కరోనాకు సంబంధించి వాలంటీర్లకు, ఏ.ఎన్.ఎంలకు అప్పగించిన ప్రొటోకాల్ పనులను తూ.చ తప్పక పాటించాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు స్పష్టం చేసారు. ప్రతీ వాలంటీరుకు 50 గృహాలను సందర్శించి కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, నిర్ణీత ఫారంలో వివరాలు సంబంధిత సచివాలయానికి అప్పగించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఆ వివరాలతో ఏ.ఎన్.ఎం కరోనా లక్షణాలు గల వ్యక్తికి ఆక్సిజన్ లెవెల్స్ పరిశీలించి, 94 కంటే తక్కువగా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టాలని, ఇదంతా కరోనా ప్రొటోకాల్ లోని భాగమేనన్న సంగతిని ఆయన గుర్తుచేసారు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరంలేదని, కానీ అలా చేయడంలేదని మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం మండల అధికారులు, ఏ.ఎన్.ఎంలు, సర్వేలైన్స్ అధికారులతో జె.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగోలు, ఖాజీపేట సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగిందని, అక్కడ కరోనా వివరాలు తెలియజేసే రికార్డులు గాని, వాలంటీర్లు పంపవలసిన ఫారాలు లేవని, దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇకపై ఇటువంటువి పునరావృతం కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు. సర్వేలో వివరాలు తెలియజేయకుండా కరోనా లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే సంబంధిత వాలంటీర్, ఏ.ఎన్.ఎంలపై కఠిన చర్యలు తీసుకుంటామని జె.సి హెచ్చరించారు. అలాగే తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరితే సంబంధిత సర్వేలైన్స్ అధికారులపై చర్యలు తీసుకుంటామని మరోమారు హెచ్చరించారు. ప్రాణం ఎవరిదైనా ఒకటేనని, ఇందుకు చిన్నా, పెద్ద తారతమ్యం ఉండబోదన్నారు. ప్రతీ ఒక్కరి ప్రాణాలను రక్షించవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని, అందులో భాగంగా వాలంటీర్లకు కరోనా లక్షణాలు గల వ్యక్తుల వివరాలు సేకరించాలని చెప్పడం జరిగిందన్నారు. ఇందులో ఎటువంటి అలక్ష్యం వహించరాదని సూచించారు. గతంలో 40 ఏళ్లకు పైబడి కరోనా లక్షణాలు ఉన్నవారి వివరాలు మాత్రమే కోరడం జరిగిందని, ప్రస్తుతం అన్ని వయస్కుల వారి వివరాలు సేకరించమని తెలియజేయడం జరిగిందన్న సంగతిని జె.సి గుర్తుచేసారు. 40 ఏళ్లలోపు వ్యక్తులకు కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వారిని హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి, హోమ్ ఐసోలేషన్ కిట్లను అందజేసి చికిత్సను అందించాలని ఏ.ఎన్.ఎంలకు సూచించారు. అలాగే 40 ఏళ్లు పైబడి కరోనా లక్షణాలు ఉన్నవారిని వ్యాధి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా పూర్తిగా పోలేదని, చిన్నపాటి నిర్లక్ష్యం వహిస్తే మరలా పెరిగే అవకాశముందని గుర్తించాలన్నారు. నవంబరు 2 నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని, కావున వాలంటీర్లు, ఏ.ఎన్.ఎంలు కరోనా ప్రొటోకాల్ ను ఖచ్చితంగా అమలుచేయాలని జె.సి ఆదేశించారు. ఇప్పటివరకు వాలంటీర్లు, ఏ.ఎన్.ఎంలు, రెవిన్యూ, పారిశుద్ధ్యం, పోలీసు యంత్రాంగం తదితర విభాగాలు అందించిన సహకారంతో జిల్లాలో కరోనాను నియంత్రించగలిగామని, ఇదే స్పూర్తితో రానున్న రెండు, మూడు మాసాలు కృషిచేస్తే జిల్లా నుండి కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మండల తహశీల్ధారు వై.వి.ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి ప్రకాశ్ రావు, సర్వేలైన్స్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లా రాంబిల్లి మండలంలో ప్రవహిస్తున్న శారదా నది ముంపు బారినుండి పొలాలను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. శనివారం ఆయన రాంబిల్లి మండలం రజాల గ్రామంలో ముంపుకు గురైన పంటలను, పొలాలను రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అల్పపీడనం కారణంగా కురిసిన వర్షం, నదిలో పెరిగిన నీటిమట్టం ఏ గ్రామాలలో ఏ విధంగా నీటి మట్టం పెరిగి గట్లు తెగి పోవుటకు కారణమైన అంశాలను గూర్చి విపులంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో నీరు కలిసే క్రమంలో గట్లు తెగడానికి గల కారణాలను పరిశీలించాలని అన్నారు. ముంపునకు కారణాలను అన్ని కోణాలనుంచి పరిశీలించి తక్షణం నివేదికను సమర్పించాలని రెవిన్యూ డివిజినల్ అధికారిని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పంటలు పొలాలు పాకలు మొదలైనవి ఏ విధంగాముంపుకు గురైనది అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం లెక్కగట్టి లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయం లో ప్రదర్శించాలన్నారు. పంట నష్టం సంభవించిన ఏ రైతు పేరు అయినా జాబితాలో చేరకపోతే వారు తెలియజేస్తారని చెప్పారు. ఎన్.ఏ.ఓ.బి. వారు ప్రవాహానికి అడ్డుగా మెస్ వేసినందున నదీజలాలు వెనుకకు ఎగదన్ని నది గట్టు తెగిపోయిందని దాని మూలంగా పంటలు ముంపుకు, నష్టానికి గురయ్యాయని రైతులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ వీలైనంత వేగంగా నష్టపరిహారం అందించేందుకు తగిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
విశాఖజిల్లాలోని లంకెలపాలెం లో దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ ను పరవాడ మండల బిజెపి అధ్యక్షులు గనిరెడ్డి రమణ కోరారు. గురువారం స్థానిక శ్రీ రంగనగర్ కాలనీ వాసులతో మద్దిలపాలెం లోని ఎమ్మెల్సీ మాధవ్ స్వగృహంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లంకెలపాలెం లో ప్రధాన సమస్యలైన రైల్వే అండర్ బ్రిడ్జ్, స్థానికంగా ఉన్న టోల్గేట్ సమస్య, మంచినీటి కుళాయిలు సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలని మాధవ్ ను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ, ప్రభుత్వం ద్రుష్టికి సమస్యలు తీసుకెళతానని, కేంద్రం చేపట్టే పనులు కేంద్రం ద్రుష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూరపనేని శ్రీనివాసరావు గురుపూటిదేవుడు, బోండా నర్సింగరావు, దాసరి లక్ష్మణ రావు బోండా రమణ తదితరులు పాల్గొన్నారు.
పాయకరావుపేట నియోజక వర్గంలో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కి వివరించారు. సోమవారం తాడేపల్లి లో మంత్రి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లో 97 గ్రామాలకు తాగు నీటి సమస్య పరిష్కరించేందుకు నిర్మిస్తున్న ఉద్దండపురం వాటర్ గ్రిడ్ కు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. దివంగత వైఎస్సార్ హయం లో ఈ వాటర్ గ్రిడ్ కి 36 కోట్లు మంజూరు చేశారన్నారు. పనులు ప్రారంభించిన తర్వాత మహానేత మరణించారని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అంచనాలు పెంచినప్పటికి పనులు పూర్తి కాకుండా ఈ ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచి పోయిందని మంత్రికి వివరించారు. అంతేకాకుండా వాటర్ గ్రిడ్ పూర్తిచేసి ఇంటిటింటికి కుళాయిలు ద్వారా తాగు నీరు అందించేందుకు నిధులు మంజూరు చేయాలని కూడా లేఖలోకోరారు. అదేవిధంగా జల్లూరు పండూరు గ్రామాల్లో ప్రధాన రహదారిపై వంతెనలు నిర్మాణాలు, పాయకరావుపేట మండలంన్లో సత్యవరం మసయ్యపేట లలో సీసీ రోడ్లునిర్మాణాలు, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని కూడా మంత్రిని కోరామన్నారు. వెంకట నగరం వద్ద పంపా నది కోతకు గురికాకుండా రక్షణ గోడ మత్యకారులు కోసం వంతెన నిర్మాణానికి నిధులు , ఎస్ రాయవరం మండలం లో ఏ తవతల్ గ్రామాల వారికోసం వరాహ నది పై వంతెన కోసం కూడా మంత్రికి వివరించినట్టు ఎమ్మెల్యే మీడియాకి వివరించారు.
విశాఖ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సుమారు రూ.8 వేల కోట్లకు పైగా పంటనష్టం జరిగిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవిఎన్ మాధవ్ అన్నారు. ఆదివారం చోడవరం మండలంలో చాకిపల్లి, కన్నంపాలెం, రామజోగిపాలెం పర్యటించిన ఆయన ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంతవరకు వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేయడానికి గ్రామాలను రాకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండు నెలల్లో కోతకు రాబోతున్న వరిపంట ముంపుకు గురి కావడం వల్ల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అన్నారు. అధికారులు స్పష్టంగా పంటనష్టాలను అంచనా వేయాలని లేదంటే చాలా మంది రైతులు అన్యాయమైపోతారన్నారు. నేటికీ చాలా ప్రాంతాలు వరద ముంపు నీటిలో ఉన్నాయన్నారు. పత్తిపంటలు కూడా చాలా చోట్ల మునిగిపోయాయని ఎమ్మెల్సీ చెప్పారు. ఈయన వెంట స్థానిక బీజేపి నాయకులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు సచివాలయంను జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేసారు. ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎం .పి.డి.ఒ, కార్యదర్శి లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సచివాలయ సేవలపై ముఖ్యమంత్రి నిరంతర ర్యవేక్షణ చేస్తున్నారని, సచివాలయం ద్వారా అందించే సేవల విషయం లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా గ్రామసచివాలయాల ద్వారా నూరుశాతం సేవలు అందించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గంలో జరుగుచున్న అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తిచేసి నియోజకర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని జిల్లా కలక్టరు అధికారులకు సూచించారు. శనివారం పాయకరావుపేట మండల పరిషత్ సమావేశమందిరంలో అధికారులతో నియోజక వర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 65 కోట్ల అభివృద్దిపనులు, 10 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను అదేశించారు. నిర్మాణ పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని, నిర్మాణాలను వినియోగానికి సిద్దం చేయాలని తెలిపారు. ప్రజల వద్దకే సేవలందించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చారని, సచివాలయాల ద్వారా 50 శాఖలకు చెందిన 541 సేవలను ప్రజలకు అందించటం జరుగుతుందన్నారు.
విశాఖజిల్లాలో కోతకు గురవుతున్న వరాహానది గట్లు పటిష్టానికి శాశ్వత చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ తెలియజేసారు. జిల్లాలో గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎస్.రాయవరం మండలం సోముదేవుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తో కలిసి పర్యటించారు. కోతకు గురైన వరహనది గట్లను,రోడ్లను పరిశీలించారు. వరహానది మ్యాప్ ను పరిశీలించిన అనంతరం ఈ గట్లు కోతకు గురవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రోయిన్ నిర్మాణం జరిగిన చోట ఈ సమస్య తలెత్తడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వరహానది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ గట్లు పటిష్ఠ పరిచేందుకు తీసుకున్న చర్యలు గూర్చి ఇరిగేషన్ డి.ఇ సుజాత ను అడిగి తెలుసుకున్నారు. .ఈ సమస్య పరిస్కారం కు ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేశామని డి.ఇ చెప్పడంతో త్వరితగతిన పనులు జరిగేలా చూడాలన్నారు. అనంతరం పాయకరావుపేట అతిథి గృహం వద్ద నియోజకవర్గ పరిధి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తుపాను కారణంగా నష్టపోయిన వరద బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే పంట నష్టం అంచనా వేసి పూర్తి సమాచారం తో ,నష్టపోయిన రైతుల వివరాల తో కూడిన నివేదికను జిల్లా కార్యాలయంకు పంపించాలని ఆదేశించారు. ఈ వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి వరద వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలాగా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు గట్లు డిజైన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ విషయం పై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ తో పాటు జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో గ్రోయిన్ డిజైన్ లో మార్పు కారణంగా గట్లు కోతకు గురయ్యాయని స్థానికులు తెలియజేసారని, దీనిపై పూర్తి సమాచారం కొరకు ఎస్.ఈ నుంచి నివేదిక కోరానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం సుమారు ఆరు వేల హెక్టార్లలో రూ.70 కోట్లుగా ప్రాథమిక అంచనా వేస్తున్నా మని కలెక్టర్ తెలిపారు. పూర్తి స్థాయి సమాచారంతో సోమవారం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, యితర అధికారులు పాల్గొన్నారు.
రేవుపోలవరంలో రొయ్యల చెరువుల ద్వారా వచ్చే ఇబ్బందులపై త్వరలోనే చర్యలు తీసుకొని సమస్య పరిష్కరిస్తామని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు రేపుపోలవరం, బంగారమ్మపాలెం, చిన ఉప్పలం గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఈ గ్రామాల్లో వరదల తాకిడికి నష్టపోయిన ప్రాంతాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేద్రుష్టికి తెచ్చారు స్థానికులు. ఈ ప్రాంతంలో పంట నష్టాలను రెండు రోజుల్లో తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొబ్బతోటలు, ప్రత్తిచేలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులను జరిగిన నష్టం ఎక్కడా ఎలాంటి తేడాలు లేకుండా జరపాలని అధికారులను ఆదేశించారు. వరదనీరు గ్రామాల్లోకి వెళ్లకుండా కాలువల ద్వారా మళ్లించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నీరు చేరిన చోట వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చల్లించాలని సచివాలయ అధికారులను రంగంలోకి దించాలని అధికారులకు సూచించారు.
విశాఖజిల్లాలో వరదలతో నష్టపోయిర రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. శుక్రవారం ఎస్.రాయవరం మండలంలోని రేవు పోలవరం, కొత్త రేవుపోలవరం గ్రామాలను నీటమునిగిన పంటపొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రకృతి వైపరీత్యం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి సకాలంలో నష్టపరిహారం అందేలా అధికార యంత్రాంగం చురుకుగా పని చేస్తుందని తెలిపారు. వరద ముంపునకు గురైన గ్రామాలలో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో పాటు, అధికార పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట వైస్సార్సీపీ నాయకులు చేకూరి శ్రీ రామచంద్ర రాజు, పోలిశెట్టి పెద్ద ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
చోడవరం మండలం గవరవరం గ్రామం వద్ద శారదా నదిపై తాత్కాలికంగా నిర్మించిన కాజువే గురువారం కొట్టుకుపోవడంతో చుట్టు ప్రక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు శారదా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కాజువే కొట్టుకుపోయింది. ఇక్కడ శారదా నదిపై వంతెన నిర్మాణం కోసం తాత్కాలికంగా కాజువేను నిర్మించారు. వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో పలు గ్రామాల ప్రజలు కాజువేపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇపుడు దానిపై నుంచి వరద నీరు ఉద్రుతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల పై వరదనీరు పారుతున్నది. అధికారులు ఇక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ కు నివేదించారు. వర్షాలు తగ్గితే తప్పా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదు.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చోడవరం మండలంలోని పెద్దేరు, బొడ్డేరు నదులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహం అతి తీవ్రంగా ఉండడంతో జన్నవరం వద్ద వంతెనను ఆనుకుని వరదనీరు పారుతున్నది. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మండలంలోని పి ఎస్ పేట వద్ద బలిరెడ్డి సత్యారావు కళ్లాల వద్ద నదికి గండి పడింది. దీంతో వందలాది ఎకరాల వరి, చెరకు తోటలను వరద నీరు ముంచెత్తింది. వరదనీటి తీవ్రతకు పిఎస్ పేట వద్ద వేసిన బొప్పాయి తోటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. పెద్దేరు ఉత్పత్తికి మండలంలోని కన్నంపాలెం, చాకిపల్లి, రామజోగిపాలెం, జన్నవరం, బెన్నవోలు గ్రామాలకు చెందిన వందలాది ఎకరాలు చెరుకు తోటలు, వరి పొలాలు ఇంకా నీటి ముంపులోనే ఉండి పోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల పై వరదనీరు పారుతున్నది. కొన్ని చోట్ల వరద ఉద్రుతి తగ్గినా చాలోచోట్ల రోడ్డుప్రక్కన ఉన్న కాలువలు సైతం పొంంగి ప్రవహిస్తున్నాయి...