కార్తీక వనభోజన కార్యక్రమం నవంబరు 22వ తేదీన ఆదివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలో(200 మందికి మించకుండా) అధికారులు, సిబ్బందితో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకీపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఉదయం 10 గంటలకు పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. కార్తీక వనభోజనం కారణంగా ఆదివారం శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు శనివారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు. పూర్వపురోజుల్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోందన్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోందన్నారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగిస్తున్నామన్నారు. ఇందులో సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా పుష్పార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా శనివారం ఉదయం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విజివో బాలిరెడ్డి, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు, ఎవిఎస్వోలు వీరబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మనాధస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకాన్ని ఈ నెల 22న ప్రారంభించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్.విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆ రోజు ఉదయం 9.30 గం.లకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా దాతలచే సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు సమర్పించు నిత్య అన్నదాన పథకానికి చెక్కులు గాని, డిడిల రూపంలో గాని నేరుగా దేవస్థానం బ్యాంకు ఖాతా నెం. 73166770127, ఐఎఫ్ఎస్ సి కోడ్ ఎపిజివిబి 0001170 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, శ్రీకూర్మం, గార మండలం, శ్రీకాకుళం జిల్లా కు జమ చేయవలసి వుంటుందని చెప్పారు. నగదు రూపంలో చెల్లించు సమర్పణలు నేరుగా దేవస్థానం కార్యాలయం నందు చెల్లించి తగు రశీదు పొందవలసినదిగా కోరినారు. భక్తులు అన్నదాన పథకంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.
శ్రీసూర్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవాన్ని క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఈ నెల 26న అరసవల్లి నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ వెల్లడించారు. తెప్పోత్సవం, స్వామి వారి స్వర్ణాభరణాల అలంకరణపై శుక్రవారం దేవాలయ సమావేశ మందిరంలో పాలకమండలి సభ్యుల పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రధాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే కార్తీక మాసంలో ఏకాదశి పవిత్రమైనదని, ఆరోజున స్వామి వారి స్వర్ణాభరణాలను స్వామి వారికి అలంకరించడం జరుగుతుందని అన్నారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో స్వర్ణాభరణాలతో స్వామి వారిని భక్తులు వీక్షేంచేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో భద్రతా దృష్ట్యా స్వర్ణాభరణాలను అలంకరణ చేయలేదని, వాటితో పాటు ఇటీవల స్వామి వారి కోసం తయారుచేసిన ఆభరణాలను కూడా ఇకపై అలంకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్షీరాబ్ధి ద్వాదశి అనగా ఈ నెల 26న స్వామి వారి తెప్పోత్సవం ఉంటుందని చెప్పారు. కరోనా దృష్ట్యా భక్తులెవరినీ స్వామి వారి తెప్పోత్సవానికి అనుమతించడం లేదని, అలాగే దీపాలు వెలిగించే భక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా నాగావళి నదీ తీరంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోనేరులో ఊరేగే స్వామివారికి పూల అలంకరణతో పాటు విద్యుత్ అలంకరణ ఉంటుందని అన్నారు. తెప్పోత్సవం అనంతరం స్వామి వారి ఊరేగింపు ఉంటుందని, తదుపరి మూలవిరాట్ కు అనివెట్టి మండపంలో పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాల వితరణ ఉంటుందని అన్నారు. తెప్పోత్సవంలో అర్చకులు, ఆలయ సిబ్బంది, దివిటివారు, డ్రెస్ కోడ్ ఉన్న సిబ్బంది, మీడియా మినహా వేరేవారు పాల్గొనేందుకు అనుమతి లేదని ఇ.ఓ స్పష్టం చేసారు. గతంలో స్వామి వారి స్వర్ణాభరణాలతో పాటు ఇటీవల స్వామివారికి చేయించిన ఆభరణాలను ఈ నెల 23న మధ్యాహ్నం 12.00గం.లకు మీడియా ముందు ప్రదర్శించడం జరుగుతుందని, వాటిని భక్తులకు తెలిసేలా ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, మండల మన్మధరావు, అంధవరపు రఘురామ్, పైడి భవాని, కింజరాపు ఉమారాణి, యామజాల గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
జర్నలిజం ముసుగు వేసుకొని ఒక పార్టీకి వేమూరి రాధాకృష్ణ కొమ్ము కాస్తున్నారంటూ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఎయిర్ పోర్ట్‌పై తమ పచ్చపత్రిక ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఖలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభమైతే విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేవేయలని ఉంది. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై రామోజీరావు, రాధాకృష్ణ తో చర్చించాలా. రెండు ఎయిర్ పోర్ట్‌ల మధ్య ఎంత దూరం ఉండాలో తెలియదా.. అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ కాదు నేవి ఎయిర్ పోర్ట్. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో నావీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన తరువాత బేగంపేట ఎయిర్ పోర్ట్ మూసేశారని గుర్తుచేశారు. రాధాకృష్ణ, రామోజీరావు లాంటి వారు సమతుల్యం పాటించాలన్న ఆయన రాధాకృష్ణ టివి ఛానెల్, దినపత్రిక నడపడానికి అనర్హుడని విరుచుకుపడ్డారు.. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై నాతో చర్చకు వస్తే అన్ని విషయాలు చర్చిస్తాను. అంతేతప్పా ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి జనాలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమన్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాలుగా పరిశ్రమల అభివృద్ధికి మేము సిద్ధంగా ఉన్నాము. విశాఖ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారు. టీడీపీ అధికార ప్రతినిదిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నిలు చంద్రబాబు పెట్టమంటే పెడుతున్నారు. వద్దంటే మానేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపట్టారు. ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించిన అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విఎస్వో మనోహర్, పేష్కార్జగన్ మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం ఈ నెల 24న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త తెలిపారు. గురువారంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన ఉదయం 9.45 గం. లకు చెన్నై ఎయిర్పోర్టు నుండి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలు దేరి ఉ. 10.30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మ.12.15 గం. లకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారన్నారు. అనంతరం మ. 12.50 గం. లకు వరాహస్వామిని దర్శించుకుని శ్రీవారి దర్శనానికి బయలు వెళతారని తెలిపారు. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహం చేరుకుని మ.3 గం.లకు తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని మ.3.50 వైమానిక దళ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు బయలుదేరి వెళతారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ (అన్ని రక్త పరీక్షలు, స్కానింగ్ లు, ఎక్స్ రేలు) సెంటర్లు తీసే కేంద్రాలు జిల్లా ఆసుపత్రుల్లో అరకొరగా ప్రభుత్వం మంజూరు చేయడంపై ప్రభుత్వ అధికారుల తప్పిదమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాని వెనుక సాంకేతిక కారణాలు తెలుసుకుంటే కావాలనే ప్రభుత్వ పెద్దల ప్రైవేటు ఆసుపత్రులకు హెల్త్ బిజినెస్ పడిపోతుందని ప్రభుత్వ పరంగా మెడికల్ సెంటర్లపై ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచిండంలేదనే విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అధికారులకు, వివిధ జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న విభాగాల అధిపతులకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, ఐవీఎఫ్ సెంటర్లు, డయాగ్నస్ కేంద్రాలు ఉన్నాయి. వారి దగ్గర లేని సదుపాయాల కోసం ప్రైవేటు మెడికల్ సెంటర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి మెడికల్ సెంటర్లు జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తే వారి హెల్త్ బిజినెస్ పూర్తిగా పడిపోతుంది. దానికోసం ప్రభుత్వం ఎప్పుడు వైద్యఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసినా పారామెడికల్ సిబ్బంది లోటును మాత్రమే అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఏడాది క్రితం విశాఖలో జరిగి రాష్ట్రస్థాయి వైద్యసమావేశంలో కూడా ఒక్క జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగానీ, ఏరియా ఆసుపత్రి వైద్యులు కాగీ ఆసుపత్రుల్లోకి కావాల్సిన స్కానింగ్ మిషన్లు, మెడికల్ ఎనలైజర్లు, ఇతర మెడికల్ సెంటర్ మిషన్ల ప్రస్తావన తేలేదు. కారణం ఒక్కటే సాధారణ రక్తపరీక్షలు కూడా పీహెచ్సీల స్థాయిలో పూర్తిగా జరగడం లేదు. అలా జరిగితే వారు పనిచేసే ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ సెంటర్ల బిజినెస్ దెబ్బతింటుంది. దానితో అన్నిజిల్లా ఆసుపత్రుల వైద్యులు కూడా సేవలు అందించడానికి సిబ్బందిని మాత్రమే అడిగి ఊరుకుంటున్నారు. కొన్నిమెడికల్ యంత్రాలు కొందరు సిఎస్ఆర్ ఫండ్స్ తో సమకూరుస్తున్నా వాటిని సాధారణ ప్రజల వైద్యానికి మాత్రం వినియోగించడం లేదు. ఉన్న సర్వీసులను సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెడికల్ సెంటర్లకు పరీక్షల కోసం ప్రతిపాదించని వైద్యులు, మెడికల్ ఎక్విప్ మెంట్ కోసం ఎందుకు అడగటం లేదనే విషయాన్ని ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఏ ఒక్క ప్రభుత్వంలోనూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిలు గుర్తించడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా అసలు పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలకు ఏస్థాయిలో మెడికల్ సెంటర్లు అవసరం అవుతాయనే విషయంలో ఒక్కసారి కూడా విచారణ చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ సెంటర్ల ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తే ...ప్రభుత్వం చెప్పిన కార్పోరేట్ స్థాయి వైద్యం అందుతంది. లేదంటే ప్రచారం తప్పా ఆచరణలో ఎలాంటి ఫలితాలు కనిపించవు మరో 100ఏళ్లు దాటినా..