అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 'బాలికే భవిష్యత్తు' పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లా,డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఒక రోజు కార్యాలయపు అధికారిగా బాలికకు ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ గా బాలిక బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ బాలిక కలెక్టర్ గా విధులు నిర్వహిస్తారనేది 10.30 వరకూ గానీ తెలియదు. జిల్లా అధికారులు జిల్లా అంతా జల్లెడ పట్టి కొందరు బాలికల పేర్లను జిల్లా కలెక్టర్ కి నివేదించారు. బాలికల్లో మంచి భవిష్యత్తుకు బాటలు వేయడానికి, స్పూర్తిదాయకంగా ఉండేందుకు కలెక్టర్ ఈ కార్యక్రమం చేపట్టం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కలెక్టర కార్యాలయంలోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బాలికలు ప్రధాన అధికారులుగా ఒక్కరోజు పనిచేసేలా చేయడం ఒక చారిత్రక అంశమే. కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం పట్ల విద్యార్ధినిల తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన యువతకు ప్రత్యేకించి ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ఎమ్మెస్ ఆఫీస్ పై ఇచ్చేందుకు దరఖాస్తు లు కోరుతున్నట్టు రంపచోడవరం ఐటిడిఏ పీవో ప్రవీణ్ ఆదిత్య శనివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కోసం www.apssdc.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని పొంది దరఖాస్తులు నింపి సమర్పించాలని కోరారు. రిజిస్ట్రేషన్ గడువు తేదీని పొడిగించడంతో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్ జూమ్ లింక్ తో ఎమ్మెస్ ఆఫీస్ తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. ఈ తరగతులు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారని మొత్తం శిక్షణ కాలం 40 గంటలు ఉంటుందన్నారు. ఇందులో బేసిక కంప్యూటర్ ఫండమెంటల్స్ అర్హతగా గుర్తించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి గల గిరిజన యువత దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కొరకు సెల్ నెంబర్ 7989656834 లో సంప్రదించాలని పీఓ సూచించారు...
పాయకరావుపేట నియోజకవర్గంలో అంతా తీవ్రంగా చర్చించుకునే తేడా రాజకీయం జరుగుతోంది.. దళిత ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యావంతుడు, మచ్చలేని మంచి మనిషి ఎమ్మెల్యే గొల్లబాబూరావుని కార్యకర్తల సమావేశంలో వాడు, వీడూ అనేసి.. ఎమ్మెల్యే అవినీతి చిట్టా టైమొచ్చినట్టు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చేసి.. రాజైనా, రెడ్డైనా ఇంకెవరైనా నియోజవకర్గంలో మనల్ని కాదని పనిచేయడానికి బయపడేలా చేయాలని కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి మరీ నోటికొచ్చినట్టు మాట్లాడేసి.. ఆపై ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చాలా మంచి వ్యక్తి నాయకులు, కార్యకర్తలు కోపంలో నోటికొచ్చినట్టు మాట్లాడేసినా మంచి మనసుతో క్షమించేసి..దూరం చేసిన మనల్ని అన్నీ మరిచిపోయి దగ్గర చేసేకుంటారంటారనే వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని వాడూ, వీడు అని మాట్లాడాలంటే ఏ స్థాయి నాయకుడై ఉండాలో, ఎంత అవినీతి చేస్తే ఆ స్థాయిలో మాట్లాడాతారో అటు పార్టీలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ అందరూ గుర్తిస్తారు.. అలాంటిది ఒక సాధారణ ఎంపీటీసి అయిన బొలిశెట్టి ఎమ్మెల్యే గొల్లబాబూరావుతో పాటు, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూడా తన నోటికొచ్చినట్టు మాట్లాడిన కార్యకర్తల సమావేశం యొక్క ఆడియో, స్వయంగా ఎమ్మెల్యే గొల్లబాబూరావు నియోజకవర్గంలోని అన్ని మండాల్లో తనకు అన్యాయం జరుగుతుందని, తన పనిని తనని చేసుకోనీయకుండా చాలా మంది అడ్డుపడుతున్నారని, ఎమ్మెల్యేని మించి వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త చంటి విషయంలో ఎమ్మెల్యే కళ్లముందే తన్నుకున్న తరువాత, పార్టీ పరువుని ఏ స్థాయిలో చెడగొట్టాలో అంతా చెడగొట్టారు. ఆపై కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మనల్ని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తులను వెంటేసుకొని పనులు చేయిస్తున్నారనే అక్కసుతో నోటికొచ్చినట్టు మాట్లాడేసిన బొలిశెట్టి గోవింద్...ఇపుడు అదే కార్యర్తల సమావేశంలో కొందరు బాకా నాయకులతో భజనలు చేయించి, మరీ క్షమాపణ రాగం అందుకోడంతో...పాయకరావుపేట నియోజకవర్గంలో తేడా రాజకీయం జరుగుతుందంటూ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. అయినా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఏం అధికార ముందని నోటికొచ్చినట్టూ మాట్లాడి ఇపుడు మళ్లీ క్షమించాలని కోరితే ఎమ్మెల్యే కరిగిపోతే దానికంటే చండాలం మరొకటి వుండదంటూ చర్చకు తెరలేపారు పాయకరావుపేటలోని నియోజకవర్గ కార్యకర్తలు. పైగా ఎమ్మెల్యేకి, తనకి కావాలనే కొందరు దూరం పెంచారనే కొత్త పల్లవి కూడా అందుకోవడం ఎమ్మెల్యేను కావాలనే తక్కువ చేయాలని చూస్తున్నట్టు, ఎమ్మెల్యేను బలంగా నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అర్ధమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో దెబ్బకొట్టిన వారిని దూరం పెట్టి ఏ విధమైన ట్రీట్ మెంట్ ఇస్తారో అందరికీ తెలిసిన విషయమే. దూరంపెట్టి ఎలాంటి పనులు కాకుండా చేసిన ఎమ్మెల్యేను మళ్లీ బుజ్జగించి, అన్నమాటలన్నీ ఉత్తుత్తివే అన్నట్టు చేయాలని చూస్తున్న రాజకీయం పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ కేడర్ ను అబాసు పాలు చేసేలా వుందనేది తేటతెల్లమవుతుంది. అటు పార్టీ అధిష్టానం సైతం ఎంపీటీసి లాంటి వ్యక్తులను ఆ స్థాయికే పరిమితం చేయాలి తప్పితే.. అంతకంటే ఎక్కువ చనువు ఇస్తే ఇలానే వుంటుందని కూడా మాటలు అనిపించుకున్నట్టు పాయకరావుపేటలోనూ, పార్టీలో తీవ్రస్థాయిలోనే ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో బొలిశెట్టిని క్షమించేసి, మళ్లీ నువ్వే ఎస్.రాయవరంలో నాయకుడిగా ఉండాలని చెబితే పరిస్థితి ఎలా వుంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇంత రచ్చ జరిగి, ఎమ్మెల్యేని అందరూ అడిగేలా, వాడూ వీడు అన్నవ్యక్తి చాలా మంచివాడిగా క్రియేట్ చేయాలని చూస్తున్న బాజా కార్యకర్తల మాటలు ఎమ్మెల్యే నమ్ముతారా, లేదంటే నిజంగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కోసం ఎమ్మెల్యే చూస్తున్నారా అనే విషయంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి వుంది.. నిజంగా ఎమ్మెల్యే మనసు మార్చుకుంటే అటు ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోయడం, పార్టీని తక్కువ చేసి చూపడం ఖాయం. ఇప్పటికే ఆ దిశగా ప్రతిపక్షనేతలు ఎమ్మెల్యే తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. పాయకరావుపేట తేడా రాజకీయంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి..!
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యులతో ప్రతీనెలా 10వ తేదీన ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని శంఖవరం పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీసత్యన్నారాయణ సూచించారు. శుక్రవారం యాంటినెటల్ డే సందర్భంగా పీహెచ్సీలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు శరీరంలో రక్తనిల్వలు తగ్గకుండా మంచి బలవర్ధక ఆహారం తీసుకోవాలన్నారు. ఎవరికైనా రక్తం తక్కువగా ఉంటే ఆసుపత్రిలో ఇచ్చే ఫోలిక్ యాసిడ్, ఐరన్ మాత్రలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా మరీ అత్యవసరం అయిన గర్భిణీ స్త్రీలకు ఐరన్ సుక్రోజ్ కూడా అందించండం జరుగుతుందన్నారు. అదేసమయంలో కరోనా నేపథ్యంలో వీరంతా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనే అంశంపై కూడా ఆరోగ్య సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే ఆరోగ్య సహాయకుల ద్వారా పేర్లు నమోదు చేసుకొని పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ లో ఉండి వైద్యం పొందేందుకు కూడా మెడికల్ కిట్లు కూడా అందజేస్తున్నట్టు డాక్టర్ ఆర్వీవి సత్యన్నారాయణ వివరించారు. అంతకుముందు వారందరికీ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మూడు సచివాలయాలకు చెందిన ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు.
పాయకరావుపేట దళిత ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యావంతుడు సౌమ్యశీలి ఫెర్ ఫెక్ట్ లీడరైన గొల్ల బాబూరావుని నోటికొచ్చినట్టు వాడు, వీడు..అనడమేకాకుండా ఎంతటివాడైనా అంటూ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటిసీ బొలిశెట్టి గోవింద్ అదేకార్యకర్తల సమావేశంలో క్షమాపణ రాగం అందుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈలెక్కన చూస్తే అందితే జిత్తు...అందకపోతే కాళ్లూ పట్టుకోవడానికి బొలిశెట్టి ఎంతకైనా దిగజారతారనే విషయం అతని మాటలు అనుచరల ద్వారా మరోసారి శుక్రవారం తేటతెల్లమైపోయింది.. అంతకుముందు తన ప్రతీ పనికి అడ్డు పడుతున్నారంటూ.. తనని మించిన స్థాయిలో కొందరు వ్యవరహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే గొల్లబాబూరావు నియోజకవర్గం అంతా గొంతు చించుకుని మరీ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో బొలిశెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలు మీడియా ముఖంగా వచ్చి రచ్చరచ్చ అయ్యి.. దాదాపు ఎమ్మెల్యే గొల్లబాబూరావు పరువుపోయినంత పనైంది. ఈ దశలో గొల్ల విషయాన్ని అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లడం, పార్టీ పరువుపోతుందని అలాంటి చోటాలను గ్రామస్థాయికే పరిమితం చేయాలి గానీ మరీ ఎక్కువ చనువు ఇచ్చేస్తే , ఇలానే నోటికొచ్చినట్టు చాన్సుతీసుకొని మాట్లాడతారని అధిష్టానం చెప్పి పంపేసిన నేపథ్యంలో..ఎమ్మెల్యే గొల్ల బొలిశెట్టి పూర్తిగా పక్కన పెట్టారు. అధికారిక కార్యక్రమాల్లో బొలిశెట్టి ఫోటో పెద్దది వేసుకొని, ఎమ్మెల్యే ఫోటో సాధారణ కార్యకర్తలా చిన్నది వేసి మరీ అవమానించడంతోపాటు, కార్యకర్తల ముందే పరువుపోయాల మాట్లాడిన వ్యక్తి.. నెల రోజుల్లో ప్లేటు ఫిరాయించి.. నేడు మళ్లీ క్షమాపణ రాగం పాడి ఆ ఆడియోను కావాలనే మీడియాకు అందేలా అందరికీ పంపారు. అంటే తప్పుజరిగింది.. క్షమించాలనే మాటను రచ్చ జరిగిన మీడియా ద్వారా చెప్పి, ఆతరువాత నేరుగా కార్యకర్తలతో వెళ్లి క్షమించాలని కోరనున్నట్టు అనుచరలతో బాకా కొట్టించిన ఆడియోను మీడియాకి రిలీజ్ చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు...ఈ నెలరోజుల కాలంలో బొలిశెట్టిని ఎమ్మెల్యే కాదంటే నియోజవర్గంలో పరిస్థితి ఏంటో బొలిశెట్టికి అద్దంలో కనబడినట్టు చాలా క్లియర్ గా అందరికీ తెలియజేయడంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయినా చెంపమీద కొట్టి..క్షమించమని అడిగితే ఎవరు క్షమించి పాత స్థానాన్ని కట్టబడతారనే వాదన కూడా పాయకరావుపేట నియోజకర్గంలో బలంగా వినిపిస్తోంది. అదే పరిస్థితిని నేడు పాయకరావుపేట నియోజవర్గంలో కూడా తలెత్తింది. ఎమ్మెల్యేలను కార్యకర్తల ముందు నానా మాటలు మాట్లాడి...ఇపుడు మళ్లీ ఎమ్మెల్యేని క్షమించాలని, ఏదో ఆవేశంలో తప్పు జరిగిందనే విషయాన్ని చెప్పడం ద్వారా మళ్లీ గొల్లను ప్రశన్నం చేసుకునే భజన మొదలు పెట్టాడు బొలిశెట్టి. బొలిశెట్టి క్షమాపలకు కరిగిపోతే ఎమ్మెల్యే గొల్లబాబూరావు పరును నిజంగానే పోతుందని గొల్ల నిజమైన అనుచరులు హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా బొలిశెట్టిని పక్కన పెడితే బొలిశెట్టి భజన చేసేవారికి నియోజకవర్గంలో ఏ పనులూ కావడం లేదు ఈ క్రమంలో హై డ్రామాలకు మించిన డ్రామాలు పాయకరావుపేట నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో బొలిశెట్టి కార్యకర్తల మధ్య అన్న మాటలను ఎమ్మెల్యే తుడిచేసుకొని, పార్టీలోకి ఆహ్వానిస్తారా... లేదంటే అవసరాలకు తగ్గ రాజకీయం చేసేవాళ్లను పూర్తిగా పక్కన పెడతారా అనే విషయం తేలాల్సివుంది..
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. బాలల బంగారు భవిత కోసం ఎన్నటికీ తరగని, ఎవరూ దోచుకోలేని ఆస్తిగా విద్యను ప్రతీ పేద కుటుంబానికి అందిస్తున్నారని చెప్పారు. తండ్రి తర్వాత అమ్మ తరుపు నుంచి పిల్లల భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించే మేనమామ తరహాలోనే పేద పిల్లలను గురించి ఆలోచిస్తున్నారని కితాబిచ్చారు. కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రచర్ల పరీక్షిత్ రాజు, జిల్లా విద్యశాఖాధికారి నాగమణి , పార్వతీపురం ఐటీడీఏ పిఓ కూర్మనాథ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పుష్ప శ్రీవాణి తన చిన్న నాటి పాఠశాలను గుర్తు చేసుకున్నారు.. ‘‘ మా నాన్న స్కూలు టీచర్ అయినా నలుగురు పిల్లలను చదివించడం కష్టంగానే ఉండేది.. నేను గిరిజన ఆశ్రమపాఠశాలలో డే స్కాలర్ గా చదువుకున్నాను. మా స్కూలు ఊరి నుంచి 2 కి.మీ దూరంలో ఉండేది. మా దగ్గరున్న బుక్కులు, నోటు పుస్తకాలను పెట్టుకోవడానికి బ్యాగు కూడా ఉండేది కాదు.. అందుకే అంత దూరం కూడా పుస్తకాలను చేత్తో పట్టుకొని నడుచుకుంటూ స్కూలుకు వెళ్లే వాళ్లం..అప్పట్లో బాగా ఉన్న వాళ్ల పిల్లలకే స్కూలు బ్యాగులు ఉండేవి.. ఎవరైనా మంచి బ్యాగు తెచ్చుకుంటే అలాంటిది మాకూ ఉంటే బాగుండేది కదా అని ఆశగా చూసేవాళ్లం.. స్కూల్లో కూర్చోవడానికి టేబుళ్లు కూడా ఉండేవి కావు, నేల మీద కూర్చొనే చదువుకున్నాం.. ఇక ఫ్యాన్లు లైట్టు లాంటివేమీ ఉండేవి కావు.. బోర్డు మీద అక్షరాలు రాస్తే అక్షరాలు కూడా కనిపించేవి కావు.. అలాంటప్పుడు పిల్లలం మేమే పలకాకు, మసి బొగ్గును నూరి బోర్డుకు పూస్తే అప్పుడు అక్షరాలు కనిపించేవి.. సిగ్గు విడిచి చెప్పుకుంటున్నా.. ఆడపిల్లలం ఉన్నా మా కోసం కనీసం బాత్ రూములు కూడా ఉండేవి కావు.. నాతోటి పిల్లల తల్లిదండ్రులు కూడా వారిని చదివించే ర్థిక స్థోమత లేక అర్ధాంతరంగా వారి చదువులను మాన్పించేసారు...’’ అని వెల్లడించారు. అంత దారుణంగా ఉండేవి అప్పటి పరిస్థితులని వాపోయారు. పిల్లల భవిష్యత్తు గురించి తండ్రి తర్వాత అమ్మతరుపున అంతగా ఆలోచించేది మేనమామ అని ప్రస్తుతం ముఖ్యమంత్రి జగననన్న కూడా ఒక మేనమామ తరహాలోనే ఆలోచిస్తున్నారని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. పేదలకు తమ పిల్లల చదువులు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి పేదతల్లికీ 15 వేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందించారని ప్రస్తావించారు. యూనిఫాంలు, మంచి బ్యాగు, షూస్ బెల్టు, బూట్లు లాంటివన్నీ ఇచ్చి కలిగిన వారి పిల్లలు చదివే కార్పొరేట్ స్కూలు పిల్లల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలు కూడా ఉండాలని సీఎం సంకల్పించారని చెప్పారు. ఒకవైపు పిల్లలకు అవసరమైన సామాగ్రిని జగనన్న విద్యా కానుకగా అందిస్తూనే మరోవైపున ప్రభుత్వం చేపట్టిన మనబడి.. నాడు నేడు పథకాలు గవర్నమెంట్ స్కూళ్ల దుస్థితిని మార్చే విప్లవాత్మకమైన పథకాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల పాఠశాలల్లో నాడు నేడు పథకంలో భాగంగా పెద్ద భవనాల్లో ఉపయోగించే నాణ్యమైన, ఖరీదైన సామాగ్రిని ఉపయోగిస్తున్నారని, పాఠశాలలకు అవసరమైన ఫ్యాన్లు, లైట్లు, టేబుళ్లు, కుర్చీలు, బాత్ రూములు, తాగునీటి వసతి, కాంపౌడ్ గోడలు వంటి మౌలిక వసతులన్నింటినీ అందిస్తూ వాటి రూపురేఖలను మారుస్తున్నారని వివరించారు. ఎన్నటికీ తరగనిది, ఎవరూ దోచుకోలేని ఆస్తి విద్య అని దాన్ని ప్రతి పేద విద్యార్థికి అందించే దిశగా ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు. మాతృభాష అయిన తెలుగుతో పాటుగా బంగారు భవిష్యత్తును అందించే ఆంగ్ల మాధ్యమాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రస్తుతం తెలుగుతో పాటుగా ఇంగ్లీషులోనూ పాఠాలున్న మిర్రర్ ఇమేజ్ పుస్తకాలను ఇచ్చారని గుర్తు చేసారు. ఈ సందర్భంగానే కురుపాం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన విద్యార్థులకు పుష్ప శ్రీవాణి జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఐ.టి.డి.ఎ, ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి, ట్రైబల్ వెల్ఫేర్ డి డి కిరణ్ కుమార్,పి.హెచ్ఓ చిట్టిబాబు, డిప్యూటీ డి. ఇ. ఓ మోహన రాయుడు, ఎ. ఎం.సి చైర్మన్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఎంపిడివో లు, తహశీల్దార్లు, ఎం.ఇ.ఓ లు, వివిధ శాఖల అధికారులు విద్యార్ధిని విద్యార్థులు తల్లి,దండ్రులు తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీలు ప్రతీనెల క్రమం తప్పకుండా 10వ తేదిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని హెల్త్ విజిటర్ కె.విజయ సూచించారు. శుక్రవారం రౌతుల పూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భీణీలకు యాంటినెటల్ మంత్ సందర్భంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో గర్భిణీలు అత్యంత జాత్రగా ఉండాలన్నారు. శరీరంలోని రక్తం శాతం పెరగడానికి బలవర్తకమైన ఆహారం తీసుకోవాలన్నారు. ఖచ్చితంగా ప్రతీనెలా వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా కాన్పు సమయం వరకూ ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్య ససహాయం అందించడానికి వీలుంటుందన్నారు. గ్రామాల్లో ఉన్న సమయంలో అత్యవసర సమయంలో ఆశ కార్యకర్తలను, సచివాలయ ఆరోగ్య సహాయకులను సంప్రదించాలన్నారు. కాన్పు సమయానికి రక్తం 14 గ్రాములు ఉండేటట్టుగా చూసుకోవాలన్నారు. ప్రతీనెల సిహెచ్సీలో రక్తల పరీక్షలు చేయించుకోవడం ద్వారా శరీరంలో రక్తం ఎంతుందనే విషయం తెలుసుకొని, దానికి అనుగుణంగా మందులు వాడటానికి ఆస్కారం వుంటుందన్నారు. కార్యక్రమంలో సచివాలయ పరిధిలోని ఆరోగ్య సహాయకులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భారీ మార్పులు తీసుకొచ్చారని పాయకరావు పేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు గొల్లబాబూరావు అన్నారు. గురువారం ఎస్.రాయవరంలో జగనన్న విద్యా కానుక కింద విద్యార్ధులకు పాఠశాల కిట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడానికి నాడు-నేడు కింద అన్ని పాఠశాలలను నిత్యనూతనంగా తయారు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశేషం ఏంటంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో లేనిపోని హడావిడీ చేసే బొలిశెట్టిని ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచడం విశేషం. అతని అనచరులు కూడా ఎమ్మెల్యే కార్యక్రమానికి రాకపోగా, కూతవేటు దూరంలో వున్న బొలిశెట్టి ఇంటి దగ్గరే ఉండి కార్యక్రమ విషయాలను తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం ఎమ్మెల్యే గొల్లబాబూరావు టూర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ కార్యక్రమాల్లో బొలిశెట్టి కనిపించకపోవడంతో, అతని అనుచరులను సైతం ఎమ్మెల్యే కావాలనే పక్కన పెట్టారనే ప్రచారం నియోజవకర్గంలో గట్టిగా సాగుతుంది.
ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విద్యార్దుల భవిష్యత్తు కోసం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్న సీఎం చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టామని వివరించారు. నాడు -నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చాం. పేద పిల్లలు గొప్పగా చదవాలని భావించి ఒకటి నంచి టెన్త్ వరకు ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్నామని చెప్పారు. నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తామన్నారు. రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నామన్న సీఎం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యను పక్కన పెట్టడంతో నిరుపేద విద్యార్ధులకు ఎంతో నష్టపోయార్నారు. ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకునేలా చేస్తామని..ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలన్నారు.
రైతులకు అన్ని వ్యవసాయ సేవలు రైతు భరోసా కేంద్రాల నుంచే అందాలజి జిల్లా సంయుక్త కలక్టరు ఎం .వేణుగోపాలరెడ్డి సచివాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం మునగపాక, అచ్చుతాపురం మండలాలలో జెసి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మునగపాక మండలం ఒంపోలు గ్రామ సచివాలయం , రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న సేవలను గూర్చి రైతులతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు, మందులు సక్రమంగా అందుతున్నది, లేనిది అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయంలో మౌళిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ తనిఖీ చేసారు. సచివాలయం ద్వారా అందించే సేవలలో లోపాలు లేకుండా చూడాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. సచివాలయంలో అందించే సేవలకు సంబంధించిన సమాచారం బోర్డులపై ప్రదర్శించాలని సచివాలయ ఉద్యోగులకు తెలిపారు. రైతు సేవల విఫలంపై ఏ ఒక్క ఫిర్యాదు అందినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జెసి హెచ్చరించారు..
ఏఐఎఫ్ పథకం క్రింద జిల్లాలో రైతాంగానికి భారీ ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు తగిన సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వివిధ వ్యవసాయ, అనుబంధ శాఖలు, బ్యాంకు అధికారులతో తన ఛాంబర్‌లో మంగళవారం ఏఐఎఫ్ పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పథకం అమల్లో బ్యాంకులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. కోత అనంతరం, సరైన సమయంలో విక్రయించేందుకు అనువుగా పంటను నిల్వచేసుకోవడానికి, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడానికి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ తదితర సదుపాయాలను కల్పించడానికి కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని చెప్పారు. పథకాన్ని సకాలంలో, సక్రమంగా ఉపయోగించుకోగలిగితే జిల్లాకు సుమారు రూ.500 కోట్లు వరకూ వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పథకాన్ని అమలు చేయడానికి విభిన్నంగా, వినూత్నంగా కొత్త యూనిట్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు. కేవలం వ్యవసాయానికే కాకుండా, ఉద్యాన, పాడి, మత్స్య, పట్టు, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల్లో కూడా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి, అంతిమంగా రైతుకు మేలు చేసేందుకు కృషి చేయాలని జెసి కోరారు. ముందుగా నాబార్డు ఎజిఎం హరీష్ మాట్లాడుతూ పథకం వివరాలను వెళ్లడించారు. అనంతరం వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, పశు సంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, ఉద్యానశాఖ డిడి ఆర్.శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడి వై.వి.శ్యామ్‌కుమార్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, మత్స్యశాఖ ఎఫ్‌డిఓ కిరణ్‌కుమార్, కెల్ల పిఏసిఎస్ అధ్యక్షులు కెవి సూర్యనారాయణరాజు తదితరులు ఈ పథకం అమలుపై పలు సూచనలు చేశారు. ఇంకా సమావేశంలో ఎల్‌డిఎం కె.శ్రీనివాసరావు, వివిధ పిఏసిఎస్ ల అధ్యక్షులు డి.శ్రీధర్, టి.వెంకటనారాయణరాజు, డిడిఏ ఎం.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.