల పెద్ద‌ డైరీలు, రూ.100/- విలువ‌గ‌ల చిన్నడైరీలు భ‌క్తుల‌కు ఆన్‌లైన్ కూడా అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు జెఈవో తెలిపారు.          ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎఫ్ఎ అండ్ సిఎవో  బాలాజి, సిఎవో  శేష‌శైలేంద్ర‌, డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి  రామ‌రాజు తదితరులు  పాల్గొన్నారు.

Tirupati

2020-09-05 20:53:28

సెప్టెంబరు 18నుంచి ఉప్మాక వెంకన్న బ్రహ్మోత్సవాలు

విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నక్కపల్లి ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 27 వరకు ఏకాంతంగా జరపనున్నట్టు టిటిడి అధికారులు ప్రకటించారు. స్వామివారి బ్రహ్మోత్సవం లో  శ్రీ విశ్వక్సేన ఆరాధన మరియు కంకనాధారణ, సెప్టెంబర్ 18 న అంకురార్పణం, సెప్టెంబర్ 19 న ధ్వజరోహనం మరియు ఉత్సవాలు జరుగుతాయని అనంతరం సెప్టెంబర్ 27 తో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. స్వామివారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. స్వామివారికి జరిగే ఉత్సవాలన్నీ మీడియా ద్వారా ప్రజలు తెలుసుకోవాల న్నారు. కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా మాత్రమే ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఒకేసారి భక్తులు అధిక సంఖ్యలో రావడం మొదలైతే కరోనా కేసులు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకుందని ప్రటించారు.

Nakkapalli

2020-09-05 20:15:35

పర్యాటక వాణిజ్యాానికి మార్గదర్శకాలు జారీ...మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యాటక వాణిజ్యం ( రిజిస్ట్రేషన్ మరియు సౌకర్యాలు ) మార్గదర్శకాలు , 2020 ను విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక,  క్రీడలు , యువజనాభివృద్ది శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికలు , సులభతరమైన విధానంలో ప్రభుత్వ ఉత్తర్వుల నెం.188 తో శనివారం మార్గదర్శకాలను జారీచేసినట్టు వివరించారు . ఇప్పటి వరకు రాష్ట్రంలో పర్యాటక వాణిజ్య ఆపరేటర్లు నమోదుచేసుకోవడానికి సరియైన యంత్రాంగం , విధివిధానాలు అందుబాటులో లేవన్నారు . రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సేవా రంగాన్ని బలోపేతంచేసి స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగు తోందన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్ . జగన్మోహనరెడ్డి సమక్షంలో విధివిధానాలను రూపొందించే దిశలో పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇవ్వడం జరిగిందన్నారు . ఆగష్టు 20 న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో విధివిధానాలను రూపొందించి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో అడుగులు వేస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.    రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యంపై సమగ్ర నివేదికను రూపొందించి సిఫార్సు చేయడం జరిగిందని తద్వారా టూరు ఆపరేటర్లు , అనుబంధ రంగాల వారు ప్రభుత్వం అందించే రాయితీలను , ప్రోత్సాహకాలను పొందవచ్చని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు . మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి వివరాలు www.aptourism.gov.in వెబ్ సైట్ లో పొందుపర్చామన్నారు . టూరు ఆపరేటర్ల , బోట్ ఆపరేటర్లు , ట్రావెల్ ఏజెంట్లు , హెూటల్సు , రిసార్ట్సు , మైస్ సెంటర్లు , వాటర్ స్పోర్ట్సు ఆపరేటర్లు తదితర అనుబంధ రంగాల అపరేటర్లను రాష్ట్ర పర్యాటక శాఖతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు . ఇందుకోసం ఆయా సంస్థలు తప్పనిసరిగా రాష్ట్ర పర్యాటక శాఖతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తద్వారా రాయితీలను , ప్రోత్సాహాలను పొందాలన్నారు . కోవిడ్ కారణంగా మూతపడిన పర్యాటక రంగానికి వైభవాన్ని తీసుకొచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ చర్యలు తీసుకొంటోందని ఆయన తెలిపారు . కేంద్ర మార్గదర్శకాలు సూచనలతో విధివిధానాలను రూపొందించి ఆయా రంగాలను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు . గోవా , రాజస్థాన్ , హిమాచల ప్రదేశ్ , కేరళ , కర్నాటక వంటి రాష్ట్రాలలో పర్యాటక రంగంలో అభివృద్ధికి అమలు చేస్తున్న విధివిధానాలపై అధ్యయనం చేయడం తద్వారా రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు సూచనలను చేశామని , సులభతరమైన మార్గదర్శకాలను జారీచేశామన్నారు . సేవా రంగానికి పెద్దపీట వేసేందుకు నాణ్యమైన సేవలపై సూచనలు , మార్కెటింగ్ మార్గాలపై సమగ్ర నివేదిక సులభతరమైన విధానాలలో అనుమతుల మంజూరు , ఇతర రాష్ట్రాల , జాతీయ అంతర్జాతీయ పర్యాటక విభాగాలైన క్రీడలు పర్యాటక సందర్శనలు , పర్యాటక క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగ వాణిజ్యాన్ని ఇతోధికమైన స్థానాన్ని కల్పించడం చేయాలన్నారు . ఇందుకు పర్యాటక సంబంధిత రంగాలవారిని , సంస్థల వివరాలను సేకరించాలన్నారు . పర్యాటక సేవా రంగంలో ఉన్నవారిని గుర్తించి రాష్ట్రంలో సమగ్ర పర్యాటక ప్రణాళికలు మరియు గణాంకాలను పొందుపరుస్తూ డేటాబేసు అనుగుణంగా మార్గదర్శకాలను జారీచేశామన్నారు .  రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించిన సంస్థలకు ఇది ఒక మంచి అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాలకు చెల్ సైటును సందర్శించాలని టూరిజం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ , ఎపిటిడిసి ఎండి, ఎపిటీఏ సీఈవో ప్రవీణ్ కుమార్  తెలియజేశారు . 

Visakhapatnam

2020-09-05 19:30:53

అవినీతిని ప్రోత్సాహానికి చంద్రబాబుకి పేటెంట్..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాడు అవినీతి పరులకు కొమ్ము కాయడానికి మాత్రమే హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిం చారు. చంద్రబాబులో ఏం మార్పు రాలేదని తహశీల్ధార్ వనజ పై దాడిచేసిన చింతమనేని అధికారంలో ఉండగా వెనుకేసుకు వచ్చి, ఇపుడు ఈఎస్ఐ స్కాములో ప్రధాన నిందితులు అచ్చెన్నాయుడు,  హంతకుడు కొల్లు రవీంద్రలకు సపోర్టు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. కరోనా వైరస్ భయంకరంగా పెరుగు తున్న సమయంలో కూడా బయటకు రాని చంద్రబాబు, తన మాజీ మంత్రులు విషయంలో హైదరాబాదు నుంచి వచ్చి మరీ పరామర్శించడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ తరుణంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక చేసిన ఆరోపణలకు బలం చేకూర్చింది. అంతేకాదు విజయసాయిరెడ్డి విశాఖ ఖంట కుడు పేరుతో చేస్తున్న కామెంట్లకు కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుండటం విశేషం...

Amaravati

2020-09-05 14:51:12

గ్రామాల్లో వీధి దీపాల బాధ్యత గ్రామసచివాలయాలదే..

గ్రామాల్లో వీధి దీపాలు వెలిగినా, వెలగకపోయివా వాటి బాధ్యత గ్రామసచివాలయాలే చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రైవేటు పొరుగు సేవల అధీనంలో ఈ సేవలు ఇక నుంచి గ్రామసచివాలయాలే చూడనున్నాయి. ఇక నుంచి ఏ వీధిలోనైనా వీధిలైటు వెలగకపోయినా సచివాలయంలో ఫిర్యాదు చేయాలి. దానిని సత్వరమే కార్యదర్శి పరిష్కరించాలి. ఒక్కోసారి కార్యదర్శి అందుబాటులో లేనపుడు గ్రామ వాలంటీర్ ద్వారా కూడా ఈ విషయమై ఫిర్యాదు చేయవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో గ్రామసచివాలయానికి ఒక ఎనర్జీ అసిస్టెంట్ ను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయినట్టే కనిపిస్తుంది. అంతేకాదు, గతంలో పొరుగు సేవల ద్వారా పనిచేసేవారికి త్వరలోనే చెల్లుచీటి కానుందని కూడా సమాచారం. ఎందుకంటే పారిశుధ్య కార్మికుల పేరుతో నిర్వాహకులు కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్టు నటిస్తూ జీతాలు తీసుకుంటున్నారు. అవిషయంపైనా ప్రభుత్వం సమగ్ర విచారణ చేయనుందని తెలుస్తుంది...

Amaravati

2020-09-05 13:56:52

15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 19 నుంచి 27వ‌ర‌కు వార్షి‌క బ్రహ్మోత్సవాలు, అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వ‌ర‌కు న‌వ‌రాత్రి  బ్రహ్మోత్సవాల‌ను పురస్కరించుకొని సెప్టెంబరు 15వ తేదీ మంగళవారం  ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.  కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

Tirumala

2020-09-05 13:49:29

అవినీతి పోలీసులను వెంటాడుతున్న ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్

ఒంటి మీద ఖాఖీషర్టు, బుజం పై రెండు స్టార్లు, లేదా ఒకటున్నా పర్లేదు వీటితో ప్రజలను ఎంతో మర్యాదగా రా రా, పోరా..ఏంటి రా..బలిసిందా.. అని ఎంతో మర్యాద గా మాట్లాడే ప్రశాకం జిల్లా పోలీసులకు ఇపుడు నానిపోతుంది...ఏంటి పోలీసులు భయపెడతారు గానీ భయపడం ఏంటి అనుకుంటున్నారా...అలా అనుకంటే పోలీ సు వ్యవహారాల్లో అడుగు పెట్టినట్టే...ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది పోలీసులను 10 రోజుల్లో సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ  సిద్ధార్థ్ కౌశల్ ఇపుడు జిల్లాలో అవినీతి పోలీసులకు సింహ స్వప్నంగా మారారు. ఎస్పీ పేరు చెబితే సినిమాల్లో ఎమ్మెస్ నారాయణ ఉన్నట్టుండి వెనక్కి గిరుక్కున తిరిగినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఎవరిమీద సస్పెండ్ అవుతారోనని. అందేకాదు సస్పెండ్ అయిన పోలీసులపై జరిపే విచారణలో వాస్తవాలు తేలితే పోలీసుల మీదే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లాలోని పోలీసులంతా మంచివారిగా మారిపోతున్నారు. పోలీస్ స్టేషన్ కి ఎవరు వెళ్లినా చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. సెటిల్ మెంట్ అనే మాట బయటకు రాకుండా కామ్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడూ పోలీస్ సినిమాలు చూసిన జిల్లా పోలీసులకు రియల్ గా ఎస్సీ యాక్షన్ చూసిన తరువాత నోటి మాట రావడం లేదు. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు ఇలా వ్యవహరించి అవినీతి ఖాఖీలను ఇంటికి పంపితే బాగుండు అనే వాదన బలగా వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 25 మంది పోలీసులను సస్పెండ్ చేస్తేనే ఎస్పీ నయిం అస్మి పేరు ఊరూనోట మారు మ్రోగిపోయింది. ఇపుడు ప్రకాశం జిల్లా ఎస్పీ దానికి డబుల్ సంఖ్యలో అవినీతి పోలీసులపై తీసుకున్న చర్చ హాట్ టాపిక్ మారింది. అంతేకాదు ఆ మందిపై ఎంతమందిపై క్రిమినల్ కేసులు రుజువవుతాయోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ప్రకాశం జిల్లా

2020-09-05 12:50:41

సత్యదేవుని దర్శనాలు ఉదయం 6 నుంచి రాత్రి9 వరకూ

తూర్పుగోదావరి జిల్లా, అన్నవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లో యధావిధిగా స్వామి వారి దర్శనాలు సెప్టెంబ రు 7వ తేది నుంచి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ జరపనున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు  కేంద్ర ప్రభు త్వ 4.0 అన్ లాక్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు చేస్తున్నట్టు చెప్పిన ఆయన భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి స్వామివారిని ధర్శించుకో వడానికి రావాలన్నారు. అంతేకాదు స్వామివారి కొండపై గదులు, సత్రాలు కూడా అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన వివరించారు. స్వామివారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యధావిధిగా సత్యదేవుని దర్శనాలు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. భక్తుల రద్దీని ద్రుష్టిలో ఉంచుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఈఓ వివరించారు. కొండపై పారామెడికల్ సిబ్బంది సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా భక్తులు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు.

అన్నవరం

2020-09-05 12:24:33

పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లకు లైన్ క్లియర్..

ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలెప్ మెంట్ ఆఫీసర్స్ పోస్టులు మంజూరు చేయడం పట్ట ఎంపీడీఓలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెం డు దశాబ్దాలుగా ఎంపీడీఓలకు, ఈఓపీఆర్డీలలకు ప్రమోషన్ల విషయంలో ఎలాంటి ముందడగు లేక చాలా మంది అధికారులు ప్రమోషన్లు పొందకుండానే ఉద్యోగ విరమణలు చేశారు. ఇన్నేళ్ల తరువాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ శాఖలో  ప్రమోషన్ల తలుపు తెరవడంతో ఆఫీస్ సబార్డినెట్లు, పంచాయతీ కార్యదర్శిలు, మినిస్టరీయేల్ స్టాఫ్, ఏ.ఓలు, ఈఓ.పి.ఆర్&ఆర్.డి వరకూ 12 కాడర్లలో ప్రమోషన్స్ కదలికలు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మార్గం సుగమం చేయడంతో పంచాయతీరాజ్ ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేధికగా సహచర ఉద్యోగులతో పంచుకుంటున్నారు. అంతేకాదు వీరందరికీ ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా కింది విభాగాల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశముంది. దీంతో కొత్త ఉద్యోగాలు, ఉన్నవారికి ప్రమోషన్లు రెండూ ఒకే సారి జరగడానికి చాలా ఏళ్ల తరువాత లైన్ క్లియర్ కావడంతో పీఆర్ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి...

ఏపీ స్టేట్ సెక్రటేరియట్

2020-09-04 19:33:20

అక్టోబర్ 17 నుంచి దుర్గమ్మ దసరా మహోత్సవాలు

విజయవాడక కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అక్టోబరు 17 నుంచి ప్రారంభిస్తున్నట్టు దుర్గగుడి అధికారు ప్రకటించారు. ఈ సందర్భంగా అమ్మవారు 9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 17న తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, 18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా, 19న శ్రీ గాయత్రీ దేవిగా,  20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా, 22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 24న శ్రీ దుర్గాదేవిగా, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతోపాటు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించడానికి అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం కనిపిస్తోంది. రోజుకి ఎంతమందిని అమ్మవారి దర్శనానికి పంపాలనే విషయమై అధికారులు ఇంకా ప్రకటన చేయలేదు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత ప్రకటించే అవకాశముంది.

దుర్గమ్మ గుడి

2020-09-04 19:16:28

శిరోముండం కేసులో నూతన్ నాయుడు అరెస్టు...

విశాఖజిల్లా లోని పెందుర్తి శిరోముండనం ఘటనలో సినీ నిర్మాత నూతన్‌ నాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా చెప్పారు. ఈ సంద ర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,  సంఘటన జరిగిన తరువాత నూతన్ నాయుడు రాష్ట్రం వదిలి వెళ్లి పోవడంతో ప్రత్యేక బ్రుందాలను పంపి కర్నా టక ఉడిపిలో పట్టుకున్నామన్నారు. శిరోముండనం ఘటనలో సిసి ఫుటేజీలో కీలక ఆధారాలతోనే నిందితుడుని పట్టుకున్నామన్న సిపి సంఘటన జరిగిన రోజు మద్యాహ్నం 2.54కి ప్రియామాధురికి నూతన్ నాయుడు ఫోన్ చేశారని చెప్పారు. కాల్ డేటా ఆధారంగా నూతన్ నాయుడును గుర్తించామన్నారు. నూతన్ నాయు డు దగ్గర నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కర్నాటక కోర్టులో హాజరు పరిచినట్టు సిపి వివరించారు. ట్రాన్సిట్ వారెంట్ పై విశాఖ వస్తున్నామని, అదేవిధంగా నిందితుల కష్టడీ కోసం కోర్టులో పిటీషన్ వేసినట్టు వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా శిరోముండనం నింధితులను పోలీసులు వెంటాడి మరీ పట్టుకోవడం విశాఖలో చర్చనీయాంశం అవుతోంది. 

Visakhapatnam

2020-09-04 19:12:41

మంత్రి కన్నబాబుకి ప్రత్యేక శ్రేణి వాహనం..కారణం అదే

ఆంధ్రప్రదేశ్ లోని  మంత్రులకు ప్రమాదాలు పొంచివున్నాయా అవుననే అంటున్నాయి నిఘావర్గాలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొందరు మంత్రులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదేసమయంలో వారిని కొందరు అనుమానితులు టార్గెట్ చేసినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. దీంతో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. 15 రోజుల క్రితం మంత్రికి అపాయం పొంచివుందని నిఘావర్గాలు ప్రభుత్వానికి తెలియజేయడంతో హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటు సెక్యూరిటీని కూడా పెంచారు. బాగా తెలిసిన అధికారులను తప్పా ఇతరులను ఎవరినీ మంత్రి వద్దకు నేరుగా పంపడం లేదు. దీంతో ఇంటెలిజెన్స్ సూచనల మేరకు కొన్ని రోజులుగా బులెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటిస్తున్నారు మంత్రి. ఈ వ్యవహారం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. మన్య ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులకు మావోయిస్టుల నుంచి ప్రమాదాం వుంటుందనే అనుమానంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయిస్తారు. ఇపుడు మంత్రికన్నబాబుకి ప్రత్యేక శ్రేణి వాహనాలు కేటాయింపుపై రాష్ట్రంలో తీవ్రమైన చర్చకు దారితీసింది.

Amaravati

2020-09-04 18:54:55

తిరుమలలో జ్యుట్ బ్యాగులకు విశేష ఆదరణ..

తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా  లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం టీటీడీ ఏడాది క్రితం ప్రారంభించిన జ్యుట్ బ్యాగ్( నార సంచి) లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. lలడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం టీటీడీ ప్లాస్టిక్ కవర్లు విక్రయించేది. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందనే ఆలోచనతో ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. తొలుత పేపర్ కవర్లు ప్రవేశ పెట్టింది. వీటితో పాటు  జ్యుట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేకంగా బ్యాగులు తయారుచేసి సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. ప్రసాదాలను తీసుకుని వెళ్ళడానికి ఇవి అనువుగా ఉండటంతో భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఏడాది క్రితం ప్రవేశపెట్టిన ఈ బ్యాగుల విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. 5 లడ్డూలు పట్టే బ్యాగు రూ 25, 10 లడ్డూల బ్యాగు రూ 30, 15 లడ్డూలు తీసుకుని వెళ్లగలిగే బ్యాగు రూ 35, 25 లడ్డూలు తీసుకుని వెళ్లగలిగే బ్యాగు ధర రూ 55 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి  పీల్చక పోవడం ఈ బ్యాగు ప్రత్యేకత. సేలంకు చెందిన  మోహన్ కౌన్డర్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలు తీసుకుని వెళ్ళడానికి జ్యుట్ బ్యాగు చాలా ఉపయోగంగా ఉందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇవి చాలా ఉపయోగంగా ఉన్నాయని చెప్పారు.  ముంబై కి చెందిన భూషణ్ కడెకర్ మాట్లాడుతూ శ్రీ వారి లడ్డూ ప్రసాదాన్ని దూర ప్రాంతానికి క్యారీ చేయడానికి జ్యుట్ బ్యాగ్ చాలా ఈజీ గా ఉందన్నారు. ప్లాస్టిక్ కవర్ల కంటే ఇవి ఎంతో మేలనీ,  పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఉపయోగ పడతాయని ఆయన చెప్పారు.    

Tirumala

2020-09-04 18:42:26

యుపీఎస్సీ అభ్యర్ధుల కోసం ప్రత్యేక రైళ్లు...

విశాఖపట్నంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల ద్రుష్ట్యా అభ్యర్దుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇచ్చపురం - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకె త్రిపాటి తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు రైల్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి సుమారు  4500 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరవుతున్న ద్రుష్ట్యా రైల్వే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.   రైలు నెం .5831 (ఇచ్చాపురం-విశాఖపట్నం) ప్రత్యేక రైలు ఇచ్చపురం నుండి 05.09.2020 న 17.00 గంటలకు ప్రారంభమవుతుంది మరియు 17.39 గంటలకు పలాసా చేరుకుంటుంది మరియు 17.40 గంటలకు బయలుదేరుతుంది; శ్రీకాకుళం రోడ్ రాక 18.35 గంటలకు 18.36 గంటలకు బయలుదేరుతుంది; విజయనగరం 19.30 గంటలకు చేరుకుని 19.32 గంటలకు బయలుదేరి 21.00 గంటలకు గమ్యం విశాఖపట్నం చేరుకుంటుంది.    తిరిగి వచ్చే దిశలో 05832 (విశాఖపట్నం-ఇచ్చపురం) స్పెషల్ 06.09.2020 న 18.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది, ఇది 19.35 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది మరియు 19.37 గంటలకు బయలుదేరుతుంది; శ్రీకాకుళం రోడ్ 20.31 గంటలకు రావడం మరియు 20.32 గంటలకు బయలుదేరుతుంది; 21.30 గంటలకు పలాసా రాక, 21.31 గంటలకు బయలుదేరి 22.30 గంటలకు ఇచ్చాపురానికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో 16 జనరల్ బోగీలతోపాటు  2 సెకండ్ క్లాస్ ఒక లగేజ్ గేజ్ కమ్ బ్రేక్ బోగీలు ఉంటాయని ఆయన తెలియజేశారు. అభ్యర్ధులు రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Visakhapatnam

2020-09-04 17:58:08