పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
పుష్పాధిదేవుడు ''పుల్లుడు'' ఆవాహన :
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి పునరుద్ధరించి నిర్వహిస్తున్నారు. పుష్పయాగానికి మొత్తం 8 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి 3 టన్నులు, కర్ణాటక రాష్ట్రం నుంచి 4 టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక టన్ను పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. ఇటీవల శ్రీ వేంకటేశ్వరస్వామివారి కైంకర్యాలకు అవసరమైన పుష్పాల కోసం తిరుమల బాట గంగమ్మ ఆలయం సమీపంలో అభివృద్ధి చేసిన శ్రీవారి పుష్ప ఉద్యానవనం నుండి 150 కేజీల పుష్పాలు ఈ మహోత్సవంలో వినియోగించారు.
ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం :
శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులును శ్రీవారి ఆలయ అధికారులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.