శ్రీకాకుళం ప్రభుత్వ పరుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, రవాణా, విద్య, గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా జల యాజమాన్య సంస్ధ, గృహ నిర్మాణ సంస్ధ, డి.ఆర్.డి.ఏ, అటవీ, వ్యవసాయ, పౌరసరఫరాలు, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధ, పంచాయతీరాజ్ శాఖలు తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే శకటాలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్.డబ్ల్యు.ఎస్) ప్రధమ స్ధానం దక్కిం చుకోగా, పౌరసరఫరాల శాఖ శకటం ద్వితీయ స్ధానాన్ని, ఐటిడిఏ శకటం తృతీయ స్ధానాన్ని, డి.ఆర్.డి.ఏ శకటం కన్సోలేషన్ బహుమతులను గెలుచుకున్నాయి. శకటాలు ప్రదర్శించిన శాఖలతో పాటు బి.సి కార్పొరేషన్, సామాజిక వన విభాగం, ఉద్యానవన శాఖ, సూక్ష్మ నీటి పారుదల సంస్ధ, పశుసంవర్ధక, మత్స్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు తమ ప్రదర్శన శాలలను ఏర్పాటు చేసాయి.
లబ్ధిదారులకు పథకాలను అందజేసిన ఇన్ ఛార్జ్ మంత్రి : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో వై.యస్.ఆర్. క్రాంతి పథం క్రింద జిల్లాలోని 2,322 సంఘాలకు బ్యాంకు లింకేజీ క్రింద 92 కోట్ల 1 లక్షా 31 వేల రూపాయల బ్యాంకర్స్ చెక్ ను జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి నాని లబ్ధిదారులకు అందజేసారు. అనంతరం బి.సి.కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై రెండు ట్రాక్టర్లను లబ్ధిదారులకు మంత్రి అందజేసారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు : 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మరియు జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో పలు సాంస్కతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఇన్ ఛార్జ్ మంత్రి ఆధ్యంతం తిలకించగా ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా డా. తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన భరత ఖండమే నా దేశం పాటకు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించగా, శివ శిష్య బృందం చేసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ, పరిమళ శిష్య బృందం చేసిన నమో నమో భారతాంబే, డా. నీరజా సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో చేసిన భారత జాతి ముద్దు బిడ్డలం అనే పాటలకు చేసిన నృత్యాలు అందరినీ మంత్రముగ్దులను చేసాయి.
శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు కృషి చేసారన్నారు. మహాను భావుల త్యాగ ఫలాలు జాతి మొత్తానికి అందుటకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ మహమ్మార వ్యాప్తి బాగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్ భారీన పడిన తల్లిదండ్రుల వద్దకు పిల్లలు వెల్లడం, పిల్లలు వద్దకు తల్లిదండ్రులు వెళ్ళడం వంటి పరిస్ధితి లేకుండా పోయిందని అన్నారు. అయితే ఎటువంటి వివక్ష అవసరం లేదని అప్రమత్తంగా ఉండటమే ప్రధానమని చెప్పారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు చక్కగా పనిచేసారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ప్రాణాయామం, యోగా సాధన చేయడం అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం ఐడిఎస్పి డా.కె.అప్పారావు, ఎం.ఎన్.ఓ ఎం.పురుషోత్తం, హోమ్ గార్డు రమణలను సత్కరించారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రమేష్ బాబు జెండ్ ఎగుర వేసారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యను అభ్యశించే వారి శాతం 31.25 నుంచి 50 శాతానికి పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషిచేస్తామని ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శనివారం ఏయూలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. అనంతరం మాట్లాడుతూ 2029 నాటికి 50 శాతం జిఇఆర్ చేరుకోవడం తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి దీనిని సాధించే దిశగా అవసరమైన జగనన్న విద్యా దివేన, జగనన్న వసతి దీవెన పథకాలను నిర్వహించడం ముదావహమన్నారు. విద్యార్థిని ఆవిష్కర్తగా, పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏపి ఎంటర్‌ప్యూనర్ బోర్డ్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లు ఉపకరిస్తాయన్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టుగా అధ్యాపక వృత్తి ఎంతో ఉతృష్టమైనదన్నారు. వ్యక్తి సామర్ధ్యాలను, నైతిక విలువలను, గుణాలను తీర్చిదిద్ధి భవిష్యత్ పౌరులను అందించే శక్తి విద్యకు ఉందన్నారు. మేధో సంపదను, నైతికతను పెంపొందించే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు నిలుస్తాయని, ఇవి నిరంతరం తమ ప్రమాణాలు మెరుగుపరచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. దేశభక్తే దేశాన్ని సమైక్యంగా ఉంచుతోందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుచేసుకోవడం, వారి త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. ముందుగా ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు, ప్రిన్సిపాల్స్, డీన్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ అని టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో శనివారం ఉదయం 74వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టిటిడి ఉద్యోగులు సేవకులని, కావున అంకితభావంతో మరింత మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. భక్తులు శ్రీవారి దర్శనం, వసతి, ప్రసాదాల కొరకు దళారుల బారిన పడకుండ, దళారులను నిర్మూలించిన టిటిడిలోని అన్ని విభాగాలు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ఎస్వీబీసీ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నామని, ఇందులో విసూచి మహా మంత్రం, సుందరకాండ, విరాటపర్వం పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ప్రతిరోజు ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు సుందరకాండ పారాయణం ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల మంది భక్తులు పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రతి రోజు దాదాపు 100 మందికి పైగా భక్తులు క్యూఆర్ కొడుతూ ఒక రూపాయి నుండి రూ.2 కోట్ల వరకు విరాళాలు అందిస్తున్నారన్నారు.
దాతల సహాకారంతో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు రూ.9 కోట్లతో అత్యాధునిక పరకామణి భవనానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో రూ.30 కోట్లతో తిరుమల నడక దారిలో పై కప్పును నిర్మిస్తామన్నారు. తిరుమల ఎస్వీ మ్యూజియంను మరింత ఆకర్షణీయంగా రూపొందించడంలో భాగంగా రూ. 15 కోట్లతో శ్రీవారి ఆలయానికి సంబంధించిన 3 డి ఇమేజింగ్‌ను, శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు, ప్రాశస్త్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా మ్యూజియం మొదటి అంతస్తులో శ్రీవారి ఆభరణాలు 3 డి డిజైన్‌తో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
తిరుమలలోని అన్ని వసతి సమూదాయాలు, అతిథి గృహాలను అధునీకరిస్తున్నామని, ఇందులో గీజర్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు ఘాట్ రోడ్లలో మరమత్తు పనులు, ప్రమాదాలు నివారించేందుకు నూతన పిట్ట గొడను నిర్మిస్తున్నామన్నారు. కరోనా సమయంలో టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని, తిరుమలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారని అదనపు ఈవో ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు హరీంద్రనాధ్,సెల్వం,బాలాజీ, నాగరాజ, దామోదరం, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, ఎస్టేట్ అధికారి విజయసారధి, వీఎస్వో మనోహర్, క్యాటరింగ్ ఆఫీసర్ జీఎల్ఎన్ శాస్త్రీ ఇతర అధికారులు పాల్గొన్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహనీయ మని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్య క్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు..శనివారం విశాఖలోని సీతమ్మధార విజేఫ్ వినోద వేదికలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు సెల్యూట్ చేసారు. అనంతరం శ్రీనుబాబు మాట్లాడుతూ, ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగ ఫలితం వల్లే భారతీయులందరికి స్వాతంత్ర్య ఫలాలు సిద్దించాయన్నారు. వారి పోరాట పటిమ,. ప్రశంసనీయమన్నారు. జర్నలిస్ట్ ల సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచేయాలన్నారు. త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలన్నారు. విజేఫ్ కార్యదర్శి ఎస్.దుర్గారావు మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ పాలకవర్గం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందన్న ఆయన భవిష్యత్తులో సభ్యులు సంక్షేమమే లక్ష్యంగా మ పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు, వరలక్ష్మి, డేవిడ్ తో పాటు ఎల్లేశ్వరరావు, కిల్లి ప్రకాష్ రావు, పి.నగేష్ బాబు, సునీల్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో 2020 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15, శనివారం ఉదయం 9గంటలకు విశాఖపట్నం పోలీస్ బారెక్స్ స్టేడియంలో జరుగుతాయని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు గౌరవ వందనం స్వీకరించి , జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ప్రసంగిస్తారని తెలిపారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న విజేతలను సన్మానిస్తారని తెలిపారు. ప్రంటులైన్ వారియర్సు గా కోవిడ్ పై పోరాడుతున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, శానిటరీ ఉద్యోగులను అభినందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి, డి ఆర్ ఓ ఎం .శ్రీదేవి, ఆర్ డి ఓ పి.కిషోర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పోలీసులకు ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఇన్ స్పెక్టర్ ఆదాం తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు పాలకొండ జూనియర్ కాలేజ్ లో పోలీసులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 24 మంది పోలీసులు వారి కుటుంబ సభ్యులుకు కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. గతంలో ఒక హెడ్ కానిస్టేబుల్ కరోనా వైరస్ సోకందిని, శ్రీకాకుళం జెమ్స్ కు తరలించి వైద్యం అందించామని అన్నారు. కరోనా నుండి కోలుకుని విధులకు హజరయ్యారని తెల్పారు. కోవిడ్ పరీక్షలలో పాజిటివ్ వచ్చినంత మాత్రానా కలత చెందవద్దని, దైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న నియమాలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సానిటైజ్ చేసుకోవాలని పిలుపు నిచ్చారు. సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 9వ విడత ఉచిత రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమం పూర్తి అయినట్లు సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ మీడియాకి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుపు రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు పంపిణీ చేయడం జరిగిందని జె.సి. తెలిపారు. అదే విధంగా రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి కూడా రేషన్ సరకులను ఇవ్వనున్నామని తెలిపారు. కరోనా సమయంలో నిరుపేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం బియ్యం, కందిపప్పు ను తెలుపు రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యాన్ని, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసామని తెలిపారు. అదే విధంగా కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేసిన్నట్లు తెలిపారు. తెలుపు రేషన్ కార్డుదారులందరికీ ½ కిలో రూ. 17/- లకు పంచదారను అందించామన్నారు. . జిల్లాలో వున్న 8 లక్షల 29 వేల 69 తెలుపు రేషన్ కార్డుదారులందరికీ రేషన్ సరకులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 15,237 మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరకులను అందచేయడం జరిగిందన్నారు.
శ్రీకాకుళంలో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె నివాస్ గురు వారం పరిశీలించారు. ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల) మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించడం రుగుతుందని ఆయన చెప్పారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధులను, కరోనా నుండి కోలుకున్న వృద్ధులు, గర్భిణీ స్త్రీలు తదితర వర్గాలకు సత్కారాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలీసు పెరేడ్ తోపాటు వివిధ శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాలు, ప్రదర్శన శాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ చెప్పారు. మైదానంలో పారిశుధ్యం, తాగు నీటి ఏర్పాట్లు చూడాలని నగర పాలక సంస్ధ కమీషనర్ ను ఆదేశించారు. వేదిక నిర్మాణం, అతిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అధికారులు, సత్కార గ్రహీతలు తదితరులు కూర్చునే ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. కార్యక్రమం సాధారణంగా, చక్కగా ఉండాలని కలెక్టర్ అన్నారు. సంబంధిత శాఖల అధికారులు శకటాల తయారీని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్, తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలను అరికట్టాలని, ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలకు కఠినంగా శిక్షించాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం విశాఖలో జీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వరుస ప్రమాదాలపై సిఐటియు, ఎఐటియుసి, ఐ.ఎన్.టి.యు.సి., ఐఎఫ్‌టియు, ఎఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్ధేశించి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగిన తరువాత కార్మికులకు నష్టపరిహారాలు ప్రకటించి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని విమర్శించారు. వరుసుగా ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా చర్యలు కోసం నోరుమెదపడం లేదన్నారు. పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించకుండా సంబంధిత శాఖలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అదే విధానాన్ని కొనసాగించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవడంలో తీవ్ర వైఫల్యం ప్రదర్శిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టే విధంగా, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో విశాఖ కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమిస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ సిఐటియు నాయకులు కె.ఎం.కుమార్‌మంగళం, ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, కొండయ్య, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి జి.వామనమూర్తి, ఎఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి గణేష్‌పాండా, సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు, వి.కృష్ణారావు, ఆర్పీ రాజు, అప్పలరాజు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 పై పోరులో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని, మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువ ఉండే విధంగా కృషిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. గురువారం నాడు డిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులతో కొవిడ్ వ్యాప్తి నివారణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ఆయన టెస్టింగు ల్యాబ్ ల సామర్ద్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని, ఫలితాలు జాప్యం లేకుండా వెల్లడించాలని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది కోవిడ్ బారిన పడే అవకాశాలను తగ్గించాలని తెలిపారు. వారికి ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తపడాలని, పి.పి.ఇ. కిట్ల వినియోగం, డిస్పోజల్ పై అవగాహన పెంచాలని, వారు హాట్ స్పాట్ ప్రాంతాలలో నివసిస్తుంటే మరింత శ్రద్ద వహించాలని తెలిపారు. గుర్తించిన పాజిటివ్ కేసులను సత్వరమే అంబులెన్స్ లద్వారా ఆసుపత్రులకు, కేర్ సెంటర్లకు తరలించాలని తెలిపారు. రోగులు ఆసుపత్రికి రాగానే త్వరగా బెడ్ కేటాయించి చికిత్స ప్రారంభించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ హోం ఐసోలేషన్ లో ఉండే పాజిటివ్ రోగుల వలన వారి కుటుంబాలకు కోవిడ్ సోకే ప్రమాదం ఉందని, వారిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొరపాటున జాగ్రత్తలు పాటించకుండా బయట తిరిగితే ఇతరులకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలలో కూడా కాంటాక్టు ట్రేసింగు ను సమర్దవంతంగా చేయగలుగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో అత్యదికంగా పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో బెడ్ల కేటాయింపును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్త్తున్నట్లు తెలిపారు. కొత్తగా 1088 అంబులెన్స్ లను ప్రారంభించినట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వస్తున్న విదేశీ ప్రయాణీకులను నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉంచుతున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో కొత్తగా 42 పి.హెచ్.సి.లను ప్రారంభిస్తున్నట్లు, వీటికి సిబ్బందిని నియామకం చేస్తున్నట్లు తెలిపారు. 54 పాత అంబులెన్స్ లకు కూడా మరమ్మత్తులు చేయించి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లారెవిన్యూ అధికారి ఎం. శ్రీదేవి, ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎంపికైన అభ్యర్దుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ త్వరలో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఏపిపిఎస్సీ నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులైన పంచాయతీ కార్యదర్శుల అభ్యర్ధుల జాబితాను ఏపిపిఎస్సీ జిల్లాకు పంపించిందన్నారు. అభ్యర్ధుల విద్యార్హతలు, ఇతర అర్హతల సర్టిఫికేట్లను పరిశీలించాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. త్వరలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఏర్పాటు చేసి పూర్తి చేస్తామని ఆ ప్రకటనలో ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేది తేదీలను ప్రకటిస్తామన్న కలెక్టర్ కలెక్టర్ వెరిఫికేషన్ కు అన్ని రకాల విద్యార్హతలతోపాటు ఒక సెట్ జెరాక్సు కాపీలు, పాస్ సైజు ఫోటోలతో మెరిట్ అభ్యర్ధులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
కోవిడ్ 19 లాక్ డౌన్ తరువాత ప్రారంభించే పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే ప్రారంభించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ఎప్పటి కప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని వాటి పర్యవేక్షణకు గాను జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలక్టరు తెలిపారు. ఎల్.జి. పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన తరువాత పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ సూచించిన సిఫార్సుల మేరకు జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిందన్నారు. ఈ కమిటీ లో చైర్మన్ గా జాయింట్ కలెక్టర్ (ఎ అండ్ డబ్ల్యు), డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆప్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, రీజనల్ ఆఫీసర్, ఎపిపిసిబి. డిప్యూటి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అదికారి మెంబర్లు గాను, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం , మెంబర్ కన్వీనర్ గా ఉంటారని తెలిపారు. ఆయా పరిశ్రమలు తాము పాటించవలసిన చట్టాలు, నియమాల ప్రకారం నిర్ణీత ప్రొఫార్మాలో నివేదికను సమర్పించాలి. ఈ కమిటీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు, ఎన్విరాన్ మెంటల్ ప్రమాణాలు పరిశీలించాలని తెలిపారు. మొదటి విడతగా కెమికల్, కెమికల్ నిల్వ, తయారీ, పేలుడు పదార్దాల తయారీ, పెట్రోలియం పరిశ్రమలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించి నెలవారీగా నివేదికలు అందజేస్తాయని తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన నిమిత్తం పరిశ్రమల యాజమాన్యం, కార్మికయూనియన్లు, టెక్నికల్ నిపుణులు, హెల్త్ డిపార్టుమెంటు, తక్షణ స్పందన బృందాలతో జిల్లా స్థాయి సంక్షోభ నివారణ గ్రూపు ఏర్పాటుచేసి దానికి జిల్లా కమిటీ నేతృత్వం వహిస్తుందన్నారు. ఈ కమిటీ ముఖ్య విషయాలను జిల్లా కలెక్టరు దృష్టికి ఎప్పటి కప్పుడు తీసుకువస్తుందని, అదే విధంగా పరిశ్రమల భదత్రపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తుందని జిల్లా కలెక్టరు తెలిపారు.
గ్రామ సచివాలయ భవన నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల హెచ్చరించారు. బుధవారం తాహశీల్దారులు, ఇంజనీరింగ్ అధికారులతో మన బడి నాడు నేడు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు, ఉపాధిహామీ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరకువేలీ మండలం లోతేరు సచివాలయం భవన నిర్మాణం ప్రారంభించలేదని తాహశీల్దారిని, ఆర్ ఐ, వి ఆర్ ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే సోమవారం నాటికి పనులు ప్రారంభించక పోతే చార్జిమెమో జారీ చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. నాడు నేడు పనులు వేగం పెంచాలని ఆదేశించారు. నాడు నేడు పనులు 33 శాతం పురోగతి సాధించారని ఈనెల 17 తేదీ నాటికి 66 శాతం ప్రగతి సాధించాలన్నారు. ఇసుక, సిమ్మెంటు సమస్యలు లేకుండా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్ల పనులు రూఫ్ స్దాయికి రావాలని, ఎలక్ట్రికల్ పనులు మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహా పధకం పనులపై సమీక్షిస్తూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ లబ్దిదారులు 70 వేల కుటుంబాలు ఉన్నాయని వారందరికి 150 రోజులు పని కల్పించాలని స్పష్టం చేసారు. రూ.350 కోట్ల ఉపాధిహామీ పనులు చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే, రూ.197 కోట్ల పనులు మాత్రమే చేసారని నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని అన్నారు. కాఫీ తోటల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కె వి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ కుసుమ భాస్కర్, కాఫీ ఎడి రాధాకృష్ట, ఎన్ ఆర్ ఇ జి ఎస్ ఎపిడి సి.హెచ్. లచ్చన్న, గిరిజన సంక్షేమశాఖ డి. ఇ అనుదీప్ , ఎటిడబ్ల్యూ ఓ రజని తదితరులు పాల్గొన్నారు.
అన్నవరం, శ్రీ సత్యన్నారాయణస్వామి వారి దేవస్థానంలో 650 మంది సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. పాజిటివ్ వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇంకనూ దేవస్థానంలో పనిచేయు సిబ్బందికి 200 పైగా సిబ్బందికి పరీక్షలు నిర్వహించాల్సి వుందన్నారు. దేవస్థానంలో కేసులు అధికంగా ఉన్నందున స్వామివారి దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసి స్వామివారికి ఏకాంతముగా సేవలు చేయడానికి నిర్ణయించినట్టు చెప్పారు. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. హోమ్ క్వారంటైన్ లో వైద్యసేవలు పొందే వారంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మందులు వాడుతూ, బలవర్ధక ఆహారం తీసుకోవాలని ఈఓ కోరారు.