ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో ఆదివారం ఉదయం జరిగిన సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితుల అఖండ పారాయణంతో వసంత మండపం పులకించింది. సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ ప్రపంచ ప్రజల యోగ క్షేమం కొరకు టిటిడి 241 రోజులుగా శ్రీవారి అనుగ్రహంతో మంత్ర పారాయణ కార్యక్రమం నిర్వహస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో సుందరకాండలోని 68 సర్గలలోని 2821 శ్లోకాలను మొత్తం 16 పర్యాయలు అఖండ పారాయణం చేయనున్నట్లు తెలిపారు. సుందరకాండ పారాయణం చేయడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వివరించారు.
ఇప్పటివరకు ఆరు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8 నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాలు, అక్టోబరు 4న ఐదవ విడత 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు 174 శ్లోకాలను, నవంబరు 3న ఆరో విడత 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు185 శ్లోకాలు అఖండ పారాయణం జరిగింది.
కాగా టిటిడి ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం " దాశరధీ కరుణాపయోనిధి ...... " , అనే సంకీర్తనను కార్యక్రమం ప్రారంభంలో, టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ " శ్రీ హనుమ.....సీతారామ ప్రియ శ్రీ హనుమ....జై హనుమ ......" అనే సంకీర్తనను కార్యక్రమం ముగింపులో సుమధురంగా అలపించారు.
అఖండ పారాయణంలోని 24వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను శ్రీ పవన్‌కుమార్ శర్మ, శ్రీ రామానుజాచార్యులు పారాయణం చేశారు. ఈ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, జాతీయ సంస్కృత వర్సిటి ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఎస్వీ వేద ఉన్నత వేద అధ్యాయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ పాల్గొన్నారు.
కరోనా నేపధ్యంలో అన్ని రంగాల పరిశ్రమలు కుప్పకూలిపోయాయి. సినీ పరిశ్రమ తో సంబంధం ఉన్న పంపిణీరంగం ,
చిత్ర ప్రదర్శన రంగం కూడా కకావిలైపోయింది. గత కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం చిత్రాల ప్రదర్శన కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినా థియేటర్ యజమానులు చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే తమతమ థియేటర్స్లో చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. కరోనా కారణంగా థియేటర్స్ కు ప్రేక్షకులు రాకపోవడం గమనించదగ్గ విషయం .
అయితే రెండు రోజుల క్రితం విశాఖపట్నం జగదాంబ థియేటర్లో "టినెట్" సినిమాను తెలుగులో రెండాటలు, ఇంగ్లిష్లో రెండు ఆటను ప్రదర్శించారు .ఈ సినిమా మార్నింగ్ షో, సెకండ్ షో హౌస్ఫుల్ కావడం ఒక విధమైన శుభ పరిణామంగా భావించాలి. జగదాంబ థియేటర్ తో పాటు ఉత్తరాంధ్ర లో వున్న పంపిణీదారులు, థియేటర్ యజమానులు , సినీ ప్రేమికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు .అంతేకాకుండా అర్జున్ ,శివకార్తికేయన్ కాంబినేషన్ లో "అభిమన్యుడు " చిత్ర దర్శకుడు" మిత్రన్" అందిస్తున్న డిఫరెంట్ చిత్రం "శక్తి " ని ఈ నెల 11 న ఉత్తరాంధ్ర జిల్లాల్లో గాయత్రి దేవి ఫిలింస్ పదిహేడు థియేటర్స్లో ప్రదర్శించడానికి సిద్ధం అవడం ఎంతో శుభసూచికం.. మరెంతో అభినందనీయం..ఎందరో శ్రామికులు ...మరెందరో కార్మికులు ...ఈ చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు .అలాగే పంపిణీదారులు ,చిత్ర ప్రదర్శన దారులు కూడా ఈ చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు .
ఎప్పుడూ చలనచిత్ర రంగం పచ్చగా వర్ధిల్లాలని EMS సినిమా టీమ్ భావిస్తోంది.
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శనివారం తిరుమల వసంత మండపంలో శ్రీ విష్ణుసాలగ్రామ పూజ ఘనంగా జరిగింది. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ విశేషమైన భగవత్ శాస్త్రంలో చెప్పడినట్లు సాలగ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ ముక్కోటి దేవతలు ఉంటారని తెలిపారు. సృష్ఠి, స్థితి, లయ కారకుడైన శ్రీ మహవిష్ణువు కూడా అక్కడే కొలువై ఉంటారన్నారు. కృత, త్రేత, ద్వాపర యుగాలలో వేలాది సంవత్సరాలుగా తపస్సు, యజ్ఞ యాగాలు చేయడం వల్ల పొందే ఫలితాన్ని, కలియుగంలో పవిత్ర కార్తీక మాసంలో విష్ణుసాలగ్రామ పూజ చేసిన, దర్శించిన, ఆ మంత్రాలను విన్న అంతటి ఫలితం సిద్ధిస్తుందని వివరించారు. ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత సాలగ్రామాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాలగ్రామాలకు ప్రత్యేక వేద మంత్రాలచే ఆరాధన, నివేదన, హారతి సమర్పించారు. చివరిగా క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది. ఈ పూజ కార్యక్రమంలో అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్ఎకె.సుందరవరదచార్యులు, శ్రీవారి ఆలయ ఓఎస్‌డి పాల శేషాద్రి, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయంలో డిసెంబరు 6 నుంచి 10వ తేదీ వరకు ''బాలాలయ మహాసంప్రోక్షణ'' కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి డిసెంబరు 5వ తేదీ రాత్రి అంకురార్పణం జరుగనుంది. ఆలయంలోని యాగశాలలో డిసెంబరు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. దీనికోసం టిటిడి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీఏటా డిసెంబరు మాసంలో స్వామి '' బాలాలయ మహాసంప్రోక్షణ '' చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు.
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై డిసెంబరు 6వ తేదీ 7వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న 194 శ్లోకాలను పారాయణం చేస్తారు. కాగా, సుందరకాండలోని 68 సర్గలకు గాను 2821 శ్లోకాలు ఉన్నాయి. ఈ మొత్తన్ని 16 విడతలుగా టిటిడి అఖండ పారాయణం చేయ సంకల్పించింది. ఇప్పటివరకు ఆరు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. ఆదివారం జరుగనున్న ఈ కార్యక్రమంలో తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, టిటిడి వేదపారాయణదారులు పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతోంది.