ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరువుని ఎన్నికల కమిషన్ దగ్గర మరోసారి తీయాలనే కంకణం కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయకుండా, అటు ఎలక్షన్ కమిషన్ పాసులు జర్నలిస్టులకు రాకుండా చేయగలిగింది. వాస్తవానికి అక్రిడిటేషన్ కలిగివున్న జర్నలిస్టులకు మాత్రమే ఎన్నికల కమిషన్ జిల్లా రిటర్నింగ్ అధికారుల ద్వారా ఎలక్షన్ పాసులు పోలీంగ్ బూత్ లు, ఇతర ఎన్నికల ప్రక్రియను కవర్ చేయడానికి జారీ చేస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు డిసెంబరు 2020తోనే ముగిసి పోయింది. దీనితో కొత్త అక్రిడిటేషన్లు ఇస్తే తప్పా వారికి ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయడానికి వీలులేదు. అలాగని సమాచారశాఖ ప్రస్తుతం వున్న అక్రిడిటేషన్లను సైతం కొన్ని నెలలు రెవిన్యువల్ కూడా చేయలేదు. ఈ క్రమంలో కాలం చెల్లిన అక్రిడిటేషన్లకు ఎలక్షన్ కమిషన్ పాసులు ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డొస్తాయి. దీనితో ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని సమాచారశాఖ చేసిన ఈ పనికి మరోసారి లిఖిత పూర్వకంగా ప్రశ్రించే అవకావాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చైర్మన్ నిమ్మగడ్డ ద్రుష్టికి, అక్రడిటేషన్లు ఉంటే తప్పా ఎలక్షన్ కమిషన్ పాసులు వచ్చే పరిస్థితి రాదనే విషయాన్ని కొందరు సీనియర్ జర్నలిస్టులు తీసుకెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి దేశరాజధాని న్యూఢిల్లీలోని పీఐబీలో కూడా లేని నిబంధనలు పెట్టి, ఆ విధంగా మీడియా సంస్థలు అనుబంధ పత్రాలు, జిఎస్టీ, క్లిప్పింగులు, ఇతర ఆర్ఎన్ఐ అనుబంధ పత్రాలు ఆన్ లైన్ అప్ లోడ్ చేస్తే తప్పా అక్రిడిటేషన్లు ఇచ్చేది లేదంటూ బీష్మించుకొని కూర్చుంది సమాచారశాఖ. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలు జరపాలని, దానికి సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. ఈ తరుణంలో జర్నలిస్టులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి వెళ్లాలంటే ప్రభుత్వ గుర్తింపు(అక్రిడిటేషన్ కార్డు) అడ్డంకిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం సమాచార శాఖ ద్వారా ఇచ్చిన అరకొర సమాచారాన్ని మాత్రమే మీడియా సంస్థలు, జర్నలిస్టులు వార్తల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి వస్తుంది. అదీకూడా సమాచార అధికారులు తమకు నచ్చిన మీడియా సంస్థలకే ఆ సమాచారం కూడా పంపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ఇతర సంస్థల్లోకి వెళ్లడానికి ఖచ్చితంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఉండాలి. కానీ అక్రిడిటేషన్ల గడువు గత ఏడాది డిసెంబరుతో ముగిసినా, కనీసం అక్రిడిటేషన్లు గడువు పెంచకుండా సమాచారశాఖ కొత్త అక్రిడిటేషన్లు ఇచ్చేస్తామంటూ...నిబంధనల పేరుతో ఇప్పటి వరకూ కాలయాపన చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కొన్ని జర్నలిస్టు సంఘాలు ఈ విషయాన్ని కోర్టులో కేసువేయడంతో హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. అవే ఇపుడు కొనసాగుతున్నాయి. ఆ దెబ్బతో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు రాకుండాపోయాయి. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర,జిల్లా, మండల స్థాయి జర్నలిస్టులు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారిక కధనాలు, వార్తలు రాయడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. కాలం చెల్లిన అక్రిడిటేషన్లతో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులను జర్నలిస్టులు కలవలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ చర్యలపై గుర్రుగా వున్న ఎలక్షన్ కమిషన్, ఇపుడు కావాలనే పంచాయతీ ఎన్నికల్లో జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు రాకుండా చేయడానికే సమాచారశాఖ ఈ విధంగా వ్యవహరించదనే విషయాన్ని ఒక వర్గం మీడియా విషయాన్ని కమిషన్ ద్రుష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలా కాకుండా కాలం చెల్లిన అక్రిడిటేషన్ల జాబితా ఆధారంగా ఎన్నికల కమిషన్ పాసులు జారీచేస్తే అదీ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలలోకి తొక్కినట్టే అవుతుంది. అలా చేసినా ఎన్నికల కమిషన్ ను రాష్ట్రప్రభుత్వంలోని సమాచారశాఖ తప్పు పట్టినట్టుగానే కమిషన్ చూస్తుంది. ఇదంతా చూస్తుంటే ఎన్నికల సమయంలో జర్నలిస్టులు యాక్టివ్ గా పనిచేయడానికి వీలు లేకుండా ఉండేందుకే అక్రిడిటేషన్లు ఇవ్వకుండా, సమాచారశాఖ నిబంధనలు పెట్టిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు పచ్చగడ్డివేస్తే బగ్గుమని మండిపోతున్న సమయంలో సమాచారశాఖ అక్రిడిటేషన్ల విషయంలో కావాలని, నిబంధనలు అమలు చేయాలని చేసిన తాత్సారం ప్రభుత్వం పరువుని మరోసారి ఎన్నికల సంఘం ముందు తీసేలా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఎంత జనరంజక పాలన ప్రజలకు అందించాలని చూస్తున్నా ఏదోఒక ప్రభుత్వ శాఖ వలన ప్రభుత్వానికి తలనొప్పులు వస్తూనే వున్నాయి. ఈ మధ్య కాలంలో అత్యధికంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తలనొప్పి అధికమైంది. మరోసారి ఎన్నికల కమిషన్ జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలంటే అక్రిడిటేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. కాదు కూడదు జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు ఇవ్వకూడదని సమాచారశాఖ నిర్ణయించుకుంటే ఎన్నికల సంఘాలన్ని, సంఘం జర్నలిస్టులకు ఇచ్చే ఎలక్షన్ కమిషన్ పాసులను అపహాస్యం చేసినట్టే అవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వ మీడియా సలహాదారులు, సమాచారశాఖ అధికారులు జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే ఎలక్షన్ కమిషన్ పాసుల విషయం ఎన్నికల సంఘం, జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంతో కలిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాచారశాఖ పుణ్యమాని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి కమిషన్ నుంచి మాటపడే పరిస్థితులు తప్పేటట్టు లేవు. జర్నలిస్టులకు నిబంధనల పేరుతో అక్రిడిటేషన్లు ఇవ్వకుండా చేయాలని సమాచారశాఖ చూస్తుంటే.. అధికారుల చర్యలు, జీఓలతో ప్రభుత్వానికి చెరుపుకోలేని మచ్చలు ఏర్పడుతున్నాయి. అందులోనూ ఎలక్షన్ కమిషన్ విషయంలో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం కేంద్రం నిశితంగా గమనిస్తుంది. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ పాసులు అక్రిడిటేషన్ జర్నలిస్టులకు రాకుండా చేయడానికే ఉద్దేశ్యపూర్వం చేసిందని తేలితే దేశస్థాయిలో ప్రభుత్వ పరువు సమాచారశాఖ కావాలనే తీసినట్టు అవుతుంది. ఈ తరుణంలో సమాచారశాఖ అధికారులు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తారా? పాతవాటినే రెవిన్యువల్ చేస్తారా? అక్రిడిటేషన్లు లేకుండానే ఎలక్షన్ కమిషన్ పాసులు కాలం చెల్లిన అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇస్తారా? జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి మరోసారి తలవొంపులు తీసుకు వస్తారనే అనేది వేచి చూడాలి..!
మీడియా రంగంలో జర్నలిస్టు కావాలనుకునే ప్రతీ ఒక్కరూ మీడియా కోసం పూర్తిగా ముందు అవగాహన పెంచుకున్న తరువాత మాత్రమే ఆయా విభాగాల్లో కెరీర్ బాగా వున్న విభాగాన్ని ఎంచుకోవాల్సి వుంటుంది. సాధారణంగా చాలా మందికి ఉన్న అవగాహన ఏంటంటే ఒక జర్నలిస్టు ఏం వార్త రాస్తే అది అలాగే ప్రింటింగ్ అయి పేపర్ రూపంలో మరుసటిరోజు వచ్చేస్తుందని అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఒక వార్త జర్నలిస్టు రాసి పత్రిక, టివి, న్యూస్ ఏజెన్సీ, మొబైల్ యాప్ లకు పంపిన తరువాత ఎన్ని విభాగాలు దాటితే వార్తగా వస్తుందనే విషయం తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. ముందు ఒక పత్రికలో ఎన్ని విభాగాలు ప్రస్తుత కాలంలో పనిచేస్తున్నాయో అనే విషయం తెలుసుకుందాం. అపుడు ఒక జర్నలిస్టు రాసి పంపిన వార్త ఒక న్యూస్ ఫార్మాట్ లోకి రావడానికి ఎంత సమయం పడుతుంది, న్యూస్ లా ఎలా మారుతుంది అనే విషయాలు తెలుస్తాయి. పత్రికా కార్యాలయంలో ప్రధాన భూమిక పోషించేది డెస్క్..ఇక్కడ చాలా విభాగాలు జర్నలిస్టు రాసిన వార్తను, ఫోటోగ్రాఫర్ పంపిన ఫోటోని వార్తకు అనుకి అనుగుణంగా తయారు చేయడానికి అన్ని విభాగాలు కష్టపడాల్సి వుంటుంది. ముఖ్యంగా డెస్క్ లో ప్రధాన ఉద్యోగి ఎడిషన్ ఇన్చార్జి, తరువాత డెస్క్ ఇన్చార్జి, ఆ తరువాత సబ్ ఎడిటర్, ఫోటో ఎడిటర్, ఫ్రూఫ్ రీడర్, పేజి డిజైనర్, ఫోటోషాప్ ఎడిటర్ ఇలా 7 విభాగాలు పనిచేస్తాయి. అదే టివి ఛానల్ అయితే న్యూస్ కోర్డినేటర్, ఇన్ పుట్ ఎడిటర్, వీడియో ఎటిడర్, సబ్ ఎడిటర్, గ్రాఫిక్ డిజైనర్, ఔట్ పుట్ ఎడిటర్, న్యూస్ రీడర్, పీసీఆర్ అనే 8 విభాగాలు ఉంటాయి. ఇక న్యూస్ ఏజెన్సీకి వస్తే ఎడిటర్, సబ్ ఎడిటర్, ఫోటో ఎడిటర్, వీడియో ఎడిటర్, మెసెంజర్, 5విభాగాలు ఉంటాయి. స్థూలంగా మూడు రకాల మీడియా సంస్థల్లో పనిచేసే విభాగాలు ఇవి. ఈ విభాగాల్లో పనిచేయడానికి ప్రాధమిక విద్య మాత్రం జర్నలిజం చదివి ఉండాలి. ఆ తరువాత విభాగాన్ని బట్టి కాస్త సాంకేతిక విద్య, శిక్షణ కూడా మనం శిక్షణ పొందాల్సి వుంటుంది. అలా శిక్షణ పొందినపుడు మాత్రమే మనం మంచి విభాగాన్ని ఎంచుకొని మీడియాలో మంచి కెరీర్ ను ప్రారంభించడానికి అవకాశం వుంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో తెలుగు మీడియా కంటే జాతీయ మీడియాలో జర్నలిస్టులకు మంచి గుర్తింపు వస్తోందిదనేది నిపుణుల మాట. అలాని స్థానిక, రాష్ట్రీయ మీడియాలో అవకాశాలు లేక అనేం కాదు. ఇక్కడ కూడా ఉంటాయి, కాకపోతే జాతీయ స్థాయి మీడియాలో మరిన్ని అవకాశాలు మన నైపుణ్యాన్ని బట్టి మనం అందిపుచ్చుకోవడానికి అవకాశాలు అధికంగా వుంటాయి. జాతీయ స్థాయిలో జర్నలిస్టు కావాలనుకున్నా కూడా మీడియాకోసం తెలుసుకోవడం తోపాటు, దానికి అనుబంధ చదువు, శిక్షణ, అవగాహన ఉంటే తప్పా ఏమీ చేయలేని పరిస్థితి అంటే డిగ్రీలో జర్నలిజం లేదా, పీజీలో జర్నలిజం చేయాలి. అదీకాదనుకుంటే మనం ముందుగా ఇంగ్లీషు, హిందీ, తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదిస్తే ఆయా మీడియా సంస్థలు నిర్వహించే జర్నలిజం స్కూలు ద్వారా ప్రవేశ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించి ఆపై మంచి ఉద్యోగాలు పొందడానికి కూడా అవకాశం వుంటుంది. అలా జర్నలిజం స్కూలుకి ఎంపికైన వారికి పైన పేర్కొన్న అన్నివిభాగాల్లో శిక్షణ ఇస్తాయి ఆయా జర్నలిజం పాఠశాలలు. ఒక పూర్తిస్థాయి జర్నలిస్టుగా మారాలంటే మాత్రం ముందు డిగ్రీ చదువుకున్న తరువాత మూడు భాషలపై ప్రావీణ్యం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఆపై జర్నలిజంలో శిక్షణ తీసుకుంటే మంచి జర్నలిస్టుగా ఉద్యోగం దొరుకుతుంది. తరువాత మీ మనం నేర్చుకున్న అంశాలకు మెరుగుపెట్టుకోవడం ద్వారా మంచి జర్నలిస్టుగా గుర్తింపు పొందే అవకాశాలుంటాయి..జర్నలింలో శిక్షణ పొందడానికి ఇబ్బంది పడేవారికి, ఉచితంగా శిక్షణ కల్పించాలని, అవగాహన కల్పించాలని, ప్రాధమిక శిక్షణ ఇవ్వడం ద్వారా ఔత్సాహిక జర్నలిస్టులకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా తమవంతుగా ఈ సర్వీసు అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఆశక్తి వున్నవారం సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం.. అసలు మీడియాలోని ఏఏ విభాగాల్లో పనిచేయాలంటే ఏం నేర్చుకోవాలి, ఏ విభాగంలో ఉద్యోగం బాగుంటుంది, దానికోసం డిగ్రీ తరువాత ఏం చేయాలి, ఏం శిక్షణ తీసుకోవాలని అనే అంశాలు రేపటి పాఠంలో చర్చిద్దాం..!
జర్నలిస్టు కావాలనుకునేవారు నేరుగా జర్నలిస్టు అయిపోదామని అనుకోవడానికి ముందు అసలు మీడియా ఎలా వుంటుంది? ..ఎన్ని విభాలుగా వుంటుంది?.. ఎన్నిరకాలుగా వుంటుంది?.. ఏ రకం మీడియాలో అయితే ఉపాది లభిస్తుంది?..ఏ మీడియాలో అయితే మంచి గుర్తింపు వస్తుంది?..ఎలా పనిచేస్తే మంచి జర్నలిస్టుగా రాణించవచ్చు?.. అనే అంశాలను ముందు తెలుసుకుంటే మీడియా రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వేదికను ఏర్పాటు చేసుకోవడానికి వీలుపడుంది. దానితో పాటు మీడియాలోని ఏ విభాగంలో జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెడితే బాగుంటుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి వుంటుంది. జర్నలిస్టు అయిపోతే ఏ విభాగంలోనైనా పనిచేసేయొచ్చు కదా అనుకోవడానికి లేదు. ఒక్కో విభాగంలో జర్నలిజం ఒక్కోలా వుంటుంది. దానికోసం మనం జర్నలిజంలో ఉన్న వివిధ విభాగాల్లో మనకి అనుకూలంగా వున్న విభాగాన్ని ఎంచుకోవడం ద్వారా మన భవిష్యత్తు కూడా ఉజ్వలంగా వుంటుందని గమనించాలి. లేదంటే మధ్యలోనే మనం మీడియాని వదిలిపెట్టే పరిస్థితులు కూడా రావొచ్చనే ఇబ్బందులు కూడా ఎదురు పడొచ్చు. ఏదోలా బతికేద్దామంటే మీడియా రంగంలోకి రావడం దండగనే చెప్పాలి. దమ్ము, దైర్యం, సమయస్పూర్తి, ఒక మంచి విజన్, ఇన్విస్టెగేషన్, సర్వీస్, జస్టిస్, జాబ్ సాటిస్ఫేక్షన్ ఉండేలా అయితేనే మీడియా రంగంలోకి అడుగు పెట్టాలి. లేదంటే సాధారణ జర్నలిస్టులకూ మీకూ పెద్దగా తేడా ఏమీ ఉండదు. దానికోసం ముందుగానే మీడియా కోసం తెలుసుకోవాల్సి వుంటుంది. అసలు మీడియాకోసం మీకు ఎవరు చెబుతారు...ప్రస్తుతం జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారందరికీ మీడియాకోసం తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. మరేం తెలుసునని చాలా మంది జర్నలిస్టులు మాకు తెలియంది ఏముంటుందని అంటారని మీకు సందేహం రావచ్చు. చాలా మంది జర్నలిస్టులకు తెలిసింది కేవలం వార్తలు రాయడం, రాసిన వార్త ఏవిధంగా వచ్చింది, కార్యాలయంలో దానికి ఎలా తుది మెరుగులు దిద్దుతారు, పత్రిక అయితే ప్రింట్ అయి, టివి అయితే టెలీకాస్ట్ అయి, న్యూస్ యాప్ అయితే పబ్లిష్ అయి, వీడియో అయితే ప్లే అయినంత వరకూ మాత్రమే వారికి తెలుస్తుంది. దాని వెనుక ఎన్ని విభాగాలు పనిచేస్తే ఒక న్యూస్ ఫార్మాట్ లో మీరు రాసిన న్యూస్ బయటకొస్తుందో చెప్పమంటే చాలామంది తెల్లమొహం వేస్తారు. మరి ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే... మనం జర్నలిజం కోసం ప్రాధమిక శిక్షణ తీసుకున్న తరువాత ఆయా మీడియా సంస్థల్లోని విభాగాలు పనిచేసే తీరుపై ద్రుష్టి సారిస్తే తప్పా మనకి మీడియాలోని విభాగాల కోసం తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ మీడియా తప్పితే స్థానిక మీడియాలో ఉపాది, ఉద్యోగాలు గాల్లో దీపం లానే ఉన్నాయి. దానికోసం జర్నలిజం కెరీర్ ను ఎంచుకునేవారు పెద్ద మీడియా సంస్థల్లో ఉపాది లభించేలా శిక్షణ పొందాల్సి వుంటుంది. అలా పెద్ద మీడియా సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే ఏంచేయాలనేది ముందు ముందు పాఠాల్లో నేర్చుకుందాం. రేపటి పాఠంలో మీడియా ఎన్నిరకాలుగా వుంటుంది, ఎన్ని విభాగాలు ఉంటాయి? ఆయా విభాగాల్లో పనిచేయాలంటే ఏం నేర్చుకోవాలి, విద్యార్హతలేంటి, ఉద్యోగాలు ఎలా వుంటాయి, జీతాలు ఎలా ఉంటాయి, కెరీర్ ఏ విభాగంలో అయితే బాగుంటుంది, ఏ విభాగంలో ఉద్యోగమైతే ఎన్ని ఇబ్బందులొచ్చినా భరోసా ఉంటుంది, తదితర అంశాలు చర్చిద్దాం..!
నేల నలు చెరగుల్లో(News-North, East, West, South) ఏం జరుగుతోందో తెలుసుకొని ఏరి,కోరి, కూర్చి, ఒక అంశాన్ని విషయంగా పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో రాయడాన్నే వార్త అంటారు. అసలు మనకి వచ్చినట్టు ఏదో ఒక విషయాన్ని ఏదోలా రాసేస్తే అదివార్త..అదేనండి మీ పరిభాషలో న్యూస్ అయిపోతుందా..అంటే కాదనే చెప్పాలి. ఒక వార్తను మనం రాసేటపుడు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా అనే అంశాలను ప్రామాణికంగా తీసుకొని రాసినపుడు మాత్రమే అది నిర్ధిష్టమైన న్యూస్ ఫార్మాట్ న్యూస్(వార్త) అవుతుంది. ప్రధాన మీడియా సంస్థలు, పేరున్న న్యూస్ ఏజెన్సీలు అన్నీ న్యూస్ ఫార్మాట్ లో మాత్రమే వార్తలను ప్రజలకు అందిస్తాయి. అలా న్యూస్ ఫార్మాట్ లో ఒక వార్త రాయడానికి పైన పేర్కొన్న ఐదు అంశాలపై అవగాహన మాత్రమే కాదు వాటిని ఎలా ఉపయోగించాలనే విషయంపై పట్టు కూడా
రావాలి. అలా పట్టు రావాలంటే ప్రతినిత్యం కాస్త గట్టిగానే శ్రమించాల్సి వుంటుంది. చాలా మంది అనుకోవచ్చు. డిగ్రీలో జర్నలిజం చేసినా, పీజీలో జర్నలిజం చేసినా జర్నలిస్టు అయిపోవచ్చు గదండీ అంటారు చాలా మంది నాలాంటి తెలివైనోళ్లు..? అదెలా వుంటుందంటే వైట్ అండ్ వైట్ డ్రస్సు వేసిన ప్రతీవాడు రాజకీయ నాయకుడు ఎలా కాలేడో.. డిగ్రీ, పీజీల్లో జర్నలిజం చేసినంత మాత్రన జర్నలిస్టు అనుకోవడానికి లేదు. మనం ఎంత చదువు చదువుకున్నా ఎపుడైతే ఒక విషయాన్ని పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో చక్కగా న్యూస్ ఫార్మాట్ లో రాయగలిగామో అపుడే మనం నిజమైన జర్నలిస్టు అయినట్టు లెక్క. డిగ్రీ తరువాత మనం పీజి ఒక సబ్జెక్టులో మాస్టర్స్ ఎలా చేస్తామో..అలాగే జర్నలిస్టుగా అయిన తరువాత కూడా చాలా మంది తమ ప్రావీణ్యాన్ని వివిధ విభాగాల్లో పెంచుకోవడానికి, పనిచేయడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం కాలంలో ఒక్కో దిన పత్రిక ఒక్కో న్యూస్ ఫార్మాట్ ను వినియోగిస్తుంది. ఒక పత్రిక విషయాన్ని మాత్రమే పాఠకుడికి తెలియజేస్తుంది. మరో పత్రిక విషయంతో పాటు ఒక రెండు అంశాలను కూడా తెలియజేయాలని అనుకుంటుంది. మరో పత్రిక ఆ రెండు విషయాలతోపాటు జరగబోయే క్రమాన్ని కూడా పాఠకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. వివిధ అంశాలపై మనకున్న పట్టును బట్టీ మీడియా సంస్థలు ఆయా విభాగాలు, ప్రభుత్వ శాఖలు మనకి జర్నలిస్టుగా పనిచేయడానికి అవకాశాలు కేటాయిస్తాయి అదీ మీరు పూర్తిస్థాయి జర్నలిస్టుగా అయిన తరువాత.. అదేంటండీ న్యూస్ అని మొదలు పెట్టి అపుడే శిక్షణ మొత్తం అయిపోయి జర్నలిస్టుగా బాధ్యతలు చేపట్టినట్టుగా ముగించేస్తున్నారే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. జర్నలిస్టు అనే వ్యక్తి ఎపుడైతే నిత్య విద్యార్ధిగా ఉన్నానని భావిస్తాడో అపుడే మంచి అంశాలను శోధించి వాటిని పాఠకుడికి వార్తలు, వార్తా కధనాలుగా, ప్రత్యేక కధనాలుగా అందించగలుగుతాడు. అలా జర్నలిస్టుగా మారాలంటే దానికి ముందు చాలా శ్రమపడి అన్ని విషయాలను నేర్చుకుంటే తప్పా జర్నలిస్టుగా మారడం కష్టం. మాకు ఇవన్నీ వద్దుకానీ మేము డైరెక్టుగా ఏదైనా పత్రికలోనో, టీవీలోనో, న్యూస్ ఏజెన్సీలోనో చేరిపోతే జర్నలిస్టు అనరా? అంటే అంటారని చెబుతాను. కానీ పూర్తిగా శిక్షణ తీసుకుని రాసే జర్నలిస్టుకి, ఏమీ రాకుండా పెన్నూ పేపరు పట్టుకొని ఫీల్డులోకి వెళ్లి, ఆ తరువాత సేకరించిన సమాచారాన్ని ఆఫీసుకో కూర్చొని ఒక సింగిల్ కాలమ్ వార్త రాయడానికి పడే కష్టం, పట్టే చెమటలు, చిరిగే పేపర్లు, అంతా రాసిన తరువాత స్వీకరించే పేపరు ఆఫీసువాళ్లు తిట్టే తిట్ల దండకం ఏ స్థాయిలో వుంటుందో ఏమీ తెలియకుండా నేనూ జర్నలిస్టుననే తెగఫీలైపోయిన వారిని అడిగితే చెబుతారు...కాదు కాదు ఎపుడైనా అలాంటి వారు పత్రికా కార్యాలయంలో వార్తలు రాస్తున్న సమయంలో వెళ్లిచేస్తే తెలుస్తుంది. కానీ ఎవరికీ వెళ్లి చూసే అవకాశం వుండదు. కానీ ఇది వాస్తవం. తాము సీనియర్ జర్నలిస్టులమని చెప్పుకునే వారు సైతం నేటికీ న్యూస్ ఫార్మాట్ లో వార్తలు రాయలేరంటే అతిశయోక్తి కాదు..ఇలాంటి ఇబ్బందులు, అవమానాలు పడకుండా ఉండాలనుకునే వారు మాత్రమే జర్నలిజంలో శిక్షణ తీసుకున్న తరువాత మాత్రమే జర్నలిస్టుగా మారతూ ఉంటారు. ఒకప్పుడు చాలా మంది జర్నలిజం స్కూళ్లు, కాలేజీల్లో వేలకు వేలు ఖర్చు చేసి జర్నలిజంలో శిక్షణ తీసుకునేవారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా మంచి జర్నలిస్టుగా మారదామనుకునే వారిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ జర్నలిజంలో ప్రాధమిక శిక్షణ మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేక కధనాల ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో భాగంగానే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. అంతేకాదు విశాఖలో ఎవరైనా ఔత్సాహికులు జర్నలిజం పట్ల ఆశక్తి వుంటే నేరుగా ఫీల్డులోనే వారికి లైవ్ లో శిక్షణ కూడా ఇవ్వాలని సంకల్పించాం. ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా మంచి జర్నలిస్టులను సమాజానికి అందించాలనే లక్ష్యంతో పైసా ఖర్చులేకుండా జర్నలిజంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. కాకపోతే మీరు ఈ జర్నలిజం పాఠాలను నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుగూల్ ప్లే స్టోర్ నుంచి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. రేపటి పాఠంలో మళ్లీ కలుద్దాం..
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రతిష్ట దిగజార్చేందుకు సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన కుట్ర పై సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యక్తి గతంగా తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు భక్తుల్లో ఆందోళన చెలరేగేలా జరిగిన ఈ చర్యపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆయన టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి లో ఇటీవల జరిగిన ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాల మీద జరిగిన దాడుల గురించి విలేకరులు శ్రీ సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ప్రజలందరినీ భగవంతుడు ( శ్రీ వేంకటేశ్వర స్వామి) జీసస్, అల్లా కాపాడుతున్నారనీ, వారి మీదే దాడులు చేసే వారు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని సుబ్బారెడ్డి చెప్పారు.ఇది ముఖ్యమంత్రి మీద కొన్ని పార్టీలు చేస్తున్న కుట్ర అని చెప్పారు. కొంత మంది వ్యక్తులు ఈ వీడియోను కట్ చేసి ఆయన మాటల్లోని ఉద్దేశం మార్చేలా వీడియో అతికించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే శ్రీ సుబ్బారెడ్డి స్పందించి టీటీడీ అధికారులతో మాట్లాడారు. ఈ దుష్ప్రచారం, కుట్రపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.