తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గానికి ఆదివారం ఉభయ గోదావరి జిల్లాల్లోని 116 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసి, 91.91 శాతం పోలింగ్ నమోదైందని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేసారు. నియోజక వర్గ పరిధిలోని రెండు జిల్లాల్లో నమోదైన మొత్తం 17,467 మంది ఉపాధ్యాయ ఓటర్లుగాను, 16,054 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సరళి - ఉదయం 10 గంటల సమయానికి 14.5 శాతం, మద్యాహ్నం 12 గం.లకు – 43.6 శాతం, 2గం.లకు – 74.71 శాతం, 4 గం.లకు పోలింగ్ ముగింపు సమయానికి 91.91 శాతం నమోదు జరిగిందన్నారు. 7 పోలింగ్ కేంద్రాలలో నూరు శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని 7 రెవెన్యూ డివిజన్ల పరిధిలో నమోదైన మొత్తం 9720 మంది ఉపాధ్యాయ ఓటర్లుకు గాను, 8823 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా జిల్లాలో 90.94 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎటపాక డివిజన్ లోని వి.ఆర్.పురం, పెద్దాపురం డివిజన్లోని గండేపల్లి, రాజమహేంద్ర వరం డివిజన్ లోని కోరుకొండ, సీతానగరం పోలింగ్ కేంద్రాలలో నూరు శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదైన మొత్తం 7,765 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను, 7,231 మంది ఓటు హక్కు వినియోగించకోగా, 93.12 శాతం పోలింగ్ నమోదైదన్నారు. కుక్కునూరు డివిజన్ లోని వేలేరుపాడు, ఏలూరు డివిజన్లోని లింగపాలెం, కొవ్వూరు డివిజన్ లోని ఇరగవరం పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతం పోలింగ్ జరిగిదన్నారు.
ఆదివారం జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికల అబ్జర్వర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సందర్శించి, పోలింగ్ ఏర్పాట్లను, సరళిని పరిశీలించారని తెలిపారు. కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ హాలులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ,తూగో సిహెచ్.సత్తిబాబు వెబ్ కాస్టింగ్ విధానంలో పర్యవేక్షించారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బ్యాక్స్ లను అత్యంత భద్రతా ఏర్పాట్లతో ఆదివారం రాత్రికి కాకినాడ జెఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐఈటిఈ బ్లాకులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించి సాయుధ దళాలు, సిసి కెమేరాల నిఘాతో పటిష్టమైన రక్షణలో ఉంచుతున్నామని జిల్లా కలెక్టర్ మురళీధరెడ్డి తెలిపారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 7-00 ల నుండి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు.
విజయనగరం జిల్లాలో స్థానిక ఎన్నికల కారణంగా రద్దు చేసిన స్పందన ప్రజా వినతుల కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ప్రజల నుంచి యధావిధిగా అర్జీలు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటి వరకూ కార్యక్రమం రద్దు చేశామన్నారు. ఇపుడు ఎన్నికల కోడ్ కూడా పూర్తిగా ఎత్తివేయడంతో యధావిధిగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.
తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగ ముగిసిందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు తో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎం.ఎల్.సి. కు జరుగుతున్న పోలింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలో ఓట్ల లెక్కెంపు ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. లెక్కింపుకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో వెబ్ కేస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షించే విధంగా జిల్లా సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. అదే విధంగా జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గం శాసన మండలి స్ధానానిక జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. జిల్లాలో 67 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలి ఎన్నికకు జరుగుతున్న పోలింగ్ తీరును కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ద్వారా డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు నేతృత్వంలో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభించి, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిందన్నారు. అదే విధంగా ఏజెన్సి ప్రాంతాల్లో ఉ. 8 గంటల నుండి మ. 2 గంటల వరకు జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన యంఎల్ సి ఎన్నికల కంట్రోల్ రూమ్ తో పాటు స్పందన కేంద్రంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబుతో కలిసి పరిశీలించారు. అదే విధంగా కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి పోలింగ్ కేంద్రాన్నికాకినాడ ఆర్డిఓ ఏజి చిన్నకృష్ణతో సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెల్సుకున్నారు. అదే విధంగా ముమ్మిడివరం నగర పంచాయతీ కు సంబంధించి జియంసి బాలయోగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అమలాపురం ఆర్డిఓ హిమాన్షు కౌషిక్ తో కలిసి సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ప్రజలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మంచి గిఫ్ట్ ఇచ్చారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీలతో అత్యధిక సీట్లను గెలిపించారన్నారు. వార్ వన్ సైడ్ అనే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగాయన్న రోజా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాదులో రెస్ట్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు ఇక అక్కడే పరిమితమైతే మంచిదని హితవు పలికారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకంగా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారని వ్యాఖ్యానించిన రోజా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎక్కడున్నారో వెతుక్కొని మరీ ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ఇంత అభిమానం పొందడం సీఎం జగన్‌కే మాత్రమే సాధ్యమైందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా జగన్‌కే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం ఉంటే ఎంతటి ఘన విజయాలు సాధించవచ్చని మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయని రోజా అన్నారు..
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నకల ఫలితాలు 100% సాధించడానికి సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలనకు నిదర్శనమని పట్టణ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో అత్యధిక స్థానాలను గెలుచుకుందని అన్నారు. జగనన్న ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని ప్రజా సంక్షేమ పాలన అందిస్తుందనే దానికి ఈ ఫలితాలే ఒక నిదర్శనమన్నారు. ఈఎన్నికల్లో కష్టపడిన ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్తకు, నాయకుడిని ఆయన అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఇంతటి ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్న మంత్రి 22 నెలల సంక్షేమ సీఎం పాలనకు ప్రజలు ఘన విజయం అందించారన్నారు. పనిచేసే ప్రభుత్వానికి, నిజాయితీ, నిబద్ధతకు ప్రజలెప్పుడూ మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, దౌర్జన్యాలు చేసినా ప్రజలు వైఎస్సార్‌సీపీనే నమ్మారని, ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నామని, ప్రజలపై తనకు నమ్మకం ఉందని జగన్ చెప్పారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ప్రజలు తమవైపే ఉన్నారని సీఎం చెప్పారని మంత్రి వ్యాఖ్యానించారు. మాయ మాటలు, మోసం చేసే వ్యక్తికి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అమరావతి, విశాఖ ఉక్కు అంటూ బాబు రాజకీయం చేయబోయాడని అందుకే ప్రజలు ఆయన ఆలోచనకు బుద్ధి చెప్పారని స్పష్టం చేశారు. తండ్రీకొడుకులు ఎలా మాట్లాడారో రాష్ట్రమంతా చూశారని బొత్స గుర్తుచేశారు.