1 ENS Live Breaking News

ఏపీలో పులుల సంఖ్య 55 నుంచి 65 మాత్రమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వుతోపాటు ఏజెన్సీ, శేషాచలం అన్ని ప్రాంతాలో కలిపి 55 నుండి 65 వరకూ పులుల సంఖ్య ఉండొచ్చని అంచనా వేశారు. కాలి గుర్తులు, కెమెరా రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఈ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ ఉంది. ఇది కాకుండా పాపికొండల ప్రాంతంలోనూ పులల సంచారం ఉంది. ఒడిస్సా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ ప్రాంతాల నుండీ మన రాష్ట్రంలో అటవీ ప్రాంతానికి పులుల రాకపోకలు సాగిస్తున్నాయి. మహారాష్ట్రలో మాల్గార్‌ రిజర్వు నుండి నిత్యం మన రిజర్వులోకి రాకపోకలు సాగిస్తుంటాయి. ఒడిస్సాలోని సిమ్లిపాల్‌ రిజర్వు నుండి పులులు వస్తుంటాయి. రాష్ట్రంలో సుమారు 3500 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులుల సంచారం ఉన్నట్లు అంచనా. ప్రతి పులి తన టెరిటోరిల్‌(సరిహద్దులు) 100 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. అంటే సుమారు 2500 ఎకరాలు సరాసరిగా ఉంటుంది. ప్రతి ఏటా పులుల సంఖ్యపై జాతీయస్థాయిలో సర్వే నిర్వహిస్తారు. గతంలో నిర్వహించిన సర్వేలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 590 వరకూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 55 నుండి 65 మధ్య ఉండొచ్చని లెక్కగట్టారు. ప్రసుత్త కాకినాడ పరిధిలో తిరుగుతున్న పులి కూడా మన రాష్ట్రానికి సంబంధించింది కాదని, ఇటీవల లభించిన వీడియో, పంజా గుర్తుల ఆధారంగా అది ఇతర రాష్ట్రం నుండి వచ్చి ఉండచ్చని చెబుతున్నారు. ఒడిస్సా అటవీ ప్రాంతం నుండి వచ్చిందని, వచ్చే క్రమంలో దారితప్పి రావడం, అదే సమయంలో పశు మాంసానికి అలవాటు పడటంతో పూర్తిస్థాయిలో టెరిటరీ ఏర్పాటు చేసుకోలేదని, దీనివల్ల కొంత గందరగోళానికి గురవుతోందని తేల్చారు. అయితే అది తిరిగి వెళ్లే క్రమంలో ప్రస్తుతం తుని పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చని తేల్చారు. రాకపోకలు సాగించే దారిలేకపోవడం వెనుక ప్రకృతి సహజమైన వనరులు ధ్వంసం కావడం కూడా కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. అడవి జంతువులు నిరంతరం తిరిగే మార్గంలో అడ్డంకులు ఎదురైనప్పుడు మాత్రమే అవి దారితప్పుతాయని, లేనిపక్షంలో అంత తొందరగా వాటి సరిహద్దులు దాటి రావని చెబుతున్నారు. జూన్‌, జులై నెలల్లో పులుల సంఖ్యను ప్రకటించే సమయం కావడం ఇదే సమయంలో రాష్ట్రంలో పులి దారితప్పి ప్రయాణిస్తుండటంతో రాష్ట్రంలో పులుల సంఖ్య, వాటి కదలికలపైనా ఆసక్తి ఏర్పడింది. తుని పరిసరాల్లో ఉన్న పులి యుక్త వయస్సువల్ల తోడు కోసం దారితప్పిందని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, ప్రకృతి సిద్ధమైన అనేక కారణాలు ఇందులో ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. నిజంగా తోడు కోసమైతే పులి ఇంతదూరం ప్రయాణం చేయదని, కేవలం దారితప్పడం వల్లే కొంత గందరగోళానికి గురైందని చెబుతున్నారు. త్వరలోనే జాడను గుర్తిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Tadepalli

2022-06-28 05:34:17

ఉద్యోగుల రెగ్యులైజేషన్ కి నోట్ ఫైల్ షురూ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లరైజేషన్ చేసిన తరువాత వారి సర్వీసులను రెగ్యులర్ చేసే ప్రక్రియను వేగం పెంచింది. దానికోసం సచివాలయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఇచ్చిన జీఓ-5 తో 19 ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు రెగ్యులైజేషన్ కి సంబంధించి జిల్లా కలెక్టర్ కి నోట్ ఫైల్ తయారుచేసే పనిలో పడ్డారు. 13 జిల్లాలు కాస్త.. 26 జిల్లాలుగా మారిపోవడంతో ఇపుడు ఏ జిల్లాకు చెందిన సచివాలయ ఉద్యోగుల జాబితా ఆ జిల్లా అధికారులు తయారు చేస్తున్నారు. ఈ మేరకు వార్డుల్లో మున్సిపల్ అధికారులు, జిల్లాల్లో జిల్లా అధికారులు ఈ జాబితా తయారు చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లే ప్రొబేషన్ పూర్తిచేసుకున్న సిబ్బంది యొక్క ఫైనల్ ఫైళ్లను మండలాల్లో ఎంపీడీఓలు జిల్లా అధికారులకు సమర్పించారు. ప్రభుత్వం ఆగస్టు1 నాటికి ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ కొత్త పేస్కేలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏఏ జిల్లాల్లో ఎంత మంది రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నారు.. ఎంత మంది ప్రసూతి సెలువుల్లో ఉన్నారు.. మరెంత మంది డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసయ్యారు.. తదితర వివరాలతో కూడిన నోట్ ఫైల్ ను తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే డిఎస్సీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించడంతో అన్ని మండాలను యుద్ద ప్రాతిపదిక జాబితాలు జిల్లా కేంద్రానికి రప్పిస్తున్నారు. 

ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి 6 నెలలు సర్వీసు ప్రొబేషన్ పొడిగింపు వర్తించడంతో వారి జాబితాలను కూడా జిల్లాశాఖల అధికారులు సేకరిస్తున్నారు. అదే సమయంలో ఎంత మంది ఉద్యోగులకు పోలీసు వెరిఫికేషన్ పూర్తయింది.. ఇంకా ఎంతమంది పెండింగ్ లో ఉన్నారనే సమాచారాన్ని కూడా 19శాఖలకు చెందిన జిల్లా అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి తొలి నోట్ ఫైల్ పూర్తయితే..మిగిలిన సిబ్బంది యొక్క జాబితా వచ్చే నె22 నాటికి పూర్తికావాలి. అంతేకాకుండా ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీలోపు జీతాల బిల్లులు పెట్టాల్సిరావడంతో ఆలోగానే సమాచారం జిల్లా అధికారుల నుంచి అనుమతులు వస్తేనే పూర్తిస్థాయి పేస్కేలుతో జీతాలు పెట్టడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే ప్రభుత్వం తొలుత నిర్ధారించిన రూ.15వేలతో ఉద్యోగులు జీతాలు తీసుకోవాల్సి వుంటుంది. ఆ ఇబ్బందులు రాకుండా జిల్లా అధికారులు నోట్ ఫైల్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో  కలెక్టర్లకు అందిన నోట్ ఫైల్ ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎంత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగస్టు1 నాటికి ఫుల్ పేస్కేలు తీసుకుంటున్నారు..మరెంత మందికి ప్రభుత్వ నిబందనల మేరకు షరతులు వర్తిస్తాయనేది తేలనుంది.

Tadepalli

2022-06-28 03:21:19

వెనక్కి వెళ్లిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు..

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు వ్యవహారం రెండు అడుగులు వెనక్కి వెళ్లినట్టే కనిపిస్తున్నది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చే క్రమంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి వడి వడిగా స్థలాల సేకరణ చేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. వాస్తవానికి జిల్లాల విభజన పూర్తిస్థాయిలో జరిగిన తరువాత, 75శాఖలకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. కాని కొన్ని శాఖల కార్యాలయాలు మాత్రమే కొత్త జిల్లాలకు వచ్చాయి. చాలా ప్రభుత్వశాఖలు ఇంకా కొత్త జిల్లాలకు రాకుండా పాత జిల్లాల నుంచే పరిపాలన సాగిస్తున్నాయి. ఈ తరుణంతో ప్రభుత్వం కూడా కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల వ్యవహారాన్ని కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు పూర్తయిన తరువాత చూద్దాం అన్నట్టుగానే పక్కన పెట్టింది. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖను పటిష్టం చేసిన తరువాత జిల్లా స్థాయిలో అధికారులు ప్రజల సమస్యలు, అభివ్రుద్ధిపై కాస్త అధికంగా ద్రుష్టిసారించాల్సి వుంటుంది. అందుకువీలుగానే కొత్తజిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దానికి తగ్గట్టుగానే భూముల పరిశీలన చేపట్టింది. కొన్నిజిల్లాల్లో భూములు దొరకని ప్రాంతంలో ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వం సేకరించడానికి జిల్లా కలెక్టర్లు, జాయంట్ కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. తెలంగాణలో మాదిరిగా 75 ప్రభుత్వ శాఖలు ఒకే భవనంలో వివిధ చాంబర్లలో ఉంటే పరిపాలన కూడా చాలా సాఫీగా సాగుతుందని, అత్యవసర సమావేశాలు, ఆదేశాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆలోచన చేసినప్పటికీ.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై చూపిన శ్రద్ధ కొత్తగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల విషయంలో చూపించడం లేదు. దీనితో ఈ వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయ్యింది. ఇంకా ప్రభుత్వానికి కేవలం రెండేళ్లు లోపు సమయం మాత్రమే ఉండటంతో పూర్తిస్థాయిలో నవరత్నాలు అమలు చేసి, ప్రజలు చేరువ కావడానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తున్నది. కొత్తజిల్లాలో చాలా వరకూ ప్రస్తుతం వున్న జిల్లా కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అలాకాకుండా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు అయితే అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో పాటు, చాలా పోస్టులు కుదింపు జరిగే అవకాశం కూడా వుంటుంది. ఒకరకరంగా ఈ విధానం వలన అన్ని జిల్లాశాఖలకు చెందిన అధికారులు ఒకే చోట ఉంటడంతో స్పందనలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సత్వర మేలు జరుగుతుంది. పైగా అత్యవసర పనులపై జిల్లా కేంద్రాలకు వచ్చే ప్రజలకు కూడా ఒక్కో కార్యాలయానికి ఒక్కో దగ్గరకి తిరగకుండా ఒకే కార్యాలయంలో కావాల్సిన అన్నిశాఖల పనులు చూసుకొని వెళ్లే సౌలభ్యం కూడా వుంటుంది. ఇన్ని ఉపయోగాలున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల విషయాన్ని ప్రభుత్వం ఒక్కసారిగా పక్కన పెట్టడం వెనుక ఆంతర్యం అంతుచిక్కడం లేదు. చూడాలి ఈ ఏడాది చివరినాటికైనా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం మొదలవుతుందా లేదా అనేది..!

Tadepalli

2022-06-28 02:45:11

సచివాలయ ఉద్యోగులపై అయోమయ బాంబ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను జూలై నెలఖరు నుంచి క్రమబద్దీకరిస్తున్నామని, వారంతా ఆగస్టు ఒకటి నుంచి సరికొత్త పీఆర్సీతో కూడి పేస్కేసలు అందుకుంటారని జీఓనెంబ-5 విడుదల చేసినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగిలోనూ ఆనందం లేదు సరికదా.. పూర్తిగా అయోమయంలో పడిపోయారు. ఇదేంటీ ఓప్రక్క ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్  చేస్తూ జీఓ ఇచ్చినా.. ఈ తేడా వార్తలు రాస్తున్నాన్నారేంటి.. అందులోనూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్), అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens live,న్యూస్ వెబ్ సైట్ www.enslive.net వాళ్లు విషయాన్ని ఇంతలా ఉద్యోగులకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారేంటి అనుకుంటున్నారా.. మీకు కూడా ఆ ఆ డౌట్ వచ్చంది కదా.. అలాఅయితే  ఈ స్టోరీ పూర్తిగా చదివితే మీకు కూడా సరిగ్గా బొమ్మ కనిపించే వాస్తవాలు తెలుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసినపుడు ఉద్యోగుల సర్వీసును ప్రొబేషన్ ను డిక్లేర్ చేసే సమయంలో ఒక జీఓను విడుదల చేస్తుంది. ఆ జీఓను అనుసరించి ప్రతీ శాఖ ముఖ్య కార్యదర్శి మరోసారి ఉద్యోగుల సర్వీసు రూల్సు, పదోన్నతులు తెలియజేస్తూ.. వారి పేస్కేలుని నిర్ణయిస్తూ మరో జీఓరు జారీ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 19 శాఖల సిబ్బందిని ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చి, నగపరిధిలో వార్డు సచివాలయాలు, గ్రామ పరిధిలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసినా.. నియామకాల సమయంలో మాత్రం వారి వారి మాత్రుశాఖల నుంచే వీరందరికీ నియామకపత్రాలు అందించారు. అంతవరకూ బాగానే ఉన్నా..రాష్ట్రప్రభుత్వం ఈనెల 25వ తేదీన వీడుదల చేసిన జీఓనెంబరు -5 తోనే అసలు చిక్కంతా వచ్చిపడింది. అసలు సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్  లేకుండా, పేస్కేలు నిర్ధిష్టంగా ఎంత వస్తుందో చెప్పకుండా, అందరికీ కలిపి ఒక ఒక్క జీఓను ఇచ్చి చేతులు దులుపుకుంది. 

19 ప్రభుత్వ శాఖలకు చెందిన జీఓలను ఇంకా విడుదల చేయలేదు. అందునా ఒక్క గ్రేడ్-5 కార్యదర్శికి తప్పా మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులకు ఒకే రకంగా పేస్కేలు నిర్ధారిస్తూ జీఓలో ఉటంకించారు. ప్రభుత్వం సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ, పేస్కేలు అమలు చేస్తున్నట్టు మాత్రమే జీఓ ఇచ్చింది. దీనిని అనుసరించి మిగిలిన శాఖల సర్వీసు రూల్సు ఏర్పాటు చేసి జీఓలు ఇస్తే తప్పా, వీరి భవిష్యత్తు ఏంటనే తేలదు. లేదంటే వీరంతా జీవితంత కాలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఉద్యోగం వచ్చినచోట పనిచేయాలి. గతంలో ప్రభుత్వం ఏంపీడీఓ వ్యవస్థ ఏర్పాటు చేసినపుడు వారికి కూడా సర్వీసు రూల్స్, పదోన్నతుల విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో నేటికీ  ఎంపీడీఓలుగానే రిటైర్ అయ్యారు. అవుతున్నారు కూడా. ఇటీవల కాలంలో ఎంపీడీఓలకు పదోన్నతులు ఇస్తామని ప్రకటించినా..ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోలేదు. తీసుకుంటుందో..లేదో కూడా తెలియదు. కారణం ఇంకా ఈ ప్రభుత్వానికి గడువు రెండేళ్లు లోపు మాత్రమేవుంది. ఇపుడు సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవే ఇబ్బందులు రాబోతుండటంతో వారంతా తమ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందనే అనుమానాన్ని, భయాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.


పీఆర్సీ ఏవిధంగా వర్తింప చేశారు..?
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ద్వారా పెంచిన పేస్కేలు ఇస్తున్నట్టు చెప్పినా.. ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులుకు ఇచ్చినట్టుగా సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయలేదని తేటతెల్లమైపోయింది. పీఆర్సీని అమలు చేస్తే.. హెచ్ఆర్ఏ, డీఏ కలుపుకొని ఎంత వస్తుందనేది మాత్రం జీఓలో స్పష్టత ఇవ్వలేదు. దానిని ఒక్కో మీడియా సంస్థ ఒక్కోలా ఉద్యోగులను అయోమయంలోకి నెట్టేస్తూ వార్తల రూపంలో వండి వార్చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఒక నిర్ధిష్ట ప్రకటన చేయలేదు. ఉద్యోగాలకు డిగ్రీ అర్హత పెట్టినా నాల్గవ తరగతి ఉద్యోగుల కంటే తక్కువ కేడర్ లోనే వీరిని ఉంచేసింది. అందులోనూ సచివాలయ శాఖలో 19ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ ఏ ఒక్కరి విషయంలోనూ ప్రమోషన్ ఛానల్, సర్వీస్ రూల్స్, డిపార్ట్ మెంటల్ టెస్టులు తదితర అంశాలేమీ పొందు పరచలేదు. ఇప్పటికే రెండేళ్లు చేయాల్సిన సర్వీసు ప్రొబేషన్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 39 నెలలు చేస్తున్నారు. కాదు కాదు చేయించిన తరువాత  మాత్రే వీరందరికీ సర్వీస్ ప్రొబేషన్ క్లియర్ అవుతుందని, జూలై నెలాఖరు వరకూ వీరి ప్రొభేషన్ కొనసాగి ఆగస్టు 1 నుంచి పేస్కేలు అందుకుంటారని జీఓనెంబరు-5లో పేర్కొంది ప్రభుత్వం. మరోప్రక్క సచివాలయ ఉద్యోగులు, నియామకాలు, వారి అధికారాలపై ఇంకా కోర్టుల్లో కేసులు నలుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జారీచేసిన ప్రొబేషన్ డిక్లరైజేషన్ జీఓ సచివాలయ ఉద్యోగులను అయోమయంలోకి నెట్టేసింది.


మళ్లీ సచివాలయ ఉద్యోగాలు మరోసారి తీసే పనిలేకుండా.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు రూల్స్, పదోన్నతులపై జీఓ ఇస్తే ఏడేళ్ల తరువాతనో, లేదంటేం పదేళ్ల తరువాతనో ఉన్న ఉద్యోగులంతా పదోన్నతులపై వారి వారి శాఖల్లో పెద్ద స్థాయికి వెళతారు. ఆ సమయంలో సచివాలయాల్లో ఖాళీ అయిన అన్ని ఉద్యోగాలను మళ్లీ  భర్తీ చేయాల్సివుంటుంది. అలా చేయాల్సి వస్తే ప్రతీ ఏడు సంవత్సరాల కొకసారి గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి వుంటుంది. అదే జరిగితే ప్రభుత్వంపై చాలా పెద్ద మొత్తంలో ఆర్ధిక భారం పడుతుంది. అలా కాకుండా సర్వీసు రూల్స్ గానీ, ప్రమోషన్ ఛానల్ గానీ ఏర్పాటు చేయకపోతే సచివాలయ ఉద్యగులు, ఎన్నేళ్లైనా ఇక్కడే అలాగే ఉండిపోతారు. వారికి జీతం పెరుగుతుంది తప్పితే ఉద్యోగంలో ఎలాంటి ఎదుగు, బొదుగూ ఉండదు.  ఒక వేళ కోర్టులను ఆశ్రయించినా వాయిదాలతోనే ప్రభుత్వం పదవీ కాలం పూర్తయిపోతుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఇతర ప్రయోజనాల మీద ద్రుష్టిపెడతారు తప్పితే ఉద్యోగుల సర్వీసు రూల్స్, పదోన్నతుల కోసం ఆలోచించే సమయం వుండదు. వచ్చే ప్రభుత్వం ఇదే  అయితే మరోసారి ఆలోచిస్తామనో..లేదంటే కొత్తగా సర్వీసు రూల్సు అమలు చేస్తామనో ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకుంటారు.. మారీ కూడదు అనుకుంటే పదోన్నతులు అడగకుండా చేస్తున్న విధినిర్వహణలో ప్రస్తుతం రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవులు అనే తారమతమ్యం లేకుండా ప్రత్యేకంగా విధులు చేయిస్తున్నదానికంటే రెండింతలు నిర్వహించేలా చేస్తూ... కఠిన నిర్ణయాలు, అదనపు విధులు అమలు చేస్తే.. కనీసం సెలవులు అడిగి ప్రమోషన్ కోసం మాట్లాడకుండా ఉంటారని కూడా ప్రచారం జరుగుతుంది.

పేరుకే భారీ సంఖ్యలో ఉద్యోగాలు..తలా..తోకా లేనే లేదు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినట్టుగానే గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసి సుమారు లక్షా 34వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినా.. ఆ ఉద్యోగాలకు తలాతోకా ఏమీ లేకుండా పోయిందనేది ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ అమలు చేయకపోవడంతో ఆ విషయం తేటతెల్లమైపోయింది. భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 33 నెలలు సర్వీసు ప్రొబేషన్ ఉద్యోగులతో చేయించిన క్రమంలో అదనంగా పనిచేసిన కాలానికి ఉద్యోగులు సుమారు రూ.1.50 లక్షల వరకూ ఉపయోగాలు కోల్పోయారు. ఇపుడు ప్రమోషన్ ఛానల్ ప్రకటించకపోవడంతో వీరంతా ఇవే ఉద్యోగాల్లో జీవితాంతం పనిచేయాల్సి వస్తుంది. రెగ్యులర్ ఉద్యోగమనే ఒకే ఒక్క నమ్మకంతో లక్షల్లో జీతాలు వదులుకొని వచ్చిన సచివాలయ ఉద్యోగులందరికీ ప్రభుత్వ తీరుతో నిరాశ ఎదురైంది. దానికితోడు, సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఇచ్చిన జీఓకి, మిగిలిన 19శాఖల ముఖ్య అధిపతుల నుంచి ప్రత్యేకంగా జీఓలు రాకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అయోమయ బాంబు పడ్డట్టు అయ్యింది. పేరుకే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఖాళీలు భర్తీచేసినా వారికి జీఓనెంబరు 149ని అమలు చేయకపోవడం, మహిళా పోలీసు ఉద్యోగాలు భర్తీచేసినా వారు యూనిఫారం పోలీసుల క్రిందికి వస్తారో, కార్యాలయ పోలీసు సిబ్బందికి వస్తారో క్లారిటీ ఇవ్వకపోవడం, అన్నింటికంటే ముఖ్యంగా వీరంతా ఏ తరగతి ఉద్యోగుల క్రిందికి వస్తారో కూడా అధికారికంగా చెప్పకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది.

 కొత్తగా ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసినపుడు ఎక్కడైనా వారికి ప్రాధమికంగా ఇచ్చే ఉద్యోగంతోపాటు, ఐదేళ్ల తరువాతో, ఏడేళ్ల తరువాతో వారికి ఏ తరహా పదోన్నతులు కల్పిస్తారో చెబుతూ, సర్వీసు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు సదరు ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు. విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని 19శాఖల ఉద్యోగుల విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా ఉద్యోగాలు భర్తీచేసి, ఇపుడు ఆగస్టు1 నాటికి ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. చూడాలి ముందు ముందుకైనా వీరు ఏ తరగతి ఉద్యోగుల క్రిందికి వస్తారు, అసలు పదోన్నతులు, బదిలీలు, ఉంటాయా ఉండవా? వీరి సర్వీసు మొత్తం ఇక్కడే రిటైర్ అయిపోతారా అనే విషయాలపై క్లారిటి వస్తుందా.. లేదా.. అనేది. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్), అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens live App, www.enslive.net ఎప్పుడూ ఉద్యోగులు, వారి సమస్యలు, ఇబ్బందులను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆ క్రమంలోనే ఉద్యోగులకు జరగబోయే నష్టాన్ని, ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన తరువాత 19శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శిలు చేసిన తప్పుల వలన ఉద్యోగులకు జరిగే నష్టాన్ని సవివరంగా తెలియజేసింది..!

తాడేపల్లి

2022-06-27 06:01:35

సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ ను డిక్లేర్ చేస్తూ..జీఓనెంబరు-5ను సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ విడుదల చేశారు. ఈ జీవోతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు లక్షా 24వేలకు పైగా ఉద్యోగులకు రెగ్యులర్ పేస్కేలు అమలవుతుంది. అయితే ప్రభుత్వం వీరికి పీఆర్సీ కూడా అమలు చేసినట్టు ప్రకటించింది. సచివాలయ ఉద్యోగులు 33 నెలలు ప్రొబేషన్ తరువాత మాత్రమే ఈ జీఓను జారీ చేసింది. వాస్తవానికి అక్టోబరు1 2021నే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తయింది. కానీ 19శాఖలకు చెందిన సచివాలయ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం ఈజీఓ వర్తింపచేసింది. ఈ జీఓ ప్రకారం ఉద్యోగులు ఆగస్టు 1 నుంచి కొత్తగా పెరిగిన పేస్కేలు అందుకుంటారు. ప్రభుత్వ జీఓ ప్రకారం పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలకు రూ.23,120 నుంచి రూ.74,770 అదేవిధంగా మిగిలిన 18శాఖల ఉద్యోగులకు రూ.22,460 నుంచి రూ.72,810 మేరకు పేస్కేలు వర్తిస్తుంది. దీనికి హెచ్ఆర్ఏ, డీఏ పూర్తిస్థాయి జీతాలు ఉద్యోగులు అందుకుంటారు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓను గ్రామసచివాలయశాఖలో పనిచేస్తున్న అన్నిశాఖలకు, డీఎస్సీ చైర్మన్, కలెక్టర్లు జారీచేసింది. ఇన్నేళ్లకు తమ సర్వీసు ప్రొబేషన్ క్లియర్ చేస్తూ.. పేస్కేలు వర్తింపచేయడం పట్ల గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tadepalli

2022-06-25 12:40:06

కేబినెట్లో సచివాలయ ఉద్యోగుల ఊసేది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మంత్రిమండలిని విస్తరించిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సుమారు 42 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన విషయం మాత్రం చర్చకు రాలేదు. ఇప్పటి వరకూ సచివాలయ ఉద్యోగులు 33నెలల పాటు సర్వీసు ప్రొబేషన్ ను చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ సర్కారు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకోగానే వారి సర్వీసులు రెగ్యులర్ చేసి వారికి పేస్కేలు అమలు చేస్తామని చెప్పింది. ఆ తరువాత కరోనా రావడంతో రెండేళ్ల ప్రొబేషన్ ను కాస్తా 33 నెలలకు పెంచి ఆగస్టు1 నుంచి కొత్తజీతాలు ఇస్తామని..దానికి సంబంధించిన ఫైలుపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంతకాలు కూడా చేశారు. సీఎం ఫైలుపై సంతకాలు చేసి పదిరోజులు గడుస్తున్నా సదరు ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్స్ కి సంబంధించిన అంశంలో మాత్రం క్లారిటీ రాలేదు. సుమారు లక్షా 24వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసు ప్రొబేషన్ వ్యవహారం ఏడాదికి ఏడాది కాలం పొడిగిస్తూనే వస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఒక ఫైలుపై సంతకాలు చేసిన 24 గంటల్లో ఆర్ధిక శాఖ జీఓ జారీచేస్తుంది. 

ఆపై వరుసగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శాఖలు కూడా జీఓలు జారీచేస్తాయి. ఈ విధంగానే జరుగుతుందని సచివాలయ ఉద్యోగులంతా ఊహించుకున్నారు. ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తిచేసుకుని.. టెస్టులు పాసైన వారందరికీ వర్తింపచేస్తామని చెప్పిన మాటలు మాత్రం మాటలు గానే ఉండిపోయాయి. ముఖ్యమంత్రిస్థాయిలో నిర్ణయం తీసుకున్నతరువాత అదే విషయాన్ని కేబినెట్ లో చర్చించి సదరు ఫైలుకి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఊసేలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల గొంతులో వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. ప్రభుత్వం కేబినెట్ లో తమ అంశం కూడా చర్చించి సర్వీసు ప్రొభేషన్ విషయాన్ని ముగించి తమకు పేస్కేలు అమలు చేయడానికి లైన్ క్లియర్ చేస్తారని అంతాఆశించినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఇప్పటికే ఆగస్టు 1నాటికి ప్రొభేషన్ డిక్లరేషన్ అయిన తరువాత కొత్త జీతాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం..ముచ్చటగా మూడేళ్లు పూర్తిచేసినా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని..తొలుత జూన్ నాటికి రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం దానిని ఆగస్టు1నాటికి మార్చిందని..ఇపుడు కేబినెట్ లో తమ ఉద్యోగాల సర్వీస్ ప్రొభేషన్ డిక్లరైజేషన్ కోసం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగస్టు నుంచి మళ్లీ అక్టోబరు 1 అంటే మూడేళ్లు పూర్తిచేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటుందా అనే అనుమానాలను కూడా ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అదనంగా 9నెలల పాటు పేస్కేలు కోల్పోయిన ఉద్యోగులు.. పొగిడించిన రెండు నెలలతో మరింతగా పేస్కేలు కోల్పోతారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి మానస పుత్రిక గా పేరుగాంచిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ జరగలేదు. ఇపుడు సర్వీసు రెగ్యులైజేషన్, ప్రొభేషన్ డిక్లరేషన్ విషయంలోనూ అదే కాలయాపన చేస్తుందని మరోవైపు టీడీపీ ఆరోపణలు గుప్పిస్తున్నది. 

ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగానే పాలక ప్రభుత్వం కూడా తాత్సారం చేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. అయితే కొంత మందిఉద్యోగులు ప్రభుత్వం పెట్టిన పరీక్షలు పాస్ కాలేదని, వారందరికీ మరోసారి పరీక్షపెట్టి వారికి అందరికీ ఒకేసారి సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేస్తామని అంటున్నట్టుగా ప్రభుత్వ అధికారుల వద్దకు సమాచారం అందినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వంలోనూ లేనివిధంగా 33నెలలకు పైగా ప్రొభేషన్ చేయించడం, అదీ రెండవ శనివారాలు, ఆదివారాలు, మిగిలిన సెలవు రోజుల్లో ప్రత్యేక విధుల పేరుతో ఉద్యోగాలు చేసినా..ప్రభుత్వం గుర్తించకపోవడం, సకాలంలో సర్వీసులు రెగ్యులర్ కాకపోవడం తదితర పరిణాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది..!

తాడేపల్లి

2022-06-25 05:46:31

స్పందనలోనే ఇక సచివాలయ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల అధికారులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఏర్పాటు చేసే సమావేశాలకు, ఆ పేరుతో చేసే కాలయాపనకు అడ్డుకట్టవేసింది. సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉండాలని, ఆ సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో సహా అన్నిశాఖల సిబ్బంది పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశించింది. ఆ సమయంలో మండలకేంద్రాల్లో ఎలాంటి సమావేశాలు, క్షేత్రస్థాయి పనులు సిబ్బందికి ఆపాదించవద్దని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఏదైనా మండల కేంద్రంలో సమావేశం పెడితే ఒక పూటంతా రూరల్ జిల్లాలో గ్రామసచివాలయ సిబ్బందికి, నగర ప్రాంతంలో వార్డు సచివాలయ సిబ్బంది సమయం వ్రుధా అయ్యేది. అంతేకాకుండా మండల కేంద్రం నుంచి సచివాలయానికి వచ్చే సమయంలో ప్రయాణానికే చాలా ఎక్కువగా వ్రుధా అవుతోంది. దీనిని ద్రుష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రతీరోజూ సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఆటంకం లేకుండా అన్నిశాఖల సిబ్బంది సచివాలయాల్లోనే ఉండాలని.. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయశాఖ సంచాలకులు GVWW & VSWS GWSUICOOR /158/2021/GW5/14885/ dt.19.08.2021 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ ఉత్తర్వులు అనుసరించి ముఖ్యమైన సమావేశాలుంటే మధ్యాహ్నం లోపుగానే నిర్వహించాల్సి వుంటుంది. ఈ ఆదేశాలను అటు వార్డు సచివాలయాలు, ఇటు గ్రామసచివాలయాలకే కాకుండా సచివాలయంలో పనిచేసే సిబ్బందికి చెందిన అన్ని శాఖల సిబ్బందికీ, మండల అధికారులకు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇప్పటి వరకూ కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శిలు బయోమెట్రిక్ వేసి మండల అధికారులు ఆదేశించే కార్యక్రమాలకు వెళ్లిపోతూ ఉండేవారు. ఇకపై ఆ ఆటలు చెల్లకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా మధ్యాహ్నం3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించాల్సి వుంటుంది. 33 నెలలు సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకొని..సర్వీస్ రెగ్యులైజేషన్ కి దగ్గరవుతున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిందనే సంకేతాలు ప్రస్తుతం జారీ చేసిన ఆదేశాలతో అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామసచివాలయంలో అన్ని శాఖల సిబ్బంది ప్రజలుకు అందుబాటులోకి రావడంతోపాటు, ఆయ సమస్యల పరిష్కారానికి కూడా మార్గం సుగమం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూడాలి ఈ ప్రత్యేక ఉత్తర్వులు ఏ స్థాయిలో ఫలితాలనిస్తాయనేది.

Tadepalli

2022-06-24 08:08:25

న్యూస్ ఏజెన్సీ వార్తకి మీడియా సంస్థలు డేట్ లైన్ ఎందుకివ్వాలి..

ప్రపంచవ్యాప్తంగా మీడియా(ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్)కి ఎంత ప్రాధన్యత ఉన్నదో.. న్యూస్ ఏజెన్సీకి కూడా అంతకంటే రెండాకుల అధిక ప్రాధాన్యత ఉన్నది. ఒక్కో సందర్భంలో మీడియాకంటే న్యూస్ ఏజెన్సీ వార్త, ఆ వార్త సంస్థ డేట్ లైన్ తో వచ్చే ఫోటో, వీడియో, యానిమేషన్లకు మాత్రమే ప్రామాణికం వుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పటి మీడియాకి న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి..న్యూస్ ఏజెన్సీ అంటే ప్రింట్ మీడియానా..ఎలక్ట్రానిక్ మీడియానా..అసలు ఇలాంటిది అంటూ ఒకటి ఉందా, ఉంటుందా..వాళ్లేం చేస్తారు.. అని అడిగే ఈ తరం జర్నలిస్టు మహానుభావులు, అంతకు మించిన మీడియా సంస్థలు కూడా లేకపోలేదు. ప్రతీ మీడియా సంస్థకు ఒక న్యూస్ ఏజెన్సీ ఉండి తీరాలి అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ఆంక్ష. అయితే ఇటు మీడియాకి, అటు న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగా సిబ్బందిని వినియోగించాలనే ఆర్ధిక ఇబ్బందులతో మీడియా సంస్థలు సొంత న్యూస్ ఏజెన్సీల నిర్వహణ మానేసాయి. కొన్ని సంస్థలు వార్త సంస్థలకు చందాదారులుగా చేరి వారిచ్చిన వార్తలను మీడియాలో ప్రచురించుకుంటున్నాయి. ఆ విషయం పెద్ద పత్రికలు, ముఖ్యంగా ఇంగ్లీషు పత్రికలు, టీవీ ఛానళ్లకు మాత్రమే తెలుసు. కొన్ని చిన్న, మధ్య తరహా పత్రికలు, లోకల్ కేబుల్ టీవీలకు అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా తెలియదు. అలాగని న్యూస్ ఏజెన్సీ వార్తలు ఎందుకు వినియోగించాలో అసలే తెలియదు. కొందురు తెలిసినట్టు నటిస్తారు గానీ.. వారికీ అసలు విషయం తెలియదని వారికే తెలిసిన విషయం. ఇక తెలిసిన వారు వారి వారి మీడియా సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు న్యూస్ ఏజెన్సీ వార్త, ఫోటో, వీడియోలను, యానిమేషన్లను వినియోగిస్తూ(వారి మీడియా జర్నలిస్టులు కాకుండా గుర్తింపు పొందిన ప్రత్యేక వార్త సంస్థకు చెందిన జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, యానిమేటర్లు కవర్ చేసి ఇచ్చినవి) చందా దారులుగా వినియోగించుకుంటూ.. న్యూస్ ఏజెన్సీల డేట్ లైన్ వేస్తూ.. సదరు మీడియా సంస్థల గౌరవాన్ని నిలబెట్టుకుంటూ హుందాగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అయితే అక్కడి సమాచారశాఖ న్యూస్ ఆడిట్ చేస్తుంది(న్యూస్ ఆడిట్ అంటే ఒకే వార్త ఒకేసారి వివి పత్రికలు, టీవీ ఛానళ్లలో న్యూస్ ఏజెన్సీకి చెందిన స్క్రిప్ట్, విజువల్స్, లోగో, యానిమేషన్ తో వస్తే.. అది న్యూస్ ఏజెన్సీదనీ, లేదంటే అది సదరు పత్రిక సేకరించదని గుర్తిస్తారు. వాటిని ఆడిట్ చేసి ఆ రిపోర్టును మీడియా సంస్థలకు న్యూస్ ఏజెన్సీ స్క్రిప్టుతో సహా పంపుతారు) దౌర్భాగ్యం ఏంటంటే ఆ పరిస్థితి భారతదేశంలో లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అదేంటో కూడా తెలియదు. అందుకనే న్యూస్ ఏజెన్సీ యొక్క ప్రాముఖ్యతగానీ, అవసరం గానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారశాఖ నిబంధనలు కానీ మన దేశ మీడియా సంస్థలు పాటించవు. నిజంగా భారతదేశంలోనూ, రాష్ట్రాల్లోని సమాచారశాఖ న్యూస్ ఆడిట్ చేపడితే మాత్రం న్యూస్ ఏజెన్సీల యొక్క ప్రాధాన్యత పెరిగి మళ్లీ పూర్తిస్థాయిలో పెరుగుతుంది. న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో సోషల్ మీడియా పుణ్యమాని ప్రతీ సామాన్యుడికీ తెలుస్తుంది. కానీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలకు, రాజకీయపార్టీలకు చెందిన నేతలకే ప్రధాన మీడియా సంస్థలు ఉండటంతో ఆ న్యూస్ ఆడిట్ అనేది జరగక న్యూస్ ఏజెన్సీల ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. అసలు న్యూస్ ఏజెన్సీ యొక్క వార్త, ఫోటో, వీడియోను, యానిమేషన్లను మీడియా సంస్థలు ఎందుకు వాడాలనే మాటకొస్తే..సదరు మీడియా సంస్థలకు న్యూస్ వచ్చే ప్రదేశంలో సొంత జర్నలిస్టు లేని సమయంలో అక్కడ కవర్ చేసిన వార్తను ఏ న్యూస్ ఏజెన్సీ కవర్ చేసి మీడియా సంస్థలకు పంపితే.. ఆ ప్రామాణిక వార్తను మీడియా సంస్థలు ఆ యొక్క న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ తో ప్రచురించాలి..టీవీల్లో అయితే వాటర్ మార్క్ తో వేయాలి, లేదంటే న్యూస్ ఏజెన్సీ లోగోతో వేయాలి, డిజిటల్ మీడియా అయినా వాటర్ మార్క్ తోనే న్యూస్ వేయాలి. కానీ ప్రస్తుత మీడియా సంస్థలు సోషల్ మీడియాను మాత్రమే వేదిక చేసుకొని.. న్యూస్ ఏజెన్సీల కవర్ చేసి పంపిన వార్తలనైనా వారి సొంతవార్తలా వారి వారి డేట్ లైన్ తోనే వేసుకుంటున్నాయి. ప్రచురించేస్తున్నాయి. వాస్తవానికి న్యూస్ ఆడిట్ జరిగిన సమయంలో న్యూస్ ఏజెన్సీ కవర్ చేసిన వార్తను అదే వార్తగా ఏదైనా మీడియా సంస్థ కవర్ చేసినా, సదరు న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ వేయకపోయినా ఆ విషయాన్ని గుర్తించి వారికి నోటీసులు పంపాలి. అంతేకాకుండా సదరు వార్త సంస్థలు కాపీరైట్ దావా వేస్తే వారికి నష్ట పరిహారం కూడా కట్టాలి. ఆ ఇబ్బందులు రాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సమాచారశాఖలు మీడియా సంస్థలకు వార్త కవర్ చేసే ప్రాంతంలో జర్నలిస్టులు లేకపోతే.. అక్కడి నుంచి కవర్ చేసిన ఏ వార్తకైనా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ వేయాలని, లేదా సదరు జర్నలిస్టు రాయని వార్తకు జర్నలిస్టు డేట్ లైన్ వేయకుండా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ మాత్రమే వేయాలనే నిబంధన అమలు చేసింది. దానిని ఆర్ఎన్ఐ నిబంధనల్లోనూ పొందు పరిచింది. కానీ అవేవీ భారతదేశంలోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు  జరగకపోవడంతో, అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా మీడియా సంస్థలకు తెలీకుండా పోయింది సరికదా..సదరు మీడియా సంస్థలు న్యూస్ ఏజెన్సీల వార్తలను, ఫోటోలను, వీడియోలను వార్త సంస్థ డేట్ లేన్ గానీ, లోగోగానీ, వాటర్ మార్క్ గానీ లేకుండానే వినియోగించేస్తున్నాయి. ఈ విషయం సమాచారశాఖ అధికారులకు తెలిసినా అది శూన్యమే అవుతుంది. దానికితోడు సోషల్ మీడియాపేరుతో మీడియా సంస్థలు కూడా తాము కవర్ చేసిన వార్త న్యూస్ ఏజెన్సీది కాదని, సోషల్ మీడియాదేనని చెప్పుకుంటూ న్యూస్ ఏజెన్సీల వార్తలను అప్పనంగా వాడేస్తున్నాయి. తమ వార్తగానే ప్రచురించేస్తున్నాయి. ఈరోజుకీ కొన్ని ప్రధాన ఇంగ్లీషు పత్రికలు, ఒకటి రెండు పెద్ద తెలుగు పత్రికలు, రెండు మూడు టీవీ ఛానళ్లు తప్పితే మిగిలిన ఏ మీడియా సంస్థలు  కూడా తమది కాని వార్తకు తమ మీడియా సంస్థ డేట్ లైన్ వినియోగించడం లేదు. ఖచ్చితంగా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ మాత్రమే వేస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు మాత్రం న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ ని పెట్టడం లేదు. సదరు వార్తను సేకరించినది న్యూస్ ఏజెన్సీయే అయినప్పటికీ ఆ వార్తను వారి యొక్క న్యూస్ స్టేటస్ కోసం వారి జర్నలిస్టులు కవర్ చేసినట్టుగానే అప్పనంగా వాడేసుకుంటున్నాయి.. ఆర్ఎన్ఐ నిబంధనలను మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. న్యూస్ ఆడిట్ అసలు జరగడంలేదు.. అంతెందుకు జర్నలిస్టులు లేని ప్రదేశాల నుంచి కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు ప్రచురితం అయినా ఆ విషయాన్ని సమాచారశాఖ మీడియా సంస్థలను ప్రశ్నించడంలేదు. కనీసం సంస్థలో పనిచేసే పనిచేసే జర్నలిస్టుల సమాచారం కూడా తీసుకోవడం లేదు. అలా తీసుకున్న రోజు.. ఒకే వార్త అన్ని పత్రికల్లో న్యూస్ ఏజెన్సీకి చెందిన న్యూస్ వెబ్ సైట్, న్యూస్ యాప్, న్యూస్ వైర్ లను పోలి ఒకే విధంగా వచ్చిన రోజు.. అది న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన వార్తమాత్రమేనని తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సమాచారశాఖలు మీడియా సంస్థలు వార్తల విషయంలోనూ, న్యూస్ ఏజెన్సీల వార్తలను, వాటికి చెందిన డేట్ లైన్ ను వినియోగించే విషయంలో నిర్ధిష్ట ఆదేశాలను అమలు చేసిన రోజు ఏది మీడియా సేకరించిన వార్తో..ఏది న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన వార్తో..ఏది సోషల్ మీడియా నుంచి తస్కరించి వార్తో ప్రభుత్వాలకు తెలుస్తుంది. అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏంటో అటు మీడియాకి, ప్రభుత్వాలకు, పాఠకులకు తెలుస్తుంది..!

Visakhapatnam

2022-06-23 13:40:55

సిఎంసీఐకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు.. డా.మహర్షి

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు డా.కె.మ‌హ‌ర్షి( జాన్ క్రిష్ట‌ఫ‌ర్ కొమ్మ‌ల‌పూడి) స్థాపించిన‌ క్రిష్టియ‌న్ మ్యూజిక్ కాలేజీ కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ల‌భించింది.  2020 ఏప్రిల్ 14 నుంచి 800 రోజుల పాటు నిర్విరామంగా విద్యార్ధుల నుంచి పెద్ద‌వారి వ‌ర‌కూ ఉచితంగా జూమ్ ద్వారా ఆన్ లైన్ లో క్రైస్థ‌వ శాస్త్రీయ సంగీత త‌ర‌గ‌తులు నిర్వ‌హించినందుకు గాను ఈ ఖ్యాతి గ‌డించింది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం విశాఖ‌లో డా.కె.మ‌హ‌ర్షి  మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్రంగా ఇచ్చిన ఆన్ లైన్ శిక్ష‌ణ‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. క‌రోనా లాక్ డౌన్ నుంచి రోజుకు రెండు బ్యాచ్ ల చొప్పున ఈ ఉచిత ఆన్ లైన్ త‌ర‌గ‌తుల ద్వారా అమెరికా, యుకె, దుబాయ్‌, కెన‌డా, ఆస్ట్రేలియా దేశాల‌కు చెందిన ఎంద‌రో తెలుగువారు ఈ శిక్ష‌ణ పొందార‌ని చెప్పారు. ఆంధ్ర క్రైస్త‌వ కీర్త‌న‌లు, గ్రంధంలోని కీర్త‌న‌లు, స్వ‌రాల‌ను తాను శిక్ష‌ణ ఇచ్చాన‌ని వివ‌రించారు. అంతేకాకుండా తాను స్వ‌యంగా ర‌చించిన‌ క్రైస్త‌వ శాస్త్రీయ సంగీత విద్యాద‌ర్ప‌ణం పుస్త‌కంలోని అంశాల‌ను కూడా విద్యార్ధుల‌కు వివ‌రించిన‌ట్టు చెప్పారు. తాను అందించిన ఆన్ లైన్ శిక్ష‌ణ‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఇవ్వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. ఇదే స్పూర్తితో గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ల‌ర్డ్ రికార్డ్స్ లో గుర్తింపు వ‌చ్చేలా త‌మ ఆన్ లైన్ శిక్ష‌ణ కొన‌సాగించ‌డంతోపాటు శాస్త్రీయ సంగీతానికి పూర్వ‌వైభ‌వం తీసుకురావ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా క్రుషిచేస్తున్న‌ట్టు డా.కె.మ‌హ‌ర్షి( జాన్ క్రిష్ట‌ఫ‌ర్ కొమ్మ‌ల‌పూడి) మీడియాకి వివ‌రించారు.

Visakhapatnam

2022-06-20 09:43:35

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం మ‌ధ్యాహ్నం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మ‌హ‌ద్వారం వద్ద ఆలయ అర్చకులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి ఆల‌యంలోకి ఆహ్వానించారు.  స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలను గ‌వ‌ర్న‌ర్‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు  ర‌మేష్ బాబు,  హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2022-06-08 10:34:51

రూటు మార్చిన బెంగాల్ టైగర్..

ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత 19 రోజులుగా చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతున్న రాయల్ బెంగాల్ టైగర్ ఇపుడు ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు దిశగా రూటుమార్చినట్టుగా పులి నడిచిన ముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు ద్రువీకరిస్తున్నారు. పెద్దిపాలెం గ్రామ పరిసరాల్లో పొట్టి మెట్ట మీద పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా మంగళవారం సాయంత్రానికి పులిసంచరించిన ప్రదేశాలను పులి అడుగులు వేసిన ముద్రల ఆధారంగా దాని జాడ ఏలేరు రిజర్వాయర్ ప్రాంతానికి దారితీసినట్టుగా చెబుతున్నారు. అయితే గత రెండు వారాలకు పైనే అడవిలో సంచరించిన పులి ఇపుడు దాహార్తిని తీర్చుకోవడానికే ఏలేరు రిజర్వాయర్ ప్రాంతానికి దారిమళ్లి వుంటుంద అటవీ అధికారులు భావిస్తున్నారు.  పొదురపాక, పాండవుల పాలెం మధ్య ఉన్న పొట్టి మెట్ట ప్రాంతాలతోపాటు, గతంలో పులి సంచిచన ప్రదేశాలను కూడా అటవీశాఖకు చెందిన 120 మంది సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పులి అడుగులు అక్కడి రెండు మూడు ప్రాంతాల్లో కూడా కనిపించడంతో పులి తన రూటు ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాంతాల వరకూ దారితీసినట్టుగా భావిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో పులి జాడను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు అటవీశాఖ అధికారులు. లింగంపర్తి ఏరియాను దాటి శివారు ప్రాంతాల్లో సంచరించే అవకాశాలు ఆ దారిగుండా కనిపిస్తున్నాయని మాత్రం చెప్పుకొస్తున్నారు. బెంగాల్ టైర్ రోజుకో రూటులో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రాంతంలో దర్శనమిస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్తిపాడు నియోజవకర్గ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.
 

ఏలేశ్వరం

2022-06-07 16:41:52

జూన్ 12నుంచి14 వరకు జ్యేష్టాభిషేకం

తిరుమల‌లో జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు అభిద్యేయక జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిద్యేయక అభిషేకం’అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-06-07 12:45:58

14400తో ఇక అవినీతి పరుల ఆటకట్టు

ఏసీబి14400 యాప్ తో ఇక అవినీతి పరుల ఆటకట్టించవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సులో ఏసీబీ అనే యాప్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అన్నిచోట్లా అవినీతిని రూపుమాపేందుకే ఈ యాప్ ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకొని అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-06-01 15:39:33

ఆ పరీక్షలో మహిళా పోలీసులంతా పాస్

రాష్ట్రవ్యాప్తంగా 14849 మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో 366 మంది అభ్యర్ధినిలు మినహా 14483 మంది పాస్ అయినట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయం తెలియజేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మహిళా పోలీసులు ఈ పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులను 33నెలల తరువాత సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్న తరుణంలో కోర్టుకేసుల కారణంగా ఈ ప్రక్రియ ఒక్క మహిళా పోలీసుల విషయంలోనే నిలిచిపోయింది. ఈ తరుణంలోనే హోంశాఖ మహిళా పోలీసులు అప్పుడెప్పుడో రాసిన పరీక్షల ఫలితాలను ఇపుడు విడుదల చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Tadepalli

2022-06-01 14:42:31

ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాపోటీలు

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా, ఆయుష్ విభాగము రాష్ట్ర వ్యాప్తంగా యోగాసనాల పోటీలను నిర్వహిస్తుందని కమిషనర్ వి.రాములు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 21 జూన్ న జరిగే ఈ పోటీలకు  8 సంవత్సరాల పై బడి ఏ వయస్సు వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చుని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 1) పూర్ణ నటరాజాసన 2) దండియమన జాను సిరాసన 3) వటయానాసన 4) త్రివిక్రమాసన 5) విభక్త పశ్చిమోత్తానాసన 6) గర్భాసన 7) పద్మబకాసన 8) ఏకపాద విపరీత దండాసన 9) తీతిభాసన 10) వృశ్చికాసన 11) మయూరాసన 12) హనుమానాసన 13) పూర్ణ ఉష్ట్రాసన 14) పూర్ణ ఉష్టాసన పాదాంగుష్ట ధనురాసన 15) పూర్ణచక్రాసన 16) గండబేరుండాసనాలు వేయాలన్నారు.  పేర్కొన్న  16 ఆసనాలలో ఏవైన 8 ఆసనాలను వేయగలిగినవారు ఆయా ఆసనాలను వేసి ఆసన స్థితిలో వున్న ఫోటోల ను advyoga2022@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపాల్సి వుంటుందన్ని పేర్కొన్నారు.  ఫోటోతో పాటు తమ పేరు, వయస్సు, ఆధార్ నెంబర్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ లను పంపవలసి వుంటుందని, ఫోటోలు పంపుటకు చివరి తేది. 06గా నిర్ణయించినట్టు తెలియజేశారు. ఆరోజు సాయంత్రం 05గంటలలోపుగా వాటిని పంపాలని తెలియజేశారు. ఈ ఫోటోలను ప్రాధమికంగా పరిశీలించిన అనంతరం ఎంపిక ఐన వారు 10 జూన్ 2022 న న్యాయ నిర్ణేతల సమక్షంలో ఇవే ఆసనాలను ఆన్ లైన్ లో ప్రదర్శించవలసి వుంటుందని, ఇందులో ఎంపిక కాబడిన వారికి 21 జూన్ 2022న విజయవాడలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వటంతో, పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిధుల ద్వారా బహుమతులు అందజేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు 9441014521లో  సంప్రదించాలన్నారు.

Tadepalli

2022-06-01 02:20:05