1
గాంధీ జయంతి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని భావించిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక చేదు కబురు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తూ.. చక్కర్లు కొడుతుంది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ మరో ఏడాది ప్రభుత్వం పొడిగించనుందని, వారు బాధపడకుండా వారి జీతం రూ.15 నుంచి 20వేలు చేస్తుందనేది దీని సారాంశం. ఈ విషయాన్ని కొందరు డివిజన్ లెవల్ అధికారులు సైతం గ్రామ సచివాలయాలకు తనిఖీలకు వచ్చిన సందర్భంగా ఉద్యోగులతో కుశల ప్రశ్నలు వేస్తూ ఈ మాటను కూడా చెప్పి వెళ్లిపోతున్నారు. దానివెనుక ఒక సాంకేతిక కారణాన్ని కూడా అధికారులే చెబుతుండటం విశేషం. అదేంటంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 25వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటే అందరూ డిపార్టమెంటల్ పరీక్షలు పాస్ కాలేదని.. ఈ కారణంగా రెండు మూడు దఫాలు మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి టెస్టులు పెట్టి వారంతా పాసైన తరువాత ఒకే సారి ఉద్యోగులందరికీ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారని ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది అన్నట్టుగా సచివాలయాల్లో ఉద్యోగులకు అధికారులు చెప్పి వెళ్లిపోతున్నారని తెలిసింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న సచివాలయ ఉద్యోగులకు ఈ చేదు కబురు జీర్ణం కావడం లేదు. కరోనా రెండేళ్లసమయంలో తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవలు అందించామని, అదే సమయంలో చాలా మంది కరోనా భారిన కూడా పడ్డామని, తీరా అక్టోబరు 2 తరువాత తీపి కబురు అందుతుందనుకుంటే ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2వ వనివారాలు, ఆదివారాలు, ఇతర సెలవు రోజులనే తేడా లేకుండా ప్రభుత్వానికి, ప్రజలకే సేవలు అందించామని తీరా ఇపుడు ప్రభుత్వమే ఈ విధంగా ప్రొబేషన్ మరో ఏడాది పొడిగిస్తుందనే బాంబు పేల్చిందని వాపోతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో డిపార్ట్ మెంటల్ పరీక్షలు పెట్టి వుంటే గాంధీ జయంతి నాటికి అందరు ఉద్యోగులు ప్రొబేషన్ డిక్లరేషన్ కు సిద్దంగా ఉండేవారనే విషయాన్ని సదరు సచివాలయ ఉద్యోగులు అధికారుల వద్ద ప్రస్తావిస్తే.. తమకు అందిన సమాచారం మాత్రమే తాము చెబుతున్నామని, తమకి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదని మరోమాటగా కూడా చెబుతున్నారట. ప్రభుత్వ ఉద్యోగం, అందునా రెగ్యులర్ ఉద్యోగాలని చెప్పి.. చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సాప్ట్ వేర్ తో పలు ప్రైవేటు కంపెనీల్లో వేలాది రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకొని వచ్చామని.. తీరా చూస్తే ప్రభుత్వం తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రోజుకో ట్విస్టు ఇస్తుంటే.. పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా వుంటుందోనని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసిన ప్రభుత్వం కనీసం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బదిలీలు చేపట్టినా సొంత జిల్లాలు, తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోతే కనీసం ఇచ్చే రూ.15వేలు జీతానికి ఇంటి అద్దెలు, ఖర్చులైనా తగ్గుయాని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చే రూ.15 వేలు జీతం సరిపోవడం లేదని, చేస్తున్న ఉద్యోగాల్లో రోజుకో నిబంధన.. ఒక్కో అధికారి ఒక్కో ఆదేశం, ఒక్కో ఒక్కోవిధంగా చెబుతుంటే ఈ ఉద్యోగాలు చేయగలమా అనే వాదన కూడా సచివాలయ ఉద్యోగుల నుంచి బలంగా వినిపిస్తుంది. అందులోనూ మండల స్థాయి అధికారులు సైతం గ్రామసచివాలయ ఉద్యోగులను చిన్పచూపు చూడటం, వర్క్ లోడు పెంచుతూ.. ప్రైవేటు కంపెనీల్లో మాదిరిగా వర్క్ టార్గెట్లు ఇవ్వడం కూడా సచివాలయ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.
విశేషం ఏంటంటే ఇంతకాలం మండల అధికారులుగానీ, పంచాయతీ కార్యదర్శిలు గానీ పాలక వర్గాలు లేనపుడు, ఇంత మంది సిబ్బంది లేనపుడు వారిదే రాజ్యం అన్నట్టుగా విధులు నిర్వహించారు. తీరా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పడి ఒకేసారి గ్రామస్థాయిలోనే 14 మంది సిబ్బందిని చూసేసరికి మండల అధికారుల్లోనూ, పలు పంచాయతీల్లోని గ్రేడ్1 నుంచి గ్రేడ 4 కార్యదర్శిల వరకూ అంతా వీరిపై పెత్తనం చలాయిస్తున్నట్టుగా మారిపోయారనే వాదన ఉద్యోగులు నుంచి చాలా బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగులకు ఇచ్చిన ఆయా ప్రభుత్వ శాఖల విధినిర్వహణ కంటే పంచాయతీలోని పనులు తాము చెప్పినట్టు చేస్తేనే సకాలంలో జీతాలు అందుకుంటారనే బెదిరిపులు కూడా ఉద్యోగులకు అధికం అయ్యాయి. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు ఒక్కటై ఉద్యోగులను స్కూలు పిల్లలను చూసినట్టే చూస్తున్నారనే ప్రచారం కూడా అధికంగా జరుగుతుంది. అయితే ఈ విషయాలేమీ జిల్లా కలెక్టర్లు, గ్రామ, వార్డు సచివాలయ జెసీలు, జిల్లా పంచాయతీ అధికారుల ద్రుష్టి వరకూ వెళ్లడంలేదు. దీనితో పంచాయతీ స్థాయిలో గ్రేడ్-1 నుంచి గ్రేడ-4 కార్యదర్శిలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు ఏం చెప్పినా అది సచివాలయ ఉద్యోగులు చేయాల్సి వస్తుంది. ఇక్క విచిత్రం ఏంటంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆయా ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన సర్క్యులర్లుగానీ, జీఓలు గానీ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి మండల కార్యాలయాలకు అక్కడి నుంచి గ్రామ సచివాలయాలకు చేరడం లేదు. కానీ ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత ఉద్యోగులంతా మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల కంటే అత్యధిక విద్యావంతులు కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి జీఓలు వచ్చినా, సర్క్యులర్లు వచ్చినా మండల అధికారుల కంటే ముందుగానే వాటిని సంపాదించ గలుగుతున్నారు.
వాటి ఆధారంగా గ్రామసచివాలయాల్లో సిబ్బంది పనులు చేసుకు పోతున్న సమయంలో కూడా వాటిని మండల అధికారులు, పంచాయతీల్లో పలువు కార్యదర్శిలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము చెప్పకపోయినా ప్రభుత్వ ఆదేశాలు వీరికి తెలుస్తున్నాయని, కొంత మంది తాము పెట్టే సమావేశాల్లోనే తమనే తిరిగి ప్రశ్నిస్తున్నారనే కడుపు మంటను రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో అధికారులు ప్రదర్శిస్తున్నారు. కొన్ని మండలాల్లో అయితే మండల అధికారులే సచివాలయ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేలా దగ్గరుండి సచివాలయ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారు. ఇన్ని విధాలుగా అధికారుల నుంచి ఒత్తిడులు, చిరాకులు, చీత్కారాలు, కడుపుమంటలు ఎదుర్కొని రెండేళ్లపాటు విధులు నిర్వహిస్తే.. తీరా అక్టోబరు రెండు తరువాత ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయనుకుంటే ఆ మాట మరోఏడాది పాటు వెనక్కి వెళ్లేలా ఉన్నట్టు డివిజనల్ స్థాయి అధికారులు చేస్తున్న ప్రచారాలను బట్టి తెలుస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రచారం చేస్తున్నట్టుగానే గాంధీ జయంతి నాటికి సచివాలయ ఉద్యోగుల రెగ్యులైజేషన్ విషయంలో ప్రభత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు కూడా జరుగుతున్న ప్రచారం నిజమేనని నమ్మే స్థితికి చేరుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు వస్తుంది..ఉన్న ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారా.. లేదంటే డిజివనల్ స్థాయి అధికారులు ప్రచారం చేస్తున్నట్టుగా మరో ఏడాది ప్రొబేషన్ పెంచుతారా అనేవిషయంలో క్లారిటీ అయితే రావాల్సి వుంది..!