విద్యార్థులలో సృజనాత్మక ఆలోచన అవసరమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కరోనా భారీన పడకుండా వినూత్న ప్రయోగం చేసి డిజిటల్ ఐడి కార్డును శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని దుప్పలవలస ఏపిబాలయోగి గురుకుల విద్యార్ధులు రూపొందించారు. ఈ కార్డును తయారు చేసిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నివాస్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు. భౌతిక దూరం పాటించడం ద్వార వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో పరికరాలు వినియోగించి డిజిటల్ ఐడి కార్డు ను రూపొందించారు. టెక్నికల్ ట్రైనర్ శివ సంతోషకుమార్ పాణిగ్రాహి విద్యార్థుల మెదడుకు పదును పెట్టి తక్కువ ఖర్చుతో ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. తేలికపాటి బరువుతో నిత్యం మెడలో వేసుకునేలా డిజిట్ ఐడి కార్డును ఆ పాఠశాలలో 9వతరగతి చదువుతున్న యాగాటి యశ్వంత్ , పెయ్యల గిరి సహాకారంతో దీన్ని తయారు చేశారు. ఐడి కార్డుకు సరిపడే ఎల్ సిడి, డిఎస్ ప్లే, దూరం గుర్తించేందుకు అల్ట్రాన్ సోనిక్ సెన్సర్ , శబ్దం వచ్చేందుకు బ్యాటరీ , బజర్, ఎల్ ఇడిలను పాణిగ్రాహి వినియోగించారు. సరికొత్త టెక్నాలజీని రూపొందేంచే ఈకార్డు తయారీకి 200 రూపాయలు వినియోగించుకుని తయారు చేసారు. ఆరు అడుగుల దూరం కన్నా దగ్గరకి ఎవరైనా వస్తే ఈ ఐడికార్డులో ఉన్న సెన్సార్ దాన్ని గుర్తించి అలారం మోగుతుంది. డిజిటల్ కార్డులో ఉన్న ఎరుపు రంగు విద్యుత్ బల్బు వెలిగి వారిని హెచ్చరించేలా ఆటో మెటిక్‌గా మోగేలా ఏర్పాటు చేశారు. మెజరింగ్ ఐడీకార్డుగా నామ కరణం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ లో ఉన్న పరికరాలతోనే డిజిటల్ మెజరింగ్ ఐడీకార్డులు విద్యార్ధుల రూపొందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వేళ విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఒక్కోకార్డుకు రెండు వందల రూపాయలు ఖర్చుకాగా దీని భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, మరింత టెక్నాలజీ వినియోగించి డిజిటల్ కార్డు సైజ్ ను తగ్గించి తయారు చేయవచ్చుని శివసంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులం జిల్లా సమన్వయ అధికారి వై.యశోదా లక్ష్మీ, ప్రిన్సిపాల్ డి.దేవేంద్ర రావు, సూపరింటెండెంట్ పి.చంద్రయ్య, కె.వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం మామిడిపల్లి గ్రామ సచివాలయ గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్ బి.సతీష్ కుమార్ ను సస్పెన్షన్ చేస్తూ వార్డు, గ్రామ సచివాలయ విభాగం జేసీ డా.కె.శ్రీనివాసులు సోమ వారం ఉత్తర్వులు జారీ చేసారు. ఇసుక తరలింపుకు సంబంధించిన వే బిల్లు ఎస్ 3 ఫారంను పంచాయతీ కార్యదర్శి మరియు డ్రాయింగ్ అధికారి అనుమతి లేకుండా జారీ చేయడమే కాకుండా, సంతకం ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. లబ్దిదారుల నుండి ఎస్ 3 ఫారం జారీ చేయుటకు కొంత సొమ్ము వసూలు చేసినట్లు నిర్ధారణ జరగింది. ఈ మేరకు క్రమశిక్షణా చర్యలలో భాగంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
క్రీడాకారుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పవర్ జిమ్ లు ఎంతగానో ఉపయోగపడాతయని ఈస్ట్ కోస్టు రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. సోమవారం ఆయన రైల్వేమహిళా సంక్షేమ సంస్థ అధ్యక్షులు శాలినీ శ్రీవాస్తవ తో కలిసి నూతన జిమ్ ను ప్రారంభించారు. క్రీడాకారుల ఫిట్ నెస్ కోసం ఎయిర్ కండీషన్డ్ హైటెక్ జిమ్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ జిమ్ లోక్రాస్ ఫిట్, స్పిన్నింగ్, బాడీ కామండ్, ఏరోబిక్స్ సహా పలు బాడీ ఫిట్ నెస్ లు చేసుకోవడాని వీలుగా 2700 చదరపు మీటర్లలో దీనిని విస్తరించినట్టు పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలతో కూడిన కవర్ డ్రైవ్ జిమ్ ప్రపంచ స్థాయి క్రీడాకారులకు, ఇక్కడ నిర్వహించే భారత శిబిరాలకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే క్రీడా విభాగం అధికారులు, సిబ్బంది, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన పై సత్వరం పరిష్కారం చూపించాలని సిబ్బందిని క్రైమ్ డియస్పి మురళీధర్ ఆదేశించారు. సోమవారం యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు స్పందనలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఈరోజు స్పందనలో జిల్లా యస్.పి కార్యాలయానికి 25 ఫిర్యాదులు వచ్చాయన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి తమ యొక్క సమస్యల తెలియజేశారన్నారు. వారి యొక్క సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని కేసు విషయాలు అడిగి తెలుసుకొని సంబందిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు వారికి సమాచారం కూడా అందిస్తామన్నారు. ముఖ్య సమస్యలపై పోలీసు అధికారులను కూడా యస్.పి స్పందన కార్యక్రమానికి పిలిపించి ఇక్కడే స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్టు డిఎస్పీ వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురము జిల్లాలో రేపు (17.11.2020) కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాలను కలెక్టర్ గంధం చంద్రుడు మీడియాకి వివరించారు. ఆయా కేంద్రాల ద్వారా కరోనా లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఆ కరోనా పరీక్షలు కేంద్రాలు వివరాలు తెలుసుకుంటే..1. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతపురం, 2. హమాలీ కాలనీ యూపిహెచ్ సి, 3. మారుతీ నగర్ (మంగలవారి వీధి) యూపిహెచ్ సి, 4. నాయక్ నగర్ యూపిహెచ్ సి, 5. నీరుగంటి వీధి యూపిహెచ్ సి, 6. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 7. పెనుకొండ డివిజన్, 8. కదిరి డివిజన్, 9. అనంతపురం డివిజన్,10. కళ్యాణదుర్గం డివిజన్,11. ధర్మవరం ఇలా ప్రకటించిన డివిజన్ లలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మాస్కుధారణ, సామాజిక దూరం పాటిస్తూనే, తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలన్నారు. అదేసమయంలో కరోనా భారిన పడిన వారు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో 14 రోజులు ఐసోలేషన్ ఉండి బలవర్ధక ఆహారం తీసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు సూచిస్తున్నారు.
విశాఖజిల్లాలో జనవరి 1 , 2021 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం నాడు స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ERO) , సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(AERO) తో ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ - 2021 పై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్డు ప్రకారం ఈ రోజు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలని కోరారు. ఈ రోజు నుంచి డిసెంబరు 15వ తేది వరకు ముసాయిదా ఓటర్ల జాబితా పై ఫిర్యాదులను స్వీకరించాలని ఈ.ఆర్.ఒ., ఎ.ఈ,ఆర్.ఒ లను ఆదేశించారు. నవంబరు 28, 29 తేదీలలో , డిసెంబరు 12,13వ తేదీలలో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించి పోలింగ్ బూత్ స్థాయిలో అభ్యంతరాలు, ఫిర్యాదులపై ధరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. కొత్తగా ఓటర్ల నమోదు మొదలుకొని మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం నిర్ణీత ప్రొఫార్మాలయిన 6,7,8, 8ఎ లలో బూత్ లెవెల్ అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అన్నిరాజకీయ పార్టీలకు ఈ సమాచారాన్ని అందించాలని తెలిపారు. అన్నిరాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని కూడా కోరారు. బూత్ లెవల్ అధికారులు స్థానికంగా అందుబాటులో వుండి అవసరమైన ఫ్రొఫార్మాలను సిద్థంగా వుంచుకోవాలని కోరారు. తొలగింపులపై సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో వుంచాలని అన్నారు. ఈ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని నిర్వహించాలని తెలిపారు. “ KNOW YOUR B.L.O” ప్రచారం నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారుల వివరాలు అందరికీ తెలియజేయాలని కోరారు. ఆన్ లైన్ లో www.nvsp.in నందు నమోదు చేసుకోవడం పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
అనంతపురం జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే సర్వీస్ రిక్వెస్ట్ లలో 85 - 90 శాతం సర్వీసులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి మాత్రమే వస్తున్నాయని, అలాకాకుండా సచివాలయాలకు వచ్చే వాటిలో ఇతర శాఖలకు చెందిన సర్వీస్ రిక్వెస్టులు మరిన్ని పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని 1 & 4 సచివాలయాలను, కొర్రపాడు -2 గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 540 సర్వీస్ రిక్వెస్ట్ లను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అన్ని శాఖలకు సంబంధించిన సర్వీసులు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఎక్కువ రిక్వెస్ట్ లు రాగా, ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించి రిక్వెస్ట్ లు వస్తున్నాయని, విద్యుత్ శాఖ నుంచి కూడా సర్వీసులు పెంచేలా చూడాలన్నారు. ప్రజలకు వాలంటీర్ల ద్వారా సచివాలయాల సేవలపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సచివాలయాలకు అన్ని శాఖల సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గడువు తీరిన సర్వీసులు ఒకటి కూడా పెండింగ్ ఉంచడానికి వీలు లేదని, ఎప్పటికప్పుడు అన్ని సర్వీసులను నిర్దేశిత గడువు లోపు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బుక్కరాయసముద్రం 1 & 4 గ్రామ సచివాలయాలలో ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఏయే సర్వీసులు ఎక్కువగా వస్తున్నాయి, ఇతర శాఖలకు సంబంధించి ఎందుకు సర్వీసులు తక్కువగా వస్తున్నాయి అనే విషయాలపై సచివాలయ సిబ్బందితో ఆరా తీశారు.
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం శ్రీసిటీని సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, సిటీ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలు, మౌళిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన గురించి చైర్మన్ కు వివరించారు. శ్రీసిటీ ప్రణాళిక, అభివృద్ధి పట్ల భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికులకు, ముఖ్యంగా మహిళలకు తగినన్ని ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. వెనుకబడిన ప్రాంతాన్ని మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా మార్చడంలో శ్రీసిటీ యాజమాన్యం కృషిని ప్రశంసిస్తూ, ఈ ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులకు మరిన్ని ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు సాగాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. పర్యటనలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూసి పారిశ్రామిక కార్యకలాపాలను పరిశీలించారు. ఎవర్టన్ టీ పరిశ్రమను సందర్శించి, అక్కడ కార్మికులతో చర్చించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీసిటీ సందర్శన పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ఈ ప్రాంత అభివృద్ధి పనులను పర్యవేక్షించడంలో ఆయనకు వున్న శ్రద్ధ, ఆసక్తిని తెలియచేస్తుంది చెవిరెడ్డి పేర్కొన్నారు.
శ్రీకాకుళం సహకార సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వ్యాపార కార్యకలాపాలను పెంచుతూ సంస్థ అభివృద్ధికి కృషిచేయాలని డివిజనల్ సహకార అధికారి ఎ.వి.రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు 3వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డివిజనల్ సహకార అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత సహకార పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన సహకార సంస్థల శిక్షణ వలన కలిగే ప్రయోజనాలు గురించి సిబ్బందికి వివరించారు. సిబ్బంది తమ వ్యాపార కార్యకలాపాలను పెంచుతూ సంస్థ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. జిల్లా సహకార అధికారి కె.మురళీకృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్థ యొక్క వ్యాపారాలను పెంచి, సంస్థలో ఉన్న సిబ్బందికి పనికల్పించడమే కాకుండా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. రాజమండ్రి సహకార శిక్షణ కేంద్రం అధ్యాపకులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్ లైన్ కమ్యూనికేషన్ ద్వారా శిక్షణ మరియు విద్య పునశ్ఛరణ అనే అంశంపై వివరించారు. సంఘ డైరక్టర్ పి.లక్ష్మణరావు మాట్లాడుతూ సంఘ పూర్వపరాలను తెలుసుకోవడం వలన తదుపరి కాలంలో సంస్థ అభివృద్ధికి ఏ విధంగా కృషిచేయాలనే విషయం తెలుస్తుందని , ఆ దిశగా సిబ్బంది పనిచేయాలని కోరారు. సంఘ బిజినెస్ మేనేజర్ గంగు లక్ష్మణకుమార్ మాట్లాడుతూ సంఘం యొక్క వ్యాపార అభివృద్ధి వివరాలను తెలియజేస్తూ సంఘం చేపడుతున్న వ్యాపార కార్యకలాపాలను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని, అందులో లోటుపాట్లను గమనించి వాటిని నివృత్తి చేసుకునే విధంగా సిబ్బంది పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిష్టర్ కె.రాము, యస్.భూషణరావు, సంఘ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా నుంచి కోలుకోవడంతో 84 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు సోమవారం 84 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
గ్రామీణ ముఖ చిత్రం మారే విధంగా ముఖ్యమంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అయిన సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, బి ఎం సి యు లు , వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాలు నిర్దేశించిన సమయం మేరకు మార్చి 2021 పూర్తి కావడమే లక్ష్యంగా నరేగా అనుబంధ శాఖలతో సమీక్ష నిర్వహించామని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నరేగా అనుసంధాన శాఖలతో వివిధ పనుల పురోగతిపై సమీక్ష అనంతరం ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి తో కలసి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లు కేటాయించి సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, బి ఎం సి యు లు , వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాలు సాగాలని ముఖ్యమంత్రి సూచించారని త్వరగా పూర్తిచేస్తే అభివృధ్ధి పనులకు మరో రూ.5 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారాని అన్నారు. జిల్లాలో నిర్మాణాలు ఆశాజనకంగా వున్నా రాష్ట్రంలో మెదటి స్థానం రావాలని సూచించమని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఈ నిర్మాణాలు పూర్తి అయితే ప్రజలకు పౌర సేవలు వైద్యం, పశువైద్యం, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటు, పాలసేకరణ కేంద్రాలతో గ్రామ స్థాయిలోనే అన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గతం ప్రభుత్వంలో చేసిన పనులకు రూ.5 లక్షలలోపు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి అయి అభియోగాలు లేకుండా వున్న పనులకు సమబంధించిన బకాయిలు త్వరలో చెల్లించనున్నామని, మరికొన్ని కోర్టులలో వున్నాయని తెలిపారు.
గ్రామ సచివాలయాలు, రైతు బారోసా కేంద్రాలు , వై.ఎస్.ఆర్. ఆరోగ్యకేంద్రాలు , పాల సేకరణ కేంద్రాలు వంటివి గ్రామవ్యవస్థను రూపు రేఖలు మార్చే నిర్మాణాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతిష్టాత్మక ఆలోచనఅని నిర్దేశించిన సమయం మేరకు మార్చి 2021 నాటికి పూర్తి కావాలని, ఇంజనీరింగ్ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నరేగా అనుసంధాన శాఖలతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తతో కలసి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సమీక్షించారు. సమీక్షలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అని గుర్తించి సచివాలయాల, ఆర్ బీ కె ల నిర్మాణాలు అనుకున్న సమయానికి మార్చి 2021 నాటికి పూర్తి చేయాలని అన్నారు. గ్రామ సచివాలయాలు 1012 గాను ఇప్పటివరకు 283 మాత్రమే పూర్తి అయ్యాయని మరో 419 పురోగతిలో ఉన్నాయని త్వరగా ఇంజినీరింగ్ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఇంకా 74 సచివాలయాలకు స్థలం ఇబ్బందులు ఉందని తెలిపారని, ఈనెల 17 న ఒక్కరోజులో వాటిపై సంబంధిత ఆర్డీఓ లు, సబ్ కలెక్టర్లు, క్లియరెన్స్ ఇచ్చి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రైతుబరోసా కేంద్రాలు 932 గానూ 336, వై.ఎస్.ఆర్. ఆరోగ్యకేంద్రాలు 721 కి గానూ 225 మాత్రమే పురోగతిలో వున్నాయని, కోవిడ్ ప్రభావం తగ్గుదల నేపద్యంలో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇంజినీరింగ్ శాఖలు తమ పరిధిలో జరుగుతున్న నిర్మాణాల ఏజెన్సీలతో సమావేశం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. వై .ఎస్. ఆర్ జలకళ రైతులకు ఒక వరం, రైతు ఆర్థికంగా చితికి పోయేది కేవలం బోరు బావుల వలనేనని, ప్రాధాన్యత గుర్తించి త్వరగా పథకం అమలుకు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జలకళకు 6 వేలు దరఖాస్తులు వస్తే 4 వేల మందికి అర్హత వచ్చిందని సూచించారని, జిల్లాలో డార్క్ ఏరియా ప్రాంతాలు 197 ఉన్నాయని, గత సంవత్సరం నుండి వర్షాలు పడుతున్నందున మరోసారి పరిశీలించి డార్క్ ఏరియా ఎంత వరకు తొలగించాలో నిర్ణయించాలని సూచించారు. జలకళ కు సంబందించి ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు యూనిట్ వచ్చిన విషయం తెలిసిందేనని, డ్రిల్లింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాలలో సి. సి. రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలతో పాటు, జిల్లాలో ఉన్న 4500 చెక్ డ్యామ్ లలో పూడిక తీయడం , చెరువుల అనుసంధానం, సప్లయ్ ఛానెల్స్ పునరుద్ధరణ వంటివి చేపట్టాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ నరేగా లో ఉపాధిహామీ పనులు ఇప్పటివరకు జిల్లాలో 1.61 కోట్ల పనిదినాలు కల్పించామని, ఇప్పటికీ వరకు రూ.180 కోట్లు ఖర్చు చేయగా, మార్చి 2021 నాటికి అనుకున్న విధంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ఈ సమీక్షలో తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి , నరేగా డైరెక్టర్ చినతాతయ్య, నరేగా కౌన్సిల్ మెంబర్ విశ్వనాథ్, పిడి డ్వామా చంద్రశేఖర్ , ఎస్.ఇ లు పి. ఆర్. అమరనాథ్రెడ్డి, ఇరిగేషన్ సురేంద్ర నాధ్, ఆర్. డబ్ల్యూ. ఎస్ విజయ కుమార్ , ఇంజనీరింగ్ శాఖల ఇ ఇ లు, డి ఇ లు , అధికారులు పాల్గొన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోను ఒక ప్రచారాస్త్రంగా చూస్తారని, అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మేనిఫెస్టోను భగద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఆడితప్పడం, మడమ తిప్పడం జగనన్న చరిత్రలోనే లేదని, ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా సోమవారం కురుపాం నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది ప్రజలతో నిర్వహించిన పాదయాత్రలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు నాయుడు 600 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసారని విమర్శించారు. తాను పదవిలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో తానిచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మహిళలకు పసుపు కుంకుమల పేరుతో డబ్బులిచ్చి మోసం చేయాలని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. అయితే మహిళలు చంద్రబాబు మోసాన్ని గ్రహించి ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం నేర్పారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలలో లబ్ది పొందడం కోసం పార్టీ నేతల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సివచ్చేదని గుర్తు చేసారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రజలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు నేరుగా ఇళ్లవద్దకే వెళ్లి ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన సరుకులను, పింఛన్లను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘రైతులు తమ పంటలను పండించుకోవడానికి ఉచితంగా బోర్లు, మోటార్లను, విద్యుత్తును ఇచ్చి, పంటలు పెట్టుకోవడానికి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి మొత్తాలను అందించి, పండించిన పంటలను రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతుధరలకు కొంటున్న రైతు ప్రభుత్వం తమదని’’ పుష్ప శ్రీవాణి విపులీకరించారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీకి పంట రుణాలిస్తామని మోసం చేసిందని, 2014 నుంచి 2019 వరకూ రైతులకు రూ.1,865 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.685 కోట్లు మాత్రమే చెల్లించి, మిగిలింది ఎగ్గొట్టారని గుర్తు చేశారు. అప్పటి ఆ బకాయిలు రూ.1,200 కోట్లు తీరుస్తానని వైఎస్ జగన్ రైతులకు మాట ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మొత్తాలను ముఖ్యమంత్రి నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం జమ చేస్తారన్నారు. సీఎం మాట ప్రకారం గత ఖరీఫ్‌లో పంట రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీ కూడా ఇప్పుడు చెల్లిస్తున్నామని చెప్పారు. సీజన్ పూర్తయిన వెంటనే ఇలా ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి అని వివరించారు. మొత్తం క్లెయిమ్‌ల ప్రకారం 48.60 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద రూ.510.30 కోట్లు ఇవ్వనున్నామని, ఇప్పటివరకూ 10,62,335 మంది రైతుల క్లెయిములకు సంబంధించి రూ.205.74 కోట్లు మంగళవారం ఇవ్వనున్నామని వెల్లడించారు.నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపునిచ్చి, పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందించి, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు, బెల్టులను కానుకగా ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక విప్లవానికి సీఎం నాంది పలికారని, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రాణంపోసారని అభిప్రాయపడ్డారు. జనరంజకమైన జగనన్న పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.
కార్యకర్తలకు రుణపడి ఉంటాం: పరీక్షిత్ రాజు
కురుపాం నియోజకవర్గంలో తమపై నమ్మకముంచి వెన్నంటినడుస్తున్న వైసీపీ కార్యకర్తలకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పరీక్షిత్ రాజు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా అభివృద్ధి పనులు కొంత మందగించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కురుపాం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామి అవుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో లబ్ది చేకూర్చడానికి ప్రభుత్వం రాజకీయ పార్టీలను కాకుండా ప్రజల అర్హతలను మాత్రమే చూస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆపన్నహస్తం అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వైయస్సార్ విగ్రహం దాకా కొనసాగిన సంఘీభావయాత్రలో కురుపాం నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొన్న వారి లో ఐదు మండలాల కన్వీనర్ లు ఐ. గౌరిశంకర్రరావు, కె.దీనమయ, ఎం.గౌరీశంకరావు, డి.జనార్దన్ నాయుడు, ఉరిటి రామారావు,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరావు, వైస్ ఛైర్మన్ కె.సత్యన్నారాయణ, కళింగ వైశ్య, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు కె.వెంకట సురేష్ కుమార్, గోరిశెట్టి గిరిబాబు, మాజీ ఎంపీపీ,జడ్పీటీసీ లు ఇందిరా కుమారి,శెట్టి పద్మా వతి, ఎన్నికల సమన్వయ కర్త బొంగు సురేష్, మైనార్టీ సంఘ నాయకులు షేక్ నూరేళ్ళ, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు ఆర్.శ్రీధర్, బిడిక అన్నాజీరావు తదితరలు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన నవోదయ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.గోవింద రావు తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నవోదయ విద్యాలయంలో 2021 -22 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఆన్ లైన దరఖాస్తు విధానం అక్టోబరు 22వ తేదీన ప్రారంభమైందని, డిశంబరు 15వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన వివరించారు. 2021 ఏప్రిల్ 10వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. 2020 – 21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసే విద్యార్ధులు 2008 మే 1వ తేదీ మరియు 2012 ఏప్రిల్ 30వ తేదీ మధ్య జన్మించి ఉండాలని ఆయన స్పష్టం చేసారు. గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్ధులకు 75 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుందని, అందులో మూడో వంతు సీట్లు బాలికలకు కేటాయిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబిసి, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగులకు రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుందని ఆయన వివరించారు. దరఖాస్తులను www.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించవచ్చని చెప్పారు. సంశయాలు, వివరాలు కావలసిన వారు సంబంధిత జిల్లాల నవోదయ విద్యాలయాల ప్రిన్సిపాల్ ను సంప్రదించవచ్చని సూచించారు. 9వ తరగతి ఖాళీ సీట్లకు ఫిబ్రవరి 13న ప్రవేశ పరీక్ష : 2021 – 22 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లకు వచ్చే ఫిబ్రవరి 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గోవింద రావు చెప్పారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు ఈ నెల 4వ తేదీన ఆన్ లైన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిందని, డిశంబరు 15వ తేదీ లోగా దరఖాస్తు చేయాలని ఆయన వివరించారు. దరఖాస్తు చేయు విద్యార్ధులు 2005 మే 1వ తేదీ మరియు 2009 ఏప్రిల్ 30వ తేదీ మధ్య జన్మించినవారై ఉండాలని ఆయన పేర్కొన్నారు.
విశాఖజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 20 వ తేదీ నాటికి ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌర సరఫరాలు, వ్యవసాయం , డీ ఆర్ డీ ఏ, ఐ టి డి ఎ, డీ సీ సీ బి, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్న చిన్న కార రైతుల ఆర్థిక స్వావలంబన కు ప్రత్యేక దృష్టి పెట్టి వారు పండించిన పంటలకు మద్దతు ధరను అందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతులు పండించే ఏ పంట నైనా సరే తిరస్కరించకుండా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చ ర్ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలన్నారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలకు తెలిసే విధంగా ప్రసార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాయిశ్చర్ మీటర్లను అమర్చడంతో పాటు, అవసరమైన మెటీరియల్ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏఏ గ్రామాలలో పంట కోతలు మొదలు అవుతాయి అన్న విషయాలను ఆయా రైతులతో మాట్లాడాల్సిందిగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కు ఆదేశించారు. అదే విధంగా సంబంధిత డేటా ను సిద్ధం చేయాలన్నారు. కోతలు పూర్తయ్యే సమయానికి ఆయా గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల వద్ద గన్నీలను సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో రైస్ మిల్లర్లు ట్రాన్స్పోర్టేషన్ తో సిద్ధంగా ఉండాలన్నారు. డి ఎస్ ఓ లు సెంటర్ల మ్యాపింగ్ లను తయారు చేయాలన్నారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ, జిల్లా లో మొత్తం 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో డీ ఆర్ డీ ఏ , వెలుగు ద్వారా ఐటీడీఏ పరిధిలో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ లీలావతి, డిఆర్డిఎ ప్రాజెక్ట్ అధికారి విశ్వేశ్వరరావు,మార్కెటింగ్ శాఖ ఏడి కాళేశ్వర రావు, పాడేరు డి పి ఎం సత్య నాయుడు, డిసిసిబి డీజీఎం శ్రీనివాసరావు, డీఎస్ఓ రూరల్ శివ ప్రసాద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరన్న చౌదరి తదితరులు హాజరయ్యారు.