వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భారీ మార్పులు తీసుకొచ్చారని పాయకరావు పేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు గొల్లబాబూరావు అన్నారు. గురువారం ఎస్.రాయవరంలో జగనన్న విద్యా కానుక కింద విద్యార్ధులకు పాఠశాల కిట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడానికి నాడు-నేడు కింద అన్ని పాఠశాలలను నిత్యనూతనంగా తయారు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశేషం ఏంటంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో లేనిపోని హడావిడీ చేసే బొలిశెట్టిని ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచడం విశేషం. అతని అనచరులు కూడా ఎమ్మెల్యే కార్యక్రమానికి రాకపోగా, కూతవేటు దూరంలో వున్న బొలిశెట్టి ఇంటి దగ్గరే ఉండి కార్యక్రమ విషయాలను తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం ఎమ్మెల్యే గొల్లబాబూరావు టూర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ కార్యక్రమాల్లో బొలిశెట్టి కనిపించకపోవడంతో, అతని అనుచరులను సైతం ఎమ్మెల్యే కావాలనే పక్కన పెట్టారనే ప్రచారం నియోజవకర్గంలో గట్టిగా సాగుతుంది.
ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విద్యార్దుల భవిష్యత్తు కోసం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్న సీఎం చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టామని వివరించారు. నాడు -నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చాం. పేద పిల్లలు గొప్పగా చదవాలని భావించి ఒకటి నంచి టెన్త్ వరకు ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్నామని చెప్పారు. నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తామన్నారు. రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నామన్న సీఎం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యను పక్కన పెట్టడంతో నిరుపేద విద్యార్ధులకు ఎంతో నష్టపోయార్నారు. ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకునేలా చేస్తామని..ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలన్నారు.
రైతులకు అన్ని వ్యవసాయ సేవలు రైతు భరోసా కేంద్రాల నుంచే అందాలజి జిల్లా సంయుక్త కలక్టరు ఎం .వేణుగోపాలరెడ్డి సచివాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం మునగపాక, అచ్చుతాపురం మండలాలలో జెసి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మునగపాక మండలం ఒంపోలు గ్రామ సచివాలయం , రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న సేవలను గూర్చి రైతులతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు, మందులు సక్రమంగా అందుతున్నది, లేనిది అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయంలో మౌళిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ తనిఖీ చేసారు. సచివాలయం ద్వారా అందించే సేవలలో లోపాలు లేకుండా చూడాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. సచివాలయంలో అందించే సేవలకు సంబంధించిన సమాచారం బోర్డులపై ప్రదర్శించాలని సచివాలయ ఉద్యోగులకు తెలిపారు. రైతు సేవల విఫలంపై ఏ ఒక్క ఫిర్యాదు అందినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జెసి హెచ్చరించారు..
ఏఐఎఫ్ పథకం క్రింద జిల్లాలో రైతాంగానికి భారీ ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు తగిన సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వివిధ వ్యవసాయ, అనుబంధ శాఖలు, బ్యాంకు అధికారులతో తన ఛాంబర్‌లో మంగళవారం ఏఐఎఫ్ పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పథకం అమల్లో బ్యాంకులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. కోత అనంతరం, సరైన సమయంలో విక్రయించేందుకు అనువుగా పంటను నిల్వచేసుకోవడానికి, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడానికి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ తదితర సదుపాయాలను కల్పించడానికి కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని చెప్పారు. పథకాన్ని సకాలంలో, సక్రమంగా ఉపయోగించుకోగలిగితే జిల్లాకు సుమారు రూ.500 కోట్లు వరకూ వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పథకాన్ని అమలు చేయడానికి విభిన్నంగా, వినూత్నంగా కొత్త యూనిట్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు. కేవలం వ్యవసాయానికే కాకుండా, ఉద్యాన, పాడి, మత్స్య, పట్టు, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల్లో కూడా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి, అంతిమంగా రైతుకు మేలు చేసేందుకు కృషి చేయాలని జెసి కోరారు. ముందుగా నాబార్డు ఎజిఎం హరీష్ మాట్లాడుతూ పథకం వివరాలను వెళ్లడించారు. అనంతరం వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, పశు సంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, ఉద్యానశాఖ డిడి ఆర్.శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడి వై.వి.శ్యామ్‌కుమార్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, మత్స్యశాఖ ఎఫ్‌డిఓ కిరణ్‌కుమార్, కెల్ల పిఏసిఎస్ అధ్యక్షులు కెవి సూర్యనారాయణరాజు తదితరులు ఈ పథకం అమలుపై పలు సూచనలు చేశారు. ఇంకా సమావేశంలో ఎల్‌డిఎం కె.శ్రీనివాసరావు, వివిధ పిఏసిఎస్ ల అధ్యక్షులు డి.శ్రీధర్, టి.వెంకటనారాయణరాజు, డిడిఏ ఎం.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రశ్ జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గ మహిళ మనీషాను సామూహిక బలాత్కారం చేసి ఆమె మృతికి కారణం అయిన నిందితులను తక్షణమే ఉరి తీయాలని ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఆచార్య నునావత్ దేవదాస్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన శంఖవరంలో మీడియాతో మాట్లాడుతూ, మనీషా పార్థివ దేహం కడచూపును కూడా ఆమె తల్లి తండ్రులకు దక్కకుండా చేసి చాటుగా అంత్య క్రియలు చెయ్యడం పట్ల ప్రజల్లో ఆక్రోశం పెల్లుబిగిసిందనీ, ఈ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు అని అన్నారు. సుప్రీంకోర్టు ఈ పరిణామాలన్నీ స్వయంగా పర్యవేక్షించి సరైన విచారణ చేపట్టకపోతే మనీషా కుటుంబానికి న్యాయం జరగదని, నిందితులకు శిక్ష పడదని అన్నారు. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు ఈ విషయంపై జోక్యం చేసుకుని నిందితులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర జలశక్తి (జలవనరుల శాఖ) మంత్రి గజేంద్ర సింఘ్ షెకావత్ గారికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.పి.అనిల్ కుమార్, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి, జెసి మార్కండేయులు , తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటి కమాండెంట్ శుక్లా , డ్వామా పిడి చంద్రశేఖర్, రేణిగుంట తహసిల్దార్ శివ ప్రసాద్, భానుప్రకాష్ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం, పోకల అశోక్ కుమార్, వల్లివేడు రాజా రెడ్డి, ఎం.శ్రీనివాస్ , డిఎస్పీ చంద్రశేఖర్, ఎయిర్ పోర్ట్ టర్మీనల్ మేనేజర్ గోపాల్ సెంట్రల్ వాటర్ కమిషన్ అబ్జర్వర్ కుమార్, బిజెపి కార్యకర్తలు, స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం రోడ్డుమార్గాన తిరుమల బయలు దేరి వెళ్లారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శించుకుని సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగుప్రయాణం కానున్నారు.