రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది జూన్ మొదటి వారంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రైస్ కార్డులు అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని, అందులో భాగంగా రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటి వరకు 13.20 లక్షల రైస్ కార్డులను కొత్తవారికి అందజేశామని సివిల్ సప్లయిస్ కమీషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్యతో కలిసి సివిల్ సప్లయిస్ కమీషనర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రైస్ కార్డులు అందించే కార్యక్రమాన్ని జూన్ నెలలో ప్రారంభించినప్పుడు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మిగతా ఏ కార్డులకు లేని విధంగా కేవలం రైస్ కార్డులను మాత్రమే సచివాలయంలో ప్రింట్ చేసి ఇచ్చే సదుపాయం ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరికి కార్డు లేకపోయినా వారు సంబంధిత సచివాలయంలోకి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే పది రోజుల్లోపు ఖచ్చితంగా రైస్ కార్డు ఇచ్చే బాధ్యత సివిల్ సప్లై శాఖ తీసుకుందన్నారు. వచ్చే డిసెంబర్ లేదా జనవరి నుంచి ఎప్పుడైతే నాణ్యమైన బియ్యం ఇంటింటికీ సరఫరా చేసే కార్యక్రమం అమలు చేస్తామో అప్పుడు వంద శాతం రైస్ కార్డు అమలు అవుతుందన్నారు. ఇంటింటికి రైస్ కార్డు ద్వారా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగా 9260 మినీ ట్రక్స్ వాహనాలను కొనుగోలు చేస్తున్నామన్నారు. మినీ ట్రక్స్ వాహనాలతో ఎఫ్ పి షాపు నుంచి ఇంటి వద్దకు నాణ్యమైన బియ్యాన్ని తీసుకెళ్లడానికి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ కింద వాహనాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యువతకు ఒక అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని, అందుకనుగుణంగా వాహనాల కొనుగోలు చేసి డిసెంబరు లేదా జనవరి నెలలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి గడప వద్దకు నాణ్యమైన బియ్యం తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతకుముందు పీడీఎస్ బియ్యం అంటే నాసిరకం బియ్యం అనే అపోహలు ప్రజలలో ఉన్నాయని, అపోహలు తొలగిస్తూ చక్కని బియ్యం, తినగలిగిన నాణ్యమైన బియ్యాన్ని ప్రతి ఇంటి వద్దకే చేర్చాలనే కార్యక్రమం రూపొందించామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, అక్కడి నుంచి కొన్ని అనుభవాల ద్వారా వచ్చే రెండు నెలల్లో రాష్ట్రం మొత్తం మీద గడపగడపకు బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏ ఆసరా లేని వారికి సింగిల్ కార్డు తీసుకోవచ్చని, ట్రాన్స్ జెండర్స్ కు కూడా కార్డులను ఇస్తామన్నారు. రైస్ కార్డు అనేది మిగతా ఎటువంటి స్కీమ్ లకు సంబంధం లేనిదని, కేవలం బియ్యం, పప్పులు కావాలనుకునేవారు, బియ్యం తినే వారు మాత్రమే తీసుకోవాలన్నారు. సచివాలయం పరిధిలో దరఖాస్తు తీసుకోవడం, మంజూరు చేయడం, అక్కడే కార్డు ప్రింట్ చేయడం జరుగుతోందన్నారు. సామాన్య ప్రజలు బియ్యం కార్డు కోసం ఎక్కడ ఇబ్బంది పడకూడదని అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, అన్ని సచివాలయాల పరిధిలో ఎక్కువ స్థాయిలో సర్వీసులు బియ్యం కార్డు కోసమే వచ్చాయన్నారు. అవసరమైన వారు దరఖాస్తు చేసుకుంటే బియ్యంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
రాష్ట్రంలో వర్షాలు బాగా పడ్డాయని, ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అందుకు అనుగుణంగా వరి పండించే ప్రాంతాలైన కోస్తా జిల్లాలు, హెచ్ఎల్సీ పరిధిలోని ప్రాంతంలో రైతులు ఎవరూ కనీస మద్దతు ధర కంటే తక్కువగా పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా ధర పడిపోతుంటే అక్కడ వరి కొనుగోలు కేంద్రం పెట్టి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు రైస్ కార్డులు, ధాన్యం సేకరణ, బియ్యం క్వాలిటీ, బియ్యం పంపిణీ చేసే విధానం ప్రతి విషయంలో కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి మార్పులు తీసుకొస్తున్నామన్నారు. సివిల్ సప్లై పంపిణీలో బాగా అమలవుతున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర ప్రభుత్వం చెప్పేలా పరిస్థితి తీసుకువచ్చామన్నారు. ఇంటింటికీ బియ్యం తీసుకెళ్లి సరఫరా చేయడంలో దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిచేలా చేయాలన్నది మా సంకల్పమని, ఆ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకప్పుడు బియ్యంలో నూకలు ఉండేవని, అన్నం ముద్దవుతుండేదని, ప్రజల ఆహార అలవాట్లను గమనించి మంచి నాణ్యమైన బియ్యాన్ని తీసుకురావడం జరుగుతోందన్నారు. ఇందుకు సంబంధించి బియ్యం నిల్వ చేస్తున్న అనంతపురం పరిధిలోని జంగాలపల్లి గోడౌన్ ను చెక్ చేసి వచ్చామని సివిల్ సప్లయిస్ కమీషనర్ తెలిపారు.
అశోక్ నగర్ వార్డు సచివాలయం తనిఖీ
నగరంలోని అశోక్ నగర్ వార్డు సచివాలయాన్ని రాష్ట్ర సివిల్ సప్లయిస్ కమీషనర్ కోన శశిధర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయం ద్వారా సేవలను ఎలా అందిస్తున్నారు, ఇంతవరకు ఎన్ని సర్వీసుల కు సేవలు అందించారు, కొత్త రైస్ కార్డులను ఎలా అందిస్తున్నారు అనే విషయాలను సచివాలయ సిబ్బంది తో ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని సివిల్ సప్లయిస్ కమీషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ , వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, మునిసిపల్ కమిషనర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ద్రోణం విశాఖ వన్‌టౌన్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఈయన మ్రుతి పట్ల సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దిగ్బ్రాంది వ్యక్తం చేశారు. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్సా సత్యన్నారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, అరకు, పాడేరు ఎమ్మెల్యే చెట్టి పాల్గున కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎంపీ గొడ్డేటి మాధవి విశాఖనగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, కెకెరాజు, మళ్లవిజయప్రసాద్ లు తమ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం సుందరకాండలోని 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు ఉన్న 174 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితుల అఖండ పారాయణం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిభావాన్ని పంచింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ ఐదో విడత సుందరకాండ అఖండ పారాయణం ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగింది. ముందుగా టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ శ్రీరామ సంకీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. చివరగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ రచించిన ఆంజనేయ స్తుతిని ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు డా.వందన బృందం రమ్యంగా ఆలపించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులు శ్లోకపారాయణం చేశారు. ఈ సందర్భంగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ రామనామం ఎక్కడ పలికితే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని, హనుమంతుని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు నెరవేరుతాయని చెప్పారు. ధర్మ ప్రచారంలో భాగంగా మానవులకు సిరిసంపదలు కలిగేందుకు విరాట పర్వం, ధార్మిక చైతన్యం అలవడేందుకు గీతా పారాయణం చేపడుతున్నట్టు వివరించారు.
ఇప్పటివరకు నాలుగు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8 నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాల అఖండ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ ఏ.వి.ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటి ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
అక్రమకట్టడమని తెలుసు, ఆక్రమించుకున్నదనీ ఆ విశాఖ ఆక్టోపస్ కు తెలుసు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ముఖ్యమంత్రిపై రంకెలేస్తున్నాడు. మేయ ర్ గా పనిచేసినవాడే పార్కులను ఆక్రమించాడు. ఏపీ రాజకీయాలపై పచ్చమీడియాలో జాతకాలు చెప్తాడు. మేయర్ గా చేసినవాడికి మున్సిపల్ రూల్స్ తెలియవా? అంటూ రాజ్య సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ సబ్బంహరిపై ఫేస్ బుక్ వేదికగా మండి పడ్డారు. ప్రజా ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తే కబ్జాలకు పాల్పడుతుంటే ప్రజలకు ఏం చెబుదామని అంటూ చురకలు అంటించారు. శనివారం తెల్లవారుజామున జీవిఎంసి అధికారులు మాజీ మేయర్ టిడిపి నేత సబ్బం హరి ఆక్రమించిన 12 అడుగుల స్థలంలో నిర్మించిన మరుగుదొడ్లను జేసీబీలతో కూలగొట్టించారు. ఆ సమయంలో సబ్బం చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ జవాబు ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటానికి చట్టం తనపని తాను చేసుకుంటూ పోయిన విషయంలో జరిగిన రొంపి రాజకీయవర్గాల్లో గట్టి చర్చనే లేవదీసింది. అయితే దీనికి సహేతుకమైన కారణంగా దురాక్రమణ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుండటంతో ఎవరూ సబ్బానికి చేదోడుగా రాకపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యుపీఎస్సీ సివిల్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. పరీక్షలు జరిగే విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, విజయ వాడ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల సమక్షంలో పరీక్షా పత్రాలు కేంద్రాలకు చేరుకున్నాయి. అభ్యర్ధులంతా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సారి పరీక్షలకు అభ్యర్ధుల సౌకర్యార్ధాం తిరుపతిలో హాల్ టిక్కెట్టు వారీగా ఏ కేంద్రంలో ఎవరు పరీక్షాలు రాస్తున్నారోననే సమాచారం కూడా ఇవ్వడంలో అభ్యర్ధులకు ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి మార్గం సులవు అయ్యింది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్ధులను లోనికి అనుమతించలేదు. కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో పెట్టుకొని ప్రతీ అభ్యర్ధిని పరీక్షా కేంద్రాల వద్దే శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించిన తరువాత మాత్రమే లోనికి అనుమతించారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్యసిబ్బందితోపాటు మందులు, మంచినీరు అన్నింటిని ఏర్పాటు చేశారు.
దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక మైన వ్యవస్థగా వైఎస్సార్సీపి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇంతటి మహా వ్యవస్థను పూర్తిస్థాయి ద్వారా ప్రజలకు సేవలు చేయకుండా, ప్రభుత్వానికి మచ్చతెచ్చేవిధంగా కొందరు అధికార కోవర్టులు మోకాలడ్డు వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. గ్రామసచివాలయ వ్యవస్థలో ప్రధానమైన కార్యదర్శిలకు అధికారాల బదాలియిపుకోసం ఇచ్చిన జీఓఎంఎస్ నెంబరు 149ని అమలు చేయకుండా ఏడాదిగా కాలం వెల్లదీస్తున్నారు. ఈ విషయమై గ్రేడ్-5 కార్యదర్శిలు తమ విధులు, అధికారాలు తమకు అప్పగిస్తే తప్పా ప్రజలకు తాము ఎలా సేవలు చేయగలమని జిల్లా పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా, ఫిర్యాదులు చేసినా అవి బుట్టదాఖలు అయ్యాయి. నేటికీ రాష్ట్రవ్యాప్తంగా 7వేల మంది గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓఎంఎస్ నెంబరు 149 నిబంధనల మేరకు ఒక్క అధికారం కూడా దక్కలేదు. కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ డ్రైనేజీల వద్ద బ్లీచింగ్ చల్లించాలన్నా సీనియర్ కార్యదర్శి దగ్గర అడుక్కునే పరిస్థితులున్నాయని, కాగితానికి, కలానికి కూడా కార్యదర్శిల చుట్టూ దరఖాస్తు దారుడు తిరిగినట్టు తిరగాల్సి వస్తుందని కొత్త కార్యదర్శిలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క తూర్పుగోదావరి లాంటి జిలాల్లో డిపిఓలు తక్షణమే గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు తక్షణమే బదలాయించాలని ఎంపీడీఓలను, ఈఓపీఆర్డీలను ఆదేశించినా కింది స్థాయిలో అధికారులు మాత్రం వాటిని అసలు అవి ఉత్తర్వులే కాదన్నట్టుగా పక్కన పెట్టడం విశేషం. ఈలెక్కన జిల్లా పంచాయతీ అధికారుల మాటలను, లిఖిత పూర్వక ఉత్తర్వులను, ఆదేశాలను కిందిస్థాయిలో అధికారులు ఏ స్థాయిలో పట్టించుకుంటున్నారో ఈ జీఓనెంబరు 149 విషయంలో తేటతెల్లం అవుతుంది. ఎంపీడీఓలకు, ఈఓపీఆర్డీలకు, సీనియర్ కార్యదర్శిలకు తమ తప్పేమీ లేదన్నట్టుగా జారీచేసిన అర్జెంట్ మెమో కాపీని జిల్లా కలెక్టర్, గ్రామసచివాలయశాఖ జాయింట్ కలెక్టర్లకు పంపినా వారు కూడా దీని విషయంలో ఒక్క ఎంపీడీఓని కూడా ప్రశ్నించలేదు. ఏదైనా ఒక్క ఉత్తర్వు వస్తే ఆఘమేఘాలపై హడావిడీ చేసే అధికారులు గ్రామసచివాలయ వ్యవస్థలో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, విధులు బదలాయించే విషయంలో ఎందుకు కావాలని ఊరుకుంటున్నారో అధికారులే సమాధానం చెప్పాల్సి వుందనే వాదన బలంగా వినిపిస్తుంది. గ్రామస్థాయిలో గ్రేడ్-5 కార్యదర్శిలకు పూర్తిస్థాయిల విధులు, అధికారాలు ఇచ్చేసే వారు మరింతగా పనిచేయడానికి వీలుపడుతుందని, అలా చేస్తే ప్రభుత్వానికి మరింత పేరు వచ్చేస్తుందనే అక్కసుతోనే కోవర్టులుగా ఉన్న అధికారులు ఈ జీఓ జీఓఎంఎస్ నెంబరు 149ని అమలు చేయడం లేదనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుంది. పైగా 2020 జూలై నెలలో జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన మెమోపై నేటికీ ఒక్క ఎంపీడీఓగానీ, ఈఓపీఆర్డీ కానీ, సీనియర్ కార్యదర్శి గానీ తూర్పుగోదావరి,విజయనగరం, విశాఖపట్నం, క్రిష్ణా, శ్రీకాకుళం, చిత్తూరు లాంటి జిల్లాలో వీటిని అమలు చేయలేదు. ఒక్క ఈ జిల్లాల్లోనే కాదు... ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే వుంది.. విశేషం ఏంటంటే కొందరు సీనియర్ కార్యదర్శిలు బెదిరింపులు దిగడంతో చిత్తూరు జిల్లాలో కొందరు కార్యదర్శిలు తమ ఉద్యోగాలు వదులుకోవడానికి సిద్ధపడిన సంఘటనలు కూడా తెరపైకి వచ్చాయి..భారీ ఎత్తున ప్రచారం జరగడ.. ప్రభుత్వం జారీ చేసిన జీఓని అమలు చేసే విషయంలో కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామసచివాలయాల్లో కార్యదర్శిలు వేగంగా నిర్ణయం తీసుకోవడానికి గానీ, ప్రజలు పూర్తస్థాయిలో సేవలు అందించడానికి గానీ వీలుపడటం లేదు. దీనిని బట్టి చూస్తుంటే కావాలనే ఈ జీఓని అధికారులు తొక్కిపెట్టి గ్రామసచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు రానీయకుండా చేయాలనుకుంటున్నారని వేరేగా చెప్పాల్సి పనిలేదు. ఈ జీఓఎంఎస్ నెంబరు 149 అమలు కావాలనంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకేసారి సమాయత్తం అయితే తప్పా డీపీఓ, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు దీనిని అమలు చేసేటట్టు కనిపించడం లేదు. మరి జిల్లా కలెక్టర్లు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి..!
రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు, వేదపండితులు వేదాశీర్వచనం అంద జేశారు. గిరిజాశంకర్ కు పరిపాలన విభాగంలో చాలా మంచి అనుభవం వుంది. అంతేకాకుండా ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకోవ డంలో అందెవేసిన చేయి. గ్రామసచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో ప్రజలకు పూర్తిస్థాయిలో మంచి సేవలు అందిస్తుందంటే ఈయన తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం ఆమోదించడమే. అలాంటి ఉత్తమ అధికారి టిటిడిలోకి రావడంతో ఇక్కడ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని శ్రీవారికి మరింతగా ప్రజలను చేరువ చేస్తారనే నమ్మకం చాలా మందిలో కలుగుతోంది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, జెఇఓ పి.బసంత్ కుమార్, జెఇఓ(విద్య, ఆరోగ్యం) ఎస్.భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, డెప్యూటీ ఈవో జనరల్ సుధారాణి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మున్సిపాలిటీలు, పురపాలకల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు తీసుకువచ్చామని, ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్‌లోనే జరుగు తాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఆమీడియాతో, సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణపు ప్లాన్ సులభంగా పొందే లా సరళీకరణ చేశామని, నిర్మాణరంగానికి ఊతమిచ్చేలా నిబంధనల్లో సడలింపులు చేశామన్నారు. మరింత వేగంగా భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీ జరుగు తాయన్న మంత్రి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు 400 శాతం టీడీఆర్ వర్తింపు ఉంటుందన్నారు. ఇకపై ఆన్‌లైన్‌లోనే టీడీఆర్‌ల జారీ ఉంటుందని, పరిశ్రమల అంతర్గత రహదారులు, ఖాళీ స్థలాల నిబంధనల్లో సడలింపులు ఉంటాయన్నారు. అనధికార ప్లాట్లు, భవనాలు, లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ కానున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి దరఖాస్తు దారుడు నుంచి ఫీడ్ బ్యాక్, పకడ్బందీగా తనీఖీలు ఉంటాయన్నారు. బిల్డింగ్ రూల్స్, లే అవుట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.
గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం(గ్రామసచివాలయ వ్యవస్థ)లో ప్రజలకు సేవలు చేయడానికి ఎన్నో ఆశలతో విధుల్లోకి చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు రిక్తహస్తం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై నేటికి సరిగ్గా ఏడాది పూర్తవుతున్నా గ్రేడ్-5 కార్యదర్శిల అధికార బదలాయింపు ఉత్తర్వులు జీఓఎంఎస్ నెంబరు 149 అమలు కాకపోవడాన్ని బట్టి అధికారుల చిత్తశుద్ధి గ్రామసచివాలయాల విషయంలో ఏస్థాయిలో ఉందో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సివుంది. రాష్ట్రంలో గ్రామసచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా జిల్లా అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో గత ఆరో రోజులుగా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ పరిశోధనాత్మక కధనాలు అందిస్తూ వస్తోంది. అంతేకాదు వాటిని అన్ని జిల్లా కలెక్టర్లు, డిపీఓలు చూస్తూనే.. 149 జీఓని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు కూడా.. సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి మనస పుత్రిక, భారత దేశంలో ఒక ఆదర్శ గ్రామసచివాలయ వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు.. ప్రజలకు నేరుగా సేవలు అందించే బ్రుహత్తర వ్యవస్థకు.. కొందరు జిల్లా అధికారులు ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని...కావాలనే గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వాల్సిన జిఓ 149ని అమలు చేయకుండా తొక్కిపెడుతున్నట్టు ఏడాది పూర్తిచేసుకున్న గ్రామసచివాలయ వ్యవస్థ వెక్కిరిస్తోంది. అంతేకాదు కావాలనే జిల్లా అధికారులు ఈజీఓని తొక్కిపెట్టారని, ఒక వర్గం రాజకీయ పార్టీకి సపోర్టుగానే ఈ పనికి కొందరు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అనుకునే పూనుకున్నారని నిఘావర్గాలు గుర్తించాయని తెలుస్తుంది. పూర్తిస్థాయిలో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇస్తే..ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, తద్వారా దేశానికే ఈ వ్యవస్థ మార్గదర్శి అయిపోతుందనే అక్కసుతో అధికార బదలాయింపు చేయకుండా నూతన కార్యదర్శిల విధులేంటో చెప్పకుండానే అధికారులు వారితో పనిచేయిస్తుండటం వారిని ఎంతగానో బాధకు గురిచేస్తుంది. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా వస్తున్న కథనాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న నిఘావర్గాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7వేల మంది గ్రేడ్-5 కార్యదర్శిలు రెండు మూడు సచివాలయాలు ఉన్నచోట.. తమ అధికారాల బదాలాయింపు జీఓ 149 అమలు చేయాలని ఎంతమంది డిపీఓ(జిల్లా పంచాయతీ అధికారులు)లకు లేఖలు రాశారు, వాటిపై ఎంతమంది డిపిఓలు ఎంపీడీఓలకి, ఈఓపీఆర్డీలకు, సీనియర్ కార్యదర్శిలకు అర్జెంట్ మెమోలు జారీచేశారో తదితర వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ మెమోకాపీలను రాష్ట్రంలో ఎంత మంది జిల్లా కలెక్టర్లకు నకలుగా పంపారు, ఈ విషయంలో గ్రేడ్-5 కార్యదర్శిలు పడుతున్న ఇబ్బందులపైనా పూర్తిస్థాయి సమాచారం కేంద్ర నిఘా వర్గాలు రికార్డు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. జిల్లా అధికారులు ఈ జీఓను అమలు చేయకపోవడంపై గ్రామస్థాయిలో ఎలాంటి అధికారాలు లేని గ్రేడ్-5 కార్యదర్శిల ఉద్యోగాలు ఏవిధంగా చేస్తున్నారనే విషయంపై సమగ్ర సమాచారం సేకరించినట్టు బోగట్టా. రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు అయితే జిల్లా అధికారులకు అనుకూలంగా నివేదికలు ఇస్తాయనే మంచిపేరుంది. అదే కేంద్ర నిఘా వర్గాలైతే ఉన్నది ఉన్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తాయనే నమ్మకం కూడా ఉంది. కొందరు జిల్లా పంచాయతీ అధికారులు అర్జెంటు మెమోలు ఇచ్చి, ఆ జీఓని అమలు చేయకుండా ఎందుకు చేతులు దులిపేసుకున్నారనే కోణంలో కేంద్ర నిఘా వర్గాలు గ్రౌండ్ లెవల్ లో వాస్తవ విషయాలను సేకరిస్తున్నాయని తెలుస్తుంది. కంచ పెట్టి అన్నం తిను అన్నట్టుగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం...ఆ ఉద్యోగంతో ప్రజలకు నేరుగా సేవలు అందించడానికి అధికారాలు మాత్రం ఇవ్వలేదు. అలా అధికారాలు ఖచ్చితంగ ఇవ్వాలని జీఓఎంఎస్ నెంబరు 149ని విడుదల చేసినా, దానిని అమలు చేయడంలో జిల్లా పంచాయతీ అధికారులు చూపిస్తున్న తాత్సారంతోనే కొత్తగా విధుల్లోకి చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలు గమగోడును ఫిర్యాదు రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారు. అలా ఫిర్యాదు చేసినందుకు నేటికీ చాలా మంది జూనియర్ కార్యదర్శిలు సీనియర్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు...ఉద్యోగంలోకి చేరి ఏడాది కాలేదు...ఇంకా సర్వీసు రెగ్యులర్ కాకుండా మీకు అధికారాలు కావాల్సి వచ్చాయా అంటూ ప్రశ్నించడం కూడా చర్చనీయాంశం అవుతుంది. అసలు జిల్లా అధికారులు జీఓఎంఎస్ నెంబరు 149ని ఎందుకు రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రధాన కారణం ఏంటనే విషయాన్ని...గ్రామ సచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-7 లో చూడవచ్చు..!
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై అక్టోబరు 4వ తేదీ ఆదివారం ఐదో విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు ఉన్న 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. కాగా, ఇప్పటివరకు నాలుగు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాల అఖండ పారాయణం జరిగింది.
జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల వాటరుసుముతో కట్టించుకున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కార్డులను ప్రభుత్వమే సొంత ఖర్చులతో రెవిన్యువల్ చేసిందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని గురువారం ప్రకటించారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో 8, 456 జర్నలిస్టుల ప్రయోజనం చేకూరనుంది. కరోనా సమయంలో జర్నలిస్టులు హెల్త్ కార్డు ప్రీమియం చెల్లించే పనిలేకుండానే ప్రభుత్వం వీటిని రెవిన్యువల్ చేసిందని, జర్నలిస్టుల కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేస్తుందని ప్రకటించారు. తద్వారా వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం రెన్యూవల్ 31.3.2021వరకు చేస్తూ నేడు ఉత్తర్వులు వచ్చాయి. కరోనా సమయంలో ఏఒక్క జర్నలిస్టు కుటుంబం ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకూడదని, జర్నలిస్టులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశ్యంలో ఈ సౌకర్యంకల్పించామని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో నిబద్ధతో ఉన్నారని కూడా ఆళ్ల వివరించారు. రెవిన్యువల్ చేసిన కార్డులతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఉచితంగా జర్నలిస్టులు వైద్య సేవలు పొందవచ్చనన్నారు. ఈ అవకాశాన్ని అత్యవసర సమయంలో జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆళ్ల సూచించారు.
గ్రామసచివాలయాల్లో సీనియర్ కార్యదర్శిలు చేతి వాటం చూపిస్తూ.. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టిస్తున్నా ఇటు జిల్లా కలెక్టర్లుగానీ, జిల్లా పంచాయతీ అధికారులు గానీ.. కొత్తగా వచ్చిన గ్రామసచివాలయశాఖ జెసిలుగానీ జీఓఎంఎస్ నెంబరు 149 ను అమలు చేయడానికి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఒక్క జిల్లా కలెక్టర్ సైతం ఈ జీఓను అమలు చేసే విషయంలో స్పందించకపోవడం విశేషం. మరో వైపు రాష్ట్రప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలను బదలాయించే ఈ జీఓని అమలు చేయకుండానే గ్రామస్థాయిలో ప్రజలకు విశేషంగా సేవలు అందించాలని జిల్లా అధికారులు తమ పర్యటనల్లో గ్రామసచివాలయ సిబ్బందిని హెచ్చరించడం హాస్యాస్పదంగా మారుతోంది. అసలు అధికారమే లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 7వేల మంది గ్రేడ్-5 గ్రామకార్యదర్శిలు ఏం పనిచేస్తారో అధికారులే చెప్పాల్సి వుంది. గ్రామసచివాలయానికి వెళ్లే ప్రతీ అధికారి, అక్కడ సిబ్బందికి క్లాస్ పీకడం తప్పితే ప్రజలకు నేరుగా సేవలు చేయడానికి అడ్డంగా వున్న 149 జిఓ లక్ష్మణ రేఖను చెరిపే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో విధుల్లోకి చేరిన గ్రామ కార్యదర్శిలు తమ అధికారాలు తమకి ఇస్తే తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లా పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీనిపై డిపీఓలు ఎంపీడీఓలకి,ఈఓపీఆర్డీలకి, గ్రామ సచివాలయాలకి మెమోలు జారీచేశారు తక్షణమే జీఓ నెంబరు 149 ప్రకారం ఏ గ్రామ సచివాలయ పరిధిలోని ప్రాంతాన్ని ఆ సచివాలయానికి అప్పగించి, విధులు, అధికారాలు బదలాయింపు చేయాలని. కానీ వచ్చిన మోమె సచివాలయంలో కార్యదర్శి టేబుల్ మీదనే ఉన్నా...అధికారాలు ఇవ్వడానికి మాత్రం రాష్ట్రంలో ఒక్క సీనియర్ కార్యదర్శి కూడా ముందుకి రాలేదు. దీంతో ఇపుడు కొత్తగా వార్డు, గ్రామ సచివాలయ శాఖలను అప్పగించిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డ, బొత్స సత్యన్నారాయణలను కలవడానికి గ్రేడ్-5 కార్యదర్శిలు సిద్ధమవుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ గ్రామసచివాలయాల్లో తాము ఎలాంటి అధికారాలు లేకుండా ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓలకు, తమ సీనియర్ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలకు మెమోలు జారీచేసినా ఏ ఒక్కరూ అమలు చేయకపోతే ఇక ఆవిషయాన్ని మంత్రులు, వారూ వినక పోతే నేరుగా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కి మాత్రమే చెప్పాలని నూతన కార్యదర్శిలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై 11 నెలలు గడుస్తున్నా.. నేటి వరకూ తమ విధులు, తమ అధికారాలేంటో తమకి తెలియకపోతే మిగిలిన 10శాఖల సిబ్బందిని ఎలా కలుపుకుంటూ ఉద్యోగాలు చేయాలని గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సీనియర్లు ప్రశ్నిస్తే మీ ఉద్యోగాలు ఇంకా రెగ్యులర్ కాలేదు...ఆలోగానే ఇంటికి వెళ్లాలని ఉందా.. అంటూ బెదిరిస్తున్నారని కూడా కొందరు కార్యదర్శిలు మీడియా ముందు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓనే అమలు చేయాలని అడుగుతున్నాం తప్పితే కొత్తగా ఏమీ చేయమనడం లేదని కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై ఈఎన్ఎస్ నెట్వర్క్ రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ లెవర్ రియాలిటీని ప్రత్యేక కధనాలతో అన్ని జిల్లాల డీపీఓ ద్రుష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో కొందరు డీపీఓలు స్పందించి తాము కూడా అర్జెంట్ సర్కులర్ ద్వారా లేఖలు రాసినా ఎవరూ స్పందించకపోవడం తమకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. అదే సమయంలో అన్ని చోట్ల సచివాలయ భవనాలు నిర్మాణం జరుగుతున్న వేళ ఈ విషయాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి అధికారాలు బదలయింపులు జరగకపోతే సీనియర్లు చేసే తప్పులకు కొత్త కార్యదర్శిలపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని కూడా చెప్పడం విశేషం. దానికి అనుగుణంగా రాష్ట్రంలో చాలా గ్రామసచివాలయాల్లో ఈఓపీఆర్డీలుగా వున్నవారు ప్రభుత్వ నిధులు వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించిన కేసులపై డివిజనల్ పంచాయతీ అధికారులు విచారణలు కూడా చేస్తున్నారు. విశాఖజిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షల రూపాయలు తమ సొంత అవసరాలకు ఈఓపీఆర్డీలు, కార్యదర్శిలు నిధులు దుర్వినియోగం చేసినట్టు రుజువైంది కూడా. ఈ తరుణంలో జీఓఎంఎస్ నెంబరు 149 అమలు విషయం కీలకంగా మారింది...ఈ జీఓని అమలు చేస్తే కొందరు చేతివాటం వున్న సీనియర్లు చేసిన తప్పులన్నీ ఏ రకంగా బయటపడతాయో గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-6లో చూడవచ్చు..
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన ప్రభుత్వం కరోనా వైరస్ ఉద్రుతి ద్రుష్ట్యా.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. పాఠశాలలను ప్రారంభించిన వెంటనే అదేరోజు జగనన్న విద్యాకానుక పథకాన్ని కూడా ప్రారంభించాలని వైఎస్ జగన్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు. ఏపీలో స్కూల్స్‌ను ప్రారంభించాలని జగన్ సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను మరింతగా మెరుగు పరిచేందుకు నాడు నేడు అనే కార్యక్రమం మొదలుపెట్టిన ప్రభుత్వం.. ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిందింది. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలనే సమూలంగా మార్చివేసింది.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా భవనాలను, ప్రాంగణాలను ప్రభుత్వ పాఠశాలలు మార్చేసింది. విద్యార్ధులు కూర్చోవడానికి సైతం మంచి ఫర్నిచరును కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.