1 ENS Live Breaking News

చేనేత వర్గాలు రాజకీయంగా ఎదగాలి..గాజువాక గర్జన

రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పద్మశాలి సామాజికవర్గాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, రాజకీయంగా చేనేత వర్గాలను ఎదగనీయకుండా అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తున్నాయని పద్మశాలి గర్జనలో పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గాజువాకలో జరిగిన ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ సదస్సు లో విశాఖ జిల్లా అధ్యక్షుడు వానపల్లి ఈశ్వరరావు అధ్యక్షతన గాజువాక గర్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్బంగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత సామాజిక వర్గీయులంతా ఒకే తాటిమీదకి రావాలన్నారు. ఇప్పటివరకు మన చేనేత వర్గానికి రాజకీయంగా ఎదుగుదల లేదని, రానున్న రోజుల్లో చేనేతలు అందరూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటేనే చేనేతలు ఎదగడానికి అవశాకశం వుంటుందన్నారు. మన కంటే తక్కువ శాతం వున్న  బీసీల్లో అనేకమంది చట్టసభలకు వెళ్తున్నారని.. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా పద్మశాలీయులు, చేనేత కులస్తులు లేకపోవడం బాధాకరమన్నారు. మాజీ మంత్రి, నిమ్మల కృష్ణప్ప, రాజ్యసభ సభ్యులు జీవియల్ నర్సింహారావు,  ఆప్కోస్ చైర్మన్ గంజి చిరంజివి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత , మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వావిరాళా సరళ దేవి, చేనేత కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు  తదితరలు ప్రసంగించారు. జనాభాలో అధిక శాతం ఉన్న పద్మశాలి కులస్తులకు రానున్న ఎన్నికల్లో తగినన్ని ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కుల సంఘం పెద్దలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి చేనేతలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Gajuwaka

2023-08-27 14:24:12

తొండమనాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తొండమనాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 27న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఆగస్టు 28న ఉద‌యం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు,  ఆగ‌స్టు 29న ఉద‌యం పవిత్ర సమర్పణ, సాయంత్రం చ‌తుష్టానార్చ‌న నిర్వ‌హిస్తారు. ఆగస్టు 30న ఉద‌యం మహా పూర్ణాహుతి, ప‌విత్ర విత‌ర‌ణ‌, స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంత‌రం సాయంత్రం వీధి ఉత్స‌వం, నిర్వహించనున్నారు.  ఈ సంద‌ర్భంగా టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

Tirupati

2023-08-26 13:20:15

ఘనంగా ఏపీఎల్, ఏసీఏ ప్లాటినం జూబ్లీ వేడుకలు

ఏపీఎల్, ఎసిఎ ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎసిఎ కార్యదర్శి శ్రీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా 83 వరల్డ్ హీరోలు రానున్నట్లు తెలిపారు. విశాఖలో శనివారం ఎసిఎ జాయింట్ సెక్రటరీ రాకేశ్ తో కలిసి ఎస్. ఆర్ . గోపినాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రా రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని యువ క్రికెటర్ల లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారి గొప్ప అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గత ఏడాది ఏపీఎల్ - 1 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాము.  ప్రస్తుతం ఏపీఎల్ - 2 నిర్వహిస్తున్నాం.  ఆదివారం వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఎసి విడిసి స్టేడియంలో జరగనున్న ఏపీఎల్ ఫైనల్ కు మాజీ ఇండియా టెస్ట్ కెప్టెన్, బిసిసిఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ కృష్ణమా చారి  శ్రీకాంత్, అదేవిధంగా గౌరవ అతిథిగా మాజీ ఇండియా క్రికెటర్, ఇండియా నేషనల్ క్రికెట్ కోచ్  మదన్ లాల్ హాజరవుతారని వెల్లడించారు. ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఐపిఎల్ టీం స్కౌట్స్ వచ్చారని, దీంతో యువ క్రీడాకారులకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 

ఏసీఏ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా బిసిసిఐ ప్రెసిడెంట్ శ్రీ రోజర్ బిన్నీ, గౌరవ అతిథిగా మాజీ ఇండియన్ క్రికెటర్, ఇండియా నేషనల్ క్రికెట్ కోచ్ శ్రీ మదన్ లాల్ హాజరు అవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మెన్, ఉమెన్ రంజీ ప్లేయర్లు, కెప్టెన్లు, ఏసీఏ సిబ్బందితో ఆయన  600 మంది ఎసిఎ సిబ్బంది తదితరులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారని వెల్లడించారు. అదేవిధంగా తొలి భారత టెస్ట్ కెప్టెన్, ఆంధ్ర రంజీ ట్రోపి జట్టుకు మొదటి కెప్టెన్ కల్నల్ సి. కె. నాయుడు గారి కుటుంబ సభ్యులను సన్మానిస్తామని తెలిపారు. బిసిసిఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ వైజాగ్ రావడం వల్ల రాష్ట్రానికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియం ప్రాంగణంలో ఎసిఎ మాజీ కార్యదర్శి శ్రీ ఎన్. వెంకట రావ్ గారి పేరిట స్టాండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Visakhapatnam

2023-08-26 13:15:38

హానికరమైన ఆహారపదార్ధాలకు దూరంగా ఉండాలి

రంగులు, రసాయనాలు వినియోగించి తయారు చేసే ఆహారపదార్ధాలకు విద్యార్ధులు దూరంగా ఉండాలని విద్యార్దుల జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ఇ.బి. విలియమ్స్ సూచించారు. శనివారం సరస్వతి స్మారక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో  విద్యార్దులతో ఏర్పాటు చేసిన కన్సూమర్ క్లబ్స్ అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు మనం నగదు చెల్లించి కొనుగోలు చేసే వస్తువుల్లో కల్తీ పదార్ధాలు, నకిలీ వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. కొనుగోలు చేసే వస్తువులపై తయారీ సంస్థ పేరు, తయారు చేసిన తేదీ, వినియోగానికి చివరి తేదీ చూడాలని, కొనుగోలు చేసే ప్రతి వస్తువులు సేవలకు తప్పని సరిగా రశీదు పొందాలని తెలిపారు. తల్లిదండ్రులకు, చుట్టుప్రక్కల ఉన్నవారికి వినియోగాదారుల రక్షణ చట్టం గురించి వివరించాలని సూచించారు. ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద గ్యాస్ తూకం సరిచూసి తీసుకోవాలని, బిల్లులో ఉన్న మొత్తం మాత్రమే చెల్లించాలని, అధికంగా కోరితే పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. 

వస్తువులపై ముద్రించిన ధరకన్నా అధిక ధరలకు వినియోగిస్తున్నట్లయితే తూనికలు కొలతల శాఖ వారికి ఫిర్యాదు చేయాలని, పండ్లు, కూరగాయలపై రంగులు రసాయనాలు వినియోగించే వారిపై, పరిశుభ్రత పాఠించకుండా ఆహారపదార్ధాలు తయారు చేసేవారిపై, విక్రయించే వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారు విద్యార్దులను కోరారు. సినిమా హీరోలు, సెలబ్రెటీలతో ఉన్న ప్రకటనలు చూసి వస్తువులను కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.  వినియోగదాల రక్షణ చట్టం –2019 గురించి, విద్యార్ధులకు పవర్ పాయింట్ ద్వారా  దాసరి ఇమ్మానియేలు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో బాపట్ల సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్ ఓంకార్, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, కన్స్యూమర్ క్లబ్ ఇన్చార్జి ఫాతిమున్నీసా, పాఠశాల ఉపాధ్యాయులు,  విద్యార్దులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వారు రూపొందించిన మేము సైతం పుస్తకాన్ని పాఠశాలకు అందచేశారు.

Bapatla

2023-08-26 10:46:33

శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలి

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం- పర్జన్యశాంతి హోమం నిర్వహించామని, శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల పాటు జరిగిన యాగాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఈవో  ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరుణదేవుని ఆశీస్సులు కోరుతూ 32 మంది ఋత్వికులు ధర్మగిరిలో ఎంతో నిష్టగా, అత్యంత అంకితభావంతో యాగాలు నిర్వహించారని తెలిపారు. అనంతరం ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎస్.అవధాని  కారీరిష్టి-వరుణజప-పర్జన్యశాంతి మంత్రాలను పఠించి అందరితో పలికించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమసలహాదారు  మోహనరంగాచార్యులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజీఓలు  బాలిరెడ్డి, గిరిధర్ రావు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Tirupati

2023-08-26 08:06:49

కాకినాడజిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కురసాల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు కాకినాడ జిల్లా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధిష్ఠానం తాడేపల్లి నుంచి పార్టీ కార్యాలయం విడుదల చేసింది. ఇందులో భాగంగానే జిల్లా కమిటీని 49 మందితో ఏర్పాటు చేసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఒకరిని, ఉపాధ్యక్షులుగా ముగ్గురిని, ప్రధాన కార్యదర్శులుగా ఏడుగురిని, కార్యదర్శులుగా మరో ఏడుగురిని, కోశాధికారిగా ఒకరిని, మొత్తం 30 మంది కార్యనిర్వహక సభ్యులలుగా నియమించారు.‌ జిల్లా పార్టీ కమిటీ అధ్యక్షుడుగా మాజీ మంత్రి, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నియమితులు అయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి కర్రి వెంకట శివరామకృష్ణ, తుని నియోజకవర్గం నుంచి గంటా చక్రరావు, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నరాల శ్రీనివాసరావు నియమితులు అయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కాకినాడ గ్రామీణం నియోజకవర్గం నుంచి ఇద్దరు బలగం ప్రసన్న కుమార్, పాలిక నరసింహమూర్తి, జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇద్దరు తుమ్మల వెంకట రామకృష్ణ, పోసిన బాబూరావు, కాకినాడ పట్టణ నియోజకవర్గం నుంచి ఇద్దరు బెండ విష్ణుమూర్తి, అడ్డాల శ్రీలక్ష్మి, పిఠాపురం నియోజకవర్గం నుంచి మొగిలి మాణిక్యాలరావు నియామకం అయ్యారు. 

కార్యదర్శులుగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పైలా కళ్యాణ్, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి పుల్లా ప్రభాకరరావు, తుని నియోజకవర్గం నుంచి చింతల వెంకట రమణ, పెద్దాపురం నియోజకవర్గం  నుంచి ఇద్దరు బర్రే రాంగోవింద్, తాటికొండ అచ్చిరాజు, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అలమండ చలమయ్య, పిఠాపురం నియోజకవర్గం నుంచి మామిడి రంగబాబు, అలాగే కాకినాడ నగరం నియోజకవర్గం నుంచి కోశాధికారిగ కాకరపర్తి హరినాధ్ లకు జిల్లా శాఖ కమిటీలో అవకాశం కల్పించారు. వీరితో పాటు వీరితో పాటు 39 మంది కార్యనిర్వహక సభ్యులుగా గెద్దాడ రాజు, వాసంశెట్టి నాగ దుర్గా ప్రసన్న కుమారి, గొర్ల అమ్మాజీ, కడజారి నాగేశ్వరరావు, అర్జిల్లి సింహాద్రి, నూకల కొండల రావు, జార్జ్, గుండవరపు బాబూరావు, చిలుకూరి మనోజ్ కుమార్, గుడాల శాంతి ప్రసాద్, సోమాల రామలక్ష్మి, గొడుగుల కొండబాబు, మేడిశెట్టి సింహాచలం, పురంశెట్టి నాగ వెంకట సత్య ప్రసాద్, జుత్తుక సుబ్బలక్ష్మి, దండా రాజేష్, షేక్ బషీర్, కామన రామకృష్ణ, బండి దుర్గరాజు, నాళం లోవకుమారి, ముప్పనబోయిన సోమరాజు, అబ్బిరెడ్డి భావన్నారాయణ రెడ్డి, కర్రి దివ్యవాణి, గాడి రమణబాబు, గాబు వీర వెంకట సత్యనారాయణ, చోడిశెట్టి వెంకటేష్, కాకర రాంబాబు, ఆచారి సాంబ, ఆకుల వీరబాబు, ఆకుల అనసూయలను పార్టీ నియమించింది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ కమిటీలోకి ప్రాతినిధ్యం కల్పించడంలో పార్టీ సమతూకం పాటించినట్లైంది.‌ ఎంతో కాలంగా నిజాయితీగా పార్టీ కోసం నిస్వార్థంగా సేవలను అందిస్తున్న వారికి ఈ సందర్భంగా పార్టీ నుంచి సరైన గుర్తింపు లభించినట్లు అయ్యింది.

Kakinada

2023-08-25 16:53:49

6217మందికి రూ.7.58 ద్వైవార్షిక నగదు మంజూరు

అనకాపల్లి జిల్లాలో నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హత గల 6,217 మంది లబ్దిదారులకు వివిధ పథకాల క్రింద రూ.7 కోట్ల 58 లక్షల 49 వేల 019లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు.  గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల  లబ్ది అందని వారికి నగదు లబ్ధిని అందించడంలో భాగంగా వర్చువల్ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసారు.  జిల్లా కలెక్టరు కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, జిఎస్ డబ్ల్యుఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, డి ఆర్ డి ఎపిడి డైజీ లబ్దిదారులు  పాల్గొన్నారు. 
 
ఈ సందర్బంగా  కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో  ద్వైవార్షిక మంజూరు కింద  అర్హత ఉన్న 6, 217 మంది లబ్దిదారులను గుర్తించి వివిధ శాఖల అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కు చెందిన రూ.7,58,49,019లను లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు.  ద్వైవార్షిక నగదు మంజూరులో భాగంగా 366 లబ్ధిదారులకు అమ్మఒడి రూ 54,90,000; 1895 మందికి చేదోడు పథకంలో రూ. కోటి 89 లక్షల 50 వేలు, 111 మందికి ఈ బీసీ నేస్తంగా 16 లక్షల 65 వేలు, మత్స్యకార భరోసా కింద 23 మందికి 2లక్షల 30 వేలు, విద్యా దీవెన కింద 1615 మందికి 2 కోట్ల 12 లక్షల 30 వేల 756, వసతి దీవెన కింద 1233 మందికి రూ. కోటి 7లక్షల 24 వేలు, వైయస్సార్ ఆసరాగా 579 మందికి రూ కోటి 57 లక్షల 93 వేల 263, వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ గా 395 మందికి 17 లక్షల 66 వేలు లబ్ధి చేకూరిందని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్ డబ్ల్యుఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, డి ఆర్ డి ఎపిడి డైజీ, డిఎల్ డివో ఉదయశ్రీ లబ్దిదారులు తదిత రులు పాల్గొన్నారు. 

Anakapalle

2023-08-24 15:03:41

అనకాపల్లి నుంచే మరలా పోటీ చేస్తా ..మంత్రి అమర్

అనకాపల్లి నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ప్రాణం పోయినా అవినీతి కి పాల్పడనని రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. స్థానిక న్యూకాలనీ లోని రోటరీ కళ్యాణ మండపంలో మంగళవారం సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఎప్పుడు కూల్ గా సాగే ఆయన ప్రసంగం ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కనిపించింది.  సుదీర్ఘంగా సాగిన తన ప్రసంగంలో అమర్నాథ్ అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని, కార్యకర్తలే తన బలమని, చెప్పుడు మాటలు విని తనను దూరం చేసుకోవద్దు అంటూ భావోద్వేగంతో చేసిన ప్రసంగం పలువురిని ఆలోచింపజేసే విధంగా చేసింది.తన మీద నమ్మకం ఉంటే తనతోనే ఉండండి.తనను నమ్మిన వారిని  ఎప్పుడూ దూరం చేసుకోను. పలకరించలేదనో. లేక పట్టించుకోలేదనో తనను దూరం చేసుకోవద్దు. నా గుండెల్లో తన తల్లిదండ్రులకు ఏ స్థానం ఉందో అంతకుమించి తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఉందని అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవుల కేటాయింపులలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఆయా నాయకులు కార్యకర్తలు సంప్రదింపులు జరుపుకొని తన దగ్గరికి వచ్చిన తర్వాతే ఆయా పదవులనుభర్తీ చేశానని అమర్నాథ్ వెల్లడించారు. 

ఇదిలావుంటే వచ్చే ఎన్నికల్లో తాను అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని, కార్యకర్తలే నా ఎలక్షన్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.  రాజకీయా ల్లో ఓపిక అవసరమని, సమయం వచ్చినప్పుడు పదవులు అంది వస్తాయని ఆయన అన్నారు.ఇదిలావుంటే తాను అవినీతికి పాల్పడుతున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రాణం పోయినా అవినీతికి పాల్పడబోనని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కార్యకర్తలంతా కాలర్ ఎగరేసి మరీ చెప్పచ్చని అమర్నాథ్ అన్నారు. తానేదో  భూ కుంభకోణానికి పాల్పడ్డానని అంటూ దాన్ని నిరూపించడానికి వచ్చిన ఒక సినిమా యాక్టర్,  కేవలం నాలుగు నిమిషాలు ఇక్కడ ఉండి నిరూపించలేక పలాయనం చిత్తగించారని ఆయన అన్నారు. నోరు ఉందని ఇష్టానుసారంగా తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అమర్నాథ్ హెచ్చరించారు. తనపై అవినీతి మరక పడకూడదని, ఎదుటివారి వద్ద తలదించుకోకూడదన్న భావన తనలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.త్వరలోనే అనకాపల్లికి తాను మకాం మారుస్తానని అమర్నాథ్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బి.సి వెల్ఫేర్ గవర కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎపి ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, అర్బన్ సచివాలయాల కన్వీనర్ కొణతాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-22 16:07:14

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా..?

ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదని ఇప్పటివరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన పర్యటన, మాట్లాడుతున్న మాటలు బట్టి అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  పవన్ కళ్యాణ్ బుధవారం ఎర్రబట్టిదిబ్బలను సందర్శించిన అనంతరం మాట్లాడిన మాటలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఎర్రమట్టి దిబ్బలు చారిత్రక ఆనవాళ్ళని దానిని ఆక్రమించుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అక్కడ విఎంఆర్డిఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పంటే ఎలా? అనిఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ గత నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్  వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. " మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది." అని అమర్నాథ్పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి మీ పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు వాస్తవ విరుద్ధమని,  ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని అమర్నాథ్ కోరారు. ఆయన ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతంలో  ఎక్కడ ఎటువంటి లోపం కనిపించకపోవడంతో , ఇక్కడ జరుగుతుందంతా ఎన్జీటీకి, మోడీకి చెప్తానంటూ లేనిపోని ప్రగల్బాల్ పలుకుతున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. " మీరు ఇక్కడ ఉండే ఒకటి రెండు రోజుల్లోనైనా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి.. అవాస్తవాలను మాత్రం మాట్లాడకండి" అని అమర్నాథ్, పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2023-08-16 15:46:29

నిర్ణీత కాల‌వ్య‌వధిలోగా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా చేప‌ట్టిన ఇంటింటి స‌ర్వేకి కేవ‌లం ఐదు రోజులే గ‌డువు ఉంద‌ని, ఆ లోగా ప‌ని పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు, అధికారుల‌తో బుధవారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌, ఇంటింటి స‌ర్వే పై నియోజ‌క‌వ‌ర్గాల వారీగా, మండ‌లాల వారీగా స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఇంటింటి స‌ర్వేకి ఎక్కువ స‌మ‌యం లేద‌ని, నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. అర్హ‌త ఉన్న ప్ర‌తీఒక్క‌రికీ ఓటు క‌ల్పించాల‌ని, అలాగే అన‌ర్హులంద‌రినీ తొల‌గించాల‌ని ఆదేశించారు. ఓటు తొల‌గించేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ఫార‌మ్ 7 ద‌ర‌ఖాస్తు తీసుకోవాల‌ని, డెత్ స‌ర్టిఫికేట్ లేదా ఏదో ఒక థృవ‌ప‌త్రం కూడా ఉండాల‌ని, వాటిని ఫైల్ చేయాల‌ని సూచించారు. ఒక కుటుంబ ఓట్లు, ఒక అపార్ట్‌మెంట్ లేదా గ్రూప్ హౌస్ ఓట్లు ఒకే పోలింగ్ స్టేష‌న్లో ఉండేలా రేష‌న‌లైజేష‌న్ చేయాల‌ని చెప్పారు.

 విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌క్రియ కొంత నెమ్మ‌దిగా సాగుతోంద‌ని, వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. ఎటువంటి త‌ప్పులు లేని, ఆరోగ్య‌క‌ర‌మైన ఓట‌ర్ల జాబితాల‌ను రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.  ఈ స‌మావేశాల్లో జాయింట్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌, ట్రైనీ క‌లెక్ట‌ర్ వెంక‌ట త్రివినాగ్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓలు ఎంవి సూర్య‌క‌ళ‌, ఎం.అప్పారావు, శేష‌శైల‌జ‌, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు బి.సుద‌ర్శ‌న‌దొర‌, నూక‌రాజు, ప‌ద్మ‌ల‌త‌, నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల తాశిల్దార్లు, డిటిలు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు రొంగ‌లి పోత‌న్న‌, శ్రీ‌నివాస‌రెడ్డి, స‌తీష్‌కుమార్, ద‌యానంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-08-16 14:40:23

సుజల స్రవంతి పనులు వేగవంతం చేయాలి-మంత్రి అమర్

అనకాపల్లి జిల్లాలో సుజల స్రవంతి పనులు మరింత వేగవంతం చేయాలని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 1876 ఎకరాల భూమిలో 1205 ఎకరాలు జిరాయితీ భూమి ఉందన్నారు. అనకా పల్లి, కసింకోట, సబ్బవరం మండలాల పరిధిలో మొత్తం 22 గ్రామాలకు చెందిన భూమిని సమీకరించాలన్నారు.  ఆరిపాక నల్లరేగు పాలెం, కొండుపాలెం లలో వెంటనే పనిని ప్రారంభించాలన్నారు.  జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ  సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.  ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు   సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం భూమిలో 1025 ఎకరాలు జిరాయితీ, 476 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలింది అటవీ భూమి గా గుర్తించడం జరి గిందని అధికారులు తెలిపారు.   సేకరించిన భూమిలో పనులు వేగంగా చేయాలని, మిగిలిన భూమిని సేకరించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కలెక్టర్ అధికారు లను ఆదేశించారు.  సమావేశంలో అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ, బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రత్యేక ఉప కలెక్టర్ కె. రమామనణి, ఇంజనీరింగ్ అధికారులు తదిత రులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-16 14:16:12

పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో  నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు.  ప్రభుత్వం కల్పించే రాయితీలు, తోడ్పాటును గురించి వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున అందించే ఇన్సెంటివ్ లు మంజూరు కొరకు సబ్ కమిటీని ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలన్నారు.  ఏపీఐఐసీలో పరవాడ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు విషయమై  అధికారులు పారిశ్రామికవేత్తలు విన్నవించగా కలెక్టర్ ఏపీ ఈపీ డి సి ఎల్  సిఎండి తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.  అంతకుముందు గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు గూర్చి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మెంబర్ నదియా, ఏపీఐఐసీ జెడ్. ఎం. త్రినాథ్, డిపిఓ శిరీష రాణి, డి ఆర్ డి ఏ పీ డి లక్ష్మీపతి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ ఇ, అగ్నిమాపక శాఖ అధికారి, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-16 14:14:39

వీజేఎఫ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వీజేఎఫ్ -ప్రెస్ క్లబ్)ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాబా గార్డెన్స్ లోని సంస్థ ప్రధాన కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. రైతు బజార్ లో కాయగూరలు అమ్ముకొని జీవన సాగిస్తున్న 90 ఏళ్ల వయసు కలిగిన నారాయణమ్మ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల  త్యాగఫలం మన స్వావాతంత్ర్యాన్ని స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర సిద్ధించడానికి దేశం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. వృద్ధ మహిళా రైతు నారాయణమ్మ లాంటి అనేకమంది శ్రమజీవులు  శ్రమ ఫలితంగా దేశం  ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పడానికే ఆమె చేత జాతీయ జెండాను ఆవిష్కరించమని తెలిపారు. స్వేచ్ఛ ,స్వాతంత్రాలతో అనేక హక్కులతో మన జీవిస్తున్నామంటే గాంధీ,సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్,నెహ్రూ, పటేల్, భగత్ సింగ్ ,అల్లూరి సీతారామరాజు లాంటి అనేకమంది త్యాగ ఫలితం అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కృషితోపాటు దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  దని పేర్కొన్నారు. ఆ మహానీయుల స్ఫూర్తితో వీజేఎఫ్ అభివృద్ధికి జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వీజేఎఫ్ సభ్యులు, జర్నలిస్టులు టి.బంటయ్య ,పి.సత్యనారాయణ, బి.నారాయణరావు ,ఎస్వీ రమణ,ఎస్ సన్యాసిరావు, కె .పరశురాం , ఆర్.అబ్బాస్,బి.శివప్రసాద్ ,చొప్పాబాలకృష్ణ, దుంపల ప్రసాదరావు, పృధ్వి రాజు,యు. వి. రమణ మూర్తి , కె.కె. రెడ్డి, ఎమ్.శ్రీహరి , యెద్దు  బాలకృష్ణ,అర్జున, కె.శివ,నటరాజు, మోహన్ ,బి. ఏ .నాయుడు, నరసింహం,సతీష్, శ్రీనివాస్, కె సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-15 08:35:30

కొండంతా వెతికి ఎలుకని పట్టలేని పవన్ కళ్యాణ్

 కళ్యాణ్ ని చూస్తే జాలేస్తోంది.. ఎవరో చెప్పిన మాటలు విని విశాఖలో భూ కుంభకోణాలు వెలికితీస్తానంటూ బయలుదేరిన పవన్ కళ్యాణ్ గత ఐదు రోజులుగా ఈ ప్రాంతంలో తిరిగినా ఏమి సాధించలేకపోయాడని, ఎందుకు తిరుగుతున్నాడో .. ఎవరి కోసం తిరుగుతున్నాడో ఆయనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం అయిన విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విస్సన్నపేట భూముల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని.. దాన్ని బయటపెడతానంటూ జబ్బలు చరుచుకుంటూ వెళ్లిన పవన్ కళ్యాణ్ కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదు అని విమర్శించారు... వ్యాన్ ఎక్కి నాలుగు మాటలు మీడియాతో మాట్లాడి.. దిగి.. కారెక్కి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ ను చూసి అందరూ నవ్వుకుంటున్నారని అమర్నాథ్ఎద్దేవా చేశారు. 2004వ సంవత్సరంలో రంగుబోలుగడ్డ కోసం 45 ఎకరాలను చంద్రబాబు నాయుడు హయాంలో సేకరించారని, అప్పట్లో రైతులకు పరిహారం కూడా ఇచ్చారని.. అక్కడున్న పోరంబోకు భూములు అయితే పరిహారం ఎందుకు ఇచ్చారని అమర్నాథ్ ప్రశ్నించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి విస్సన్నపేట వెళ్లి పవన్ కళ్యాణ్ సమయం వృధా చేసుకున్నాడని ఆయన అన్నారు. విస్సన్నపేట భూముల్లో జరిగిన వ్యవహారం గురించి మీడియా ప్రతినిధులు మాట్లాడమంటే, నేను మంత్రులతో మాట్లాడను నేరుగా సీఎంతోనే మాట్లాడుతానని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆయన ఆరోపణలలో బలం లేకపోవడం వలనే  పవన్ అలా కప్పిపుచ్చుకొని వెనదిరిగారని అమర్నాథ్ అన్నారు. నిజంగా విస్సన్నపేట భూముల్లో అవకతవకలు జరిగి ఉంటే ఆయన ఆధారాలు చూపాలి కదా! లేవు కనుకనే మారు మాట్లాడకుండా వెనుతిరిగాడని ఆయన అన్నారు.


పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇమేజ్ ఆధారంగా చేసుకుని సినిమాల్లోకి వచ్చారు. 'మీ నాన్న  కానిస్టేబుల్ కాకముందే, మా తాత ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. మా కుటుంబం గత 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తోంది. నేను నా తండ్రిని, తాతను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు రాలేదు. 18 ఏళ్లు కష్టపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఇంత వాడినయ్యాను. మేము ప్రభుత్వ భూములకు కస్ట్రోడియన్లు గా ఉంటాం కానీ, ఆక్రమించుకోo అని అమర్నాథ్ దీటుగా సమాధానం ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేక, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్వాగతించలేక, ద్వేషం, ఈర్ష్యతో ఆయన మీద అర్థం  లేని ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కాస్తంత జ్ఞానం సంపాదించుకొని మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అమర్నాథ్ వ్యక్తం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ యువతను మభ్యపెట్టి తన వెంట తిప్పుకుంటూ కీచక గురువుగా తయారయ్యాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాల్లో ఎవరైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన అది తిరిగి రాదని త్వరలోనే ఆయన తన కేడర్ను  మూట కట్టి చంద్రబాబు నాయుడుకి అమ్మేస్తాడని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ రెండు రాజకీయ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేస్తాం! అని అమర్నాథ్ అన్నారు.

Visakhapatnam

2023-08-14 14:11:48

సనాతన ధర్మంపై అవగాహన పెంచుకోవాలి

ఆయుర్వేద వైద్య విద్యార్థులు సనాతన ధర్మంపై అవగాహన పెంచుకుని ధర్మబద్ధంగా నడుచుకోవాలని హైదరాబాదు లోని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలియజేశారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బుధవారం సాయంత్రం సనాతన ధర్మంలో విజయ సూత్రాలు అనే అంశంపై స్వామీజీ ఉపన్యసించారు. సనాతన ధర్మంలో చెప్పిన విధంగా బ్రహ్మచర్యం, ఇంద్రియనిగ్రహం, మితాహారం‌,  బాహ్య, అంతర శుద్ధి ద్వారా మనసుశుద్ధి చెంది జ్ఞాపకశక్తి పెంపొందుతుందన్నారు. తద్వారా సమాజంలో వైద్యులుగా చక్కగా కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డా. సుందరం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. హరినాథాచారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati

2023-08-09 16:14:38