తిరుపతి జిల్లాలో మాతాశిశు మరణాలు జీరో స్థాయికి రావాలని వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు వైద్యం అందించడంలో, పోషకాహారాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా ప్రసూతి మరణాల నిఘా, ప్రతిస్పందన (ఎం.డి.ఎస్.ఆర్.) కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అద్యక్షతన వైద్య అధికారులతో, ప్రసూతి మరణాలకు సంబందించిన వారి కుటుంబీకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత డిసెంబర్ మాసంలో జరిగిన రెండు మాతృ మరణాలు, ఐదు శిశు మరణాలపై సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని భాద్యతతో వైద్యశాఖ గర్భిణీలకు వైద్యం అందించడంలో శ్రద్ధ కనబరచాలని, మహిళా శిశుసంక్షేమ శాఖ పోషకాహార లోపాలు ఉన్న గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందించడం, ఇరాన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు సరైన సమయానికి వాడేలా చూడాలని అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు.
మాతృ మరణాలకు సంబంధించి వాకాడు మండలం బాలిరెడ్డి పల్లి అఖిల, డక్కిలి మండలం వెంకటరమణమ్మ మరణాలపై చికిత్స అందించిన డాక్టర్లతో, కుటుంబ సభ్యులతో వైద్య చికిత్సలపై ఆరా తీశారు. హై రిస్క్ గర్భవతులు అని గుర్తించినా స్థానికంగా చికిత్స అందించడం, కనీసం ప్రసవానికి వారం ముందే ప్రధాన ఆసుపత్రులలో చేర్పించకపోవడం అలసత్వం అవుతుందని పూర్తి స్థాయి విచారణకు డి.ఎం.అండ్. హెచ్.ఓ. ను ఆదేశించారు. 108 వాహనాలు హై రిస్క్ గర్భవతులకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని, పి.హెచ్.సి. డాక్టర్లు 108 కాల్ సెంటర్ తో పాటు స్థానిక డ్రైవర్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. శిశు మరణాలకు సంబంధించి పిచ్చాటూరు మండలం ముడియూరు బేబి ఈశ్వర్ కు పాలు పట్టడంలో తల్లిదండ్రుల పొరపాట్లు, డక్కిలి కి సంబంధించి చెంచు లక్ష్మీ బేబీ బరువు తక్కువతో పుట్టడం, గూడూరు మండలం చెన్నూరు శ్రీలత బేబి గుండెకు రంద్రం, చిల్లకూరు మస్తానమ్మ బేబి తీవ్ర జ్వరంతో , శ్రీకాళహస్తి ఎంపేడు ప్రమీలమ్మ బేబి బరువు తక్కువతో పుట్టడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
వైద్య అధికారులు, శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలు, ఎ.ఎన్.ఎం. లు, ఆశా లు సరైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు త్వరలో శిక్షణ ఇవ్వాలని, తల్లిదండ్రులకు ఇవ్వవలసిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లాలో మాతృ మరణాలకు తావివ్వరాదని ఆదేశించారు. ఈ సమీక్షలో కమిటీ కన్వీనర్ డి.ఎం.హెచ్.ఓ. శ్రీహరి, డి.సి.హెచ్.ఎస్. ప్రభావతి, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థసారథిరెడ్డి, డి.ఐ.ఓ. శాంత కుమారి, చిన్న పిల్ల ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ, ఎం.డి.ఆర్. నోడల్ ఆఫీసర్ డా.నీలిమ, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్నా టాగూర్, సి.డి.పి.ఓ. పద్మజ, 108 సర్వీసెస్ పవన్ కుమార్, పి.హెచ్.సి. డాక్టర్లు, మాతృ శిశు మరణాలు జరిగిన కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ అనుప్ సత్పతి విశాఖపట్నం-కోరాపుట్ సెక్షన్‌ను శనివారం తనిఖీ చేశారు. స్టేషన్లలో ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలు, ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అంతేకాకుండా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను అధ్యయనం చేసేందుకు అధికారులతో కలిసి సుక్కు-కోరాపుట్ మధ్య రైలు పట్టాలు తప్పిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వెయిటింగ్ హాల్స్ ,ప్లాట్‌ఫారమ్‌ల వద్ద ప్రయాణీకులతో సంభాషించారు. సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రధాన సమస్యలను వీలైనంత వరకు పరిశీలించి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని చెప్పారు. ఆయన వెంట ఎడిఆర్‌ఎం సుధీర్ కుమార్ గుప్తా, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ పి కె మహారాణా, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ జి. సునీల్ కుమార్, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ప్రవీణ్ భాటి, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ కె పాత్ర తదితరులు ఉన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రమైన సురుటుపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వర స్వామి వారికి టిటిడి తరఫున శనివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. టిటిడి ఛైర్మన్ సతీమణి స్వర్ణలతారెడ్డి, శ్రీవారి ఆలయ పారుపత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి, వేదపారాయణదారులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి టిటిడి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆలయ పాలకమండలి ఛైర్మన్ బాలాజిరెడ్డి, ఈవో రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు జూమ్ ద్వారా జిల్లాలోని పోలీసుల అధికారులతో పరీక్షా కేంద్రాల వద్ద తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు అభ్యర్థుల సౌలభ్యం కోసం చేసిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిం చారు. ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాల లలో మొత్తం 16750 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అవుతున్నారని అన్నారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొదట పేపరుకు మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ప్రాథమిక వ్రాత పరీక్ష ఉంటుందన్న ఆయన అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి పరీక్షా హాల్ లోకి అనుమతిస్తామని, సూచించిన సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించేది లేదని అభ్యర్ధులకు తెలియజేశారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.10 నుండి 8.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడి శ్రీవారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం - రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి - సారథి, మనస్సు - పగ్గాలు, ఇంద్రియాలు - గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.
అనంతరం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సిఇ నాగేశ్వరావు, ఇఇలు మురళి కృష్ణ, కృష్ణా రెడ్డి, మల్లికార్జున ప్రసాద్, సుమతి, డెప్యూటీ ఇఇ దామోదరం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, విజివో మనోహర్, ఏఇ చంద్ర శేఖర్, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, వెంకటస్వామి, కంకణ బట్టార్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.40 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.
ఏపీ శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి శుక్రవారం ఒక అభ్యర్థి జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆనందపురం మండలం, తర్లువాడ గ్రామానికి చెందిన ఇల్లిపల్లి.అప్పలరాజు స్వతంత్ర అభ్యర్థి గా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు . గురువారం నాడు రెండు సెట్ల పత్రాలు నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి డా. కోరెడ్ల రమాప్రభ తిరిగి శుక్రవారం మరొక రెండు సెట్ల నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ రాగా రెండవ రోజు శుక్రవారం (ఫిబ్రవరి 17) నాటికి మొత్తం ఇద్దరు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాగా వరుసగా 18, 19 ప్రభుత్వ సెలవు దినములు రావడంతో ఆరోజు నామినేషన్లు స్వీకరించబడవని రిటర్నింగ్ అధికారి తెలిజేశారు.
ఆర్ కెబీచ్, నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆశేష భక్త జనావళికి వైద్యునాధుడి దివ్యదర్శనం కల్పిస్తున్నారు. శుక్రవారం రాత్రి గాయత్రీ విద్యాసంస్థల ఛైర్మన్ పి.సోమరాజు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వందలాది మంది భక్తులు వైద్యనాధుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో ఉన్న జ్యోతిర్లింగాలు, వాటి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక భక్తిభావానికి సంబంధించిన అనేక ఫోటో ప్రదర్శనలులో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బ్రహ్మకుమారీస్ ప్రతినిధి శివలీల మాట్లాడుతూ గత ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించామన్నారు.
ఈ ఏడాది వైద్యునాధుడిగా పరమశివుని దర్శనం కల్పిస్తున్నామన్నారు. మూడు రోజులు పాటు భక్తులు ఆచరించే ఉపవాస, జాగరణల ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఆ పరమశివుడి కృపగా భావిస్తున్నట్లు సోమరాజు, శ్రీనుబాబులు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్యునాధుడిని దర్శించుకుంటే అన్ని రోగాలు , రుగ్మతలు నయమవుతాయని కాబట్టి శివరాత్రిరోజు ప్రతీ ఒక్కరూ ఈ దివ్యదర్శనాన్ని చేసుకోవాలని వీరు ఆకాంక్షించారు. అనంతరం ధ్యాన మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అందంగా శోభాయమానంగా అలంకరించారు.
మహా విశాఖనగరం పరిధిలోని ప్రధాన కేంద్రాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు క్రైమ్ డిసిపి జి.నాగన్న తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని సిరిపురం జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ కూడలి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనే విషయమై ప్రత్యే సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిటీ పోలిస్ కమిషనర్ సిహెచ్ ఆదేశాలమేరకు ఈ ప్రాంతాల గుర్తింపు చేపట్టినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా బంగారు దుకాణాలు, బట్టల షాపులు, ఇతర వ్యాపార కూడళ్ల వద్ద కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సదరు షాపుల నిర్వాహకులకు తెలియజేసినట్టు పేర్కొన్నారు. కెమెరాల ఏర్పాటు వలన ఆయా ప్రాంతాల పర్యవేక్షణ నేరుగా చేసుకోవడానికి, అనుమానితులను గుర్తించడానికి, దొంగతనాలు అరికట్టడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈయన వెంటన సిఐ ఎర్రమ్మనాయుడు, ఇమ్మానుయేలు రాజు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కిరండోల్ నుండి విశాఖకు వచ్చే గూడ్స్ రైలు ఒడిస్సాలోని సుక్కు కొరపుట్ మద్య శుక్రవారం పట్టాలు తప్పిందని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ అనుప్ తెలియజేశారు. ఉదయం కిరండోల్ నుండి విశాఖకు బయలుదేరి వెళ్తున్న గూడ్స్ రైలుకు ఒడిస్సాలోని సుక్కు కొరపుట్ మద్య రైల్ ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. గూడ్స్ రైలులో ఉన్న 8బోగిలు పట్టాలు తప్పయని వివరించారు. ఈ కారణంగా విశాఖ నుంచి కిరండోల్ కు మద్యాహ్నం వెళ్ళు ప్రత్యేక ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేశామన్నారు. పట్టాలు తప్పిన రైలు పునరుద్ధరణ జరిగిన తర్వాతే కిరండల్ వరకు ప్రత్యేక ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు పై ప్రకటన చేయనున్నట్టు ఆయన వివరించారు. విశాఖ-కిరండోల్ లైనులో ప్రయాణాలు చేసేవారు ఈ అంతరాయాన్ని గమనించాలని ఆయన కోరారు.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాధాన్యత భవనాలు, గృహ నిర్మాణాల అవసరాలకు అనుగుణంగా కొత్త ఇసుక రీచ్ లను గుర్తించి ప్రతిపాదనలు అందచెయ్యలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, మార్చి 2 నాటికి పర్యావరణ అనుమతుల కాలపరిమితి ముగిసే సాండ్ రీచ్ లకు సంబంధించి ప్రతి పాదనలు ప్రభుత్వానికి సాంకేతిక అంశాలు ప్రాతిపదికన సిద్దం చెయ్యాలన్నారు. జిల్లాలోఐదు సాండ్ రీచేస్ లకు చెందిన స్టాక్ పాయింట్స్, డిపో ల వివరాలు కలెక్టర్ కు అందచేశారు. చిడిపి లో 10043 మెట్రిక్ టన్నుల, ఉసులుమర్రు లో 10,544 ఏంటి, పందల పర్రు లో 7,074 ఏమ్ టి, పెండ్యాల లో 13,218 ఎంటి, కాపవరం లో 6,490 ఎంటి ఇసుక అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ నిర్మాణాలకు వినియోగించాడానికి అవసరమైన ఇసుక లభ్యత లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక మేరకు సిద్దంగా ఉండాలన్నారు.
ఉగాది నాటికి ఇళ్ళ నిర్మాణం పనులు వేగవంతం చేసే విధానం లో అడుగులు వేస్తున్న దృష్ట్యా, ప్రస్తుతం ఇంటి పనులకు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం లేనందున తగినంత ఇసుక లభ్యత ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం డివిజన్ వేమగిరి కడియాపులంక 4.57 హెక్టర్లలలో 45,700 క్యూబిక్ మీటర్ల కోసం క్షేత్ర స్థాయి తనిఖీ అనంతరం సమావేశం ముందు ఉంచిన ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. కాతేరు బోట్స్ మ్యాన్ సొసైటీ వారికి డీ సిల్టేషన్ కు సంబంధించి నాలుగు రిజిస్ట్రేషన్ సొసైటీ కు అనుమతులు మంజూరు చేయడం కోసం కమిటీ ఆమోదం తెలియచేసింది . ఇందుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని కమిటీ స్పష్టం చెయ్యడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నియమ నిబంధనలు పాటించని వారి లైసెన్స్, లీజు కాల పరిమితిని రద్దు చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కాకినాడ డిడి మైన్స్ ఈ. నరసింహ రెడ్డి, రాజమహేంద్రవరం ఏ డీ ఎమ్. విష్ణు వర్ధన్, ఆర్టీవో కేవి కృష్ణా రావు, ఈ ఈ పొల్యూషన్ జీ. కరుణ రేఖ, డి డి (గ్రౌండ్ వాటర్) వై. శ్రీనివాస్, సి ఐ (సెబ్) కే. రాంబాబు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పి వి రమణ, జెపి ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మహిళా, ఔత్సహిక పారిశ్రామికవేత్తలను అభ్యున్నతికి, తద్వారా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏప్రిల్ 4 వ తేదికి జిల్లా ఏర్పాటై ఏడాది సంవత్సరం పూర్తి కానున్న దృష్ట్యా 50 మంది మహిళా పారిశ్రామిక వేత్తలకు యూనిట్స్ ఏర్పాటుకు బ్యాంకర్స్ రుణాలు మంజూరు చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యాలన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి దశలో 200 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి అడుగులు పడ్డాయన్నారు. మార్చి, 2023 చివరి నాటికి మరో 1500 మందికి ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ దిశలో ఇప్పటివరకు ప్రధాన మంత్రి మహిళ ప్రోత్సాహ షెడ్యూల్ ప్రకారం, 206 మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించామన్నారు.
మొదటి విడతగా పరిశీలన అనంతరం 75 యూనిట్స్ బ్యాంకర్స్ రుణాలు మంజూరు చేయడం జరుగుతొందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎంఎస్ఎంఇ ప్రోగ్రాం క్రింద 2861 యూనిట్లకు గాను రూ. 474.89 కోట్లు పెట్టుబడి నిధి అందించగా 11741 మందికి ఉపాధికి అవకాశాలు లభించాయన్నారు. జిల్లాలో మరో 3 భారీ పరిశ్రమలు ఏర్పాటుకు గాను రూ. 1660 కోట్లతో నిర్మించునున్న పరిశ్రమలో వివిధ దశల్లో ఉన్నాయని ఈ పరిశ్రమల వలన 2691 మంది కి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమలు కొవ్వూరు మండలం పంగిడిలో సోలార్ గ్లాస్, నల్లజర్ల మండలం పోతవరంలో బయోటెక్నాలజీ, గోకవరం మండలం గుమ్మలదొడ్డి లో ఇన్ ఆర్గానిక్ కెమికల్స్ కంపెనీల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో క్లస్టర్ అభివృద్ధి ప్రోగ్రాం కింద రూ.15 కోట్ల ప్రతిపాదనతో 140 ఫర్నిచర్ క్లస్టర్ యూనిట్లు ఏప్రిల్ 2023 నాటికి ప్రారంభించినట్లు తెలిపారు.
2022 - 23 సంవత్సరానికి గాను జిల్లాలో సిలికాన్ కార్బన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ రాజమహేంద్రవరం వారిచే 27 యూనిట్లకు గాను రూ. 28 కోట్లు, గోదావరి సర్మిక్ అండ్ రీ ఫ్యాక్టరీ అసోసియేషన్ ధవలేశ్వరం వారు 25 యూనిట్లకు గాను రూ 10 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గా జిల్లాలో ఇప్పటివరకు డిఐసి, ఏపీకే విఐబి, కెవిఐసి క్రింద 611 దరఖాస్తులు రాగా 275 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 192 యూనిట్లు గ్రౌండ్లింగ్ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని పరిశ్రమల స్థాపన దిశగా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహం అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కే. వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ పి . ప్రదీప్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్, డిపిఓ పి. జగదాంబ, మైక్రో ఇరిగేషన్ అధికారి కె. శ్రీనివాసరావు, డిసిఐఎఫ్, ఏపీఐఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ విధానం ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖైదీలకు/ముద్దాయిలకు అందిస్తున్న న్యాయ సేవల గురించి సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి వివరించారు. శుక్రవారం ఆమె రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించి అక్కడ ఉన్న వసతులను ఆమె పరిశీలించారు. ఖైదీల కోస ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను వివరించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ, ముద్దాయికి అవసరమైన ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఉచిత న్యాయ సహాయం పొందడం వారి హక్కు అని తెలియజేశారు. ఖైదీలకు, ముద్దాయి లకు అందచేస్తున్న వైద్య సేవలు గురించి కారాగారం నందు పని చేస్తున్న వైద్యులతో మాట్లాడారు. అక్కడున్న వైద్య సదుపాయాలు, ఖైదీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. వసతులు, సదుపాయాల విషయంలో ఏ విధమైన అవసరాలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకు రావాలని వారికి సూచించారు. ఈ సందర్భం గా జైల్ సూపరింటెండెంట్ ఎస్. రాజారావు, జైల్ అధికారులు, మెడికల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ధార్మిక ప్రాజెక్టుల కార్యకలాపాలపై టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం జెఈవో సదా భార్గవితో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కార్యకలాపాలను తెలియజేశారు. ధార్మిక కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్‌ను రూపొందించాలని ఈవో సూచించారు. అనంతరం మనగుడి, కల్యాణమస్తు, గుడికో గోమాత, అష్టాదశపురాణాలు, అన్నమాచార్య సంకీర్తనలు, దాసపదాలు, ఆళ్వార్ల సాహిత్యం, చతుర్వేద హవనాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అయా ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, నియామకాలు, చెల్లింపులు, కళాకారుల సమస్యలపై వేరువేరుగా సమీక్షలు నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని జెఈవోకు ఈవో సూచించారు. ఈ సమీక్షలో ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. విభీషణశర్మ, హెచ్‌డిపిపి ఏఈవో శ్రీరాములు, ప్రోగ్రాం అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫిష్ ఆంధ్ర యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ఆర్ధికంగా సహకారం అందిస్తున్నందున ఈ రంగం లో ఆసక్తి ఉన్న యువతను, మహిళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. వండిన చేపల కూరలు మార్కెటింగ్ చేయుటకు స్టాళ్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను, కూడళ్లను గుర్తించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఫిష్, డైరీ డెవలప్మెంట్ యూనిట్ల లక్ష్యాల పై సమీక్షించారు. విద్యార్హత లు లేనందున ఆసక్తి వారికి అవగాహన కలిగించి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యూనిట్లను ఏర్పాటు చేయించాలని తెలిపారు. ఎఫ్.పి.ఓ లు మండలాల్లో జరిగే జె.ఎం.ఎల్.బి.సి సమావేశాలకు తప్పక హాజరు కావాలని, అలా హాజరు కాని వారి పై చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ డి డి నిర్మలకుమారిని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ ఆర్ అండ్ ఆర్ కలోనిస్ లో డిగ్రీ పాస్ అయిన వారిని గుర్తించి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని ఆ శాఖ అధికారి గోవింద రావు కు సూచించారు. పోలిపల్లి లో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని అన్నారు. కానీలలో తిరిగి షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ పెట్టాలి, ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు అనే అంశాలను డి.ఆర్.డి.ఏ, మెప్మా ల ద్వారా సర్వే చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లను నెలకొల్పేలా చూడాలని ఆ శాఖ జె.డి డా.రమణకు తెలిపారు. కొత్తవలస లో నున్న. మాంగో జెల్లీ ని ఆకర్షణీయమైన పాకింగ్ చేయించి జి 20 సదస్సుకు సిద్ధం చేయాలని డి.ఆర్.డి.ఏ పి.డి కల్యాణ చక్రవర్తి కి సూచించారు. ఈ సమావేశంలో జె.సి మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు, ఫిషరీష్ డిడి ఎన్.నిర్మలకుమారి, ఎల్.డి.ఎం శ్రీనివాస రావు, మెప్మా పిడి సుధాకర రావు, హార్టికల్చర్ డిడి జమదగ్ని తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంజిల్లాలోని మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రోజెక్ట్ ( రేగులపాడు రిజర్వాయర్ ) పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొ న్నారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆఫ్ షోర్ ప్రోజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆఫ్ షోర్ ప్రోజెక్ట్ క్రింద రామకృష్ణాపురం, చీపురుపల్లి,గోపివల్లభాపురం గ్రామాల నిర్వాసితులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించడం జరిగిందని తెలిపారు. అయితే ఆర్ అండ్ ఆర్ క్రింద ఆయా గ్రామాల్లో చేపట్టవలసిన మౌలిక వసతులు,ఇతర సదుపాయాలపై ఏ.పి.ఈ. డబ్ల్యు. ఐ.డి.సి, ఆర్.డబ్ల్యు. ఎస్. ,నెడ్ క్యాప్, టెక్కలి ఆర్.డి.ఓ మరియు ఏ.పి.ఈ. పి.డి.సి.ఎల్ శాఖల ద్వారా 38 పనులు అప్పగించడం జరిగిందన్నారు. అందులో ఇప్పటివరకు 13 పనులు పూర్తికాగా, 25పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.
ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీలతో మాట్లాడి పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ బిల్లులపై కూడా దృష్టి సారించాల్సి ఉందని కలెక్టర్ తేల్చిచెప్పారు. జిల్లాలో ఆఫ్ షోర్ కోసం చేపట్టవలసిన పెండింగ్ పనులకు సంబంధించి అవసరమైన నిధులు, పెండింగ్ బిల్లుల అంచనాలను శుక్రవారం నాటికి తమకు సమర్పించాలన్నారు. సబ్ కలెక్టర్, రెవెన్యూ, ఏ.పి. ఈ.డబ్ల్యు.ఐ.డి.సి, ఆర్.డబ్ల్యు.ఎస్.,ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పెండింగ్ బిల్లులపై దృష్టి సారించాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ సంయుక్త కలెక్టర్ బి.నవ్య, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్ డా.జి.జయదేవి, వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమలరావు, ఇతర అధికారులు, ఆయా మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.