తిరుపతి నగరంలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ను 2021 జనవరి 04 నుంచి 07 వరకు నిర్వహిస్తున్నట్లు అనంతపురము రేంజ్ డి.ఐ.జి క్రాంతి రాణా టాటా చెప్పారు. మంగళవారం తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి. ఏ.రమేష్ రెడ్డితో కలిసి పోలీస్ మీట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఐజీ మాట్లాడుతూ, తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మొదటి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రధమంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇతర జిల్లాల సీనియర్ ఐ.పి.యస్ అధికారులతో పాటు కొత్తగా రాష్ట్రానికి వచ్చిన యువ ఐ.పి.యస్ అధికారుల సహకారంతో కార్యక్రమం మొత్తం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ డ్యూటీ మీట్లో జిల్లాల నుంచి వివిధ విభాగాలలో రేంజ్ డ్యూటీ మీట్ లో ప్రతిభ ఆధారంగా ఎన్నికైన పోలీస్ సిబ్బందిని జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపిస్తామన్నారు.
అన్ని జిల్లాలలో పోలీస్ అధికారులు సాధించిన విజయాలపై స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, కళాశాల విద్యార్థులకు కూడా విజ్ఞాన పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో ఈ ప్రప్రధమ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం ఆనందకరమని, ఇది పూర్తిగా పోలీస్ విశిష్టతను తెలియజేస్తుందని, సమాజంలో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి పోలీస్ విభాగం సర్వసన్నద్ధంగా ఉన్నదని తెలపడానికి ఇది ఒక ప్రధాన సూచికగా బావించవచ్చునన్నారు. రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ సూచనల మేరకు రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, దీనికి వేదికగా స్థానిక ఏ.ఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ , PTC కల్యాణి డ్యాం వద్ద నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ యస్.పి స్థాయి అధికారి వరకు పాల్గొంటున్నారని, ఇందులో కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి, పోట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐ.ఓ ఫోటోగ్రఫీ మొదలగు వాటిపై పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం డ్యూటీ మీట్ కోర్ టీమ్ అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో బోర్ కొట్టి నపుడు తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ వెంటనే అమరావతిలో రైతులు గుర్తొచ్చి రెచ్చగొట్టే విధంగా ఏదో టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ లోని మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ళ, పట్టాల పంపిణీ మహాయజ్ఞంలా చేస్తుంటే ప్రతిపక్షం లో ఉన్న చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం సంస్కారం ఉన్నా తన తీరు మార్చుకోవాలన్నారు. శత కోటి నానీల్లో ఈయన ఇంకో నాని అని ఒక బాధ్యతకలిగిన మంత్రి గురించి అలా మాట్లాడటం చాలా తప్పని అన్నారు. నాని తండ్రి పేరున్న నాయకుడు సినిమా ప్రమోషన్లలో భాగంగా రావడం,రోడ్ షోలు చేయటం, నాలుగు డైలాగులు చెప్పడం సరికాదన్నారు. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోనో మరొకరితోనే చెప్పించుకోవలసిన అవసరం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేదన్నారు.
ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కలెక్టర్ లతో మోనటరింగ్ చేసి రైతులు విషయం లో అడగకుండానే ఎం కావాలో ముందే అందిస్తున్నారన్నారు. విశాఖలో ఇళ్ళ 2,96,272మంది లబ్ధిదారులకి అందించామన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.పేదలందరికీ ఇళ్ళుస్థలాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో నిజమైన పండుగ వాతావరణం సంక్రాంతి పండుగకు ముందే నెలకొందని అన్నారు. పట్టాల పంపిణీలో వివక్షత లేకుండా పాలన జరుగుతోందన్నారు. భీమిలిలో టిడిపి గ్రామాలు అధికంగా ఉన్నా అర్హత ఉన్న అందరికీ ఇళ్లు ఇవ్వడడానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పంట నష్టం జరిగినా గత ప్రభుత్వ హయాంలో కాలయాపన చేసారే తప్ప రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని..గతం తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు చెప్పిన దానికంటే ముందే పరిహారం అందిస్తున్నామన్నారు. సచివాలయాల వద్ద పంటకి ఇన్సూరెన్స్, అధిక దిగుబడులు వచ్చేలా విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు,రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడం అన్ని రకాలుగా సహయ సహకారాలు అందిస్తున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా నిలుస్తున్న విషయం దేశమే కీర్తిస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
తిరుమలలో శ్రీవారికి జనవరి నెలలో నిర్వహించే విశేష కార్యక్రమాలు, ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అవన్నీ ఈ క్రింది విధంగా ఆయా తేదీల్లో జరగనున్నాయి..
- జనవరి 7న అధ్యయనోత్సవాలు సమాప్తి.
- జనవరి 8న తిరుమలనంబి సన్నిధికి శ్రీ మలయప్పస్వామివారు వేంచేపు.
- జనవరి 9, 24వ తేదీల్లో సర్వ ఏకాదశి.
- జనవరి 10న శ్రీ తొండరడిప్పొడియాళ్వార్ వర్షతిరునక్షత్రం.
- జనవరి 13న భోగి పండుగ.
- జనవరి 14న మకర సంక్రాంతి.
- జనవరి 15న కనుమ పండుగ, శ్రీ గోదా పరిణయోత్సవం, తిరుమల శ్రీవారి శ్రీ పార్వేట ఉత్సవం.
- జనవరి 28న శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి.
- జనవరి 30న శ్రీ తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం.
ఆంధ్రప్రదేశ్ లో సమాచార శాఖ సిబ్బంది లేమితో కొట్టిమిట్టాడుతోంది..ఏపీఆర్వోలు, డిపీఆర్వోలు,డిప్యూటీ డైరెక్టర్లు, ఏడీస్థాయి అధికారుల ఖాళీలు భారీగా ఏర్పడటంతో ప్రభుత్వ కార్యక్రమాలను మీడియాకి ప్రెస్ నోటు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో సమాచారశాఖలో సినిమా ఆపరేటర్లను ఫోటో గ్రాఫర్లుగానూ, ఏపీఆర్వోలగాను వినియోగిస్తుండగా, మరికొన్ని చోట్ల ఏపీఆర్వో చేసే ఉద్యోగాన్ని ఏడీలు, డిడిలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఏపీఆర్వోలను ప్రభుత్వం నియమించినా వారికి ప్రెస్ నోట్లు రాయడం రాకపోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. దీనితో సిబ్బంది కొరత ఉన్న విభాగాల్లో వారిని వినియోగించుకుంటున్నారు సమాచారశాఖ అధికారులు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు మంత్రులు ఉండటంతో వారి ప్రెస్ కవరేజీ సమాచారశాఖకు తలనొప్పిగా తయారైంది. కొన్ని జిల్లాల్లో కార్యక్రమం జరిగిన వెంటనే వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారాన్నిపంపుతున్నా...మరికొన్ని జిల్లాల్లో సమాచారశాఖ కనీసం ప్రెస్ కోసం వాట్సప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయలేదు. కాదు కాదు చేస్తే మరింత ఒత్తిడి పెరుతుందని మానేశారు. ఇంకా పాత జీమెయిల్ విధానంలోనే ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు అరకొరగా పంపుతున్నారు. మంత్రులు వద్ద పీఆర్వోలు ఉన్నప్పటికీ వారు ఆయా జిల్లాలకే కొద్దిమంది మీడియాకే పరిమితం అవుతున్నారు. మంత్రుల కార్యక్రమాలు నేరుగారు సమాచారశాఖ కు కాకుండా వారే మీడియాలకు పంపుతున్నారు. దీనితో మంత్రుల కార్యక్రమాలకు సమాచారశాఖ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లే సమయంలో మిగిలిన ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కార్యాలయాల్లోని టైపిస్తులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫోటో గ్రాఫర్లు ఇలా చాలా పోస్టులే సమాచారశాఖలో ఖాళీగా ఉండిపోయాయి. రాష్ట్ర రాజధాని రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్న తరుణంలో ముఖ్యమైన మూడు జిల్లాల్లోని సమాచారశాఖ శాఖలో ఏపీఆర్వోలు, కార్యాలయ సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుందని అంతా భావించినా సిబ్బంది నియామకంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా చాలా చోట్ల ప్రభుత్వ పథకాల సమాచారం కూడా పత్రికలు, ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలకు రాకుండా పోతుంది. ప్రతీ జిల్లా నుంచి అరకొరగానే ప్రెస్ నోట్లు వస్తున్నాయి. మంత్రులు కార్యక్రమాలు తప్పా సమాచారశాఖకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కార్యక్రమాలు కవర్ చేసే అవకాశం లేకుండా పోతుంది. డిడి, ఏడీ, డిపీఆర్వో, డివిజనల్ పీఆర్వోల మీద భారం మొత్తం పడిపోతుంది. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా సమాచారశాఖలోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పాతబడినవి కావడం కూడా వేగంగా మీడియాకి సమాచారం అందించే విషయంలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఒక్కో జిల్లాకి ముగ్గురు ఏపీఆర్వోలను నియమిస్తే తప్పా ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి కష్టంగా మరుతోంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే సమాచారశాఖలో ఖాళీలను భర్తీ చేస్తే పరిస్థితి కొలిక్కి వచ్చేటట్టు కనిపించడంలేదు..ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి..
ప్రతి పథకం అక్క చెల్లెమ్మల పేరుమీదనే మంజూరు చేస్తూ మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశ్యంతో పథకాల రూపకల్పన చేస్తూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఉరందూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప్పొంగిన అభిమానంతో ప్రజల కరతాళ ద్వానుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 25 న వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పండుగ సందర్భంగా గొప్ప కార్యక్రమమైన పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలా 75 వేల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి విడతలో 15 లక్షలా 65 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2 లక్షలా 50 వేల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి విడతలో 1,78,840 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి లో అక్క చెల్లెమ్మలకు పంపిణీ చేస్తున్న భూమి కి మంచి మార్కెట్ విలువ కలదని, అధికారం లోకి వచ్చిన 18 నెలల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రతి పథకం మహిళల పేరుమీదనే రూపకల్పన చేస్తున్నామని, మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మహిళలను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది అర్హులైన తల్లుల ఖాతాల్లోకి రూ. 6,350 కోట్లు, విద్యా దీవెన పథకం కింద 18 లక్షలా 52 వేల మందికి రూ. 4వేల కోట్లు, వసతి దీవెన పథకం కింద 15 లక్షలా 56 వేల మంది తల్లులకు రూ. 1,221 కోట్లు, వై.ఎస్ ఆర్ ఆసరా కింద ప్రతి పొదుపు సంఘం లో ఉన్న 87 లక్షలా 74 వేల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6792 కోట్లు, వై.ఎస్.ఆర్ చేయూత కింద 24 లక్షలా 55 వేల మందికి రూ.4604 కోట్లు, పొదుపు సంఘాలలో ఉన్న 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వారి తరఫున వడ్డీ 1400 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని, కాపు నేస్తం కింద 3 లక్షల 28 వేల మందికి రూ. 491 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇలా ప్రతి పథకం ద్వారా పొందే లబ్ధి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. వీటితో పాటు మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారిని అభివృద్ధి చేసేందుకు రాజకీయ పదవుల్లో కూడా 50 శాతం వారికి కేటాయించడం జరుగుతోందని తెలిపారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని తెలుపగా ప్రస్తుతం 31 లక్షల పక్కా ఇండ్లు ఇస్తున్నామని సగర్వంగా తెలిపారు. ఇంకనూ అర్హత ఉండి ఇళ్ళు పొందని నిరుపేదలు ఉంటే సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఒక్క రూపాయ కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ వై.ఎస్. జగనన్న కాలనీని ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, ఈ కాలనీ లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 7 వేల కోట్ల పై చిలుకు ఖర్చు అవుతుందని తెలిపారు. గతం లో 224 చ. అడుగులతో ఇండ్ల నిర్మాణం మహిళలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం 340 చ. అడుగులతో ఇళ్ళ నిర్మాణం చేపట్టామని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే 68 వేల 361 ఎకరాలు భూమిలో లేఔట్లు వేసి అభివృద్ధి చేసి ఇస్తున్నామని వీటి మార్కెట్ విలువ రూ. 25 వేల 530 కోట్లు ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాలలో ఒకటి నుండి 1.5 సెంట్లు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రతి లేఔట్ లోనూ మోడల్ ఇళ్ళు నిర్మించడం జరుగుతున్నదని, ప్రతి ఇంట్లో ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్, వరండా, టాయ్లెట్ వంటి సౌకర్యాలతో పాటు రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబు లైట్లు, రెండు ఎల్ ఈ డి బల్బులు పచ్చదనం పెంచేందుకు ప్రతి ఇంటికీ మొక్కల పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఇండ్ల పట్టాల పంపిణీ రోజే వారి స్థలాన్ని వారికే కేటాయించి ఆరోజే వారికి స్వాధీనం చేయడం ఎప్పుడూ జరగలేదని తెలిపారు. మొదటి దశలో 15 లక్షలా 25 వేల ఇళ్ల నిర్మాణం, రెండవ దశ వచ్చే సంవత్సరం లో మొదలవుతుతుందని, టిడ్కో కింద లబ్ధిదారుల ఆప్షన్ మేరకు కేవలం ఒక్క రూపాయతో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఆప్షన్ లలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నా ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతుందని, లబ్ధిదారుల పేరు పైన ఉన్న ఇళ్ళు 5 సం. ల తరువాత ఇళ్ళు అమ్ముకోవడానికి బ్యాంకు లోను తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం న్యాయ పరమైన ఇబ్బందులు ఉన్నందున ప్రస్తుతం డి ఫామ్ పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదని, అడ్డంకులు తొలగిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు 30 రకాల వృత్తిదారులకు ప్రత్యక్ష మరియు పరోక్షంగా పని ఏర్పడుతుందని తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన పుష్ప, జ్యోతి, ధనలక్ష్మి, సృజనీ, రజియాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం మొదట జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా ముఖ్యమంత్రి దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణ దాస్, గృహ నిర్మాణ శాఖామాత్యులు రంగనాథ రాజు, ఎంపీ లు రెడ్డెప్ప, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపిఐఐసి చైర్ పర్సన్ రోజా, శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, కరుణాకర రెడ్డి, ఆదిమూలం, నవాజ్ బాషా, ద్వారకనాథ రెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి, వెంకటే గౌడ్, ఆరణి శ్రీనివాసులు, ఎం ఎస్ బాబు, ముఖ్యమంత్రి పర్యటన పరిశీలకులు తలశీల రఘురాం సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉషారాణి, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, జాయింట్ కలెక్టర్లు డి. మార్కండేయులు, వి. వీరబ్రహ్మం, రాజశేఖర్, డిఆర్ఓ మురళి, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సామాన్యరైతులకు అందుబాటుధరల్లో వ్యవసాయ ఉపకరణాలు తయారుచేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సిపెట్ విద్యార్ధులు, అధ్యాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కు పిలుపునిచ్చారు. సోమవారం గన్నవరం మండలంలోని సూరంపల్లి గ్రామంలో కోవిడ్ సక్రమణ తర్వాత ద్వితీయ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సిపెట్ సంస్ధ పురోభివృద్ధిని పరిశీలించి, అనంతరం విద్యార్ధులతో ముచ్చటించారు. ఈసందర్భంగా యం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కోవిడ్ సంక్రమణ సందర్భంగా వర్చువల్ సభల కంటే నేరుగా ముఖాముఖి సమావేశం పెట్టుకోవడమే ఎంతో తృప్తినిస్తుందని చెప్పారు. నాణ్యత, ప్రామాణికత, అత్యల్పధరలతో వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఆరోగ్యం, ఆటోమొబైల్, మానవుడుకి అనునిత్యం అవసరమయ్యే సెల్ ఫోన్, పెన్ను వాటిల్లో కూడా ప్లాస్టిక్ వినియోగంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. వ్యవసాయరంగంలో కూడా క్రొత్త ఆవిష్కరణలు పెరిగితే అవి రైతుకు ఎ ంతో ఉపయోగపడతాయన్నారు.
ప్రకృతి అందించిన సంపదను భవిష్యత్తు తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతితో స్నేహంగా ఉండకపోతే సమాజమంతా నష్టపోవాల్సి వస్తుందని దానికి తార్కాణాలు ఎ న్నో మనముందుకు వచ్చాయన్నారు. ప్లాస్టిక్ వాడకం, దాన్ని వాడిన తర్వాత తిరిగి మళ్లీ ఉపయోగంలోకితేవడం జరగాలన్నారు. నష్టాల్లో ఉన్న సిపెట్ విద్యాసంస్ధ లాభసాటి వ్యవస్ధగా ఎ దగడం చాలా సంతోషాన్నిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణాతో విడిపోయినప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు ఏమీ లేవని తనకు ఆందోళనగా ఉండేదన్నారు. కేంద్రప్రభుత్వం సహకరించడం వల్ల 36 కేంద్రసంస్ధలు రాష్ట్రంలో నెలకొల్పామన్నారు. క్రొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి తనవంతుపాత్రగా సంబంధిత మంత్రిత్వశాఖల మంత్రులతోనూ, అధికారులతోనూ చర్చించి లాభసాటిగా నిలిచేలాగా ఉన్న పధకాలు వివరాలు తెలుసుకుని వాటి అమలుకు కృషి చేశానన్నారు. ఆదిశలో ఆయా మంత్రులు, అధికారుల సహకారం హర్షణీయం అన్నారు.
సిపెట్ ఏర్పాటు సందర్భంలో అప్పటికేంద్ర మంత్రి అనంతకుమార్ , ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చినసహకారం, తోడ్పాటు అభినందనీయం అని ఈసందర్భంగా వారిని శ్లాఘించుకోవడం మన కర్తవ్యం అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశంలో 65 శాతంమంది జనాభా 35 సంవత్సరాల లోపువారు కాగా, 15 శాతం మంది 36 నుండి 50 సంవత్సరాలలోపువారు ఉన్నారన్నారు. యువతరాన్ని నైపుణ్యాభివృద్ధి , సాంకేతికత, పరిశోధనలు, విద్యాసంబంధిత అంశాలలో ప్రోత్సహించడం ద్వారా గణనీయమైన అభివృద్ధిని సాధించగలుగుతామన్నారు. ప్రకృతితో కలిచి నడవాలని, ప్రకృతిని ప్రేమించాలని, పర్యావరణానికి హానికలిగించే వాటిపట్ల జాగురూకత వహించాల్సి ఉంటుందన్నారు. కేవలం ప్రభుత్వం వల్ల మాత్రమే ఇది సాధ్యంకాదని ప్రజల స్వచ్ఛంధ భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఉత్తమఫలితాలను సాధించగలుగుతామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను మళ్లీ ఉపయోగంలోకి తేవడంపై ప్రత్యేక దృష్టి పెట్టమని సిపెట్ అధికారులను వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.
నాణ్యత, ఎ క్కువకాలం మన్నిక వస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పర్యావరణానికి సవాళ్లు విసురుతోందని ఆయన చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు మరింత నష్టంకలగజేస్తుందన్నారు. దీనికి పరిష్కారం ప్లాస్టిక్‌ను నియంత్రించడం కానేకాదని, వినియోగదారుల్లో బాధ్యత, సక్రమంగా రీసైకిల్ చేసుకోవాలన్నారు. త్వరలో నెల్లూరు జిల్లాలో సిపెట్ సంస్ధ ఏర్పాటుచేస్తామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన అంగీకారాన్ని కూడా తెలిపిందన్నారు. ఈసమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పెట్రోలియం మరియు పెట్రోకెమికల్స్ జాయింట్ సెక్రటరీ కాశీనాధ్‌ఝూ మాట్లాడుతూ 2016 లో కేంద్రమంత్రిగా యం. వెంకయ్యనాయుడు చేతులుమీదుగా సిపెట్‌కు శంఖుస్ధాపన జరిగిందన్నారు. అదేసంస్ధ అభివృద్ధి చెంది దాదాపు 9500 మంది విద్యార్ధులకు కళాశాలల్లో శిక్షణ కూడా ఇచ్చిందన్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా పిల్లలఆటవస్తువుల తయారీలో సిపెట్ కృషి చేస్తోందన్నారు. ఫ్లెక్సిబుల్, ఎ లక్ట్రానిక్ ఆటవస్తువుల రూపకల్పనకు విశేషంగా కృషి జరుగుతోందన్నారు.
సిపెట్ డైరెక్టర్ జనరల్ డా. యస్.కె. నాయక్ మాట్లాడుతూ భవిష్యత్తులో విజయవాడనగరం ఒక గ్లోబల్ సిటీగా మారనుందని, ఆకేంద్రంలో సిపెట్ విద్యాసంస్ధ నెలకొల్పేందుకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక కృషి చేశారన్నారు. దాదాపు 3 లక్షలమంది విద్యార్ధులను తయారుచేస్తున్న దేశంలోని సిపెట్ సంస్ధలు వచ్చే 2024 నాటికి 5 లక్షలకు విద్యార్ధులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సమావేశంలో రాష్ట్రదేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్, సిపెట్ ప్రిన్సిపల్ డైరెక్టరు ఆర్. రాజేంద్రన్, సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర, సిపెట్ కేంద్రం ఇన్‌ఛార్జ్ శేఖర్ , తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటి మీట్ నిర్వహిస్తున్నట్లు అనంతపూర్ రేంజ్ డి.ఐ.జి క్రాంతి రాణా ఠాటా తెలిపారు. శనివారం ఆయన తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి. ఏ.రమేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మొదటి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ 2021 జనవరి 4 నుంచి 7 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ సూచనల మేరకు రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్-2020 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. దీనికి వేదికగా స్థానిక ఏ.ఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్, PTC కల్యాణి డ్యాం ఆతిథ్యం ఇవ్వనున్నాయన్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ యస్.పి స్థాయి అధికారి వరకు పాల్గొంటున్నారని చెప్పారు. కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వార్డ్, ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి, పోట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐ.ఓ ఫోటోగ్రఫీ మొదలగు వాటిపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన వారిని జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపిక చేస్తామన్నారు. అదేవిదంగా ప్రతి రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపదేవిధంగా విజ్ఞానాన్ని పెంపొందిచే చర్చా వేదికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక విద్యార్ధి కూడా వీటిని వీక్షించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కర్యరమానికి ముఖ్య అతిధిలుగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత , రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ పాల్గొని ప్రారంబిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన ట్రైనీ ఐ.పి.యస్ అధికారులు, జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో బిఎస్‌ఎన్‌ఎల్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్, ఎంబిఏ విద్యార్థులకు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను, సాంకేతిక అంశాలపై శిక్షణ అందించే దిశగా ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. శనివారం ఏయూ పాలకమండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్‌షిప్, నైపుణ్య శిక్షణను భాగం చేసిందన్నారు. దీనిని ఏడాదిన్నర క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి ప్రతిపాదించారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి దీనిని ఆచరణలో చూపడం జరుగుతోందన్నారు. విశ్వవిద్యాలయ పరిశోధకులకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. వర్సిటీతో సంయుక్తంగా పరిశోధనలు జరపాలని ఆహ్వానించారు.
బిఎస్‌ఎన్‌ఎల్ పిజిఎం పి.విలియమ్స్ మాట్లాడుతూ దేశానికి మానవ వనరులే సంపదగా నిలుస్తున్నాయన్నారు. వీరికి మెరుగైన నైపుణ్యాలు, సామర్ధ్యాలను అందించే దిశగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉదంన్నారు. విద్యార్తులకు అవసరమైన ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించడంలో బిఎస్‌ఎన్‌ఎల్ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.బిఎస్‌ఎన్‌ఎల్ ఏజిఎం ఎం.సత్యప్రసాద్ శిక్షణలో భాగంగా అందించే శిక్షణ కార్యక్రమాలు, కోర్సు వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.కె భట్టి, అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు, డీన్ ఆచార్య ఏ.భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎందరో అభిమానులకు ఆరాధ్యుడు రజనీకాంత్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ భగంతుడ్ని ప్రార్థిస్తున్నటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు రజనీకాంత్ సేవలు ఎంతో అవసరమన్నారు. త్వరలో ఆయన రాజకీయాలలోకి వచ్చి సమాజానికి సేవలు అందించాలని విజయ్ చందర్ ఆకాంక్షించారు. తెలుగుప్రజలకు అతి దగ్గరవాడైన రజనీకాంత్ కోలుకొని తన అనుకున్న లక్ష్యాలను సాధించే సంకల్పంతో మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తారని విజయ్ చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అస్వస్థకు గురయ్యారని తెలియగానే ఎంతో ఆవేదనకు గురయ్యారని అన్న ఆయన ఆయన త్వరగా కోలుకోవాలని ఆ షిర్డీసాయినాధుడిని మనసారా కోరుతున్నానని చెప్పారు.
నా సుదీర్ఘ 3,648 కి.మీ..పాదయాత్రలో గూడులేని పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని, అందుకే పేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో శుక్రవారం మొదలు 15 రోజుల పాటు పట్టాల పంపిణీ పండగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరి గ్రామంలోని భారీ లేఅవుట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కాచెల్లెమ్మలకు 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు కిరణాల సాక్షిగా పేద మహిళలకు ఇళ్ల పట్టాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి శుభదినాన ఇల్లులేని పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. మొత్తం 28.30 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా తొలిదశలో 15.60 లక్షల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మించనున్నామన్నారు. రూ.50,940 కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సొంత ఇల్లు లేని పేద మహిళలకు 17,005 జగనన్న వైఎస్సార్ కాలనీల్లో లే అవుట్లను అభివృద్ధి చేసి, ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతకంటే నాకు దేవుడు ఇచ్చిన వరం ఏముంటుందన్నారు. ఈ జన్మకు ఇది చాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా సెంటున్నర భూమి, పట్టణ ప్రాంతాల్లో సెంటు నుంచి సెంటున్నర భూమిలో ఇళ్ల పట్టాలను మహిళా లబ్ధిదారులకు దాదాపు 68,361 ఎకరాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.21,345 కోట్ల విలువగల 2.62 లక్షల టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్‌లను కూడా అక్కాచెల్లెమ్మలకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇళ్ల స్థలాల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉండి, ఇల్లు లేనివారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇంటి పట్టా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పేదలకు సొంతింటితో సామాజిక గౌరవాన్ని కల్పిస్తామన్నారు.
కాలనీలు కాదు.. ఊళ్లకు ఊళ్లే రాబోతున్నాయి
కొమరగిరి లేఅవుట్‌ను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ లేఅవుట్‌లో దాదాపు 16,681 ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో వైఎస్సార్ జనతా బజార్, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రం, బస్టాప్, అంగన్‌వాడీ కేంద్రాలు, ఫంక్షన్ హాల్, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కమ్యూనిటీహాల్, పార్కులు తదితరాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల పరిమాణాన్నిబట్టి మురుగునీటి వ్యవస్థ, అప్రోచ్ రోడ్లు, విద్యుత్, తాగునీరు... ఇలా సకల సామాజిక మౌలిక వసతులను ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కనీసం రూ.4 లక్షల మార్కెట్ విలువగల ప్లాటును ఈ రోజు అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నట్లు తెలిపారు. ఓ అన్నగా, తమ్ముడిగా ఉంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని దేవుడు నాతో చేయిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నానన్నారు. పక్కా ఇల్లు లేకపోతే కష్టం ఎలా ఉంటుందో పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశానన్నారు. పేదలు తాము సంపాదించిన మొత్తంలో దాదాపు 35 నుంచి 40 శాతం అద్దెలకే చెల్లించి ఎంతో కష్టాలు అనుభవిస్తుండటాన్ని గమనించానన్నారు. చాలీచాలని జీతాలతో బతుకు బండిని లాగిస్తున్న పేదల బతుకులను కళ్లారా చూశానన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేదలకు సొంతిళ్ల అంశాన్ని చేర్చామని, మ్యానిఫెస్టో తనకు ఓ బైబిలు, ఖురాన్, భగవద్గీత అని పేర్కొన్నారు. అందుకే మ్యానిఫెస్టో అమలుకు అహర్నిశలూ కృషిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలు, మతాలు, కులాలు, రాజకీయాలు, వర్గాలు.. ఇలా ఏవీ చూడకుండా అర్హత మాత్రమే ప్రాతిపదికగా అయిదేళ్లలో 25 లక్షల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చామని, కానీ.. అంతకుమించి ఈ రోజు 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు.. అయితే ఇప్పుడు ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి 24 లక్షల మంది జనాభాకు మేలు జరుగుతోందని సగర్వంగా చెబుతున్నాను. 340 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
* అందరూ కలిసి ఉంటేనే అది రాజధాని*
అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారు అందరూ కలిసి ఉండగలిగితేనే అది రాజధాని అవుతుందని, దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అందరికీ చోటిస్తేనే అది సమాజమని, అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వమవుతుందన్నారు. అలాంటి రాజధానిని, సమాజాన్ని, ప్రభుత్వాన్ని దేవుని చల్లని దీవెనలతో తప్పనిసరిగా నిర్మించుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఏ పథకం కావాలి?
టిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టి, మధ్యలో వదిలేసి వెళ్లిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2.62 లక్షల టిడ్కో గృహాలను త్వరలోనే పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరో రూ.9,500 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. 300 చదరపు అడుగుల లోపు ఇంటికయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కేవలం ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు ఇచ్చే జగనన్నపథకం కావాలో.. లేదంటే రూ.2 లక్షల 65వేల బ్యాంకు రుణాన్ని 20 ఏళ్లపాటు వడ్డీతో పాటు రూ.7.20 లక్షలు ఖర్చయ్యే గత ప్రభుత్వ స్కీం కావాలో తేల్చుకోవాలని ముఖ్యమంత్రి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.
ఇంకా ముఖ్యమంత్రి ఏమన్నారంటే:
- అక్కాచెల్లెమ్మలకు లేఅవుట్లను అభివృద్ధి చేసిన 68,361 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.25,530 కోట్లు.
- ఇళ్లను కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ప్రతి లేఅవుట్‌లోనూ ఓ మోడల్ ఇంటిని నిర్మించాం. అదే విధంగా ప్రతి ఒక్కరికీ ఇళ్లను ఇస్తాం.
- ప్రతి ఇంటిలో ఓ బెడ్‌రూం, లివింగ్ రూం, కిచెన్, వరండా, మరుగుదొడ్డి, స్నానాలగది, పైన సింటెక్స్ ట్యాంకు ఉంటుంది. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, రెండు ఎల్ఈడీ బల్బులు వంటివి ఉంటాయి.
- జగనన్న వైఎస్సార్ కాలనీలు ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున 13 లక్షల మొక్కలు నాటుతాం.
- అవినీతికి, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఇళ్ల స్థలాల కేటాయింపు చేశాం. సామాజిక తనిఖీ ప్రక్రియను చేపట్టాం.
- న్యాయపరమైన సమస్యలు తొలగిపోయిన అనంతరం ప్రస్తుతమిస్తున్న హౌస్‌సైట్ పట్టాల స్థానంలో అన్ని హక్కులతో అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తాం.
- రూపాయి లంచానికి కూడా తావులేకుండా 18 నెలల కాలంలో రూ.77 వేల కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశాం.
- నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల పనుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థకు ఊతం తు లభిస్తుంది.
- 1978 నాటి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగామార్చడం జరిగింది. దీనికోసం కృషిచేస్తుంటే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
మూడు ప్రత్యామ్నాయాలు
- ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్లను కూడా కట్టించి ఇవ్వనున్నందున ప్రభుత్వం మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు.
అవి.. 1. నమూనా ఇంటి ప్రకారం ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలను కూడా ఇస్తుంది. లబ్ధిదారుడే ఇల్లు కట్టించుకోవచ్చు.
2. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుడికే దశల వారీగా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీంతో లబ్ధిదారుడే ఇల్లు కట్టుకోవచ్చు.
3. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని ఇంటిని నిర్మించి ఇస్తుంది. ఈ మూడింటిలో దేన్నయినా లబ్ధిదారుడు ఎంపికచేసుకోవచ్చు. ఇలా ప్రభుత్వమే లబ్ధిదారుడి చేయి పట్టుకొని సొంతింటికి నడిపిస్తుంది.
శుక్రవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా, యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకాన్ని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి స్వాగతం పలుకగా, స్థానిక పిఠాపురం శాసన సభ్యులు పెండెం దొరబాబు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పరిపాలనా వికేంద్రీకరణలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను 2019 అక్టోబరు 2వ తేదీన తూర్పు గోదావరి జిల్లా నుండే ప్రారంభించారని, అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పధకం క్రింద ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్ల మంజూరు బృహత్తర కార్యక్రమాన్ని కూడా ఈ జిల్లా నుండే ప్రారంభించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 17 లక్షల కుటుంబాల్లోని 22 శాతంగా 3 లక్షల 25 వేల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయన్నారు. తొలి దశగా 2,725 కోట్ల వ్యయంతో లక్ష 53 వేల లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయడం అనందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమం కొసం దాదాపు 3168 కోట్లు బడ్జెట్ కేయించి ముఖ్యమంత్రి ఆర్థికమైన, నైతిక మైన మద్దతు కల్పించడంతో కరోనా కలకలం, అధిక వర్షాలు, వరదలు ఎదురైనా లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలిగామని తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ కొమరగిరిలో ఇళ్ల స్థలాలు పొందుతున్న లబ్దిదారులందరూ కాకినాడ సిటీ వారైనా, మంచి కార్యక్రమాన్ని తన నియోజక వర్గంలో ప్రారంభిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, అందరినీ గుండెలలో పెట్టి చూసుకుంటానని తెలిపారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా నాడు డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పవిత్ర క్రిస్టమస్, ముక్కోటి ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినాన ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. దేవుడి దీవనలు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సుల బలంతో ప్రతి పేదకు నిలువనీడ కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి చేపట్టిన సంకల్పాన్ని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అపలేరన్నారు. నియోజక వర్గంలో ఎన్నిక సందర్భంగా 10 వేల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చానని, ముఖ్యమంత్రి దయ వల్ల 31 వేల మందికి నియోజక వర్గ పరిధిలో ఇళ్లు కల్పించే అవకాశం తనకు లభించిందన్నారు.
ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పేదలందరి జీవితాల్లో సామాజిక భద్రత, గౌరవం కల్పిస్తూ సొంతింటి కలను సాకారం చేస్తున్న నవరత్నాలు – పేదలందరికి ఇళ్ల కార్యక్రమం ప్రారంభమౌతున్న ఈ రోజు వారందరికీ నిజమైన పండుగ రోజన్నారు. తొలి విడతగా 15.65 లక్షల ఇళ్లు చేపట్టగా, వచ్చే డిశంబరు నుండి మరో 12 లక్షల ఇల్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. పేదల ఇళ్ల స్థలాల కొరకు స్వచ్చందంగా భూములు అందించిన రైతులందరి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే కార్యక్రమంలో సిసిఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ బృహత్త ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాల మహత్త ఆశయాలను వివరించారు.