ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సెలవులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్టు విద్యాశాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సాకు చూపి మార్చి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు అంటూ ఒక పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వాటిని ఎవరూ నమ్మవద్దన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలైనా నేరుగా ప్రభుత్వ పాఠశాలలు లేదా డిఈఓ, ఎంఈఓల ద్వారా మాత్రమే ప్రభుత్వం ప్రటిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు యధావిధిగానే నడుస్తాయన్నారు. ఈమేరకు అన్ని జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 27న మాఘపూర్ణిమను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం నిర్వహిస్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్లీనంగా సరస్వతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ మూడు నదుల సంగమ స్థానమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
విశాఖలో త్వరలోనే మిలీనియం టవర్ పక్కన భారీ ఐటి పార్కు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు. ఈమేరకు సచివాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎక్కువ ఉద్యోగాలందించేందుకు అవకాశం ఉన్న ఏకైక శాఖ ఐ.టీ శాఖ మాత్రమేనన్నారు. ప్రతీ ఏటా బయటకు వస్తున్న ఇంజనీరింగ్ పట్టభద్రులే కాకుండా, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు కూడా ఐటీ లో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. దీనికోసం విశాఖపట్నంలోని మిలీనియం టవర్ సమీపంలో ఐ.టీ పార్కు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని అన్నారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ లోని రహేజా మైండ్ స్పేస్ తరహాలో ఐ.టీ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ మేరకు అధికారులను ఆదేశించినట్టు మంత్రి వివరించారు. యువత గర్వంగా చెప్పుకునే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఐటి ఉద్యోగాలకు అనుగుణంగా ముందస్తుగానే ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఆయా టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏ టెక్నాలజీల్లో ఉద్యోగాలొస్తున్నాయో గుర్తించి నిరుద్యోగ యువతకు అందులో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఐటీ ఉద్యోగాలు సత్వరమే రావడానికి ఆస్కారం వుంటుందని చెప్పారు. దానికోసం నైపుణ్యాభివ్రుద్ధి సంస్థ ద్వారా శిక్షణలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను కోరామన్నారు.. ఐ.టీ పార్కు అభివృద్ధితో వీలైనన్ని ఎక్కువ నాణ్యమైన ఉద్యోగాలందింస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. కాగా, 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగుస్తుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కోర్టు తీర్పుమేరకు రాష్ట్రంలో అన్ని పనులు చక చకా జరిగిపోతున్నాయి..
తిరుమలలో ఫిబ్రవరి 27వ తేదీన జరగాల్సిన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను టిటిడి రద్దు చేసింది. ఈ కారణంగా కుమారధార తీర్థంలోకి భక్తులకు అనుమతి లేదని టిటిడి స్పష్టం చేసింది. కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రజలకు గ్రామాల్లోనే ప్రాధమిక వైద్యం అందించాలని ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినిక్ లకు 104ను అనుసంధానం చేయాలని భావిస్తుంది. తద్వారా ఒక్కో విలేజ్ క్లినిక్ పరిధిలో ఒక్కోరోజు మెడికల్ క్యాంపులు ప్రతీనెలా కానీ ప్రతీ 15 రోజులకు ఒకసారిగాని ఏర్పాటు చేయడం ద్వారా అన్ని రకాల రోగాలతోపాటు, రక్తపరీక్షలు కూడా గ్రామాల్లో చేయాలని చూస్తున్నట్టు సమాచారం. సుమారు 90 రకాల మందులు విలేజ్ క్లినిక్ లలో అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు వేస్తున్న వేక్సిన్లను కూడా ఇకపై విలేజ్ క్లినిక్ లలోనే వేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే అంగన్వాడీలు, సచివాలయ ఏఎన్ఎంలకు ట్యాబులు, రక్త పరీక్షలు(హీమోగ్లోబిన్ పరీక్షలు చేసే)కిట్లను అందించిన ప్రభుత్వం గ్రామంలో అందరికీ వాటితోనే పరీక్షలు చేయించనుంది. సుగర్ పరీక్షలకు కూడా ప్రత్యేకంగా కిట్లను అందజేసి ఆరోగ్య సహాయకులతోనే పరీక్షలు చేయించాలని భావిస్తోందట. అంటే చాలా వరకూ విలేజ్ క్లినిక్ లలో ల్యాబ్ టెక్నీషియన్ అవసరం లేకుండానే కొత్తగా నియమించే స్టాఫ్ నర్సు, ఏఎన్ఎంలతోనే వాటిని నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఆరోగ్య సహాయకులుగా బిఎస్సీ నర్సింగ్ చేసిన వారిని నియమిస్తారు. వారితోపాటు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంలు వీరితోపాటే విలేజ్ క్లినిక్ లలోనే సేవలు అందిస్తారు. నెలకొకసారి 104 ద్వారా డాక్టర్లు బ్రుందం వచ్చినపుడు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. అత్యవసరం అయితే ఎలగూ 108 వాహనాలకు విలేజ్ క్లినిక్ ల నుంచే ఫోన్ చేసి వాటిని రప్పిస్తారు. ఇలా 104, 108 అంబులెన్సులు కూడా ప్రజలకు అత్యవసర సేవలకు ఉపయోగ పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విలేజ్ క్లినిక్ ల నిర్మాణం జరుగుతుండగా, ఏప్రిల్ లో లేదా మే నెలలో దీనికి సంబంధించిన స్టాఫ్ నర్సుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విలేజ్ క్లినిక్ ల నిర్మాణం జరిగి సిబ్బంది అందుబాటులోకి వస్తే గర్భిణీ స్త్రీలు ఒక్క కాన్పులకు మాత్రమే పీహెచ్సీలకు, గానీ, ఏరియా ఆసుపత్రులకు గానీ వెళ్లే పనుంటుంది. అంతవరకూ ప్రాధమిక వైద్యం మొత్తమంతా ఇక్కడ పనిచేసే ఆరోగ్య సహాయకులతోనే ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. కొత్తగా ఏర్పాటు కాబోయే విలేజ్ క్లినిక్ ల ద్వారా సుమారు 11274 మందికి కొత్తగా స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ కేంద్రానికి కూడా ఒక కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్, వెబ్ కెమెరా తదితర సామాగ్రి ఇచ్చి పీహెచ్సీ స్థాయిలోగానీ, ఏరియా ఆసుపత్రి స్థాయిలో గానీ, జిల్లా స్థాయిలోగానీ, రాష్ట్రస్థాయిలో గానీ అందుబాటులో ఉండే వైద్యులతో రోగుల రోగాలకు అనుగుణంగా మందులను ఇచ్చేందుకు వీలుగా టెలీమెడిసిన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే విధంగానే వీటి నిర్మాణాలు జరుగుతున్నాయని సమాచారం. గ్రామసచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లతోపాటు, వెటర్నరీ క్లినిక్ లు కూడా ఏక కాలంలో అందుబాటులోకి రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఒకప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా పీహెచ్సీలకు కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వచ్చేది. తీరా అక్కడికి వెళ్లిని అక్కడ పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేవి కాదు. వీటిని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వా ఆ ఇబ్బందులను ప్రజలకు ఉపసమనం కల్పించడానికి ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ విలేజ్ క్లినిక్ వ్యవస్థతో గ్రామస్తులకు గ్రామంలోనే ప్రాధమిక వైద్యం అందే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు అంతరాయం లేని స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని వైఎస్ జగన్ సర్కారు భావిస్తుంది. మైదాన, పట్టన ప్రాంతాల్లో సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా ఏజెన్సీ గ్రామాల్లోని సచివాలయాలకు ఆ ఇబ్బందులు చాలా అధికంగా వున్నాయి. చాలా గ్రామ సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వలన గిరిజన ప్రాంతాల్లో చాలా ఆన్ లైన్ పనులకు అంతరాయం ఏర్పడుతుంది. అదే సమయంలో ప్రతీగ్రామానికి ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ నెట్ సౌకర్యం కల్పించాలనే భావనతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలోని ఒక ఇంటర్నెట్ స్టేషన్ ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందించాలని చూస్తుంది. గతంలోనే ఈ ప్రాజెక్టు కోసం అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకల కారణంగా వాటి సేవలు ప్రజలకు పెద్దగా అందలేదు. ప్రస్తుతం అన్ని సచివాలయ పనులకు, సంక్షేమ పథకాల నమోదుకు ఇంటర్నెట్ అత్యవసరం కావడంతో ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని చూస్తుంది. ఇప్పటికే ఆఫ్ లైన్ లోవున్న కేబుల్ వ్యవస్థను అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థల్లోకి మార్పులు చేస్తూ వస్తుంది. ఇకపై గ్రామాల్లో ఎవరికి ఇంటర్నెట్ కావాలన్నా గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే..దాని నుంచి ఆ గ్రామంలో వున్న కేబుల్ ఆపరేటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులోనూ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా టెలీఫోన్, ఇంటర్నెట్, కేబుల్ టివి, వైఫై అన్ని వస్తుండటంతో వాటినే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు వర్తింపచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 5400 గ్రామాల్లో ఈ ఏపీ ఫైబర్ నెట్ సేవలను విస్తవరించగా, దానికోసం 24వేల కిలోమీటర్ల పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ను ఏర్పాటు చేశారు. సుమారు 15వేల గ్రామ, వార్డు సచివాలయాలలు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, అన్ని ప్రభుత్వ పాఠశాఠశాలలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవడంతోపాటు పది లక్షల మంది కుటుంబాలకు ఏపీ ఫైబర్ నెట్ సేవలను దగ్గర చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వారికి కూడా ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఇంటర్నెట్ అందించాలని కూడా చూస్తుంది. ప్రతి విద్యార్ధికి ప్రస్తుతం ఇంటర్నెట్ భాగం అయిపోవడంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ విస్తరించి ప్రభుత్వసేవలు అందించాలని చూస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా పనులు నడుస్తుండగా, రాష్ట్రంలోని అన్ని నూతన గ్రామ సచివాలయాలు నిర్మాణాలు పూర్తి అయ్యే నాటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022 మార్చినాటి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలతోపాటు 10 నుంచి 15 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు వేయనున్నారు. ఇప్పటి వరకూ 2800 గ్రామ, వార్డు సచివాలయాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. వీటితో పాటు 11274 గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సేవలను విస్తవరించనున్నారు. వీటితోపాటు గ్రామాల్లో ఉచిత వైఫై టవర్లు కూడా పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో గ్రామాల్లోకి ఇంటర్నెట్ కనెక్షన్ లు అందుబాటులోకి వస్తే ఆన్ లైన్ సేవలకు, ప్రభుత్వ పథకాల అమలకు, విద్యార్ధుల ఆన్ లైన్ క్లాసులకు ఎలాంటి డోకా లేకుండా ఇంటర్నెట్ అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన పనులను చకచకా చేపడుతుంది..!
విజయవాడలో వేంచేసియున్న శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయంలో అవినీతి ,కుంభకోణాలపై విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా నిరవధికంగా వస్తున్న ఆరోపణలపై సకాలంలో అవినీతికి తావియ్యకుండా,అవినీతిపరుల అక్రమాలు అరికట్టేంచుదుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఆలయ భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. అయితే అంతా అనుకున్నట్టుగానే ఈఓపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీనిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సంతోషం,హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ,పుణ్యక్షేత్రాన్ని అక్రమాల అడ్డాగా మార్చుకున్న అవినీతి,అసాంఘిక శక్తుల కబంధ హస్తముల నుండి విడుదల అయ్యేలా చూడాలని ప్రజలు,అమ్మవారి భక్తులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరుతున్నారు. మరోవైపు ఈఓ కూడా తనను వేరోచోటుకి బదిలీ చేయాలని, లేదంటే లాంగ్ లీవ్ పై వెళ్లిపోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది.