ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ "మా బాబు "చిత్రాన్ని నిర్మాత డి.వి.ఎస్ . రాజు నిర్మించారు. నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ,సావిత్రి జంటగా ఈ చిత్రంలో నటించారు. టి . ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం: టి .చలపతిరావు, రచన : జూనియర్ సముద్రాల, కెమెరా : కమల్ ఘోష్, కళ: కళాధర్ .
ఈ చిత్రం లో నాగేశ్వరరావు, సావిత్రి ,రేలంగి , గుమ్మడి, రమణారెడ్డి ,కుటుంబరావు, కన్నాంబ ,ఎం.ఎన్ .రాజ, ఎం. సరోజా , హనీ ఇరానీ ( వండర్ చైల్డ్) మొదలగు వారు నటించారు .ఈ చిత్రం తే 22-12-60దీ నాడు విడుదల అయ్యింది . యావరేజ్ గా ప్రదర్శింపబడింది .
ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందును అందించి, ఉర్రూతలూగించేందుకు "ఊర్వశి ఓటిటి" సర్వ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నెలాఖరు వరకు 'ఇనాగురల్ ఆఫర్'గా ఉచిత వినోదం పంచనున్న "ఊర్వశి ఓటిటి".. ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా "రామ్ లోపాల్ వర్మ" చిత్రాన్ని ఉచితంగా చూపించనుంది. ప్రముఖ దర్శకుడు వీరు.కె రూపొందించిన ఈ చిత్రంలో షకలక శంకర్, ఆర్లిన్, డి.ఎస్.రావు, మధురిమ, లక్కీ, ఫిష్ వెంకట్, శశికాంత్, హర్షద పటేల్ ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర రూపకర్త వీరు.కె మాట్లాడుతూ... "ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న "ఊర్వశి ఓటిటి" ఇనాగురల్ ఆఫర్ గా.. "రామ్ లోపాల్ వర్మ" స్ట్రీమింగ్ కానుండడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్లిన దర్శకుడు ఇప్పుడు.. అదే తెలుగు సినిమా స్థాయిని పాతాళంలోకి తీసుకువెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక... సదరు దర్శకుడిపై ఇప్పటికీ గల గౌరవంతో... ఆవేదనతో...అతని లోపాలను ఎత్తి చూపుతూ... అతని పూర్వ వైభవాన్ని కోరుకుంటూ రూపొందించిన చిత్రం "రామ్ లోపాల్ వర్మ. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. విమర్శనాత్మకంగా, ఆలోచన రేకెత్తిస్తూ తెరకెక్కిన "రామ్ లోపాల్ వర్మ" అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది" అన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కెమెరా: గోపి కాకాని, ఎడిటింగ్: అల్లియో, డాన్స్: రామారావు, ఫైట్స్: కృష్ణ, రచన-నిర్మాణం-దర్శకత్వం: వీరు.కె !!
ఆయన ఎమ్మెల్యే కాకముందు వాయుసేనలో ఫైలట్..భారతదేశానికి ఎనలేని సేవలు అందించి రిటైర్ అయ్యారు..విధినిర్వహణ చేరినపుడే తన ప్రాణం దేశానికే అంకితం అని ఇచ్చిన మాటను మరువకుండా నాటి నుంచి నేటి వరకూ రక్తం దానం చేస్తూనే వస్తున్నారు..అంతేకాదు ఒక వ్యక్తియొక్క ప్రాణానికి ఈయన ఇచ్చే విలువ తెలిస్తే ఎవరైనా సెల్యూట్ చేస్తారు..ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. భారతదేశంలో అన్ని ముఖ్యమైన రోజుల్లోనూ ఆయన రక్తదానం చేస్తారు. ఎక్కడ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించడానికి వెళ్లినా ముందు తన రక్తాన్ని దానం చేస్తూ...ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంతా ఇదేదో ఆయన ప్రచారం కోసం చేస్తారనుకుంటారు..అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఒక వ్యక్తి రక్తం దానం చేయడం ద్వారా ఆపదలో వున్న నలుగురు ప్రాణాలను కాపాడవచ్చునని అందుకే ప్రతీ మూడు నెలలకొకసారి తాను ఖచ్చితంగా రక్తం దానం చేస్తానని, దానికి రక్తదాన శిభిరాలనే ముందుగా ఎంచుకుంటానని తడుముకోకుండా చెబుతారు. వాయుసేనలో చేరినపుడే తన జీవితాన్ని భారతమాతకు అంకిత మిస్తానని ప్రామిస్ చేశానని...ఆ మాటను నిలబెట్టుకుంటూ క్రమం తప్పకుండా రక్తం దానం చేస్తూనే ఉంటానని చెబుతారు వాసుపల్లి. తన కోసం ఎవరు ఎలా అనుకున్నా డోంట్ కేర్..తను దానం చేసిన రక్తంతో ఒక్క ప్రాణం నిలబడినా నాకు అదే ఆత్మ సంత్రుప్తి అని అంటారు. ఈయన చేసే రక్తదానం స్పూర్తితో ఎందరో యువకులు ఈయనను అనుసరిస్తారు. రక్తం దానం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని, అదే సమయంలో మనం మంచి ఆహారం కూడా తీసుకోవాలనే జాగ్రత్తలు కూడా రక్తాన్ని దానం చేసే వారికి హితబోద చేస్తారు వాసుపల్లి. విశాఖలో రక్తదానమంటే ఎమ్మెల్యే వాసుపల్లే అనేంతగా ఈయన సేవలు ఉంటాయనడంలో అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్బంగా కూడా ఎమ్మెల్యే తన రక్తాన్ని దానం చేసి మరీ రక్తధాన శిబిరాన్ని ప్రారంభించడం విశేషం. ఈ రక్తదాన శిబిరంలో కూడా పెద్దఎత్తున యువత పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిజం విలువల పరిరక్షణకు నడుం కట్టినట్టు కనిపిస్తుంది. గతంలో వ్యాపారంగా సాగుతూ వచ్చిన అక్రిడేషన్లు ఇకముందు నిస్పాక్షికంగా జారీచేసేందుకు వివిధ సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర, జిల్లా కమిటీలను అధికారులతో నియమించడం పట్ల పలువురు హర్షం చేస్తున్నారు. అదే సమయంలో దేశ రాజధాని పీఐబి తరహా అక్రిడిటేషన్ నిబంధనలను కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అలా చేయకపోవడం ద్వారా నకిలీ జర్నలిస్టులు(జర్నలిజం లేని వారు, వ్యాపారాలు చేసే వారు, టూరిజం గైడ్లు తదిరులు) అక్రిడిటేషన్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. ఇలాంటి వారే చాలా మంది అక్రిడిటేషన్ కమిటీ నేతలతో మిలాఖత్ అవడం ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు నష్టం వాటిల్లి, కమిటీ సభ్యులు, కులపెత్తనం చేసే కాస్త తేడా జర్నలిస్టుల పంతాలు నెగ్గించుకొని వారికి అనుకూలంగా వున్నవారికోసం సమాచారశాఖ అధికారులను అడ్డం పెట్టుకొని అక్రిడిటేషన్లు పొందుతున్నారు. దానికి మూలాలూ కూడా లేకపోలేదు..జిల్లా అక్రిడేషన్ కమిటీల్లో అధికారులు మాటలు, కొన్ని యూనియన్ నాయకుల హడావిడి తప్పితే కమిటీలో కూర్చున్న ఏ ఒక్కరూ జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన చైర్మన్ కు వాస్తవాలు వివరించలేని పరిస్థితి. దానికి కారణం ఇంగ్లీషుపై పట్టు లేకపోవడం, అసలు అక్రిడిటేషన్ మంజూరుకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవడం, కొందరు సమాచారశాఖ అధికారుల వక్రబుద్ది చూపించడం ఇలా చాలానే వస్తున్నాయి. ఫలితంగా నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది. దానికితోడు అక్రిడేషన్ల వ్యామోహం తోనే అనేకమంది ఈ రంగంలోకి వచ్చి జీతభత్యాలు లేక, జీవన స్థితి గతులు అంతంతమాత్రంగా మారిన స్థితిలో వివిధ అపసవ్య మార్గాన్ని ఎంచుకున్న కొందరి వలన ఈ రంగం కలుషితం అవుతున్నట్లు నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రిడేషన్లు జారీలో నిబంధనలు ప్రకారం ఖచ్చితంగా జరీచేసినా లేక, జీతభత్యాలు రావని ఈరంగాన్ని పలువురు భవిష్యత్లో ఎంచుకునే మార్గం వీడే అవకాశం తో పత్రికా రంగంలో కేవలం అంకితభావం, అర్హులు మాత్రమే ఉన్నవారి వలన తప్పక ఫోర్త్ ఎస్టేట్ ప్రతిష్ట పెరుగుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ విషయంలో చొరవ తీసుకున్న సమాచార శాఖా మంత్రి పేర్న నాని, కమిషనర్ టి.విజయ్ కుమార్ ల నిర్ణయం చాలా గొప్పదినే భావన వర్కింగ్ జర్నలిస్టుల్లో వ్యక్తం అవుతోంది. దానికి ఇక ఇటీవల తరచుగా లో మీడియా కి చెందిన వారిపై జూదం,వ్యభిచారం,బ్లాక్మైలింగ్, దారిదోపిడీ,ఫోర్జరీ తదితర నేరాలకు పాల్పడిన వారి వార్తలు రావడం కూడా ఫోర్త్ ఎస్టేట్ రంగం కలుషితం అవుతోంది. కనుక ప్రభుత్వం అక్రిడేషన్లు జారీ చేసే ముందు అసలు అక్రిడిటేషన్ కి దరఖాస్తు చేసిన వారు నిజంగా జర్నలిజంలో పనిచేస్తున్నారా...లేదంటే డెస్కులో పనిచేస్తున్నారా.. ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నారా.. అనే విషయాలపై పోలీస్, సమాచారశాఖ అధికారులతో విచారణ జరిపిస్తే.. అక్రిడిటేషన్ కోసం వేల రూపాయలు ఖర్చుచేసి మరీ అక్రిడిటేషన్లు కొనుగోలు చేసేవారు తగ్గుతారని వర్కింగ్ జర్నలిస్టుల వాదన. అలా ఎంక్వయిరీ జరిపించి మరీ అక్రిడేషన్లు జారీచేయాలని పాత్రికేయులు కోరుతున్నారు. అదే సమయంలో చిన్న, మధ్య తరహా పత్రికలు నడిపేవారి సమస్యలను కూడా ప్రభుత్వం గుర్తించాలని కూడా నిజమైన జర్నలిస్టుల కోసం నడిచే పాత్రికేయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎల్ఐసీ ఏజెంట్లు, పలు రాజకీయపార్టీలకు చెందిన నాయకులు, ప్రింటింగ్ ప్రెస్ లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, బిల్డింగ్ కలెక్షన్ కార్డు జర్నలిస్టులు, యూనియన్ నేతల ముసుగులో దందాలు చేసే జర్నలిస్టులు ఈ విధానాల వలన పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు, వర్కింగ్ జర్నలిస్టులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లో జర్నలిజం కూడా మంచి మార్గంలో వెళ్లేందుకు,కోల్పోతున్న పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలపై నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని యూనియన్లు ఆందోళనలు చేసినా అలాంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. అయితే ఇదే సమయంలో సమచారశాఖ వక్రబుద్ధి లాభీయింగ్ లపై కూడా ప్రభుత్వం ద్రుష్టి సారించడం ద్వారా నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు వచ్చే అవకాశం వుంది. లేదంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నా..గతంలో మాదిరిగానే అడ్డదారిలో వచ్చేవారికే అక్రిడిటేషన్లు వస్తాయనడంలో సందేహం లేదు..!
జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా పథకాల అమలును వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ రూపొందించిన ప్రత్యేక వ్యూహం ఫలితమిచ్చింది. ఈ పథకం అమల్లో జిల్లా గణనీయమైన పురోభివృద్దిని సాధించింది. వైఎస్ఆర్ చేయూత పథకంలో ఏకంగా రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకోగా, వైఎస్ఆర్ బీమా పథకంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. జగనన్న తోడు పథకం అమల్లో ఈ నాలుగు రోజుల్లోనే మంచి పురోభివృద్ది చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మూడు పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి అమలు చేశారు. జిల్లా అధికారులను పరుగులు పెట్టించడమే కాకుండా, తాను సైతం స్వయంగా పలు బ్యాంకులకు వెళ్లి తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్లు కూడా వివిధ బ్యాంకులను తనిఖీ చేశారు. పథకాల పర్యవేక్షణకు డిఆర్‌డిఏ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా ఒక కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మండలాలకు ఐటిడిఏ పివో, జాయింట్ కలెక్టర్(ఆసరా), సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్‌డిఓ, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులను ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించారు. వీరు నేరుగా ఆయా బ్యాంకు అధికారులతో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేశారు. అలాగే క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే, వాటిని విశ్లేషించి, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్‌టీమ్ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలు వరకూ సిద్దంగా ఉండి పనిచేసింది. వివిధ శాఖల పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, సాంకేతిక సహకారాన్ని అందించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆధ్వర్యంలో, ఆయా శాఖల సిబ్బంది సైతం కంట్రోల్ రూములో 24 గంటలూ అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు. మొత్తం కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పర్యవేక్షించారు.
ఈ ప్రత్యేక కార్యాచరణ కారణంగా ఈ పథకాల అమలు వేగవంతం అయ్యింది. వైఎస్ఆర్ చేయూత పథకం అమల్లో శతశాతం లక్ష్యాలను సాధించడం ద్వారా, రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ బీమా పథకం అమల్లో రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు ద్వితీయ స్థానం దక్కింది. జిల్లాలో సుమారుగా 6,97,161 బియ్యం కార్డులు ఉండగా, 5,92,827 కార్డులకు సర్వే పూర్తి అయ్యింది. వీటిలో 5.25.215 కుటుంబాల వివరాలను బ్యాంకులకు అందజేయడం జరిగింది. బీమా పథకంలో మొదటి స్థానంలో విశాఖ జిల్లా నిలవగా, మన తరువాత స్థానంలో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు నిలిచాయి. జగనన్న తోడు పథకం క్రింద ఇప్పటివరకు 25,635 దరఖాస్తులను బ్యాంకులు ఆమోదించాయి. వీరిలో ఇప్పటికే 9,475 మందికి రూ.9,47,50,000 మొత్తాన్ని అందజేయడం జరిగింది. మిగిలిన వారికి కూడా రెండు మూడు రోజుల్లో రుణాలు మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 22న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 11.45 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
పర్యాటకరంగంలో భారీ పెట్టుబడులను ఆహ్వనించేలా , అందుకు తగిన సంస్థలను ప్రోత్సాహించేలా నూతన పర్యాటక పాలసీని రూపొందించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నాడు స్థానిక సర్య్కూట్ హౌస్ లో ఆయన “ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీ 2020 – 2025 “ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహజవనరులు ఉన్నరాష్ట్రమని, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం,రివర్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం,రిక్రియేషన్ టూరిజం లను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వసతి, సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. 5 స్టార్, 7 స్టార్ హోటల్ లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ హోటల్ లు నెలకొల్పడానికి అవసరమైన భూమి, ఇతర సదుపాయాలను ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మెగా టూరిజం ప్రాజెక్టులకు లీజు కాలాన్ని 66 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచామని తెలిపారు. లీజు తీసుకోవడానికి ఆస్తి విలువపై 2 శాతం ఉన్న స్టాంప్ డ్యూటీని 1 శాతానికి తగ్గించామని తెలిపారు.
స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పి వి) ద్వారా పెట్టుబడులకు పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా అనుమతులిస్తామని తెలిపారు. అనుమతులు కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 90రోజులలో ఇస్తామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేలా నిబంధనలను సరళీకరిస్తున్నామని తెలిపారు. ఇతరరాష్ట్రాల పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు చెన్నై, ముంబాయి లాంటి నగరాలలో రోడ్ షోలు నిర్వహిస్తామని తెలిపారు. అధికారులు , నిపుణులతో చర్చించి పాలసీని మెరుగు పరచామని తెలిపారు.
కోవిడ్ పరిస్థితుల అనంతరం పర్యాటకరంగాన్ని పునరుద్దరించేందుకు రూ. 200 కోట్లతో ‘”రీస్టార్ట్ ప్యాకేజీ” ని ఇస్తున్నామని తెలిపారు. చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు తీసుకునే బ్యాంకు రుణాలపై 4.5 శాతం వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. టూర్ ఆపరేటర్లు, హోటళ్లు,రెస్టారెంట్లు నిర్వాహకులు ఈ ప్యాకేజీ ద్వారా లబ్దిపొందుతారని తెలిపారు. రాష్ట్రంలో రాయలసీమ , కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, , గోదావరి సర్య్కూట్ లను ప్రత్యేకంగా అభివృద్ది పరుస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తామని తెలిపారు. రాబోయే 2 నెలలలో ఈ నాలుగు ప్రాంతాలలో ఇన్ వెస్టర్స్ మీట్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకరంగంలో లక్షమందికి జీననోపాధి లభిస్తుందని తెలిపారు.
బోట్ లను పర్యవేక్షించేందుకు 9 కమాండ్ కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇరిగేషన్, టూరిజం, పోలీసు,రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు వీటిలో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న టూర్ ఆపరేటర్లు, గైడ్ లకు వృత్తి పరమైన శిక్షణ ఇచ్చి ప్రొఫెషనలిజం ఉండేలా తీర్చి దిద్దుతామని తెలిపారు. “అతిధి దేవోభవ” సాంప్రదాయాన్ని పాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, శాసన సభ్యులు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, పర్యాటక శాఖ ఆర్ డి రాంప్రసాద్, టి ఐ ఓ పూర్ణిమాదేవి పాల్గొన్నారు.
తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో గల కౌంటర్లలో డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను మూసివేస్తునట్టు టిటిడి ప్రకటించింది. డిసెంబర్ 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను కూడా డిసెంబర్ 21వ తేదీ లోపు జారీ చేస్తామని తెలియజేసిన టిటిడి భక్తులు ఈ మార్పును గమనించి టిటిడికి సహకరించాల్సిందిగా కోరింది. కోవిడ్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ,గతంలో జరిగిన శాంతిభద్రతలు, ఇతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యాయం వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు స్థానికులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు పేర్కొంది. దయచేసి స్థానికేతరులెవ్వరూ టోకెన్ల కొరకు రావద్దని మనవి చేయడమైనది. స్థానికులు కూడా ఆధార్ కార్డు తీసుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్దేశించిన 5 ప్రాంతాలకు వచ్చి టోకెన్లు పొందాలని కోరింది.