కరోనా నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల ప్రాధాన్యత పెరిగిందని దీంతో రాష్ట్రంలో ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు కూడా మరింత పెరిగాయని ఏ.పి. ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టరు యం. మధుసూధనరెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని కరోనా నేపథ్యంలో వాటి ప్రాధాన్యత మరింత పెరిగిందని మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 70 శాతం పనులు ఇంటర్నెట్ ఆధారంగానే ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని విద్యాభోధన కూడా ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ఇంటర్నెట్ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఏ.పి. ఫైబర్ నెట్ ద్వారా హైస్పీడ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలకు అందించాలన్న ప్రతిపాదన తీసుకురావడం జరిగిందన్నారు. బేసిక్ ప్యాక్ రూ. 300 లు, ఎ సెన్షియల్ ప్యాక్ రూ. 449 లు, ప్రీమియం ప్యాక్ రూ. 599 లు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ సేవల్లో భాగంగా ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సదుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది చందాదారులకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 660 మండలాలు, 6300 గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా సేవలు అందించడం ఏ.పి. ఫైబర్ నెట్ ప్రత్యేకత అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు, రైతుభరోసా కేంద్రాలకు, వైయస్ఆర్ ఆరోగ్య కేంద్రాలకు, పాలసేకరణ కేంద్రాలకు, నాడు-నేడు పాఠశాల కార్యక్రమాలకు ఏ.పి. ఫైబర్ నెట్ ఇంటర్నెట్ కనెక్టవిటీని అనుసంధానం చేసామన్నారు. వీటికి టెలిఫోన్ సౌకర్యాన్ని అందించడం గమనార్హమని మధుసూధనరెడ్డి తెలిపారు. ట్రంక్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ మౌలిక సదుపాయాలు కలిగి 24 కిలోమీటర్ల నిడివిలో ఆర్కిటెక్చర్ కలిగి ఉన్న సాంకేతిక అనుసంధానంతో ఒక వలయంగా రాష్ట్రవ్యాప్తంగా 2600 ప్రదేశాలలో పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్‌తో కూడిన సేవలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ సేవలను గ్రామపంచాయతీలతో ఫేజ్ - 2 ప్రాజెక్టులో భాగంగా అనుసంధానం చేస్తున్నట్లు మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల గృహాలకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోనికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఆదేశించారని మధుసూధనరెడ్డి తెలిపారు. రాబోయే 2, 3 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలను అనుసంధానం చేస్తామన్నారు. పెరుగుతున్న ఖాతాదారులకు అనుగుణంగా సిపిఇ బాక్స్‌లను కూడా సరఫరాను పెంచుతామని ఆయన తెలిపారు. స్ధానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్ల నిర్వాహకులతో ఏ.పి. ఫైబర్ నెట్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు.
‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు పంపిణీతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 7 వరకూ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం తెలిపారు. ‘‘లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తాం. మెటీరియల్ ఇవ్వండి, లేబర్ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని’’ సీఎం స్పష్టం చేశారు.
ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధం చేసుకోవాలని, దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం చురుగ్గా ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు. ఇటీవల వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైన విధంగా డ్రైయిన్లు నిర్మాణం, ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం లేకుండా, సమస్యలు లేకుండా చూడాలని.. ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలని, దీని తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మనం కట్టేవి ఇళ్లు కావు, ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలి. వీధి లైట్ల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి పెట్టాలి. ప్రతి లే అవుట్‌లో నమూనా ఇంటిని (మోడల్ హౌజ్) నిర్మించాలని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
♦మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు
♦3,65,987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులు
♦ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ
♦రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ
♦కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం
♦వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక
♦పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం
♦175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభం
♦8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం
♦రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం
♦టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న ప్రభుత్వం
♦300 చదరపు అడుగుల ఫ్లాట్‌లను కేవలం రూ.1 రూపాయికే ఇవ్వనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి సృష్టిస్తున్న అయోమయంపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం తెలవగానే కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక వైద్యులతోపాటు మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం పరిశీలించారని.. అయితే వైద్యపరీక్షల్లో ఈ పరిస్థితికి కారణమేంటనేది మాత్రం తెలియడం లేదని అధికారులు ఉపరాష్ట్రపతికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌తో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. బాధితులకు ఉన్నతస్థాయి వైద్యం అందించడంతోపాటు.. ఈ ఘటనకు కారణమేంటనే దాన్ని గుర్తించి.. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వంతో సహకరించాలని, ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ఏయిమ్స్ అత్యవసరవైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, పుణే ఎన్ఐవీ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవష్టవర్, ఎన్డీసీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంకేత్ కులకర్ణిలతో కూడిన ఈ బృందం.. ఏలూరు వైద్యులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏలూరులో నాలుగైదు రోజులుగా పలువురు మూర్ఛ, కళ్లుతిరగడం, నోట్లు నురగ వంటి లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరుతూ చికిత్స తీసుకుని రెండ్రోజుల్లో కోలుకోగానే ఇంటికి వెళ్లిపోతున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరగడం ఇందులోనూ చిన్నారులు, మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇది సంక్రమణ వ్యాధి లాగా అనిపించడం లేదని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. అసలు కారణాలేంటనేది మాత్రం అంతుచిక్కడం లేదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని విజయవాడ, విశాఖపట్టణం పంపి చికిత్సనందిస్తున్నారు. డైరక్టర్లతో మాట్లాడిన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి చొరవతో ఏర్పాటైన ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన వైద్య నిపుణులు, వైరాలజిస్టుల బృందం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు వచ్చి, ల్యాబ్ నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందజేస్తారని ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి తెలియజేశారు.
గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. హిందూ ధర్మ రక్షణ కోసం టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమానికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని కోరారు.టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణ శాల నేతృత్వంలో అమలు చేయనున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని సోమవారం విజయవాడ కనక దుర్గ ఆలయంలో మంత్రి వెలం పల్లి శ్రీనివాస్ తో కలసి ఆయన ప్రారంభించారు. వేద పండితుల మంత్రో చ్చారణల నడుమ దుర్గ గుడికి గోవు, దూడను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ , హిందూ ధర్మం లో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారునీ అందుకే గోవును గోమాత అంటామన్నారు.
గోవును పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. గో సంరక్షణ కూడా హిందూ ధర్మ పరిరక్షలో ఒక భాగమే నని చైర్మన్ చెప్పారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదంతో గోసంరక్షణ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు యారవుతున్నాయని ఆయన చెప్పారు. హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నామన్నారు.ఈ కార్యక్రమం అమలు కోసం ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా దేశవాళీ ఆవుల దానాన్ని స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
మఠాలు, పీఠాలు, వంశపారంపర్య పర్యవేక్షణ ఆలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వేద పాఠశాలలకు ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ గోవుతో పాటు దూడను అందజేస్తుందన్నారు. గోదానం పొందిన ఆలయాలు, పీఠాలు, వేదపాఠశాలలు గోవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. టిటిడి ద్వారా దానం పొందిన గోవుల వద్ద గుడికో గోమాత - టిటిడి అనే బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వివరించారు. ఎస్వీ గోసంరక్షణశాల ముందస్తు అనుమతితోనే భక్తులు ఈ కార్యక్రమానికి గోవులను దానం చేయాల్సి ఉంటుందని శ్రీ వైవి చెప్పారు. రాష్ట్ర దేవ దాయ శాఖ మంత్రి శ్రీ వేలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గోసంరక్షణ కోసం టీటీడీ చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నారు.
శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, కొలుసు పార్థ సారథి, టీటీడీ జెఈఓ బసంత్ కుమార్, ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, దుర్గ గుడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు సోమి నాయుడు, ఈఓ సురేష్ బాబు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. డిసెంబరు 10వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.ఇందులో భాగంగా శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 20 మంది ప్రముఖ రుత్వికులు 13హోమగుండాలలో విశేష హోమాలు నిర్వహించనున్నారు. కాగా, ఆదివారంనాడు ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
కళాకర్షణ :
రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు.
డిసెంబరు 7, 8, 9వ తేదీల్లో :
- ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరల రాత్రి 8 నుండి 10 గంటల వరకు విశేషహోమాలు, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
డిసెంబరు 10న :
డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయబడిన రాగి రేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులకు శ్రీ వరాహస్వామివారి మూల విరామూర్తి దర్శనం ఉండదు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగు వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్ఎకె.సుందరవరదచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.