ప్రభుత్వం తమను ప్రతిష్టాత్మక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోకి ఉద్యోగులుగా తీసుకుంది.. ఆడుతూ పాడుతూ పనిచేసినా ఎవరూ పట్టించుకోరు..ఒక వేళ వచ్చినా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతున్నారు.. పెద్దగా అధికారుల పర్యటనలు..డ్యూటీ చార్ట్ పట్టించుకోవాల్సిన పనిలేదు..దిల్ ఖుష్ రాజా అంటూ విధులు నిర్వహించేయొచ్చు.. అనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏకంగా 9 మంది గ్రామసచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇపుడు రాష్ట్రంలోనే సంచనలంగా మారింది. గ్రామసచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి, అక్కడి ఉద్యోగుల్లో జవాబుదారీ తనాన్ని పెంపొందించడానికి జిల్లా కలెక్టర్లు, జెసి, ఇతర ప్రత్యేక అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యటనలు చేస్తున్నా... ఇప్పటి వరకూ ఎక్కడా ఎవరినీ సస్పెండ్ చేయలేదు. అదే కొందరు గ్రామసచివాలయ ఉద్యోగులకు, సిబ్బందికి అలుసుగా మారింది. అదే సమయంలో కర్నూలు జిల్లాలో కూడా ఇదే విధంగా సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం వహించి కలెక్టర్ వీరపాండియన్ సచివాలయం సందర్శించే సమయానికి ఉద్యోగులు లేకపోవడంతో వెంటనే 9 మంది సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కర్నూలు జిల్లాయే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే హడలి చస్తూ(ఒకటీ, రెండూ పోసుకుంటున్నారు) పైగా కర్నూలు జిల్లా వీరపాండియన్ సస్పెండ్ చేసిన ఉత్తర్వులను సోషల్ మీడియాలో పెడుతూ, అన్ని జిల్లాల సచివాలయ సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నారు. కొత్తగా చేరిన ఉద్యోగులతో ఇంతకాలం ప్రజలకోసం పనిచేయాలని చెప్పి పనిచేయిస్తున్న అధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తీసుకున్న చర్యలతో బలమొచ్చింది. ఇకపై తాము కూడా ఈ విధంగానే వ్యవహించాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అటు ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లు, ప్రత్యేకంగా సచివాలయాల కోసం నియమించిన జెసిలకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడంతో ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు రాష్ట్రంలోని కలెక్టర్లు, జెసిలు. ఇక పనిచేయకుండా పబ్బం గడిపేద్దామనుకునే సచివాలయ ఉద్యోగులందరూ జాగ్రత్తగా ఇంటికెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు (115)సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం రాత్రి మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు. కొండపల్లి ప్రాంతంలో అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను విన్న అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈయన మరణ వార్తను విన్న చుట్టుప్రక్కల ప్రాంతాల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు.
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 24న మంగళవారం తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఛైర్మన్, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, రాంభగీచ వసతి భవనాలు, శ్రీ వరాహ స్వామి ఆలయం, శ్రీవారి ఆలయాలలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి వస్తున్నందున కోవిడ్ - 19 పరిస్థితుల దృష్ఠ్యా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలలో ప్రతిచోటా పరిమిత సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి ముందస్తుగా కోవిడ్ పరీక్షలు నిర్వహించమన్నారు. సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ భారత్ నారాయణ్ గుప్తా, ఎస్పీ రమేష్ రెడ్డిలు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. సిఇ రమేష్ రెడ్డి, ఇఇ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరింద్రనాథ్, విజిఓ బాలి రెడ్డి, ఎవిఎస్వో గంగరాజు, టెంపుల్ పేష్కర్ జగన్మోహనాచారి తదితరులు పాల్గొన్నారు.
కార్తీక వన భోజన మహోత్సవం ఆదివారం తిరుమల పార్వేట మండపంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాదీ పవిత్రమైన కార్తీకమాసంలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈసారి కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని 250 మంది భక్తులతో ఏకాంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్టు చెప్పారు. ముందుగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపం వద్ద మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. శాక్సాఫోన్, డోలు, నాదస్వర వాయిద్య సంగీతం ఆకట్టుకుంది. అనంతరం గరుడ వైభవం హరికథ పారాయణం చేశారు.ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బోర్డు సభ్యులు మురళీకృష్ణ, ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, విజివో బాలిరెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు బాలాజి, నాగరాజ, డిఎఫ్‌వో చంద్రశేఖర్, ఆలయ పేష్కార్ జగన్ మోహనాచార్యులు, పోటు పేష్కార్ శ్రీనివాస్, ఎవిఎస్వోలు గంగరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
కార్తీక వనభోజన కార్యక్రమం నవంబరు 22వ తేదీన ఆదివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలో(200 మందికి మించకుండా) అధికారులు, సిబ్బందితో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకీపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఉదయం 10 గంటలకు పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. కార్తీక వనభోజనం కారణంగా ఆదివారం శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు శనివారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు. పూర్వపురోజుల్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోందన్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోందన్నారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగిస్తున్నామన్నారు. ఇందులో సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా పుష్పార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా శనివారం ఉదయం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విజివో బాలిరెడ్డి, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు, ఎవిఎస్వోలు వీరబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మనాధస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకాన్ని ఈ నెల 22న ప్రారంభించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్.విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆ రోజు ఉదయం 9.30 గం.లకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా దాతలచే సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు సమర్పించు నిత్య అన్నదాన పథకానికి చెక్కులు గాని, డిడిల రూపంలో గాని నేరుగా దేవస్థానం బ్యాంకు ఖాతా నెం. 73166770127, ఐఎఫ్ఎస్ సి కోడ్ ఎపిజివిబి 0001170 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, శ్రీకూర్మం, గార మండలం, శ్రీకాకుళం జిల్లా కు జమ చేయవలసి వుంటుందని చెప్పారు. నగదు రూపంలో చెల్లించు సమర్పణలు నేరుగా దేవస్థానం కార్యాలయం నందు చెల్లించి తగు రశీదు పొందవలసినదిగా కోరినారు. భక్తులు అన్నదాన పథకంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.