అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి పాదపద్మముల సాక్షిగా ఈఎన్ఎస్ లైవ్ యాప్ గుగూల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ అయ్యింది. శ్రావరణ 4వ శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వామివారి పవిత్ర పాదాల వద్ద ఈఎన్ఎస్ లైవ్ యాప్ కు పూజలు చేయించి యాప్ ని అప్లోడ్ చేసి ప్రధాన సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు బాలభాను(బాలు), ఆయన సతీమని సచివాలయ పోలీసు అధికారిణి నాగసత్య శిరీషలు యాప్ ని తొలివార్త అప్లోడ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ ప్రధాన సంపాదకులు బాలు మీడియాతో మాట్లాడుతూ, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పాఠకులకు తాజా వార్తల ఆన్ లైన్ లో అరచేతిలో ఇమిడి యాప్ ద్వారా అందించాలని సంకల్పించామన్నారు. అంతేకాకుండా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ప్రజలే జర్నలిస్టులుగా మారి సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియజేవచ్చునన్నారు. తద్వారా ఆదాయం కూడా పొందే సౌలభ్యం కలుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా చైతన్య పూరిత కథనాలు, న్యూస్ కార్డ్ రూపంలో అందిస్తామన్నారు. స్థానిక సమస్యలను ప్రభుత్వ అధికారుల ద్రుష్టికి కూడా వార్తల రూపంలో తీసుకెళ్లి పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని వివరించారు. యాప్ గుగూల్ ప్లే స్టోర్ లింక్ పదిరోజుల్లో అప్డేట్ అవుతుందన్న ఆయన తరువాత నేరుగా ఆ లింక్ ద్వారా ఎవరైనా యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవచ్చునన్నారు. ప్రజా ప్రతినిధులు, సేవకులు, ఇతర రంగాల్లో ఉన్నవారికి special subscription ద్వారా ఈఎన్ఎస్ లైవ్ కవరేజీ కూడా ప్రారంభించినట్టు బాలు చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి పారాయణం జరిగింది. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు ద్వారకను తలపించాయి. తిరుమలలో టిటిడి నిర్వహిస్తున్న పారాయణ కార్యక్రమం బుధవారం 125వ రోజుకు చేరుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని వ్యాసమహర్షి రచించిన భాగవతంలోని దశమస్కంధం మూడవ ఆధ్యాయంలోని శ్రీకృష్ణుని జననం పారాయణం చేశారు. ఆనంతరం తిరుపతి ఇస్కాన్ నుండి వచ్చిన 20 మంది భక్తులు నామసంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, డెప్యూటీ ఈవోలు హరీంద్రనాధ్, బాలాజి, ఎస్వీ వేద ఉన్నత వేద అధ్యాయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీకృష్ణస్వామివారికి విశేష అభిషేకం -
తిరుమలలో శుక్రవారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.గోగర్భం డ్యామ్ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం 10.00 గంటల నుండి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలివున్న ఉద్యోగాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరపాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అధికారులతో సమీక్షించారు. వారం రోజుల పాటు సచివాలయ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు బొత్స సత్యనారాయణ తెలిపారు. దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఖాళీలు అధికంగా ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని మంత్రులు అధికారులకు సూచించారు. పరీక్షల అనంతరం మొత్తం రెండు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తిచేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామసచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందించాలన్న సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదేశాలు అమలు చేస్తున్నట్టు మంత్రులు చెప్పారు.
విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు సిహెచ్.వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కరోనా వైరస్ ను జయించారు. 15 రోజుల క్రితం వంశీకి కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ కార్యకర్తలకు ఫోను ద్వారా అందుబాటులో ఉండేవారు. నేడు మరోసారి కరోనా టెస్టు చేయడంతో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకున్నాని నిర్ధారించుకున్న తరువాత ఉదయం అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సింహాచల అప్పన్న, అమ్మలు గన్న అమ్మ కనమహాలక్ష్మి, తాను ఎంతో ఇష్టంగా పూజింగే షిర్డీ సాయినాధుడి దయతో కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని వంశీ ప్రకటించారు. రేపటి నుంచి కార్యకర్తలకు, నాయకులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని ఆయన మీడియాకి వివరించారు. కరోనా వైరస్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, బలవర్ధక ఆహారం తీసుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ నుంచి తేలికగా కోలుకోవచ్చుననడానికి తానే ఒక ప్రధాన ఉదాహరణ అని చెప్పారు వంశీ...
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమానికి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో ఆగస్టు 15న పట్టాలు పంపిణీ వుంటుందని ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ ఆ తేదీన పట్టాలు పంపిణీ చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే దానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పేదలకు ఇవ్వాలనుకున్న భూముల విషయం ఒక కొలిక్కి రావకపోవడం, కొన్ని చోట్ల లేవుట్లు పూర్తి కాకపోవడం తదితర కారణాలున్నాయి. దీంతో ప్రభుత్వం ఇళ్లపట్లాల పంపిణీనీ వాయిదా వేసుకుంటూ వస్తుంది. తాజా మరోసారి వాయిదా పడిన ఇంటి పట్టాల పంపిణీ ఎప్పుడదనే త్వరలో ప్రకటిస్తామని మంత్రి క్రిష్ణదాస్ మీడియాకి వివరించారు. ఎంతో ఆశగా పంద్రాగస్టు రోజున పట్టాలు అందుకుందామనుకున్న నిరుపేదలకు మళ్లీ నిరాశే ఎదురైంది...
విశాఖపట్నానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొయ్యా ప్రసాద్ రెడ్డి, విశాఖ కలెక్టరేట్ పేరును, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పేరును ఉపయోగించి ల్యాండ్ డీల్స్.. అంటూ చేస్తున్న కార్యకలాపాలను పార్టీ క్రమశిక్షణ సంఘం తీవ్రంగా పరిగణించింది. కొయ్యా ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును, పార్టీలోని పార్లమెంటు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకుల పేర్లను ఉపయోగించి భూములు, ఇతరత్రా డీల్స్.. అంటూ ఎవరు అక్రమాలకు ఒడిగట్టినా ఇదేవిధమైన తీవ్రస్థాయి క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. కొయ్యప్రసాదరెడ్డిని సస్పెండ్ చేయడం పార్టీలో చర్చనీయాంశం అయ్యింది...
ఎస్ సి, ఎస్ టి , బిసి, మైనార్టీ సామాజిక వర్గాల్లో ఉన్న 45-60 సంవత్సరాల మధ్యగల పేద మహిళలకు ఆర్ధికంగా అండగా నిలబడేందుకు వై ఎస్ ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లి లోని సి.ఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ప రెన్స్ నిర్వహించి, బటన్ నొక్కి మొదటి విడత సహాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేసారు. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళకు ప్రతి ఏటా రూ 18,750/- చొప్పున నాలుగేళ్లలో రూ 75,000/- ఆర్ధిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తం లో దాదాపు 23లక్షల కుటుంబాలకు లబ్దిచేకూరనున్నదని తెలిపారు. మహిళలకు అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలు అందించేలా అమూల్, ఐటిసి, హిందూస్ధాన్ లీవర్, పి & జి లాంటి ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. తద్వారా ఉత్పత్తుల కొనుగోలు తోడ్పాటు, శిక్షణ, వ్యాపార సామర్ధ్యం మెరుగుదల లబిస్తుందని తెలిపారు. విశాఖపట్నం నుండి జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో 194714 మంది లబ్దిదారులు ఎంపికయ్యారని వీరికి నాలుగేళ్లలో రూ.1460 కోట్లు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో 144476 మంది బిసి మహిళలు , 18739 మంది ఎస్ సి మహిళలు , 27210 మంది ఎస్ టి మహిళలు , 4289 మంది మైనార్టీ మహిళలు ఈ పథకం కింద ఎంపికైనారని తెలిపారు. సచివాలయ వ్యవస్ధవలన ఎం ఆర్ ఓ ఆఫీసు ల చుట్టూ తిరిగే శ్రమ తప్పిందన్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమంలో కూడా ఎంపిక అయ్యానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు అరుణ్ బాబు, గోవిందరావు, జి.వి.ఎం .సి కమిషనరు జి.సృజన, డి ఆర్ డి ఎ పి డి విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ పేరును వైస్సార్ జర్నలిస్ట్ భీమాగా(యాక్సిడెంటల్ స్కీమ్) పేరు మార్చింది. ఈమేరకు సమాచారశాఖ ముఖ్యకార్యదర్శి టి.విజయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు వైఎస్సార్ జర్నలిస్టు భీమాగా మరుస్తూ జిఓనెంబరు 1254ను విడుదల చేశారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనికి 42.63 లక్షల బడ్జెట్ ను కూడా ప్రభుత్వ వాటా కింద విడుదల చేశారు. 21వేల మంది వర్కింగ్ జర్నలిస్టులు ప్రస్తుతం ఈ స్కీములో సభ్యులుగా ఉన్నారని, ఒక్కో జర్నలిస్టుకి రూ.203 చెప్పున ప్రభుత్వ షేర్ కింద వర్తిస్తాయని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం కోవిడ్ 19 నియంత్రణకు అన్ని దారులూ వెతుకుతూనే, సులభ పద్దతుల్లో ప్రజలకు కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనా టెస్టుల కోసం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేసింది. వెనువెంటనే ఈ వాహనాల దగ్గర ఇద్దరిద్దరు చొప్పున రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెద్దవాహనాలు దగ్గర ఒకేసారి పరీక్షలు చేయడానికి ఆలస్యం కావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ చిన్న చిన్న వాహనాలు నేరుగా వార్డు దగ్గరకే వెళ్లి రోగులకు పరీక్షలు చేస్తున్నాయి. ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగానే జిజిహెచ్ లోని ప్రధాన ల్యాబ్ నుంచి విడుదల చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, రవాణా, సరఫరా క్రమబద్దీకరణలపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక తవ్వకాలు, లోడింగ్, సరఫరా, డోర్ డెలివరీకి వివిధ స్థాయిల్లో బేస్ రేట్లు నిర్ణయిస్తూ గనుల శాఖకు ఇచ్చినన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓపెన్ రీచ్‌లు, పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకానికి టన్నుకు రూ.90, జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్ రుసుము టన్నుకు రూ.25గా నిర్ధరించారు. ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేయనున్నారు. గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణా టన్నుకు జీఎస్టీతో కలిపి కి.మీ రూ.3.30గా నిర్ణయించారు. డోర్ డెలివరీ కోసం 10కి.మీ లోపు దూరానికి ట్రాక్టర్ ద్వారా టన్నుకు రూ.10, లారీ ద్వారా టన్నుకు రూ.8, పెద్ద లారీకి టన్నుకు రూ.7 వసూలు చేయనున్నారు.
కరోనా వైరస్ నియంత్రణకు ఆయుర్వేద పద్దతులు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రముఖ సామాజిక సేవకులు సానా రాధ అన్నారు. మంగళవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహా విశాఖపరిధిలో రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీరోజూ, పసువు, వేపాకు, తులసి కలిసిన వేడినీటిని ఆవిరి పట్టాలన్నారు. అదే విధంగా రోజంతా బలవర్ధక మైన ఆహారాన్ని తింటూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా వైరస్ చేరడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. వాటితోపాటు మాస్కు, ప్రతీ రెండు గంటలకొకసారి సబ్బుతో చేతులు కడుక్కోవడం, బయటకు వెళ్లినపుడు నాణ్యమైన సానిటైజర్ ను వినియోగించడం చేయాలన్నారు. మనం తీసుకునే జాగ్రత్తలతోనే కరోనా వైరస్ ను జయించడానికి అవకాశం వుంటుందన్నారు. నిమ్మజాతి పండ్లను, నిమ్మరసానాన్ని రోజులో ఒక్కసారైనా సేవించాలని సానా రాధ సూచిస్తున్నారు. ఏమాత్రం కరోనా లక్షణాలున్నా తక్షణమే స్థానిక వార్డు వాలంటీర్ల ద్వారా ఆరోగ్యశాఖకు తెలియజేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చినవారు స్వచ్ఛందంగా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందడానికి సిద్ధంగా ఉండాలన్నారు. లేదంటే వారిపై ఆధారపడిన కుటుంబాలకు వైరస్ సోకే ప్రమాదం వుంటుందన్నారు. ఆరోగ్యసేతు యాప్ ను వినియోగించడంతోపాటు, ఆరోగ్యసిబ్బంది సూచనలను పాటిస్తూ, పరిశరాలను ఎల్లప్పుడూ బ్లీచింగ్ తో పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఏపీలో ఓటర్ల జాబితాల సవరణకు నవంబర్ 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 12, 13 తేదీల్లో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ ప్రకటించారు. ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేకపోయినా ఏటా జరిగే సవరణల్లో భాగంగా తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి 15న తుది జాబితాల ప్రచురణతో ముగుస్తుంది. అక్టోబర్ 31 వరకూ ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, కొత్తపేర్లను చేర్చడం, మృతులను జాబితాలో నుంచి తొలగించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. నవంబర్ 16న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. డిసెంబర్ 15 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5 వరకూ వీటి పరిష్కారం ఉంటుంది. జనవరి 14 వరకూ డేటా బేస్ అప్‌డేట్ చేస్తారు. ఆ తర్వాత జనవరి 15న తుది జాబితా ప్రచురిస్తారు. వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండబోతున్న ఓటర్లు కూడా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకూ ఆన్‌లైన్ లోనూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి వివరించారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు, సేవల కోసం సీఎం వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా అధికారుల నుంచి ప్రజలకు సేవలు మరింత దగ్గరకు చేర్చారు. దీనితో నిర్దేశిత సమయంలోగా వినతుల పరిష్కారంపై మరో కీలక అడుగు పడింది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) కాల్ సెంటర్‌ను సీఎం సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పీఎంయూ అప్రమత్తం చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా పీఎంయూ పనిస్తుంది. మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు. అనంతరం గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. అనంతరం మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని సీఎం ప్రారంభించారు. ఫంక్షనల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులతో సచివాలయాలను అనుసంధానం, చేయాలని ఆదేశించారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు. ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. మిగిలిన సచివాలయాలను వచ్చే 2 నెలల్లో అనుసంధానిస్తామన్న అధికారులు సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా ప్రభుత్వ పథకాలు, మార్గదర్శకాలు అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా వార్డు సచివాలయాల నిర్మాణాలపైనా, అర్బన్ హెల్త్ క్లినిక్స్‌పై అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి) అమలు చేసే విధి విధానాలను తెలుగు రాష్ట్రాల్లోని సమాచార శాఖలో కూడా అమలు చేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో అక్రిడిటేషన్స్ కోసం కేంద్రం రూపొందించిన పిఐబీ నియమనిభందనలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా ఒకే దేశం, ఒకే అంశాన్ని అమలు చేసినట్టుగా కూడా ఉంటుందని గంట్ల అభిప్రాయ పడ్డారు. అక్రిడిటేషన్లు ఖచ్చితంగా ప్రతీ రెండేళ్ల కొకసారి మాత్రమే ఇవ్వాలని, మధ్యలో రెవిన్యువల్ చేయడం ద్వారా వాటి నకలు జర్నలిస్టుల సీనియారిటికీ పనిచేయకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వం పిఐబిలో అమలు చేస్తున్న నియమ నిబంధనలు అమలు చేయడం ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి కూడా ఎంతో పేరు, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిన విధంగా జర్నలిస్టులకు సదుపాయాలు, హెల్త్ పాలసీని కూడా నిర్ధిష్టంగా ప్రకటించాలని శ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు.