శ్రీకాకుళం జిల్లాలో కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయడమైనదని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అమిత్ బర్దార్ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యల్లో భాగంగా కర్ఫ్యూను చాలా పగడ్బంధీగా అమలు చేయడమైనదన్నారు. జిల్లాలో కోవిడ్ తగ్గుముఖం పట్టిందని, కర్ఫ్యూలో 23 వేల కేసులు నమోదు చేయడమైనదని, మాస్కు వేసుకోకుండా బయటకు వచ్చినవి 64 వేల కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతర్రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరైనా అనుమతి లేకుండా జిల్లాలోకి వస్తున్నారా లేదా పరిశీలించి పంపుతున్నట్లు చెప్పారు. పోలీసులు కోవిడ్ బారీన పడినప్పటికీ కోవిడ్ నివారణకు కష్టపడి పనిచేశారన్నారు. ఉదయం 5 గంటల నుండి పోలీసులు పనిచేసి రాత్రి సమయంలో కూడళ్లు, మార్కెట్ల్, నివాస ప్రాంతాల వద్ద ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి రోడ్ల పైకి వస్తే అలాంటి వారితో గౌరవంగా మాట్లాడి ఇంట్లోనే ఉండాలని, కోవిడ్ నివారణకు అందరూ సహకరించాలని పోలీసులు సూచిస్తున్నట్లు చెప్పారు. పోలీసులతో పాటు, వైద్య సిబ్బంది కోవిడ్ నివారణకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తునట్లు తెలిపారు. జిల్లాలో వ్యాక్సినేషన్ చాలా బాగా జరుగుతుదని, ఇప్పటికే సుమారు 97 శాతం వరకు జరిగినట్లు పేర్కొన్నారు. అందరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే, కోవిడ్ ను మన నియంత్రణలోకి తీసుకువచ్చి మూడవ దశ రాకుండా అరికట్టవచ్చునని ఆయన కోరారు. అవసరమైతే తప్ప ఎవరూ బయట తిరగవద్దని, అవసరానికి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించి, శానిటైజర్ వాడాలని ఆయన పిలుపునిచ్చారు.