1 ENS Live Breaking News

ఆంధ్రప్రదేశ్ లో అలిగిన కొత్తజిల్లాల కలెక్టర్లు

ఆంధ్రప్రదేశ్ లోని 13 కొత్త జిల్లా కలెక్టర్లు అలకబూనారు.. పేరుకే జిల్లా కలెక్టర్లమే అయినా తమకు ఎలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం ప్రభుత్వం ఇవ్వలేదంటూ లోలోన మధనపడుతూ, వారి సంఘంలో తీవ్రమైన చర్చకు తెరలేపారు. అసలు కొత్త జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వంపై అలగడం ఏంటి.. ఏం జరిగిందీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చింది. జిల్లాలను అయితే మార్చింది కానీ కొత్త జిల్లాల్లో కలెక్టర్లకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వలేదు. దానికి నిలువెత్తు సాక్ష్యం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై కొత్త జిల్లాల్లో కలెక్టర్లకు సంతకాలు పెట్టి, ఇచ్చే అధికారాలు ఇవ్వకపోవడమే. ఈ అధికారాన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, డిఎస్సీ కమిటీలకు చైర్మన్లుగా ఉన్నవారికే ప్రభుత్వం అప్పగించింది. దీనితో తమను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లుగా నియమించినా..తమకు మాత్రం రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరణ చేసే అధికారం కొత్త జిల్లాల కలెక్టర్లుగా ఉన్న తమకు కాకుండా పాత జిల్లాల కలెక్టర్లకు ఇవ్వడమేనని చెబుతున్నారు. 

 దీనితో ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారుల సంఘంలో చర్చకు దింపారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేయడానికి జీఓనెంబరు-5ని విడుదల చేయడంతో అన్ని జిల్లాశాఖల అధికారులు ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ ఫైళ్లను సిద్దం చేసి..జిల్లా కలెక్టర్ల సంతకాలకు పంపిన సమయంలో ప్రభుత్వం నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చాయి. ఈ ప్రక్రియ మొత్తం పాత జిల్లా కలెక్టర్లు మాత్రమే చేయాలని.. దీనితో తాము కూడా జిల్లాలకు కలెక్టర్లమే కదా..తమకు ఉద్యోగులను క్రమబద్దీకరించే అధికారం ఇవ్వకుండా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం సరికాదని ప్రభుత్వంపై గుస్సా అవుతున్నారు కొత్త జిల్లాల కలెక్టర్లు.. విషయాన్ని బయటకు అనకపోయినా..తీవ్రంగా మదన పడ్డారు. అందులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా..వ్యవహరించినా ప్రాధాన్యత లేని ప్రభుత్వ శాఖలకు అధికారులుగా నియామకాలు జరిగిన తరుణంలో ఈ విషయాన్ని నేరుగా బయట ప్రస్తావించలేదనే విషయం మాత్రం బయటకు పొక్కింది.. ఈ విషయం కాస్త మీడియాకి తెలియడంతో గుప్పుమంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వేల సంఖ్యలో ఉద్యోగులను క్రమబద్దీకరించే అవకాశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమకు రాలేదని కొత్త జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారనే విషయం నేడు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది.

అసలు విషయం తెలుసుకోవాలని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్నీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net సంప్రదిస్తే వారు కూడా ఆశక్తకర విషయాలను ప్రస్తావించారు. పాత ఉమ్మడి జిల్లాల డిఎస్సీ చైర్మన్ల సమయంలోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయడం వలనే..వారితోనే ఉద్యోగాలను కూడా పాత జిల్లాల కలెక్టర్లతోనే క్రమబద్దీకరించాల్సి వచ్చింది చెప్పుకొచ్చారు. ఏ ఐఏఎస్ ని అయినా జిల్లా కలెక్టర్ గా నియమించినపుడు సర్వోన్నత అధికారాలు వస్తాయి కదా అని ప్రశ్నించిన ఈఎన్ఎస్ కి మరో సమాధానం కూడా వచ్చింది. ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతోనేవ పాత కలెక్టర్లతోనే ఈ విధంగా చేయించారని..అయితే అదే సమయంలో కొత్త జిల్లాల కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారుల నుంచి తమకు అధికారాలు ఇవ్వలేదనే విషయం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో చాలా శాఖల అధికారులు జిల్లా అధికారి స్థాయి హోదా లేకపోవడం వలన ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పారు. చాలా వరకూ ఇన్చార్జిలు, కొన్ని జిల్లాల్లో హోదా లేకపోయినా ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంలో అధికారులను ప్రభుత్వం నియమించిందని.. ఆ కారణంగానే ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ ఫైళ్లపై కొత్త జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు అవకాశం ఇవ్వలేదని కూడా సమాధానం ఇచ్చారు.

కొత్త జిల్లాల్లో జిల్లాశాఖల అధికారులకు జిల్లా అధికారి హోదా లేకపోయినా.. ఐఏఎస్ లకు మాత్రం ఆ స్థాయి ఉన్నా.. తమకు కూడా ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ చేసే అధికారాలు ఇవ్వలేదని కొత్త జిల్లాల కలెక్టర్లు మదనపడుతూ..వారిలో వారు చర్చించుకోవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని బట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు అయినా విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొత్త జిల్లాల కలెక్టర్లకు అధికారాలు లేవనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో తేటతెల్లం అయిపోయింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినదగ్గర నుంచి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్నీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net అన్ని విషయాలను అటు ప్రభుత్వం.. ఇటు ప్రజల ముందు ఉంచే విషయంలో కీలక భూమిక పోషిస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే ఈ విషయాన్ని కూడా బయటకు తీసిందని చెబుతున్నాం. తప్పితే ఏ అధికారిపైనా..ఐఏఎస్ ను తక్కువ చేయడం గానీ..ప్రభుత్వం నిర్ణయాలను తప్పబట్టడం కానీ తమన ఉద్దేశ్యం కాదని కూడా తెలియజేస్తున్నాం..

 జిల్లాశాఖల అధికారులు అలగడాన్ని పెద్దగా పరిగణలోనికి తీసుకోకపోయినా..ఐఏఎస్ అధికారుల అలకను మాత్రం ప్రభుత్వం అర్ధం చేసుకుంటుందని ఆఫ్ ది రికార్డ్ అంటూ సీనియర్ ఐఏఎస్ లు  చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం 13 కొత్త జిల్లాలకు సివిల్ సర్వీస్ అధికారుల నియామకాలు చేపట్టినా.. పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వలేదు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ విషయంలోనే కాదు.. ఇదే పద్దది కొనసాగితే.. ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లాల్లో కలెక్టర్లుగా చేరడానికి ఐఏఎస్ లు ముందుకు వచ్చే పరిస్థితులు ఉండవనే వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఇకపై పాత కొత్త జిల్లాల కలెక్టర్లకు విధాన పరమైన నిర్ణయాలు, అధికారాలు ఇచ్చే విషయంలో మార్పులు వస్తాయని.. కొత్త జిల్లాల్లో పరిపాలన గాడిలో పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రస్థాయి ఐఏఎస్ అధికారులు. చూడాలి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల కలెక్టర్లకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇచ్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో..!

Tadepalli

2022-07-28 04:30:27

కారుణ్య నియామకాలతోనే ఆ పోస్టులు భర్తీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో మిగులు ఉద్యోగాలను భర్తీచేసేం దుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ, సర్వీసులో మరణిస్తే..ఆ కుటుంబంలోని పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఇచ్చే ఉద్యోగాలను గ్రామ, వార్డు సచివాలయ శాఖలో భర్తీచేయాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టర్లకు వర్తమానం పంపింది. ఇప్పటికే చాలా ఉద్యోగాలను కారుణ్య నియామకాల కింద భర్తీచేసిన ప్రభుత్వం మిగులు ఉద్యోగాలను కూడా ఆ విధంగానే భర్తీచేసి, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఖాళీలన్నీ పూర్తిచేయనుంది. ఇటీవలే ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం వాటిని కూడా ఇక్కడే భర్తీచేయాలని చూస్తోంది. తొలి ప్రాధాన్యత సచివాలయాలకు ఇచ్చి, మలి ప్రాధాన్యత కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్లకు, ఇతర జిల్లాశాఖలకు ఇవ్వనుంది. ప్రస్తుతం  కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీలు ఉండిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వాటిని భర్తీచేయాలని చూస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 1.35 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం రెండుసార్లు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు మధ్యలో కొంతమందిని కారుణ్య నియామకాల కింద తీసుకున్నా.. 1.21.లక్షల మందిని మాత్రమే సచివాలయాల్లో భర్తీ చేసింది ప్రభుత్వం. ఇంకా సుమారుగా 14వేల పోస్టులు సచివాలయశాఖలో మిగిలిపోయాయి. సదురు ఉద్యోగాలకు కారుణ్య నియామకాల్లో భర్తీచేసే సమయంలో వారి వారి విద్యార్ధహతలను బట్టీ మిగులు పోస్టులు భర్తీచేస్తే మొత్తం శాఖలోని అన్ని ఉద్యోగాలు భర్తీచేసినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా మొదలు పెట్టింది.

సాధారణంగా కారుణ్య నియామకాల క్రింద నాల్గవ తరగతి ఉద్యోగాలను ప్రభుత్వం ఇన్ సర్వీసులో ఉండి మ్రుతిచెందిన వారికి కుటుంబ సభ్యులకు జిల్లాశాఖల కార్యాలయాల్లో మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారిపోవడంతో, ప్రభుత్వం కూడా జిల్లా శాఖల్లోని ఉద్యోగుల సంఖ్యను, విభాగాలను కూడా కుదించేసింది. అలా కుదించినప్పటికీ చాలా జిల్లాల్లో 75 ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో నాల్గవ తరగతి ఉద్యోగాలు ఖాళీలు ఉండిపోయాయి. అయితే ముందుగా వాటిని భర్తీచేయాలని భావించినప్పటికీ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ప్రత్యేక ప్రభుత్వశాఖగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో అన్ని ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీచేస్తే ప్రజలకు గ్రామ, వార్డుల స్థాయిలోనే సేవలు అందుతాయని చూస్తుంది. దానికి తగ్గట్టుగానే మిగులు ఉద్యోగాలన్నింటినీ సాధ్యమైనంత వరకూ కారుణ్య నియామకాల్లో భర్తీచేస్తారు. ఇంకాఏమైనా ఉద్యోగాలు మిగిలిపోతే వాటికి ప్రతీ ఏటా తీసే జాబ్ కేలండర్ లోకి చేర్చి భర్తీచేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పశుసంవర్ధక, వ్యవసాయం, వాణిజ్యం, రెవిన్యూ, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు చాలా సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిని కారుణ్య నియామకాలు జరిపే సమయంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి క్వాలిఫికేషన్లుకు తగ్గట్టుగా ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా సచివాలయ శాఖలో అన్ని ఉద్యోగాలు నింపినట్టు అవుతుందని ప్రభుత్వం ఆలోచన.

ప్రస్తుతం రాష్ట్రంలోని 75 జిల్లా శాఖలకు సంబంధించి 26 జిల్లాల్లో ఎన్ని నాల్గవ తరగతి ఉద్యోగాలు ఖాళీలు అత్యధికంగా ఉన్నాయి..ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం జిల్లాశాఖల అధికారులను నివేదికలు కోరుతుంది. ప్రభుత్వానికి జిల్లా శాఖల అధికారులు నివేదికలు సమర్పించిన వెంటనే, ప్రాధాన్యతా క్రమంలో తొలుత గ్రామ, వార్డు సచివాలయశాఖలో నియామకాలు చేపట్టి.. తరువాత మిగిలిన శాఖల్లో ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేయనుందని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబరు నెలాఖరునాటికి ఇటు ఆర్టీసీలో భర్తీలచేయాల్సిన కారుణ్య నియామకాలతో పాటు, ఇతర ప్రభుత్వశాఖలు, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో చాలా వరకూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే గ్రామ,వార్డు సచివాలయ శాఖలో చాలా పోస్టులకు సంబంధించి సర్వీస్ రూల్స్ నిబంధనలు సక్రమంగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం, కొన్ని శాఖలకైతే ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగాలకైతే అభ్యర్ధులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అలాంటి సమయంలో జిల్లాశాఖల్లోని నాల్గవ తరగతి ఉద్యోగాల్లోనే భర్తీచేయాలా..లేదంటే అన్నిశాఖల మాదిరిగానే గ్రామ,వార్డు సచివాలయ శాఖలోని 19శాఖల ఉద్యోగులకు వారి మాత్రుశాఖలకు సంబంధించిన సర్వీసు రూల్స్ నే అన్వయించాలా అనేవిషయంలో రాష్ట్రస్థాయిలో అధికారుల్లోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందనేది..!

Tadepalli

2022-07-18 07:09:59

'ఆస్ట్రేలియా' పెట్టుబడులకు ఏపీ అనువైనది

భౌగోళికంగా, సాంకేతికంగా, వాణిజ్యపరంగా అత్యంత శక్తివంతమైన ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి  అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐ. టి  శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు చెన్నై,  బెంగుళూరు లలో  వివిధ రంగాల్లు పెట్టుబడులు. పెట్టడానికి పశ్చిమ  ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమర్  రోజర్ హగ్ కుక్  నాయకత్వంలో  వంద మంది సభ్యులతో కూడిన పచ్చిమ ఆస్ట్రేలియా బృందం శనివారం విశాఖ వచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్.  ఎకనమిక్. డెవలప్మెంట్ బోర్డు,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశ్చిమ ఆస్ట్రేలియా  ప్రతినిధులతో శనివారం ఇక్కడ  జరిగిన సదస్సులో ఇరు దేశాల మధ్య  పలు ఒప్పందాల పై సంతకాలు జరిగాయి. పశ్చిమ ఆస్ట్రేలియా, భారత్  మధ్య వాణిజ్య సంబంధాలు ఈ  ఒప్పందాల వలన మరింత బలోపేతం. అవుతాయని  అన్నారు.

భారత్, ఆస్ట్రేలియా  దేశల మధ్య స్నేహ  సంబంధాలు అనాదిగా కొనసాగుతున్నాయని, ఇప్పుడు జరిగే వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాలకు  మరింత ప్రయోజన కారిగా ఉంటాయని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో 
నిలిచిందని ముఖ్యమంత్రి  జగన్మోహనరెడ్డి  చేపట్టిన సంస్కరణలే ఇందుకు కారణమని చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున పెట్టబరాలను రాష్ట్రానికి రాబట్టగలిగామని చెప్పారు.  2019-22 మధ్య 43, 866 కోట్ల యుపాయల మేర పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నా మని చెప్పారు.  2.33 లక్షల మందికి వుద్యోగాలు లభించాయి  అని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు  పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అత్యంత త్వరగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పా అమర్ నాథ్ చెప్పారు. రాష్ట్రలో ఆరు పోర్టులు ఉన్నాయాని, మరో మూడు త్వరలోనే అందుబాటులో రానున్నాయని చెప్పాం. సముద్ర రవాణాలో

ఆంధ్రప్రదేశ్ పోర్టులు అత్యున్నత స్థానములో నిలిచాయి.   అని  అమర్ నాథ్ చెప్పారు. 2020-21లో రాష్ట్రం నుంచి 16.9 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని అదే 2020-21 లో 22.88 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశామని  తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ లో సుశిక్షుతులైన యువకులు ఉన్నారని, వివిధ రంగాల్లో  నిపుణులకు ఇక్కడ కొరత లేదని అమర్ నాథ్ చెప్పారు.  ఐటి రంగంలో  పెట్టుబడులకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన భూములు సిద్ధంగా ఉన్నాయిని అయిన వెల్లడించారు. విశాఖపటం పర్యాటకంగా

అభివృద్ధి చెండిందని,  సినిమాల చిత్రికరణకు అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని, ఆస్ట్రేలియా సినీ పరిశ్రమ ఇక్కడ సినిమా చిత్రీకరణ చేసుకోడానికి ముందుకు రావాలని మంత్రి అమరనాథ్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమర్ రోజర్ హగ్  కుక్ మాట్లాడుతూ భారత్, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు చాలా మంది శ్రమించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో.  ఫిషింగ్, ఆక్వా  కల్చర్  రంగాలు ముందంజలో  వున్నాయని అన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఆ దేశాలు ఆర్ధికంగా మరింత బలోపేతం అవడానికి అవకాశం వుందని అన్నారు. విద్య, పర్యాటక రంగాలు
మరింత అభివృద్ధి చెయతాయన్నారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ గడచిన నాలుగు సంవత్సరాల  నుంచి ఆంధ్రప్రదేశ్ జి.డి.పి. రేటు వృద్ధి చెందుతూ వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఫుడ్. ప్రాససింగ్ , కెమికిల్, పెట్రో కెమికల్,  ఐటి  విద్య రంగాలు మెరుగైన ఫలితాలను సంధిస్తున్నాయిని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఏడూ లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు  కోర్సులు  పూర్తి చేసి బయటకు వస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ని అనేక దేశాల్లో తెలుగు విద్యార్థులతో మినీ ఆంధ్ర ప్రదేశ్ కనిపిస్తోంది అని అన్నారు. సురరిపాలన,  కచ్చితమైన నాయకత్వం చూసి   అనేక దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయిని అన్నారు. ఈ సమావేశంలో  పశ్చిమ ఆస్ట్రేలియా  విద్యా శాఖ మంత్రి టెoపుల్టన్,  పరిశ్రమల  శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-16 12:49:55

ఇక దొంగ ఓట్లుకు ఆథార్ లింక్ తో చెక్..

భారతదేశంలో దొంగ ఓట్లకు చెక్ పడనుంది..దేశ వ్యాప్తంగా నికార్శైన ఓటర్ల జాబితా సిద్దం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. దానికోసం ఆధార్ కి ఓటరు కార్డును అనుసంధానించనుంది. ఈ విధంగా చేయడం ద్వారా నకిలీ ఓట్లు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఏర్పడింది. దానికోసం ఆగస్టు 1వ తేది నుంచి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని ఓటర్ల కార్డులకు ఆధార్ ను అనుసంధానించే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే దానికోసం ప్రభుత్వం ప్రకటన కూడా జారీచేసింది. అన్ని రాష్ట్రాలకు ఈ వర్తమానాన్ని పంపింది. ఈ విధంగా చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా వున్న నకిలీ ఓట్లకు చెక్ పడనుంది. ఖచ్చితంగా ఓటరు కార్డుకి ఆధార్, మొబైల్ నెంబరును అనుసంధానిస్తారు. అలా చేయడం ద్వారా అదే పేరుతో ఎన్ని ఓట్లు ఉన్నాయో కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్  డేటాబేస్ ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. ఈ అనుసంధానం తరువాత 2024 ఎన్నికల్లో ఆధార్ కార్డునే ఓటు వేసేందుకు కూడా అనుమతించాలనే ఆలోచనతోనే ఈ కార్యాచరణ పూర్తిచేయనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓటరు నవీకరణ జాబితాలు తయారు చేస్తారు. అలాంటి సమయంలో కొన్ని అధనంగా ఓట్లు పెరిగే అవకాశం వుంటుంది. ఇలా పెరిగే సమయంలో కరెక్టు ఓటర్లు మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆధార్ ను ప్రతీ ప్రభుత్వ పథకానికి అనుసంధానిస్తూ వస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు ఓటరు కార్డుకి కూడా వీటిని లింక్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చుననేది  ఆలోచన.

ఓటరు కార్డుకి ఆధార్ కార్డును అనుసంధానించడం ద్వారా భారీ సంఖ్యలోనే నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు, ఒకే పేరు వివిధ ప్రాంతాల్తో నమోదైన ఓట్లును రద్దు చేసే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఓటరు ఏ ప్రాంతంలో ఐదేళ్లకు పైగా ఉంటారో  అక్కడే తన ఓటును శాస్వతంగా ఉంచే నిర్ణయంలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో పారదర్శకత ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విధానం వలన దేశ వ్యాప్తంగా చాలా రాజకీయపార్టీలు చాలా నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరుతో వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాల్లో ఓటు కలిగిన వారు దేశ వ్యాప్తంగా చా ఎక్కువ మంది ఉన్నారు. ఇకపై అలాంటి ఓట్లన్నీ ఆధార్ అనుసంధానంతో రద్దైపోతాయి. ఆధార్ అనుసంధాన కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించి దానిని పూర్తిస్థాయిలో చేపట్టడానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ కార్యక్రమం సత్వరమే జరగడానికి అవకావాలు ఏర్పడ్డాయి. సచివాలయాల్లో 19శాఖల సిబ్బంది, వాలంటీర్లు అందుబాటులో ఉండటంతో ఈ పని ఏపీలో సత్వరమే పూర్తవుతుందని చెబుతున్నారు. కానీ ఈ కార్యక్రమానికి గ్రామ వలంటీర్లను దూరంగా ఉంచాలనే డిమాండ్ అన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తం అవుతుంది.


ఆధార్ తో ఓటరు కార్డులు అనుసంధానం చేపడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే లెక్కకు మించిన ఒకే పేరుతో వివిధ ప్రాంతాల్లో వున్న ఓట్లు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో నూతన ఓటర్ల నమోదు కూడా చేసే అవకాశం కూడా లేకపోలేదు. అదనంగా ఉన్న ఓట్లు పోయినా.. కొత్తగా నమోదు అయ్యే ఓట్లతో 2024లో ఎన్నికలు జరపాలని కేంద్రం ఎన్నికల కమిషన్ యోచించే సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ఈ ఓటరుకార్డుకి ఆధార్ నెంబరు అనుసంధాన కార్యక్రమం చేపట్టిందని చెబుతున్నారు. ఒక రకంగా చూసుకుంటే ఈ విధానం అన్ని రాజకీయ పార్టీలకు సంకటంగానే పరిణమించే పరిస్థితి ఉన్నా.. దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంతో చాలా రాజకీయపార్టీలు తమకు పడాల్సిన ఓట్లు లాసు అయిపోతున్నామనే భావనతో ఈ విషయాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లిన తరువాత..మెజార్జీ రాజకీయ పార్టీల అభ్యర్ధన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆధార్ అనుసంధానంతో లక్షల ఓట్లు రద్దుఅవుతాయా.. వేల సంఖ్యలో ఓట్లు రద్దు అవుతాయి..ఏం జరుగుతుందనేది ఆగస్టు 1 దాటిన తరువాత తేల నుంది. ఆధార్ అనుసంధాన కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, బీఎల్వోలకు అప్పగించి చేయించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. చూడాలి..ఈ అనుసంధాన ప్రక్రియతో ఏం జరగబోతుందనేది..!

Guntur

2022-07-16 06:07:57

వైజాగ్ లో ఆటో నడిపిన సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి అంటే పెద్ద స్టేజీలపై ఆర్బాటాల ప్రసంగాలే ఇప్పటి వరకూ చూశాం.. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకు వేశారు. వాహనమిత్ర పథకాన్ని లబ్దిదారులకు పంచడానికి విశాఖ వచ్చిన ఆయన నేరుగా లబ్దిదారుని ఆటో ఎక్కి ఆటో నడిపారు. ఆటో నడిపేటపుడు ఖచ్చితంగా ఖాకీ చొక్కా ఉండాలనే నిబంధనను ఎక్కడా మరిచిపోకుండా ఖాకీ చొక్కా వేసుకొని మరీ ఆటో ఎక్కారు సీఎం జగన్. ఈ సంఘటతో సదరు లబ్దిదారిణి ఆనందానికి అవదులు లేవు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఒక సాధారణ ఆటో ఎక్కి ఈ విధంగా డ్రైవర్లును ప్రోత్సహించడం అక్కడున్న పార్టీ నాయకులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వయంగా ఆటోని మహిళా డ్రైవర్ ని నడపమని చెప్పి అందులో సీం ప్రయాణించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్.జగన్ మాట్లాడుతూ, వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం చెప్పారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.

Visakhapatnam

2022-07-15 06:56:10

భారీగా ఆదాయం కోల్పోతున్న సచివాలయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం భారీస్థాయిలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. సచివాలయాల ద్వారా 725 సర్వీసులను అందించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అరకొరగా కొన్ని సర్వీలు మాత్రమే సచివాలయం నుంచి అందిస్తున్నది. దానికి కారణం కూడా లేకపోలేదు గ్రామ, వార్డు సచివాయాల్లో కలిపి 19శాఖలకు చెందిన సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక్కో సచివాలయానికి రెండు కంప్యూటర్లు మాత్రమే మంజూరు చేసింది. అందులో ఒకటి రెగ్యులర్ గా డిజిటల్ అసిస్టెంట్ పనిచేస్తుండగా, మరో కంప్యూటర్ ద్వారానే సచివాలయంలో అందరు సిబ్బంది పనిచేయాలని. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులు పని భారం మొత్తం డిజిటల్ అసిస్టెంట్లపైనే పడుతోంది. అల కాకుండా ఒక్కోశాఖ సిబ్బందికి ఒక్కో కంప్యూర్ లేదా. సచివాలయానికి ప్రస్తుతం ఉన్న రెండు కంప్యూటర్లకు తోడు మరో మూడు కంప్యూటర్లు ప్రభుత్వం మంజూరు చేయగలిగితే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నిర్వహించే 725 రకాల సర్వీసులు సచివాలయంలో పనిచేసే అందరు సిబ్బంది ద్వారా ప్రజలకు అందించడానికి వీలుంటుంది. అంతేకాకుండా అటు ప్రభుత్వానికి కూడా రాష్ట్రవ్యాప్తంగా వున్న 14వేల 5 సచివాలయాల నుంచి పూర్తిస్థాయిలో ఆదాయం కూడా అనునిత్యం వస్తుంది. కానీ ప్రభుత్వం సిబ్బందిని అయితే నియమించింది తప్పితే వారితో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

యూపీఐ, క్యూఆర్ స్కాన్ కార్డులు ఏర్పాటు చేస్తే..
గ్రామ,వార్డు సచివాలయాల్లో అందించే సేవలకు ప్రభుత్వం క్యూఆర్ స్కాన్ కార్డులు, యూపీఐ ఐడీలు ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాకే సేవలు పొందిన వారి ద్వారా సర్వీసు మొత్తం చేరే అవకాశం వుంటుంది. లేదంటే రోజంతా పనిచేసిన మొత్తాన్ని డిజిటల్ అసిస్టెంట్లు ప్రత్యేకంగా బ్యాంకులకు వెళ్లడం ద్వారా కొంత సమయం వ్రుధా అవుతున్నది. ప్రస్తుతం 725 సర్వీసులకు గాను ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కేలం 25 నుంచి 50 సర్వీసులను మాత్రమే అందిస్తున్నది. అదీ కూడా ఒక్క సచివాలయంలో ఒక్క డిజిటల్ అసిస్టెంటు ద్వారానే పనులు జరుగుతున్నాయి. అలా కాకుండా అన్ని శాఖల సిబ్బందిని కామన్ సర్వీస్ సెంటర్ కు అనుసంధానించి, శాఖాపరమైన పనులు లేని సమయంలో అందరు సిబ్బంది ద్వారా ఈ సర్వీసులు మొత్తం ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తే గ్రామ,వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సచివాలయాల్లో ఒక లక్షా 21వేల మంది సిబ్బంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా..నేటికీ మండలాలు, గ్రామాల్లోని మీసేవా కేంద్రాలకే వెళ్లి సర్వీసులు పొందడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం సచివాలయాల్లోపూర్తిస్థాయిలో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా సేవలు అందకపోవడమే.

సిబ్బంది సేవలను వినియోగిస్తే కాసుల వర్షం..
ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖకు లేనంద మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖకు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను పూర్తిస్థాయిలో ప్రజల సేవకు వినియోగించడం మొదలు పెడితే..గ్రామంలోనే ప్రజలకు డిజిటల్ సేవలతో పాటు మిగిలిన అన్ని రకాల సర్వీసులు అందే అవకావం వుంది. సచివాలయశాఖలో మేన్ పవర్ అధికంగా ఉన్నా.. ఇక్కడ టెక్నాలజీ, సాంతికేతిక, కంప్యూటర్ల విషయంలో ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేయడంతో ఇంత మంది సిబ్బంది వున్న ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రస్తుత రోజుల్లో అన్ని అనుమతులు ఆన్ లైన్ లో ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సి రావడంతో వాటన్నింటినీ ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా సచివాలయాల ద్వారానే అందించే ఏర్పాటు చేస్తున్నది. ఏర్పాటైతే చేసిందిగానీ, దానికి సరిపడ కంప్యూటర్లను మాత్రం మంజూరు చేయలేదు. ఒక్కో సచివాలయాలనికి కేవలం రెండు కంప్యూటర్లు మాత్రమే ఇవ్వడంతో ఒక శాఖ ఉద్యోగి పని పూర్తిగా అయ్యేంత వరకూ మరోశాఖ ఉద్యోగికి చెందిన పనులు చేసుకోవడానికి గానీ, ప్రజలకు సర్వీసులు అందించడానికి గానీ వీలులేకుండా పోతుంది. సిబ్బందికి అనుగుణంగా కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అన్నీప్రభుత్వం ఏర్పాటుచేస్తే ప్రభుత్వంలోని అన్నిశాఖల కంటే గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారానే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి..!

Tadepalli

2022-07-15 04:32:31

రేపు ఏపీ సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో వరదలు అధికంగా కురుస్తున్నందున వరదలకి ప్రభావితమైన ప్రాంతాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహనరెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌ నుంచి వరద ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన ఏరియల్‌ సర్వే కొనసాగనుంది. సీఎం ఏరియల్‌ సర్వే కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎగువ గోదావరి నుంచి అత్యధికంగా వరద ప్రవాహం రావడంతో ఉబయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. ఎవరూ అదైర్య పడవద్దని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండేలా చూడాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ముఖ్యంగా కాటన్ బ్యారేజీ వద్ద 24 గంటలూ పర్యవేక్షణ చేపట్టాలని, వరద ఉద్రుతిని బట్టి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు కూడా చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Visakhapatnam

2022-07-14 15:52:40

ప్రభుత్వ ప్రచారానికి సమాచారశాఖ మోకాలడ్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ప్రముఖ శాఖగా ఉన్న సమాచార పౌర సంబంధాలశాఖ అధికారులు కావాలనే చేస్తున్న తప్పిదం ప్రజలకు సంకటంగా మారుతోంది. మీడియాకి ప్రతిబంధకంగా తయారవుతోంది. కాదు కాదు అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే కోవర్టు సమాచారశాఖ అధికారుల తీరు వలన ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం అన్ని వర్గాల మీడియా ద్వారా ప్రజలకు చేరడం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం రానీయకుండి కొందరు డీపీఆర్వోలు పనిగట్టుకొని మీడియాకి సమాచారం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు నెంబరు యాడ్ చేసుకొని వాట్సప్ ద్వారానో, ఈమెయిల్ యాడ్ చేసుకొని మెయిల్ ద్వారానో పంపమంటే వారి ఆస్తులన్నీ జర్నలిస్టులకు రాసి ఇచ్చేయమన్నట్టు తెగ ఫీలై పోతున్నారు. అంతేకాదు మీ మీడియాలో ఆ వార్త రాకపోతే ప్రభుత్వానికి ఒరిగిపోయేది ఏమీలేదులే అనే బహిరంగ డైలాగులు కూడా వాడేస్తున్నారు. ఈ విషయం రాష్ట్రంలోని 26జిల్లాలకు చెందిన కలెక్టర్లు, స్వయానా సమాచారశాఖ మంత్రికి తెలిసినా ఉపయోగం మాత్రం సున్నా. ఒక్క ప్రభుత్వశాఖ తమ పనిని తాము సక్రమంగా నిర్వహించకపోవడం వలన ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మళ్లీ మళ్లీ పాత జిల్లాల కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ జిల్లా శాఖల కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తున్నది. విషయం తెలియక చిన్న, మధ్యతరగతి మీడియా అవస్థలు పడాల్సి వస్తుంది. అవునండీ..రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలుగా వున్న వాటిని 26 జిల్లాలుగా మార్పు చేసింది. ఆ విషయం ప్రభుత్వం మీడియాద్వారానే ప్రజలకు తెలియజేసింది. అయితే కొత్త జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, 75శాఖలకు చెందిన జిల్లాశాఖల అధికారులు ఎవరు,వారి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి..ఏఏ జిల్లాలకు చెందిన ప్రజలు ఏ జిల్లా కలెక్టరేట్లు, ఏ జిల్లాశాఖ అధికారులను సంప్రదించాలనే విషయంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదే మీడియా ద్వారా  ప్రచారం చేయడంలో ఘోరంగా విఫలం అయ్యింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వున్న మీడియాకి ఇదే సమాచారశాఖ ప్రభుత్వ సమాచారం ఇవ్వడంలో తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తోంది. దీనితో ప్రభుత్వశాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లకు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో రాష్ట్రంలోని కొత్తజిల్లాల్లోని మీడియాకి రావడం లేదు..ఆపై ప్రజలకూ తెలియడం లేదు.

ప్రెస్ నోటు అడిగితే ఆస్తులు అడిగినంతగా ఫీలపోతున్నారు..
రాష్ట్రంలో సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన డీపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు, ఏపీఆర్వోలు మీడియా ప్రభుత్వ కార్యాక్రమాలకు సంబంధించిన ప్రెస్ నోటు మెయిల్ ద్వారానో, అధికారిక వాట్సప్ గ్రూపులో మీడియా ప్రతినిధుల నెంబర్లు యాడ్ చేసి అందజేసే విషయంలో చాలా దారుణంగా ఫీలై పోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆస్తులను అడిగినట్టుగానే వ్యవహరిస్తున్నారు వీరంతా. కొన్ని జిల్లాల్లో అయితే డీపీఆర్వోలు చాలా బాధ్యతగా జిల్లాలో మీడియా ప్రతినిధులను నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు తీసుకొని కొత్త జిల్లాలో పరిపాలనకు సంబంధించిన వార్తలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు చాలా చక్కగా పంపిస్తున్నారు. ముఖ్యమై ప్రభుత్వ కార్యక్రమాలకు ఫోన్లు చేసీ మరీ చెబుతున్నారు. కొన్నిజిల్లాల్లో మరీ దారుణంగా అన్ని మీడియాలకు చెందిన జర్నలిస్టులకు ప్రెస్ నోట్లు పంపవద్దని, వారి నెంబర్లు వాట్సప్ గ్రూపులో యాడ్ చేసుకోవద్దని కొత్తగా విధుల్లోకి చేరిన కలెక్టర్లు, సమాచారశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ సమాచారశాఖ అధికారులు చేసే తప్పుని వారిపై నెట్టేస్తున్నారు. దీనితో కొత్త జిల్లాల్లోని పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన సమాచారం సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా అన్ని వర్గాల మీడియాకు అందడం లేదు. సదురు మీడియా సంస్థల జర్నలిస్టులు సేకరించిన వార్తలనే మీడయా సంస్థలు ప్రచురించుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించి గానీ, జిల్లా శాఖల అధికారులకు సంబంధించిన వ్యతిరేక వార్తలు వస్తే మాత్రం అదే సమాచారశాఖలోని డీపీఆర్వో ప్రెస్ నోటు, ప్రెస్ ఇన్విటేషన్ కూడా పంపని మీడియా సంస్థలకు ఖండన ప్రకటనలు పంపిస్తుండటం విశేషం..

అధికార పార్టీ మీడియా భజన చేస్తున్న సమాచారశాఖ..
సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు తెల్లవారు లెగిస్తే అధికారపార్టీ మీడియా భజన చేయడానికే సమయం అంతా సరిపోతుంది. ఎంత దారుణం అంటే సదరు మీడియాకి చెందిన అందరు రిపోర్టర్లు నెంబర్లు జిల్లా అధికారిక మీడియా గ్రూపులో యాడ్ చేసే డీపీఆర్వోలు, న్యూస్ ఏజెన్సీలు, చిన్న, మధ్య తరహా పత్రికలకు చెందిన జర్నలిస్టుల వాట్సప్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను తమ గ్రూపుల్లో యాడ్ చేయడానికి ఎక్కడలేని నొప్పులన్నీ పడుతున్నారు. పైగా సాంకేతిక పరంగా తప్పించుకునేందు మీ పత్రిక, ఛానల్, న్యూస్ ఏజెన్సీల, లోకల్ కేబుల్ నెట్వర్క్ లకు ప్రభుత్వం అక్రిడిటేషన్ ఇచ్చిందా.. అలా ఇచ్చిన జర్నలిస్టుల నెంబర్లుకు, మీడియా సంస్థలకు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలకు చెందిన ప్రెస్ నోట్లు,  ప్రెస్ ఇన్విటేషన్లు పంపమని సమాచారశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని చెబుతూ చేతులెత్తేస్తున్నారు. విఐపీలు, వీవీఐపీలు వచ్చే కార్యక్రమాలకు సైతం చిన్న మద్య తరహా మీడియా సంస్థల రిపోర్టర్లను ఆహ్వానించడం లేదు సమాచారశాఖ. ఇందేంటని నేరుగా సమాచారశాఖ అధికారులను ప్రశ్నించినా పట్టించునే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని కొత్త జిల్లాల కలెక్టర్లు వద్ద ప్రస్తావించిన ప్రతీ సారీ..అక్కడ కలెక్టర్లు, జిల్లా అధికారులను సైతం సమాచారశాఖ అధికారులు, సిబ్బంది బురిడీలను చేసి.. మసిపూసి మరేడు కాయ చేస్తోంది. చిన్నా చితకా పత్రికలు మనకి అవసరం లేదు..వాటిలో వార్తలు వచ్చినా రాకపోయినా ఒకటే..పెద్ద పత్రికలు, పెద్ద టీవీ ఛానళ్లు ఉంటే చాలు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.

చోద్యం చూస్తున్న సమాచారశాఖ కమిషనర్..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ అధికారిక కార్యక్రమం అయినా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వున్న అన్ని రకాల మీడియాలోనూ ప్రచారం జరిగేలా చూడాల్సిన సమాచారశాఖ శాఖ కొన్ని మీడియా సంస్థలనే పట్టించుకుంటూ వారికే కొమ్ముకాస్తూ.. మిగితా వాటిని వదిలేస్తున్నా సమాచారశాఖ కమిషనర్ సైతం చోద్యం చూస్తున్నారు తప్పితే పట్టించుకోలేదు. అంతెందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు అధికారిక వెబ్ సైట్ లున్నా.. అందులో ఒక ప్రభుత్వశాఖగా వున్న  సమాచారశాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ లో మాత్రంలో  ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అన్ని జిల్లాలకు చెందినవి కనిపించవు. ఒకప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు సదరు సమాచారశాఖ వెబ్ సైట్ లో పొందు పరిచేవారు. వాటినే రాష్ట్రవ్యాప్తంగా వున్న మీడియా పబ్లికేషన్ కు వినియోగించుకునేది. ఇపుడు ఆ పనిచేస్తే ఎక్కడ ప్రభుత్వ సమాచారం మీడియా ద్వారా బయట ప్రజలకు తెలిసిపోతుందోనని భావించిన సమాచారశాఖ అరకొర సమాచారంతోనే వెబ్ సైట్ నిర్వహిస్తోంది. వాస్తవానికి కొత్తజిల్లాల్లో పరిపాలన ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియాలన్నా, ప్రజలకు కొత్త జిల్లాలకు చెందిన అధికారుల సమాచారం తెలియాలన్నా అన్ని రకాల మీడియాల ద్వారా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు తెలిసేలా చేసే విషయంలో రాష్ట్రంలోని 26 జిల్లాల డీపీఆర్వోలకి కమిషనర్ ఆదేశాలివ్వాల్సి వుంది. కానీ ఆ విధంగా ఆదేశాలు ఇచ్చినట్టు ఎక్కడా కనిపిచడంలేదు. ఫలితంగానే కొత్త జిల్లాల్లోని అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన సమాచారం చిన్న, మధ్య తరహా మీడియా ద్వారా ప్రజలకు చేరడం లేదు. ఇప్పటికైనా సమాచారశాఖ కమిషనర్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ డీపీఆర్వోలకు నిర్ధిష్ట ఆదేశాలిస్తే తప్పా పరిస్థి గాడిన పరిస్థికి కనిపిండం లేదు..!

Tadepalli

2022-07-14 03:20:04

సీఎం జగన్ ఆలోచనలతో సంచలనాలు

సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్మి  ప్రభుత్వ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యపై రూ.52,677 కోట్లు వెచ్చించిందని గుర్తుచేసారు. జగనన్న అమ్మ ఒడి పథకం క్రింద 44,48,865 మంది లబ్ధిదారులకు రూ.19617.53 కోట్లు అందించారని అన్నారు. జగనన్న విద్యాదీవెన క్రింద 21,55,298 మందికి, జగనన్న వసతి దీవెన పథకంలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం  18,77,863 మందికి మొత్తం రూ 11007.17 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా రాష్ట్రంలో 47,40,421 మంది లబ్ధిదారులకు రూ 2368.33 కోట్లు అందించిందని,జగనన్న  గోరుముద్దలు క్రింద 43,26,782 మందికి రూ 3087..50 కోట్లు అందించిందని అన్నారు. పాఠశాలల్లో నాడు నేడు పథకం క్రింద 15715 స్కూల్లు ఆధునికీకరణకు మొదటిదశలో రూ.3669 కోట్లు వెచ్చించిందని అన్నారు.  వైఎస్సార్ సంపూర్ణ పోషణ క్రింద 3419875 మంది లబ్ధిదారులకు రూ.4895.45 కోట్లు అందించిందని అన్నారు. స్వేచ్ఛ  పథకం క్రింద 10,01,860 మంది లబ్ధిదారులకు రూ.32కోట్లు వెచ్చించి శానిటరీ న్యాప్  కిన్స్ అందించిందని అన్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా మీటింగ్ అయిపోయాక జనం కుర్చీలపై నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోతారని కేవలం చంద్రబాబు మీటింగ్ లోనే కుర్చీలు ఎత్తుకెళ్తారని ఏద్దేవా చేసారు.వైఎస్ఆర్ సిపి ప్లీనరీ ప్రారంభానికి ముందు  సమావేశం అనంతరం ఖాళీగా ఉన్న కుర్చీలు చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్న పచ్చమీడియాపై ఆయన మండిపడ్డారు. ఇటువంటి చౌకబారు ప్రచారంతో ప్రజలలో విశ్వాసం పూర్తిగా కోల్పోయారని అన్నారు. రాష్ట్రపతి  రామనాథ్ కోవింద్ ని పట్టుకుని కోవిడ్ అని సంబోధించిన చంద్రబాబునాయుడికి ఇటివల పెట్టుకున్న చిప్ కూడా అరికాలును దాటి పాతాళానికి పడిపోయినట్టుందని ఎద్దేవా చేసారు.  సీఎం అయ్యాకే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని మంగమ్మ శపధం చేసిన చంద్రబాబు, రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు ఓటు వేయాలంటే అసెంబ్లీకి వెల్లాల్సివస్తుందని మర్చిపోయినట్లున్నాడని అన్నారు.

క్షుద్రపూజలు చేసి చంద్రబాబు, లోకేష్ లు వక్రబుద్ది వరంగా పొందారని ఫలితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి వీరికి వంకరగానే కనిపిస్తున్నాయని అన్నారు. అరాచకపాలక, అసురపాలన అంటే చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబు రాక్షసపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఆ దుష్టపాలనకు చమరగీతం పాడి, రాజన్నరాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారని అన్నారు. అరాచకపాలనంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 

Tadepalli

2022-07-13 14:54:20

జిల్లా కార్యాలయానికి ఐదుగురే సిబ్బంది

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటైన తరువాత జిల్లాశాఖల కార్యాలయాల రూపం పూర్తిగా మారిపోయింది. జిల్లా కార్యాలయానికి వెళ్లిన ఏ ఒక్కరికైనా అసలు ఇది జిల్లా కార్యాలయమేనా అనేఅనుమానం కలుగుతున్నదంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు జిల్లా శాఖల కార్యాలయాలంటే కార్యాలయానికి కనీసం తక్కువలో తక్కువ 20 మంది సిబ్బంది ఉండేవారు. ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి కేవలం జిల్లా కార్యాలయానికి ఐ నుంచి ఏడుగురు సిబ్బంది మాత్రమే మిగిలారు. కాదు కాదు అలా తగ్గించేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే 26 జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యపెరుగుతుందని అంతా బావించారు. కానీ దానికి రివర్స్ లో ఉన్న సిబ్బంది కుదించుకుపోయి, కొత్తజిల్లాలకు సర్ధుబాటు చేసి ప్రభుత్వం. దీనితో 75 శాఖలకు చెందిన జిల్లాశాఖల్లో వేళ్లపై లెక్కపెట్టేంత సిబ్బంది మాత్రమే మిగిలివున్నారు. జిల్లా కలెక్టరేట్ లో ఉండే 8సెక్షన్లు కాస్త నాలుగు సెక్షన్లుగా కుదించేశారు. ఇక జిల్లా శాఖలకొస్తే.. ఒక జిల్లా అధికారి, అటెండరు,  డిజిటిల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కారు డ్రైవరు, కొన్నిశాఖల్లో మాత్రంల ఏఓలు కూడా ఉంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో జిల్లా స్థాయి ఉద్యోగులు లేకపోవడంతో ఏడీ స్థాయి ర్యాంకు ఉన్న అధికారులను కొత్త జిల్లాలకు జిల్లా అధికారులుగా నియమించేసింది ప్రభుత్వం. చాలా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో మినిస్టీరియల్ స్టాఫ్ ను భారీగా కుదించేసింది ప్రభుత్వం. దీనితో చాలా కార్యకలాపాలు నిర్వహణ జిల్లా అధికారులకు గుదిబండగా మారింది. గతంలో పదుల సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు ఉంటేనే పనులు నెలలు నెలలు గడిచేవి. ఇపుడు ఆ పరిస్థితి మరింతగా పెరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు, కార్యకలాపాలు అన్నీ ఆన్లైన్ రికార్డుల్లో తప్పితే మరెక్కడా కనిపించడం లేదు. చాలా మంది జిల్లా అధికారులకు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడానికి డ్రైవర్లు కూడా లేని విధంగా మారిపోయింది. కొన్ని పాతజిల్లాల్లో మాత్రం జిల్లాశాఖల అధికారుల ఇబ్బందులను స్వయంగా పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్లు వారికి ఔట్ సోర్సింగ్ పద్దతిపై ఒక్కొక్క డిజిటల్ అసిస్టెంటన్ ను మంజూరు చేస్తున్నారు. 

కొన్ని జిల్లాల్లో ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొత్త జిల్లాకి ఎవరు జిల్లాశాఖ అధికారిగా వచ్చారో నేటికీ ప్రజలకు తెలియలేదు. దానిపై ఎలాంటి ప్రచారం కూడా ప్రభుత్వం చేపట్టలేదు. అంతేకాకుండా కొత్తజిల్లాల్లో జిల్లాశాఖల కార్యాలయాలు తెలియక చాలా ప్రజలు ఏ ఒక్క సమస్య వచ్చినా పాత జిల్లాలకే వెళ్లిపోతుండటం విశేషం. కొత్త జిల్లాల కార్యకలాపాలు మీడియాలో కనిపించినంతగా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు అవగాహన రాలేదు. ఆ విధంగా అవగాహన తెచ్చేవిధంగా కూడా జిల్లా శాఖల అధికారులు ఏ ఒక్క ప్రచారం కార్యక్రమం చేపట్టడం లేదు. చాలామంది అధికారులకు కొత్త జిల్లాలకు వెళ్లి పనులు చేయడమే చాలా కష్టంగా వుంది. దీనితో ఏదో మొక్కుబడిగా పనిచేస్తున్నాం అన్నట్టుగానే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది, అధికారులు, కుదించుకుపోవడంతో క్షేత్రస్థాయిలో చేపట్టే చాల పనులు పెండింగ్ లో పడిపోయాయి. అటు రాష్ట్రప్రభుత్వం మినిస్టీరియల్ సిబ్బందినైనా నియమిస్తుందనుకుంటే అదీకూడా భర్తీచేయకపోవడంతో రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత జిల్లాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే కొత్తజిల్లాల్లో సిబ్బంది లేమి, అధికారుల కొరత మరీ అధికంగా వుంది. ఆర్బాటంగా రాష్ట్రంలో 13 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసి..పరిపాలన సాగిస్తున్నట్టుగా చేస్తున్నా అసలు పనులు మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకి కదలడం  లేదు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం జిల్లాశాఖల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తే ప్రజా పరిపాలన, జిల్లాశాఖ పెండింగ్ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఇదే విధంగా అరకొర సిబ్బందితో జిల్లాశాఖల కార్యాలయాలను నెట్టుకొస్తుందా..లేదంటే రానున్న రోజుల్లో భారీగా ఏర్పడిక ఖాళీలను భర్తీచేస్తుందా అనేది..!

Tadepalli

2022-07-13 05:54:30

ద్రౌపది ముర్మును కలిసిన రాష్ట్ర మంత్రి

ఎన్.డి.ఏ రాష్ట్రపతి  అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల  ప్రచారంలో భాగంగా  మంగళవారం అమరావతి విచ్చేశారు. ఈ  సందర్భంగా ఆమెను అధికార వైఎస్సార్సీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుసుకున్నారు. ఈ  సందర్భంగా నే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి,  మంత్రి గుడివాడ అమర్నాధ్‌ను ద్రౌపది ముర్మును పరిచయం చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా తనకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కలవడానికి ఆమె రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని ప్రకటించింది. ఆమె నామినేషన్ సమయంలో కూడా రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రధానిమంత్రితో కలిసి వెళ్లి తమ మద్దతును తెలియజేశారు.

Tadepalli

2022-07-12 15:42:58

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో  ఏవి. ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. సంవత్సరంలో నాలుగు ప‌ర్వ‌దినాలైన ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.   తిరుమంజ‌నం అనంత‌రం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. 

       ఇందులో భాగంగా  ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు  కాటసాని రాంభూపాల్ రెడ్డి,  మారుతి ప్రసాద్, సనత్ కుమార్,  మధుసూదన్ యాదవ్, ఎస్ ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ  వేణుగోపాల్, విజివో  బాలిరెడ్డి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Tirumala

2022-07-12 06:38:34

ఆగస్టు1కైనా పూర్తి పేస్కేలు వస్తుందా..?

మా ఇంటికి వస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. అని అడుగుతున్నట్టుగానే వుంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు. రెండేళ్లు ప్రొబేషన్ ను 9 నెలలు పొడిగించి 33 నెలలు చేసింది ప్రభుత్వం.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీత భత్యాల ఉపయోగాల్లో మాత్రం భారీగా కోతపెట్టింది. పెంచిన పీఆర్సీ ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాదిరే రాష్ట్ర వ్యాప్తంగా వున్న 1.21లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. పెంచిన పీఆర్సీ పూర్తిస్థాయిలో ఇవ్వకపోగా, ఇపుడు 9నెలలు పేస్కేలు కోల్పోయేలా చేసింది. అంతేకాదు ఈ విధంగా 9నెలలు అధనంగా ప్రొబేషన్ లో ఉండిపోయిన ఉద్యోగులు తమ జీవిత కాలంలో ఒక ప్రమోషన్ కోల్పోయే ప్రమాదముంది. అక్టోబరు 2, 2021 నాటికి సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయివుంటే సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల్లానే వీరంతా కూడా పూర్తిస్థాయిలో జీతాలు తీసుకునేవారు. కానీ ఇపుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం అమలు చేసే ప్రసూతి సెలవులు, ఇతర మెడికల్ సెలవులు విషయంలో ఉద్యోగులు సర్వీసు ప్రొబేషన్ ను మాత్రం పెంచుతూ అమలు చేసినా..నోటిఫికేషన్, అదే జీఓల ప్రకారం ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ మాత్రం డిక్లేర్ చేయలేదు. దీని వలన 9నెలల పేస్కేలు, వాటితో వచ్చే ఇతర ఉపయోగాలు, పీర్సీ వలన పెరిగిన జీతం, ఆపై వచ్చే ఉపయోగాలు, అదనంగా పనిచేసిన 9నెలల కాలంలో ఆరు నెలలకు ఒకడీఏ కూడా ఉద్యోగులు కోల్పోయారు. ఇపుడు ప్రభుత్వం తాజాగా జీఓనెంబరు-5 ద్వారా ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కూడా ఉద్యోగులకు పెంచిన పేస్కేలు పూర్తిగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 


ప్రసూతి నిబంధన పొడిగింపు పక్కాగా అమలుచేశారు..
ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన తరువాత ప్రభుత్వ నిబంధన ప్రకారం తొలుత రెండేళ్లు సర్వీస్ ప్రొబేషన్ పూర్తిచేయాల్సి వుంటుంది. తరువాత అదే ప్రభుత్వ నిబంధనతో సదరు ఉద్యోగులను ప్రభుత్వం నోటిఫికేషన్ లో ప్రకటించిన విధంగా సర్వీస్ రెగ్యులర్ చేసి, పూర్తిస్థాయిలో పేస్కేలును అమలుచేయాలి. కానీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వెసులుబాటుని 9నెలలకు పొడిగించి, అదే రూ.15వేలతోనే అదనంగా ఉద్యోగులతో పనిచేయించింది. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు 6నెలలు సర్వీసు ప్రొబేషన్ పొడిగించింది. ఇలా చేయడం వలన నేటికీ చాలా మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తి కాలేదు. కానీ ప్రభుత్వం జీఓనెంబరు 5లో పేర్కొన్నవిధంగా చూస్తే రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని పక్కాగా ప్రకటించి జీఓలో పొందు పరిచింది. అదే ఉద్యోగ నియామకం సమయంలో ఇచ్చిన జీఓ, ఉద్యోగులు విధుల్లోకి చేరినపుడు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రెండేళ్ల తరువాత సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పూర్తి పేస్కేలు ఎందుకు అమలు చేయాలేదని ప్రశ్నిస్తే.. అ ఒక్కటీ మీరు అడక్కూడదంటూ ఆ విషయాన్ని దాట వేసింది. ప్రభుత్వం ఈ విధంగా చేయడం వలన సచివాలయ ఉద్యోగులు 9నెలలు అదనంగా రూ.15వేలకే పనిచేయడంతోపాటు, 9 నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు, 27% ఐఆర్, ఒక డీఏ, పీఆర్సీ పెంపుతో రావాల్సిన ఎరియర్స్  ఉపయోగాలన్నీ కూడా ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది.

ఆగస్టు1కి వచ్చే జీతం ఎన్నికోతలకు గురై వస్తుందో..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆగస్టు1 నుంచి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారందరికీ పూర్తిస్థాయి పేస్కేలు అమలు చేయాలని, వాటికోసం జూన్ నెలాఖరు నాటికే వారి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని జీఓనెంబరు-5 ద్వారా ఆదేశించింది. ఈ సమయంలోనే ఉద్యోగుల జీతాలకు చెందిన సాలరీ బిల్లులు ప్రతీ నెల 20 నుంచి 25 వతేదీలోగా అప్లోడ్ చేయాల్సి వుంటుంది. అయితే ప్రసూతి సెలవులు తీసుకున్నవారి సర్వీసు ప్రొబేషన్ సాలరీలు పెట్టే సమయం నాటికే పూర్తయినా వారు కొత్త పేస్కేలు పొందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ విధంగానే ప్రభుత్వం జీఓలో పొందు పరిచింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బినిఫిట్స్ ను తప్పించుకునేందుకు.. ప్రభుత్వానికి అనుకూలంగా జీఓలను అమలు చేయనప్పటికీ, ప్రసూతి, సిక్ లీవ్ లను అమలు చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం తమ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసింది. ఈ ఒక్క కారణంతోనే నేటికీ చాలా మందికి మహిళా ఉద్యోగలకు సర్వీసు ప్రొబేషన్ కి సంబంధించిన డిక్లరేషన్ ఫైనల్ డాక్యుమెంట్లు జిల్లాశాఖల కార్యాలయాల నుంచి సచివాలయాలకు చేరుకోలేదు. అంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా వ్యవహరించినప్పటికీ, ఉద్యోగుల సెలవుల విషయంలో ప్రభుత్వం తూచా తప్పకుండా జీఓలను అమలు చేయడం మాత్రం ఎక్కడా ఆపలేదు. ఈ ఒక్క కారణంతోనే ఆగస్టు 1నాటికి కూడా చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెరిగిన పేస్కేలు జీతం అందుకునే పరిస్థితి లేదు. అంతేకాదు అసలు ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసి పేస్కేలు ఇస్తామని చెప్పినట్టుగా.. ఎంత జీతం చేతిలో పెడుతుంది. ఏఏవి కోత పెట్టిందీ తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి.. సచివాలయ ఉద్యోగులకు జాయినింగ్ ఆర్డర్ లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వం, ఇపుడు పెరిగిన పేస్కేలుతో ఎంత మొత్తం వారికి జీతాలు అందించనుందో..ఏ మొత్తాన్ని కుదించి..అవి మీకు ఇవ్వడం లేదని చెప్పనుందో.. ఈ లెక్కన చూస్తే.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. అని నానుడిని పక్కాగా అమలు చేసినట్టు లేదూ..!

Tadepalli

2022-07-08 08:31:07

ప్రభుత్వం నిల్(కార్యాలయం)రాజకీయం ఫుల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసినంత త్వరగా కొత్త జిల్లాల్లో ప్రభుత్వ జిల్లాశాఖల  కార్యాలయాల ఏర్పాటు మాత్రం చేయడానికి చొరవ చూపించడం లేదు. ఒక్కో జిల్లాలో సుమారు 75శాఖలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి వుంది. ముఖ్యమైన శాఖలైన రెవిన్యూ, పోలీస్, ఫారెస్టుతో మరో పది పదిహేను కార్యాలయాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. మిగిలిన కార్యాలయాలు మాత్రం కొత్త జిల్తాల్లో ఏర్పాటు కాలేదు. పేరుకి జిల్లా కార్యాలయాల బోర్డులు తగిలించినా కార్యకలాపాలు మాత్రం పాత జిల్లాల నుంచే నడిపిస్తుంది ప్రభుత్వం. ఇటీవలే ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం ఆ తరువాత కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు. కొత్త జిల్లాల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలు ప్రారంభం అయిపోయి కార్యకలాపాలు మొదలు కావడం విశేషం. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఫారెస్ట్ అధికారుల కార్యాలయాలకు సంబంధించినంత వరకూ  సివిల్ సర్వీస్ అధికారుల నియామకాలు మాత్రం నూతన జిల్లాల ఏర్పాటు నుంచే ప్రారంభం అయినా మిగిలిన శాఖల కార్యాలయాలు ఒక్కొక్కటీ ధీమాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇదే క్రమంలో ఇప్పటికీ చాలా మంది పాత జిల్లాల్లోనే స్పందన కార్యక్రమాలకు వెళ్లి తమ అర్జీలను ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ అధికారులు మీ జిల్లా మారిపోయింది. ఇకపై మీరు  పలానా జిల్లా కలెక్టరేటు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నచోటుకి వెళ్లి మీ సమస్యను అక్కడ జిల్లా అధికారులకు తెలియజేయండి అని నచ్చజెప్పి పంపిస్తున్నారు.ఇక మీడియా కార్యాలయాలు కూడా విభజన జరగలేదు. పత్రికలైతే పాత జిల్లాలు ఎన్ని జిల్లాలుగా మారాయో.. అన్ని జిల్లాలు(మూడేసి జిల్లాలను కలిపి) పేర్లను ఒకే ఎడిషన్ పై వేసి ఆ జిల్లాలకు చెందిన సమాచారాన్ని, వార్తలను పాఠకులకు అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం ఆయా కొత్త జిల్లాల పేర్లతోనే వార్తల బులిటిన్ లను విడుదల చేస్తున్నాయి.

ఇక్కడ చెప్పుకోవాల్సినది ముఖ్యంగా రాజకీయ పార్టీలు. అన్ని రాజకీయ పార్టీలు తమ సొంత జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాల ఎంపిక పూర్తిచేసుకొని నిర్మాణాలకు సిద్ధం అవుతున్నా.. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడం పట్ల ప్రజలు గందర గోళానికి గురవుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలు కూడా ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఎక్కడో ఏర్పాటు చేయడం, వాటిపై ప్రజలకు అవగాహన వచ్చేలా నేటికీ పూర్తిస్థాయిలో మీడియా ద్వారా కూడా ప్రచారం చేయకపోవడం ప్రజలకు కొత్త ఇబ్బందులను తీసుకొస్తున్నది. అలాగని గ్రామ, వార్డుల్లోని సమస్యలపై సదరు సచివాలయాల్లో దరఖాస్తులు చేసినా వాటికి పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ఒక్క అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు మాత్రం కాలేదు. మరోవైపు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం కూడా అర్ధాంతరంగానే ఆగిపోయింది.

విచిత్రం ఏంటంటే..అధికాపార్టీ రాజకీయ కార్యక్రమాలు, కార్యకలాపాలు కూడా పాతజిల్లా కేంద్రంగానే నిర్వహిస్తోంది. అటు జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, టిడిపి, లోకసత్తా, బిఎస్పీ లాంటి రాజకీయపార్టీలు మాత్రం కొత్త జిల్లాల్లో కార్యలయాలు ప్రారంభించి తమ కార్యకలాపాలను కొత్త జిల్లాలల్లోని మండలాలకు కూడా విస్తరించాయి. అధికార పార్టీకి పాత జిల్లాల్లోనే కార్యాలయాలు ఉండటం, కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో జిల్లా కార్యాలయాలు లేకపోవడంతో చిన్నా, చితకా ప్రెస్ మీట్లు కూడా పాత జిల్లా కేంద్రంగానే ఏర్పాటు చేస్తున్నాయంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీకి జిల్లాల్లో కార్యాలయాలు లేకనే ప్రభుత్వ కార్యాయాలు కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తుందని అన్ని వర్గాల ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాలు నిల్.. రాజకీయపార్టీల కార్యాలయాల ఫుల్ అన్నచందంగా తయారైంది కొత్త జిల్లాల్లోని పరిస్థితి. కొత్త జిల్లాల్లో కొన్ని డివిజనల్ కార్యాలయాలు సొంత కార్యాలయాల్లో నడుస్తున్నా..వాటిని జిల్లా కార్యాలయాలుగా మర్పు చేసి కొన్ని కార్యాలయాకే పరిమితం చేశారు. 75 ప్రభుత్వశాఖలకు సంబంధించిన అధికారులు ఎక్కడెక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు.. అసలు ఆ మొత్తం జిల్లా అధికారులందరూ కొత్త జిల్లాలకు వచ్చారా? వారిని ఏ విధంగా సంప్రదించాలి..? అన్నది కూడా ప్రశ్నార్ధకంగానే మిగిలి పోయింది. చూడాలి డిసెంబరు లోపుగా అన్ని ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయిలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఏ స్థాయిలో అమలు జరుగుతుందనేది.

Anakapalle

2022-07-08 05:40:09