ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సవాంగ్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనకు శని వారం విచ్చేసిన డిజిపి స్ధానిక సంస్ధల ఎన్నికలపై పోలీసు అధికారులతో సమీక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కీలకమన్నారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క అర్హమైన వ్యక్తికి ఓటు వేసుకునే సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటును వేసుకునే పరిస్ధితి ప్రస్తుతం తీసుకువచ్చామని అన్నారు. గత మూడు విడతలలో ప్రశాంతంగా పోలింగు జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడు విడతలలోనూ 80 శాతంకు పైగా పోలింగు నమోదు అయ్యిందని అన్నారు. జిల్లా యంత్రాగం, పోలీసు వ్యవస్ధ మంచి సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని కొనియాడారు. పోలీసులు మానవతా ధృక్పదంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు చేయూతను పోలీసు వ్యవస్ధ అందిస్తుందని చెప్పారు. కోవిడ్ సమయంలో పోలీసులు అందించిన సేవలు ఎనలేనివని డిజిపి అన్నారు. కోవిడ్ అనే భయంకరమైన మహమ్మారి ఏమి చేస్తుందో, ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్ధితుల్లో పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్డుపైకి వచ్చి ప్రజలను కాపాడటం బాధ్యతగా తీసుకుందని అన్నారు. ప్రజల కోసం పోలీసు వ్యవస్ధ నిలబడిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం పోలీసులు ప్రశంసనీయమైన మంచి సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిఐజి) ఎల్.కె.వి.రంగారావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, ఎఎస్పిలు పి.సోమశేఖర్, కె.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయిందని కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తే నష్టాన్ని పూడ్చుకునే వెసులుబాటు వస్తుందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కోరారు. శనివారంప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో జరిగిన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, పారిశ్రామికంగా వేగంగా ఎదగడం వంటివి ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’తోనే సాధ్యమవుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్పత్తి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సేవల డెలివరీ, ఆరోగ్యం, పౌష్టికాహారం అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఏపీలో కనీసం టయర్-1 నగరం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు-నేడు క్రింద కొత్తగా ఆసుపత్రులను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ‘భారత్ నెట్ ప్రాజెక్ట్ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కోసం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం చేసినట్లు వివరించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చించారు.
భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మహర్ధశ ప్రారంభమైంది. సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వంలో ఈ శాఖకు కమిషనరేట్ ప్రారంభించిన ప్రభుత్వం వీరికి సర్వీస్ రూల్స్ వర్తింపజేయనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన వీరందరూ అపుడే 16 నెలలు విధులు నిర్వహించారు. ప్రభుత్వం తొలుత ప్రకటించినట్టుగా వీరికి రెండేళ్లు ప్రొహిబిషన్ పూర్తయిన తరువాత వీరి సర్వీసును రెగ్యులర్ చేయనుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటుతోపాటు పాటు ఇపుడు గ్రామపంచాయతీలు కూడా పూర్తిస్థాయిలో ప్రారంభమవడంతో వీరికి సర్వీస్ రూల్స్ వర్తింపచేయడానికి ముందుగా వీరందరికీ సర్వీస్ రిజస్టర్(ఎస్ఆర్)ను ఈ మార్చి 30 నాటికల్లా ప్రారంభించాలని అధికారులను ఈ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. సర్వీస్ రూల్స్ సచివాలయ ఉద్యోగులకు అమలు అయితే వీరంతా రెగ్యులర్ ఉద్యోగులకిందకే వస్తారు. దీనితో చాలా మంది చేస్తున్న అసత్య ప్రచారాలు..ఈ ఉద్యోగాలు ఎంతో కాలం ఉండవు..ప్రభుత్వం వీటిని వచ్చే ఏడాది నుంచి తొలగించేస్తుదనే ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది. ఎస్.ఆర్ స్టార్ట్ అయితే రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగానే కారుణ్యనియామకాలు, హెల్త్ కార్డు, శాఖాపరమైన పరీక్షలు, శిక్షణ, శెలవులు, డ్రెస్ కోడ్ ఇలా అన్ని రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా వీరికి కూడా వర్తింపజేస్తారు. రెండేళ్లు ప్రొహిబిషన్ పూర్తి అయ్యేలోపు వీరిందరికీ కమిషనరేట్ ద్వారా అమలు చేసే అన్ని పనులూ పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతేకాకుండా ఇంకా భర్తీకాకుండా మిగిలిపోయిన ఉద్యోగాలను కూడా జిల్లాల వారీగా సేకరించాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ శాఖకు కమిషనర్ గా ప్రభుత్వం నియమించిన డా.నారాయణ భరత్ గుప్తా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. దేశంలోనే చక్కటి వ్యవస్థగా రూపొందిన గ్రామసచివాలయ వ్యవస్థను ఇప్పటికే కేరళ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చూస్తుండగా...రాష్ట్రంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే వ్యవస్థను అమలు చేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో ఈ శాఖను దేశానికే వన్నె తెచ్చే విధంగా తయారు చేయాలని భావిస్తున్న సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని అధికారులు అమలు చేసి ఆచరణ లో పెడుతున్నారు. అనతి కాలంలో ఈ ఉద్యోగాలపై ఉద్యోగులు, ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం తెచ్చామని ప్రకటించుకుంటున్న ప్రభుత్వానికి, కొత్త గ్రామ పంచాయతీ పాలక మండళ్లకు దుర్వాసనతో కూడిన చెత్త స్వాగతం పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల తరువాత ఏర్పడిన గ్రామ పంచాయతీలకు, వాటినే పేరు మార్చిన గ్రామసచివాలయాలకు అన్ని గ్రామాలు చెత్తతో నిండిపోవడమే దానికి కారణం. ఏంటి కొత్త పంచాయతీలకు చెత్త స్వాగతం చెప్పడమేంటని ఆలోచిస్తున్నారా అయితే మీరు కూడా చెత్తలో కాలుమోపినట్టే. రాష్ట్రంలోని సుమారు పదేవేల చిలుకు గ్రామ పంచాయతీలుంటే అందులోని మేజర్ పంచాయతీల్లో మాత్రమే శానిటేషన్ సిబ్బందిని నియమించుకొని, ట్రాక్టర్లు ద్వారా చెత్తను అరకొరగా తొలగిస్తున్నాయి. మిగిలిన చిన్న పంచాయతీలకు ఎలాంటి శానిటేషన్ సిబ్బంది లేరు. ఎవరైతే గ్రామంలో పనిచేసే తలయారీ వున్నాడో ఆయనే గ్రామం మొత్తం తిరిగి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించాల్సిన దుస్థితి ఏర్పండి. ఒక్క తలయారీ గ్రామంలోని చెత్తను మొత్తం ఎత్తాలంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి అర్ధం చేసుకుంటే...నెలలో ఒకసారి కూడా ఏ ఒక్క వీధికి కూడా చెత్తను తీసుకెళ్లడానికి ఆ తలయారీ వచ్చే పరిస్థితులు లేవు. ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో శానిటేషన్ సిబ్బందిని నియమించినట్టుగా చిన్న పంచాయతీలకు కూడా శానిటేషన్ సిబ్బందిని ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకు అధికారులూ, ప్రభుత్వం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా ఎలాంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండి పోతుంది. అయినప్పటికీ యధాప్రకారంగా ఇంటిపన్నులు, లేని గ్రంధాలయానికి ల్రైబ్రెరీ పన్నులు, వీధిలైట్ల పన్నులు, నీరు రాని మంచినీటి కుళాయిలకు కుళాయి పన్ను ఇలా ప్రజల నుంచి చాలా పన్నులే వసూలు చేస్తుంది. గతంలోనే సర్పంచ్ లు పంచాయతీల్లో శానిటేషన్ సిబ్బందిని నియమించే విషయమై మండల అధికారులను కోరితే...ప్రభుత్వం పరిశీలన చేస్తుందని కాలయాపన చేశారు. ఆ తరువాత టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలకు ఎన్నికలే నిర్వహించడం మానేసింది. దీనితో గ్రామంలోని చెత్త సమస్య అలానే ఉండిపోయింది. ఇపుడు కొత్తగా ఎన్నికైన చిన్న పంచాయతీలకు మాత్రం గ్రామాల్లోని చెత్తే వారికి దుర్వాసనతో స్వాగతం పలుకుతోంది. కారణం ఒక్కటే ఎక్కడి చెత్త అక్కడ దారుణంగా పేరుకుపోవడమే. చాలా పంచాయతీల్లో చెత్త ఎత్తని కారణంగా ఇంటి పన్నులు కూడా కట్టమని తెగేసి చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా చిన్నపంచాయతీల్లోని ప్రజలంతా చెత్తకోసం ఉద్యమించే పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం చిన్న పంచాయతీల్లో వున్న వారంతా ప్రజలు కారు...వారి ఇళ్ల నుంచి చెత్త ఎత్తించాల్సిన అవసరం లేదనుకుంటే..నేటి గ్రామసచివాలయ వ్యవస్థలో కూడా శానిటేషన్ సిబ్బందిని నియమించదు. అలాకాకుండా 14 మంది సిబ్బందితో గ్రామసచివాలయాల ద్వారా సేవలందిస్తున్నప్పుడు...చిన్న పంచాయతీలకు చెత్తఏరివేయడానికి శానిటేషన్ కనీసం ఆరుగురు వ్యక్తులనైనా చెత్త ఎత్తడానికి నియమించడానికి చర్యలు తీసుకుంటుంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి..!
రథసప్తమినాడు శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి డెప్యుటేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తిశ్రద్ధలతో సేవలందించాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో డెప్యుటేషన్ సిబ్బందికి, శ్రీవారి సేవా సదన్-2లో శ్రీవారి సేవకులకు గురువారం అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఉద్యోగులు, శ్రీవారిసేవకులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని, భక్తులు కూడా ధరించేలా తెలియజేప్పాలని కోరారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులందరికీ తాగునీటి బాటిల్ అందిస్తామని, అది ఖాళీ అవగానే తిరిగి అక్కడే ఉన్న కొళాయిల్లోని జలప్రసాదం నీటిని నింపుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. గ్యాలరీల్లో చివర ఉన్న భక్తులకు కూడా తాగునీరు, అన్నపానియాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న మరుగుదొడ్ల గురించి భక్తులకు తెలియజేయాలన్నారు. శ్రీవారి సేవకుల సాయంతో చక్కగా భక్తులకు సేవలు అందించాలన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు వాహనసేవలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే అందుబాటులో ఉన్న అధికారులను వెంటనే సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో టిటిడి డెప్యూటీ ఈవో నాగరాజ, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, విజివో బాలిరెడ్డి, క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్.శాస్త్రి, శ్రీవారి సేవా సెల్ ఏఈవో రమాకాంతరావు, టిటిడి అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాతల శ్రేయస్సే కోసం IFMA (ఐ ఎఫ్ ఎం ఏ) ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు తెలంగాణ (ఐ ఎఫ్ ఎం ఏ) ఇంచార్జి "రామచంద్ర రెడ్డి" ప్రోడ్యూసర్లు సినిమాలతో నష్టపోకుండా వారికి అన్ని సేవలు అందించడానికి ఈ అసోసియేషన్ ఏర్పడినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో గురువారం పాత్రికేయుల సమావేశం ఏర్పటు చేసి (ఐ ఎఫ్ ఎం ఏ) లోగో లాంచ్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టిందని... ఇప్పటి వరకు మొత్తం 9 రాష్ట్రాల్లో నిర్మాతలకు, సినిమాలోని 24 శాఖలకు పలు సేవలు అందిస్తుందని తెలిపారు.ఐ ఎఫ్ ఎం ఏ లో నిర్మాత సభ్యత్యం తీసుకుంటే నిర్మాతలకు టైటిల్ రెజిస్ట్రేషన్ నుండి పబ్లిసిటీ మరియు సినిమా విడుదల వరకు కార్పోరేట్ స్థాయిలో అన్ని సంస్థే చూసుకుంటుందని ,24 శాఖల వారు సభ్యత్యం తీసుకుంటే వారికి ESI,PF సౌకర్యం ఉంటుందని తెలిపారు.
(ఐ ఎఫ్ ఎం ఏ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ "విజయ జాలాది" మాట్లాడుతూ...సమాజ శ్రేయస్సు కోసం జాతిని జాగృతి చేయడానికి ఈ అసోసియేషన్ ఏర్పడిందని 24 శాఖల కళాకారులు ఇందులో సభ్యత్వం తీసుకుంటే వారికి సంస్థ అండగా ఉంటుందన్నారు.సెంట్రల్ బ్యూరో నియమ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందుతాయని ,నిర్మాతలు ఈ అసోసియేషన్ లో సభ్యత్యం తీసుకుంటే అన్ని విధాలుగా మేము నిర్మాతలకు సినిమా విడుదల వరకు సేవలు అందిస్తామని అన్నారు.
(ఐ ఎఫ్ ఎం ఏ) మీడియా ఎంటర్టైన్మెంట్ సలహాదారులు " ప్రతిభా పులిజాల" మాట్లాడుతూ... ఈ అసోసియేషన్ కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని,నిర్మాతల క్షేమం కోసం వారు మోసపోకుండా ఉండడానికి మేము వారికి అండగా ఉంటూ సేవలు అందిస్తామన్నారు(ఐ ఎఫ్ ఎం ఏ) సభ్యులు "రాజీవ్ రెడ్డి" మాట్లాడుతూ...కరోనా సమయంలో నిర్మాతలకు ఎవరు అండగా లేరని వీరు ఎంతో నష్టపోయరని ,కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే వీరికి సరైన గుర్తింపు లేదని మా అసోసియేషన్ లో నిర్మాత సభ్యత్యం తీసుకుంటే వారికి ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ,సినిమా విడుదల వరకు నిర్మాతకు ఎక్కడ మోసం జరుగకుండా మేము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా పులిజాల, విజయ జాలాది , పి. రామచంద్ర రెడ్డి , రాజీవ్ ,భీమా నిషాంత్ , కర్ణాటక విభాగం సెక్రెటరీ దిలీప్ తదితరులు పాల్గోన్నారు.