కోవిడ్ విధులలో నిర్లక్ష్యం వహించే వారిని జిల్లా యంత్రాగం తీవ్రంగా పరిగణిస్తోంది. వీరఘట్టాం మండల కేంద్రంలో గ్రామ సచివాలయం -2 లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల విధులు నిర్వహించాల్సిన ఇంజనీరింగు సహాయకుడు జి.వెంకటేష్ విధులకు హాజరు కానందున సస్పెన్షన్ చేయగా, తనకు అప్పగించిన పంచాయతీల క్లష్టర్లలో విధులకు హాజరు కాని క్లష్టర్ సర్వేలియన్స్ అధికారి, బిటివాడ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పి.చైతన్య శంకర్ ను సస్పెన్షన్ చేసారు. ఈ మేరకు వార్డు, గ్రామ సచివాలయాలు, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ అయిన ఇద్దిరితోపాటు క్లష్టర్ సర్వేలియన్స్ అధికారి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఓ) జి.పైడితల్లి సక్రమంగా పర్యవేక్షక విధులు నిర్వహించని కారణంగాను., ఇఓ పి.ఆర్.డి, పంచాయతీ కార్యదర్శి మరియు సచివాలయం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి పి.రాజ్ కుమార్ తమకు కేటాయించిన క్లష్టర్లలో సర్వేలియన్స్ పనులలో పర్యవేక్షణలో లోపం కారణంగా షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. కోవిడ్ విధులకు నియమించిన అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు. కోవిడ్ విధులను బాధ్యతతో, విద్యుక్త ధర్మంతో నిర్వహించి ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ విధులను అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని, ఎటువంటి నిర్లక్ష్యం వద్దని ఆదేశాలు జారీ చేస్తున్నా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండటం విచారకరమని ఆయన అన్నారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో రేయింబవళ్ళు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసామని, అవి విధిగా రేయింబవల్ళు పనిచేయాల్సిందేనని శ్రీనివాసులు తెలిపారు. ప్రతి క్షణం అప్రమత్తత అవసరమని పేర్కొంటూ ప్రతి ఇంటిలో ఫీవర్ సర్వే జరగాల్సిందేనని, కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణం ఆసుపత్రిలో చేర్చాలని ఆదేశించారు. ఆసుపత్రిలో కనీసం వారం రోజుల పాటు చికిత్స పొందే పరిస్ధితి ఉండాలని చెప్పారు. ఇళ్ళలో చివరి క్షణాల వరకు కరోనా లక్షణాల వ్యక్తులు ఉంటే అందుకు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులదే బాధ్యత అని స్పష్టం చేసారు. ప్రజలు కూడా తమకు లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వాలంటీరుకు, సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్ కు తెలియజేసి సహాయం పొందాలని కోరారు. కరోనా వివక్ష ఉంటుందనే ఆలోచనతో ప్రాణాల మీదకు తెచ్చుకోరాదని ఆయన పిలుపునిచ్చారు. వివక్ష చూపే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు చిన్నవిగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవడం వలన కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా ఇంటికి చేరవచ్చని సూచించారు. అధికారులు, సిబ్బంది ఇచ్చిన సూచనలు ప్రజలు పాటించాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని అన్నారు.
కొత్త గాజువాక రాజీవ్ మార్గ్ లో వేంచేసియున్న శ్రీ సత్తమ్మతల్లి అమ్మవారి పండగ సందర్భంగా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.సత్తమ్మతల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 65 వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి) విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులంతా కరోనా వైరస్ సందర్భంగా సామాజిక దూరం పాటిస్తూనే అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం అమ్మవారి చరిత్రను తెలిపే పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఉత్సవ పర్యవేక్షకులు మద్దాల అప్పారావు,సూరిశెట్టి శివ, శరగడం కోటి, హరనాధ్,సత్తిబాబు, నర్సింగరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతీ నిరుపేదకు బాసటగా నిలుస్తుందని విశాఖ ఎంపీ ఎవీవీ సత్యన్నారాయణ అన్నారు. ఆదివారం ఆసుపత్రుల్లో అనారోగ్యాల నిమిత్తం చేరి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కలను విశాఖ లా సన్స్ బే కాలనీ పార్టీ ఆఫీస్ లో రూ. 2.52 లక్షలవిలువైన చెక్ లను ఆరుగురు లబ్ధిదారులకు అందజేశారు . రేసపువానిపాలానికి చెందిన పూసర్ల వెంకటేశ్వరరావు కి రూ.1లక్ష, వినాయక నగర్ కి చెందిన ఉప్పాడ రమణమ్మ కి రూ.55 వేలు, రాజీవ్ నగర్ కి చెందిన మల్లూరి నారాయణ రావు కి రూ.40 వేలు ,ఎంవీపీ కాలనీ కి చెందిన కొర్రా ప్రభావతి కి రూ.25 వేలు ,పండా వీధికి చెందిన నాయన ఉపేంద్ర కి రూ.17 వేలు , గాజువాక కి చెందిన పైడి మాదాన్స్ నివాస్ కి రూ. 15 వేలు చెక్ లను అందజేశారు. ఈ సందర్భంగా చెక్ గ్రహీతలు ఎంవీవీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. తమని ఈ కష్టకాలంలో ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ నులుపురుగుల దినోత్సవం (డీ వార్మింగు డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్య తెలిపారు. జాతీయ నులి పురుగుల దినోత్సవంలో భాగంగా కార్యక్రమాన్ని 17వ తేదీ నుండి 20 వ తేదీ వరకు నాలుగు రోజులు జరుపుటకు ప్రభుత్వం నిర్థయించిందన్నారు. జిల్లాలో 1వ సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు డీ వార్మింగ్ మాత్రలు (ఆల్చెండజోల్ 400 మీ.గ్రా) నమిలి చప్పరించి తినిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2 సంవత్సరాల వరకు అర (1/2) మాత్ర,, 2 నుండి 19 సంవత్సరాల వయస్సులోపు ఉన్న బాలబాలికలకు అంగన్ వాడి కార్యకర్త, ఆశా, ఎ.ఎన్.ఎమ్ ద్వారా గ్రామములో బాల బాలికలు అందరికి ఈ మాత్రలు వేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ గ్రామములో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన ప్రణాళిక పద్ధతిలో కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయిన తరువాత మరియు మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతీ ఒక్క బాల బాలికలకు ఒక మాత్ర (ఆల్బెండజోల్ - 400 మీ.గ్రా) నమిలి చప్పరించి తినిపించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశాకార్యకర్త, ఏ. ఎస్.ఎమ్ తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది అంగన్ వాడీ కార్యకర్తల సమన్వయంతో భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు గ్లౌసు ధరిస్తూ సానిటైజర్ రాసుకుంటూ, తల్లిదండ్రులు సమక్షంలో దగ్గర వుండి మాత్రలు తినిపించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 1 నుండి 2 సంవత్సరా వయస్సు గల బాలబాలికలు 52,398 మంది, 3 నుండి 5 సం.ల వయస్సు గల బాలబాలికలు 92,193 మంది, 6 నుండి 10 సం.ల వయస్సు గల బాలబాలికలు 1,93,565 మంది, 11 నుండి 19 సం.ల వయస్సు గల బాలబాలికలు 2,53,240 మంది వెరశి 5,91,397 మంది ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందన్నారు. మాత్రలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారుల పర్యవేక్షణలో అన్ని ఉప కేంద్రాలకు సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. ప్రతీ గ్రామములో ఆశాకార్యకర్తలు, అంగన్ వాడీ కార్యకర్తలు, స్వచ్చంద సేవా సంఘాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండల పరిధిలో పి.హెచ్.సి వైద్యాధికారి, ఎం.పి.డి.ఒ, ఎం.ఇ.ఒ, సి.డి.పి.ఒ, సి.ఆర్.పి. పర్యవేక్షణ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ మాత్రలు వేసుకొనడం వలన ఏ విధమైన ఔషద దుష్పరిణామాలు ఉండవని, ఒకవేళ ఔషద దుష్పరిణామాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పి. హెచ్.సి. వైద్యాధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా సమన్వయ అధికారిగా, రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమము ప్రోగ్రాం ఆఫీసర్స్, జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి, ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.
విశాఖనగర పోలీస్ కమీషనర్ ఆర్కేమీనా విశాఖ నుంచి డీజీపీ ఆఫీసుకు బదిలీ అయిన సందర్భంగా వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఘనంగా ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, పోలీస్ కమీషనర్ గా విశాఖ నగరాన్ని శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. కరోనావంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు,సిబ్బందికీ అన్నివిధాలుగా అందించిన సేవలకు విశాఖవాసులు ఎంతగానో మిమ్మల్ని గుర్తుంచుకుంటారని అన్నారు. ఆర్కేమీనాలాంటి నిజాయితీ, నిబద్దత కలిగిన ఆఫీసర్లు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వ్యక్తి విశాఖ సిపిగా పనిచేసిన కాలంలో అందించిన సేవలు ఎనలేనివన్నారు. మీనా రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వంశీ ఆకాంక్షించారు. అనంతరం ప్రజాసంఘాలు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కూడా వంశీ పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి, గింజర్తి మీదుగా బొర్రంపేట వెళ్లే రహదారి మధ్యలో కొండచరియలు విరిగి రోడ్డుపై పడుతున్నాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండపై మట్టిపూర్తిగా నానిపోయి పెద్ద పెద్ద బండరాళ్లు రాహదారిపై పడుతున్నాయి. దీంతో ఈ రూటులో వెళ్లేవాహన చోదకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు బండరాళ్లు తమపై పడతాయోనని ఆందోలన చెందుతున్నారు. ఈ ప్రాంతీయులు కొండచరిలు విరిగి పడిన విషయాన్ని మీడియాకి ఫోటోలు తీసి పంపించారు. అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క పరిస్థితిని వీడియోలు తీసి సచివాలయ వీఆర్వో ద్వార మండల రెవిన్యూ అధికారులకు తెలియజేశారు. రోడ్డు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పొసమ్మగండి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీరు అమ్మవారి మెడను తాకింది. మూడు గంటల పాటు వరదనీరు అమ్మవారివిగ్రహం పీక వరకూ చేరుతూనే ప్రవహించింది. అంతేకాకుండా దేవిపట్నం, పూడిపల్లి గ్రామాల్లోకి కూడా నీరు ప్రవేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్నవారిని పడవల సహాయంలో బయటకు తీసుకు వస్తున్నారు. గోదావరి ఉద్రుతి వరనీరు గ్రామాల్లోకి రావడంతో లోతట్టు ప్రాంతాల వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు దేవీపట్నం మండలం తొయ్యూరు వద్ద జూనియర్ కళాశాలలో కూడా వరదనీరు చేరింది. గ్రామంలోని చేరిన నీరు మోకాలు పై వరకూ రావడం విశేషం.
భారత యువత ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్రంలో మోదీ సర్కారు ఫిట్ ఇండియా యూత్ క్లబ్ లను ఏర్పాటు చేయడం హర్షనీయమని బీజేపీ సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫిట్ ఇండియా యూత్ క్లబ్ కార్యక్రమం ద్వారా యువత రోజుకు గంటపాటు ఫిట్ నెస్ కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. వీటని నిర్వహించేందుకు యువజన సర్వీసులశాఖ, నేషనల్ సర్వీస్ స్కీమ్ ద్వారా 75 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, వీరి సంక్ష కోటి వరకూ పెంచి ఈ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటైనా ఫిట్ ఇండియాని కార్యకర్తలు, ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లాలని కేంద్ర యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజీజూ కోరిన విషయాన్ని రామ్ కుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
స్వాతంత్య్రం సాధించుకోవడం కోసం నాటి మహనీయులు ఆస్తులు దేశం కోసం వదులుకుంటే.. నేటి మన నాయకులు తాను తన బంధువుల పేరున బినామీగా వందల ఎకరాలు భూములు, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడం మన దుర దుష్టకరమని సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రోజు ఆవేన వ్యక్తం చేశారు. ఎస్.రాయవరంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎంపిటిసి మాత్రమే అయిన బొలిశెట్టి గోవిందరావు, తన అత్త, మామ ఇద్దరు బావమరుదులు పేరున భూములు బినామీగా కొని విజయనగరముకు చెందిన భార్య కుటుంబసభ్యుల చేతిలో బందీ అయ్యాడన్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. అంతేకాకుండా కాకినాడలో తన అక్క పేరున, తన స్నేహితుడు దాసరి దొంగబాబు, లాక్కోజు ఆదిమూర్తి, మరి కొందరి పేరున బినామీగా అక్రమ సంపాదనతో ఆస్తులు కొన్నాడని ఆరోపించారు. విచిత్రంగా ఎస్.రాయవరం గ్రామంలో సెంటు భూమి, ఇళ్ళుకాని లేవు. ఇక్కడ రాజకీయనాయకుని ముసుగులో అక్రమంగా సంపాదించి ఇతర ప్రాంతాలలో కొంటున్నాడని చెప్పారు. ఇవి కాక ఇంకా ఉన్న ఇతర ఆస్తులను ఎవరికైనా తెలిసి ఉంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమకు తెలియజేయాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కూడా రాజు వివరించారు.
మత్తు పదార్ధాలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా కలెక్టర్ , సిపిలతో కలిసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పతాక ఆవిష్కరణ అనంతరం మాదక ద్రవ్యాల నిషేధం, మత్తుపదార్థాల బానిసలైన వారికి విముక్తి కలిగించడం పై పోస్టర్లను విడుదల చేశారు. వ్యసన విముక్త భారత్ ప్రచార కమిటీ (నాష్ ముక్త్ భారత్) రూపొందించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా మత్తునుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినాయోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ సీతామహాలక్ష్మి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉప సంచాలకులు వి. మణిరామ్ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కొరకు ఎoతో మంది నాయకులు, ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలని, వారిని స్ఫూర్తి గా తీసుకోని దేశ అబివృద్ధి కి కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పి. ఆర్. ఒ. వెంకటరాజ్ గౌడ్, అదనపు పి. ఆర్. ఒ. సాయి బాబా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ హెచ్చరించారు. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి రెవెన్యూ అధికారులు,సిబ్బంది స్థానికంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, తగు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు గాను జిల్లా కలెక్టరేట్ నందు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో, తహసిల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. విశాఖపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08912590102 ఆర్టీవో విశాఖపట్నం 8790310433 ; ఆర్డిఓ అనకాపల్లి: 8143631525; 8790879433;. సబ్ కలెక్టర్ నర్సీపట్నం : 8247899530; 7675977897; ఆర్ డి ఓ పాడేరు : 08935-250228; 8333817955; 9494670039; 8331821499.ఇదే విధంగా ప్రతి తహసిల్దారు కార్యాలయాలలోకూడా కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయ బడతాయని తెలిపారు.
క్రమశిక్షణ,నిబద్ధతో నిజజీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిని కొండారాజీవ్ గాంధీకి సూచించారు. శనివారం రాజీవ్ జన్మదినం సందర్భంగా ఆయన విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆశీర్వాదంతోపాటు, జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. అనంతరం మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, ఎమ్మెల్యేలు అమర్నాధ్, అదీప్ రాజ్ , నగర పార్టీ అధ్యక్షులు వంశి కృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్తలు కేకే రాజు, యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం రాష్ట్ర మరియు నగర కమిటీ నాయకులు సంయుక్తంగా కొండా రాజీవ్ గాంధీకి జన్మదిన శుభాకంక్షాలు తెలియజేసారు. కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
భారదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి త్యాగధనులు చేసిన త్యాగాలను గుర్తించి వారి ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ క్రుషి చేయాలని సాక్షి విశాఖ యూనిట్ బ్యూరో చీఫ్ గరికపాటి ఉమాకాంత్ అన్నారు. శనివారం విశాకలోని సాక్షి యూనిట్ లో నిర్వహించిన 74వ స్వాతంత్ర్య దినోత్సవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను జాతీకోసం త్రుణప్రాయంగా వదిలాన్నారు. వారిని నిత్యం స్మరిస్తూ, దేశాభివ్రుద్ధికి పాటుపడాలన్నారు. ప్రతీఒక్క జర్నలిస్టు రాష్ట్ర అభివ్రుద్ధిలో కీలక పాత్ర పోషించే విధంగా తమ విధినిర్వహణ చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న వేళ జర్నలిస్టులు సామాజిక దూరం పాటిస్తూనే ముఖ్యమైన వార్తలకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో యూనిట్ సిబ్బంది, జర్నలిస్టులు పాల్గొన్నారు.
ప్రపంచాన్ని కుదేపేస్తున్న కోవిడ్ మహమ్మారి నుండి కోలుకుని విజయవంతంగా బయటకు వచ్చిన విజేతలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జ్ఞాపికలను బహూకరించారు. జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ పురుషుల కళాశాలలో శని వారం నిర్వహించిన 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, జిల్లా కలెక్టర్ జె నివాస్ సమక్షంలో ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు విజేతలకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. విజేతలలో సామాన్య ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, వైద్యులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. కోవిడ్ అంటే భయం అవసరం లేదు మనోధైర్యం, ఆత్మ నిబ్బరం ఉంటే చాలు అనే స్పూర్తిని కలిగించిన వృద్ధులు, గర్భిణీ మహిళలు ఉండటం విశేషం. భయపడితేనే చంపుతుందని, ఆత్మస్థైర్యం ఉంటే ఏమి చేయదని నిరూపించారు. కరోనా విజేతలలో జ్ఞాపికలు బహూకరించుటకు వృద్ధులు, గర్భిణీలు, ఉద్యోగులు, వైద్యులు, పోలీసు తదితర రంగాల నుండి కొంత మందిని ఎంపిక చేసారు. 291 మందిని స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనుటకు ఆహ్వానించారు. జ్ఞాపికలు పొందిన వారిలో పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, రాజకీయ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, కలెక్టర్ కార్యాలయ పారిపాలన అధికారి బి.రాజేశ్వరరావు, పోలీసు అధికారి డి.ఎస్.పి డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఇన్స్పెక్టర్ హెచ్.మల్లేశ్వరరావుతో సహా పలువురు ప్రజలు జ్ఞాపికలు అందుకోగా గర్భిణీగా చేరి సుఖప్రసవంతో బిడ్డతో సహా సంతోషంగా ఇంటికి చేరిన మెరగాన జ్యోత్స్న, గొట్టిపల్లి అనురాధ ఉండగా, వృద్ధులు కె. అప్పల నరసింహులు, మెండా లచ్చయ్య, పెదపూడి వెంకట్రావు ఉన్నారు. పోలీస్ శాఖలో కాశీబుగ్గ పోలీస్ కానిస్టేబుల్ కే.శేఖర్ రావు, మెళియాపుట్టి పోలీసు కానిస్టేబుల్ ఏ.శ్రీనివాస రావు, ఎచ్చెర్ల డి.ఎ.ఆర్ కానిస్టేబుల్స్ జి.సూర్యనారాయణ, సంపతిరావు అప్పారావు, పి. మాధవరావు, కరిమి గరయ్య, బూర్జ పోలీసు కానిస్టేబుల్ లుట్టా అప్పారావు, ఇచ్చాపురం పోలీసు కానిస్టేబుల్ బేసి రామారావు, సారవకోట పోలీసు కానిస్టేబుల్ మెట్టా సత్యం, రాజాం పోలీసు కానిస్టేబుల్ పైడి రామకృష్ణ ఉన్నారు. డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.నగేష్, వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్ సునీల్ నాయక్, డాక్టర్ ఎస్. పద్మావతి, డాక్టర్ కె.కృష్ణ కుమార్, ఎంపిహెచ్ఇఓ కె.ధర్మారావు, పి.హెచ్.ఎన్ వి.భాగ్యవేణి, అంపోలు ఎ.ఎన్.ఎం వై.ప్రభావతి, స్టాఫ్ నర్స్ వై.ఎస్ రామలక్ష్మి, ఆశా కార్యకర్త పద్మ., జిల్లా పరిషత్ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఆమదాలవలస మండలం రామచంద్రాపురం వ్యవసాయ సహాయకులు ఏ.రోహిత్ కుమారా, చింతలపేట డిజిటల్ అసిస్టెంట్ పిట్టా ఈశ్వరరావు, శ్రీకాకుళం మండలం గూడెం విలేజ్ సర్వే సహాయకులు డి.జ్ఞానసాగరిక, అలికాం పంచాయతీ కార్యదర్శి ఎం. శ్యామ సుందర్ రావు, ఎస్.ఎస్.వలస వ్యవసాయ సహాయకులు ఏ.లోకేశ్వరరావు, అంపోలు మహిళా ప్రొటేక్షన్ కార్యదర్శులు ఇప్పిలి సాయి శిల్ప, జల్లా శ్రీదేవి., శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఇంజనీర్ ఎస్.వెంకటి, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కె.వి.రమణమూర్తి, జూనియర్ అసిస్టెంట్లు ఎస్. చిద్విలాస్ గుప్తా, లోవ శ్రీనివాస రావు ఉన్నారు.
కోవిడ్ మృతదేహాల సేవకులకు గుర్తింపు : కోవిడ్ మృతదేహాల సేవకులుగా గుర్తింపు పొందిన భూసి శ్రీనివాస రావు, మైలపల్లి కృపానంద్ కు కోవిడ్ విజేతల జ్ఞాపికలను అందజేసారు. కోవిడ్ తో మృతి చెందుతున్న వారి దహన సంస్కారాలను నిర్వహించుటకు కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంటున్న సమయంల శ్రీనివాస రావు, కృపానంద్ బృందం చేస్తున్న సేవలు అపారం. ఈ సేవలకు గుర్తింపుగా జ్ఞాపికలను మంత్రి బహూకరించారు.