1 ENS Live Breaking News

డా..వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ

కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. అంటూ ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఒక్క ఫోన్‌ కాల్‌తో నిమిషాల్లో ఆపద్భాంవుడిలా వచ్చి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ తరహాలోనే... ఇప్పుడు పశువులకు కూడా సేవలందించడానికి, పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డాక్టర్ వైఎఎస్సార్ సంచార పశు వైద్యశాల’(మొబైల్‌ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్‌) వాహనాలు మే 19 నుంచి సేవలందించబోతున్నాయి. "డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ" పథకం ద్వారా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 సంచార పశు వైద్యశాల వాహనాలు కొనుగోలుతో పాటు వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 175 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభ నున్నారు. "డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ” పథకం ద్వారా ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.142.90 కోట్ల వ్యయంతో 175 వాహనాలు, రెండవ దశలో రూ.134.74 కోట్ల వ్యయంతో మిగిలిన 165 వాహనాలు కొనుగోలుతో పాటు నిర్వహణ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో సైతం పాడి పశువులతో పాటు, పెంపుడు జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన పశువైద్యసేవలు అందించేందుకు వీలుగా ఈ వాహనాల నిర్వహణకు కూడా మన ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ.. ఒక్కొక్క వాహన నిర్వహణకు నెలకు రూ.1.90 లక్షల చొప్పున మొత్తం రెండేళ్లకుగాను దాదాపు రూ. 155 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. సంచార పశువైద్య శాలల ద్వారా పశు ఆరోగ్య సేవలతో పాటు అనారోగ్య పశువు ఉన్న చోటనే సత్వరమే పశువ్యాధి నిర్ధారణ చేసి, ఖచ్చితమైన నాణ్యమైన పశువైద్యం అందించడంతో పాటు, ఆయాప్రాంతాలలో పశువ్యాధులు వాప్తి, నిర్మూలన వంటి అంశాలను అంచనా వేయడంతో పాటు కృత్రిమ గర్భోత్పత్తి సేవలు అందించడం జరుగుతుంది. ఈ వాహనంలో ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కం అటెండర్ మొత్తం ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ వాహనంలో 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త సంబంధిత పరీక్షలు నిర్వహించేందుకు గాను మైక్రోస్కోప్ సౌకర్యము ఉన్న చిన్న ప్రయోగశాల, అవసరమైన మందులు, కృత్రిమ గర్భధారణ సేవలు, పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ఉండేలా తీర్చిదిద్దారు.

 రాష్ట్రాన్ని పశుగణ రంగంలో దేశములోనే ప్రధమ స్థానంలో ఉంచాలని, పశుపోషణను మరింత లాభసాటిగా మార్చాలని పశుపోషకులకు మరింత చేరువగా అత్యుత్తమ పశువైద్య సేవలు అందించాలని టోల్ ఫ్రీ నెంబర్ 1962తో పశువైద్య టెలి మెడిసిన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మనిషి ఆపదలో ఉన్నాడని ఫోన్ చేయగానే కుయ్.. కుయ్.. మని అంటూ 108 మరియు 104 అంబులెన్స్ ఎలా వాలిపోతాయో అలాగే పశువు అనారోగ్యానికి గురైనప్పుడు కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేయగానే మారుమూల ప్రాంతాలలోని పశుపోషకులు గుమ్మం వద్దకే నేరుగా సంచార పశువైద్య శాల వాహనం సిబ్బందితో వచ్చి వైద్యం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘డా. వైఎస్సార్ పశు ఆరోగ్య సేవ’ పథకం అమలు ద్వారా మన రాష్ట్రములోని మారుమూల ప్రాంతాలలో ఉన్న పశుపోషకులకు సైతం రైతు గుమ్మం వద్దనే సత్వర, ఖచ్చితమైన, నాణ్యమైన పశువైద్యం అంది మూగజీవాలలో మరణాల శాతం తగ్గుతుంది. తద్వారా పశువుల యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడి పశుసంవర్థక శాఖ అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల ద్వారా పశుపోషణ అవసరాలను అధిగమించి పశువులలో ఉత్పాదక శక్తి మరియు ఉత్పత్తి పెరుగుతుంది. పశూత్పత్తులైన పాలు, గ్రుడ్లు, మాంస ఉత్పత్తులు పెరిగి పశుపోషకుల సగటు ఆదాయం పెరిగి వారి జీవన స్థాయి మెరుగు పడటమే కాకుండా జాతీయ స్థూల సంపద పెరుగుదలకు కూడా తోడ్పడే విధంగా.. మనుషుల ఆరోగ్యానికే కాక పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.  

Tadepalli

2022-05-17 16:00:27

విద్యుత్ రంగ అక్రమాలపై ఇక ఉక్కుపాదం

విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఇంధనశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజిలెన్స్ విభాగం పటిష్టంగా ఉంటేనే విద్యుత్ చోరీలు, దుర్వినియోగం, విద్యుత్ నష్టాలను నియంత్రించ గలుగుతామని తెలిపారు. సీఎం  వైయస్ జగన్ విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు, ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒకవైపు రైతులకు ఉచిత విద్యుత్ ను అందించడం, మరోవైపు వినియోగదారులకు మెరుగైన విద్యుత్ ను సరఫరా చేరేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలను పూర్తిస్థాయిలో తగ్గించుకునేందుకు అధికారులు దృష్టి సారించాలని కోరారు. అదే క్రమంలో అక్రమ విద్యుత్ వినియోగం, చౌర్యం, అనుమతి లేకుండా అధిక లోడ్ లను వినియోగించుకోవడం, మీటర్ల ట్యాంపరింగ్ తదితర అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని కోరారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపై కూడా అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు. తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సూచించారు.

సీఎం వైయస్ జగన్  అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అన్నారు. 2019-20లో విద్యుత్ సరఫరా, పంపిణీలో 13.02 శాతం నష్టాలు ఉంటే, 2020-21 నాటికి వాటిని 9.83 శాతంకు తగ్గించేందుకు ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలే కారణమని అన్నారు. ఈ నష్టాలను మరింతగా తగ్గించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఐఆర్డిఎ మీటర్లను బిగించడం, ఓవర్ లోడ్ సెక్షన్ లలో అదనంగా ఫీడర్లను ఏర్పాటు చేయడం, అదనపు లోడ్ డిమాండ్ ఉన్న చోట్ల కొత్త డిటిఆర్ లను ఏర్పాటు చేయడం, విద్యుత్ చౌర్యంపై అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు ఇన్నోవేటీవ్ గా ఆలోచించాలని, మొక్కుబడిగా పనిచేస్తే కుదరదని స్పష్టం చేశారు. విద్యుత్ అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులతో పాటు జిల్లాల్లోని పోలీస్ యంత్రాంగం సహకారం కూడా తీసుకోవాలని, అందుకోసం అవసరమైతే జిల్లా ఎస్పీలతో సంయుక్త సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

విద్యుత్ మీటర్లపై తెలుగుదేశం పార్టీ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఏటా ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం సబ్సిడీగా పదివేల కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అన్నారు. సీఎం  వైయస్ జగన్ వ్యవసాయానికి అందించే విద్యుత్ నాణ్యతతో ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉండాలని అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఇదే క్రమంలో మీటర్లను బిగించడం ద్వారా వాస్తవానికి వ్యవసాయానికి ఎంత విద్యుత్ వాడుతున్నామో నికరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 28 వేల వ్యవసాయ కనెక్షన్ లకు ప్రయోగాత్మకంగా విద్యుత్ మీటర్లు బిగించడం ద్వారా 33 శాతం తక్కువగానే విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తేలిందన్నారు. రాష్ట్రం మొత్తం కూడా వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించడం వల్ల ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కు ఇస్తున్న సబ్సిడీ పదివేల కోట్ల రూపాయలలో 33 శాతం అంటే దాదాపు 3500 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని అన్నారు. ఈ సొమ్మును ప్రజలకే సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేయవచ్చని అన్నారు. వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లను ఏర్పాటు చేసి, రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఆ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుందని అన్నారు. రైతులే డిస్కం లకు చెల్లింపులు చేస్తారని, దీనివల్ల రైతుల్లోనూ జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. ఇందులో రైతులకు జరుగుతున్న నష్టం ఏమిటో ప్రతిపక్షం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసే ప్రతిపనిని వ్యతిరేకించడం, మంచిని అడ్డుకోవడమే చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో డిపిఇ వింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,31,140 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేసినట్లు అధికారులు వివరించారు. దీనిలో 59.583 కేసుల్లో అక్రమాలు వెలుగుచూశాయని అన్నారు. ఈ కేసుల్లో 15,139 విద్యుత్ చౌర్యం కింద నమోదయ్యాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన కేసులకు సంబంధించి రూ.131.90 కోట్ల రూఆపయలను జరిమానగా విధించడం జరిగిందని, దీనిలో 65.49 కోట్ల రూపాయలను వసూలు చేశామని తెలిపారు. ఒక్క విద్యుత్ చౌర్యం కేసుల ద్వారానే రూ.10.66 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. గత ఏడాది మొత్తం 189 ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు 137 కేసులు నమోదు చేశారని, మరో 52 కేసులకు సంబంధించి కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, డైరెక్టర్ (హెచ్ఆర్ & ఐఆర్) సయ్యద్ రఫీ, సివిఎస్ వి టి. పనసరెడ్డి, అడిషనల్ ఎస్పీ లావణ్య లక్ష్మి, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-17 15:44:40

అన్నవరం సత్యదేవుని పుష్ఫయాగం..లైవ్

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణం తరువాత అత్యంత వైభవంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని తెలుగురాష్ట్రాలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా వున్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live మరియు  www.enslive.net ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ప్రత్యేకంగా అందిస్తోంది. స్వామివారి పుష్పయాగ వైభవాన్ని భక్తులందరూ తమ అరచేతిలోనే మొబైల్ ఫోన్ ద్వారా తిలకించవచ్చు. సత్యదేవుని సేవలో తరించే ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందించే మరిన్ని అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటే తక్షణమే గుగూల్ ప్లేస్టోర్ నుంచి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ను ఇనిస్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నాం.

Annavaram

2022-05-17 07:28:07

విశాఖ పొలిటికల్(పరిపాలన)రాజధాని..!

విశాఖపట్నం పరిపాలనా రాజధానా..? పొలిటికల్ రాజధానా..? అంటే పొలిటికల్ రాజధాని అనే సమాధానం వస్తోంది ప్రతీనోటా..అవును నూతన జిల్లాల విభజన తరువాత  ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద జిల్లాల సరసన ఉండే విశాఖ ఇపుడు అతి చిన్న జిల్లాగా మారిపోయింది. కేవలం ఐదు నియోజకవర్గాల పరిధి మాత్రమే. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే రూరల్ జిల్లా లేని జిల్లాగా మారిపోయిన జిల్లా. రాష్ట్రానికి ఆర్ధిక రాజధానిగా వున్న విశాఖను అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా(ఎగ్జిక్యూటివ్ కేపిటల్) రాజధానిగా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అదే నిర్ణయాన్ని కోర్టులో ఉపసంహరించుకుంది. దీనితో పరిపాలనా రాజధాని ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఎలాగూ పరిపాలనా రాజధాని కాలేదు కాబట్టి విశాఖపట్నం జిల్లా పొలిటికల్ రాజధానిగా మారిపోయింది. అవునండీ ఈ విషయాలను బేరీజు వేసుకుంటే మీరు కూడా విశాఖపట్నం పొలిటికల్ రాజధానిగా మాత్రమే లెక్కగడతారు. రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడినా జిల్లా పరిషత్ లు మారలేదు.  కొత్తజిల్లాల్లో కార్పోరేషన్ స్థాయి జిల్లాలు ఉన్నా కొత్తగా కార్పోరేషన్ లు ఏర్పడలేదు. ఏమీ లేకున్నా అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు, తూర్పునావికాదళం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండటంతో విశాఖపట్నం కాస్త పొలిటికల్ రాజధాని అయిపోయింది. విశాఖపట్నం జిల్లా మీదుగానే అన్ని జిల్లాలకు ప్రయాణించే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర అధికారులు ప్రయాణించడానికి, ట్రాన్సిట్ హాల్టులు చేయడానికి.. అలా చేసిన సమయంలో రాజకీయం చేయడానికి మంచి వేదికగా మారిపోయింది. ఒకప్పుడు విశాఖలో పనిచేయడానికి అటెండర్లు దగ్గర నుంచి ఐఏఎస్ లు వరకూ క్యూ కట్టేవారు. నూతన జిల్లాలు ఏర్పడిన తరువాత రాష్ట్రంలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చిన్నజిల్లాగా మారిపోవడం, ఆపై అనునిత్యం రాజకీయనాయకులు, రాష్ట్రస్థాయి అధికారులు, త్రివిధ దళాల అధికారుల రాకపోకలు వారికిచ్చే ప్రోటోకాల్ కే సమయం మొత్తం అధికారులకు ప్రజాప్రతినిధులకు గడిచిపోతుంది. విశాఖలోని అన్నిశాఖల అధికారులు మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో పొలిటికల్ ప్రోటోకాల్ కూడా అధికంగా మారిపోయింది. దీనితో ఒకప్పుడు పరిపాలనా రాజధాని అవుతుందనుకున్న విశాఖపట్నం నేడు పొలిటికల్ రాజధానిగా రూపాంతరం చెందుతోంది.

రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నం జిల్లాను పరిపాలనా రాజధాని చేయాలనుకున్నా..వారి ప్రమేయం లేకుండానే పొలిటికల్ రాజధానిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను అయితే విభజన చేసింది తప్పితే రాజకీయాన్ని విభజన చేయలేకపోయింది. కాదు కాదు రాజకీయనాయకులు తీరుమార్చులేకపోతున్నారు. అధికారికంగా జిల్లాలు విభజన జరిగినా.. ఇంకా విశాఖలోనే అన్ని పార్టీలకు చెందిన పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. వాస్తవానికి పక్కజిల్లా నాయకులైనా.. ఇదే విశాఖ వేదికగా కార్యక్రమాలు చేపట్టడం ఇటు పార్టీ కేడర్ కు, ప్రజలకు ఇబ్బందిగానే ఉంటోంది. ఇక మీడియా విషయానికొస్తే విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలన్నీ సాగిస్తున్నాయి. దీనితో రాజకీయపార్టీల నేతలందరూ ఏ విషయం చెప్పాలన్నా విశాఖ రావాల్సి వస్తుంది. ఇక్కడే ప్రెస్ మీట్ లు పెట్టాల్సి వస్తుంది. ఇలా విశాఖపట్నం పరిపాలనా రాజధాని నుంచి పొలిటికల్ రాజధానిగా మారిపోయి అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేసింది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా తాముచేసిన అభివ్రుద్ది ప్రజలకు చెప్పి, మళ్లీ అధికారం కోసం, ప్రత్యర్ధులను తలదన్నే విధంగా కార్యకలాపాలు చేపడుతుంది. ఈ తరుణంలో మూడు రాజధానుల విషయం అటకెక్కిపోయింది. ఆ ఊసు ఇపుడు ఏ రాజకీయపార్టీ కూడా ఎత్తడం లేదు. అందరూ 2024 ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. దీనితో విశాఖను అధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయపార్టీలు పొలిటికల్ పరిపాలన రాజధానిగానే వినియోగించుకుంటూ తమ కార్యకలాపాలు చేపడుతున్నారు. చూడాలి ఈ ప్రభుత్వంలోనే విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందా..లేదంటే వచ్చే ఎన్నికలకు విశాఖను పరిపాలనా రాజధానికగా ఆశచూపి రాజకీయం చేస్తారా అనేది..!?

Visakhapatnam

2022-05-17 05:11:54

Visakhapatnam

2022-05-16 10:48:33

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమ‌వారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.  ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వ‌ర‌కు అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు.  రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాధం, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, అర్చకులు  బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  దామోదరం పాల్గొన్నారు.

Tirumala

2022-05-16 06:33:47

Tadepalli

2022-05-16 06:18:39

అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌సేవ కొనసాగింపు

తిరుమలలో వేసవి భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌక‌ర్యార్థం జూన్ 30వ తేదీ వ‌ర‌కు అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది.  అయితే, ప్రతి మంగళవారం నిర్వహించే అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవాటికెట్లను జూన్ వరకు ఆన్లైన్ లో విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు.  ఆన్లైన్ లో  సేవాటికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవకు అనుమతించాలని టిటిడి  నిర్ణయించింది. అదేవిధంగా, అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని కోరింది. లేనిపక్షంలో సేవాటికెట్ రీఫండ్ పొందాలని టిటిడి భక్తులను కోరుతోంది. ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేకోవాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో సూచించింది.

Tirumala

2022-05-16 05:53:20

అన్నవరం సత్యదేవుని కళ్యాణం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది  వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా , స్మార్తాగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు. శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారిని  " మూలతో బ్రహ్మరూపాయ ..మధ్యతశ్చ మహేశ్వరం..  అధతో విష్ణురూపాయ..  త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.  క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామానారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరిమీద వెలుస్తున్నాను.. శాస్త్ర ప్రకారం ప్రతిష్టించి పూజించమని చెప్పాడు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి వెతికి , ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీనుండి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891 , ఆగస్టు 6వ తారీకున ప్రతిష్టించి , ఆ యంత్రంపై స్వామిని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా ప్రతిష్టించారు. హరి హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యన్నారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడుకూడా పూజలందుకుంటుంటాడు.

Annavaram

2022-05-11 16:10:29

పిఆర్సీ అమలుపై ప్రభుత్వ జిఓలు జారీ

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి అమలుకు సంబంధించిన వివిధ జిఓలను ప్రభుత్వం జారీ చేసింది.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పిఆర్సి అమలుకు సంబంధించిన సమావేశం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,జిఏడి కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్ ల సమక్షంలో జరిగింది.ఈసందర్భంగా పిఆర్సి అమలుకు సంబంధించిన 8 ప్రభుత్వ ఉత్తర్వులను(జిఓ)జారీ చేసి ఆజిఓల ప్రతులను సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఆర్ధికశాఖ అధికారులు అందచేశారు. ఈసమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పిఆర్సి అమలుకు సంబంధించి బుధవారం 8జిఓలను జారీ చేయడం జరిగిందని మరో రెండు జిఓలను కూడా బుధవారం రాత్రికి లేదా గురువారం విడుదల చేయడం జరుగుతుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చెప్పారు.మరికొన్ని జిఓలు త్వరలో విడుదల అవుతాయని అన్నారు.
ఈసమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి పెండింగ్ అంశాల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.అదే విధంగా వివిధ పెండింగ్ బిల్లులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పిఆర్సితో పాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని సకాంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి,ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ,ఇంకా ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-11 16:03:33

వైఎస్సార్ మత్స్యకార భరోసా 13కి వాయిదా..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసని తుఫాన్ ప్రభవావం ఉన్నందున ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో  మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13 (శుక్రవారానికి) కు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లకు వర్తమానం పంపించారు. ఈ విషయాన్ని మత్స్యకారులకు తెలియాలని జిల్లా కలెక్టర్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు, సచివాలయాల పరిధిలోని మత్స్యశాఖ సహాయకుల ద్వారా తెలియజేయాలని సూచించారు.  

Tadepalli

2022-05-10 11:30:37

భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయానికి రండి

తిరుమల తిరుపతి దేవస్థానం భువనేశ్వర్ లో నిర్మించిన  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌  వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.  మే  21 వ తేదీ నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. టీటీడీ డిప్యూటీ ఈవో  గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి పాల్గొన్నారు.

Tadepalli

2022-05-10 08:18:36

12న అన్నవరం సత్యదేవుని కళ్యాణం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి కళ్యాణం ఈనెల 12వ తేదిన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు ఆయన దేవస్థానంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈనెల 11 నుంచే ప్రారంభం అవుతాయని చెప్పారు. అదేరోజున స్వామివారు, అమ్మవార్లను పెళ్లికొడుకు, పెళ్లికూతుర్లను చేస్తారని, 12వ తేదిన స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా 17వ తేదిన పుష్పయాగం చేపట్టడంతో కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయని తెలియజేశారు. స్వామివారి కళ్యాణం జరుగుతున్న విషయాన్ని భక్తుల సమాచారార్ధం పెద్ద ఎత్తుప ప్రచారం కూడా చేపట్టినట్టు చెప్పారు. రెండేళ్ల తరువాత మళ్లీ స్వామివారి కళ్యాణం భక్తుల సమక్షంలో జరుగుతుందని, దానికోసం ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఈఓ పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి క్రుపకు పాత్రులు కావాలని ఈఓ ఈ సందర్భంగా మీడియా ద్వారా భక్తులను కోరారు.

అన్నవరం

2022-05-08 14:51:01

టిటిడి ఈఓ(ఏఎఫ్ఏసి) గా ఎవి.ధర్మారెడ్డి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కొలువులో 19 నెలల పాటు భక్తులకు సేవలు అందించానని, దీన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి టిటిడి ఈవో(ఎఫ్ఎసి) బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డిని శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటంతో సన్మానించారు.  ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ తన పదవీ కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, పలు కార్యక్రమాలు ఇంకా పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత బోర్డుతోపాటు రానున్న ఈఓ ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తన పదవీ కాలంలో సహకరించిన ధర్మకర్తల మండలికి, టిటిడి అధికారులకు, ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

      అనంతరం టిటిడి ఈవో(ఎఫ్ఎసి)  ఎవి.ధర్మారెడ్డి టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జెఈఓ(ఆరోగ్యం, విద్య) సదా భార్గవి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో(ఎఫ్ఎసి) ఎవి.ధర్మారెడ్డి  మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పాటు తాను అదనపు ఈఓగా బాధ్యతలు నిర్వహించానని, శ్రీవారి ఆశీస్సులతో ఈవో(ఎఫ్ఎసి) బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో  నరసింహ కిషోర్, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర రావు, ఎస్ఈ  జగదీశ్వర రెడ్డి, అడిషనల్ సీవీఎస్వో  శివ కుమార్ రెడ్డి డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు, హరీంద్ర నాథ్ , కస్తూరి బాయి, భాస్కర్,  హెల్త్ ఆఫీసర్ Dr. శ్రీ దేవి, పేష్కార్లు  శ్రీహరి,  పార్థసారథి  తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-05-08 13:32:33

Rajahmundry

2022-05-08 06:46:28