జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 19 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ డా. జి. సృజన చెప్పారు. సోమవారం టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ఉదయం 10.00 గం. నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించివాటిని సమస్య పరిష్కారానికి జెడ్సీలకు, సంబంధిత శాఖల అధికారులకు పంపించి మూడు రోజుల్లో నివేదికలు తయారు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఫిర్యాదుల్లో 1వ జోనుకు సంబందించి 04, 2వ జోనుకు సంబందించి 04, 3వ జోనుకు సంబందించి 03, 4వ జోనుకు సంబందించి 04, 5వ జోనుకు సంబందించి 02, 6వ జోనుకు సంబందించి 02, మొత్తము 19 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎ. వి. రమణి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ మంగపతి రావు, ప్రోజెక్ట్ డైరెక్టర్ (యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, సి.సి.పి. విద్యుల్లత, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎల్.ఎస్.జి. శాస్త్రి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన విద్యను అందించే దిశగా సిలబస్ రూపకల్పన చేయడం జరుగుతోందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఏయూ అకడమిక్ సెనేట్ సమావేశం జరిగింది. సెనేట్ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ ముందకు సాగడం జరుగుతోందన్నారు. అన్లైన్ బోధన విధానాన్ని అవలంభించామన్నారు. వర్సిటీలోని పలు విభాగాలు వెబినార్లను సమర్ధవంతంగా నిర్వహించాయన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో సైతం తమ విశ్వవిద్యాలయం ఆచార్యులు సమర్ధవంతంగా పరిశోధన ప్రాజెక్టలను సాధించడం శుభపరిణామమన్నారు. త్వరలో విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో సేవలు అందించే దిశగా, విద్యార్థులకు తరగతులు, పరీక్షల నిర్వహణకు విభిన్న వ్యూహాలను అవలంభించడం జరుగుతోందని వివరించారు.
నిస్వార్ధ ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనంగా టంగుటూరి ప్రకాశం పంతులు నిలుస్తారని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. టంగుటూరి ప్రకాశం జయంతిని ఆదివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించారు. ముందుగా టంగుటూరి చిత్రపటానికి వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటీషు వారికి ఎదురొడ్డి ప్రాణాలను సైతం దేశ స్వాతంత్య్రం కోసం అర్పించడానికి సిద్దపడిన ధీశాలిగా టంగుటూరి చరిత్రలో నిలచిపోయారన్నారు. ఆయన చూపిన ధైర్యం, తెగువ నేటి యువతకు ఆదర్శనమన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ది ఎంతో ఆదర్శనమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్, డీన్ ఆచార్య ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రానివాసరావు అన్నారు. ఆదివారం ఆయన సింహాచలంలో శ్రీ వారహ లక్ష్మి నృసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింహాచలం దేవస్థానంలో కనీవినీ ఎరుగని అభివ్రద్ధి చేయనున్నట్టు చెప్పారు. భక్తులకు సౌకర్యాలు పెంచడంతోపాటు, రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానంలా మార్పు చేయడానికా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారికి జరిగే సేవలను ప్రజలకు, పర్యాటకులకు తెలియజేసే కార్యక్రమం చేపడతామన్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు పూజలు, కప్పస్థంభం ఆలింగనం తరువాత తీర్ధ ప్రసాదాలను అందజేసి, వేదపండితులతో ఆశీర్వాదాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. ఆదివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శ్రీ టంగుటూరి ప్రకాశo పంతులు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశము పంతులు సేవా స్పూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి, సైమన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ తుపాకులకు ఎదురొడ్డిన ధీరుడు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం . వేణుగోపాలరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
విశాఖ స్టీలుప్లాంట్ నిర్వాసితుల ఆర్ కార్డ్ దారులు పడుతున్న ఇబ్బందులు తీర్చాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శుక్రవారం జెసిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆర్ కార్డు దారులు వారి కార్డులను బదిలీలు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడం ద్వారా వారికి మేలు చేసినట్టు అవుతుందని జెసికి వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన జెసి త్వరలోనే ఒక అధికారిని స్టీలుప్లాంట్ ఆర్ కార్డుల బదిలీ కోసం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గాజువాకలో ఎంత మంది ఎమ్మెల్యేలు పనిచేసినా ఆర్ కార్డుదారులకు న్యాయం జరగలేదు. తాజాగా ఇపుడు ఎమ్మెల్యే చొరవతో ఒక్కో అడుగు ముందుకి పడుతుంది. ఆర్ కార్డులు బదిలీ జరిగితే స్థానికులకు, నిర్వాసితులకు న్యాయం జరిగి, స్టీలు ప్లాంటులో ఉద్యోగాలు వచ్చే అకాశం ఏర్పడుతుంది. తద్వారా ఎన్నో ఏళ్ల నుంచి అరిష్క్రుతంగా ఉన్న సమస్య కూడా పరిష్కారం అవుతుందని నిర్వాసితులు పేర్కొంటున్నారు.
యువతకు ఆన్ లైన్ కోర్సులను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ చర్యలు చేపట్టిందని యువజన సర్వీసుల శాఖ (సెట్ శ్రీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికితీయడం, వారిలో వ్యక్తిత్వ వికాసాలను పెంపొందిచడం, యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలోని 15 నుండి 29 సం.ల మధ్య వయస్సు కలిగిన యువతీ, యువకులకు అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. ఉచిత యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో అంతర్జాలము వేదికగా ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలలో భాగంగా ప్రతీ రోజు యోగా, ధ్యానం కోర్సులు నిర్వహిస్తారని, మిగిలిన అంశములను వారంలో ఒక రోజు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్, బి.వి. పట్టాభిరామ్, గంపా నాగేశ్వరరావు తదితరులు నిర్వహిస్తారని వివరించారు. ఆసక్తి, అర్హత గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యక్తిత్వ వికాసాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందంచుకోవాలని శ్రీనివాస రావు కోరారు. అభ్యర్ధులు తమ వివరాలు - పేరు, తండ్రి పేరు, పుట్టిన తేది, ప్రస్తుత స్థితి, చిరునామా, మొబైల్ నెంబరు, ఈ మెయిల్ ఐడి, ఆధార్ నంబరు, శిక్షణ పొందుటకు ఆసక్తిగల అంశంను ఒక కాగితంపై రాసి పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించి, సంతకం చేసిన దరఖాస్తును స్కాన్ లేదా పి.డి.యఫ్ చేసి setsrisklm@gmail.com మెయిల్ అడ్రస్ నకు ఈ నెల 25 వ తేది లోగా పంపించాలని శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత కోర్సుల వివరాలపై సందేహాలు, వివరాలకు కార్యాలయం పని దినములలో సెట్ శ్రీ మేనేజరు బి.వి. ప్రసాదరావు (8341478815, 08942 240601) ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన ఎం.వి.రమణ సేవలు స్ఫూర్తిదాయకమని రెవిన్యూ అధికారులు, సిబ్బంది పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రెవిన్యూ అధికా రిగా బదిలీ అయిన రమణ గురు వారం బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. బదిలీపై వెళుతున్న రమణను శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్ అధికారులు, కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆర్.డి.ఓగా మంచి సేవలు అందించారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో మంచి మార్గదర్శకత్వం వహించారని, సూచనలు సలహా లతో విధులను విజయవంతంగా నిర్వహించుటకు తోడ్పడ్డాయని అన్నారు. కోవిడ్ ప్రారంభ దశ నుండి రేయింబవళ్ళు విధులు నిర్వహించి క్వారంటీన్ కేంద్రాల ఏర్పాటు, రవాణా ఏర్పాటులో విశేషమైన కృషి చేసారని ప్రశంసించారు. చివరకు అనారోగ్యం భారీన పడినప్పటికి త్వరగా కోలుకుని ఉద్యోగ నిర్వహణలో వెంటనే చేరడం ఆదర్శప్రా యమ న్నారు. బదిలీపై వెళుతున్న ఎం.వి.రమణ మాట్లాడుతూ శ్రీకాకుళంలో పనిచేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. శ్రీకాకుళం మరుపురాని అనుభూతిని కలిగించిందని అన్నారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ తో సహా అధికారులు, సిబ్బంది అందరూ చక్కటి సహకారం అందించడం వలన విధులు నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని, అటువంటి సమయంలో వారికి సేవలు అందించడం ఉద్యోగ నిర్వహణలో సంతృప్తికరమైనదని అన్నారు. జిల్లా కలెక్టర్ నివాస్ మంచి వసతులు కల్పించారని, వాటి పర్యవేక్షణలో భాగస్వామ్యం కావడం ఆనందం కలిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జర్నలిస్టులతో సమాజప్రగతి సాధ్యమని విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సీతమ్మధార వి.జె.ఎఫ్. వినోదవేదికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ ఏర్పాటుచేసిన మట్టివినాయక విగ్రహాలు, వృతకల్ప పుస్తకాలు, మొక్కల పంపిణీలో ఎం.వి.వి. ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా అన్ని పండుగలు జర్నలిస్టులు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వం తరపున తాము అండగా వుంటామని, జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తామని ఎం.వి.వి. చెప్పారు. గౌరవ అతిథిగా హాజరైన జి.వి.యం.సి. ప్రధానావైద్యాధికారి డాక్టర్ శాస్త్రి మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతిఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందరూ ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా వ్యవహారించాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తమ సభ్యుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్నారు. వినాయక చవితి పర్వదినంతో పాటు అన్నిపండుగలు జర్నలిస్టులు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం జర్నలిస్టులందరికీ స్వాతి ప్రమోటర్స్ సౌజన్యంతో విగ్రహాలు, వృతకల్పాలు పంపిణీ చేశామన్నారు. దీనితో పాటు మొక్కలు కూడా అందజేయడం జరిగిందన్నారు. వి.జె.ఎఫ్. కార్యదర్మి ఎస్. దుర్గారావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఆయా కార్యక్రమాలు విజయవంతంగా చేయగలుగుతున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తుమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. స్వాతి ప్రమోటర్స్ అధినేత మేడపాటి కిృష్ణారెడ్డి, ఎ.పి. డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.వి. మహేశ్వరరెడ్డి, వై.యస్.ఆర్. సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వి. నవీన్‌రెడ్డి తదితరులు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వి.జె.ఫ్. ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గసభ్యులు ఇరోతి ఈశ్వరరావు, దొండా గిరిబాబు, సనపల మాధవరావు, డేవిడ్‌రాజ్, శేఖరమంత్రి తదితరులు పాల్గొన్నారు.
వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో వర్షాలు బాగా కురుసి, పంటలు బాగా పండుతాయని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల మూలంగా ప్రతి రైతుకు ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. శుక్రవారం ఆయన భీమిలీ నియోజకవర్గం ఆనందపురం మండలం పాలవలస, బోని గ్రామాలలో , పద్మనాభం మండలం గంధవరం, భాందేవపురం, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి అందించారని ఈ క్రాప్ ద్వారా పంటల బీమా పథకం చేపట్టి రైతులందరికీ పూర్తి భరోసా కల్పించారన్నారు. అలాగే రేపు జరిగే వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని గట్టెక్కించాలని యధావిధిగా అందరం పనిచేసుకుని సంతోషంగా ఉండాలని వినాయకుడిని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో బీజేపీ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తామని సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజుకి తెలియజేశారు. శుక్రవారం విశాఖలో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం ఆయన రాష్ట్ర అధ్యక్షులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో బీజేపీ పార్టీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై యువజన విభాగం ద్వారా ఏ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారో వివరించారు. అంతేకాకుండా ఇకపై ఆ కార్యక్రమాన్ని తరచుగా చేపడుతూ, పార్టీపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తామని కూడా రామ్ కుమార్ సోముకి వివరించారు. ఇప్పటికే చాలా మంది పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పిన ఆయన ఇదే సమయంలో అన్నివర్గాల మెప్పుని చూరగొని 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి విజయకేతనం ఎగురవేయడానికి తమవంతు క్రుషి చేస్తామని వివరించారు. కొప్పలతోపాటు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు...
రైతులకు అన్నిరకాల సేవలు ఒకే దగ్గరే దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విశాఖపట్నం జిల్లా లోని భీమిలీ నియోజకవర్గం ఆనందపురం మండలంలోని పాలవలస, బోణీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైెఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు గత వైభవాన్ని తీసుకువస్తామన్నారు. వారికి గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు, మంచి ఉపాది కూడా చూపిస్తామని, వ్యవసాయం దండగ అనే నానుడికి చరమగీతం పాడేలా అశివ్రుద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం పద్మనాభం మండలం లోని గంధవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి, ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. "వైఎస్సార్ చేయూత" చెక్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన నిర్మాణపనులు నెలాఖరుకు పూర్తిగా ప్రారంభించి, మార్చి నెలాఖరుకు శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వుడా చిల్డ్రన్ ఎరీనా సమావేశమందిరంలో డ్వామా, పంచాయతీరాజ్, ఐ.టి.డి.ఎ., పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్, అంగన్వాడి కేంద్రాల భవనాలు ప్రహరీల నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య మిస్తున్నదని, ముఖ్యమంత్రి వీటి నిర్మాణాలపై శ్రద్దవహిస్తూ ఎప్పటి కప్పుడు పనులు పురోగతిని తెలుసుకుంటున్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వ అనుమతి పొందిన మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలన్నారు.
పథకాల వారీగా పనులను సమీక్షిస్తూ జిల్లాకు రూ.447 కోట్ల పనులు మంజురయ్యాయని, డిశంబరు నాటికి రూ.284 కోట్లు పనులు పూర్తిచేయుటకు ప్రణాళిక సిద్దం చేశారని, మార్చి నాటికి మిగిలిన రూ.163 కోట్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళిక తయారు చేసు కోవాలన్నారు. ప్రతి గురువారం పనుల పురోగతిని సమీక్షిస్తామని, మండల వారీగా ప్రతి వారం లక్ష్యం ప్రతిపాదించుకొని పూర్తి చేయాలన్నారు. సున్నా శాతం ఖర్చు చూపిస్తున్న అసిస్టెంటు ఇంజనీర్లకు షోకాజు నోటీసు జారీచేయాలని ఆదేశించారు. వారంరోజులలో వారికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు పూర్తయిన పనులకు బిల్లులను ఎప్పటి కప్పుడు సమర్పించాలన్నారు.
ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్, పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు సుధాకరరెడ్డి, డ్వామా ప్రోజెక్టు డైరెక్టరు ఇ. సందీప్, జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిని గూర్చి కలక్టరుకు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు గోవిందరాజులు, జిల్లా పంచాయతీ అధికారి వి. కృష్ణవేణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంటు ఇంజనీర్లు, డిఎల్.పి.ఒ.లు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలోని అన్ని బ్యాంకులు 24వ తేది నుంచి ఉదయం 10 గంటల నుంచి సా. 5గం.ల వరకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విశాఖలో కలెక్టర్ లో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు బ్యాంకులు ఉ.9 నుండి మ.2గంటల వరకు మాత్రమే సేవలందిస్తున్నాయి వై ఎస్ ఆర్ చేయూత చెల్లింపుల దృష్టా 24.8.20 నుండి అన్ని బ్యాంకులు ఉ. 10 గంటల నుండి సా. 5గంటల వరకు పని చేస్తాయని స్పష్టం చేశారు. అన్ని బ్యాంకుల వద్ద ఈ విషయం ప్రజలకు తెలిసేలా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
విశాఖజిల్లా నాతవరం మండలంలోని తాండవ జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. గురువారం ఆయన నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి తాండవ జలాశయం సందర్శించారు. కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ, జలాశయ ప్రాంతం అభివృద్ధి పై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారితో చర్చిస్తామన్నారు. అంతకు ముందు నాతవరంలో సచివాలయ భవనాల రైతు భరోసా కేంద్రం నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలు జాప్యంపై అధికారులను ప్రశ్నించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తాండవ జలాశయం ప్రాంతంలో బోట్ షికార్ ఏర్పాటుకు అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. దేవుని దయతో జలాశయం నిండి ఉందని ఈ సంవత్సరం పంటలు 15 శాతం అధిక దిగుబడి ఎక్కువ రాగలదని అంచనా వేశారు. మాధవ్ నగరానికి చెందిన ఆయకట్టు దారులు తమ గ్రామం నిర్వాసితులకు ఇచ్చిన పట్టాలు ఆధారంగా పాస్ పుస్తకాలు అందించి బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలాశయం డి.ఈ. రాజేంద్ర కుమార్, పి ఆర్ డి ఈ ప్రసాద్ రావు, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.