శ్రీకాకుళం జిల్లాలో యువతకు అంతర్జాలం ద్వారా ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణాధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడం, యువత లో గల వ్యక్తిత్వ వికాసాలను పెంపొందిచడానికి, యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సంకల్పించిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా జిల్లా లోని యువతీ, యువకులకు ఒక మహత్తరమైన అవకాశాన్ని కల్పిస్తూ, “Functional English Course" పై అంతర్జాలము వేదికగా ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించుటకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ శిక్షణా తరగతులు వారంలో రెండు రోజులు - మంగళవారం, గురువారాలలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. శిక్షణా తరగతులను విజయవాడ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిప్యూటి డైరెక్టరు డా. బి. సాయిలక్ష్మి పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు. ఆసక్తి, అర్హత గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, http://tiny.cc/functionalenglishcourse వెబ్ సైట్ లో మీ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఆస్ లైన్ ద్వారా నమోదు చేసుకొన్న అభ్యర్థులకు 17వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 5.30 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా ఉచిత శిక్షణా తరగతులు ఉంటాయని చెప్పారు. అదనపు వివరములకు కార్యాలయపు పని దినములలో సెట్ శ్రీ మేనేజరు బి.వి. ప్రసాదరావు (8341478815) ను సంప్రదించవచ్చని చెప్పారు.
వై.యస్.ఆర్ నేతన్న నేస్తం రెండ విడత నిధులు బుధవారం విడుదల అయ్యాయి. 20,06.2020న 2020-21 ఆర్ధిక సంవత్సరానికి మొదటి విడత వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పథకంను రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఆన్ లైన్ ద్వారా జూన్ 20వ తేదీన ప్రారంభించిన సంగతి విదితమే. మొదటి విడతలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మొత్తం 1438 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ.24,000/- లు చొప్పున మొత్తం రూ.3,45, 12,000/- లు వారి వ్యక్తిగత బ్యాంకు బాతాకు ఆన్ లైన్ ద్వారా నగదు జమ చేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రెండవ విడత వై.ఎస్.ఆర్.నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం ఆన్ లైన్ ద్వారా ప్రారంభించి నగదు జమ చేశారు. రెండవ విడతలో శ్రీకాకుళం జిల్లా నుండి మొత్తం 337 మంది లబ్దిదారులకు ఒక్కకరికి రూ.24,000/- లు చొప్పున మొత్తం రూ.80,88,000/- లు వారి వ్యక్తిగత బ్యాంకు' ఖాతాకు ఆన్ లైన్ ద్వారా జమ చేయడం జరిగింది. వెబ్ ఎక్స్ ద్వారా జరిగిన ఆన్ లైన్ కార్యక్రమములో చేనేత, జాళి శాఖ సహాయ సంచాలకులు డా.వి.పద్మ, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంత భూములను రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోర్టు నిర్మాణానికి సేకరించిన ప్రభుత్వ భూమి, సాల్ట్ ల్యాండ్ , జిరాయితీ భూములు ఎంత వరకు ఉన్నవి అనే విషయాలను జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణం జరిగితే భూసేకరణ, తరలించవలసిన గ్రామాల వివరాలు, మత్స్యకారుల జీవన స్థితిగతులు, ప్రస్తుత జనాభా, తదితర విషయాలపై ఆరా తీశారు. మత్స్యకారుల జీవనానికి ఆధారమైన మత్స్య సంపద ఎంతవరకు లభిస్తుంది, వారు ఎంత మేరకు పెట్టుబడి పెడుతున్నది, ఎగుమతి, దిగుమతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. పోర్టు నిర్మాణం వలన ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పోర్టు సీఈవో శ్రీనివాస్ రెడ్డి, పోర్టు డైరెక్టర్ ఆదినారాయణ, సబ్ కలెక్టర్ గనోర్ సూరజ్ ధనుంజయ, తాసిల్దార్ రాంబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణ బుధవారం ఘనంగా జరిగింది. జిల్లా ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసిన కిమ్స్ రహదారిలో సింహద్వారం దగ్గరలో ఇంటాక్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించి విగ్రహావిష్కరణ చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గొర్లె శ్రీరాములు నాయుడు తిరుగులేని ప్రజానాయకుడుగా, శ్రీకాకుళం కీర్తిప్రతిష్టలను రాష్ట్రం మొత్తం చాటి చెప్పిన వ్యక్తిగా నిలిచారన్నారు. రాజకీయాల్లో ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. శాసనమండలి సభ్యులుగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా ఆయన పనితీరును ఇప్పటికీ అందరూ గొప్పగా చెప్పుకుంటారని పేర్కొన్నారు. నిస్వార్ద, నిష్కలంక, సమర్దవంతమైన నాయకునిగా పేరుగాంచారని, అనేక పాఠశాలలు స్దాపించి విద్యాప్రదాతగా నిలిచారని, మడ్డువలస జలాశయ సాధనలో కీలక పాత్ర పోషించారని, తోటపల్లి జలాశయ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయింపు చేసారని, మారుమూల ఆవాసాలకు సైతం రహదారులను కల్పించారని, రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల విద్యార్ధులకు సంక్షేమ వసతి గృహాలు ప్రారంభించారని, వందలాది గ్రామాలకు తాగు నీటి కల్పనకు కృషి చేసారని, రైతు సహకార రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ గొర్లె శ్రీరాములు నాయుడు అనేక మందికి రాజకీయ గురువు అన్నారు.1959 వ సంవత్సరంలో కోటపాలెం సర్పంచ్ గా ఏకగ్రీవ ఎన్నికతో రాజకీయ ప్రస్ధానం ప్రారంభించి, అదే సంవత్సరంలో రణస్ధలం నాన్ బ్లాక్ (సమితి) ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. 1964 సంవత్సరంలో రణస్ధలం సమితి అధ్యక్షునిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికై, అదే సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారని తెలిపారు. 1974 సంవత్సరంలో ఆర్.టి.ఏ సభ్యులుగాను, 1975లో డిసిసిబి ఛైర్మన్ గాను, 1976లో ఎం.ఎల్.సిగా ఎన్నికయ్యారని, 1979లో రాష్ట్ర చిన్న నీటిపారుదల, వెనుకబడిన తరగతులు శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, 1981లో రాష్ట్ర మధ్యతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. 1981లోనే మంత్రి పదవికి రాజీనామా చేసి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా 18 ఏళ్ళపాటు సుదీర్ఘకాలం జిల్లాకు సేవలు అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన మామిడి శ్రీకాంత్, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్, సభ్యులు జగన్నాథం నాయుడు, మాజీ మునిసిపల్ చైర్మన్ ఎం. వి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యతను ఇస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ విద్యార్ధి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా ఎటువంటి సాంకేతికత లేని రోజుల్లోనే రాబోయే తరాలకు ఉన్నత విద్యను అందించేందుకు కృషిచేసిన మహోన్నత వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. ఇదే తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి తరానికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో విద్యకు, వైద్యానికి తొలి ప్రాధాన్యతను ఇస్తున్న సంగతిని జె.సి గుర్తుచేసారు. అందులో భాగంగానే నాడు-నేడు పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతున్నాయని, త్వరలో వాటిని విద్యార్ధులు వీక్షించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యాకానుక పేరుతో ప్రతి విద్యార్ధికి స్కూల్ బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, షూప్, బెల్ట్, షాక్సులు, యూనిఫారాం వంటివి పంపిణీచేయడం జరిగిందని చెప్పారు. నాణ్యమైన భోజనం, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటివి అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార దృష్టితో చూస్తాయని, కానీ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలనే తపనతో ఉంటాయని చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థల కంటే మెరుగైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటారనే విషయం గుర్తించాలన్నారు. అబుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల ముందుచూపును గ్రహించి విద్యార్ధులందరూ రోల్ మోడల్ గా ఉండాలని జె.సి ఆకాంక్షించారు. ప్రభుత్వం పంపిణీచేసిన యూనిఫారాలు ధరించి విద్యార్ధులు రావడం ఆనందంగా ఉందని, ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందిస్తున్నట్లు జె.సి పేర్కొన్నారు. తొలుత అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించిన జె.సి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా విద్యాశాఖాధికారి కుసుమ చంద్రకళ మాట్లాడుతూ సృజనాత్మకత, నాయకత్వం, ఉపాధికల్పన, వ్యవస్థాపకత వంటివి విద్యతోనే లభిస్తాయని కలాం ఆశించారని, అందుకే విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. భారత ప్రభుత్వంలో తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్లు నిర్విరామంగా పనిచేసిన మహనీయుడు కలాం అని కొనియాడారు. విద్యావ్యవస్థలో పలుమార్పులను తీసుకువచ్చిన గొప్ప దార్శనీకుడు కలాం అని అన్నారు. మన విద్యావ్యవస్థ ఇతర దేశాల్లో తలమానికంగా ఉండేందుకు ఆయనే మూలకారణమనే విషయాన్ని విద్యార్ధులు గుర్తెరగాలని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా విద్యార్ధులు నడుచుకొని, మంచి విద్యను అభ్యసించి మంచి విద్యావేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రోజెక్ట్ అధికారి పైడి వెంకటరమణ, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యం.వాగ్దేవి, ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, తల్లితండ్రుల కమిటీ చైర్మన్ మామిడి సూర్యప్రసాద్ దొర, ఉపాధ్యాయులు పి.వి.జయరాం, ఎ.బి.వీరాంజనేయులు, సిహెచ్.అభిమన్యరాజు, యన్.షణ్ముఖరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
భారత దేశ ప్రథమ విద్యా శాఖ మంత్రి జనాబ్ మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి ఉత్సవం బుధ వారం శ్రీకాకుళం కలెక్టరేట్ లో ఘనంగా జరిగింది. జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ మైనారిటి దినోత్సవంగా నిర్వహిస్తున్న ఈ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, జిల్లా కలెక్టర్ జె నివాస్ జనాబ్ మౌలానా అబుల్ కలామ్ అజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అబుల్ కలాం ఆజాద్ సేవలను ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. అనంతరం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ మైనారిటి దినోత్సవంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి మాట్లాడుతూ అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. హాజ్ యాత్రకు రూ.60 వేల వరకు ఆర్ధిక సహాయాన్ని పెంపుదల చేశామన్నారు. అల్ప సంఖ్యాక వర్గాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు తెలిసిన ప్రభుత్వ మన్నారు. రాష్ట్రంలోని 9 వందల మదార్శలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని చెప్పారు. ప్రామాణిక విద్యను అందించుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, ముస్లిం, క్రిస్టియన్ మత ప్రతినిధులు మోహిబుల్లా ఖాన్, ఎం.ఏ. రఫీ, మొహ్మద్ సిరాజుద్దీన్, మొహ్మద్ సలీమా ఖాన్, ఇస్మాయిల్ ఆదర్శి, సిరాజ్ భయ్యా, హాజీ భయ్యా, హాజీ అలీ జాన్, రజా, కృపానందం, జాన్ జీవన్, ప్రేమ్ కుమార్,ఎలీషా తదితరులు పాల్గొన్నారు.
ముష్కరుల పోరులో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మక శాంతి చేకూరాలని కోరుతూ మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధ సభ్యులు ఘనంగా నిర్వాహించారు. మంగళవారం క్రిష్ణాజిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోయసుధ మాట్లాడుతూ, జమ్ముకాశ్మీర్ పుల్వామా జిల్లా మచిల్ సెక్టార్ లో భారత దేశ భద్రతాదళాలపై ఉగ్రవాదులు అక్రమ చొరబాట్లను ఉక్కుపాదం అణచివేయాలన్నారు. ముష్కరులను తరిమి తరిమికొట్టాలన్నారు. అలాంటి సాయుధపోరులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన అవాలుదారు ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్రం కి చెందిన ర్యాడ మహేష్ త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాలు కలిసి రావాలన్నారు. ముష్కరుల దాడిని ప్రతీ ఒక్క భారతీయుడూ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది, సహాయకులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో రెండు మినరల్ కంపెనీ లకు సంబంధించి పర్యావరణ సంబంధ అనుమతుల కోసం మక్కువ మండలం ఎస్. పెద్ద వలస గ్రామంలో బుధవారం జరగ వలసిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడినట్లు కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ. బి. సుదర్శనం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ పాల్గొనాల్సి వున్న కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడినట్లు పేర్కొన్నారు. తాండ్ర మినరల్స్, తాండ్ర ఎక్స్ పోర్ట్స్ కు సంబంధించిన అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని గతంలో ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం కార్యక్రమం పూర్తికాగానే ప్రజాభిప్రాయ సేకరణ ఎపుడు ప్రారంభించేది తెలియజేస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ కంపెనీలకు ముఖ్యమని ఆయన మీడియాకి వివరించారు.
వివిఐపీలు, విఐపీలు, సెక్యూరిటీ కాన్వాయ్ ల సిబ్బందికి తిరుపతి అర్భన్ పోలీస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో రెండురోజుల తిరుపతి వెటర్నరి కాలేజి మైదానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ముగింపు కార్యక్రమంలో తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో 6 జిల్లాలకు చెందిన ప్రత్యేక కాన్వాయ్ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి వి.ఐ.పి, వి.వి.ఐ.పి వాహనాలను నడుపు సందర్భంలో ఏ ఏ ప్రాంతంలో వి.ఐ.పి ని తీసుకొని వెళ్ళునప్పుడు వాహనాలను ఏ రోడ్డు వస్తే ఎలా జాగ్రత్తగా నడపాలి, పబ్లిక్ ఉన్న ప్రదేశాలు, సాదారణ రోడ్డు, ఘాట్ రోడ్డు, సమస్యాత్మకమైన రోడ్డు, ఫారెస్ట్ ప్రాంతం మొదలగు ప్రాంతాలలో వాహనాలను ఎటువంటి జగ్రత్తలు తీసుకొని నడపాలి అనే దానిపై మరియు వాహనంలో వి.ఐ.పి ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం సంబవించినప్పుడు వి.ఐ.పి ని ఎలా రక్షించాలి, ఎలా రక్షణ కల్పించాలి తెసుకోవలసిన జాగ్రత్తలపై క్షుణ్ణంగా రెండు రోజుల పాటు పోలీస్ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారన్నారు. ఎన్ఎస్జీ, ఇంటలిజెన్స్, సెక్యూరిటీ వింగ్ ఈ శిక్షణకు ప్రాతినిధ్యం వహించారన్నారు. వి.ఐ.పి వాహనాల శ్రేణి, కూర్పులతో పాటు విపత్కర పరిస్థితులో వాహనాలను ఎలా నడపాలి అనే వాటిపై ప్రదర్శనపై కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి సుప్రజ మేడం ఏ.ఆర్ డి.యస్.పి నంద కిషోర్, హోంగార్డ్ డి.యస్.పి లక్ష్మణ్ కుమార్,డిఎస్పీ డి.కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ రాజు, ఎన్ఎస్జీ యస్.ఐ జానకిరాం, యం.టి.ఓ ఆర్.ఐ రెడ్డప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులుగా మనం ఎలా పనిచేశామో అనేదికాదని, ప్రజల వద్ద మర్యాదలా ఎలా మెలిగామో అదే పోలీస్ లకు అధికారులకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి సూచించారు. మంగళవారం శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్ లో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లడుతూ కేసుల పురోగతి విషయంలో పూర్తిగా మార్పు తీసుకురావాలన్నారు. కేసు విషయాలపై పూర్తిగా అవగాహన పెంచుకొని ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి పురోగతి సాదించాలన్నారు. కేసులను పరిష్కరించే విషయంలో ఆలసత్వం వహించకూడదని, పోలీస్ విధులను క్రమశిక్షణతో సక్రమంగా నిర్వహిస్తే ఫలితం అదే వస్తుందన్న ఎస్పీ ప్రతి కేసు విషయంలోను సంబంధ పడిన వ్యక్తులతో వ్యక్తి గతంగా విచారించాలన్నారు. కేసు జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పూర్వపరాలను పరిశీలించినప్పుడే కేసుపై పట్టు సాధించి కేసును చేదించడానికి అవకాశం వుంటుందని వివరించారు. విచారణలో ఉన్న కేసులను, పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదు యొక్క ఫిర్యాదులను పరిశీలించి వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. స్టేషన్ పరిధిలో ఎక్కువ నేరాలకు తీవ్రమైననేరాలకు పాల్పడిన వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేకమైన నిఘా వుంచి ఎప్పటికప్పుడు కేడీలు, డి.సి.లు, బి.సి.లను తరువుగా చెక్ చేసి వారి కదలికపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే బైండ్ ఓవర్ చేసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా ముఖ్యమైన ప్రాంతాలలో తగిన బీట్లు, పికేట్స్, లర్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని దొంగతనాలను అరికట్టాలన్నారు. తప్పకుండా పోలీస్ సిబ్బంది విజిబుల్ గా రోడ్డుపై కనిపించాలని తెలిపారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి తగిన న్యాయం చేయాలని, మిస్సింగ్ కేసులు వచ్చిన వెంటనే త్వరిగతిగా స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ముఖ్యమైన కేసు విషయాలలో ఇతర జిల్లాల అధికారులతో మాట్లాడి సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ యస్.పి లు, అడ్మిన్ సుప్రజ మేడం , తిరుమల మునిరామయ్య గారు, యస్.బి డి.యస్.పి గంగయ్య, జిల్లాలోని డి.యస్.పి లు, సి.ఐ లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన గోడౌన్ల ఏర్పాటు, గోనె సంచులు , మిలర్ల టాగింగ్ , హమాలీలు, రవాణా కు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 3 వ వారం నాటికీ పంట వస్తుందని, పంట సేకరణ ఒక పండగలా జరగాలని అన్నారు. మంగళవారం అయన ఛాంబర్ లో మిల్లర్లు, పౌర సరఫరా, మార్కెటింగ్, వ్యవసాయ, భారత ఆహార సంస్థ అధికారులతో దాన్యం సేకరణ ఏర్పాట్ల పై సమీక్షించారు. జిల్లాలో వెలుగు బృందాలు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, డి సి ఎం ఎస్ , గిరి వెలుగు, రైతు బృందాలు, వ్యవసాయ మార్కెట్ కమిటి ల ద్వారా కొనుగోలు చేయుటకు 263 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సేకరణ కేంద్రం రైతు భరోసా కేంద్రానికి మాపింగ్ జరగాలని అన్నారు. ఇంతవరకు 558 రైతు భరోసా కేంద్రాల్లో 14 వేల 992 మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారం లోగా మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలను ఇవ్వాలని డిసిసిబి అధికారులకు తెలిపారు. ప్రతి ధాన్యం సేకరణ కేంద్రం దగ్గరలో నున్న రైస్ మిల్లునకు ట్యాగ్ అయ్యేలా చూడాలని జిల్లా పౌర సరఫరాల అధికారికి సూచించారు. భారత ఆహార సంస్థ మిల్లర్లకు దగ్గరగా ఉన్న చోట తమ గోడౌన్ లలో ఎక్కువ స్థలాన్ని కేటాయించాలని కోరారు. దూరంగా ఉన్న గోడౌన్ లకు రవాణా చేయడానికి రవాణా ఖర్చుల భారం పెరుగుతోందన్న మిల్లర్ల విజ్ఞప్తిని దృష్టి లో పెట్టుకొని దగ్గరగా ఏర్పాటు చేయాలన్నారు .
అక్రమ రవాణా పై గట్టి నిఘా : ధాన్యం పక్క దారి పట్టకుండా, అక్రమ రవాణా అరికట్టడానికి చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచాలని రవాణా శాఖాధికారులకు ఆదేశించారు. సేకరణ కేంద్రాల నుండి డిజిగ్నేట్ చేసిన రైస్ మిల్లులకు రవాణా చేసే వాహనాల వివరాలను ధాన్యం సేకరణ కేంద్రాల పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.ధాన్యం సేకరణ పై విస్తృత ప్రచారం: ప్రతి రైతు భరోసా కేంద్రం , దాన్యం సేకరణ కేంద్రాల వద్ద ధాన్యం సేకరణ బ్యానర్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందు కోసం ప్రతి ప్రోక్యూరింగ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా వెంటనే డేప్యుట్ చేయాలని అన్నారు. రైతులందరికీ తెలిసేలా గ్రామాల్లో ప్రచారం గావించాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వరకుమార్, మార్కెటింగ్ శాఖ ఎ.డి శ్యాం కుమార్, వ్యవసాయ , భారత ఆహార సంస్థ శాఖల అధికారులు , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొండబాబు, శ్రీరామ్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి పరిధిలోని ఘన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని జివిఎంసి కమిషనర్ డాక్టరు జి. సృజన తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సోలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు అనుసరించి స్వచ్ఛ భారత్ మిషన్ కు అనుబంధంగా శాస్త్రీయ పద్దతిలో ఘన వ్యర్ధ నిర్వహణ అమలు చేయడానికి జివిఎంసి వివిధ రకాల పద్దతుల చేపడుతోందన్నారు. అపార్ట్మెంట్ మరియు గేటెడ్ కమ్మ్యునిటీ నుండి వచ్చు ఘన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు సేకరించి, సిబ్బందితో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామన్నారు. సదరు ఘన వ్యర్ధ పదార్ధములు సేకరించడానికి వాహనములు ద్వారా తరలించుటకు అయ్యే ఖర్చును యూజర్ చార్జీల రూపంలో ఆయా గృహ సముదాయాల మరియు వాణిజ్య సంస్థల నుంచి వసూలు చేస్తామని తెలిపారు. గేటెడ్ కమ్మ్యునిటీ, అపార్ట్మెంట్స్ లోని ఒక్కొక్క ఫ్లాట్ నకు నెలకు రూ.50/- చొప్పున, హోటల్స్, రెస్టారెంట్స్ నకు నెలకు రూ. 5,000/- చొప్పున, సినిమా థియేటర్సు నెలకు రూ.1500/- చొప్పున, మాల్స్ నకు నెలకు రూ.5,000/- చొప్పున, కళ్యాణ మండపాలకు నెలకు రూ.1,000/- చొప్పున, ఇతర వాణిజ్య సముదాయములకు నెలకుగాను రూ.1,500/- చొప్పున వసూలు చేసి తగిన రసీదును సిబ్బంది నుండి పొందాలని కమిషనర్ పేర్కొన్నారు. వినియోగ రుసుమును(యూజర్ చార్జీలను) పౌరులు, వివిధ యాజమాన్య సంస్థలు చెల్లించి, నగారాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను, యాజమాన్య సంస్థల ప్రతినిధులను కమిషనర్ పత్రికా ప్రకటన ద్వారా కోరారు.
శ్రీకాకుళంజిల్లాలో కరోనా నియమ నిబంధనలు పాటించని ప్రైవేటు కళాశాలలను మూసివేస్తామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కళాశాల యాజమాన్యాలను హెచ్చరించారు. కరోనా నేపధ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలతో సమీక్షా సమావేశం స్థానిక బాపూజీ కళామందిర్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు నవంబర్ 2 నుండి కళాశాలలు ప్రారంభమయ్యాయని, అయితే కొన్ని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్ధులు కరోనా నిబంధనలు పాటించడం లేదనే విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. దీనివలన మరలా కరోనా ప్రబలే అవకాశం ఉందని స్పష్టం చేసారు. ప్రతీ జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కరోనా నియమ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని, నిబంధనలు పాటించని కళాశాలలను మూసివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతీ కళాశాలలో 33 శాతం మంది విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని, మిగిలిన వారిని ఈ క్రమంలోనే తదుపరి తేదీల్లో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ తరగతి గదిలో 16 మంది విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని, ఎక్కువ మంది విద్యార్ధులు ఉన్నట్లయితే అదనపు తరగతి గదులను ఏర్పాటుచేయాలని సూచించారు. ఇరుకు గదుల్లోనూ, తక్కువ ప్రదేశంలో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ విద్యార్ధి మాస్కు, శానిటైజర్ విధిగా వినియోగించేలా ఉండాలని, కళాశాల వెలుపల శానిటైజేషన్ చేసి లోపలకు పంపాలని సూచించారు. విద్యార్ధులు లోపలకు ప్రవేశించే సమయంలో 6 అడుగుల సామాజిక దూరం పాటించాలని, కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసారు. కళాశాల వెలుపలకు వచ్చే మార్గాలు విశాలంగా ఉండాలని అన్నారు మరుగుదొడ్లు, తరగతి గదులను ఎప్పటికపుడు హైపోక్లోరైడ్ తో శుభ్రం చేస్తుండాలని సూచించారు. దూర ప్రాంతాల నుండి రెండు, మూడు వాహనాలు మారి వచ్చే విద్యార్ధులను అనుమతించరాదని, అటువంటి వారి కోసం ప్రత్యేక విద్యాబోధన ఏర్పాటు చేయాలని తెలిపారు. వీలైనంత వరకు ఆన్ లైన్ తరగతులకు ప్రాధాన్యతను ఇవ్వాలని, యూట్యూబ్, వీడియో, వాట్సాప్ ద్వారా తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా కరోనా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కరోనా లక్షణాలతో విద్యార్ధులు హాజరైతే తక్షణమే తమకు సమాచారం అందించాలని, అటువంటివారికి తక్షణమే పరీక్షలు నిర్వహించి వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి అయ్యేవారి వివరాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. దీనివలన కరోనాను నియంత్రించే అవకాశం కలుగుతుందని చెప్పారు. కరోనా సమాచారం తెలియజేయడం వలన తమ కళాశాలను మూసివేస్తారనే అపోహ కళాశాల యాజమాన్యాలకు వద్దని కలెక్టర్ స్పష్టం చేసారు. అలాకాకుండా కరోనా లక్షణాలు గల విద్యార్ధుల సమాచారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే అటువంటి కళాశాలలను తక్షణమే మూసివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతీ కళాశాలను సంయుక్త కలెక్టర్, ప్రాంతీయ తనిఖీ అధికారి ( ఆర్.ఐ.ఓ ), తహశీల్ధార్, సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారని, తనిఖీలో కరోనా వివరాలు బయటపడితే అటువంటి కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అస్త్మా, గుండె సమస్యలు, డయాబెటిక్, కోమా డిజార్డర్ ఉన్నవారిని కళాశాలలకు అనుమతించరాదని, తల్లితండ్రుల అనుమతితోనే విద్యార్ధులు కళాశాలలకు హాజరుకావాలని కలెక్టర్ వివరించారు. ప్రతీ రోజూ కళాశాలకు హాజరయ్యే విద్యార్ధుల వివరాలను తమకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గత 8 మాసాలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రజలు సహకరించడం వలనే గత 2 మాసాలుగా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం పూర్తి లాక్ డౌన్, దుకాణాల సమయాలను తగ్గించడం వలన కరోనా కేసులు బాగా తగ్గాయని, ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో రోజుకు 10 కన్నా తక్కువ కేసులే నమోదు అవుతున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ఈ విధమైన చర్యలు ప్రజలు మంచికోసమే అని అందరూ భావించాలని, కావున కళాశాల యాజమాన్యాలు తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నియంత్రణకు సహకరించాలని, ఇందులో ఎటువంటి అలసత్వం వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ప్రాంతీయ తనిఖీ అధికారి ఆర్.రుక్మాంగధరరావు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న నమ్మకమే తెలంగాణలో టిఆర్ఎస్ గడ్డపై బీజెపీ జెండా రెపరెపలాడిందని గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్జి నరసింగరావు అన్నారు. మంగళవారం రాత్రి తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ది రగునందనరావు 1118 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా, బీహార్ లో 125 సీట్లుకు పైగా ముందంజలో వున్న సందర్బంగా పాతగాజువాక కూడలిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎఎన్నార్ మాట్లాడుతూ, మన ప్రదాని మోదీ గారి నాయకత్వంపై ఉన్న నమ్మకంతో దేశ ప్రజలు బీజేపి కి పట్టం కట్టారని , రాబోయే రోజుల్లో ఆంధ్రాలో కూడా రాష్టృ అధ్యక్షులు సోము వీర్రాజ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. మొదట తీన్ మార్ డప్పులను వాయిస్తూ..మిఠాయిలను పంచుతూ అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రసేనా రెడ్డి, కృష్ణం రాజు, కో కన్వీనర్ గూటూరు శంకరరావు, కార్పొరేటర్ అభ్యర్థులు సిరసపల్లి నూకరాజు, సోంబాబు, నాగేశ్వరరావు, అప్పలరాజు, పావని, బాటాశ్రీను , మహిళా మోర్చా అధ్యక్షురాలు వర్రి లలిత, సన్యాసిరావు,అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.