ఆర్.టి.సి బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచాలని ఆర్.టి.సి వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ఆర్.పి.ఠాగూర్ అన్నారు. శుక్ర వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఠాగూర్ శ్రీకాకుళం ఆర్.టి.సి డిపో, కాంప్లెక్సు ప్రాంతాలను తనిఖీ చేసారు. అనంతరం శ్రీకాకుళం ఒకటవ నంబరు డిపోలో ఆర్.టి.సి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసగించారు. ఆర్.టి.సి ఉద్యోగులది గురుతరమైన బాధ్యత అన్నారు. ఆక్యుపెన్సీ రేట్ పెంచాలని, మైలేజ్ పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి రోజు 8 లక్షల లీటర్ల డీజిల్ ను ఆర్.టి.సి వినియోగిస్తుందని ఆయన అన్నారు. మైలేజిని పెంచడం ద్వారా వినియోగం తగ్గించాలని తద్వారా ఆదాయం పెరిగే దిశగా అడుగులు వేయగలమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టుటకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రజల అవసరం మేరకు సేవలు మెరుగుపరచుటకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల పనితీరు (పెర్ఫార్మెన్సు) మెరుగుపడాలని, ప్రజా రవాణా శాఖ స్వయం ప్రతిపత్తి దిశగా సాగలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల పాత బకాయిలను చెల్లిస్తామని, పారితోషికాలను పునరుద్ధరిస్తామని ఎం.డి తెలిపారు. శ్రీకాకుళంలో డిపోలు, కాంప్లెక్సు విశాలంగా ఉన్నాయని చక్కని వాతావరణం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్ గా ప్రధమ స్ధానం సాధించిన ఎస్.వి.రమణకు రూ.5 వందల పారితోషికాన్ని అందించారు. ఇతర డిపోలలో పనిచేస్తు ఉత్తమ ఫలితాలు అందించిన వారికి పారితోషికాలను సంబంధిత డిపో మేనేజర్లకు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.సి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.రవి కుమార్, రీజనల్ మేనేజర్ ఏ.అప్పల రాజు, డివిజనల్ మేనేజర్ జి.వరలక్ష్మి, డిపోమేనేజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్టు ఉత్తర్వుల పరిధికి లోబడి అభ్యంతరాలు లేని ఆక్రమణల ధృవపత్రాలు జారీకి వెంటనే చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ చెప్పారు. స్ధానిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో సిసియల్ఏ, రెవెన్యూ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, కృష్ణా జిల్లా కలెక్టరుతో గురువారం విజయవాడ పరిధిలోని ఆక్రమణలో ఉన్న స్ధలాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రభుత్వ, ఇరిగేషన్, తదితర ప్రభుత్వ శాఖల అధీనంలో ఉన్నస్ధలాల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వ నిబంధనలు మేరకు క్రమబద్ధీకరించుకోవచ్చన్నారు. ఇప్పటికే అటువంటి భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. భూముల క్రమబద్దీకరణ విషయమై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోనికి తీసుకుని ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలెక్టరు ఏయండి. ఇంతియాజ్‌కు సూచించారు. విజయవాడ నగరంలోని కృష్ణలంక లెఫ్ట్ కెనాల్, విజయవాడ వెస్ట్, సెంట్రల్, నార్త్, ఈస్ట్ మండలాల పరిధిలోని ఆక్రమణల్లో ఉన్న స్ధలాల విషయాలను సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈసమావేశంలో సిసియల్ఏ స్పెషల్ సియస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూ సెక్రటరి వి.ఉషారాణి, ఇరిగేషన్ కార్యదర్శి జె. శ్యామలరావు, కృష్ణాజిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, కృష్ణాజిల్లా జలవనరుల శాఖాధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. అలాంటి మంచి పనినిన మేమే అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని తమకు లేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్‌నిర్మిస్తామన్న కెసిఆర్ 9.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సభకు వివరించారు. ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో మా పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని వివరించారు. పెట్రోల్ ధరలను అదుపు చేయడం మా చేతుల్లో లేదన్న కేసీఆర్ ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్నివసతులు కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.