ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా ఆయన ఇప్పటికే కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వరదల కారణంగా 4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరాల కోసం వెంటనే 2250 కోట్లు సాయం అందించాల్సిందిగా ఆయన తన లేఖలో కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా పంటనష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. బాగా వరదలు వచ్చిన ప్రకాశం బ్యారేజీ, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే క్రిష్ణాజిల్లా కలెక్టర్ ను ఆదేశించి బాదితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునరావాస చర్చలు తీసుకోవాలాని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు కోవిడ్ 19తో మృతి చెంది వుంటే తక్షణమే వివరాలు ఆయా జిల్లాల సమాచారశాఖ కార్యాలయాలకు తెలియజేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు జర్నలిస్టులను కోరారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్19 నేపథ్యంలో రాష్ట్రంలో మృతి చెందిన 45 మంది జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని చెప్పారు. ఈ మేరకు విశాఖ జిల్లా నుంచి కూడా ఇద్దరు జర్నలిస్టులు మృతి చెంది ఉండడంతో వారి వివరాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఇందుకు సంబంధించి ఇంకా ఎవరైనా జర్నలిస్టు మృతి చెంది ఉంటే వారి వివరాలను తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపాలని ఆయన కోరారు. మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబం కి రూ.5లక్షలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని చెప్పారు. జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి ఇన్సూరెన్స్ సదుపాయము కల్పించాలని పీఎం మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి లను కోరడం జరిగింది అన్నారు. త్వరలో సానుకూల స్పందన లభిస్తుంని భావిస్తున్నట్లు శ్రీనుబాబు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజి విషయం కేంద్రం ద్రుష్టికి తీసుకువెళ్లనున్నామని వివరించారు...
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో అభయమిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డా. నిశ్చిత, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, కుమారగురు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం అండగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'గత పది నెలల్లో 134 కోట్ల వ్యయంతో 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయలో అండ. డిశ్చార్జైన 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు. కుటుంబ పెద్ద కోలుకునే సమయంలో పెద్దదిక్కుగా మారిందీ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముందు చూపునకు మచ్చుతునక' అంటూ ప్రశంసలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు పూర్తిస్థాయిలో కార్పోరేట్ వైద్యం అందించింన ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రకెక్కిందన్నారు. ఆపదలో కూడా 108 అంబులెన్సులు అదేస్థాయిలో ఆపద్బాందవుడిగా పనిచేస్తున్నాయన్నారు. 104 ద్వారా ప్రతీ గ్రామంలో ఉచిత వైద్యసేవలు, పరీక్షలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎం.శంకరనారాయణ, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. వెనుబడిన వర్గాల వారికి రాజ్యాధికారం అందివ్వడం ద్వారా బీసీల ఆర్యాధ్యుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. విజయవాడ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాను మంత్రులు ప్రకటించారు. ముందుగా డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన వర్గాలను ఆదుకోవాలని పాదయాత్ర సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. బీసీలు వెనుకబడి వర్గాలు కాదు సమాజానికి వెన్నుముక అని సీఎం జగన్ రుజువు చేశారన్నారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలోనే రూ.33,500 కోట్ల రూపాయలు వెచ్చించారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, 728 మందికి చైర్మన్లగా, డైరెక్టర్లగా అవకాశమిచ్చారన్నారు. క్యాబినెట్ లో కూడా వెనుబడిన కులాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. బీసీ కూలానికి చెందిన తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. వెనుబడిన కులాలంతా పండగ జరుపుకునే సమయమని ఆనందం వ్యక్తంచేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ కులాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని నామినేట్ అయిన చైర్మన్లకు ఆయన పిలుపునిచ్చారు.
నా జన్మ ధన్యమైంది : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ...
56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాను ప్రకటించే అవకాశం రావడంతో తన జన్మ ధన్యమైందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీసీలకు రాజ్యాధికారం కల్పిండంతో చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు అని, దేశ చరిత్రలో ఎన్నడూ ఇంతమంది బీసీలకు అధికారమిచ్చిన దాఖలాల్లేవని అన్నారు. వెనుబడిక వర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పలువురు బీసీ నాయకులకు మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా అవకాశమిచ్చారన్నారు. ఒక్కో కార్పొరేషన్లో చైర్మన్ సహా 12 మంది డైరెక్టర్లు ఉంటారన్నారు. సామాజిక స్థితిగతులు, ఇతర అంశాలను బేరీజు వేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి.. చైర్మన్లను ఎంపిక చేశారన్నారు. అనంతరం ఆయన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాను ప్రకటించారు.
హ్యాట్సాఫ్ సీఎం సార్... : మంత్రి బొత్స సత్యనారాయణ....
ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వెనుకబడిన కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తామని, ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అదే సభలో ఉన్న తమకు ఇది సాధ్యమేనా..? అని ప్రశ్న తలెత్తిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అసాధ్యమనుకున్న విషయాన్ని సుసాధ్యం చేశారన్నారు. పదవుల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, 728 మంది వెనుబడిన కులాలకు చెందిన వారిని చైర్మన్లగా, డైరెక్టర్లగా నియమిస్తూ... ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారన్నారు. బీసీ కులాలు జీవితాంతం వెనుకబడి ఉండిపోయేలా కాకుండా వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానాల్లో నిలపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లో చూపిస్తూ, బీసీలకు అండగా నిలిచారని కొనియాడారు. ప్రతి బడ్జెట్ లోనూ బలహీన వర్గాల అభ్యున్నతికి అత్యధిక నిధులు కేటయిస్తున్నారన్నారు. తమ అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి బీసీలంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు.
చరిత్రలో నిలిచిపోయే రోజు : ఎంపి మోపిదేవి వెంకటరమణ...
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అభిప్రాయపడ్డారు. నిన్నటి వరకూ ఓటు బ్యాంకుగా నిలిచిన బీసీలు ఇకపై పాలనలో భాగస్వాములవుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుబడి ఉండడాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో గుర్తించారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారన్నారు. అదే సమయంలో బీసీలకు పాలనలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో తనలాంటి వారెందరికో మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశమిచ్చారన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో మహిళలకు 50 శాతం అవకాశమివ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. దానిలో భాగంగా కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపికలో మహిళలకు 50 శాతం మేర అవకాశమిచ్చారన్నారు. డైరెక్టర్ల ఎంపికలోనూ ఇదే పంథా కొనసాగుతుందన్నారు. 728 మంది బీసీ నాయకులకు రాజ్యాధికారం కల్పించడం ఏపీ చరిత్రలోనే సాహసోపేతమైన చర్య అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శంకరనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మహానటుడు స్వర్గీయ ఎన్టీఆర్ కి భారతరత్న ప్రకటించాలనే ఉద్యమం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమేపీ బలపడుతోంది. ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఎన్టీఆర్ ను బీజేపి ప్రభుత్వమైనా గుర్తించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి రిజిస్టర్ పోస్టు లేఖల ద్వారా తమ డిమాండ్ ను తెలియజేస్తున్నారు. డా.ఎన్టీఆర్ కళారాధన పీఠం, యునైటెడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చైర్మన్, లక్షల లేఖల ఉద్యమ నిర్వాహకులు ఎస్ఎల్ఎన్ స్వామి రోజుకి 30 నుంచి 50 రిజిస్టర్ పోస్టు లేఖల ద్వారా ఉద్యమాన్ని ముందుకి నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, తెలుగు సినీ రంగం చరిత్రలోనే ఎన్టీఆర్ నటన ఎనలేనిదన్నారు. అలాంటి మహానటుడిని కేంద్రం ప్రభుత్వం నేటికీ గుర్తించకపోవడం శోచనీయమన్నారు. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులంతా కలసి కోటి ఉత్తరాల ఉద్యమం చేపట్టి కేంద్రానికి తమ వినతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పోస్ట్ ఎన్టీఆర్ ఉద్యోగులు చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. ప్రతినిత్యం రిజిస్టర్ పోస్టు ద్వారా తమ డిమాండ్ ను కేంద్రానికి తెలియజేయడం అభినందనీయమన్నారు. ఈ ఉద్యమయంలో ప్రతీ ఎన్టీఆర్ అభిమాని కలసి రావాలని ఆయన పిలుపునచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో తనకున్న అభిమానాన్ని మీడియాకి తెలియజేశారు.
ఉత్తరాంధ్రావాసుల ఇలవేల్పు విశాఖలోని బురుజుపేట శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శనివారం ఈ మేరకు ఆలయంలో నిర్వహించిన రాట మహోత్సవంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దుర్గమ్మ, కనకమహాలక్ష్మి అమ్మవార్లు కరుణతో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో నియంత్రణ జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్సవాలు నిర్వహించాలని ఈఓకి సూచించారు. ఆలయంలోకి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, గదతో దామోదర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు డిపి.అనంత, వేమిరెడ్డి ప్రశాంతి, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.