సైనిక్ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత నవంబర్ 30వ తేదీనే అప్లికేషన్స్‌కి గడువు ముగియగా.. మరో ఐదు రోజుల పాటు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో 6, 9వ తరగతుల ప్రవేశం కోసం అభ్యర్ధులు డిసెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సైనిక్ స్కూళ్ల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు.
కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలను ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023) ద్వారా కల్పించడానికి అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 33 సైనిక స్కూళ్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తోంది.
అర్హతలు ఇవే..
6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల వయసు మార్చి 31, 2023 నాటికి 10 నుంచి12 ఏళ్ల మధ్యలో ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు మార్చి 31, 2023 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి. 2022-23 విద్యాసంవత్సరంలో ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలతోపాటు ఆసక్తికలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 5, 2022వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ విద్యార్థులు రూ.650లు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో జనవరి 8, 2023వ తేదీన దేశ వ్యాప్తంగా దాదాపు 180 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.
మొత్తం సీట్ల వివరాలు ఇవి..
6, 9 తరగతులకు కలిపి మొత్తం 4,786 సీట్లు కేటాయించారు. 6వ తరగతికి దాదాపు 4,404 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ- 2,894, ప్రైవేటు- 1,510 సీట్ల చొప్పున ఉన్నాయి తొమ్మిదో తరగతికి మొత్తం 382 సీట్లు ఉన్నాయి. సైనిక్ స్కూల్ ఉన్న రాష్ట్ర విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం సీట్లు కేటాయిస్తారు. వీటిల్లో ఎస్సీ కేటగిరీకి15 శాతం, ఎస్టీ కేటగిరీకి 7.5 శాతం, ఇతరులకు 27 శాతం సీట్లు రిజర్వేషన్ ప్రకారం కేటాయిస్తారు. 50.50 శాతం సీట్లలో 25 శాతం మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, 25 శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే..
అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.