భారతదేశంలో ప్రజలకు సత్వర పరిపాలన..ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే పరిపాలనా వ్యవస్థలో సీనియర్ ఐఏఎస్ ల పాత్ర చాలా కీలకం. దానిని గుర్తించిన బీజేపీ ప్రభుత్వం ఇపుడు సరికొత్తగా ఆలోచన చేసింది. అదే సమయంలో ఐఏఎస్ ల కొరతను కూడా అధిగ మించడానికి కార్యాచరణ మొదలు పెట్టింది. దానికోసం కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్ లకు పదోన్నతి అడిషనల్ జాయింట్ సెక్రటరీ గా ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా దేశంలోని అన్ని కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనూ సెక్రటరీతోపాటు, అడిషనల్ జాయింట్ సెక్రటరీ పోస్టు కూడా వచ్చి చేరబోతుంది. ఈ విధంగా ఐఏఎస్ లకు పదోన్నతి కల్పించడం ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, కేంద్ర లక్ష్యాన్ని అనుకున్న సమయానికి పూర్తిచేయాలనే సంకల్పం కూడా వుంది. కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ స్థాయి పదవులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను ఎంపిక చేసే విధానంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. 2 సంవత్సరాలు డైరెక్టర్ లేదా డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి మాత్రమే జాయింట్ సెక్రటరీగా ఉండేలా ప్రభుత్వం తన ఎంప్యానెల్‌మెంట్ విధానాన్ని సవరించింది.
దేశంలో ఐఏఎస్ ల కొరత చాలా తీవ్రం..
భారతదేశంలో ప్రస్తుతం మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789 మంది. కానీ ప్రస్తుతం వున్న ఐఏఎస్ అధికారులు 5317 మంది అంటే ఇంకా కావాల్సిన ఐఏఎస్ అధికారులు 1472 మంది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఉండగా, 26 చోట్ల ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీసు(ఐఏఎస్)ల కొరత తీవ్రంగా వుంది. అదే సమయంలో కేంద్రంలోనూ ఐఏఎస్ ల కొరత వుంది. ప్రస్తుతం ఏటా కేంద్రప్రభుత్వం 2012 నుంచి 180 మంది ఐఏఎస్ అధికారులను డైరెక్టుగా నియమిస్తోంది. అయినప్పటికీ ఖాళీల కొరత తీవ్రంగా వుంది. 1455 మందిని స్టేట్ సివిల్ సర్వీస్ ద్వారా పదోన్నతులు కల్పించినా..ఖళీలు మాత్రం మిగిలిపోతూనే ఉన్నాయి. తద్వారా దేశ వ్యాప్తంగా పరిపాలన,సేవల్లో జాప్యం ఏర్పడుతుంది. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని పనులు పూర్తికావాలన్నా, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఖాళీగా ఉండిపోయిన 1472 ఐఏఎస్ పోస్టులు భర్తీకావాల్సి వుంది.
పదోన్నతినితో పరిపాలన సులువు..
సీనియర్ ఐఏఎస్ లకు అడిషనల్ జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతి కల్పించడం ద్వారా పరిపాలన గాడిలోపడుతుంది. సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు కావడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఎంతమందిని అడిషనల్ జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పిస్తే..అంతే మొత్తంలో నూతన ఐఏఎస్ ల నియామకం, స్టేట్ సివిల్ సర్వీస్ నుంచి పదోన్నతులు కల్పించి ఖాళీలను భర్తీ చేయడానికి ఆస్కారం వుంటుంది. ఇంతకుముందు, అధికారులు తమ రాష్ట్ర కేడర్ నుండి నేరుగా వచ్చి కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీలుగా పనిచేసే వారు. కానీ కేంద్రంలోని జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఎంప్యానెల్‌మెంట్ కోసం సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్ స్థాయిలో 2 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉండకూడదని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 2007 బ్యాచ్ ఐఏఎస్ లకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వర్తించనుంది. కానీ ఐఏఎస్ అధికారుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే వస్తోంది.
ఖాళీగా ఐఏఎస్ ల భర్తీకి ప్రత్యేక చర్యలు
దేశంలో ఖాళీగా వున్న ఐఏఎస్ అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి యూపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల సివిల్ సర్వీస్ ద్వారా పదోన్నతులు కల్పించి ఉన్నఖాళీలను నింపాలని కేంద్రం నిర్ణయించింది. దానికోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని స్టేట్ సివిల్స్ ద్వారా కొంత మందిని భర్తీచేసింది. మిగిలిన వాటిని డైరెక్టగా తీసుకోవాలని భావిస్తుంది ఇప్పటి వరకూ ఏడాదికి 180 ఐఏఎస్ అధికారును నింపుతున్న కేంద్రం ఇపుడు ఆ సంఖ్య 200 నుంచి 225కి పెంచాలని కూడా యోచిస్తున్నది. అదే జరిగితే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవారికి కూడా మంచి రోజులు వస్తాయనే చెప్పవచ్చు. ఏది ఏమైనా కేంద్రం అడిషల్ జాయింట్ సెక్రటరీ పదోన్నతి కల్పించడానికి మొదలు పెట్టిన కార్యాచరణ ద్వారా అనేక లాభాలు వచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.