జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు వీలుగా ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాకు చెందిన జర్నలిస్టులకు ఈనెల 17వ తేదీన ( మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 00 గంట వరకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలోని జర్నలిస్టులు అందరూ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రారంభ సమావేశంలో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు. జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ ప్రారంభోపన్యాసం చేస్తారని, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కూడా పాల్గొంటారని వివరించారు. నెల్లూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ తరగతుల్లో ' వార్తలు సేకరించడంలో మెలకువలు, వార్తల్ని పసిగట్టడం ఎలా' అనే అంశంపై జర్నలిజంలో అపారమైన అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ పత్రిక మాజీ ప్రధాన సంపాదకులు జి.వల్లీశ్వర్, రచన స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాల్ గా, అధ్యాపకులుగా వందల మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఉమామహేశ్వరరావు ' వార్తల రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు' అనే అంశంపై ఉపన్యసిస్తారని వివరించారు. శిక్షణ తరగతుల సందర్భంగా జర్నలిస్టులు ఆన్ లైన్ లోనే తమ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ లింక్ అనంతపురం జిల్లాలోని జర్నలిస్టులందరికీ 16వ తేదీన సాయంత్రమే పంపుతామని తెలిపారు.
ఆన్ లైన్ లో స్టడీ మెటీరియల్ :
జర్నలిస్టులకు ఉపయుక్తం గా ఉండేందుకు స్టడీమెటీరియల్ ఆన్ లైన్ ద్వారా పంపుతామని దేవిరెడ్డి శ్రీనాథ్ వెల్లడించారు. వార్త అంటే ఏమిటి, కథనాలు రాయడం ఎలా, టీవీ రిపోర్టర్ ఎలా ఉండాలి, క్రైమ్ బీట్ పై ఫోకస్, తప్పులు రాయవద్దు తదితర పది అంశాలపై రూపొందించిన బుక్ లెట్ పిడిఎఫ్ మెటీరియల్ మెయిల్ ఐడి లకు పంపుతామని వివరించారు. తరగతులకు హాజరైన జర్నలిస్టులకు అదేరోజు సాయంత్రం ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు కూడా పంపుతామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మెట్ట భూములకు కూడా సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘వైయస్సార్ జలకళ’ పథకంతో బీడు భూములు కూడా సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఈ పథకంతో సిఎం మెట్టభూముల రైతుల కన్నీళ్లు తుడిచారని కితాబిచ్చారు. కురుపాం పంచాయతీ పరిధిలోని కస్పాగదబవలస గిరిజన గ్రామంలో ఆదివారం వైయస్సార్ జలకళ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలుస్తానని, మెట్ట భూముల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని, నవరత్నాల్లో భాగమైన ఆ హామీని జలకళ పథకం ద్వారా నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలకు లోపు భూమి కలిగిన రైతులందరూ కూడా ఈ పథకంలో లబ్ది పొందడానికి అర్హులేనని వివరించారు. బోరు వేయడంతో పాటుగా దానికి అవసరమైన మోటారును, విద్యుత్ సరఫరాను కూడా ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తుందని చెప్పారు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఇతర రైతులతో కలిసి ఉమ్మడిగా బోర్లు వేయించుకోవచ్చునన్నారు. ఒకసారి బోరు విఫలమైతే మరోసారి కూడా బోరు వేయించుకొనే అవకాశం ఉంటుందని గుర్తు చేసారు. జలకళ పథకంలో బోర్లు వేయడానికి ముందు శాస్త్రీయ పరిశీలనలు చేసిన తర్వాతనే బోర్ పాయింట్ ను గుర్తించడం జరుగుతుందని, ఈ కారణంగా బోర్లు విఫలమైయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రభుత్వం జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 9 రిగ్ లను కూడా సమకూర్చిందని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గతంలో మెట్ట రైతులు తమకు ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పులు చేసి బోర్లు వేయించుకొనే వారని, ఆ బోర్లు విఫలమైతే అప్పుల ఊబిలో కూరుకుపోయేవారని చెప్పారు. ఈ కష్టాలను కడతేర్చడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు. వైయస్సార్ జలకల పథకం ద్వారా ప్రభుత్వం చితంగా వేయించే బోర్లతో ఇప్పటి దాకా బీడువారిన లక్షలాది ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయని, మెట్టభూముల రైతుల కళ్లల్లోనూ ఆనందకాంతులు నిండుతాయని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోర్లు వేయించుకోవడానికి, మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడానికి ఎవరికీ పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పదిహేడు నెలల పాలనలోనే తాను రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని, రాష్ట్రంలో ఉన్నది రైతు రాజ్యమని అందరికీ అర్థమైయ్యేలా చేసారని, రైతుల కన్నీళ్లు తుడిచారని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్నికల కన్వీనర్ బొంగు సురేష్, మాజీ జడ్పీటీ పద్మా వతి,మాజీ ఎంపీటీసీ గొర్లి సుజాత, కురుపాం, జియ్యమ్మవలస వైసీపీ పార్టీ కన్వీనర్ లు ఎం. గౌరిసంకరరావు ,ఐ. గౌరిసంకరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరావు, వైస్సార్సీపీ మైనార్టీ నాయకులు షేక్ నూరుల్లా, కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కె.సురేష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, ఐరుక కార్పొరేషన్ డైరెక్టర్ గవర విజయ్ చంద్ర శేఖర్, ఎంపీడీఓ మురళీకృష్ణ, ఉపాధి హామీ ఏపిడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 23 ప్రఖ్యాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అధికార మర్యాద చెయ్యాలంటూ దేవాదాయశాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేయడం దారుణమని జనసేన నాయకులు పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకోసం పాటు పడాల్సింది పోయి.. ఈ నెల 18 న స్వామీజీ జయంతికోసం ఏకంగా ప్రముఖ దేవలయాల్లో పూజలు, మర్యాదలు చేయాలని జీఓ జారీచేయడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కి సన్నిహితుడు అన్న కారణంగా ఇప్పటికే ప్రభుత్వం స్వామి ముందు సాగిలపడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి స్వామి భక్తివుంటే దానిని ప్రజలు, ఆలయాల మీదకు జీఓల ద్వారా రుద్దడం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పద్దతి కాదన్నారు. స్వామీజీలకు, మఠాధిపతులకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజలకు పూర్తిస్థా వైద్యం అందించడంలోనూ, పీహెచ్సీల్లో అన్నిరకాల పారామెడికల్ సిబ్బందిని నియమించడంలోనూ, చదువులు చెప్పే పాఠశాలల్లో అన్ని తరగతులకు ఉపాధ్యాయులను నియంమించడానికి, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులు, వివిధ ప్రభుత్వ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి వినియోగించాలని అన్నారు. అలా చేయడం ద్వారా ప్రజలు మీ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నవారు అవుతారని అన్నారు. ఇప్పటికైనా హిందూ ధర్మాలకి,ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా నడిచే ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఫ్యూజన్ ఫుడ్స్ అరాచకాలకు కాలం చెల్లింది..వేలంపాట లేకుండా అప్పనంగా ఇంతవరకూ కాలం గడిపిన ఆ రెస్టారెంట్ ను అదే వేలం పాట నిబంధనలతో ప్రభుత్వం ఆదివారం ఖాళీచేయించింది..అంతేకాదు అక్రమంగా ఎవరు వ్యవహరించినా ఇదే పరిస్థితి వస్తుందనే సంకేతాలు కూడా ఇచ్చారు వుడా అధికారులు...విశాఖలో వీఎంఆర్‌డీఏ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను అధికారులు ఖాళీ చేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్ల వరకు మాత్రమే లీజు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ దశాబ్దాల కాలంగా ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ వీఎంఆర్‌డీఏ స్థానంలోనే అలాగే కొనసాగుతూ వచ్చేసింది.. 2015 నుంచి 24 వరకు అనుమతులు ఇస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. వాస్తవానికి మూడేళ్లపాటు మాత్రమే అనుమతి ఇవ్వడమే కాక ఆ తర్వాత కొనసాగించాలంటే వేలంపాట వేయాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు పాటించకుండానే తొమ్మిదేళ్ల పాటు తాజాగా అనుమతులు పొంది ఫ్యూజన్ ఫుడ్స్ కొనసాగుతోందన్న ఫిర్యాదుపై వీఎంఆర్‌డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. సామాగ్రిని యజమానికి అప్పగించి ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితుడిగా పేరొందిన హర్ష కుమార్ ఈ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ నిర్వాహకుడు కావడం విశేషం. ఆ కారణంగానే ఎలాంటి వేలం పాట లేకుండా మూడేళ్లకు ఒకసారి నిర్వహాంచాల్సిన వేలం పాటకూడా పెట్టకుండా 2024 గడువున్నా అధికారులు మాత్రం పాత నిబంధనల ఆధారంగా ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయించారు. ఇక్కడ విశేషం ఏంటంటే సిరిపురం జంక్షన్ వద్ద ఉడా నుంచి లీజుకు తీసుకున్న ఆస్తిని టీడీపీ నేత హర్ష రెండింతల అద్దెకు మరొకరికి ఇవ్వడమే. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎంత ఆదాయం కోల్పోతుందో అర్ధమవుతుంది. దీంతో అక్రమ లీజుపై ఉక్కుపాదం మోపిన అధికారులు లీజుదారుడిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఈ విషయం విశాఖలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండి వుడా నిర్వహించే మిగిలిన షాపుల లీజులను కూడా ప్రభుత్వం మరోసారి తనిఖీలు చేపడుతోంది. ఇలానే మిగిలిన షాపుల్లో కూడా అక్రమాలు జరిగితే వాటిని కూడా ఖాళీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది..
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు వెమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి వస్త్రాలను శనివారం విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, వేద పారాయణదారులు, పోటు కార్మికులు కలిపి మొత్తం 1200 మందికి ఈ వస్త్రాలను అందజేశారు. దీపావళి పర్వదినం రోజున తిరుమలలోని అర్చక నిలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి చెంత నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలు అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టుకు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తిఅయినది.అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. ఈ ఆస్థానంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నూతన అధ్యయనం ప్రారంభం కావాలని గంట్ల ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్క జర్నలిస్టూ గుర్తెరగాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు, చైతన్యాన్ని జర్నలిస్టులు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత రాష్ట్రంగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని గంట్ల పేర్కొన్నారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదామని గంట్లశ్రీనుబాబు పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 13న జరగనున్న జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ( NTSE ) కొరకు 10వ తరగతి విద్యార్ధులు ఈ నెల 20లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులే కాకుండా 18 సం.ల లోపు వయస్సు కలిగి దూరవిద్య ద్వారా మొదటిసారి 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఈ పరీక్షకు అర్హులేనని ఆమె చెప్పారు. పూర్తి వివరాల కొరకు www.bseap.org వెబ్ సైట్ నందు లేదా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. ఈ అవకాశాన్ని ఆశక్తి వున్న విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా రాబోయే రోజుల్లో పోటీపరీక్షలకు ప్రేరణగా వుంటుందని ఆమె వివరించారు.
తిరుపతిలోని శ్వేత భవనంతోపాటు టిటిడి ప్రాజెక్టులను జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) సదా భార్గవి శుక్రవారం తనిఖీ చేశారు. శ్వేత భవనంలో కోవిడ్ - 19పై టిటిడి ఉద్యోగులకు జరుగుతున్న ఆన్ లైన్ అవగాహన తరగతులను పరిశీలించారు. ఆదేవిధంగా శ్వేత భవనంలో గల కేంద్రీయ గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ద్రవిడ వేద నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకం, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, శ్రీనివాస తెలుగు వాఙ్మయ అధ్యయన సంస్థ, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణం మరియు ఎస్వీ వైభవోత్సవం ప్రాజెక్టులను తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో కోవిడ్-19 నేపథ్యంలో అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. జెఈఓ వెంట ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, శ్వేత సంచాలకులు డా. కె.రామాంజులరెడ్డి తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళంజిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ జె నివాస్ దీపావళ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లా ప్రజలు అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి జిల్లాలో నూతన అధ్యయనం ప్రారంభం కావాలని కలెక్టర్ ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత జిల్లాగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించామని – విద్యార్ధులు ఉన్నతంగా ఆలోచించి వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదాం ... అని కలెక్టర్ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన మంత్రి సంపద యోజన పథకం (PMMSY) కోసం అర్హులైన వారు ఈ నెల 15లోగా APCFSS నవశకం వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2020-21 నుండి ఐదేళ్ల వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 20 వేల 50 కోట్లు కేటాయించగా, అందులో ఈ ఏడాది జిల్లాకు రూ.7.37 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ పథకం క్రింద ఉప్పినీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం, రిజర్వాయర్లలో చేపపిల్లల స్టాకింగ్, సముద్ర జలాల్లో నది ముఖద్వారాల వద్ద పంజారాలు, ఐస్ పెట్టెతో సహా మోటార్ సైకిళ్లు, అక్వాలో వ్యాధి నిర్ధారణ పరీక్ష, సంచార లేబరేటీరీలు, అక్వాక్లినిక్, కొత్త బోట్లు, వలలు, బ్రతికియున్న చేపల విక్రయ కేంద్రాలు, ఇన్సులేటెడ్ వాహనాలు, చేపల అమ్మకానికి ఐసు పెట్టెతో సహా ఆటోలు, ఇ-రిక్షాలు, రిటైలు చేపల మార్కెట్ నిర్మాణము వంటి యూనిట్లను స్థాపించుకోవచ్చని తెలిపారు. ఇతరులకు యూనిట్ ఖరీదులో 60 శాతం లబ్దిదారుని వాటా కాగా 40 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. షెడ్యూలు కులాలు మరియు తెగలకు చెందిన మహిళలు 40 శాతం లబ్ధిదారుని వాటా కాగా 60శాతం రాయితీ లభిస్తుందని ఆయన వివరించారు. కావున ఆసక్తి గల అర్హులైన వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప్పినీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం సాగు యూనిట్ ఖరీదు రూ.18 లక్షలు కాగా, రిజర్వాయర్లలలో చేపపిల్లల స్టాకింగ్ యూనిట్ ఖరీదు రూ.3 లక్షలని చెప్పారు. సముద్ర జలాల్లో నది ముఖద్వారాల వద్ద పంజారాలు(కేజెస్) యూనిట్ విలువ రూ.5 లక్షలని, రిజర్వాయర్లలో పంజారాలు (కేజెస్) యూనిట్ విలువ రూ.3లక్షలుగా ఉంటుందని తెలిపారు. ఐస్ పెట్టెతో సహా మోటార్ సైకిళ్లు యూనిట్ విలువ రూ.75వేలు, ఆక్వాలో వ్యాధినిర్దారణ పరీక్ష సంచార లేబరేటీరీ/ఆక్వా క్లీనిక్ యూనిట్ విలువ రూ.35 లక్షలుగా ఉంటుందని చెప్పారు. పాత బోటుల స్థానములో కొత్త బోటుల వలల యూనిట్ విలువ రూ.5 లక్షలు కాగా, బ్రతికియున్న చేపల విక్రయ కేంద్రాల యూనిట్ ఖరీదు రూ.20 లక్షలని అన్నారు. ఇన్సులేటెడ్ వాహనాల యూనిట్ ఖరీదు రూ. 20 లక్షలని, చేపల అమ్మకానికి ఐస్ పెట్టెతో సహా ఆటోలు,ఇ-రిక్షాల యూనిట్ ఖరీదు రూ. 3 లక్షలుగా పేర్కొన్నారు. రిటైలు చేపల మార్కెట్ల (హబ్) నిర్మాణం కోసం యూనిట్ ఖరీదు రూ. 100 లక్షలు కాగా, చేపల దుకాణాల (కీయాస్క్) నిర్మాణం కోసం యూనిట్ ఖరీదు రూ. 10లక్షలుగా ఉంటుందని అన్నారు. చేపల అదనపు విలువ జోడించే వ్యాపార కేంద్రాల యూనిట్ ఖరీదు రూ. 50 లక్షలని, ప్రతీ యూనిట్ లబ్ధిదారుల వాటాను బ్యాంకు నుండి రుణంగా పొందవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
దరఖాస్తుదారులు ఆక్వా, మత్స్య రంగమునకు చెందినవారై, తగు శిక్షణ పొంది మంచి నైపుణ్యం కలిగిన వారై యుండాలని అన్నారు. యూనిట్ల మంజూరు కొరకు దరఖాస్తుదారులు 2020 నవంబరు 15వ తేదీలోగా తమ దరఖాస్తులను APCFSS నవశకం వెబ్ సైట్ నందు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్ లైన్ లో దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు, వారు కోరు పథకంలోని లబ్ధిదారుల వాటా సొమ్ముకు సంబంధించి బ్యాంకు రుణ మంజూరు పత్రం లేదా బ్యాంకు ఖాతా నందు లబ్ధిదారుని వాటాకు సరిపడు సొమ్ము కలిగియున్న పాసు పుస్తకము, ఇతర అనుమతులు, అవసరమైన పత్రాలు, ప్రోజెక్టు రిపోర్టులు ఆన్ లైనులో అప్ లోడ్ చేయవలసి ఉంటుందని చెప్పారు. ఈ విధముగా అప్లోడ్ చేయబడిన దరఖాస్తులు వివరములను జిల్లా స్థాయి కమిటీ వారు పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని, తగిన పత్రాలు లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఆయన స్పష్టం చేసారు.జిల్లా స్థాయి కమిటీలో ఎంపిక కాబడిన వెంటనే దరఖాస్తుదారులకు జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, రూ.50లక్షలకు పైబడిన యూనిట్ల మంజూరుకు రాష్ట్ర స్థాయి కమిటీ వారి ఆమోదం పొందవలసి ఉంటుందని తెలిపారు. ఈ పథకాలు 2021 మార్చి 31లోగా అమలుకావలసి ఉందని ఆయన వివరించారు.
ఆయనను చూస్తే ఎవరూ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అనుకోరు.. ఎవరినోట విన్నా ఆయన ఇండియన్ పీపుల్ సర్వీస్ ఆఫీసర్(దాన గుణ సేవకుడు) అంటారు..ఆ స్థాయిలో ఆ ఐపీఎస్ వ్యవహార శైలి వుంటుంది.. పోలీసు అధికారుల్లో ఐపీఎస్ అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు...కానీ చిత్తూరు జిల్లా తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి అలా కాదు.. ఆయనను చూస్తే ఎవరికైనా స్నేహభావం మనసులో ఉద్బవిస్తుంది...ఐపీఎస్ ల్లో కూడా ఇంత మంచి అధికారులు ఉంటారా అనిపిస్తుంది..అంతలా ఆయన సేవా కార్యక్రమాలు చేపడతారు..ఆయన మంచి మనసుకి ఆయన సతీమణి కూడా తోడవడంతో ఆయన నిరుపమాన సేవలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా శుక్రవారం దీపావళి సందర్భంగా “పాస్ మనోవికాస్” ఆశ్రమానికి రూ.వేలు ఆర్ధిక సహాయం చేసి, అక్కడ అనాధపిల్లలతో కుటుంబ సభ్యులతో చాలా సరదగా గడిపారు. ఆయకొచ్చే జీతంలో సగభాగం నిరుపేదల సేవలకే వెచ్చిస్తున్నారంటే ఈ అధికారి దాన గుణం ఎలాంటిదో వర్ణించడానికి మాటలే చాలవు. సంస్థ నిర్వాహకులకు ఆర్ధిక సహాయంతోపాటు ఆశ్రమంలో ఉన్న వారి కోసం బియ్యపు బస్తాలు (10), టవళ్ళు, పండ్లు, పలహారాలు, దీపావళి గిఫ్ట్ పాకెట్స్ మొదలగు వాటిని “లక్షయ ఫర్ నీడ్” టీం వారితో కలసి అందించారు. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా, ఏ అవసరం వచ్చినా తనను కలవాలని నా శక్తి మేర సహకారం అందిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఇంతటి సహాయం చేసిన రమేష్ రెడ్డి సేవలు ఎప్పుడూ రాష్ట్రంలో మార్గదర్శిగానే మారుతుంటాయి. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రీన్ టపాసులతో దీపావళి జరుపుకోవాలని, పండుగ రోజు రాత్రి 8 గం. నుంచి 10 గం. మధ్య బాణాసంచా కాల్చుతూ పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు కోవిడ్ నుండి కోలుకున్న రోగులకు పొగ కాలుష్యం వల్ల ఇబ్బందులు కల్గకూడదని వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు దీపావళి జరుపుకోవాలన్నారు. పర్యావరణాన్ని కూడా పరిరక్షించే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ముఖ్యంగా బాణసంచా కాల్చేవారు, దీపాలు వెలిగించే మహిళలూ శానిటైజర్ కు దూరంగా ఉండాలన్నారు. శానిటైజర్ లోని ఆల్కహాల్ వల్ల అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున బదులుగా సబ్బు వాడాలని కోరారు. ప్రజలంతా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగునింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
చిత్తూరు జిల్లాలో రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. తిరుపతి అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎయిర్ పోర్ట్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, బిజెపి నాయకులు భానుప్రకాష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, సైకం జయచంద్రారెడ్డి, జల్లి మధుసూదన్, అజయ్ కుమార్, కాసరం రమేష్, రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్, టర్మీనల్ మేనేజర్ లు గోపాల్, శ్యామ్, సి ఐ ఎస్ ఎఫ్ అధికారి భాస్కరరావు, ఆర్.ఐ.జీవన్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజులు తన కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం తిరిగి హైదరాబాదుకి తిరుగు ప్రయాణం అవుతారని అధికార వర్గాలు తెలియజేశాయి..