ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పట్టణంలోని గుండాల వద్ద గల సచివాలయ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటుచేసిన ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు, బిర్సాముండా, గాం గంటం దొర, గాం మల్లు దొర చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో వివిధ ఆదివాసి తెగలను పరిచయం చేయడం వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారతీయ మూలాలు సజీవంగా ఉన్నాయంటే ఆదివాసుల వల్లనే నని గుర్తించి వాటిని అవగాహన చేసుకుని ప్రచారం చేయాలన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని చెప్పారు.
ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నిజాయితీగా అమాయకంగా ఉండే గిరిజనులు అభివృద్ధి బాట పట్టారని చెప్పారు.
అనకాపల్లి జిల్లా గిరిజన ప్రాంతాలన్నీ ఏజెన్సీని ఆనుకొని ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గిరిజనులను అభివృద్ధి పరిచేందుకు చైతన్యం నింపేందుకు ఉత్తరాంధ్రలో అల్లూరి, మన్యం పేర్లతో రెండు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు బి. వరాహ సత్యవతి మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, వైద్య, విద్యా పరంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు.తొలుత గిరిజన బాలికలు ప్రదర్శించిన ధింసా నృత్యాలు ఇతర గిరిజన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో బీసీ వెల్ఫేర్ డిడి రాజేశ్వరి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగ శిరీష , బుచ్చయ్య పేట, జెడ్ పి టి సి దొండా రాంబాబు, సర్పంచ్ పెంటయ్య నాయుడు, జిల్లాలోని రామన్నపాలెం, కోనాం, తాండవ, నరసయ్య పేట, తాటిపర్తి ఇతర ప్రాంతాల నుండి గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.