రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, లాక్ డౌన్ కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 24 గంటల్లో 1,15,275 కరోనా పరీక్షలు నిర్వహించగా, 18,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాని, 71 మరణాలు సంభవించాయని తెలిపారు. ఆదివారం కంటే అయిదు వేల కేసులు తక్కువగా నమోదయ్యాని తెలిపారు. 599 ఆసుపత్రుల్లో కరోనా సేవలు అందిస్తున్నామన్నారు. కర్నూల్ మినహా మిగిలిన జిల్లాల్లో ఐసీయూ బెడ్ లు తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయన్నారు. కర్నూలు లో 324 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 11,665 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 82 కొవిడ్ కేర్ సెంటర్లలో 68 చోట్ల కరోనా టెస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు.
అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటు
ఈరోజు 447 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించామన్నారు. రాష్ట్రంలో పెరిగిన కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కొనుగోలు కమిటీ తొలి సమావేశం నేడు(సోమవారం) జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆక్సిజన్ స్టోరేజ్, రవాణాకు అవసరమైన క్రయోజనిక్ ట్యాంకర్లు, ఇతర పరికరాల కొనుగోలుపై చర్చించామన్నారు. టీచింగ్ సహా అన్ని ప్రభుత్వాఆసుపత్రుల్లోనూ పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, పైప్ లైన్ల కొనుగోలుకు మూడు నాలుగు రోజుల్లో టెండర్లు ఫైనల్ చేస్తామన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించనున్నామనేది రెండ్రోజుల్లో తెలియజేస్తామన్నారు. 104 కాల్ సెంటర్ కు 13,839 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో 5,093 కాల్స్ వివిధ రకాల సమాచారం, 3,413 కాల్స్ కరోనా టెస్టులు, 2,370 ఆసుపత్రుల్లో అడ్మిషన్ల వివరాలు, 1,768 ఫోన్ కాల్స్ కరోనా టెస్టు రిజల్ట్ కోసం వచ్చాయన్నారు.
లాక్ డౌన్ కాదు... కర్ఫ్యూ మాత్రమే...
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో...రాష్ట్రంలో రెండు రకాల కట్టడి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. వ్యాపారాలకు, సాధారణ జీవనానికి ఎటువంటి ఆటంకాలు ఉండబోవన్నారు. అయితే, ఎక్కడైనా అయిదుగురు కంటే ఎక్కువగా ఉండకుండా ఉండేలా 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. నిత్యావసరాలు, ఇతర సరకుల కొనుగోలు సమయంలో భౌతిక దూరం పాటించాలన్నారు. గుంపుగా ఎక్కడా అయిదుగురికి మించి ఉండకూడదన్నారు. 144 సెక్షన్ నిబంధన ఒక్కటే ఉదయం వేళల్లో అమలు చేస్తామన్నారు. ఇక రెండోది...మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ పరిస్థితి ఉంటుందన్నారు. ఇది లాక్ డౌన్ మాత్రం కాదన్నారు. మెడికల్ సహా అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందన్నారు. మీడియా, ఉద్యోగులకు ఎటువంటి ఆటంకం ఉండబోదన్నారు. పాస్ లు, ప్రయాణికుల రాకపోకలపై విధి విధానాలను రేపు తెలియజేస్తామన్నారు. ఈ నిబంధనలు బుధవారం ఉదయం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. కర్ఫ్యూతో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయొచ్చునన్నారు. కర్ఫ్యూ కు సంబంధించి పూర్తి వివరాలను మంగళవారం అందజేస్తామన్నారు. కరోనా కట్టడి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండ్రోజులకొకసారి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. నేడు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు. కొన్ని జిల్లాలో బెడ్లు నిండిపోయాయని, మరికొన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ఏపీలో కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి లేదు...
ఏపీలో కొత్త స్ట్రెయిన్ లేదని, ప్రస్తుతం ఉన్న స్ట్రెయిన్ గతేడాది జులై నుంచే రాష్ట్రంలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే సీసీఎంబీ అధికారులతో తమ అధికారులు మాట్లాడారన్నారు. కొత్త స్ట్రెయిన్ పై సీసీఎంబీ అధికారికంగా ప్రకటించలేదన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తగదన్నారు. కొత్త స్ట్రెయిన్ వల్ల కేసులు పెరుగుతున్నాయనడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్ గైడ్ లైన్స్ ను పాటించడం ద్వారా కరోనా వైరస్ ను అడ్డుకట్ట వేయొచ్చునన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా కొవిడ్ గైడ్ లైన్స్ ను పాటించాలని ఆయన కోరారు.
టీకా పంపిణీలో 45 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత...
45 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి అవసరమైన వ్యాక్సిన్లను ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఇలా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను కూడా 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి కాకుండా 45 ఏళ్ల పైబడిన వారికే వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వృద్ధులకు వేసిన తరవాతే యువతకు వ్యాక్సిన్ వేయడం సరైన పద్ధతన్నారు. అందరికీ వ్యాక్సిన్ వేయడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్నారు.