ఆంధ్రప్రదేశ్ లో ఈసారి రాజకీయపార్టీలకు తమ సామాజిక వర్గం బలమెంతో తెలియజేసే పనికి రాష్ట్రంలోని అన్ని సమాజిక వర్గాలూ పూనుకున్నాయి. వాస్తవంగా ప్రతీ పదేళ్లు ఒక సారి కేంద్ర ప్రభుత్వం జనాభా గణన చేపడుతుంది. కానీ 2019 ఎన్నికల తరువాత ఏపీలో సామాజిక వర్గాల బలాబలాలు ప్రదర్శించుకునేందుకు
అందరూ ఆశక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో అన్ని సామాజికవర్గాల కంటే చేనేత సామాజిక వర్గం రెండవ అతిపెద్ద సామాజిక వర్గంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అయ్యింది. దీనితో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఏఏ సామాజిక వర్గాల్లో ఎంత మంది జనాభా ఉన్నారు.. జిల్లాలు, మండలాలు, పంచాయతీలు వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎప్పటికి కొత్త ఓట్లు పెరుగుతాయి.. అనే వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్స్ ఏర్పాటు చేసుకొని అధికారికంగా జనగణన చేపడుతున్నారు. దీనిలో ఈసారి ప్రభుత్వం నిర్వహించబోయే జనగణనకు ముందే ఏఏ సామాజిక వర్గాల్లో ఎంతమంది ఉన్నారనే విషయం తేలిపోనుంది. అందులోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ సామాజిక జనగణనకు ప్రాధాన్యత ఏర్పడింది.
జనాభా, ఓట్లను బట్టీ ఇకపై సీటు డిమాండ్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయపార్టీలను రాష్ట్రంలోని సామాజిక వర్గాలకు చెందిన వారు తమ సామాజిక వర్గం ఓట్లను బేరీజు చేసుకొని, వారి రాష్ట్ర, జిల్లా సంఘాల డిమాండ్ ల మేరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లను డిమాండ్ చేయాలని ఆలోచనకు వచ్చాయి. ఇప్పటి వరకూ డబ్బున్నవాడికే
రాజకీయపార్టీలు సీట్లు ఇచ్చేవి. సామాజిక జనగణన పూర్తిస్థాయిలో జరిగితే కులాల వారీగా తప్పనిసరి పరిస్థితుల్లో సీట్లు ఇవ్వాల్సి వుంటుంది. అదే సమయంలో రాజకీయపార్టీలు సీట్లు నిరాకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు నిరాకరించేవిధంగా కూడా ఇప్పటి నుంచే సామాజిక వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
సాధారణంగా ఎన్నికల నాటికి రాజకీయపార్టీలు ఇచ్చేవారివే సీట్లు, పొందిన వారే అభ్యర్ధులు అన్నట్టుగా ఉండేది. కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికల ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది.
ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ద్వారా ఉద్యోగులు గుర్తింపు
సామాజిక సంఘాలే కాకుండా ఇపుడు సామాజిక ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వశాఖలో ఉద్యోగం చేసినా..సాఫ్ట్ వేర్, లేదా ప్రైవేటు డాక్టర్ ఉద్యోగాలు చేస్తున్నా వారిని ఆయా సామాజిక ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో సభ్యులుగా చేర్చి తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు నాయకులుగా వున్నవారు తమ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎక్కువ అంటే మాటలు చెల్లుబాటు అయ్యేవి. కానీ ఇపుడు రికార్డెడ్ ప్రూఫ్ మొత్తం సామాజిక గణనతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కూడా ఆధార్ కార్డు నెంబర్లుతో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ఇపుడు ఏ సామాజిక వర్గంలో సాధారణ ఓట్లు, వాటితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగులు ఇలా ఎక్కడ ఉద్యోగం చేసినా వారి సంఖ్య, వివరాలతో ప్రత్యేక డేటాబేస్ ను తయారు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
ఆ రెండు సామాజిక వర్గాలుకే ఎప్పుడూ అధికారం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ వరకూ కేవలం రెండు సామాజిక వర్గాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. ఈ తరుణంలో బీసిలు, ఎస్సీలు, ఎస్టీలకు కూడా రాజ్యాధికారం, ప్రభుత్వంలోని పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు కూడా దక్కించుకోవాలనే లక్ష్యంతో చాలా సంవత్సరాల తరువాత అన్ని సామాజిక వర్గాల్లోనూ కదలిక వచ్చింది. దీనితో ఏఏ సామాజిక వర్గాల్లోని ఓటు బ్యాంకు ఎంతుందో మొత్తం లెక్కలు చూపించి.. రాజకీయపార్టీల దగ్గర బల ప్రదర్శన చేయడానికి సామాజిక వర్గాలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఓట్లు చీలిక రాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సామాజిక కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటిలో పదవులు ఇచ్చినా ఫలితం లేకుండా పోతుంది. ఇతర రాజకీయపార్టీలు ఈ సారికి సామాజిక బలం ఆధారంగా సీట్లు, ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రులు, ఇతర ప్రత్యేక పదవులు ఇస్తామని ప్రకటిండచం కూడా ప్రస్తుతం సామాజిక వర్గ జనగణన, ప్రభుత్వ ఉద్యోగుల గణనకు ప్రత్యేక కారణం అవుతోంది. చూడాలి ఎన్నికలు సమీపించేనాటికి ఏ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎంతుంటుందో మొబైల్ యాప్ లు, వెబ్ సైట్లు, ఇతర నెట్వర్కుల ద్వారా తేలిపోనుంది. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు, ఓట్లు పోలింగ్ కూడా వచ్చే ఎన్నికల్లో సామాజిక వర్గాల జనగణన మీదే ఆధారపడి ఉండేలా కనిపిస్తుంది..!