ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి, వ్యాధుల భారిన పడకుండా పరిరక్షిం చేందు ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ల అనాలోచిత నిర్ణయాల కారణంగా జీవోనెంబరు 149 మోకాలు అడ్డుతోంది. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి, జీఓనెంబరు-149కి లింకేంటనే అనుమానం మీకు కలిగితీరాలి. లేదంటే పంచాయతీరాజ్ శాఖలోని ఉన్నతాధికారులు చేసే తప్పులతో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు వస్తుందో.. గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల ద్వారా సేవలు ప్రజలు ఎందుకు పూర్తిస్థాయిలో అందకుండా పోతున్నాయో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ఆధారంగా విభజించిన సచివాలయాల పరిధిలు ఆధారంగా విధులు, నిధులు, అధికారాలు, పారిశుధ్య సిబ్బందిని అప్పగించి ప్రజలు సేవలు చేయించాలి. పేరుకే ఆ జీఓ ఉంది తప్పితే దానిని రెండేళ్లుగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగానీ, కమిషనర్ గానీ అమలు చేసిన పాపన పోలేదు. దీనితో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలంతా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలుగానే రెండేళ్ల పాటు విధులు నిర్వహించాల్సి వచ్చింది.
ఉత్తుత్తి కార్యదర్శిలు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వీరంతా విధుల్లోకి చేరిన దగ్గర నుంచి నేటి వరకూ వీరు సంతకం పెట్టే ఒక్క అధికారం కూడా పంచాయతీరాజ్ శాఖ వీరికి కల్పించలేదు. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తవుతున్నతరుణంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, గ్రామాలను స్వచ్ఛంగా ఉంచేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం అమలు జరిగితే పల్లెలన్నీ అద్దంలా మెరిసిపోవాలి.. కానీ అలా జరగడం లేదు. దానికి కారణం గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలనే విషయం ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి ప్రభుత్వంలోని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు..మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు గుర్తించాల్సివుంది. సీనియర్ పంచాయతీ కార్యదర్శిలుగా వున్న వీరిని జిల్లా స్థాయిలో డీపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శిలు లేని పంచాయతీలకు గ్రామ, వార్డు సచివాలయశాఖ జెసీల ఆదేశాలన్నాయంటూ వీరిని ఇన్చార్జిలుగా నియమించారు. దీనితో ఉద్యోగం చేసేచోట కంటే ఈ సీనియర్ కార్యదర్శిలకు ఇన్చార్జిలు ఇచ్చిన పెద్ద, మేజర్ పంచాయతీల్లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఈ తరుణంలో గ్రామస్థాయిలో పారిశుధ్యం పడకేస్తున్నది. కనీసం మేజర్ పంచాయతీల్లో వున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలైనా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే పారిశుధ్య సిబ్బంది వీరి మాట వినడం లేదు.
కొద్దో గొప్పో పంచాయతీల్లో వింటున్నా, సానిటేషన్ సామాగ్రికి, బ్లీచింగ్ ఫౌడర్ గా పేరుపెట్టుకున్న తెల్లబూడిద చల్లేందుకు, వాటిని తీసుకోవడానికి గ్రేడ్-1 కార్యదర్శిల నుంచి గ్రేడ్-4 కార్యదర్శిల దగ్గరకు గ్రేడ్-5 కార్యదర్శిలు వెళ్లి దేహీ అంటూ పారిశుధ్య సిబ్బందిని, సామాగ్రిని అడుక్కొని తీసుకోవాల్సిన పరిస్థితి. 60శాతం మేజర్ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు సక్రమంగా లేనే లేరు. వున్నచోట పనిచేయించడానికి సిబ్బంది తక్కువగా ఉండటం పంచాయతీ ప్రధాన కార్యదర్శి( గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 వరకూ) గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు అందుబాటులోకి లేకుండా పోతున్నారు. అందునా గ్రేడ్-5 కార్యదర్శిలకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో వీరు గ్రామస్థాయిలో పారిశుధ్య నిర్వహణ కూడా చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయాన్ని మండల, జిల్లా స్థాయి ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నేరుగా వినతి పత్రం సమర్పించినా కనీసం చలనం లేదు. ఈ తరుణంలోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద గ్రామాలను స్వచ్ఛంగా ఉంచేందుకు, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తడి, పొడి చెత్తవాహనాలు ప్రభుత్వ పంచాయతీలకు కేటాయించినా వాటిని వినియోగించడానికి డ్రైవర్లు సైతం లేని దుస్థితి నెలకొంది. దీనితో ఆ వాహనాలన్నీ పంచాయతీ కార్యలయాల ముందు అలంకరణ ప్రాయంగానే మిగిలిపోయాయి. అదే జీఓనెంబరు 149ని ప్రభుత్వం అమలు చేసి వుంటే..గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు ఉండేవి. ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అవి గ్రామస్థాయిలో అమలు చేయడానికి వీరికి పూర్తిస్థాయిలో అధికారాలుండేవి. పరిపాలన, పారిశుధ్య నిర్వహణ సదరు కార్యదర్శిలకు కేటాయించిన సచివాలయ పరిధిలో పూర్తిస్థాయిలో జరిగేది.
ఈ విషయమై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లు సంయుక్తంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎదురయ్యే సమస్యలను, లోపాలను ఎప్పటి కప్పుడు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతూ వస్తున్నది. అయినప్పటికీ పంచాయతీరాజ్ శాఖలో కనీసం చలనం రాలేదు. ఈ శాఖలో జరుగుతున్న తప్పులు, లోపాలు, సమస్యలు ప్రజలకైనా, ప్రజలను పాలించే ప్రజాప్రతినిధులకై అర్ధమవ్వాలనే సంకల్పంతోనూ.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో మంచి ఆశయంతో, లక్ష్యంతో, ప్రజలకు సేవసేయడానికి ప్రవేశపెట్టిన పథకాలకు ప్రభుత్వశాఖల ముఖ్య అధికారులే ఏ విధంగా గాలితీసేస్తున్నారో తెలియజేసే ఉద్దేశ్యంతోనే ఈ ప్రత్యేక కధనాలను ప్రజల ముందుకి తీసుకు వస్తున్నాం. అదే సమయంలో మంచి కార్యక్రమాలను కూడా అంతకంటే పెద్దస్థాయిలోనే ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియజేయడంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, బాధ్యతగా వ్యవహరిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా జీఓ నెంబరు 149 అమలు విషయంలోనూ, గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, విధులు, నిధులు, సచివాలయాల పరిధిలు కేటాయించే విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే తప్పా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమమే కాకుండా మరే ఇతర కార్యక్రమం, పథకాలు, సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించాల్సి వుంది..చూడాలి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై ద్రుష్టిపెడతారా లేదా అనేది..!