మావోయిస్టు నేత రామకృష్ణ అలియాస్ అశోక్ ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో 33 మంది పార్టీ సభ్యులు, 27 మంది మిలీషియా సభ్యులు డిజిపి హరికృష్ణ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. ఈ సందర్బంగా లొంగిపోయిన 60 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ సతీష్ కుమార్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల కృష్ణ, ఏఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం సాయంత్రం ఎఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో కలసి ముచ్చటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ అవసరాలను మాకు తెలియచేస్తే మేము పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, కొన్ని సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్ వివరించారు. లొంగిపోయిన సభ్యులలో కొండ్రుం, జూముడుం, తగ్గుపాడు, జుడిగూడ మొదలగు గ్రామాలకు చెందిన శ్రీకాంత్, లక్ష్మి, సూరిబాబు, కిల్లో శ్రీను తదితరులు ఆయా గ్రామాలలో రోడ్ లేదని, త్రాగు నీటి సదుపాయం లేదని, ఆధార్ లేదని, రేషన్ కార్డు లేదని, అంగన్వాడి భవనం లేదని, పాఠశాలకు అరకు నుండి ఒక టీచర్ వారానికి రెండు సార్లు పాఠశాలకు వస్తారని, కొండ్రుంగు గ్రామ వాలంటీర్ నెలకు రెండు సార్లు పాడేరు నుండి వస్తారని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ మీ గ్రామాలకు రెండు,మూడు రోజుల్లో వస్తామని, సమస్యలు పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. జిల్లాలో 6.50 లక్షల మందికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని, ఇంతకాలం మీరు అటువైపు ఉండి మీ జీవితాలనే కాకుండా పిల్లల భవిష్యత్తును కూడా త్యాగం చేసిసాధించింది ఏమీ లేదని, ఇప్పుడు జన జీవన స్రవంతిలో కలిశారు. మేము అందించే ఫలితాలు చూస్తారని అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. మీ సమస్యలు విన్నవించటానికి ఎప్పుడైనా నన్ను నేరుగా కలవొచ్చని కలక్టర్ స్పష్టం చేసారు.
ఐటీడీఏ పిఓ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ జమిగూడ నుండి బూసిపుట్టు వరకు రోడ్ నిర్మాణం జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో తారు వేస్తామని గుర్తు చేసారు. అదేవిధంగా, ప్రభుత్వం తరపున మేము మీకు అండగా ఉంటామని, మమ్మల్ని నమ్మండి అని సూచించారు. ఇటీవల జమిగూడ నుండి 120 మంది సమస్యలపై నన్ను కలవటానికి వచ్చినప్పటికీ రాత్రి వరకు కలవలేకపోయానని, వారి సమస్య విని వారికి భోజనాలు పెట్టించి ప్రత్యేక వాహనంలో వారి గ్రామానికి పంపించిన విషయం గుర్తు చేసిన పిఓ మీకోసం మేమున్నామన్న నమ్మకం కలిగి ఉండాలని కోరారు. ముందుగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీసులు, ప్రభుత్వం మీకు శత్రువులు కాదని, మీ హితం కోరే మిత్రులుగా గుర్తించాలని కోరారు. చాలామంది తెలీకుండానే మావోయిస్టుల వైపు వెళుతున్నారని, అది సరి కాదని, సమస్యలుంటే జిల్లా యంత్రాంగానికి చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు . అభివృద్ధి ఒక్క రోజులో జరిగేది కాదని, వేచి చుస్తే అభివృద్ధి కనిపిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ తుహిన్ సిన్హా, డిఎస్పీ (ఎసిబి) వెంకట రావు, పలువురు సి ఐలు, ఎస్ ఐలు , లొంగిపోయిన పార్టీ, మిలీషియా సభ్యులు పాల్గొన్నారు.