1 ENS Live Breaking News

సైకిల్ యాత్ర విజయవంతం కావాలి..

రెడ్ క్రాస్ సంస్థ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ప్రారంభమైన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆశాభావం వ్యక్తం చేసారు. రెడ్ క్రాస్ సంస్థ శత జయంతిని పురష్కరించుకొని స్థానిక 80 అడుగుల రహదారి వద్ద సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మంగళవారం ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ ఏ.శ్రీధర్ రెడ్డితో కలిసి  సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ వంద సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సేవా ధృక్పథంతో పనిచేయడంలో రెడ్ క్రాస్ సంస్థ ముందంజలో ఉంటుందని కొనియాడారు. ముఖ్యంగా  కోవిడ్ సమయంలో రెడ్ క్రాస్ సంస్థ వాలంటీర్లు అందించిన సేవలు అనిర్వచనీయమని, సేవా దృక్పథంతో అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. ముఖ్యంగా కోవిడ్ తో మృతిచెందిన వారిని వారి బంధువులు సైతం ముందుకురాని సమయంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు స్వచ్చంధంగా ముందుకు వచ్చి వారి అంత్యక్రియలు నిర్వహించిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. అలాగే వలస కార్మికులు భోజనాలు లేకుండా ఉన్న సమయంలో భోజనాలు అందించారని చెప్పారు. కోవిడ్  పేషెంట్ల కొరకు ప్లాస్మా అవసరమని జిల్లా ప్రజలకు పిలుపునివ్వగా రెడ్ క్రాస్ ముందు వరుసలో ఉండి ప్లాస్మాదానం చేసారని కలెక్టర్ తెలిపారు. ఇవేకాకుండా హోమ్ ఐసోలేషన్లో ఉండే కోవిడ్ పేషెంట్లకు మెడికల్ కిట్లు అందజేశారని కొనియాడారు. రక్తదానం చేయడంలోనూ, రక్తదానం సేకరించడంలోనూ రెడ్ క్రాస్ సంస్థ ముందంజలో ఉంటుందని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నట్లే ఈ సైకిల్ యాత్ర కూడా విజయవంతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  అమిత్ బర్దార్ మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అత్యవసరాలకు సరిపడా రక్తనిధి నిల్వలు లేవని, కావున యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వలన మరింత ఆరోగ్యంగా ఉంటారని గుర్తుచేసారు. రక్తదానంపై చాలామందికి అపోహలు ఉన్నాయని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారు ప్రతీ 6 మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని యస్.పి తెలిపారు. రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ ఏ.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి లేదని, త్వరలో శ్రీకాకుళంలో  క్యాన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగిందని, సైకిల్ యాత్రలో అందరూ పాల్గొనవచ్చని చెప్పారు. సైకిల్ యాత్ర ఈ నెల 25వరకు కొనసాగుతుందని, ఈ యాత్రలో పాల్గొన్నవారందరికీ ఈ నెల 25న అమరావతిలో గౌరవ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రసంశా పత్రాలను అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రదేశాల్లో యాత్రా సభ్యులతో సభలు నిర్వహించి రక్తదానం, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం, మోటారు వాహనాల వినియోగం తగ్గింపు, కరోనా నివారణ చర్యలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ సైకిల్ యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి.జగన్మోహన్ రావు, రాష్ట్ర రెడ్ క్రాస్ ట్రెజరర్ వెంకటేశ్వరరావు , సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు,  డా.డి.విష్ణుమూర్తి, స్వచ్ఛంధ సంస్థల డైరక్టర్లు గీతా శ్రీకాంత్, నూక సన్యాసి రావు, రమణ మూర్తి, ఎం. ప్రసాద రావు, సామాజిక కార్యకర్త మంత్రి వెంకట స్వామి, ఫణి, డా.శ్రీరాములు, ఇంటాక్ కన్వీనర్ కె. వి. జె. రాధా ప్రసాద్, సురంగి మోహన్ రావు, నిక్కు అప్పన్న, బలివాడ మల్లేశ్వర రావు, గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-03-16 19:39:23

టెండరులో లారీ యజమానులు పాల్గోవాలి..

పౌరసరఫరాల శాఖకు సంబంధించి స్టేజ్ -1 మూమెంట్ ట్రాన్స్ పోర్టేషన్  టెండర్ ప్రక్రియలో లారీ ఓనర్స్ ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి లక్ష్మీ శ లారీ ఓనర్స్ ప్రతినిధులను ఆదేశించారు.  మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసి లక్ష్మి శ స్టేజ్ - 1 ట్రాన్స్ పోర్టేషన్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ,సివిల్ సప్లై అధికారులు, లారీ ఓనర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ బఫర్ గోడౌన్ నుంచి మండల స్థాయి గోడౌన్ లకు  బియ్యం పంపిణీలో లారీ ఓనర్స్ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు.బియ్యం తరలింపు ట్రాన్స్పోర్ట్ ,సివిల్ సప్లై అధికారులు, లారీ ఓనర్స్ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన తెలిపారు. స్టేజ్ -1 మూమెంట్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి లారీ ఓనర్స్ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని రెండు రోజుల్లోగా తమ నిర్ణయాన్ని తెలియపరచాలని జేసి లారీ ఓనర్స్ కు సూచించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై డీఎం ఈ లక్ష్మి రెడ్డి ,ఆర్టీవో ఆర్ సురేష్, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబ్జి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Kakinada

2021-03-16 19:30:13

మహీధర కెమికల్స్ ‌రూ.10 లక్షల విరాళం..

ఆంధ్రవిశ్వవిద్యాలయానికి మహీధర కెమికల్స్ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌రూ 10 లక్షలు విరాళంగా అందించింది. మంగళవారం ఉదయం సంస్థ ప్రతినిధి, పర్చేజ్‌ ‌మేనేజర్‌ ఎం.‌సూర్య నారాయణ రాజు సంస్థ తరపున రూ 10 లక్షల చెక్‌ను ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌కు అందజేశారు. ఈ నిధులను ఏయూలో ఏర్పాటు చేస్తున్న ఇంక్యుబేషన్‌ ‌సెంటర్‌లో యుటిలిటీ సెంటర్‌ ఏర్పాటుకు వెచ్చించాలని వీరు కోరారు. విశ్వవిద్యాలయం చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమాలకు తమ వంతు సహాకారంగా దీనిని అందించామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులను ఆవిష్కర్తలుగా, యువ పారిశ్రామిక వేత్తలుగా నిలపే కార్యక్రమాలకు తాము సహకారం అందించడం ఆనందాన్నిచ్చిందన్నారు. తమ సంస్థ సామాజిక బాధ్యతగా ఉన్నత విద్యను, యువతను ప్రోత్సహించే ఉద్దేశంగా దీనిని అందించామన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఉపయుక్తంగా నిధులు అందించడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు వర్సిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సైతం మరింత సహకారం అందిస్తూ, వర్సిటీ ప్రగతిలో భాగం కావాలని కోరారు.

Andhra University

2021-03-16 19:18:09

అభివ్రుద్ధి మరింతం వేగంగా జరగాలి..

ప్రభుత్వ, అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లతో క్యాంప్ కార్యాలయం నుండి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఉపాధిహామీ పథకం, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, డా. వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ లు (గ్రామీణ), ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల ప్రారంభం పురోగతి, నాడు – నేడు, స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలు, మల్టీ పర్పస్ వినియోగంపై భూ సేకరణ, వైద్య కళాశాలలు, రహదారులు, భవనాలు, వై.యస్ఆర్. భీమా, జగనన్న తోడు, వై.యస్.ఆర్. చేయూత మరియు వై.యస్.ఆర్ ఆసరా పురోగతి, రబీ ప్రొక్యూర్ మెంట్, ఖరీఫ్ ప్రిపరేషన్, జగనన్న విద్యా దీవెన, వాలంటీర్ ఫెసిలిటీస్, వాలంటీర్ ఫెలిసిటేషన్, తదితర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఎస్.పి. బి. కృష్ణారావు, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ జె.డి. రమణమూర్తి, వ్యవసాయ శాఖ జె.డి. లీలావతి, జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, మెప్మా పిడి శ్రీనివాసరావు, పంచాయితిరాజ్ ఎస్.ఇ. సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-16 19:12:02

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి..

విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఘనంగా మంగళవారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు వదిలిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అలాంటి మహానుబావులను బావి తరాలు స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు రమణమూర్తి, డిసిఓ ఎండి మిల్టన్, కలెక్టర్ కార్యాలయ ఎఓ రామమోహనరావు, వివిధ విభాగాల పర్యవేక్షులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-03-16 19:06:25

పొట్టి శ్రీ‌రాములు త్యాగ‌నిర‌తి స్ఫూర్తి దాయ‌కం..

ఆంధ్ర‌రాష్ట్ర అవ‌త‌ర‌ణ కోసం ప్రాణ‌త్యాగం చేసిన అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు త్యాగ‌నిర‌తి స్ఫూర్తిదాయ‌క‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కొనియాడారు. ఆయ‌న చేసిన త్యాగం చ‌రిత్ర‌లో శాశ్వ‌తంగా నిలిచి ఉంటుంద‌ని పేర్కొన్నారు. పొట్టి శ్రీ‌రాములు జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శ్రీ‌రాములు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, చ‌రిత్ర పుట‌ల్లో కొంద‌రికి మాత్ర‌మే శాశ్వ‌త స్థానం ల‌భిస్తుంద‌ని, అటువంటి అరుదైన వ్య‌క్తుల్లో పొట్టి శ్రీ‌రాములు ఒక‌ర‌ని పేర్కొన్నారు. తెలుగువారి మ‌న‌సులో శ్రీ‌రాములు చిర‌స్మ‌ర‌ణీయ స్థానాన్ని స‌ముపార్జించార‌ని కొనియాడారు. ఆయ‌న ధైర్య సాహ‌సాలు ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. అందుకే శ్రీ‌రాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టి గౌర‌వించుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.               జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, పొట్టి శ్రీ‌రాములు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి,  బిసి కార్పొరేష‌న్ ఇడి ఆర్‌వి నాగ‌రాణి, ఎస్‌సి కార్పొరేష‌న్ ఇడి ఎస్‌.జ‌గ‌న్నాధ‌రావు, జిల్లా స‌హ‌కార అధికారి ఎస్‌.అప్ప‌ల‌నాయుడు, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ ఎడి డి.ర‌మేష్‌, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ జె‌.ర‌వికుమార్‌, ప‌ర్య‌ట‌కాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, క‌లెక్ట‌రేట్ ఏఓ దేవ్ ప్ర‌సాద్‌; ఇత‌ర అధికారులు, వివిధ శాఖ‌ల సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-16 18:38:33

18న జీవిఎంసీ మేయర్ ఎన్నిక..

మహా విశాఖ నగరపాలక సంస్థ మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలు మార్చి 18న జరుగనున్నాయని విశాఖజిల్లా కలెక్టరు,ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వి. వినయ్ చంద్ చెప్పారు. ఈ విషయమై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం జి.వి.యం.సి. సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. తేది.18-03-2021న ఉదయం 11గం. లకు నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఎన్నికైన వార్డు మెంబర్లు తప్పనిసరిగా తమ ఎన్నికల ధృవీకరణ పత్రంతో మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలకు హాజరుకావలసి ఉంటుందని కలెక్టరు తెలిపారు.  ఈ సమావేశంలో జిల్లా కలక్టరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి  ఆదేశాల మేరకు మార్చి 18 వ తేదీన జి.వి.యం.సి.లో మేయరు, డిప్యూటీ మేయరు పదవులకు జరుగుచున్న ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన 98 మంది వార్డు మెంబర్లు మరియు 15 మంది ఎక్ష్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 113 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు.  ఈ ఎన్నికలలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన బి.జె.పి, సి.పి.ఐ, సి.పి.ఐ(ఎం), టి.డి.పి, వై.ఎస్.ఆర్.సి.పి.లు విప్ జారీ చేయవలసి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివరాలతో కూడిన అనుబంధం పత్రాలు- 1, 2, 3 (Annexure – I, II & III) మరియు మేయరు, డిప్యూటీ మేయరు అభ్యర్ధులను నామినేట్ చేసేందుకు సంబంధించిన “ఎ” & “బి” ఫారాలును (Form “A”&“B”) నిర్ణీత సమయంలో సంబంధిత జి.వి.యం.సి. అధికారులకు  అందజేయ వలసినదిగా కలెక్టరు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సజావుగా నిర్వహించేటట్లు చూడాలని అదనపు కమీషనర్లు పి. ఆషా జ్యోతి, ఎ.వి. రమణిలను కలెక్టరు ఆదేశించారు. ఈ సమావేశంలో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్. విజయానందరెడ్డి(బి.జె.పి), బి. గంగారావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్ (సి.పి.ఐ.(ఎం). పాసర్ల ప్రసాద్ (టి.డి.పి.), తైనాల విజయ్ కుమార్ (వై.ఎస్.ఆర్.సి.పి), అదనపు కమీషనర్లు పి. ఆషాజ్యోతి, ఎ.వి.రమణి, వ్యయ పరిశీలకులు వై.మంగపతిరావు, సెక్రటరీ లావణ్య,, జి.వి.యం.సి. సలహాదారు జి.వి.వి.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-03-16 18:32:25

ICDS ప్రాజెక్టు డైరెక్టర్ గా జివి.సత్యవాణి..

తూర్పుగోదావరి జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నూతనంగా భాద్యతలు స్వీవకరించిన జివి. సత్యవాణి మంగళవారం ఉదయం  కలెక్టర్ కారాల్యయంలో కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్లు జి లక్ష్మీశ , కీర్తి చేకూరి, జి రాజకుమారి లను మర్యాదపూర్వకంగా కలిసారు.జివి సత్యవాణి డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉపాధి, శిక్షణ సొసైటీ - ఏలూరు , పశ్చిమ గోదావరి ( SETWEL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తూ  స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో  మాట్లాడుతూ జిల్లాలో వివిధ పదవుల్లో పని చేయడంతో జిల్లా పై పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ అనుభవంతో ఐసీడీఎస్ ద్వారా మరిన్ని సేవలను అందించి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు క్రుషి చేస్తానని అన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుస్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.

Kakinada

2021-03-16 17:39:14

వినియోగదారులు చైతన్యమే ముఖ్యం..

వినియోగదారుడు తమ హక్కులపై అవగాహన కలిగివుండాలని, నేడు మనం జరుపుకుంటున్న  ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ముఖ్యవుద్దేశ్యమని జిల్లా పౌరసరఫరాల అధికారి శివరామ్ ప్రసాద్ సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక సి.ఎల్.ఆర్.సి.భవనంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని  పౌరసరఫరాలు , తూనికలు కొలతలు, ఫుడ్ సేఫ్టీ శాఖలు నేడు సంయుక్తం వినియోగదారులకు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిధిగా జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు రాజారెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు. జిల్లా వినియోగదారుల ఫోరమ్, అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో  వినియోగదారునికి అన్యాయం జరిగితే అతని నిరసన పోరాటంతో అక్కడ చట్టాలుగా 1962 లో రూపుదిద్దుకోవడం, వినియోగదారుని ప్రాముఖ్యత, అవసరాలు గుర్తించి ప్రపంచవాప్తంగా యు.ఎన్.ఓ. 1968 నుండి మార్చి 15 నుండి   అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. మనదేశం 1986 లో డిసెంబర్ 24 చట్టం తెచ్చి హక్కులను కాపాడటం జరుగుతున్నదని అన్నారు. వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత లోపిస్తే, పోరంను ఆశ్రయించి 30 రోజుల్లో పరిష్కారం చేసుకోవచ్చని రూ.5 లక్షల విలువ వరకు ఫీజు కూడా లేదని, కోటి రూపాయల విలువ అయితే జిల్లానుండే కేసు నమోదు చేయవచ్చని  అవగాహన కలిగియుండాలని అన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఉచితంగా వచ్చే వస్తువులు తప్ప కొనుగోలు చేసిన వస్తువులు అది ప్రభుత్వం అయినా ప్రవేటు కంపెనీలయైనా హక్కులకోసం ఆశ్రయించ వచ్చని తెలిపారు. నేడు ప్రధానంగా అవగాహనతో పాటు ప్లాస్టిక్ వల్ల జరిగే అనార్థాలు, చట్టాలు చేసినా మనం మారాల్సివుందని, ఆరోగ్యమే లక్ష్యంగా వుత్పత్తులు వుండాలని అన్నారు.  తూనికలు, కొలతల అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ వివరిస్తూ తూనికల్లో మోసాలు జరిగితే తెలుపవచ్చని, శాఖ పరంగా తరచూ దుకాణాల్లో దాడులు చేసి కేసులు నమోదు చేసి వినియోగదారుడు నష్టపోకుండా చూస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన లీగల్ మెట్రాలజీ సాదారణ , ఎలక్ట్రానిక్ తూనికలు , త్రాసులు, లీటర్లు వంటీవి హాజరయిన వినియోగదారులకు మోసపోకుండా వుండే విధానం వివరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారిని హరిత మాట్లాడుతూ తినే  ప్రతి వస్తువుకు ఒక నిర్దేశిత కాలం వుంటుందని అది మీరుకొనే వస్తువుల పాకింగ్ పై నమోదు చేసివుంటుందని వినియోగదారుడు గమనించి కొనుగోలు చేయాలని, హోటల్ ఫుడ్ విషయంలో జాగ్రత్త వహించాలని, అక్కడ సరిలేకుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అప్పుడే వారికీ జరిమానా, శిక్షలు పడే అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమలో సహాయ పౌర సరఫరాల అధికారులు  తిరుపతి ఝాణ్శీ లక్ష్మి స్వాగతోపన్యాసం చేసి ప్లాస్టిక్ అనార్థాలను వివరించగా, చిత్తూరు వెంకట్రామ్, సి.ఎస్.డి.టి.లు చంద్రిక, సురేంద్ర  అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-03-15 22:47:04

మంచినీటి ఎద్దడి నివారణకు కార్యచరణ ..

వేసవిలో గ్రామంలో త్రాగునీటి సమస్యలు ఏర్పడకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా పంచాయితీ అధికారి పి.సాయిబాబు అన్నారు. సోమవారం జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిపివో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో 981 గ్రామ పంచాయితీలు ఉన్నాయని 455 మంచినీటి చెరువులు ఉన్నాయని వేసవిలో త్రాగునీటి సమస్య ఏర్పడకుండా అవన్ని ముందుగా త్రాగునీటితో నింపాలని ఆయా గ్రామ కార్యదర్శులు, ఎంపిడివోలను ఆదేశించినట్లు తెలిపారు. ఇరిగేషన్ డిపార్టుమెంట్ ప్రకాశం బ్యారేజీ నుండి కెఇబి కెనాల్, బందరు కెనాల్, ఏలూరు కెనాల్, రైవస్ కెనాల్ 4 ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా రబి సీజన్ మరియు త్రాగునీటి అవసరాలకు 3521 క్యూసెక్కుల నీటిని ప్రతి ఏడాది విడుదల చేస్తుంటారని, ఈ విధంగా విడుదల చేసిన వాటర్ తో గ్రామాల్లో చెరువులు నింపాలని త్రాగునీటి పధకాల మోటార్లు రన్నింగ్ కండిషన్‌లో ఉంచాలని, చెరువుల్లో నీటి నిల్వ సామర్ద్యం పెంపునకు పూడికలు తీయించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే నెల 22 వరకు నీటిని విడుదల చేస్తారని అన్నారు. గ్రామాల్లో ఎక్కడైన త్రాగునీటి సమస్య ఏర్పడితే జిల్లా పంచాయితీ అధికారి సెల్ 9849903225 నెంబరుకు ఫోన్ చేయాలని వెంటనే స్పందించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తామని డిపివో అన్నారు.

Machilipatnam

2021-03-15 20:51:27

స‌హ‌కార సంఘాల బ‌లోపేతానికి కృషి..

వీలైనంత మేర స‌భ్య‌త్వాల‌ను ఎక్కువ సంఖ్య‌లో న‌మోదు చేయ‌టం ద్వారా స‌హ‌కార సంఘాల బ‌లోపేతానికి కృషి చేయాల‌ని జేసీ కిశోర్ కుమార్ పిలుపునిచ్చారు. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా సాంకేతిక‌త‌ను ఆహ్వానించి, సేవ‌ల‌ను సుల‌భ‌త‌రం చేయాల‌ని పేర్కొన్నారు. స‌హ‌కార సంఘాల భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై స‌మీక్షించే నిమిత్తం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జ‌రిగిన స‌మావేశంలో జేసీ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో స‌హ‌కార సంఘాల‌ను బ‌లోపేతానికి ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌ష్టి బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఇప్పుడున్న 1,38,296 స‌భ్య‌త్వాల సంఖ్య‌ను మ‌రింత పెంచాల‌న్నారు. స‌హ‌కార సంఘాలు ఆర్థిక ల‌బ్ధి కోసం కాకుండా రైతుల శ్రేయ‌స్సు కోసం ప‌‌ని చేయాల‌ని పేర్కొన్నారు. ఒక వైపు ఆర్థికంగా నిల‌దొక్కుకుంటూ.. మ‌రో ప‌క్క రైతుల‌కు ఉన్న‌తంగా సేవ‌లందించాలని హిత‌వు ప‌లికారు. స‌భ్య‌త్వాల న‌మోదు విష‌యంలో నిజ‌మైన రైతుల‌కు అవ‌కాశం క‌ల్పించి ప్ర‌యోజ‌నాలు క‌ల్పించాల‌ని చెప్పారు. రాజ‌కీయ‌ప‌ర‌మైన ఉద్దేశంతో స‌మూహాల‌ను తీసుకొచ్చి స‌భ్య‌త్వాలు ఇవ్వాల‌ని ఎవ‌రు కోరినా.. సున్నితంగా తిర‌స్క‌రించాలన్నారు. రుణాల మంజూరు విష‌యంలో సుల‌భ‌త‌ర విధానాల‌ను అనుస‌రించాలని సూచించారు. సేవ‌ల‌ను త్వ‌ర‌గా.. క‌చ్చితంగా ఇవ్వాలంటే సాంకేతిక‌త ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబించాల‌ని చెప్పారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘాల్లో రికార్డుల‌ను, ఇత‌ర జాబితాల‌ను కంప్యూట‌రీక‌ర‌ణ చేయాల‌ని, అప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మీక్ష‌లు చేసేందుకు ప్ర‌యాస‌లు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రుణాల మంజూరు, రుణాల సేక‌ర‌ణ‌, ఆడిట్, ఇత‌ర వ్య‌య‌, ఆదాయ‌ వివ‌రాల‌ను డిజిట‌లైజేష‌న్ రూపంలో పొందుప‌ర‌చాల‌‌ని సూచించారు. స‌హ‌కార సంఘాల్లో స‌భ్య‌త్వానికి ఎంట్రీ ఫీజుతో క‌లిపి రూ.330 చెల్లించాల్సి ఉంటుంద‌ని, దాని ఆధారంగానే భవిష్య‌త్తులో ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌డానికి వీలవుతుంద‌ని జిల్లా కో-ఆప‌రేటివ్ అధికారి ఎస్‌. అప్ప‌ల‌నాయుడు తెలిపారు. కార్య‌క్ర‌మంలో సెంట్ర‌ల్ బ్యాంకు సీఈవో జ‌నార్థ‌న్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-15 20:45:22

ప్లాస్టిక్ నియంత్రణతో జీవ కోటి మనుగడ..

స‌గ‌టు పౌరుడిగా.. వినియోగ‌దారుడిగా ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ జి.సి. కిశోర్ కుమార్ పేర్కొన్నారు. "ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గిద్దాం.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుదాం" అ‌ని పిలుపునిచ్చారు. అంత‌ర్జాతీయ వినియోగ‌దారుల హ‌క్కుల‌ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని వి.టి.అగ్ర‌హారంలోని మ‌హిళా ప్రాంగ‌ణంలో సోమ‌వారం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌తి వినియోదారుడు త‌మ హ‌క్కుల గురించి తెలుసుకోవాల‌ని సూచించారు. త‌ద్వారా మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. రోజువారీ వినియోగంలో భాగంగా వివిధ వ‌స్తువులు కొంటుంటామ‌ని, మోసాల‌కు గురి కాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. ఒక మంచి ప‌ని అనేది మ‌న నుంచే ప్రారంభం కావాలి.. దానికి ఈ రోజు నుంచే కంక‌ణం క‌ట్టుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గించి ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌టంలో భాగస్వాముల‌వ్వాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో డీఎస్‌వో ఎం. పాపారావు, డిప్యూటీ డీఎం&హెచ్‌వో ఎస్‌. ర‌మ‌ణారావు, లీగ‌ల్ మెట్రాల‌జీ విభాగ డిప్యూటీ కంట్రోల‌ర్ ఎన్‌. జ‌నార్ధన్‌, ఫుడ్ సేప్టీ ఆఫీస‌ర్ ఈశ్వ‌రి, విజ‌య‌నగ‌రం త‌హ‌శీల్దార్ ప్ర‌భాక‌ర్‌, సివిల్ సప్లై డీటీ జ‌గ‌న్‌, జిల్లా వినియోగ‌దారుల స‌మాచార కేంద్రం ఇన్‌ఛార్జి చ‌ద‌ల‌వాడ ప్ర‌సాద్‌, ఇత‌ర విభాగాల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-15 20:44:13

అంతరాత్మే ఇక ప్రధాన ప్రతిపక్షం..

ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు అది తప్పా ఒప్పా అని పలుమార్లు యోచిస్తామని తమ అంతరాత్మే ఇక ప్రధాన ప్రతిపక్షమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వ్యాఖ్యానించారు.  సోమవారం ఉదయం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో విలేకరులతో మంత్రి పేర్ని నాని విలేకరులతో పిచ్చాపాటిగా  మాట్లాడుతూ,  మీకు ఇక ప్రతిపక్షమే లేకుండా  పోయిందని ఒక విలేకరి చమత్కరించగా, ఈ విజయం మా పార్టీ  మీద ప్రజలు  పెట్టుకున్న నమ్మకాన్ని  సూచిస్తుందని, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పని చేయడానికి, అన్ని డివిజన్లలో సమస్యల పరిష్కారం పట్ల బాధ్యతను మరింతగా పెంచిందని ఇకపై తమ అంతరాత్మే  ప్రతిపక్షమని, పాత్రికేయులు సైతం ఏదైనా వార్త రాసే ముందు అది తప్పా ఒప్పా అని పలుమార్లు  ఆలోచించాలని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని సూచించారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంపై మంత్రి పేర్ని నాని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైస్సార్సీపీ పట్ల రాష్ట్రప్రజలు చూపిన విశేష ఆదరణకు ఇది ఒక కొలబద్దని తెలిపారు ప్రజా సంక్షేమమే ద్యేయంగా ముఖ్యమంత్రిగా జగన్ సుపరిపాలనకు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వానికి ఈ గొప్ప విజయం ప్రజలు ఇచ్చిన అపురూప బహుమతని వినమ్రంగా పేర్కొన్నారు.         రాబోయే రెండేళ్లలో మచిలీపట్నంలో 70  ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఏప్రిల్  మాసాంతంలో వైద్య కళాశాల శంఖుస్థాపనకు ముఖ్యనంత్రి జగన్మోహనరెడ్డి మచిలీపట్నం రానున్నట్లు తెలిపారు. దీనితో పాటు 100 సీట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు పక్కా భవనం నిర్మిస్తామని చెప్పారు. వచ్చే జూలై మాసం నుండి మచిలీపట్నం నగరపాలకసంస్థ పరిధిలో విద్యుత్ కు అంతరాయం కల్గించకుండా  ప్రతిరోజు త్రాగునీరు అందించనున్నట్లు  ఇందుకోసం 45 కోట్ల రూ.లు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా అంగీకరించారని  ఎన్నికల కోడ్ను ముగిశాక ఆ నిధులు విడుదల అయిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. మచిలీపట్నం జోన్లుగా విభజించి ప్రతిరోజు త్రాగునీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.కుల,మత,పార్టీలకతీతంగా అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వం ఇదేనన్నారు.  

Machilipatnam

2021-03-15 20:39:43

రద్దుచేసిన రైళ్లను తక్షణమే నడపండి..

మచిలీపట్నం-విజయవాడ మచిలీపట్నం-గుడివాడ,మచిలీపట్నం-విశాఖపట్నం ల మధ్య నిలిపివేసిన గత సంవత్సరంగా నిలిపివేసిన పాసింజర్ రైళ్లను వెంటనే పునరిద్దరించి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కన్సల్టెటివ్ సభ్యుడు,సీనియర్ పాత్రికేయుడు చలాది పూర్ణచంద్ర రావు రైల్వే శాఖ ఉన్నత అధికారులకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దానిని సోమవారం మీడియాకి విడుదల చేశారు. ఈ పాసింజర్ రైళ్ల ద్వారా పేద ప్రయాణీకులు,ఉద్యోగులు,విద్యార్థులు,ఇతర చిరు వ్యాపారులకు ఎంతో సౌక్యర్యంగా ఉండేవని పేర్కొన్నారు. నిలిపివేసిన తరువాత నేటికీ వాటిని పునరుద్దరించలేదన్నారు.  ఒకప్రక్క ఆర్టీసీ బస్సులు, దూర ప్రయాణీకుల రైళ్లు ఇతర ప్రైవేట్ రవాణా వాహనాలు యధా విధిగా నడుస్తుండగా ఇంకా పాసింజర్ రైళ్లు నడపకపోవటంతో ప్రయాణ సౌకర్యం లేకపోవడం వలన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థులు,చిరు వ్యాపారులు,ఉద్యోగులు పేద మధ్యతరగతి ప్రయాణీకుల మీద ఆర్థికభారం పడుతున్నదన్నారు.  అన్ని రకాల వాహనాలు, స్కూళ్ళు,కార్యాలయములు యధావిధిగా నడుస్తుంటే ఇంకా పాసింజర్ రైళ్లు నడపకపోవటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. అలాగే మచిలీపట్నం -తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుని కూడా పునరిద్దరించాలని పూర్ణచంద్ర రావు ఆ ప్రకటనలో అధికారులను కోరారు.

Machilipatnam

2021-03-15 20:32:51

రేపు పొట్టి శ్రీరాములు జయంతి జరపండి..

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. మార్చి 16న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురష్కరించుకొని ఈ ఉత్సవాలను జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, ఉత్సవాలను నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.

Srikakulam

2021-03-15 20:21:13