కరోనా సోకిన జర్నలిస్ట్ లు ఆందోళన చెందవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ పులవర్తి ప్రభు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన కరోనా సోకిన జర్నలిస్టులకు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా బెడ్స్ కేటాయించినట్లు చెప్పారు. ఈ ఆవకాశం సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు. జర్నలిస్టులుకు అందుబాటులో డిపిఆర్ ఓ,నోడల్ ఆఫీసర్ ను నియమించామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులు నేరుగా నోడల్ అధికారిని కలిస్తే, ఆసుపత్రిలో చేర్పించడం దగ్గర నుంచి వైద్యం అందించే విషయంలో సహాయ సహకారాలు అందిస్తారన్నారు. ఈ విషయంలో ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అటు ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రులు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారన్న కలెక్టర్ జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు...
విశాఖ మహా నగరంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం వున్నందున, వ్యాధుల నియంత్రణకు, నివారణకు కావలసిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులకు ఆదేశించారు. గురువారం ఈ మేరకు అధికారులు, వార్డు కార్యదర్శదర్శిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి సోమవారం వార్డు సెక్రటరీలతో టెలీకాన్ఫరెన్స్ జరుపుతానన్నారు. కోవిడ్ సోకినవారి ఇళ్ల వద్ద తప్పనిసరిగా సోడియమ్ హైపో క్లోరైట్ ద్రావకం చల్లించే ఏర్పాట్లు చేయాలని సి.ఎం.ఓ.హెచ్.ఓ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని కమీషనర్ ఆదేశించారు. అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, స్వచ్ఛ సర్వేక్షన్ - 2021 పవర్ పాయింట్ లో వివరించిన అంశాలను అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్ పెక్టర్లు తప్పకుండా ఆ విధులను పాటిస్తూ, నగర పరిశుభ్రతకు, పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో, అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, బయోలజిస్టు, శానిటరీ సూపెర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
స్వఛ్చ సర్వేక్షణ్-2021లో విశాఖపట్నం ఉత్తమ ర్యాంకు సాధన దిశగా అందరం పని చేయాలని జి.వి.యం.సి. కమీషనర్ డా. జి. సృజన అన్నారు. గురువారం స్వఛ్చ సర్వేక్షణ్- 2021 నందు పొందుపరచిన అంశాలపై వుడా చిల్డ్రన్ ఎరీనాలో అధికారులతో కమీషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, గత సంవత్సరం విశాఖపట్నానికి 9 వ ర్యాంకు సాధనకు కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. జరుగనున్న స్వఛ్చ సర్వేక్షణ్ లో విశాఖ మరింత మెరుగైన స్థానం సాధించడానికి విశేషంగా క్రుషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటినుండి వేరు చేసిన చెత్తనే సేకరించాలని, చెత్తను తీసుకుని సిబ్బంది వేరు చేయకూడదన్నారు. ప్రతీ ఇంటిలో చెత్తను వేరు చేయడం, తడి చెత్తనుండి సేంద్రియ ఎరువును తయారు చేయడం వాటిపై ప్రజలకు ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు జరపాలన్నారు. నివాసిత సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ విధులలో నిర్లక్ష్యం వహించిన కారణంగా సోంపేట పరిధిలోని 19 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగిస్తున్నట్లు వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రతి వాలంటీరుకు కోవిడ్ లో నిర్వహించాల్సిన విధులను స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతి వాలంటీరు తన పరిధిలోని 50 గృహాలను ప్రతి రోజు విధిగా సందర్శించి ఏ ఇంటిలోనైనా కోవిడ్ లక్షణాలు ఉంటే తక్షణం తెలియజేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కాని సోంపేట సచివాలయం – 1 లో 52 మంది వాలంటీర్లకు గాను 15 మంది గైర్హజరు అయ్యారని, అదేవిధంగా సోంపేట సచివాలయం – 2 లో 28 మంది వాలంటీర్లకు గాను 4 గురు గైర్హజరు అయినట్లు మండల తహశీల్ధారు రిపోర్టు చేసినట్లు ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా 19 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగించామని జాయింట్ కలెక్టర్ వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
విశాఖలో కరోనాతో పోరాడుతూ మ్రుతిచెందిన డాక్టర్ బి.పురుషోత్తం (56) నకు ఆంధ్ర వైద్య కళాశాల, కింగ్ జార్జి ఆసుపత్రి వైద్యులు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ పురుషోత్తం నైపుణ్యం కలిగిన వారని, నిబద్ధతతో పనిచేసే వారని, వృత్తినే దైవంగా భావించి వైద్యవృత్తిలో నిరంతరం శ్రమించే వారిని వక్తలు కొనియాడారు. 22 సంవత్సరములు అకుంఠిత దీక్షతో వైద్య కళాశాల, కెజిహెచ్ లో వైద్య సేవలు అందించారన్నారు. వైద్య కళాశాల ఆచార్యులుగా చిరస్మరణీయమైన సేవలు అందించాలని, సహచర వైద్యులు, వైద్య విద్యార్థుల ఆదరాభిమానాలను చూరగొన్నారని ప్రశంసించారు. ప్రతిభావంతుడు, ఉత్తమ గురువు, ప్రజ్ఞ వంతుడైన వైద్యుడు అయిన పురుషోత్తమం హటాత్ మరణం వైద్య కుటుంబానికి తీరని లోటని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి వి సుధాకర్ నేతృత్వంలో వైద్య కళాశాల కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులు కొవ్వొతులను వెలిగించి నివాళులు అర్పించారు.
ఇంజినీరింగ్ అధికారులు మీ నిర్లక్ష్యం ధోరణి మార్చుకోకపోతే ఇక ఉపేక్షించేది లేదు..వందల కోట్లు రూపాయలు నియోజకవర్గం అభివృద్ధికి తీసుకు వస్తుంటే...పనులు చేపట్ట కుండా ఎందుకు అలసత్వం వహిస్తున్నారో అర్ధం కావడం లేదు..సెప్టెంబర్ 3 నుంచి ఏలూరు నియోజకవర్గం లో పనులు స్వయంగా పరిశీలిస్థా... ఎక్కడైనా అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఉంటే ఇంజినీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు... ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం NREGS పనులు ప్రగతిపై పంచాయతీ రాజ్, RWS ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద చేపట్టిన పనులు శర వేగంగా పూర్తి చేయాలని నవంబర్ నెలఖరు కు మంజూరు అయినపనులు పూర్తి చేస్తే మళ్ళీ కొత్తగా కొన్ని వర్క్ లకు నిధులు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందని మంత్రి ఆళ్ల నాని చేప్పారు..
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ – 19 పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం కిట్లను సమకూర్చుతుందని, వాటితో నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే కోవిడ్ నమూనా కిట్లను కొంత మంది విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పలాస సామాజిక ఆసుపత్రిలో లాబ్ టెక్నీషియన్లు గిన్ని నారాయణ, సల్లా శ్యామ్ కుమార్., పలాస ముఖ్య మంత్రి ఆరోగ్య కేంద్రం లాబ్ టెక్నీషియన్ గునితి వెంకట రమణ కోవిడ్ - 19 రాపిడ్ కిట్లను రూ. 2 వేలు చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు లాబ్ టెక్నీషియన్లను సస్పెన్షన్ చేసామని, వారిపై క్రిమినల్ కేసుకు ఆదేశించామని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎంతో నిబద్ధత, అంకితభావంతో కోవిడ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటి సర్వేలో కరోనా వ్యాధి లక్షణాల వ్యక్తులను గుర్తించాల్సిందేనని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. బలగ, ఆదివారం పేట వార్డు సచివాలయాల పరిధిలో సప్త వార ప్రక్రియ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ గురు వారం పరిశీలించారు. ప్రతి ఇంటిని సర్వే చేపట్టాలని ఆయన అన్నారు. కరోనా లక్షణాలు గల ఏ ఒక్క వ్యక్తి ఉన్నా గుర్తించాలని ఆయన స్పష్టం చేసారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలన్నారు. 50 ఏళ్ళకు పైబడిన వయస్సుగల వారిలో వైరస్ లక్షణాలు ఉన్నవారిని కూడా గుర్తించాలని సూచించారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో కంటైన్మెంటు జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ నమూనాల సేకరణ, పాజిటివ్ కేసుల వివరాలు, కంటైన్మెంటుజోన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు టి.వేణుగోపాల్, టి.వి.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులలోని మెడికల్ షాపు ల్లో జనరిక్ మందులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. బర్డ్ ఆసుపత్రిలో ని జనరిక్ మందుల షాపు ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంఆర్‌పి ధరలు, రోగులకు ఇస్తున్న ధరలను పరిశీలించారు. ఈ మందులు 50 శాతం దాకా తక్కువ ధరకు వస్తున్నందువల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. టీటీడీ కి చెందిన ఆసుపత్రుల్లోని అన్ని మెడికల్ షాపుల్లో ఈ మందు లే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జెఈవో బసంత్ కుమార్ ను ఆదేశించారు. టీటీడీ ఆసుపత్రుల్లో కూడా వీటినే ఉపయోగించాలని అన్నారు. ఈ మేరకు అన్ని ఆసుపత్రులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలపై మందులు కొనుగోలు భారం పడకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే మందులు నాణ్యమైనవనే నమ్మకం ప్రజల్లో తీసుకురావాలన్నారు. జనరిక్ మందుల వాడకాన్ని మరింతగా పెంచాలన్నారు.
ప్రభుత్వం భూముల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని జిల్లా కలక్టరు తెలిపారు. గురువారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మద్య కాలంలో భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువ పిర్యాదులు అందుతున్నాయని, వాటిని ఎట్టిపరిస్థితులలోను ఉపేక్షించకూడదన్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ అధికార్లు గ్రామాలలో గల ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలు 22ఎ లో నమోదు చేయాలని తెలిపారు. మండల తహశీల్దార్లు సెప్టెంబరు 1 నుండి 10 వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ భూములు, వాటి ప్రస్తుత స్థితి వివరాలను సేకరించాలని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణను గుర్తించినట్లయితే ఆక్రమణదారులపై తక్షణం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్లు ఫైల్ చేయాలని, కోర్టునకు సమర్పించిన పిదప అక్నాలడ్జ్మెంటు తీసుకొని, కలెక్టరు కార్యాలయంనకు అందజేయాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వార్తా పత్రికలలో వచ్చే నెగిటివ్ వార్తలు పై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సదరు నివేదికలను జాయింటు కలెక్టరు కు పంపించాలన్నారు. పత్రికలలో వార్తకు రిజాయండరు జారీ చేయాలని అదికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టరు ఎం. వేణు గోపాలరెడ్డి, జి.వి.ఎం.సి. కమీషనరు జి.సృజన, ఐ.టి.డి.ఎ. పోజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, నర్సీపట్నం సబ్ కలక్టరు ఎ.మౌర్య, జిల్లా రెవిన్యూ అధికారి ప్రసాద్, సూపరింటెండెంట్ ఎం .సూర్యకళ ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరకంబాడి రోడ్డు నుంచి రేణిగుంట రోడ్డు కు అనుసంధానం కోసం మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఇతర అంశాలను క్షేత్రస్థాయిలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ,జనచైతన్య లేఔట్ నుండి డి.బి.ఆర్. రోడ్డు 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు మాస్టర్ ప్లాన్ నిర్మాణం విషయమై సమగ్ర సర్వే జరిపి నివేదిక సమర్పించాలన్నారు. నగరపాలక సంస్థ శివార్లలో ఉన్న కాలనీలకు, రెండు ప్రధాన రహదారులను ఏర్పాటు చేయడం వలన లీలామహల్, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం దగ్గర రద్దీని తగ్గించేందుకు వీలవుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ మాస్టర్ ప్లాన్ కోసం కొంక చెన్నయ్య గుంట, రవీంద్ర నగర్ లకు సంబంధించిన ఫ్లాట్ యజమానులు, రైతులు సదరు సర్వే ను సంబంధిత రికార్డులతో మాస్టర్ ప్లాన్ రోడ్డు కు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితోపాటు సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం, మున్సిపల్ సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కరోనాను అరికట్టడంలో తమవంతు సాయం అందజేస్తామని లయ న్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ రాజు అన్నారు. సంస్థ ప్రతినిధులు గురువారం రూ.10లక్షల విలువ చేసే 3 హై ఫ్లో నేసల్ కాండీలా తెరఫీ ఆక్సిజన్ పరికరాలను కేజీహెచ్ కు విరాళంగా అందజేశారు. వీటిని కలెక్టర్ వినయ్ చంద్ సమక్షంలో కేజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టీ విజయ్ కుమార్ రాజు మాట్లాడుతూ వైద్య సేవలు విస్తరణలో మరింత అధునాతన పరికరాలు అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి గవర్నర్ ఉషారాజు, ఫౌండేషన్ ఏపీ కౌన్సిల్ చైర్మన్ శ్రీనివాస రావు, మాజీ చైర్మన్లు ఏవీఆర్ ప్రసాద్, డీఎస్ఎస్వి వర్మ, ఐఎంఏ జిల్లా కో ఆర్డినేటర్ డా.గోవిందరాజులు, సెక్రటరీ డా.ఫణీందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయాలలో గల ఖాళీల భర్తీకి సెప్టెంబరు 20 నుండి 26 తేదీవరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. పరిక్షలకు సుమారు లక్షాయాబది వేల మంది హాజరగుచున్నారని, పరీక్షల నిర్వహణకు 8 క్లస్టర్లుగా విభజించి, 330 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలియజేసారు. ఈ సంధర్బంగా అధికారులకు కలెక్టరు పలు సూచనలు చేసారు. పరీక్షలకు కావలసిన ట్రంకు బాక్సులు, ఇతర మెటీరియల్ వెంటనే సమకూర్చుకోవాలన్నారు. సెప్టెంబరు 1 తేదీకి కావలసిన మెటీరియల్ తెప్పించుకోవాలని తెలిపారు. స్ట్రాంగు రూం లేఅవుట్ తీసుకోవాలని, మెటీరియల్ పంపిణీలో గందరగోలం లేకుండా చూసుకోవాలన్నారు. శాటిలైట్ స్ట్రాంగ్ రూం లకు 18వ తేదీనే మెటీరియల్ పంపించాలని సూచించారు. పరీక్షరోజున స్ట్రాంగ్ రూం నుండి మెటీరియల్ పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరే విధంగా రూట్ మ్యాప్, ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా ఉండదని, దానిని బట్టి ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన వాహనాలు సమకూర్చు కోవాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పాలుపంచుకొనే శాఖలన్నిటిని సమన్వయం చేసుకొని పరీక్షల నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణపై ఇతర శాఖలతో సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టరు ఎం. వేణు గోపాలరెడ్డి, జి.వి.ఎం .సి . కమీషనరు జి. సృజన, ఐ.టి.డి.ఎ. పోజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, నర్సీపట్నం సబ్ కలక్టరు ఎన్.మౌర్య, జిల్లా రెవిన్యూ అధికారి ప్రసాద్, జిల్లా పరిషత్ సిఈవో నాగార్జునసాగర్ జిల్లా పంచాయతీ అధికారి, ఆంధ్రా యూనివర్శిటీ, ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎమ్.ఆర్ పల్లి వైకుంఠపురం ఆర్చి వద్ద శాశ్వత కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ గిరీష ఆదేశించారు. గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి, జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరుగుతున్న పనుల్లో ఎక్కడ తేడా వచ్చినా అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కోవిడ్ 19( కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడం కోసం ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ని తాత్కాలికంగా ముయించామన్నారు. నగర ప్రజలకి ఆయా వార్డుల్లో అందుబాటులో కోసం తాత్కాలికంగా 9 ప్రదేశాల్లో తాత్కాలిక కూరగాయలు మార్కెట్ ఏర్పాటుచేశామని వివరించారు. ఎంఆర్ పల్లి వాసుల కోసం కొత్తగా వైకుంఠపురం ఆర్చి వద్ద సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఈ మార్కెట్ లో 36 షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్ఈ చంద్రశేఖర్, నగరపాలక అధికారులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2021 కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఈ మేరకు డివిజను అధికారులు, తహశీల్దార్లు, ఇ.ఆర్.ఒ., ఎ.ఇ.ఆర్.ఒ. లతో జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, 2021 సంవత్సరానికి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలు ప్రకారం ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. జనవరి 2021 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారు, ఓటర్ల జాబితాలో పేరు లేనివారి నమోదు, మరణించిన వారి పేర్లు తొలగింపు, కార్యక్రమం చేపట్టాలన్నారు. ఓటరు ఫోటో క్లియర్ గా ఉన్నది లేనిది పరిశీలించాలన్నారు. ఒకే పేరుతో ఎక్కువ కార్డులు ఉంటే మొదట జారీ చేసిన కార్డు ఉంచి మిగిలిన కార్డులు తొలగించాలన్నారు. అదే విధంగా ఒకే నంబరుతో వేరువేరు వ్యక్తులకు కార్డులు జారీ అయితే మొదట జారీ చేసిన వ్యక్తికి ఉంచి మిగిలిన వారికి కొత్త కార్డులు జారీ చేయాలని తెలిపారు. పోలింగు బూతుకు 1500 ఓటర్ల ప్రకారం సర్దుబాటు చేయాలన్నారు. అవసరమైన చోట కొత్త పోలింగు కేంద్రాలు గుర్తించాలన్నారు. పాడయిన పోలింగు కేంద్రాల స్థానంలో కొత్త పోలింగు కేంద్రాలు ఏర్పాటుకు నిబంధనల ప్రకారం నడచుకోవాలన్నారు. కొత్త పోలింగు కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు, అభ్యంతరాలు, మార్పులకు సంబంధించి డిశంబరు 15 వరకు వివిధ దశలలో జనవరి 5, 2021 వరకు పరిష్కరించి, జనవరి 15, 2021 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్దం చేయాలని తెలిపారు.