రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో పాటించాల్సిన విధానాలు ఏంటి..రాజ్యాంగం ప్రకారం పాటించాల్సిన నిబంధనలు ఏమిటి.. అనే విషయాలను కూడా మనం ఏపీ బైఫర్ కేషన్ యాక్టుకి ముందే తప్పని సరిగా తెలుసుకో వాల్సి వుంటుంది. ఏపీ బైఫర్ కేషన్ యాక్టుకి సంబంధించిన నిబంధనలు ఏవేతే ఉన్నాయో..ఏవైతే సెక్షన్లు ఉన్నాయో.. రీ ఆర్గనైజేషన్ యాక్టుకి సంబంధించిన అన్ని అంశాలను మనం పూర్తిస్థాయిలో తెలుసుకోవాల్సి వుంటుంది. ఈ కోణంలో కూడా మనం రాసే పోటీపరీక్షల్లో ప్రశ్నలు అడిగే అవకాశం వుంటుంది. 2014 నుంచి ప్రస్తుతం జరుగుతున్న ప్రతీ పోటీ పరీక్షలో కూడా ఏపీ బైఫర్ కేషన్ యాక్టుకి సంబంధించి పలు ప్రశ్నలు అడుగుతూనే వస్తున్నారు. ఇది ఒక పూర్తి సబ్జెక్టుగా కూడా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికోసం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కు చెందిన పూర్తి అవగాహన అభ్యర్థికి ఉండాల్సిందే.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ..
రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ అనేది కేంద్ర జాబితాలోని, కేంద్ర పరిధిలోని అంశం. కాబట్టి ఒక రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరణ చేయాలి అనుకున్నప్పుడు కేంద్ర కేబినెట్ ముందుగా నిర్ణయం తీసుకుంటుంది. అది ఆ ప్రాంతం నుంచి వచ్చిన డిమాండ్ కావొచ్చు, వివిధ అంశాలను ద్రుష్టిలో పెట్టుకొని చేసేదే కావొచ్చు కానీ..అది కేంద్ర కేబిట్ నిర్ణయం తీసుకున్నతరువాతనే ముందుకు కదులుతుంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని బిల్లుగా రూపొందిస్తారు. దానినే రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు అంటారు. కేబినెట్ బిల్లుగా చేసిన తరువాత దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి వుంటుంది. అయితే ఆ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికంటే ముందు భారత రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతికోసం పంపాల్సి వుంటుంది.
సాధారణంగా మనం చూసుకున్నట్టైతే నేరుగా కొన్ని రకాల బిల్లులను కేంద్ర కేబినెట్ పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. ఒక్కోసారి వీటో కూడా చేసే అధికారం రాష్ట్రపతికి వుంటుంది ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు విషయంలో మాత్రం ముందుగా రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. కారణం రాష్ట్రపతి రాజ్యాంగానికి, దేశానికి అధిపతి కావడమే. దేశంలో ఏలాంటి కార్యక్రమాలు, మార్పులు చేర్పులు చేసినా దానిని ఖచ్చితంగా ముందస్తుగా రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వుంటుంది. ఆవిధంగా నిభందనను అందులో పొందుపరిచారు. ఏ రాష్ట్రాన్ని అయితే పునర్ వ్యవస్థీకరణ చేయాలని చెప్పి కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును రూపొందించిందో.. సదరు రాష్ట్ర క్యాబినెట్ అభిప్రాయం తీసుకోవడానికి కూడా రాష్ట్రపతి ఆ బిల్లును నిర్ణీత గడువుతో ఆ రాష్ట్రశాసన సభకు పంపుతారు. అది ముందుగా నిర్ణయించిన దానిప్రకారం మూడ నుంచి ఏడువారాలా అనే దానిపై ఆధారపడి వుంటుంది.
అలా పంపిన తరువాత సదరు రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సి వుంటుంది. అయితే ఆ అభిప్రాయాన్ని రాష్ట్రపతి పరిగణలోనికి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ అనే అంశం కేంద్ర జాబితాలోనిది కాబిట్టి దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ అధికారం కేంద్రానికే వుంటుంది. అంతే తప్పా రాష్ట్ర శాసన సభ ఇచ్చిన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ రాష్ట్రాన్ని విభజించే సమయంలో అభిప్రాయం కోరడం అనేది ఒక పద్దతిగా మాత్రమే జరుగుతుంది. అలా వచ్చిన రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్ర పతి కూడా పరిగణలోనికి తీసుకున్నా, తీసుకోకపోయినా మళ్లీ దానిని కేంద్ర కేబినెట్ కు పంపిస్తారు. అలా రాష్ట్ర అనుమతి పొందిన తరువాత కేంద్ర కేబినెట్ కూడా ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది.
ఆ విధంగా రాష్ట్రపతి అనుమతి వచ్చిన తరువాత పార్లమెంటులోని రెండు సభలు ఒకటి లోక్ సభ, రెండది రాజ్యసభ ఇందులో మళ్లీ ఎందులో ముందుగా ప్రవేశపెడతారు అనే విషయం ముందుగా చర్చనీయాంశం. సాధారణంగా ఆర్ధిక పరమైన బిల్లులు ముందుగా లోక్ సభలో ప్రవేశపెట్టిన తరువాత దానిని రాజ్యసభకు పంపుతారు అది రాజ్యాంగపరమైన విధి. ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే ఉపరాష్ట్రపతిని తొలగించాలనే బిల్లును ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలని వుంటుంది. సో అలాగే ఆర్ధిక పరమైన అంశాలకు చెందిన బిల్లులను మాత్రం లోక్ సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలి. దానికోసం రాజ్యాంగంలోని ప్రత్యేక మైన నిబంధనలు పొందుపరిచారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేటపుడు రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రత్యేకమైన నిబంధన పేర్కొన్నారా అంటే ఎలాంటి నిబంధనా పేర్కొనలేదు. కావున రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర కేబినెట్ ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అది లోసభ అయినా కావొచ్చు..రాజ్యసభ అయినా కావొచ్చు.
ఈ సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలనే నిభందన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు. అయితే రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఆర్ధిక పరమైన అంశాలతో కూడుకున్నది అయితే, దానిని పూర్తిగా ఆర్ధిక బిల్లుగా భావించినట్టైతేనే దానిని ముందుగా లోక్ సభలోనే ప్రవేశపెట్టాల్సి వుంటుంది కానీ లేదంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అలా ప్రవేశపెట్టినపుడు ఆ బిల్లు సాధారణ మెజార్టీ పొందాల్సి వుంటుంది. అలా వచ్చిన తరువాత తదుపరి ఆ బిల్లును రెండవ సభకు పంపిస్తారు. అక్కడ కూడా సాధారణ మెజార్టీ పొందాలి. ఇక్కడ సాధారణ మెజార్టీ అంటే సభకు హాజరైన వారిలో సంగం కంటే ఎక్కువగా ఆమోదిస్తే దానిని సాధారణ మెజార్టీ అంటారు. దానినే సింపుల్ మెజార్టీ అనికూడా అంటారు. ఇక ప్రత్యేక మెజార్టీ అంటే హాజరైన సభ్యుల్లో రెండూ బై మూడో వంతు సభ్యులు ఆమోదిస్తే దానిని ప్రత్యేక మెజార్టీ అంటారు. రాజ్యాంగ సవరణ బిల్లులు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు తదితర అంశాలకు చెందిన బిల్లులుకానీ, తీర్మాణాలను కానీ పార్లమెంటు ప్రత్యేక మెజార్టీలో పార్లమెంటు ఆమోదించాలని వుంటుంది.
కాని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై రెండు సభలు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుందట. ఇక్కడ సాధారణ మెజార్టీ అంటే సభకు హాజరైన వారిలో సగం కంటే ఎక్కువ మంది ఓటువేసిన సభ్యులు అనుకోవాలి. ఆవిధంగా మెజార్టీ వస్తే ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినట్టే. అదే సమయంలో ఒక సభలో మెజార్టీ వచ్చి, రెండవ సభలో మెజార్టీ రాలేనపుడు దానికోసం రెండు సభలను కలిపి సమావేశపరిచే అవకాశం వుందా అంటే అలాంటిదేమీ లేదని అభ్యర్ధులంతా గుర్తుంచుకోవాల్సి వుంటుంది. అంతేకాకుండా ఒక సభ ఆమోదించి, మరొక సభ ఆమోదించకపోతే ఖచ్చితంగా ఆ బిల్లు వీగిపోయినట్టే. అలాంటి సమయంలో కూడా ఉబయ సభలను సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అధికారం కూడా భారత రాష్ట్రపతికి లేదనే విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
సాధారణంగా అయితే ఒక పరిపాలనా బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టినపుడు ఒక సభ ఆమోదించి, మరొక సభ ఆమోదించకపోతే అపుడు రాజ్యాంగంలోని 108 ఆర్టికల్ ప్రకారం భారత ఉప రాష్ట్ర పతి ఉభయ సభలను సమావేశ పరచవచ్చు. కానీ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు విషయంలో ఆలాంటి నిబంధన ఏదీ పేర్కొనలేదు. కావున రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు విషయంలో రెండు సభలు ఆమోదిస్తే తప్పా బిల్లు పాసయ్యే అవకాశం లేదు. అంటే ఆ బిల్లు పూర్తిగా వీగిపోయినట్టే. సంయుక్త సమావేశానికి మాత్రం అవకాశం వుండదు. అలా రెండు సభలూ బిల్లును ఆమోదించినపుడు ఆ బిల్లును రాష్ట్ర పతి ఆమోదానికి పంపుతారు. అపుడు రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. ఎందుకంటే రాష్ట్రపతికి ఇక్కడ వీటో చేసే అధికారం లేదు. ఎందుకు లేదంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే ఆ బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదించి వచ్చింది కనుక. ఇక్కడ రెండు సభలూ ఆమోదించి పంపిన తరువాత వచ్చిన ఆబిల్లు రాష్ట్రపతి ఆమోదించడం అనేది ఆనవాయితీ మాత్రమే. ఇక్కడ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాష్ట్రపతి వీటో చేయడానికి వీలులేని బిల్లు ఈ అంశాన్ని అభ్యర్ధులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి వుంటుంది.
అలా రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రెండు సభలు ఆ బిల్లును ఆమోదించితే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు చట్టంగా మారిన విధానం చూసుకుంటే 2013 జూలై 30వ తేదీన కేంద్ర కేబినెట్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయడం కోసం కేంద్ర కేబిట్ ఈ నిర్ణయం తీసుకుంది. అలా నిర్ణయం తీసుకున్న తరువాత దానిని బిల్లుగా రూపకల్పన చేసింది. దానినే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లుగా నామకరణం కూడా చేశారు. అలా ముందుగా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు అనేది కేంద్ర కేబినెట్ రూపొందించిన తరువాత భారత రాష్ట్రపతి ఆమోదానికి పంపారు.
అపుడు భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నారు. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లుపై ఏడు వారాల గడువు ఇచ్చిదానిని ఆమోదించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పంపారు. ఆ సమయంలో రాష్ట్రం నుంచి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ..తీర్మానం చేసి పంపారు. ఆసమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుల సంఖ్య 294. అందులో 175 సభ్యుల నవ్యాంధ్రప్రదేశ్ వి కాగా, 119 సభ్యులు తెలంగాణకి చెందిన వారు. ఆసమయంలో 175మంది సీమాంధ్రాకి చెందిన శాసన సభ్యులు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టుగా పార్టీలకు అతీతంగా తీర్మాణం చేసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. కానీ రాష్ట్రపతి ఏపీ శాసన సభ తీర్మాణాన్ని పరిగణలోకి తీసుకోకుండా తన ముందస్తు అనుమతి ఇచ్చేసి దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి తన ఆమోదాన్ని తెలియజేశారు. ఈ లోగా సమయం ఎక్కువ కావడంతో అది పార్లమెంటులో ప్రవేశపెట్టేనాటికే ఏడాది మార్పు జరిగిపోయి అది కాస్తా 2014 గా మారిపోయింది. అలా ముందుగా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు-2014 పార్లమెంటులోని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
మిగిలిన ముఖ్యమైన భాగం వచ్చే ఆర్టికల్ లో చర్చించుకుందాం..