1 ENS Live Breaking News

ఏపీ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ఆమోఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేయబడుతున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పరిజ్ఞానం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు అమోఘమని, అందరికీ ఆదర్శనీయమని ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పద్దతులను తెలుసుకునేందుకు రాష్ట్ర  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం అమరావతి సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరేలా పలు అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం  తాము గమనిస్తున్నామని, వాటిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకే నేడు ఇక్కడకు వచ్చామన్నారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్, ఇతర అధికారులు రాష్ట్రంలో రైతులకు  పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చే విధంగా  అమలు చేయబడుచున్న పలు పథకాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కు వివరించారు.

 విత్తు నుండి విక్రయం వరకూ అన్నిరకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేసే “వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల”  ఏర్పాటు, వాటి పనితీరు, వాటివల్ల రైతులకు ఒనగూరే ప్రయోజనాలను బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఎంతో ఆసక్తితో తెలుసుకున్నారు. అందుకై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న పలు అప్లికేషన్లపై ఆరాతీశారు.  ముఖ్యంగా ఆర్.బి.కె.ల్లో ఏర్పాటు చేసిన  డిజిటల్  కియోస్క్ ల వల్ల రైతులకు కలిగే ఉపయోగాలు, ఇ-క్రాప్ బుకింగ్, పంటల భీమా, ఇన్ పుట్ సబ్సిడీ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానాలను అమలు పర్చడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను  ఆయన అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వ్యవసాయ యాంత్రీకరణ, ఉత్పతుల మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటూ అందుకై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. 

జగనన్న పాలనలో వ్యవసాయం దండుగకాదు పండుగ…..
గత మూడునర్రేళ్ల జగనన్న పాలనలో వ్యవసాయం దండుగకాదు పండుగ అనే స్థాయిని తీసుకు రావడం జరిగిందని రాష్ట్ర  వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ కు తెలిపారు.  రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,778  వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను  ఏర్పాటు చేయడం జరిగిందని, విత్తు నుండి విక్రయం వరకు అన్ని రకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేస్తున్నామని  తెలిపారు.  ఇ-క్రాప్ నమోదు నుండి  బ్యాంకింగ్  సేవల వరకూ అన్ని రకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేస్తూ బహుళార్ధక సాధక కేంద్రాలుగా ఈ ఆర్.బి.కే.లు పనిచేస్తున్నాయని వివరించారు. 

రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 83 శాతం మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారని, వారిలో ఐదు ఎకరాల లోపు సాగు భూమి కలిగిన రైతులు ఎక్కువ మంది వున్నారన్నారు.  అటు వంటి చిన్న సన్నకారు రైతులు అందరినీ ఆదుకునేలా ప్రభుత్వం పలు అభివృద్ది సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయడం జరుగుచున్నదని తెలిపారు. ల్యాబ్ టు ల్యాండ్ మరియు ల్యాండ్ టు ల్యాబ్ విధానంతో  రైతులు అందరికీ ఆధునిక వ్యవసాయ పద్దతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.    రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్న విధానంతో  రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్.బి.కె.లను ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా విత్తు నుండి విక్రయం వరకూ అన్ని రకాల సేవలను రైతులకు అందజేస్తున్నారన్నారు.  ఫలితంగా దేశంలోని పలు వ్యవసాయ ఉత్పత్తులకు  ఆంద్రప్రదేశ్ ప్రముఖ కేంద్రంగా మారిందన్నారు. ధాన్యం, చేపలు, పండ్లు తదితర ఉత్పత్తులకు ఆంద్రప్రదేశ్  దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలిచినట్లు ఆమె వివరించారు. 

రాష్ట్ర వ్యసాయ శాఖ కమిషనర్  హరి కిరణ్, ఉద్యావన శాఖ  కమిషనర్  డా.శ్రీధర్,  ఏ.పి.ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సి.ఇ.ఓ. ఎల్.శ్రీధర్ రెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి. ఎ.విష్ణువర్థన రెడ్డి తదితరులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్దికి,  వ్యవసాయ యాంత్రీకరణకు, రైతులకు  ఉత్తమ వ్యవసాయ పద్దతులు అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ తో పాటు పొలిటికల్ ఎకానమీ ఎడ్వైజర్  నళిని రఘురామన్, సీనియర్  ట్రేడ్ ఎడ్వైజర్  పియూష్ అవాస్తి, ప్రాస్పరిటీ ఎడ్వైజర్ జావైద్ మళ్లా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

2022-10-14 11:58:00

సూర్యగ్రహణం రోజున ఉ..8వరకే సత్యదేవుని దర్శనాలు

శ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో ఈనెల 25వ సూర్యగ్రహణం సందర్భంగా స్వామవారి దర్శనాలు ఉదయం 4 గంటల నుంచి 8గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారని దేవస్థానం అధికారులు ఒక ప్రకనటలో తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి ఆలయం మూసివేసి 26వ తేదిన ఉదయం తెల్లవారుజామున తెరుస్తారని పేర్కొన్నారు.  స్వామివారి వ్రతముల టికెట్లు  ఉ "08.00 గంటల వరకు మాత్రమే ఇస్తారని.. వివిధ సేవలు,  హోమములు ఉ"07.00 గంటలకు ప్రారంభించి 10.30 ని.లకు ముగించిన తరువాత ఆలయం మూతవేస్తారని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

2022-10-14 09:17:37

గ్రామ సచివాలయాల్లోనే మేరేజి సర్టిఫికేట్లు..

తలంబ్రాలు..జీలకర్రా బెల్లం.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఇలా కనుల పండుగగా జరిగే పెళ్లిళ్లకు ఇచ్చే ద్రువీకరణ పత్రం విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఒకప్పుడు పంచాయతీలు, దేవస్థానాల్లో ఇచ్చే ఈ పెళ్లి ద్రువీకరణ పత్రాలకు వధూవరూలు అమ్యామ్యాలు ఇస్తే తప్పా ఆ ద్రువీకరణ పత్రాలు చేతికి వచ్చేవి కాదు. దేవస్థానాలు, పంచాయతీల్లో ఈ సర్టిఫికేట్ దర కేవలం రూ.50 నుంచి రూ.100 మాత్రమే. అయితే గతంలో పంచాయతీలు, దేవస్థానాలుండే చోట అయితే రూ.5వేల వరకూ పంచాయతీ సిబ్బంది నొక్కేసేవారు. కానీ అలాంటి ముడుపుల ద్రువీకరణ విధానాలు ఇకపై ఉండకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి ద్రువీకరణ పత్రాలు జారీచేసే అధికారాన్ని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది. వధూవరులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పెళ్లైన తరువాత 60 రోజులు, పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే సచివాలయాల్లోనే ద్రువీకరణ పత్రాలు ఇస్తారు. ఆ సమయం దాటితే మాత్రం రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లాల్సి వుంటుంది. 

వివాహ ద్రువపత్రం కావాల్సిన వారు వధూవరుల ఆధార్ కార్డులు, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పెళ్లి శుభలేఖ, ఒక వేళ ఏదైనా గుడిలో జరిగితే అక్కడ తీసుకున్న ద్రువీకరణ పత్రం, మండపం రసీదులు, పెళ్లిఫోటో జతచేసి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆపై వెంటనే పెళ్లి ద్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవస్థానాల దగ్గర్లో ఉండే పంచాయతీలు, తేడా కార్యదర్శిల చేతి వాటానికి అడ్డుకట్టవేసినట్టు అయ్యింది. అందేకాకుండా పాస్ పోర్టు, రేషన్ కార్డు, ఇంటి నిర్మాణాలు ఇలా చాలా వాటికి ఇపుడు పెళ్లి ద్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీల్లో చేతివాట పూర్తిగా తగ్గనుంది. ఒకవేళ ఇక్కడ కూడా చేతివాటం ప్రదర్శిస్తే సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

2022-10-14 07:10:48

అనంతలో భారీ వర్షాలు..కుటుంబానికి రూ.2వేలు

అనంతపురంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం  వైయస్‌.జగన్మోహనరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో కురుస్తున్న వర్షాలపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వివరించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై సీఎం ఆరా తీశారు. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 
అదే సమయంలో  హఠాత్తుగా కుండపోత, ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి వివరాలను కూడా సీఎం ద్రుష్టికి అధికారులు తీసుకొచ్చారు. వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు బియ్యం, పామాయిల్‌, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఈ ఐదు రకాల నిత్యావసర వస్తులను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలన్నారు. 
వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారుచేసి నిర్ణీత సమయంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు..
 

2022-10-13 05:24:58

తిరుమ‌ల‌లో బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు

తిరుమ‌ల‌లోని త‌డిచెత్త ద్వారా బ‌యోగ్యాస్ ఉత్ప‌త్తి చేసేందుకు టీటీడీ, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (ఐఓసిఎల్‌)తో ఎంఓయు కుదుర్చుకుంది. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం టీటీడీ ఎస్ఇ - 2   జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఐఓసిఎల్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  అనీల్‌కుమార్ ఎంఓయు  ప‌త్రాల‌ను మార్చుకున్నారు.  స్వ‌చ్ఛ తిరుమ‌ల‌లో భాగంగా టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో త‌డిచెత్త ద్వారా బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా టీటీడీ రూ.6 కోట్లు, ఐఓసిల్ రూ.6 కోట్లు క‌లిసి మొత్తం రూ.12 కోట్ల‌తో రెండు ఎక‌రాల విస్తీర్ణంలో తిరుమ‌ల‌లో ప్లాంట్‌ను  ఏర్పాటు చేయ‌నున్నారు. 

ప్ర‌తి రోజు 35 ట‌న్నుల వ్య‌ర్థాల‌ను ఇందు కోసం వినియోగిస్తారు. తిరుమ‌ల‌లో రోజుకు 3.5 నుండి 4.5 మెట్రిక్‌ ట‌న్నుల గ్యాస్ అవ‌స‌రం కాగా, ఇందులో 1.6 మెట్రిక్ ట‌న్నుల గ్యాస్ ఈ ప్లాంట్ నుండి ఉత్ప‌త్తి అవుతుంది. దీనిని అన్న‌ప్ర‌సాదాల త‌యారీ కేంద్రంలో వినియోగించాల‌ని నిర్ణ‌యించారు. ఈ సమావేశంలో ఓఎన్‌జిసి సిజిఎం  సూర్య‌నారాయ‌ణ రాజు, జిఎం  సుబ్ర‌మ‌ణ్యం, టీటీడీ ఇఇ శ్రీ‌హ‌రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

2022-10-12 13:36:23

ఇక ఐఏఎస్ లకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచనలం రేపుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కొత్త విధానాలను అమలు చేయడం, వాటిని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసు అధికారులతో సైతం పాటించేలా చేయడం ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకూ అందరూ అధికారులేనని..వారంతా విధి నిర్వహణకు వచ్చినపుడు అటెండెన్సు తప్పక వేయాలనే నిర్ణయం ఇపుడు ఏపీలోని సివిల్ సర్వీస్ అధికారులను సైత ఆలోచింపచేస్తున్నది. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు ఇపుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా అందరు అధికారులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేయాలి. దానికోసం యాప్ డౌన్ లోడ్ చేయాలి.

ఇప్పటికే ఈ విధానం రాష్ట్ర సచివాలయంలోని ఐఏఎస్ లకు ఇతర రాష్ట్రస్థాయి అధికారులకు అమలు చేయగా.. దానిని 26 జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ఇప్పటికే అధికారులంతా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని జీఏడీ నుంచి అందరికీ ఆదేశాలొచ్చాయి. ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఒక విధానంలో అటెండెన్సు వేస్తే అదేవిధంగా క్రింది స్థాయి అధికారులు, సిబ్బంది పాటిస్తారనేది ప్రభుత్వ ఆలోచన దీనికోసం నిర్ణయం తక్షణమే అమల్లోకి రావడం విశేషం. ఇప్పటి వరకూ బయో మెట్రిక్ అటెండెన్సు మాత్రమే ప్రభుత్వశాఖల్లో అందుబాటులో ఉండేది. ఇపుడు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారానే అన్ని శాఖల వారు అటెండెన్సు వేయాల్సి వుంటుంది. 

ఇలా చేయడం ద్వారా విధి నిర్వహణలో జవాబుదారీతనం వుంటుందని, జిల్లా కార్యాలయంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేసిన అధికారులు వారి పర్యటనలో కూడా ముఖ్యంగా దీనినే పర్యవేక్షణ చేస్తారని సీఎం కార్యాలయం భావిస్తోంది. చాలా చోట్లు బయో మెట్రిక్ అటెండెన్సులు వున్నా దానిని సక్రమంగా నిర్వహణ చేయడం లేదు. వినియోగించడం లేదు. దీనిని పూర్తిస్థాయిలో గమనించిన ప్రభుత్వం తొలుత ఐఏఎస్ అధికారులకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్సు అమలు చేస్తే అన్నిశాఖల అధికారుల్లోనూ, సిబ్బంది విధిగా పాటిస్తారని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్సు ద్వారా సివిల్ సర్వీస్ అధికారుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ప్రభుత్వం మాత్రం దానిని పట్టించుకోలేదు. 

ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలోని అందరు ఐఏఎస్ అధికారులతోపాటు మిగిలిన సివిల్ సర్వీస్ అధికారులంతా ఇపుడు వారి వారి మొబైల్ ఫోన్ లలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ని ఇనిస్టాల్ చేస్తున్నారు. ఈ విధానం ఎంత పక్కాగా మిగిలిన శాఖల్లోని అధికారులు, సిబ్బందితో ప్రభుత్వం అమలు చేస్తుందనేది ముందు ముందు తేలుతుంది. అటెండెన్సు ద్వారానే నెలవారీ జీతం వస్తుందనే మెలికను కూడా ప్రభుత్వం పొందు పరచడం విశేషం. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వంలోని కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అధికారులంతా విధి నిర్వహణకి డుమ్మాకొట్టడానికి వీలుపడదు సరికదా..కాకిలెక్కలు..చిలపలుకులు పలకడానికి ఆస్కారం లేకుండా పోతుంది..!

2022-10-12 05:07:00

ఏడాదిలో విజ‌య‌వంతంగా 729 హార్ట్ సర్జరీలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( గుండె చికిత్సల ఆసుపత్రి)లో ఏడాది కాలంలో 729 హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, శ్రీ‌వారి ఆశీస్సుల‌తో చిన్నారుల‌కు పున‌ర్జ‌న్మ ప్ర‌సాదించిన‌ట్లు టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి చెప్పారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో మంగ‌ళ‌వారం ఈవో మీడియా తో మాట్లాడారు.  గ‌త ఏడాది అక్టోబ‌రు 11వ తేదీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 70 ప‌డ‌క‌లు, 3 ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ల‌తో ఆసుప‌త్రిని ప్రారంభించిన‌ట్లు చెప్పారు. ఆసుప‌త్రి ప్రారంభించిన ఏడాది కాలంలో దేశంలోనే అత్యున్న‌త వైద్య సేవ‌లు అందించే 10 ఆసుప‌త్రుల‌లో ఒక‌టిగా  గుర్తింపు తెచ్చుకుంద‌ని తెలిపారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించే స్థోమత లేని పేద తల్లిదండ్రులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద రాష్ట్ర ప్ర‌జ‌లు, ఆయుష్మాన్ భార‌త్‌ ద్వారా ఇత‌ర రాష్ట్రాల రోగులకు ఉచితంగా చికిత్స‌లు అందిస్తున్నామ‌న్నారు.

       ఒక బిడ్డ‌ గుండె శ‌స్త్ర‌ చికిత్సకు ల‌క్షల‌ రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని, ఆ ఖ‌ర్చును భ‌రించే దాత‌ల కొర‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆప‌న్న హృద‌యాల‌య స్కీం ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఈ స్కీంకు విరాళాలు అందించే దాత‌ల‌కు ఐదు బ్రేక్ టికెట్లు అందిస్తున్నామ‌న్నారు. ఒక పేషంట్‌కు స‌ర్జ‌రీ చేసిన ఘ‌న‌త దాత‌ల‌కు వ‌స్తుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్వీ ఆప‌న్న హృద‌యాల‌య స్కీంకు 150 మంది దాత‌లు విరాళాలు ఇచ్చార‌న్నారు. జీవ‌న్ దాన్ లైసెన్స్‌కు ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు, దాత‌లు ఎవ‌రైనా గుండె ఇస్తే పిల్ల‌ల‌కు గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్స‌లు చేసేందుకు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ముఖ వైద్య నిపుణులు ఆసుప‌త్రిలో ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు.  

         శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుప‌త్రికి 2022 మే 5న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భూమి పూజ నిర్వ‌హించార‌ని, రూ.320 కోట్ల‌తో 350 బెడ్ల‌తో అత్యాధునిక వైద్య స‌దుపాయాల‌తో చిన్న పిల్లల ఆసుప‌త్రి మ‌రో రెండు సంత్స‌రాల‌లో అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆసుప‌త్రి నిర్మాణానికి 160 మంది దాత‌లు రూ.కోటి చొప్పున విరాళంగా ఇచ్చార‌ని, వీరికి ఉద‌యాస్త‌మాన సేవ టికెట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో స్విమ్స్‌, బ‌ర్డ్‌, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుప‌త్రుల‌ను అనుసంధానిస్తామ‌న్నారు. త‌ద్వారా రోగుల‌కు మ‌రింత త్వ‌రిత గ‌తిన నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందిచ‌వ‌చ్చ‌ని చెప్పారు. త్వ‌ర‌లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్ ( సెంట్ర‌లైజ్డ్ ల్యాబ్‌)ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఈవో తెలిపారు.  బ‌ర్డ్ ఆసుప‌త్రిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక‌ సిటి స్కాన్‌, ఎక్స్ రే సేవ‌ల‌ను తిరుప‌తి, ప‌రిస‌ర ప్రాంతాల రోగులు నేరుగా వ‌చ్చి త‌క్కువ ఫీజు చెల్లించి వినియోగించుకోవ‌ల‌సిందిగా ఈవో కోరారు.  

        శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుప‌త్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ, ఆసుప‌త్రిలో 30 మంది ప్ర‌ముఖ గుండె వైద్య నిపుణులు ఒక టీంగా ఏర్ప‌డి నిరంత‌రం చిన్న‌పిల్ల‌ల‌కు వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. గుండె స‌మ‌స్య‌లు ఉన్న పిల్ల‌ల‌ను స‌రైన స‌మ‌యంలో ఆసుప‌త్రికి తీసుకురావ‌ల‌న్నారు. దేశంలోని 10 ప్ర‌ముఖ ఆసుప‌త్రుల‌లోని డాక్ట‌ర్లు శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో  ఉచితంగా సేవ‌లు అందించేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు. స్విమ్స్‌కు అనుబంధంగా త్వ‌ర‌లో ఫెలోషిప్ కోర్సులు పీడియాట్రిక్‌, అన‌స్థీషియా, త‌దిత‌ర కోర్సులు అందించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్లు వివ‌రించారు.  జెఈవో  వీర బ్రహ్మం, సిఎంవో  ముర‌ళీధ‌ర్, చిన్న పిల్లల హృదయాలయం ఆర్ఎంఓ డాక్టర్ భరత్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

2022-10-11 12:18:43

ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ కోల్పోయింది రూ.లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ విభజనలో హైదరాబాదులో ఒక్కచోటే రాజధాని ఉండటం ద్వారా కోల్పోయిన విలువైన ఆస్తులు, ప్రభుత్వకార్యాలయాలు, కర్మాగారాలు లెక్కేలేదు. ఇదంతా రాష్ట్రప్రజలు పన్నులతో నిర్మించిన రాజధానిని కేవలం విభజన ద్వారా మనకు రావాల్సిన ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల్లో మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. విభజన జరిగిన 13ఏళ్లకు గానీ తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా హైదరాబాదు నుంచి తెచ్చుకోలేకపోయామంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రాల అభివ్రుద్ధిలో వికేంద్రీకరణ ప్రముఖ పాత్రపోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రం విడిపోయిన తరువాత కానీ తెలిసిరాలేదు. అలాగని కేంద్రం కూడా ఏపీని ఆదుకోవడంలో ముందుకు వచ్చిందా అంటే అదీ లేదు. కేవలం నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. నేటికీ విభజన హామీలు పూర్తికాలేదంటే అతిశయోక్తికాదేమో. ఒకేచోట రాజధాని ఉండాలనుకునే రాజకీయపార్టీలు, ఒక వర్గం ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటే ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒప్పుకొని తీరాలి కూడా. అంత విలువైన సంపదను, భవిష్యత్లును ఏక రాజధాని వలన ఏపీ కోల్పోయిందనే విషయాన్ని ముందుగా యువత గుర్తించాల్సి వుంది.

ఏపీ రాజధాని కోల్పోయిన ఆస్తులు రూ. వేల కోట్లలోనే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండుగా విడిపోయిన తరువాత మనం, మన రాష్ట్రం కోల్పోయింది అసెంబ్లీ, శాసనమండలి, హైదరాబాద్ రైల్వేజోన్, ఆయుర్వేద ఫార్మసీ, యునానీ ఫార్మసీ, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంధ్రభారతి, అసెంబ్లీ క్వార్టర్స్, సచివాలయ భవన సముదాయం, సాలర్జంగ్ మ్యూజియం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. రాజధాని హైదరాబాదు కేంద్రంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలన్నింటినీ విభజనలో ఏమీకాకుండా కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. అలాగని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా కేంద్రం విభజనలో ఇప్పటి వరకూ ఏపీకి కేటాయించలేదు. నిర్మించలేదు. నేటికీ తెలంగాణకి విభజన తరువాత మిగిలిన లక్షల కోట్ల ఆస్తుల్లో ఏపీ నేటికీ ఏమీ సమకూర్చుకోలేకపోయింది. దానికి కారణం రాజధాని లేకపోవడం, ఒకేచోట రాజధాని ఏర్పాటు చేయాలనే పట్టుదల ఉండటం. అదే సమయంలో రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే ఆలోపాలన్నీ పెద్ద గ్రంధమే అవుతుంది.

ఏక రాజధాని వద్దు..మూడు రాజధానులే ముద్దు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత జరిగిన తీవ్రమైన నష్టాన్ని ఏకరాజధానిగా అనుకున్న అమరావతి ద్వారా కూడా గత ప్రభుత్వం ద్వారా మనం పూడ్చుకోలేకపోయాం. అంతేకాకుండా విభజన ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన సంస్థలు, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సదుపాయాలు, ఆర్ధిక సహాయం కూడా పూర్తిస్థాయిలో రాకుండా పోయాయి. రాష్ట్రవిభజన జరిగిన తరువాత కేంద్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చే విశాఖలాంటి రైల్వే డివిజన్ ను సైతం కేంద్రం నేటికీ రైల్వే జోన్ గా ప్రకటించలేదు. ఉమ్మడి రాజధానిగా ఉండటం వలనే హైదరాబాదు సాఫ్ట్ వేర్ హబ్ గా అవతరించింది. హైటెక్ సిటీలాంటి సంస్థలు నిర్మాణాలు జరిగాయి. ఇపుడు ఆ పరిస్థితి ఏపీలో కూడా రావాలంటే ఒకేచోట రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా రాదని, దానిని వికేంద్రీకరణ చేయడం ద్వారానే వస్తుందని ప్రభుత్వం బలంగా నమ్మి దానిని చట్టం రూపంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నది. దానిని ఒక వర్గం ప్రజలు వ్యతిరేకించినా..అత్యధికశాతం ప్రజలు స్వాగతిస్తున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రాజధాని మాత్రమే ఉండటం ద్వారా ఏమోం కోల్పోయామో అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని అన్ని వర్గాల ప్రజలు కూడా అభివ్రుద్ది వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారు.

మూడూ రాజధానులతో ఒకేసారి అభివ్రుద్ధి ప్రారంభం ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోశాసన రాజధాని, కర్నూలో న్యాయరాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుచేయాలనే ఆలోచనతో చేస్తున్న కార్యాచరణకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తున్నది. ఫలితంగా మూడు ప్రాంతాల్లో ఒకేసారి అభివ్రుద్ధి ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా అన్నివర్గాల ప్రజలకు విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఏర్పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక వర్గం ఆందోళనతో ఇపుడు మూడు రాజధానుల విషయాన్ని రాజకీయం చేయాలని చూసినా మెజార్టీప్రజలు మూడు రాజధానులు కోరుకోవడం ద్వారా అంతా ఆలోచించే పరిస్థితి నెలకొంది. మూడు రాజధానులు ఏర్పాటు అయితే అటు కేంద్రం నుంచి రావాల్సిన కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా మూడు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయడానికి, రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడానికి పూర్తిస్థాయిలో ఆస్కారం వుంటుంది. ఏపీలో సాఫ్ట్ వేర్ రంగాన్ని బోలోపేతం చేయాలన్నా, న్యాయవిభాగాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేర్చాలన్నా, పరిపాలనను వికేంద్రకరించాలన్నా, అభివ్రుద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నా.. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటు అత్యంత ముఖ్యమని అంతా భావించాలి. ఒక రాజకీయ పార్టీ, ఒక వర్గం రాజకీయానికి రాష్ట్రాభివ్రుద్ధి విఘాతం అయితే దానిని ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ తిప్పికొట్టాల్సిన సమయం ఆశన్నమైంది. తద్వారా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేసే ప్రక్రియలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి..మూడు రాజధానులతోనే నిజమైన అభివ్రుద్ధి, మూడు ప్రాంతాలకు ఆత్మగౌరవం దక్కుతుందని గమనించాలి..!

2022-10-11 02:33:00

గ్రామస్వరాజ్య సాధన దిశగా సచివాలయాలు

గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం భారతదేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు నేటితో ముచ్చటగా మూడేళ్లు పూర్తయ్యాయి. ఇంటి ముంగిటే ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో సుమారు 19శాఖల సిబ్బందిని ఒకే గూడులో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలోని 26 జిల్లాల పరిధిలోని ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులు ఈ శాఖలోని 14వేల 5 సచివాలయాల ద్వారా సేవలులు అందిస్తున్నారు. ఒక్క గ్రామసచివాలయం ద్వారానే 750 ప్రభుత్వ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రప్రభుత్వం సేవలను విడతల వారీగా అందుబాటులోకి తీసుకుస్తూ ప్రజలకు సచివాలయాలను చేరువ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం చేపట్టని విధంగా ఏపీ ప్రభుత్వం  ఏర్పాటు చేసిన ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇపుడు దేశం మొత్తాన్ని రాష్ట్రంవైపు చూపు తిప్పుకునేలా చేస్తున్నది.

గ్రామంలోనే స్పందన పరిష్కారాలు
గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజా సమస్యల వేదిక స్పందనను అన్ని సచివాలయాల్లోనూ ఏర్పాటు చేసి అక్కడే సమస్యలు పరిష్కరించేలా క్రుషి చేస్తున్నది. ఒకప్పడు స్పందన కార్యక్రమం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రజలు ఇపుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోని తమ సమస్యలను విన్నవించుకొని ఇప్పుడిప్పుడే పరిష్కారాలు పొందుతున్నారు. తద్వారా వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన చాలా వరకు పనులు ఇక్కడే పరిష్కారమవుతున్నాయి. ఒకప్పుడు ఆధార్ కార్డు చేయించుకోవాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇపుడు ఆ సేవలు కూడా సచివాలయాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు, సర్టిఫికేట్లు సచివాలయాల ద్వారానే ప్రభుత్వం ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తున్నది.

గ్రామాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు
ప్రభుత్వ కార్యాలయాలంటే ఒకప్పుడు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోనే ఉండేవి. కానీ గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు అయిన తరువాత గ్రామ, వార్డు సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఒక్కోచోట మూడు పక్కా ప్రభుత్వ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. దీనితో ప్రతీ గ్రామంలోనూ ఇపుడు ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బందితో కళ కళ లాడుతున్నాయి. 104, 108 సేవలు కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే విలేజ్ క్లినిక్ ప్రారంభం అయితే గ్రామాల్లోనే అవ్వా, తాతలకు ప్రాధమిక వైద్యసేవలు కూడా గ్రామాల్లోనే అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన తరుణంలో ప్రజలకు కూడా అన్ని అంశాలపై అవగాహన వస్తున్నది.

జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు ద్రుష్టిసారిస్తే మరిన్ని ఫలితాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కమిషనర్లు ద్రుష్టిసారిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు తీసుకు రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ విషయంలో అధికారులు అంటీ ముట్టనట్టు వ్యవహరించడం వలన ఇంకా గ్రామ సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహనలేదనే విషయం ప్రతీ సోమవారం జాల్లా కలెక్టర్ కార్యాలయం, కమిషనరేట్ లలో నిర్వహించే స్పందనలో ప్రజల నుంచి వచ్చే అర్జీలే స్పష్టం చేస్తున్నాయి. కలెక్టర్, కమిషనర్ గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే యూనిఫాం, ఉద్యోగుల డ్యూటీచార్ట్, స్పందన దరఖాస్తులు, పారిశుధ్యం, వినతుల పరిష్కారం, సచివాలయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచే విషయం, ప్రాపర్ ఛానల్ విధానాలు, శాఖాపరమై విధులు, బాధ్యతలు(గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, కమిషనర్ కార్యాలయం, మండల కార్యాలయాలు, జిల్లాశాఖల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే జీఓలు, వాటిని ఒక విధానంలో అమలు చేసే ప్రక్రియ)పై అధికారులు ద్రుష్టి సారించడం లేదు.

ఈ విషయంలో మండల, జిల్లా అధికారులను బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్, కమిషనర్ లు ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తే ప్రభుత్వ లక్ష్యం ఈపాటికే పూర్తిస్థాయిలో నెరవేరి గ్రామ స్వరాజ్య స్థాపన జరిగేదనే విషయాన్ని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా మండలాలు, జిల్లాల్లో అధికారులు పూర్తిస్థాయి అధికారులు కాకపోవడం, ఇన్చార్జి పాలనే పూర్తిస్థాయిలో కొనసాగం, చాలా సంవత్సరాల తరువాత కార్యదర్శిల నుంచి జిల్లాఅధికారుల వరకూ ఎక్కువ మంది సిబ్బందిని ఒకేచోట చూడటం, ఆపై తమలోని ప్రత్యేకను సిబ్బందిపై రుద్దడం తదితర అంశాలు కూడా ప్రజా సేవలకు విఘాతం కలిగిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రశాఖల ముఖ్యకార్యదర్శిల నుంచి జీఓలు నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. దానిపై జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు సైతం ద్రుష్టి సారించడం లేదు. ఒక్కోసారి సదరు జీఓలు మండల కేంద్రాలకు వచ్చినా వాటిని ఎంపీడీఓలు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ఈ విషయాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరి పూర్తిస్థాయిలో గాంధీజి కలలు గన్న గ్రామస్వరాజ్యం గ్రామాల్లో సిద్ధిస్తుందనే వాదన కూడా సర్వత్రా బలంగా వినిపిస్తోంది..!

Guntur

2022-10-02 07:10:53

చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అరుదైన జీవజాలంకు ఆల‌వాలంగా ఉన్న చిత్త‌డి నేల‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, ఇంధ‌న‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, గ‌నుల‌శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అట‌వీ అధికారుల‌ను ఆదేశించారు. అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో బుధ‌వారం అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ అధికారుల‌తో వెట్ ల్యాండ్ బోర్డ్ తొలి స‌మావేశం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అధ్య‌క్ష‌త‌న జరిగింది. ఈ స‌మావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలోని చిత్త‌డినేల‌ల్లో జీవ వైవిధ్యాన్ని ప్ర‌తిభింబిస్తూ అనేక ర‌కాల జంతువులు, ప‌క్షులు, జీవ‌జాలం మ‌నుగ‌డ‌ను సాగిస్తున్నాయ‌ని అన్నారు. కొల్లేరు, నేల‌ప‌ట్టు, పులికాట్, కొరింగ‌, శ్రీ‌కాకుళంలోని ప‌లు ప్రాంతాల్లో చిత్త‌డి నేల‌లు ఉన్నాయ‌ని అన్నారు. కొల్లేరు, పులికాట్ ప్రాంతంలోని చిత్త‌డి నేల‌ల్లో అరుదైన విదేశీ ప‌క్షులు వేల కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం చేసి, ఈ ప్రాంతంలో త‌మ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయ‌ని తెలిపారు. 

వీటితో పాటు అంత‌రించుపోతున్న ప‌లు జంతువులు, జీవ‌జాలాలు చిత్త‌డి నేల‌ల్లో ప్ర‌కృతి ఒడిలో మ‌నుగ‌డ సాగిస్తున్నాయ‌ని అన్నారు. ఇటువంటి చిత్త‌డి నేల‌ల‌ను కాపాడుకోవాల‌ని ఇరాన్ లోని రామ్ స‌ర్ లో జాతీయ క‌న్వెన్స‌న్ జ‌రిగింద‌ని, ఇందులో ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు పాల్గొని ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, జీవివైవిధ్యంను కాపాడుకునేందుకు తాము కూడా భాగ‌స్వాములు అవుతామ‌ని స్ప‌ష్టం చేశాయ‌ని గుర్తు చేశారు. చిత్త‌డి నేల‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై 2019, 2017లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ట్టాలు చేసింద‌ని తెలిపారు. వాటి ఆధారంగా రాష్ట్రంలోనూ వెట్ ల్యాండ్ బోర్డ్ ఏర్పాట‌య్యింద‌ని, అయితే ఈ బోర్డ్ స‌మావేశాలు గ‌తంలో జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నిర్వ‌హించిన‌ తొలి స‌మావేశం సంద‌ర్బంగా అట‌వీశాఖ అధికారులు చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్య‌క దృష్టి సారించాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. 

కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌న రాష్ట్రంలో మొత్తం 30వేల ఎక‌రాల్లో చిత్త‌డి నేల‌లు ఉన్న‌ట్లు గుర్తించింద‌ని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. వివిధ జిల్లాల్లో విస్త‌రించి ఉన్న ఈ నేల‌ల్లో కొంత మేర ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంద‌ని అన్నారు. కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2 వ కాంటూరు వ‌ర‌కు చేప‌ల చెరువులు విస్త‌రించాయ‌ని అన్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో సీజ‌న‌ల్ గా వ్య‌వ‌సాయం, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారని తెలిపారు. వీట‌న్నింటిపైన నిర్ధిష్ట‌మైన స‌మాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్య‌వ‌సాయం, అట‌వీశాఖ అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  రెండు నెల‌ల్లో ఈ క‌మిటీ ప్రాథ‌మిక నివేదిక‌ను వెట్ ల్యాండ్ బోర్డ్ కు స‌మ‌ర్పిస్తుంద‌ని తెలిపారు. అటు ప్ర‌జ‌ల జీవ‌నోపాధుల‌కు విఘాతం లేకుండా, ఇటు చిత్త‌డి నేలల్లో జీవ‌జాలం మ‌నుగ‌డ‌కు ముప్పు లేకుండా వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వర్యంలో అవ‌సర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో అట‌వీశాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్, అట‌వీద‌ళాల అధిప‌తి మ‌ధుసూధ‌న్ రెడ్డి, పిసిపిఎఫ్ ఎకె ఝా, స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ శాంతిపాండే త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tadepalli

2022-09-28 15:44:11

శ్రీవారి సేవకులు స‌నాత‌న ధ‌ర్మ ర‌థ‌సార‌థులు

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రేమతో సేవ‌లు అందించ‌డంతోపాటు టిటిడి వివిధ ప్రాంతాల్లో నిర్వ‌హిస్తున్న శ్రీ‌నివాస క‌ల్యాణాలు, వైభ‌వోత్స‌వాలు లాంటి ధార్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొని స‌నాత‌న ధ‌ర్మ ర‌థ‌సార‌థులుగా నిలుస్తున్నార‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు విచ్చేసిన శ్రీ‌వారి సేవ‌కుల‌కు తిరుమల ఆస్థానమండపంలో బుధ‌వారం అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లందించ‌డం శ్రీ‌వారి సేవ‌కుల అదృష్ట‌మ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 22 సంవ‌త్సరాల క్రితం శ్రీ‌వారి సేవ‌ను ప్రారంభించిన‌ట్టు చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశం న‌లుమూల‌ల నుండి 13 ల‌క్ష‌ల మందికి పైగా సేవ‌కులు పాల్గొన్నార‌ని వెల్ల‌డించారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు ఏడు రాష్ట్రాల నుంచి 3500 మంది సేవ‌కులు వ‌చ్చార‌ని తెలిపారు. రానున్న కాలంలో అన్ని జిల్లాల నుండి సేవ‌కుల సంఖ్య పెంచాల‌ని సూచించారు. తిరుమ‌ల‌తోపాటు తిరుప‌తిలోని స్థానికాల‌యాల్లో కూడా సేవ‌కులు సేవ‌లందిస్తున్న‌ట్టు చెప్పారు. దీంతో పాటు ప‌ర‌కామ‌ణి సేవ‌కూడా ఉంద‌న్నారు. రూ.23 కోట్ల‌తో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని బుధ‌వారం ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు శ్రీ‌వారి సేవ‌కులు మాట్లాడుతూ శ్రీ‌వారి సేవ చేసే అవ‌కాశం రావ‌డం భ‌గ‌వంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్న‌ట్టు తెలిపారు.

శ్రీ‌వారి సేవ‌కుల కోసం క్యూ ఆర్ కోడ్ ప్రారంభం

తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో సేవ‌లందించే శ్రీ‌వారి సేవ‌కులు ఆయా మార్గాల‌ను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూఆర్ కోడ్ విధానాన్ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ప్రారంభించారు. మొద‌ట‌గా ఒక శ్రీ‌వారి సేవ‌కుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆ ప్రాంతానికి వెళ్లే మార్గాన్ని తెలుసుకున్నారు. ద‌శ‌ల‌వారీగా భ‌క్తుల కోసం వివిధ ప్రాంతాల్లో ఈ క్యూఆర్ కోడ్‌ల‌ను అందుబాటులో ఉంచ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  పోక‌ల అశోక్‌కుమార్‌, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో  ష‌ణ్ముఖ్ కుమార్‌, విజివో  బాలిరెడ్డి, టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా.టి.రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి  పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో  నిర్మ‌ల, శ్రీ‌వారి సేవ సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2022-09-28 11:45:33

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటునమోదు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర1న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదేరోజు నుంచి ఓటర్లు కూడా తమ ఓటును నమోదు చేసుకోవాల్సి వుంటుంది. గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు మాత్రమే వుంటుంది. ఓటు నమోదు చేసుకోవడానికి అభ్యర్ధులు ఫారమ్ 18ని నింపి దానికి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్) ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జతచేయాల్సి వుంటుంది. అలా పూర్తిచేసిన దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయం, లేదా ఆర్డీఓ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ లలో సమర్పించవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లై లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గతంలో ఓటర్లుగా ఉన్నవారు కూడా మళ్లీ ఓటు నమోదు చేసుకోవాలి. 

పాత ఓటరు జాబితా మొత్తం రద్దు చేయడం వలన ఇపుడు అభ్యర్ధులంతా కొత్తగా నోమోదు  చేసుకోవాలి. పెద్దల సభకు తమ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను పంపాలనుకునే పట్టభద్రులు ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవడంతోపాటు, ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ ఒక్క పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవడంతోపాటు, తోటి పట్టభద్రులతో కూడా ఓటుని నమోదు చేసుకునేలా తమవంతు సహకారం అందించాలని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రతీ పట్టభద్రుడుకి సూచిస్తోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు ఓటింగ్ శాతం పెరగడానికి ప్రతీ ఒక్కరూ చేయి చేయి కలిపి ముందుకు సాగాలని కూడా కోరుతున్నాం.

Guntur

2022-09-28 07:29:43

రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో కోల్డ్ వార్..పోటా పోటీ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పుణ్యమాని రాష్ట్రప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిలు,  ముఖ్య అధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. దిశా నిర్ధేశం లేని వ్యవస్థలో 19 ప్రభుత్వశాఖల ప్రన్సిపల్ సెక్రటరీలు పోటా పోటీగా ఉత్తర్వులు ఇస్తూ జిల్లాల కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులను గంధరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే అదునుగా జిల్లా, మండల స్థాయి అధికారులు, పంచాయతీలు, సచివాలయాల్లోని కార్యదర్శిలు కూడా తమ ప్రతాపాన్ని సిబ్బందిపైనే చూపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లు ఎవరికి వారే తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టుగా తాజాగా విడుదలైన ఉత్తర్వులే రుజువు చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలకు ఇంటి ముంగిట అందాల్సిన ప్రభుత్వ సేవలు అటకెక్కుతున్నాయి. సిబ్బంది వారి వారి మత్రుశాఖల విధుల కంటే అదనపు ప్రభుత్వశాఖల పనులు అధికంగా చేయాల్సి వస్తున్నది. ఎవరు ఏ శాఖ ఉద్యోగులో వారికే తెలియని అయోమయ పరిస్థి నెలకొంది. అన్ని ప్రభుత్వశాఖల్లోనూ రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఇన్చార్జి వ్యవస్థలు కొనసాగుతుండటంతో పరిపాలన వ్యవస్థ గాడితప్పుతున్నదా అనే అనుమానాన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు 26 జిల్లాల కలెక్టర్లుకి ఇచ్చిన ఉత్తర్వులు రుజువుచేస్తున్నాయి.

ఒకరు చేయాలని ఉత్తర్వులిస్తే..మరొకరు తొలగించమని ఆదేశాలు
ప్రభుత్వ శాఖల్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలు గ్రామ, వార్డు సచివాలయశాఖలోలని 19 శాఖల సిబ్బందికి అన్ని రకాల పనులు చేయాలని ఉత్తర్వులు జారీచేస్తే..తమ శాఖ సిబ్బందికి ఆ పనులు చెప్ప వద్దంటూ మరోశాఖ ముఖ్యకార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు వస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే కాదు ఇటు జిల్లాల కలెక్టర్లు కూడా ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు చేసే ఆదేశాలతో తలలు పట్టుకుంటున్నారు. వెరసీ రాష్ట్రశాఖల అధికారుల మధ్య కోల్డ్ వార్ ఉత్తర్వుల రూపంలో సచివాలయ సిబ్బందిపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగని క్రిందిస్థాయిలో జిల్లా అధికారులు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు ముందుగా వచ్చిన ఆదేశాలను అమలు చేసి, ఆ తరువాత మరోశాఖ కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి ఎక్కడలేని నొప్పులన్నీ పడుతున్నారు. జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ఉత్తర్వులను తప్పా.. మండల అధికారులు ఏ ప్రభుత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినా వాటినైనా బుట్టదాఖలు చేస్తున్నారు. అలాగని జిల్లా కలెక్టర్లు సైతం ప్రభుత్వశాఖల నుంచి వచ్చిన ఉత్తర్వులను జిల్లాశాఖల అధికారుల ద్వారా ప్రాపర్ ఛానల్ లో మండల అధికారులకు పంపడం లేదు. పంపినా వాటిని వెంటనే అమలు చేయాలని ఆదేశాలివ్వడం లేదని అధికారులే చెబుతున్నారు.

నాడు 3సార్లు అందరికీ బయో మెట్రిక్..నేడు కొందరికి రెండుసార్లే
గ్రామ, వార్డు సచివాలయాల్లో 19శాఖల సిబ్బంది ఖచ్చితంగా మూడు సార్లు బయోమెట్రిక్ అటెండెన్సు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే..కొన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది కేవలం తమ శాఖ సిబ్బంది రోజుకి రెండుు సార్లు మాత్రమే బయోమెట్రిక్ వేస్తారని, వారికి మూడుసార్లు అటెండెన్సు అవసరం లేదని ఉటంకిస్తూ..అన్ని జిల్లాల కలెక్టర్లకు పలుశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉత్తర్వులు జారీచేశారు. దీనితో పనిచేసే కొందరు సచివాలయ సిబ్బందికి రోజూ మూడు సార్లు వేసే బయో మెట్రిక్ అటెండెన్సు నుంచి మినహాయింపు వచ్చింది. ఇలా కొన్ని శాఖలకు మినహాయింపు ఇవ్వడంతో మిగిలిన శాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శిలు కూడా తమశాఖ సిబ్బందికి ఎలాంటి అదనపు పనులూ అప్పగించవచ్చదని మరొకొన్ని ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నుంచి కొన్నిశాఖల సిబ్బంది కోసమే వచ్చిన ఉత్తర్వులు మిగిలినశాఖల సిబ్బందికి తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తున్నాయి.

మా శాఖ సిబ్బందికి బిఎల్వో డ్యూటీలు వేయకండి..
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎలా ఉన్నా..వారి ప్రభుత్వశాఖల పనులు కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోని అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికీ బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులు అదనంగా వేసి మాత్రుశాఖల విధులకు పక్కన పెట్టేవిధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనితో సచివాలయ సిబ్బంది వారి వారి శాఖల ప్రధాన విధులను పక్కనబెట్టి, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆదేశాలు, మండల స్థాయిలో తహశీల్దార్ల ఆదేశాలకు, హెచ్చరికలకు భయపడి బిఎల్వో విధులనే చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్రశాఖల కమిషనర్లు తమ శాఖ సిబ్బందికి బిఎల్వో విధులు తప్పించాలని, అదేవిధంగా బయో మెట్రిక్ మూడు సార్లు కూడా వేయరని మళ్లీ తాజాగా జిల్లా కలెక్టర్లకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేశారు. ఇలా ఎవరి శాఖలకు సంబంధించిన ముఖ్యకార్యదర్శిలు, కమిషర్లు వారి వారి శాఖల సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.

రాష్ట్రశాఖల అధికారుల్లో కొరవడిన సమన్వయం..
ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో గ్రామస్థాయిలోనే ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వశాఖల మధ్య కొరవడిన సమన్వయంతో ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఒక శాఖ అధికారి సచివాలయ సిబ్బంది మొత్తం తమ శాఖ సూచించిన విధులు నిర్వర్తించాలని ఆదేశిస్తే..మరోశాఖ అధికారా ఆ విధుల నుంచి తమ శాఖ సిబ్బందికి ఎలాంటి విధులూ అప్పగించకూడదని మరో ఉత్తర్వు జారీచేస్తున్నారు. ఈ విధానం చూస్తుంటే అసలు రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి, ఇతర ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిలకు, కమిషనర్లకు శాఖల మధ్య అవగాహన లేదనే విషయం స్పష్టమవుతున్నది. వాస్తవానికి సచివాలయాల్లోని 19శాఖల సిబ్బందికి వారి ప్రభుత్వ శాఖలకు చెందిన విధులు, పనులు కాకుండా అదనపు విధులు అప్పగించడం ద్వారా ఏ లక్ష్యంతో అయితే వీరిని ఉద్యోగాల్లో నియమించారో ఆ పని జరగకుండా అదనపు విధులు మోకాలడ్డుతున్నాయి. దీనితో ఏ శాఖకు చెందిన రాష్ట్ర అధికారులు, వారి శాఖల సిబ్బందికోసం, వారి శాఖలో పేరుకు పోతున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఒక శాఖ జారీచేసిన విధులను రద్దు చేయాలని మరో ఉత్తర్వులు జారీచేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని ప్రభుత్వశాఖలకు గ్రామస్థాయిలో సిబ్బంది ఉన్నారు కనుక వారి వారి శాఖల పనుల పురోగతిపై కాకుండా అన్ని రకాల పనులను అందరికీ అప్పగించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చూడాలి ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేది..!

Guntur

2022-09-28 03:22:18

పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో సీఎం వైఎస్.జగన్..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. బుధ‌వారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

          ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు  నారాయణ స్వామి,  సత్యనారాయణ, మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  వేణుగోపాలకృష్ణ, మతి రోజా, ఎంపిలు  మిథున్ రెడ్డి,  రెడ్డెప్ప, గురుమూర్తి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు  భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి,  బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు  రాములు,  పోకల అశోక్ కుమార్,  సంజీవయ్య,  మధుసూదన్ యాదవ్,  మారుతి ప్రసాద్,  ప్రశాంతిరెడ్డి, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-09-27 16:46:58

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా  ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

           ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి  నారాయణ స్వామి, మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  సత్యనారాయణ,  వేణుగోపాలకృష్ణ,  రోజా, ఎంపిలు  మిథున్ రెడ్డి,  రెడ్డెప్ప, తిరుప‌తి ఎమ్మెల్యే  భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-09-27 16:15:37