జర్నలిస్టులతో సమాజప్రగతి సాధ్యమని విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సీతమ్మధార వి.జె.ఎఫ్. వినోదవేదికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ ఏర్పాటుచేసిన మట్టివినాయక విగ్రహాలు, వృతకల్ప పుస్తకాలు, మొక్కల పంపిణీలో ఎం.వి.వి. ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా అన్ని పండుగలు జర్నలిస్టులు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వం తరపున తాము అండగా వుంటామని, జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తామని ఎం.వి.వి. చెప్పారు. గౌరవ అతిథిగా హాజరైన జి.వి.యం.సి. ప్రధానావైద్యాధికారి డాక్టర్ శాస్త్రి మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతిఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందరూ ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా వ్యవహారించాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తమ సభ్యుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్నారు. వినాయక చవితి పర్వదినంతో పాటు అన్నిపండుగలు జర్నలిస్టులు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం జర్నలిస్టులందరికీ స్వాతి ప్రమోటర్స్ సౌజన్యంతో విగ్రహాలు, వృతకల్పాలు పంపిణీ చేశామన్నారు. దీనితో పాటు మొక్కలు కూడా అందజేయడం జరిగిందన్నారు. వి.జె.ఎఫ్. కార్యదర్మి ఎస్. దుర్గారావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఆయా కార్యక్రమాలు విజయవంతంగా చేయగలుగుతున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తుమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. స్వాతి ప్రమోటర్స్ అధినేత మేడపాటి కిృష్ణారెడ్డి, ఎ.పి. డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.వి. మహేశ్వరరెడ్డి, వై.యస్.ఆర్. సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వి. నవీన్‌రెడ్డి తదితరులు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వి.జె.ఫ్. ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గసభ్యులు ఇరోతి ఈశ్వరరావు, దొండా గిరిబాబు, సనపల మాధవరావు, డేవిడ్‌రాజ్, శేఖరమంత్రి తదితరులు పాల్గొన్నారు.
వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో వర్షాలు బాగా కురుసి, పంటలు బాగా పండుతాయని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల మూలంగా ప్రతి రైతుకు ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. శుక్రవారం ఆయన భీమిలీ నియోజకవర్గం ఆనందపురం మండలం పాలవలస, బోని గ్రామాలలో , పద్మనాభం మండలం గంధవరం, భాందేవపురం, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి అందించారని ఈ క్రాప్ ద్వారా పంటల బీమా పథకం చేపట్టి రైతులందరికీ పూర్తి భరోసా కల్పించారన్నారు. అలాగే రేపు జరిగే వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని గట్టెక్కించాలని యధావిధిగా అందరం పనిచేసుకుని సంతోషంగా ఉండాలని వినాయకుడిని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో బీజేపీ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తామని సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజుకి తెలియజేశారు. శుక్రవారం విశాఖలో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం ఆయన రాష్ట్ర అధ్యక్షులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో బీజేపీ పార్టీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై యువజన విభాగం ద్వారా ఏ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారో వివరించారు. అంతేకాకుండా ఇకపై ఆ కార్యక్రమాన్ని తరచుగా చేపడుతూ, పార్టీపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తామని కూడా రామ్ కుమార్ సోముకి వివరించారు. ఇప్పటికే చాలా మంది పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పిన ఆయన ఇదే సమయంలో అన్నివర్గాల మెప్పుని చూరగొని 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి విజయకేతనం ఎగురవేయడానికి తమవంతు క్రుషి చేస్తామని వివరించారు. కొప్పలతోపాటు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు...
రైతులకు అన్నిరకాల సేవలు ఒకే దగ్గరే దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విశాఖపట్నం జిల్లా లోని భీమిలీ నియోజకవర్గం ఆనందపురం మండలంలోని పాలవలస, బోణీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైెఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు గత వైభవాన్ని తీసుకువస్తామన్నారు. వారికి గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు, మంచి ఉపాది కూడా చూపిస్తామని, వ్యవసాయం దండగ అనే నానుడికి చరమగీతం పాడేలా అశివ్రుద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం పద్మనాభం మండలం లోని గంధవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి, ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. "వైఎస్సార్ చేయూత" చెక్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన నిర్మాణపనులు నెలాఖరుకు పూర్తిగా ప్రారంభించి, మార్చి నెలాఖరుకు శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వుడా చిల్డ్రన్ ఎరీనా సమావేశమందిరంలో డ్వామా, పంచాయతీరాజ్, ఐ.టి.డి.ఎ., పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్, అంగన్వాడి కేంద్రాల భవనాలు ప్రహరీల నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య మిస్తున్నదని, ముఖ్యమంత్రి వీటి నిర్మాణాలపై శ్రద్దవహిస్తూ ఎప్పటి కప్పుడు పనులు పురోగతిని తెలుసుకుంటున్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వ అనుమతి పొందిన మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలన్నారు.
పథకాల వారీగా పనులను సమీక్షిస్తూ జిల్లాకు రూ.447 కోట్ల పనులు మంజురయ్యాయని, డిశంబరు నాటికి రూ.284 కోట్లు పనులు పూర్తిచేయుటకు ప్రణాళిక సిద్దం చేశారని, మార్చి నాటికి మిగిలిన రూ.163 కోట్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళిక తయారు చేసు కోవాలన్నారు. ప్రతి గురువారం పనుల పురోగతిని సమీక్షిస్తామని, మండల వారీగా ప్రతి వారం లక్ష్యం ప్రతిపాదించుకొని పూర్తి చేయాలన్నారు. సున్నా శాతం ఖర్చు చూపిస్తున్న అసిస్టెంటు ఇంజనీర్లకు షోకాజు నోటీసు జారీచేయాలని ఆదేశించారు. వారంరోజులలో వారికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు పూర్తయిన పనులకు బిల్లులను ఎప్పటి కప్పుడు సమర్పించాలన్నారు.
ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్, పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు సుధాకరరెడ్డి, డ్వామా ప్రోజెక్టు డైరెక్టరు ఇ. సందీప్, జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిని గూర్చి కలక్టరుకు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు గోవిందరాజులు, జిల్లా పంచాయతీ అధికారి వి. కృష్ణవేణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంటు ఇంజనీర్లు, డిఎల్.పి.ఒ.లు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలోని అన్ని బ్యాంకులు 24వ తేది నుంచి ఉదయం 10 గంటల నుంచి సా. 5గం.ల వరకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విశాఖలో కలెక్టర్ లో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు బ్యాంకులు ఉ.9 నుండి మ.2గంటల వరకు మాత్రమే సేవలందిస్తున్నాయి వై ఎస్ ఆర్ చేయూత చెల్లింపుల దృష్టా 24.8.20 నుండి అన్ని బ్యాంకులు ఉ. 10 గంటల నుండి సా. 5గంటల వరకు పని చేస్తాయని స్పష్టం చేశారు. అన్ని బ్యాంకుల వద్ద ఈ విషయం ప్రజలకు తెలిసేలా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
విశాఖజిల్లా నాతవరం మండలంలోని తాండవ జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. గురువారం ఆయన నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి తాండవ జలాశయం సందర్శించారు. కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ, జలాశయ ప్రాంతం అభివృద్ధి పై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారితో చర్చిస్తామన్నారు. అంతకు ముందు నాతవరంలో సచివాలయ భవనాల రైతు భరోసా కేంద్రం నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలు జాప్యంపై అధికారులను ప్రశ్నించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తాండవ జలాశయం ప్రాంతంలో బోట్ షికార్ ఏర్పాటుకు అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. దేవుని దయతో జలాశయం నిండి ఉందని ఈ సంవత్సరం పంటలు 15 శాతం అధిక దిగుబడి ఎక్కువ రాగలదని అంచనా వేశారు. మాధవ్ నగరానికి చెందిన ఆయకట్టు దారులు తమ గ్రామం నిర్వాసితులకు ఇచ్చిన పట్టాలు ఆధారంగా పాస్ పుస్తకాలు అందించి బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలాశయం డి.ఈ. రాజేంద్ర కుమార్, పి ఆర్ డి ఈ ప్రసాద్ రావు, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపిపిఎస్సీ) ఈ నెల 25 నుండి డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి తెలిపారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన జారీ చేస్తూ 25వ తేదీ నుండి సెప్టెంబరు 1వ తేదీ వరకు డిపార్టుమెంటల్ పరీక్షలను ఆన్ లైన్ మరియు కేంద్రాలలో వ్రాత పద్ధతిలో నిర్వహిస్తుందని చెప్పారు. 29, 30 తేదీలలో ప్రభుత్వ సెలవు దినం, ఐచ్ఛిక సేలవు దినం కారణంగా పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను జి.ఎం.ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు అండ్ టెక్నాలజి, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరల మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఆబ్జెక్టివ్ పరీక్షలు ఆన్ లైన్ ద్వారానే నిర్వహిస్తారని తెలిపారు. వ్రాత పద్ధతిలో నిర్వహించే పరీక్షలను ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని వివరించారు. ఏపిపిఎస్సీ సమకూర్చే బుక్ లెట్ లో జవాబులు వ్రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.
శ్రీకాకుళం జిల్లాను మలేరియా రహితంగా తయారుచేయుటకు సంపూర్ణ దోమల నివారణకు చర్యలు తీసికుంటున్నామని జిల్లా మలేరియా నివారణ అధికారి గొల్ల వీర్రాజు చెప్పారు.గురువారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో దోమల నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందించి, పగడ్బంధీగా అమలు చేస్తున్నామని అన్నారు.జిల్లాలో 368 గ్రామాలను హైరిస్క్ గ్రామలుగా గుర్తించి, పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో పిచికారీ చేస్తున్నామని అన్నారు.హై రిస్క్ ప్రాంతాల్లో లక్ష గంబుషియా చేపలను పెద్ద నీటి నిల్వ గల ప్రాంతాల్లో విడిచిపెట్టామని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో దోమల నివారణకు పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు మలేరియా బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ప్రతీ ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా చేసికుంటే దోమకాటుకు గురికాకుండా కాపాడుకోవచ్చు అని ఆయన తెలిపారు. జిల్లాలో29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక్క ఏజన్సీ ప్రాంతాల్లో ఉన్నాయని , గిరిజనులకు 50,900 దోమతెరలు పంపిణీ చేసామని, ఇందులో గిరిజన విద్యార్థులకు 12,900 దోమతెరలు అందించామని అన్నారు.దోమతెరలు వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రతపై ఏజన్సీ ప్రాంతాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు విడతల్లో మలేరియా పిచికారీ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. మొదట విడత పూర్తి స్థాయిలో జరిగిందని, రెండవ విడత ఆగస్టు 1 నుండి నుండి సెప్టెంబర్15 వరకు జరుగుతుందని ఆయన అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో దోనుబాయ్,కుసిమి ,పూతికివలస,పొల్ల గిరిజన ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని వీర్రాజు చెప్పారు.
భూమిలేని నిరుపేద గిరిజనులను గుర్తించి ప్రతీ గిరిజన కుటుంబానికి కనీసం రెండు ఎకరాలకు అటవీ హక్కుపత్రాలు అందించాలని గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌దండే స్పష్టం చేసారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతీ గిరిజన కుటుంబానికి కనీసం రెండు ఎకరాలకు హక్కుపత్రాలు పంపినీ చేయాలని ఆదేశించారన్నారు. గురువారం ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తాహశీల్దారులతో విజయవాడ నుంచి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31 వతేదీలో భూమిలేని గిరిజన కుటుంబాల సర్వే పూర్తి చేయాలని సూచించారు. అర్హులను గుర్తించి జిల్లా స్దాయి కమిటీ ఆమోదం పొందాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయపు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జి.కె. వీధి మండలంలో రెండురోజులు పర్యటించి వి ఎస్ ఎస్ భూములను పరిశీలించారని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ బాషా మాట్లాడుతూ గిరిజనుల సాగులో ఉన్న భూములకు వచ్చే అక్టోబరు 2 వతేదీన పట్టాలు పంపిణీ చేయడానికి సిద్దం కావాలన్నారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు హద్దులునిర్ధేశించి హద్దు రాళ్లను వేసి సంబందిత లబ్దిదారుడిని ఆ భూమిలో నిలబెట్టి పోటో తీసి వెబ్‌సెట్‌లో నమోదు చేయాలని చెప్పారు. భములు సర్వే చేసి వెబ్ సైట్‌లో ఏవిధంగా నమోదు చేయాలో వివరించారు. సర్వేలో వి ఆర్ ఓలు చేయవలసి పనులను,సర్వే విధానాన్ని తెలియజేసారు. ఈ సమావేశంలో ఐటిడి ఏ పి ఓ డా. వేంకటేశ్వర్ సలిజామల, ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి పూజలు ఇంటిలోనే నిర్వహించుకోవాలని జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వీధుల్లో వినాయక చవితి సంబరాలు ఏర్పాటు చేయరాదని ఆయన స్పష్టం చేసారు. వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆయన పేర్కొన్నారు. ఇంటిలోనే పూజలు నిర్వహించుకోవాలని ఆయన స్పష్టం చేసారు. వీధుల్లో సంబరాలు చేస్తే కరోనా వైరస్ వ్యాప్తికి కారణం కాగలరని, ఎపిడమిక్ చట్టం క్రింద చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. దీనిని ప్రజలు గమనించి సాంప్రదాయ బద్ధంగా కుటుంబం యావత్తు ఇంటిలోనే ప్రశాంతంగా పూజలు నిర్వహించుకుని భగవంతుని ఆశిస్సులు పొందాలని సూచించారు. అపార్టుమెంట్లు మరియు నివాస గృహాలలో ఏర్పాటుచేయు గణపతి విగ్రహములు 3 అడుగులు మించి ఉండరాదు. అట్లే వారి నివాస ప్రాంగణంలోనే సదరు ఉత్సవములు జరుపుకొనవలెను. ఆలయాల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకొనవలెను. అట్లే తీర్థ ప్రసాదములు పంచరాదు. ఏవిధమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ వైరస్ వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వినాయక మండపాలకు అనుమతి లేదు. వినాయక చవితి సందర్భంగా వీధులు, బజార్లలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని ఆయన కోరారు. వినాయకచవితిరోజు కాని, నిమజ్జనం రోజు కాని ఊరేగింపులు జరపడం, భక్తులు గుమిగూడి సమూహంగా నిమజ్జనం చేయడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదు. పై సూచనల పై గ్రామ/ మండల/ డివిజన్/ మున్సిపల్/ కార్పొరేషన్ పరిధిలో ఆయా శాఖల అధికారులు విధిగా గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీలను పిలిచి సమావేశం ఏర్పాటుచేసి కోవిడ్ మహమ్మారి కారణంగా నిభందనలు పాటించేలా అన్ని సూచనలు తెలియజేయాలన్నారు.
విశాఖలోని జర్నలిస్టులందరికీ మట్టి వినాయక ప్రతిమలు, వినాయక వ్రత కల్పం పుస్తకాలను పంపిణీ చేయనున్నట్టు విజెఎఫ్ అధ్యక్ష కార్యదర్శిలు గంట్లశ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు చెప్పారు. విశాఖలో గురువారం కార్యవర్గం మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ ఏడాది మాదిరిగానే ఈఏడాది కూడా విజెఎఫ్ సభ్యులందరికీ వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకంతోపాటు, మొక్కలను ఆగస్టు 21వ తేదిన సీతమ్మధారలోని నార్లభవన్ లో వీటిని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. జర్నలిస్టులిస్టలందరూ ఆరోగ్యంగా ఇంటివద్దనే వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుని కరోనా వైరస్ కు దూరంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా ప్రతీ ఒక్క జర్నలిస్టూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. వాటిని పూర్తిస్థాయిలో సంరక్షించడం ద్వారా కాలుష్య నియంత్రణలో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్క జర్నలిస్టూ రేపు నార్లభవన్ జరిగే కార్యక్రమానికి హాజరై వినాయక పత్రిమలను తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్ అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మేలు చేస్తుంటాయి. ఆ కోవకే వస్తారు శ్రీకాకుళం గ్రామసచివాలయ జెసి డా.కె.శ్రీనివాసులు ప్రభుత్వం గ్రామసచివాలయ ఉద్యోగాలకు నియామక పరీక్షలు నిర్వహిస్తున్న ఆగస్టు 20వ తేది నుంచే సచివాలయ ఉద్యోగులకు ఆన్ లైన్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అంటే ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు మళ్లీ గ్రామసచివాలయాల్లోని మెరుగైన ఉద్యోగాలకు పరీక్షలు రాయడానికి వీలుండదు. ఖచ్చితంగా శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వుంటుంది. సెలవులు కూడా పెట్టే అవకాశం వుండదు. తద్వారా జిల్లాలోని ఉద్యోగాలన్నీ భర్తీ కావడంతోపాటు, నిరుద్యోగులకు కాస్త పోటీ తగ్గినట్టు అయ్యింది. అంతేకాకుండా ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అలా కాకపోతే, ఉద్యోగంలో ఉన్నవారే మళ్లీ ఉద్యోగాలు రాసి ఇతర నిరుద్యోగులకు ఉద్యోగాలకు అడ్డంగా వస్తున్నారు. ఇలాంటి తంతు జరగకుండా శ్రీకాకుళం జెసి తీసుకున్న నిర్ణయం పట్ల నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కాగా ఇప్పటికే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి గొంతులో వెలక్కాయ్ పడినట్టు అవుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి శిక్షణా తరగతులు ఆన్ లైన్ లో పెడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయ్...మరి ఇతర జిల్లాల్లో అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి...
శ్రీకాకుళం జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖలో సమన్వయకర్తల పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని గ్రామ, వార్డు సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ప్రజల చెంతకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించుటలో భాగంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధ ఏర్పాటు చేసిన సంగతి విదితమేనని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేయుటకు జిల్లా సమన్వయకర్త , సహాయ జిల్లా సమన్వయకర్త, పట్టణ సమన్వయకర్త పోస్టులను మంజూరు చేసారని బుధ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను డిప్యుటేషన్ లేదా నేరుగా భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. అర్హులైన అభ్యర్ధులు వారం రోజులలోగా వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేయవచ్చని ఆయన తెలిపారు. జిల్లా సమన్వయకర్తకు రూ.36 వేలు, సహాయ జిల్లా సమన్వయకర్త, పట్టణ సమన్వయకర్త పోస్టులకు రూ.27 వేలు పే స్కేలుగా నిర్ణయించారని చెప్పారు. ఈ బృందం గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధల ద్వారా జరుగుతున్న కార్యక్రమాల వివరాలు సేకరించడం, విశ్లేషించడం, అందులో మెరుగ్గా చేప్టటుటకు అవకాశాలు గుర్తించడం, బలహీనతలు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు గుర్తించడం తదనుగుణంగా విశ్లేషణ చేసి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం చేయాల్సి ఉంటుందని డా.శ్రీనివాసులు తెలిపారు. జిల్లా సమన్వయకర్త నివేదికలను జాయింట్ కలెక్టర్ కు, రాష్ట్ర సమన్వయకర్తకు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. పథకం వారీగా, కార్యక్రమం వారీగా విశ్లేషించాలని పేర్కొన్నారు. కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేయుటకు అవసరమగు వ్యవస్ధాపరమైన, యాజమాన్యపరమైన, అభివృద్ధి పరమైన నైపుణ్యాలను మైక్రోసాఫ్ట్ ఆఫీసు కార్యక్రమాల ద్వారా రూపొందించే సామర్ధ్యం ఉండాలని పేర్కొన్నారు.
జిల్లా సమన్వయకర్త పోస్టుకు కంప్యూటర్ స్పెషలైజేషన్ తో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పోస్టుగ్రాడ్యుయేషన్ తోపాటు డేటాను విశ్లేషణ, మంచి ప్రెజెంటేషన్ లు తయారు చేయు సామర్ధ్యం, ఎం.ఐ.ఎస్ నివేదికలు తయారు చేయు సామర్ధ్యం కలిగి ఉండాలన్నారు. సహాయ జిల్లా సమన్వయకర్త, టౌన్ సమన్వయకర్త పోస్టులకు కంప్యూటర్ స్పెషలైజేషన్ తో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పోస్టుగ్రాడ్యుయేషన్ అభ్యర్ధులు అర్హులన్నారు. జిల్లా సమన్వయకర్త పోస్టుకు జిల్లా యంత్రాంగానికి డేటా విశ్లేషణ నైపుణ్యాలు, ఎం.ఐ.ఎస్ నివేదికల తయారీ చేసిన అనుభవానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు. సహాయ జిల్లా సమన్వయకర్త, టౌన్ సమన్వయకర్త పోస్టులకు పేరుగాంచిన సంస్ధలలో సంబంధిత రంగంలో కనీసం ఒక ఏడాది అనుభవం ఉండాలని చెప్పారు. అభ్యర్ధుల గరిష్ట వయస్సు 50 సంవత్సరాలకు మించరాదని అన్నారు. ఎస్.సి, ఎస్.టి అభ్యర్ధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుందని తెలిపారు. అనుభవం, ఆసక్తిగల అభ్యర్ధులు తమ దరఖాస్తులను 7 రోజుల లోగా వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ కు సమర్పించాలని డా.శ్రీనివాసులు తెలిపారు.
సింహాచలం దేవస్థానం ఈవోగా ఎం.వెంకటేశ్వరరావు పనిచేసిన కాలంలో జరిగిన అక్రమ తవ్వకాలు, అవినీతి వ్యవహారాలపై విజిలెన్స్ విచారణ గురువారం ప్రారంభమైంది. విశాఖ సింహాచలం దేవస్థానం భూములు, ఘాట్ రోడ్డులో తవ్విన గ్రావెల్ అవినీతిపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది. ఆ విభాగం ఏఎస్పీ బి.లక్ష్మీనారాయణ, డీఎస్పీ ఎ.నరసింహమూర్తి నేతృత్వంలో సర్వే శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ గోపాలరాజు ఆధ్వర్యంలో ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే నిర్వహించారు. ఇక్కడి కొండను ఎంత తవ్వారు? వీటికి అనుమతులున్నాయా.. ఉంటే ఆ మేరకే తవ్వకాలు జరిగాయా? గ్రావెల్‌ను ఎక్కడికి తరలించారు? ఇలా పలు అంశాలు పరిశీలిస్తామని ఏఎస్పీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వీటి ఆధారంగా మిగిలిన అంశాలపైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈఓ స్థాయి అధికారిపై విచారణ జగరడంతో ఇతర విభాగాల అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరిపై వేటు పడుతుందోనని అంతా బిక్కు బిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు.