శ్రీకాకుళం జిల్లాలో మీడియా ప్రతినిధులకు టీకా కార్యక్రమం ప్రత్యేకంగా ప్రారంభం అయింది. కోవిడ్ 19 టీకాను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ చొరవతో జర్నలిస్టులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేసారు. శుక్రవారం ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రతీ రోజు శ్రీకాకుళం నగరంలో బర్మా కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో టీకా అందిస్తారు. టీకా పొందుటకు జర్నలిస్టులు విధిగా ఆధార్ కార్డులతో సహా టీకా కేంద్రానికి వెళ్ళాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కోరారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుండి 59 సంవత్సరాల వయస్సుగల వారికి టీకా ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కోవాక్సిన్, కోవిషీల్డు వాక్సిన్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. టీకా పొందుటకు అర్హమైన వ్యక్తిగా వైద్యులు ధృవీకరించాలని తెలిపారు.
విశాఖజిల్లాలో రోజుకి 32 వేల మందికి కరోనా వేక్సిన్ వేయాలని వైద్యఆరోగ్యశాఖ కు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. దీనితో రంగంలోకి దిగిన కలెక్టర్ వినయ్ చంద్ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా వైద్యాధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణకు దిశా నిర్ధేశం చేశారు. కరోనా వేక్సిన్ వేసేందుకు నగరంతోపాటు జిల్లాలోనూ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గ్రామసచివాలయాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ కరోనా వేక్సిన్ వేయించి జీరో కరోనా కేసులకి చేరే విధంగా చక చకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ఆధారంగా వేక్సిన్ వేస్తున్నామని, ఇపుడు ఆ సంఖ్యను పెంచి అన్ని వర్గాల వారికీ కరోనా వేక్సిన్ వేస్తున్నామని డిఎంహెచ్ఓ ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా తెలియజేశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున్న కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ఆదారంగానే ఇప్పటి వరకూ వేక్సిన్ వేస్తూ వస్తున్నామన్నారు. ఇపుడు అన్ని పీహెచ్సీల వైద్యులతో సమావేశాలు నిర్వహించి ప్రతీ ఒక్కరికీ కరోనా వేక్సిన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రేపటి నుంచే లక్ష్యాలను అదిగమించడానికి అధికారులను, వైద్య, పారామెడికల్ సిబ్బందిని సిద్దం చేసినట్టు డిఎంహెచ్ఓ వివరించారు. మరోవైపు కరోనా కేసులు పెరగకుండా ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కూడా ఆయన సూచించారు. తరచుగా సబ్బుతో మొహం, చేతులు, కాళ్లు కడుక్కోవడం ద్వారా వైరస్ కు దూరంగా ఉండవచ్చునన్నారు.
రంగరాయ మెడికల్ కళాశాల మైక్రోబయాలజీ విభాగ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీ (వీఆర్‌డీఎల్) గతేడాది మార్చి 18న జీజీహెచ్‌లో కోవిడ్-19 పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిందని, కోవిడ్ సంక్షోభ కాలంలో ఈ కేంద్రం అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ పరీక్షలు ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా గురువారం కాకినాడలోని జీజీహెచ్‌లో మైక్రోబయాలజీ విభాగ వీఆర్‌డీఎల్ ప్రత్యేక నిరంతర వైద్య విద్య (సీఎంఈ) కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. కోవిడ్-19పై వైద్య విద్యార్థులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదట్లో కోవిడ్ పరీక్షల నిర్వహణకు శాంపిళ్లను పుణె పంపించాల్సి వచ్చిందని, తర్వాత కాకినాడ జీజీహెచ్‌లో కోవిడ్-19 పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళం మొదలు పశ్చిమ గోదావరి వరకు ప్రజల అవసరాలను తీర్చగలిగే స్థాయికి ఈ ల్యాబ్ ఎదిగిందని ప్రశంసించారు. ఇప్పటి వరకు ఈ కోవిడ్-19 పరీక్షల కేంద్రం 5,60,595 ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేసినట్లు వివరించారు. ఇక్కడ అత్యంత కచ్చితత్వంతో వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. దాదాపు 30 శాతం వరకు పాజిటివిటీ ఉన్న సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, భయాందోళనలు చెందకుండా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ డీఎస్ మూర్తి ఆధ్వర్యంలో ల్యాబ్ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలున్న వారిని చేర్చుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులు వెనుకాడేవని, అలాంటి సమయంలో ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజల్లో ధైర్యం నింపి, వైద్య సేవలు అందించారన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు ప్రచారం చేసే వారితో బాగా ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వదంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని , ప్రతి ఒక్కరూ కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
*ల్యాబ్ ద్వారా విశేష సేవలు: జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి
వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీ (వీఆర్‌డీఎల్)కి చెందిన కోవిడ్-19 పరీక్ష కేంద్రం కోవిడ్ విపత్తు సమయంలో విశేష సేవలందించిందని, మొత్తం బృందానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు జేసీ (డీ) కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాత్రి పగలు అనక బృంద సభ్యులు పనిచేశారన్నారు. కోవిడ్ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్/డీహెచ్ఆర్ నుంచి ఆమోదం పొందిన రాష్ట్రంలో రెండో ల్యాబ్‌గాగా ఈ ల్యాబ్ నిలిచినట్లు జేసీ తెలిపారు. కార్యక్రమంలో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.బాబ్జీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్. మహాలక్ష్మి, మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డా. జి.రత్న, వైద్యవిద్య బోధనా సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షను దారుల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ప్రవేశ పెట్టిన డా వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ హెల్త్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళిధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరిలు కోరారు. గురువారం కలెక్టరేట్ లో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందరర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు సంబందించి 64 శాఖల ఉద్యోగులకు 86,794 , 19 సబ్ ట్రజరీలకు చెందిన పెన్షనర్లుకు 42,886 ఈ హెల్త్ కార్డులు జారీ అయ్యాయన్నారు. వీటన్నింటినీ ఆయా శాఖల ఉద్యోగులకు అందచేయాలని జిల్లా కలెక్టర్ ఆరోగ్య శ్రీ అధికారులకు సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ కార్డుల ద్వారా ఆరోగ్యసేవలు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ డా. పి. రాధా కృష్ణ గారు, కె. నవీన్, జిల్లా మేనేజర్, ఆరోగ్యశ్రీ పాల్గొన్నారు.
క్రిష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పోరంకి సచివాలయాల పరిధిలోని ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్ కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ చెప్పారు. కోవిడ్ కేసులు తిరిగి నమోదుకావడంపై కలెక్టరు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు స్వచ్ఛధంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరిగి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. గత 10 రోజుల్లో జిల్లాలో 186 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజల్లో కోవిడ్ పట్ల భయం లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్పష్టంగా కనబడుతోందన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలో కరోనాకేసుల నమోదు స్ధాయి తగ్గి, గత పదిరోజుల్లోనే జిల్లాలో 186 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేయించుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పోరంకి సచివాలయాల పరిధిలో ప్రతీ ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ అందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. వ్యాక్సినేషన్ వేసుకోవడంతోపాటు భౌతికదూరం పాటించడం, మాస్క్ ఉపయోగించడం, శానిటైజర్ తప్పనిసరి అన్నారు. జిల్లాలో ఇప్పటికే లక్షమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ వేశామని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. తొలిదశలో మెడికల్, మున్సిపల్, పోలీస్, తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు జిల్లాకు సరఫరా అయిన కోవీషీల్డ్, కోవ్యాక్సిన్ వేశామన్నారు. త్వరలో మరిన్ని వ్యాక్సిన్ డోస్‌లు వస్తున్నాయన్నారు. ప్రజలు స్వచ్ఛధంగా వ్యాక్సినేషన్ వేయించుకోవడంతోపాటు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్న లక్షమందిలో ఎ లాంటి దుష్ప్రభావం చూపలేదన్నారు. ప్రజలు అపోహలు వదిలి వ్యాక్సినేషన్‌కు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. తద్వారా భవిష్యత్తులో కరోనా బారిన పడకుండా ఉండగలుగుతామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న 40 రోజుల్లో యాంటీబాడీస్ పూర్తిగా అభివృద్ది చెందుతాయన్నారు.
శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు నేరుగా సేవలందిస్తున్న వివిధ విభాగాల్లోని వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు టిటిడి ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించింది. టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 4వ తేదీ నుండి తిరుమలలో, మార్చి 5వ తేదీ నుండి తిరుపతిలో ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. మొదటి విడతలో భక్తులకు నేరుగా సేవలందించే ఉద్యోగులకు, రెండో విడతలో 45 ఏళ్లు పైబడి, షుగర్, బిపి సమస్యలు ఉన్న వారికి, మూడో విడతలో ఇతర ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు వేస్తారు. ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకుని కోవిడ్ వ్యాధి నుండి సురక్షితంగా ఉండాలని కోరారు. టిటిడి సిఎంఓ డాక్టర్ నర్మద, ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి, తిరుపతిలోని కేంద్రీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా జిల్లాను ఎయిడ్స్ రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. హెచ్ఐవి, ఎయిడ్స్‌పై కళాజాతాల ద్వారా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని ఆయన సోమవారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో ఈనెల 15 నుంచి 30 వ తేదీ వరకు కళాజాతా బృందాలతో వీధినాటకాల ద్వారా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఆర్ట్స్, ప్రతిభా ఆర్ట్స్ బృందాలు, ముందుగానే ఎంపిక గ్రామాల్లో 28 కార్యక్రమాలను నిర్వహించి, ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుందీ, వ్యాప్తి, నివారణా, నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. జిల్లాలో ఎయిడ్స్ కేసులు తగ్గుతున్నాయని, వీటిని పూర్తిగా నివారించడానికి ఇటువంటి ప్రచార కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి(ఎయిడ్స్, లెప్రసీ) డాక్టర్ జె.రవికుమార్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.బాలాజీ, ఇతర సిబ్బంది, ఎన్‌జిఓల ప్రతినిధులు పాల్గొన్నారు.
అందరి సమిష్టి కృషి వలనే విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్య శాలకు ISO సర్టిఫికేషన్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు. సోమవారం ప్రభుత్వ మానసిక వైద్య శాలలో ఏర్పాటు చేసిన ISO9001-2015 సర్టిఫికేషన్(ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్) ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మానసిక వైద్య శాలకు ISO 9001-2015 సర్టిఫికేషన్ రావడం చాలా సంతోషమన్నారు. అందరి సమిష్ట కృషి వలనే ISO 9001-2015 సర్టిఫికేషన్ వచ్చిందని తెలిపారు. సిబ్బంది, విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు అందరిని ఆయన అభినందించారు. ఇదే విధంగా మెంటైనెన్స్ చేయాలన్నారు. ప్రభుత్వ మానసిక ఆసుపత్రిని గుర్తించి ISO9001-2015 సర్టిఫికేషన్ ఇచ్చిన ఆలపాటి శివయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆసుపత్రికి వచ్చే మానసిక రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరిన్ని సదుపాయాల కో్సం జిల్లా కలెక్టర్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాధారాణి కోరగా సర్క్యులర్ పంపాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎం.డి. ఆలపాటి శివయ్య మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మానసిక వెైద్యశాలను పరిశీలించగా పారిశుద్యం, సిబ్బంది కో-ఆర్డినేషన్, ఫైర్ సేఫ్టీ, మందులు సరఫరా, తదితరమైనవి పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. పరిశీలనలో అవసరమైన కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. ఈ సర్టిఫికేట్ మూడు సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, మానసిక వైద్య శాఖ పర్యవేక్షకులు డా. ఎస్. రాధారాణి మాట్లాడుతూ మానసిక వైద్య శాలకు ISO 9001-2015 సర్టిఫికేషన్ చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ట్ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. కె.వి.వి. విజయ్ కుమార్, మానసిక వైద్య శాల సీనియర్ ప్రొఫెసర్ హిమకర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని గోపాలపట్నం పాఠశాలలో విద్యార్ధులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. విద్యార్ధుల పరిస్థితి ఎలా వుందనే కోసంణంలో విశాఖలో అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నియంత్రణ చర్యలు పాటించడంతోపాటు, విద్యార్ధులకు కరోనా రేపిడ్ టెస్టులు చేయించాలని డిఎంహెచ్ఓ ఎంఎస్ సూర్యనారాయణతో ఫోన్ లో మాట్లాడి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కింగ్ జార్జి ఆసుపత్రిలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని ఈ విషయంలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. మందులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులోనే ఉన్నారన్నారు. పాఠశాలలకు దగ్గర్లో ఉన్న పీహెచ్సీల నుంచి పాఠశాల విద్యార్ధుల నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నామని చెప్పారు. తీసుకున్న శాంపిళ్లను తక్షణమే పరీక్షలు నిర్వహించి రిపోర్టులు వచ్చిన వారిని ఐసోలేషన్ లో పెట్టాల్సిందిగా కూడా మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. సామాజిక దూరం పాటిస్తూ, విద్యార్ధులతో కూడా మాస్కులు ధరించేలా ఉపాధ్యాయులు చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రజలు కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, నిర్వహణలో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి నాణ్యత హామీ కమిటీ (Qualty Assurance Committee) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేసిన శస్త్రచికిత్సల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. 2019-20లో 251 వ్యాసెక్టమీ, 18,344 ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. అదే విధంగా 2020-21లో 2021, ఫిబ్రవరి వరకు 56 వ్యాసెక్టమీ, 11,763 ట్యుబెక్టమీతో మొత్తం 11,819 ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కేసుపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి శస్త్రచికిత్సలను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఆదేశించారు. గతంలో శస్త్రచికిత్సల సందర్భంగా ఏవైనా సంక్లిష్టతలు చోటుచేసుకుంటే వాటిని విశ్లేషించాలన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ బాగా జరుగుతోందని.. అత్యంత అరుదుగా ఏవైనా ప్రతికూల సంఘటనలు ఎదురైన సందర్భాల్లో నిబంధనల మేరకు పరిహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో నివేదికల రూపకల్పన కచ్చితత్వంతో ఉండేలా చూడాలని కలెక్టర్.. అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, అదనపు డీఎంహెచ్‌వో డా. ఎన్.ప్రసన్నకుమార్, ఆర్ఎంవో డా.గిరిధర్, ఐఎంఏ ప్రతినిధి డా. వి.రవి తదితరులు హాజయ్యారు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిర్భయంగా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సమీకృత పాడేరు గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల పిలుపు నిచ్చారు. శుక్రవారం ఐటిడి ఏ కార్యాలయం సముదాయంలో ఉన్న వివిద శాఖల ఉద్యోగులకు ప్రాజెక్టు అధికారి స్వీయ పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించారు. జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. కృష్ణారావు అధికారులకు , ఉద్యోగులకు వ్యాక్సినేషన్ టీకాలను వేసారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ వేక్సినేషన్ వేయించుకున్న సిబ్బంది వ్యాయామం చేయకుండా శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలన్నారు. తాను నిన్ననే వ్యాక్సినేషన్ వేయించుకున్నానని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని, ఆందోళన చెందవలసిన అవసరంలేదని, కొన్ని నియమాలు పాటించాలన్నారు. మూడు రోజులు వ్యాయామం, మద్యం సేవించడం, పొగ త్రాగడం వంటివి చేయకూడదన్నారు. ఐటిడి ఏ కార్యాలయం సిబ్బంది, గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్, విద్యా విభాగాలలో మొత్తం 40 మందికి డాక్టర్ కృష్ణారావు కోవిడ్ వ్యాక్సినేషన్ వేసారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ పరిపాలనాధికారి కె.నాగేశ్వరరావు, అదనపు జిల్లా వైద్యాధికారి డా. లీలా ప్రసార్, వైద్య సిబ్బంది సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రల్లో క్రిటికల్ గర్భిణి కేసులు ముందుగానే గుర్తించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్య అధికారులతో శుక్రవారం సమీక్షించారు. క్రిటికల్ కేసులు గుర్తించక మరణాలకు గురి అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రత్యేక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్నారని నివారించదగ్గ కేసులు నిర్లక్ష్యం కారణంగా మరణాలకు గురికారాదని ఆయన అన్నారు. సరైన సమయంలో స్పందించాలని పేర్కొన్నారు. పిహెచ్సి లలో అన్ని సౌకర్యాలు, వైద్యులు ఉన్నప్పటికీ ఒక్క ప్రసవం కూడా చేసిన ఆసుపత్రులు లేవని ఆయన తెలిపారు. వీరఘట్టం పిహెచ్ సి, పనితీరును ప్రశంసించారు. రేగిడి ఆమదాలవలస, రావాడ, తిలారు, ఎచ్చెర్ల, కళింగపట్నం, కొత్తపల్లి, దూసి తదితర పిహెచ్సి లలో గత మూడు నెలలుగా ఒక్క ప్రసవం కూడా చేయకపోవడం పట్ల ఆయన ప్రశ్నించారు. వైద్యులుగా గర్భిణీలకు భరోసా కల్పించాలని ఆయన తెలిపారు. అన్ని పిహెచ్ సి లలో ప్రసవాలు జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎఎన్ఎంలు గ్రామ సచివాలయంలో ఉండాలని ఆయన తెలిపారు. వాక్సినేషన్ పెద్ద ఎత్తున జరుగుటకు వైద్యులు కృషి చేయాలన్నారు.
నాడు - నేడు పనులు : ఆసుపత్రుల అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు నాడు - నేడు పనులు ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రిలో అన్ని గదులు శుచిశుభ్రతలతో ఉండాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, లేబర్ రూమ్ లపై శ్రద్దవహించాలని, విద్యుత్తు, పెయింటింగ్ లు పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రహారి గోడ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వవద్దని ఆయన సూచించారు. ఖర్చుతో నిర్మించినప్పటికి కిటికీ తలుపులు సక్రమంగా మూయక పోవడం తదితర సంఘటనలు జరగరాదని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.సూర్యారావు., ఆర్ అండ్ బి ఎస్ ఇ కె.కాంతిమతి, ఏపీఎంఐడిసి డిఇ ప్రసాద్, వైద్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, డా.ఏ.అనురాధ, డా.లీల, డా.ఎన్. ఏ.వి.వి.వి.పి.రామి రెడ్డి, డా.ప్రకాష్, వీర్రాజు, ఇంజినీరింగ్ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు. గురువారం విమ్స్ ఆసుపత్రిలో ఆయన మొదటి డోస్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కోరనా వైరస్ ను పూర్తిగా నియంత్రించడానికి ప్రజలకు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అదేవిధంగా వైద్యుల సూచనల మేరకు ప్రతీ ఒక్కరూ మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారేంతవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడి అందరూ కరోనా వేక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విమ్స్ సంచాలకులు సత్య వరప్రసాద్, తదితరులు ఉన్నారు.