ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు, సేవలకు ఉన్నతాధికారులే గాలితీసే కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్రస్థాయిలో సచివాలయ శాఖకు సంబంధించిన ఏరకమైన ఉత్తర్వులు జారీ చేసినా అవి గ్రామ, వార్డు సచివాలయాలకు సక్రమంగా చేరడం లేదు. వాస్తవానికి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఏ నోటీసులు, ఉత్తర్వులు, సూచనలు జారిచేసినా జిల్లా అధికారులు వాటిని అమలు అమలు చేయడానికి ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు చేర్చాల్సి వుంది. అన్ని శాఖలు ఒకేచోట ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలి. కానీ రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఈ విధానం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేటికీ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రోటో కాల్ ప్రకారం అధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు ఎవరో కూడా తెలియని పరిస్థి నెలకొంది.. రాష్ట్ర అధికారుల ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు, వారి నుంచి జిల్లా శాఖల అధికారులకు, అక్కడి నుంచి మండల పరిషత్ లకు, ఆఖరిగా అక్కడ నుంచి గ్రామసచివాలయాలకు చేరాల్సివుంది. కేవలం ఈఫైలింగ్ విధానం లేకపోవడం వలన రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలు జిల్లా కార్యాలయాలకు వచ్చినా వాటిని పూర్తిస్థాయిలో ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు చేర్చడంలో జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విఫలం అవుతున్నారు. దీనితో ప్రభుత్వ ఉత్తర్వులు ఎప్పుడు, ఏవిధంగా ఏఏ అంశాలమీద వస్తున్నాయో సచివాలయ సిబ్బందికి తెలియడం లేదు. ఫలితంగా వచ్చిన విషయం తెలియక వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది పనిచేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు జిల్లా పంచాయతీ అధికారి అధీనంలోనూ, వీఆర్వోలు, సర్వేయర్ లు జాయింట్ కలెక్టర్లు అధీనంలోనూ, ఆరోగ్యసహాయకులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధీనంలోనూ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అధ్వర్యంలోనూ, గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోనూ, అగ్రికల్చర్ అసిస్టెంట్లు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోనూ, హార్టికల్చర్ అసిస్టెంట్లు జాయింట్ డైరెక్టర్ హార్టికల్చర్ ఆధ్వర్యంలోనూ, సెరీ కల్చర్ అసిస్టెంట్లు అసిస్టెండ్ డైరెక్టర్ సెరీకల్చర్ ఆధ్వర్యంలోనూ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎస్ఈ పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలోనూ పనిచేస్తారు. వీరందరికీ అంటే సచివాలయశాఖకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్ ను ప్రభుత్వం నియమించడంతో వారి ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయాల సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఉత్తర్వులైనా ఆయా జిల్లా అధికారులు ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు పంపాల్సి వుంది. కానీ ఆ విధంగా అధికారులు సక్రమంగా పంపడం లేదు. ఏ విషయం తెలుసుకోవాలన్నా మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఇతర జిల్లా సచివాలయ సిబ్బంది సహకారంతోనూ, వారు నిర్వహించే టెలీగ్రామ్ గ్రూపుల ద్వారానూ తెలుసుకోవాల్సి వస్తుంది. కొన్ని పనులకు, అనుమతులకు సచివాలయ ఉద్యోగులు తాము చేసుకునే ఏ దరఖాస్తైనా నేరుగా జిల్లా కార్యాలయాలకు స్వయంగా తీసుకెళ్లి ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని శాఖల జిల్లా కార్యాలయాల సిబ్బంది సచివాలయ సిబ్బందిని దారుణంగా జిల్లా కార్యాలయాలకు పదే పదే తిప్పిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు నేరుగా మండల అధికారుల ద్వారా సచివాలయాకు చేరవేస్తే ఆవిధంగా ప్రోటోకాల్ ప్రకారం సచివాలయ సిబ్బంది పనిచేయడానికి ఆస్కారం వున్నా జిల్లా కలెక్టర్లు, సచివాలయ జాయింట్ కలెక్టర్లు ఎందుకనో ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో ఆ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ మండల కార్యాలయాల్లోనే జిల్లా కార్యాలయాల నుంచి వచ్చే ప్రభుత్వ ఉత్తర్వులు నిలిచిపోతున్నాయి. అవి సచివాలయాలకు చేరకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బందిలో కాస్త గందగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈఫైలింగ్ విధానం లేకపోవడం, జిల్లా శాఖల అధికారుల నుంచి ఎంపీడీఓలకు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ముఖ్యమైన ఉత్తర్వులు, జీఓ, నోటీసులు, సూచనలు వచ్చినపుడు జిల్లా కార్యాలయాల అధికారులు మండల కార్యాలయాలకు పంపకపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లోకి చేరిన సిబ్బందికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏవిధంగా ఏ జిల్లా అధికారిని ఏ ఉత్తర్వులతో సంప్రదించాలో తెలియడం లేదు. అలాగని ఎంపీడీఓ కార్యాలయాలను సంప్రదించినా అక్కడ కూడా సరైన సమాచారం, జీఓలు, లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవడంతో వారు కూడా సచివాలయ సిబ్బందికి వివరించడానికి వీలులేకుండా పోతుంది. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన ఉత్తర్వులు ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకూ పూర్తిస్థాయిలో చేర్చగలిగితే గ్రామస్థాయిలో సిబ్బంది ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడంతోపాటు, సిబ్బంది చేయాల్సి, చేపట్టాల్సిన పనులు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సచివాలయ నూతన సిబ్బంది ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ సమస్యలు, డిపార్టమెంటల్ పరీక్షలు, శాఖపరమైన సమస్యలు, సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, ప్రసూతి సెలవులు, లాస్ ఆఫ్ పే సెలవులు, బయో మెట్రిక్ సీఎఫ్ఎంఎస్ ఐటీ సమస్యలు, వాటికి దరఖాస్తులు, తిరిగి విధుల్లో చేరిన తరువాత వచ్చే జీతభత్యాలు, ఇతర అంశాలకు మార్గం సుగమం అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్లు, జిల్లాల్లో గ్రామ సచివాలయ శాఖ జాయింట్ కలెక్టర్లు ఈ విషయంలో పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాల్సి వుంది. లేదంటే ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సచివాలయ వ్యవస్థ సేవలు ప్రజలకు అందే పరిస్థితి లేదు. సిబ్బంది సమస్యలు పరిష్కారం అయ్యే మార్గం అసలే కనిపించడం లేదు..!