ఆంధ్రప్రదేశ్ లో సుమారు 11 సంవత్సరాల తరువాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై హాట్ హాట్ గా ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలు వెలువడుతున్నాయి. అదే స్థాయిలో నేతలు కూడా గట్టిగానే పందాలు కడుతున్నారు. దానికి కారణం ఒక్కటే విశాఖలోని స్టీల్ ప్లాంట్ దేశంలోనే ఒక సూపర్ ఐకాన్ గా ఇప్పటి వరకూ వెలుగొందుతూ వుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 34 కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నామని ప్రకటించడం, అందులో ముందుగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించడంతో ఈ ఎగ్జిట్ పోల్స్ కి మరింత ఊతం చేకూరింది. దానికితోడు తెలుగు దేశం పార్టీ కూడా ఈసారి ఎన్నికలను చాలా చోట్ల అభ్యర్ధులను బరిలో నిలబెట్టి కాస్త ప్రతిష్గాత్మకంగానే తీసుకుంది. అధికార పార్టీ వైఎస్సార్సీపీ చెప్పనక్కర్లేదు. గద పదేళ్ల నుంచి పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న చాలా మందికి ఈ సారి అన్ని మున్సిపాలిటీల పరిధిలో కార్పోరేటర్ అభ్యర్ధులుగా అవకాశం కల్పించి బరిలోకి దించింది. హోరా హోరీ ప్రచారం అనంతరం మున్సిపల్ ఎన్నికలు కూడా సజావుగా జరిగిపోయాయి. ఇక బరిలో వున్న అభ్యర్ధులపై అదే స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకున్న తరుణంలో చాలా మంది అభ్యర్ధులు కూడా అభ్యర్ధుల గెలుపు ఓటములపై భారీగానే పందాలు కాసినట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మభ్య పెట్టడంతోపాటు, విశాఖ సెంటిమెంటుపై రాజకీయమనే ఆయింటుమెంటు పూశారనే కోణంలో సోషల్ మీడియాలో గట్టిగానే వార్ జరిగింది. ఈ క్రమంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ద్రుష్టి మొత్తం విశాఖపైనే పడింది. పార్టీలకు చెందిన పెద్ద ముఖ్య నేతలు విశాఖలో తమ ప్రచారాన్ని చేపట్టారు. అధికారపార్టీకి సైతం రాష్ట్రంలో ఉన్న చాలా సామాజిక మంత్రులు కూడా చేరుకొని చాలా పెద్దసంఖ్యలోనే ప్రచారం నిర్వహించి ఎన్నికలు జరిపించారు. బరిలో వున్న అభ్యర్ధులు కంటే ఈ సారి వారి తరపున ప్రచారం చేయడానికి మహా మహులంతా విశాఖ రావడంతో ఎగ్జిపోల్స్ కి మరింత ఊతం ఏర్పడి 60-40, 50-50, 70-30, 40-60 రేషియోలో పందాలు కాస్తున్నట్టు జోరుగానే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకటించిన తరుణంలో ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఇన్చార్జి మంత్రులు, మంత్రులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు ఆఫ్ ది రికార్డ్ రెఫరెండంగా పెట్టారని సమాచారం. ఈ క్రమంలో పందాలకు పోటీ పెరిగి భారీస్థాయిలోనే బెట్టింగులు కట్టారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇచ్చిన టార్గెట్లును అధిగమించకపోతే వచ్చే ఎన్నికల్లో చాలా మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, టిక్కెట్లు కూడా దక్కవనే కోణంలో అసత్యప్రచారాలకు కొన్ని ప్రాంతాల్లో తెరతీయడం చర్చనీయాంశం అవుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిట్ పోల్స్ కి అనుగుణంగా ఫలితాలు వస్తే పరిస్థితి ఏంటనే దానిపై కూడా గట్టిగానే వాదనలు నడుస్తున్నాయని చెబుతున్నారు. అసత్య ప్రచారాలు, చర్చావేదికలు, గూఢచర్య లెక్కింపులు, సామాజిక ఓటు బ్యాంకు, ఇలా అన్నికోణాల్లోనూ లెక్కలు వేసినా అధికార పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయనేది ప్రస్తుతం టాక్. ఈ టాక్ రేపటి నుంచి ఎలాంటి మలుపులు తిరిగి ఏ స్థాయి ప్రచారానికి తెరలేపుందనేది అందరిలోనూ ఉత్కంఠను కలిగిస్తోంది..!
ఆరోగ్య భారత్ ఆవిష్కరణకు ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా ముందుకురావాలని శ్రీకాకుళం జిల్లా నెహ్రు యువక కేంద్రం సమన్వయ అధికారి డి.శ్రీనివాసరావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 ఏళ్ల జయంతి ఉత్సవాల సందర్భంగా ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 60 రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర యువజన మంత్రిత్వశాఖ వారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఈ ఫిట్ ఇండియా అవగాహన కార్యక్రమాలను చేపడతున్నామని ఆయన వెల్లడించారు. వచ్చే నెల 20 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు నడక పోటీలు,యోగా, సైకిల్ ర్యాలీ లు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి. ఇందిరా ప్రసాద్,కూన వెంకట రమణ మూర్తి,గురు ఆనంద రావు,ఎం.మల్లిబాబు,జర్నలిస్టుల ఐక్యవేదిక కన్వీనర్ శాసపు జోగి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శనీయమూర్తిమత్వం, ఆదరణీయ వ్యక్తిత్వం, ఆచరణీయ మానవ విలువలు కలబోత కీర్తిశేషులు ధర్మాన రామలింగంనాయుడు శతజయంతి ఉత్సవాలను ఈ నెల 16 నుంచి ఏడాది పాటు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. గురువారం మబగాంలో రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ విశ్రాంత కమిషనర్ డాక్టర్ దీర్ఘాశి విజయభాస్కర్ అధ్యక్షతన జరిగిన శతజయంత్యుత్సవాల సన్నాహక సమావేశంలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్వర్గీయ రామలింగంనాయుడు సూరేళ్ల జ్ఞాపకాలకు వారు నడచిన ఈ నేల నివాళులలర్పిస్తోందని అన్నారు. ఆయన మంచి ఆంగ్లభాషాభిలాషి సంస్కృత భాషా పిపాసిగా గుర్తింపు పొందారని తెలిపారు. రంగస్థల కళలపట్ల ఆయన ఎంతో మక్కువ చూపించేవారని, వారి ఔన్నత్యాన్ని సేవానిరతిని స్మరించుకోవడం లో భాగంగా ధర్మాన ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తన తండ్రి శతజయంతి ఉత్సవాల నిర్వహణ ఉంటుందన్నారు. ఈనెల 16న మంగళవారం ఉ దయం 9.45 గంటలకు ముద్దాడ కృష్ణవేణి దీపారాధనతో మొదలయ్యే ఈ ఉత్సవాలలో గుమ్మా నగేష్ శర్మ పర్యవేక్షణలో 21 మంది రుత్విక శ్రేష్టులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య సారధ్యంలో జరిగే శోభాయాత్రలో మబుగాం పురవీధుల నుండి నాదస్వర విన్యాసాలు, చెంచుబాగోతం, వాలీ-సుగ్రీవుల యుద్ధం, డప్పువాయిద్యాలు, తప్పెటగుళ్లు కోయిన్ృత్యాలు తదితర చిక్కోలు జానపద కళారీతుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన రోజున సాయంత్రం ఆరు గంటల సభాకార్యక్రమం, అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు సాంస్కృతిక విభావరి నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో టేకు వీరభద్రాచారి, మర్రివలప హరిబాబులచే గయోపాఖ్యానం యుద్ధ సన్నివేశం, పెద్దింటి రామ్మోహనరావు దుర్యోధన ఏకపాత్ర, సరస్వతి నాటక కళాసమితి సత్యహరిశ్చంద్ర వారణాశి ఘట్టం ప్రదర్శిస్తారని వివరించారు. ఈ సమావేశంలో ధర్మాన రామదాస్, ధర్మాన రామమనోహరనాయుడు, గురుగుబిల్లి లోకనాథం, చౌదరి సతీష్, మునుకోటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మమాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం ఐదగంటల నుంచి శివాలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనాలు, అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తున్నారు. నదీస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖజిల్లాలో అల్లూరి సీతారామరాజు స్వయంగా పూజలు చేసిన స్వయంభూ శివాలయాలైన ఏజెన్సీ లక్ష్మీపురంలోని నీలకంఠేశ్వరస్వామి, గొలుగొండ మండలంలోని దారమఠం శ్రీశ్రీశ్రీ ఉమాదారమల్లేశ్వర స్వామి, మాకవరంలోని మహా శివలింగాలకు భక్తులు విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు.ఈ మూడు ప్రాంతాల్లో నదులు నిత్యం ప్రవహిస్తుండటంతో భక్తులు శుద్ధి స్నానాలు ఆచరించి శివయ్యకు పూజలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి రేపు ఉదయం ఐదుగంటల వరకూ శివజాగారం చేసి స్వామిరి మరోసారి పూజలు చేసి శివ ప్రసాదం స్వీకరిస్తారు భక్తులు. ఈ మూడు ఆలయాల్లో ఈరాత్రికి శివజాగార ప్రత్యేక భజనలు ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో జరిగిన ఎన్నికలలో 71.52 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 65,473 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకున్నారని అన్నారు. ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలో 28,905 మంది ఓటర్లకు గాను 19,562 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోగా, పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో 42,836 మంది ఓటర్లకు గాను 31,356 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 19,809 మంది ఓటర్లకు గాను 14,555 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించు కున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో ఇచ్చాపురంలో 67.68 శాతం, పలాస-కాశీబుగ్గలో 73.20 శాతం, పాలకొండలో 73.48 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెరశి 71.52 శాతం మంది ఓటర్లు తమ ఓటును వినియోగించు కోవడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. మూడు పురపాలక సంఘాల పరిధిలో ఓటు హక్కుపై అవగాహన పెరగడంతో 71.52 శాతానికి ఓటింగ్ చేరుకుంది.
ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం తన ఓటు హక్కును కుటుంభ సభ్యులతోపాటు కలిసి వెళ్లి వినియోగించుకున్నారు. విజయనగరంలోని మహారాజా కళాశాల పోలింగ్ బూత్ లో తన ఓటు మంత్రి వేశారు. తన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సిలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. ప్రతీఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సాధారణ ప్రజల మాదిరిగానే క్యూలైన్ లో నిలబడే మంత్రి కుటుంబం మొత్తం తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస – కాశీబుగ్గ పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ పేర్కొన్నారు. పోలింగ్ సరళి పరిశీలనలో భాగంగా బుధవారం ఉదయం పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘంలో జరుగుతున్న ఎన్నికల తీరును కలెక్టర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ తో కలిసి పరిశీలించారు. పలాస-కాశీబుగ్గలోని చిన్న బాడం, పెసరపాడుతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడ పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరగాలని, చివరి ఓటరు వరకు పోలింగ్ కొనసాగాలని సూచించారు. మధ్యాహ్నం 01.00 గం.కు జిల్లావ్యాప్తంగా 40,268 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు పాలకొండ నగర పంచాయతీలో 38.6 శాతం, ఇచ్చాపురంలో 44.4 శాతం, పలాస-కాశీబుగ్గ లో 47 శాతం వెరసి సగటున 44.4 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లకు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించినందున గతంలో కంటే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 05.00 గం.ల వరకు కొనసాగుతుందని అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములకు తరలించి సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. కాగా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 18,19 వార్డులను సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ రెవిన్యూ డివిజనల్ అధికారి టి.వి.ఎస్.జి.కుమార్ తో కలిసి పర్యటించగా, ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలోని పలు కేంద్రాలను సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో పలాస , ఇచ్చాపురం, పాలకొండ పురపాలిక ప్రాంతాలలో నేడు పోలింగ్ జరుగుతుందని, ఎన్నికలు అన్ని చోట్లా సజావుగా జరుగుతున్నాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో గల 106 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లావ్యాప్తంగా 96,170 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. మూడు పురపాలిక ప్రాంతాల్లో 70 వార్డుల్లో పోలింగ్ జరుగుతున్న నేపధ్యంలో సమస్యాత్మక కేంద్రాలు కూడా ఉన్నాయని, అటువంటి కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ ప్రక్రియను ఎస్.పి అమిత్ బర్దార్, జె.సిలు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, డా. కె శ్రీనివాసులు స్వయంగా పరిశీలిస్తున్నారని, తాను కూడా కొన్ని ప్రాంతాలను సందర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఉదయం 09.00 గం.లకు మూడు ప్రాంతాల్లో కలిపి సగటున 8.81 శాతం పోలింగ్ నమోదైందని, ఓటర్లలో తెచ్చిన అవగాహన వలన సాయంత్రానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లను చైతన్యపరిచేందుకు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడం జరిగిందని, అలాగే పోలింగ్ కు 10 రోజుల ముందే ఓటర్లకు ఓటర్ స్లిప్పులను జారీచేయడం జారింది అన్నారు. దీనివలన ఓటరుకు చెందిన పోలింగ్ స్టేషన్ సులభంగా తెలుస్తుందని , తద్వారా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి సోమశేఖర్, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహేంద్ర గిరిపై ఇతర ప్రాంతాల వారికి శివరాత్రి దర్శనం నిషేధించామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఒడిషా రాష్ట్రం గజపతి జిల్లా రాయగడ బ్లాక్ మహేంద్ర గిరిలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు నిషేదించినట్లు గజపతి జిల్లా కలెక్టర్ తెలిపారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఎక్కువ మంది భక్తులు హాజరు కావడం జరుగుతుందని, నిషేధం ఉన్న సంగతి గమనించాలని కోరారు. కోవిడ్ రెండవ దశ వ్యాప్తిలో ఉన్నందున భక్తులు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా జాతరకు వెళ్లరాదని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ద వహిస్తూ శివరాత్రి జాతరకు వెళ్లవద్దని సూచించారు.
సమర్థ నీటి యాజమాన్యం, పటిష్ట పంపిణీ ప్రణాళిక ద్వారా సాగులో ఉన్న రబీ పంటలను విజయవంతంగా పూర్తిచేసేందుకు అన్ని చర్యలు గైకొంటున్నామని జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులతో సాగు, తాగునీటికి కొరత రాకుండా చేపట్టిన చర్యలపై కలెక్టర్ మురళీధరరెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్ ర్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తూ రబీ వరి సాగును విజయవంతంగా పూర్తిచేయడం ప్రధానమని, ఈ విషయంపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్.. అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. సీలేరు నుండి సమకూరిన జలాలతో కలిపి పస్తుతం 7,600 క్యూసెక్‌ల నీరు అందుబాటులో ఉండగా, దీన్ని 8000 క్యూసెక్‌లకు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. సాగునీటి పరంగా ఒత్తిడి ఉన్న కరప, పెదపూడి, కాజులూరు, ముమ్మిడివరం తదితర మండలాల్లో ఇప్పటికే ఉన్న మోటార్లకు అదనంగా మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆయిల్ సరఫరా చేసే ఏజెన్సీల సంఖ్యను పెంచాలని సూచించారు. ఒత్తిడి ఉన్న ప్రాంతాలకు అవసరమైన నీరు అందేలా ఎగువ ప్రాంతాల్లో నీటి సక్రమ నిర్వహణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిని సద్వినియోగం చేసుకోవడంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31 నాటికి అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నీటి విడుదల ప్రణాళికలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నీటిని నింపే చర్యలు అమలవుతున్నాయని.. ఈ నెల 25 నుంచి ఈ చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రతి నీటి బొట్టూ ఎంతో విలువైందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీరు వృథా కావడానికి వీల్లేదని ఈ మేరకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాల్లో కాలనీల సంక్షేమ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, నీటి పొదుపు ఆవశ్యకతను వివరించాలన్నారు. ఇతరత్రా అవసరాలకు రీ సైక్లింగ్ వాటర్ వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్‌కు సూచించారు. అలాగే గృహాలలో త్రాగునీటి కనెక్షన్లకు బిగించిన మోటార్ల తొలగించాలనన్నారు. కాలువల శివారులో ఉన్న రాజోలు, పి.గన్నవరం మండలాల్లోని గ్రామాలకు, యానం ప్రాంతాన కి త్రాగునీటి ఇబ్బంది రాకుండా క్రాస్ బండ్లు, మోటార్ల ద్వారా నీటిని స్టోరేజికి సేకరించేందుకు అనుమతించి, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అలాగే సాగు, త్రాగు నీటి అవసరాలు తీర్చి, అందుబాటులో ఉన్న నీటిని పారిశ్రామిక అవసరాలకు అందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఇరిగేషన్, డ్రెయిన్, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఆర్.శ్రీరామకృష్ణ, టి.గాయత్రీదేవి, రవికుమార్, ఐవీ సత్యనారాయణ తదితరులతో పాటు వ్యవసాయ శాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్, డీడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అందుకు తగిన పకడ్భందీ ఏర్పాట్లు చేయడమైనదని, ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటు హక్కులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా లో రెండు నగరపాలక సంస్థలైన చిత్తూరు, తిరుపతి , 4 మున్సిపాలిటీ లైన మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి లలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇందు కొరకు 344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 137 అత్యంత సమస్యాత్మక మరియు 97 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని, 387 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాలకు ఈ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 1,131 పెద్దవి, 572 చిన్న బ్యాలెట్ బాక్స్ లను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 73 మంది ఆర్ఓ లను, 106 మంది ఏఆర్ఓ లను, 448 మంది పోలింగ్ అధికారులు (పి ఓ లు ), 30 మంది జోనల్ ఆఫీసర్లను, 65 మంది రూట్ ఆఫీసర్లు, 278 మంది మైక్రో అబ్జర్వర్లును నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి తరలింపుకు అవసరమైన 64 బస్సులు, 21 చిన్న వాహనాల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు 17 సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కొవిడ్ దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ స్యానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజ్ లు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, కవర్లు, బుక్లెట్లు, రబ్బరు స్టాంప్ లు వంటి ఇతర సామగ్రిని పోలింగ్ సిబ్బందికి సమకూర్చడం జరిగిందన్నారు.
ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గం.ల నుండి సా.5 గం.ల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆ తరువాత పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేసి కౌంటింగ్ కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్ లకు కట్టుదిట్టమైన భద్రతతో తరలించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.. అనంతరం ఈ నెల 14 న కౌంటింగ్ ను నిర్వహించనున్నారు.
విజయనగరం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, ఒక మునిసిపల్ కార్పొరేషన్ కు బుధవారం నిర్వహించనున్న పుర, నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డా.హరిజవహర్ లాల్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ లో భాగంగా ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలించే ప్రక్రియను సాలూరు, నెల్లిమర్ల, విజయనగరంలలో కలెక్టర్ పర్యవేక్షించారు. ప్రతి కౌంటర్ వద్దకు వెళ్లి ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మూడు పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీ, ఒక నగరపాలక సంస్థకు సంబంధించి బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందు కోసం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని తరలించే ఏర్పాట్లు పర్యవేక్షణకై ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. 376 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. అయితే నామినేషన్లు అనంతరం ఐదో వార్డులో అభ్యర్ధి మరణించడంతో ఆయా స్థానాలలో 12వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిందన్నారు. దీంతో 371 పోలింగ్ కేంద్రాలలో రేపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ శాతం గంట గంటకూ వెల్లడించేందుకై జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా వీలైనంత త్వరగా ఓట్ల నమోదు శాతాన్ని వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలకు కిట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఓటర్ కు థర్మల్ స్కేనర్ తో పరీక్షించి, పోలింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సిబ్బందికి శానిటైజర్లు,మాస్కులు వంటివి అందజేస్తున్నామన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలింగ్ ఆఫీసర్లకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చామన్నారు. ఓటర్లు క్యూ లైన్లో ఎక్కువగా ఉన్నట్లయితే త్వరితగతిన ఓటింగ్ జరిగే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసామన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను రాజీవ్ క్రీడామైదానంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల నిఘాతో కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు.
నగరంలోని రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందితో మాట్లాడారు. వారికి ఏర్పాటు చేసిన భోజనాలను పరిశీలించి వంటకాల రుచి, నాణ్యత గురించి సిబ్బందితో ఆరా తీసారు. వంటలు బాగున్నాయని, రుచికరంగా వున్నాయని తెలుపడంతో సంతృప్తి వ్యక్తం చేసారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ ,నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ పాల్గొన్నారు.
అంతకు ముందు సాలూరు మునిసిపల్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు. పోలింగ్ సిబ్బంది తో పాటు పోలింగ్ ఏజెంట్లకు కుడా మాస్క్ లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సాలూరు లో పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ను జె.సి. డా.కిషోర్ కుమార్ శాలువాతో సత్కరించారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ విధెహ్ ఖరే, మునిసిపల్ కమీషనర్ రమణ మూర్తి పర్యటనలో పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఎకౌంటు ఓపెనింగ్ చేసి, త్వరితగతిన లోన్ ప్రొససింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి బ్యాంక్ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో టిడ్కో గృహాలపై ప్రైవేటు బ్యాంకు ప్రతినిధులతో జేసి కీర్తి చేకూరి సమిక్షించారు.ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ టిడ్కో గృహాలకు సంబంధించి ప్రైవేటు బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించి ప్రైవేట్ బ్యాంకులు కొంతమేర వెనుకబడి ఉన్నాయని ఆమె తెలిపారు.14 ప్రైవేటు బ్యాంకుల వారు లబ్ధిదారులు అందరిచేత ఈ నెల 12 నాటికి సేవింగ్ ఎకౌంటెంట్స్ ను,18నాటికి లోన్ ఎకౌంటుకు సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని జేసి తెలిపారు.అనంతరం జేసి ఎకౌంట్ ఓపెనింగ్ లో ప్రైవేట్ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను బ్యాంకు ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మెప్మా పీడి కె శ్రీరమణి, ఎల్డిఎం జె షణ్ముఖ రావు, వివిధ ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు ఈ సంవత్సరం జూలై 4న 125వ జయంతిని పురస్కరించుకొని 125 రూపాయాల నాణాన్ని విడుదల చేయాలని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ పేరున ‘పరాక్రమ దివాస్’ పేరుతో రూ.125 నాణాన్ని విడుదల చేసినందుకు ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి పడాల వీరభద్రరావు ధన్యవాదాలు తెలియజేశారు. నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దౌర్జన్యాన్ని దౌర్జన్యంతోనే... ఆయుధాన్ని ఆయుధంతోనే... ఎదుర్కోవాలనే ధృడ సంకల్పంతో బ్రిటీషు సామ్రాజ్యవాదులను ముందుగా హెచ్చరించి, పట్టపగలు వరుసగా పోలీస్ స్టేషన్లపై దాడులుచేసి, ఆయుధాలను సమీకరించి, బ్రిటీషు సామ్రాజ్యవాదులపై మూడేళ్ళు ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు నేతాజీ జన్మించిన 1897 సంవత్సరంలోనే జన్మించారని, ఆ ఇద్దరి మహనీయుల ఆశయాలు ఒక్కటేనని ఆ కారణంగా ఈ సంవత్సరం జూలై 4న జరిగే అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని అల్లూరి పేరున రూ.125 నాణాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కోరారు. ఈ మేరకు జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీజీకి లేఖ వ్రాసినట్టు పడాల వీరభద్రరావు ఆ ప్రకటనలో తెలిపారు.